Wednesday, May 22, 2019

May 11,2019
http://www.navatelangana.com/article/net-vyaasam/805849


మోడీ మజిలీ కథలు

ఆదివారం నాటికి లోక్‌సభ ఎన్నికల ప్రక్రియ ఆరో ఘట్టం ముగుస్తుంది. మరో పది రోజుల్లో భావి భారత పాలకులు ఎవరన్న విషయం స్పష్టం కానుంది. దాంతో మార్చి ఏడో తేదీ ఎన్నికల ప్రకటనతో మొదలైన 2019 లోక్‌సభ ఎన్నికల ప్రక్రియ కథ కంచికి చేరనుంది. పాలక పార్టీ ఈ ఎన్నికల్లో గెలవటానికి ప్రచారంలో పెట్టిన అంశాలు గమనిస్తే చిన్నప్పటి కాశీ మజిలీ కథలు గుర్తుకు వస్తాయి. అప్పట్లో ప్రధానమంత్రి గ్రామీణ సడక్‌ యోజన గానీ, స్వర్ణచతుర్భుజి పేరుతో నిర్మించిన జాతీయ రహదారులు కానీ లేవు. దాంతో కాశీయాత్రకు బయలుదేరేటప్పుడు జట్లు జట్లుగా బయలుదేరే వారు. ఒక్కో జట్టులో వయసులో పెద్దవాడైన వ్యక్తి ఒక్కో మజిలీలో ఒక్కో కథ చెపుతూ సాటి ప్రయాణీకుల్లో ఉత్సాహం నింపటానికి ప్రయత్నం చేసేవాడు. అలా వచ్చినవే కాశీ మజిలీ కథలు. కట్టు కథలైనా, పుక్కిటి పురాణాలైనా మనువాద సాహిత్యంలో కొకొల్లలు. మనువాదమే మానవవాదమని నమ్మే రాష్ట్రీయ స్వయం సేవక్‌ సంఫ్‌ుకు తిరుగులేని ప్రతినిధిగా ఉన్న మోడీ కూడా ఈ పుక్కిటి పురాణాల నుంచి బాగా స్ఫూర్తి పొందినట్టున్నారు. ఒక్కో దశ పోలింగ్‌కు ఒక్కో ప్రచారాస్త్రాన్ని ముందుకు తెచ్చి ఓటర్లల్లో ఉత్సాహం నీరుగారకుండా చూసేందుకు విశ్వప్రయత్నం చేశారు.
మోడీ మరోసారి ఢిల్లీ మజిలీ చేరుకోవటానికి ఎన్నికల ప్రచారంలో సైతం అనేక మజిలీలు దాటుకుంటూ వచ్చారు. తొలి దశ ఎన్నికల్లో మోడీ ప్రధాన కేంద్రీకరణ యావత్తూ బాలకోట్‌ దాడుల నేపథ్యంలో దేశానికి శక్తివంతమైన పాలన కావాలని, అటువంటి శక్తివంతమైన పాలన అందించే సత్తా తనకు మాత్రమే ఉందని ఉపన్యాసాలిచ్చారు. వందిమాగధుల పాత్ర పోషించటానికి పోటీ పడే సాక్షిమహరాజ్‌ వంటి వారు మరోసారి మోడీ అధికారానికి వస్తే భవిష్యత్తులో భారతదేశంలో ఎన్నికలతో పని ఉండబోదని ఇంటిగుట్టును రట్టు చేశారు. రెండో దశలో పోలింగ్‌ సందర్భంగా జరిగిన ప్రచారం నాటికి మరో అడుగు ముందుకేసి యోగీ ఆదిత్యనాథ్‌ వంటి నేతలు ఏకంగా భారతీయ సైన్యాన్ని మోడీ సేనగా ప్రకటించారు. వందలమందికి గుండెలు ఎదురొడ్డే మగధీరులున్న ఈ దేశంలో 56అంగుళాల ఛాతీ కలిగిన నేతలు సైతం లక్షల మంది సైనికులు వెన్నంటి వుంటే తప్ప ఎన్నికల బరిలో నెగ్గలేని స్థితికి చేరుకున్నారు.

ఇక మూడో దశకు వచ్చేసరికి పాచికలు విసరటం బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షా వంతు అయ్యింది. ఏకంగా తాము అధికారానికి వస్తే దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో జాతీయ పౌరసత్వ రిజిష్టర్‌ ఏర్పాటు చేస్తామని, సదరు రిజిష్టరులో ఇమడని పౌరులందరినీ విదేశీయులుగా పరిగణించి తరిమి వేస్తామని అమిత్‌షా స్పష్టం చేశారు. ఈ సమయానికి రాఫెల్‌ వివాదాన్ని విచారిస్తున్న సుప్రీం కోర్టు తన అభిప్రాయాన్ని స్పష్టం చేసింది. కేంద్ర ప్రభుత్వ అభ్యర్థనను తిరస్కరిస్తూ డిసెంబర్‌ నాటి తన తీర్పును సమీక్షించాలన్న అభ్యర్థనను మన్నించింది. విచారణ చేపట్టింది. దాంతో రాఫెల్‌ వివాదంలో భాగమైన అనుమానాస్పద లావాదేవీలు, జోక్యాలను విచారిస్తే దేశ భద్రతను బహిరంగ మార్కెట్‌లో పెట్టినట్టేనని మోడీ బ్లాక్‌మెయిలింగ్‌కు పాల్పడ్డారు. సైనికోన్మాదం ఉఛ్చదశకు చేరుకోవటంతో కాంగ్రెస్‌ కూడా తానేమీ వెనకబడలేదని చెప్పుకోవటానికి తమ హయాంలో సైతం 12సార్లు పాకిస్థాన్‌ శిబిరాలపై మెరుపు దాడులు చేశామని వెల్లడించింది. ఈ విధంగా వెల్లడించుకోవటం అంటే దేశభద్రత కాపాడటంలో తమకు సామర్థ్యం ఉందని చెప్పుకోవటమే. తద్వారా బీజేపీ వేసిన ఉచ్చులో కాంగ్రెస్‌ చిక్కుకుపోయింది.

బీజేపీ వ్యూహకర్తలు ఉత్తరప్రదేశ్‌లో సమాజ్‌వాదీ, బహుజనసమాజ్‌ పార్టీల మధ్య పొత్తు ఇంటికి చేరదని అంచనా వేశారు. ములాయంసింగ్‌ మాయావతిల మధ్య ఉన్న వ్యక్తిగత వైరమే దీనికి పునాది. ఈ వైరానికి సంబంధించిన అనేక విషయాలు ఒళ్లో ఒదిగిన మీడియా ద్వారా, కోట్ల ఖర్చు ఇంధనంతో నడుస్తున్న సోషల్‌ మీడియా ద్వారా ఉత్తరప్రదేశ్‌ ఓటర్లకు చేరవేసేందుకు బీజేపీ నేతృత్వంలోని పుకార్ల ఫ్యాక్టరీలు షికార్లు మొదలు పెట్టాయి. ఈ పుకార్లలో వాస్తవం లేదని నిరూపిస్తూ మాయావతి ములాయం సింగ్‌ యాదవ్‌లు ఒకే వేదిక మీద ఎన్నికల సభల్లో పాల్గొని ఇరు పార్టీల కార్యకర్తల్లో ఆత్మవిశ్వాసం నింపారు. దీంతో నాల్గో దశ పోలింగ్‌ సమయం దగ్గరపడే కొద్దీ బీజేపీ మజిలీ ఢిల్లీ చేరుతుందా లేదా అన్న సందేహం మొదలైంది. ఫలితంగా సహనం కోల్పోయిన ప్రధాని ఏకంగా అణోన్మాదం రెచ్చగొట్టేందుకు పూనుకున్నారు. రాజస్థాన్‌లో జరిగిన ఓ ఎన్నికల బహిరంగ సభలో భారతదేశంలోని అణ్వాయుధాలు దీపావళి రోజు పేల్చటానికి దాచుకోలేదని కనుసైగతో కరాచీని నేలమట్టం చేస్తాయని హెచ్చరించారు. అణ్వాయుధాల ప్రయోగం కేవలం పాకిస్థాన్‌నే కాదు, భారతదేశాన్నీ మట్టిపాలు చేస్తుందన్న సంయమనం లేకుండా వ్యవహరించటం ప్రధాని బాధ్యతలో ఉన్న మోడీకి తగని పని. ఇటువంటి ఉపన్యాసాలు విన్నప్పుడే కోతికి కొబ్బరి చిప్ప సామెత గుర్తుకొస్తుంది.

మొదటి మూడు దశల్లో ముస్లిం వ్యతిరేకతనే ఆయుధంగా మల్చుకున్న మోడీ, ఆయన వంది మాగధులు నాల్గో దశకు వచ్చే సరికి మోడీ వెనకబడిన కులానికి చెందినవాడు కావటంతో దేశంలోని అగ్రవర్ణాలకు ప్రాతినిధ్యం వహించే పార్టీలన్నీ ఓర్వలేక ఒక్కటవు తున్నాయని సానుభూతి రాజకీయాలకు పాల్పడ్డారు. మొదటి మూడు దశల్లో ప్రధానంగా దక్షణాది రాష్ట్రాల్లో పోలింగ్‌ హడావుడి పూర్తి అయ్యింది. నాల్గో దశలో ఉత్తరప్రదేశ్‌, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌లో ఎక్కువ స్థానాలు పోలింగ్‌కు సిద్ధమయ్యాయి. ఈ దశలో మోడీ తన వెనకబడిన కులాన్ని ముందుకు తేవటం బీజేపీ ఎన్నికల వ్యూహంలోని పదునును గుర్తు చేసే అంశం.
ఐదో దశ పోలింగ్‌ పూర్తి అయ్యే నాటికి క్రమంగా బీహార్‌ రాజస్థాన్‌ ఒడిషా రాష్ట్రాలతో సహా మెజారిటీ సీట్లల్లో పోలింగ్‌ ప్రక్రియ పూర్తయ్యింది. పంజాబ్‌, ఢిల్లీ, హర్యానా రాష్ట్రాల్లో నామినేషన్ల ప్రక్రియ మొదలైంది. దాంతో చాకచక్యంగా రాజీవ్‌గాంధీని దుమ్మెత్తిపోసే ప్రచార వ్యూహానికి బీజేపీ తెరతీసింది. తదుపరి దశల్లో పోలింగ్‌ జరిగే అన్ని నియోజకవర్గాలకు రాజీవ్‌గాంధీకి మధ్య సంబంధం ఉంది. 1984లో ఇందిరాగాంధీ హత్యానంతరం జరిగిన ఊచకోతలో ప్రాణాలు కోల్పోయిన వారిలో ఎక్కువ మంది ఈ ప్రాంతానికి చెందిన వారే. సిక్కులు, జాట్‌ సిక్కులు వీరిలో అధికులు. దాంతో వారి మనోభావాలు రెచ్చగొట్టేందుకు మోడీ మిగిలిన దశల పోలింగ్‌ను రాజీవ్‌గాంధీ పాలనపై రిఫరెండంగా మార్చటానికి తాను సిద్ధమంటూ సవాలు విసిరారు. ఆరోదశ పోలింగ్‌కు వచ్చే సరికి తనను వ్యక్తిగతంగా దూషిస్తున్నారనీ తిరిగి సానుభూతి కార్డు ప్రయోగించేందుకు సిద్ధమయ్యారు. గత ఐదేండ్లలో మోడీ గురించి ప్రయోగించిన ఉపమానాలతో ఓ డిక్షనరీ తయారు చేసి తనను ఇన్ని మాటలంటున్నారు చూడండి అంటూ వాపోయారు మోడీ. ఈ విధంగా మోడీ మజిలీ కథల్లో ఒక్కో మజిలీలో చెప్పిన కథకు ఒక్కో వ్యూహాత్మక ప్రాధాన్యత ఉన్నది. ఈ అన్ని దశల్లో ఒక్క చోట కూడా ఐదేండ్లలో సాధించిన విజయాలు గురించి చెప్పుకునేందుకు మోడీ ప్రయత్నం చేయకపోవ టం గమనించాల్సిన విషయం. మోడీ పాలన, విజయాల డొల్లతనాన్ని ఇది స్పష్టం చేస్తుంది.
ఈ ఆరుదశల్లో దేశం ఎన్నో కథలు విన్నది. భారీ తారాగణంతో రాజకీయ స్కోప్‌ సినిమాలు చూసింది. కథానాయకులు ప్రతినాయకులుగా మారటం, ప్రతినాయకులు కథా నాయకులుగా మారటాన్ని దేశం గమనించింది. ఎన్నికల ప్రచారంలో ప్రధాన పార్టీలు ముందుకు తెచ్చిన అంశాలు, ప్రజల దృష్టినాకర్షించటానికి చేసిన ప్రయత్నాలు ప్రజాస్వామ్యం పట్ల జవాబుదారీ తనం పట్ల రాజకీయనాయకులకు ఏమాత్రం పట్టింపు ఉందో అర్థం చేసుకోవటానికి కొన్ని ఉదాహరణలు మాత్రమే. రాజకీయ విలువలు అతల, వితల, సుతల, రసాతల, మహాతల, తలాతల లోకాలు దాటి పాతాళానికి చేరుకున్నాయి. మన పాలకులు విశిష్టంగా భావించే పురాణ ఇతిహాసాల ప్రకారం పాతాళానికి చేరే కొద్దీ ఈతి బాధలు పెరుగుతూ పోతాయి. అదేవిధంగా ప్రజాస్వామ్యం కూడా పాతాళానికి జారిపోయే కొద్దీ కొత్త కొత్త సమస్యల సుడిగుండంలో కూరుకుపోతుంది. ప్రజాస్వామ్యాన్ని పాతాళానికి చేర్చటానికి పాలకవర్గం మండుటెండలో సైతం మడమ తప్పికుండా పని చేసింది. ప్రజాస్వామ్యం పాతాళానికి పడిపోకుండా ప్రజల మధ్యే ఉండేలా చేయటం ప్రజలు, ప్రతిపక్షాల కర్తవ్యం.
- కొండూరి వీరయ్య
సెల్‌: 9871794037

No comments: