Monday, March 22, 2010

కుంభకోణం పెట్టుబడుల ఉపసంహరణ

యుపిఎ 2 ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పెట్టుబడుల ఉపసంహరణ కుంభకోణం దిశగా నడుస్తోంది. ప్రతిష్టాత్మకమైన ప్రభుత్వరంగ సంస్థల గ్రామీణ విద్యుదీకరణ కంపెనీ, జాతీయ గనులు, ఆర్‌ఇసి, ఖనిజాభివృద్ధి సంస్థ, ఎన్‌ఎంఎండిసి, జాతీయ థర్మల్‌ విద్యుత్పత్తి కార్పొరేేషన్‌ ఎన్టీపిసిల్లో ప్రభుత్వ వాటాల ఉపసంహరణ వ్యవహారాన్ని పరిశీలిస్తే నా ఈ సందేహం నిరాధారం కాదని స్పష్టమవుతోంది. 2009-2010 ఆర్థిక సంవత్సరానికి 25000 కోట్ల రూపాయల ఆదాయాన్ని పెట్టుబడుల ఉపసంహరణ ద్వారా సంపాదించాలని ప్రభుత్వం నిర్ణయించుకొంది. యుపిఎ- 1 మరియు యుపిఎ 2 మధ్య ఆర్థిక విధానాల్లో ఉన్న మౌలిక వ్యత్యాసాన్ని ప్రతిబింబిస్తూ 2009 జూన్‌లో రాష్ట్రపతి, 'ప్రభుత్వరంగ సంస్థల ఆస్తుల్లో వాటాలు పొందే హక్కు ప్రతి పౌరుడికీ ఉంది. అందువల్ల ప్రభుత్వ రంగ సంస్థల యాజమాన్యంలో మార్పు లేకుండా సాధ్యమైనంత మంది ఎక్కువ ప్రజలకు వాటాలపై హక్కులు కల్పించేందుకు గాను ప్రభుత్వం చర్యలు చేపడుతుంది' అని పేర్కొన్నారు. ప్రభుత్వరంగ సంస్థల వాటాలు ప్రైవేటు శక్తులకు కట్టబెట్టే పనికే నాజూకుగా ప్రభుత్వం ప్రభుత్వరంగ సంస్థల ఆస్తులపై ప్రజలకు హక్కులు కల్పించటం అని పిలిచింది. ఈ విధానం ప్రకారం ప్రభుత్వరంగ సంస్థల వాటాల విక్రయంలో ప్రజలు తండోపతండాలుగా పాల్గొనాలి. లక్షలాది షేర్లు, వాటాలు కొనుగోలు చేయటానికి గాను మార్కెట్‌ను ప్రజలు ముంచెత్తాలి. కానీ పరిస్థితి దీనికి భిన్నంగా సాగుతోందని దిగువనున్న పట్టిక తెలియచేస్తోంది.

ఈ మొత్తం ప్రక్రియలో మరో కీలకమైన అంశం దాగి ఉంది. షేర్లు కొనటానికి సాధారణ ప్రజలు సిద్ధం కాకపోవటం ఒక అంశమైతే మరోటి ప్రయివేటు కంపెనీలు కూడా సిద్ధం కాకపోవటం. ఈ పరిస్థితి ఎందుకొచ్చిందన్న ప్రశ్నకు సమాధానం వెదకటంలోనే అసలు కిటుకు దాగి ఉంది. ప్రభుత్వం ఆశించినంతగా వాటాల కొనుగోళ్లుకు దరఖాస్తులు రాలేదని ఈ పట్టికలోని సమాచారం తెలియచేస్తోంది. అలా అని వాటాల ఉపసంహరణ ప్రక్రియను విరమించుకుంటే ప్రభుత్వ మౌలిక స్వభావమే ప్రశ్నార్థకం అవుతుంది. అందువల్ల పెద్దఎత్తున ప్రభుత్వ రంగ సంస్థలైన, స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, భారత జీవిత బీమా కంపెనీలను మార్కెట్‌లోకి దించి వారి పెట్టుబడులను వాటాల కొనుగోళ్లకు పురమాయించింది ప్రభుత్వం. ఉదాహరణకు గ్రామీణ విద్యుదీకరణ కార్పొరేషన్‌ వాటాలు కొనుగోలు చేయటానికి ఎల్‌ఐసి 3000 కోట్ల రూపాయలు వెచ్చించింది. ఎన్‌ఎండిసి కంపెనీ వాటాలు కొనుగోలు చేయటానికి మరో రూ.8000 కోట్ల ఎల్‌ఐసి నిధులు వినియోగించబడ్డాయి. ఇతర ప్రయివేటు సంస్థలు, మ్యూచ్‌వల్‌ ఫండ్స్‌, ఇతర ద్రవ్య సంస్థలు ఈ వాటాలు కొనుగోలు చేయటానికి ముందుకు రాలేదు. తత్పర్యవసానంగా ఆయా కంపెనీల మార్కెట్‌ కాపిటలైజేషన్‌ విలువ తగ్గిపోయింది. ఫలానా కంపెనీ వాటాలు మార్కెట్‌లో విడుదలైన దానికంటే ఎన్ని రెట్లు ఎక్కువగా అమ్ముడయితే ఈ కంపెనీ మార్కెట్‌ విలువ అంత ఎక్కువ ఉన్నట్లు. మరి ఆర్‌ఇసి, ఎన్‌ఎండిసి కంపెనీల మార్కెట్‌ విలువ పెంచే దిశగా ప్రభుత్వ చర్యలు దోహదం చేయలేదని దీన్ని బట్టి అర్థం అవుతుంది. మరి ఈ పెట్టుబడుల ఉపసంహరణ ప్రక్రియ ద్వారా ప్రభుత్వం సాధించదల్చుకున్నది, నిరూపించదల్చుకున్నది ఏమిటి?

ఇక్కడ ఒక విషయాన్ని చర్చించుకుందాం. ఎవరైనా షేర్లు కొనుగోలు చేసేటప్పుడు ఫలానా కంపెనీ లాభాలు, స్థిరాస్తుల, అప్పులు, ఇతర లావాదేవీలు గురించి ఆరా తీస్తాము. అపుడపుడూ కీలకమైన విషయాల్లో ప్రభుత్వం తన ఆశక్తతను, అసహాయతను కప్పిపుచ్చుకునేందుకు చట్టం తన పని తాను చేసుకుపోతుంది అని ప్రకటించటం అలవాటుగా మారింది. అదే తరహాలో ప్రభుత్వం కీలక ఆర్థిక నిర్ణయాలు తీసుకునే బాధ్యత నుండి తప్పుకునేందుకు మార్కెట్‌ తన పని తాను చేసుకుపోతుంది. 'మార్కెట్‌ ధర్మం' దీనికి అంతరాయం కలిగించకూడదు అని వాదించటం కూడా అలవాటుగా మారింది. ఈ సూత్రాన్ని మాటవరసకు అంగీకరించినా ఈ విషయాల్లో ఏ కంపెనీ మెరుగ్గా ఉంటే ఈ కంపెనీ వాటాలు అమ్ముడవటం సోకాల్డ్‌ మార్కెట్‌ ధర్మం. ఆ విధంగా చూసుకున్నపుడు పట్టికలో ప్రస్తావించిన కంపెనీలన్నింటిలో ఎన్‌ఎండిసి, ఆర్‌ఇసి కంపెనీల స్థిరాస్తులు, నికర లాభాలుఎక్కువ అన్నది నిస్సందేహం. కనీసం నరవత్న కంపెనీల్లో ఒకటి, అంతర్జాతీయంగా మార్కెట్‌ ఆదరణ పొందిన ఫోర్బ్స్‌ 500 కంపెనీల్లో స్థానం పొందిన ఎన్టీపిసీ వాటాలు కూడా కొనుగోలు చేసే నాధుడు కరువయ్యాడని ఈ పట్టిక తెలియచేస్తోంది. అటువంటప్పుడు మార్కెట్‌ ధర్మం ప్రకారం ఈ కంపెనీల వాటాలకు గిరాకీ ఉండాలి. కానీ మార్కెట్‌ ధర్మం ఇక్కడ పని చేయలేదు. చిన్న చిన్న కంపెనీలు, నామమాత్రపు స్థిరాస్థులు కలిగి, మార్కెట్‌ రుణాలపై ఆధారపడే కంపెనీల వాటాలు అమ్ముడయినంతగా ప్రభుత్వరంగంలోని పెద్దఎత్తున స్థిరాస్తులు కలిగి, ప్రతి ఏటా లాభాలు సంపాదిస్తున్న కంపెనీల వాటాలు అమ్ముడుకాలేదు. అంటే ఇక్కడ మార్కెట్‌ మానాన మార్కెట్‌ పని చేయలేదని సదరు పెట్టుబడుల ఉపసంహరణ వాదులు, మార్కెట్‌ వాదులు అంగీకరించాల్సివుంది.

అలా కాదనుకున్న పక్షంలో చట్టానికి కళ్లు లేవు అన్న ధోరణిలో మార్కెట్‌ కూడా గుడ్డిది, వాస్తవికతను గుర్తించలేదు అని అంగీకరించాలి. ఈ రెండింటిలో ఈ ఒక్క వాదనను అంగీకరించినా పెట్టుబడుల ఉపసంహరణ అర్థం లేని పని అని తీర్మానించాల్సి వస్తుంది. ప్రభుత్వం మరి ఏ వాదన అంగీకరిస్తుంది అన్న విషయాన్ని తెలుసుకోవటానికి సమయం పడుతుంది.ఈ లోగా మార్కెట్‌ అవకతవకల కోణాన్న పరిశీలిద్దాం. శక్తివంతమైన కంపెనీల వాటాలుమార్కెట్‌లో పలుకుబడి కోల్పోవటం వెనక ఖచ్చితంగా మార్కెట్‌ ఆపరేటర్లు జట్టు కట్టటం కారణం అయి ఉంటుందన్న సందేహాలు ఉన్నాయి. ఒక వేళ మార్కెట్‌ వివేకవంతం అయినదైతే షేర్లుకంపెనీల్లో ఒకటి కాకపోతే మరోటైనా వివేకవంతంగా వ్యవహరించాలి కదా... మరి పబ్లిక్‌ ఇషఉ్య ముగింపు తేదీ వరకూ సదరు కంపెనీల వాటాలు అమ్ముడవకపోవటం వెనక ఉన్న మర్మం ఏమిటి? ప్రభుత్వం స్టేట్‌ బ్యాంకు, ఎల్‌ ఐసి వంటి కీలకమైన సంస్థల నిధులు మళ్లించి మరీ ఈ మార్కెట్‌ సెంటిమెంట్‌ కాపాడాల్సిన అవసరం ఏమొచ్చింది ? ఈ మొత్తం వ్యవహారాన్ని వెలుగులోకి తెస్తే తప్ప పెట్టుబడుల ఉపసంహరణ పేరిట ప్రభుత్వం ఆడుతున్న నాటకంలో నిజాలు, నీడలు వెలుగు చూడటం సాధ్యం కాదు.

కంపెనీ ఇష్యూ మోతాదు వచ్చిన దరఖాస్తులు గిరాకీ శాతం

డిక్యు 123 11083 86.3

మాన్‌ ఇన్‌ఫ్రా 142 8904 67.8

ఎఆర్‌ఎస్‌ఎస్‌ 103 5286 51.3

ఇన్‌ఫినిట్‌ కంప్యూటర్‌ 190 6840 36.0

ఐఎల్‌ఎఫ్‌ఎస్‌ ట్రాన్‌పోర్ట్‌ 700 22694 32.4

జుబిలియంట్‌ ఫుడ్స్‌ 328 8941 27.3

ఆర్‌ఇసి 3486 10945 3.1

ఎన్‌ఎండిసి 9957 12459 1.3

ఎన్‌టిపిసి 8480 10515 1.2

Tuesday, March 9, 2010

పన్ను విధానంలో మార్పుతో చేతిలో మిగిలిలేదెంత?

ప్రజాశక్తి -బిజినెస్‌డెస్క్‌ Sun, 7 Mar 2010, IST
కొండూరి వీరయ్య

బడ్జెట్‌ తతంగం పూర్తయ్యింది. ఇక మీదట బడ్జెట్‌ తర్వాత ఏయే రంగాలకు ఎంతమేర నష్టం కలిగింది, ఎంతమేర ప్రయోజనం కలిగింది అన్న అంశాలపై చర్చలు, సమీక్షలు దృష్టిపెడుతున్నాయి. ముఖ్యంగా విష్లేషకులు వ్యక్తిగత ఆదాయ పన్నుల విధానంలో వచ్చిన మార్పులపై కేంద్రీకరిస్తున్నారు. ఎందుకంటే ఇది మార్కెట్‌లో సరుకుల కదలికపైనా, నిధుల లభ్యతపైనా ప్రత్యక్ష ప్రభావం చూపించనుంది. మార్కెట్‌ విశ్లేషకులు, ఆర్థిక సంస్థలన్నీ ఈ పన్నుల విధానంలో ప్రతిపాదించిన మార్పు ద్వారా మధ్యతరగతి ప్రజలకు పెద్దఎత్తున మిగులు డబ్బులు చేతిలో ఉంటాయని వాదిస్తున్నారు. దానికనుగుణంగానే పన్నుల్లో వచ్చిన మార్పుల ద్వారా మిగిలిన డబ్బును ఫలానా స్కీంలో పెట్టుబడులు పెట్టండి, ఇంత కాలం తర్వాత అంత ఆదాయం వస్తుందన్న ప్రకటనలుకుప్పలు తెప్పలుగా కనిపిస్తున్నాయి. నిజానికి ప్రస్తుత బడ్జెట్‌లో ప్రతిపాదించిన పన్నుల విధానం వల్ల ప్రజల వద్ద అంత ఎక్కువ మొత్తంలో నిధులు ఆదా అవుతున్నాయా అన్న విషయాన్ని పరిశీలిద్దాం.

తాజా బడ్జెట్‌లో వ్యక్తిగత పన్నుల విధానాన్ని విశ్లేషించేముందు 2011 ఏప్రిల్‌ 1 నుండీ ప్రత్యక్ష పన్నుల విషయంలో నూతన విధి విధానాలు అమల్లోకి తేనున్నట్లు ప్రభుత్వం ప్రకటించిన విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఎందుకంటే ప్రస్తుత బడ్జెట్‌లో వ్యక్తిగత ఆదాయ పన్ను విషయంలో ప్రతిపాదించిన కొన్ని ప్రతిపాదనలు ఆ లక్ష్యానికి అనుగుణంగానే ఉన్నాయి. పన్నుల శ్లాబుల్లో ప్రతిపాదించిన మార్పుల వల్ల గతం కంటే ప్రజల వద్ద అదనపు వెసులుబాటు ఉంటుందన్న విషయాన్ని దిగువనున్న పట్టిక రుజువు చేస్తోంది. సదరు మార్పులను అంతవరకే పరిమితం చేసి చూస్తే నిజమే కదా అన్న భావన కూడా కలగటం కద్దు. కానీ ఈ మార్పులను అదే బడ్జెట్‌ పత్రంలో ప్రతిపాదించిన ఇతర మార్పుల నేపథ్యంలో పరిశీలిస్తే తప్ప నిజంగా కలిగే ప్రయోజనం ఏమిటన్నది అర్థం చేసుకోవటం సాధ్యం కాదు.ఇదే విధంగా సంత్సరానికి యాభై లక్షల ఆదాయం వచ్చే వారికి కూడా గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం అదనంగా 50,000 రూపాయలు తక్కువ పన్ను కడితే సరిపోతుంది. ఇదే సందర్భంలో ఇతర అంశాల్లో తెచ్చిన మార్పుల వల్ల ఈ మిగులు ఆదాయాన్ని నిర్భయంగా ఉపయోగించే అవకాశం లేకుండా చేసింది ప్రభుత్వం. అదెలాగో ఇప్పుడు పరిశీలిద్దాం. స్థూలంగా చెప్పాలంటే ఈ విధంగా మిగిలిన డబ్బును ఇతర తక్షణ ప్రయోజనకరమైన పనికి - అంటే ఇల్లు కట్టుకోవటానికో మరోదానికో వెచ్చిస్తే భారం మరో రూపంలో వచ్చి పడుతుంది. కేవలం కాపిటల్‌ మార్కెట్లు, ఈక్విటీ, బాండు మార్కెట్లలో పెట్టుబడులు పెట్టుకుంటేనే ఈ రాయితీల వల్ల వచ్చిన ప్రయోజనం ఒనగూడుతుంది. అంటే ఈ ఆదాయ పన్నుల విధానంలో ప్రతిపాదించిన మార్పులన్నీ ప్రజల చేతిలో అదనపు ఆదాయం మిగిల్చేందుకు కాదు. ద్రవ్య మార్కెట్లలో పెట్టుబడులు ప్రోత్సహించేందుకే అన్నది స్పష్టం అవుతుంది.

ఈ ఇచ్చిన రాయితీలు ప్రధానంగా బాండ్‌ మార్కెట్‌ను, మ్యుచువల్‌ ఫండ్‌ మార్కెట్‌ను, పెన్షన్‌ మార్కెట్‌ను బలోపేతం చేసేవిగా ఉన్నాయి. పై పద్ధతిలో మిగుల్చుకున్న ఆదాయాన్ని మౌలిక వసతుల కల్పనా రంగంలో విడుదలయ్యే బాండ్లుపై (ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ బాండ్లు) ఖర్చు పెడితే మరో రూ.20,000 వరకూ మినహాయింపు వస్తుంది. ఆర్థిక రంగంలో ఏ విభాగాన్ని కదిలించినా ఆ విభాగంలో మౌలికవసతుల కల్పనకు లక్షల కోట్లలో నిధులు అవసరం అని ప్రభుత్వం, నిపుణుల కమిటీలు ప్రకటించటాన్ని చూస్తూనే ఉన్నాము. ఈ మార్పుల ద్వారా ప్రభుత్వం సదరు నిధులు కల్పించేందుకు బదులుగా మార్కెట్‌ ద్వారా, అంటే ప్రజల ద్వారా ఆ నిధుల సేకరణకు మార్గం సుగమమం చేస్తోంది ప్రభుత్వం. అయితే ఈ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ బాండ్లు ఎవరు విడుదల చేస్తారు అన్నది కీలక అంశంగా ఉంది. అంతేకాదు. బాండ్ల ద్వారా వచ్చే సగటు ఆదాయం, వడ్డీనికూడా పన్నుల పరిధిలోకి తెస్తూ నిర్ణయించింది ప్రభుత్వం. ప్రైవేటు కంపెనీలకు విడుదల చేసే అటువంటి బాండ్లుకు కూడా ఈ పన్ను రాయితీలు వర్తింపచేస్తే ఇకపై రూపాయి పెట్టుబడి లేకపోయినా ప్రజల సొమ్ముతో దర్జాగా వేల కోట్ల లాభాలు దిగమింగటానికి మార్గం తేలికపర్చటమే అవుతుంది.

ఈ బడ్జెట్‌ ప్రతిపాదించిన పన్నుల విధానంలో మరో ముఖ్యమైనది నూతన పెన్షన్‌ పథకానికి సంబంధించింది. కార్మిక సంఘాలు, వామపక్షాల ఒత్తిళ్ల వల్ల నూతన పెన్షన్‌ విధానం ఇంతవరకూ చట్టరూపానికి నోచుకోలేదు. తాజా బడ్జెట్‌లో ఇపిఎఫ్‌, పిపిఎఫ్‌ల లబ్దిదారులకు స్కీం మెచ్యూరిటీతో వచ్చే ఆదాయంపై కూడా పన్ను ప్రతిపాదించారు. అంటే ఆర్థిక మంత్రి ప్రతిపాదన పార్లమెంట్‌ ఆమోదం పొందితే ఇపిఎఫ్‌ స్కీం మెచ్యూరిటీతో లక్ష రూపాయల ఆదాయం సంపాదించుకుంటే అందులో 60 వేల రూపాయలు పన్ను రూపంలో చెల్లించాల్సి ఉంటుంది. పిల్లల చదువులకో, పెళ్లిళ్లకో, ఇల్లు కట్టుకోవటానికో దాచుకున్న డబ్బులపై పన్ను వేటు పడుతోంది. మరోవైపున నూతన పెన్షన్‌ పథకంలో సభ్యత్వం తీసుకున్న ప్రతి కార్మికుడు, ఉద్యోగికీ ఏటా ప్రభుత్వం వెయ్యి రూపాయల చొప్పున మూడేళ్ల పాటు నిధి జమచేయనుంది. కొత్త పథకం పట్ల మోజు కల్గించే ప్రయత్నం తప్ప ఇది నిజంగా కార్మికులకు ప్రయోజనం కలిగించే ప్రయత్నం కాదు.

ఒకవేళ ఎవరైనా ప్రయోజనకరమైన వస్తువులు కొనుగోలుచేయాలని ప్రయత్నిస్తే వారి పరిస్థితి ఎలా ఉంటుంది? వివిధ రంగాలపై సర్వీసు పన్ను పెంచటం ద్వారా వస్తువులు, సేవలు మరింత భారంగా మారనున్నాయి. ఉదాహరణకు నిర్మాణంలో ఉన్న ఇంటికి బ్యాంకు రుణం తీసుకుంటే దానిపై కూడా సర్వీసు పన్ను చెల్లించాల్సి ఉంటుంది. అంటే ఇకపై ఇన్‌స్టాల్‌మెంట్ల భారం పెరగనుందన్నమాట. వినిమయ వస్తువులు కొందామంటే కూడా పరిస్థితి అంత తేలికగా ఏమీ లేదు. ఉదాహరణకు పెట్రోలియం ఉత్పత్తులపై పెంచిన భారం అన్ని రంగాల్లోనూ, అన్ని తరగుతల ప్రజలపైనా వడ్డించేందుకు కంపెనీలు సిద్ధమవుతున్నాయి. అదేవిధంగా కనీస ప్రత్యామ్నాయ పన్ను (మాట్‌)లో పెరిగిన భారాన్ని, ఎక్జైజు, కస్టమ్స్‌ సుంకాల రూపంలో పెరిగిన భారాన్ని కంపెనీలు నేరుగా వినియోగదారులపై వడ్డించేందుకు సిద్ధమయ్యాయి. ఈ దిశలోనే ఎలక్ట్రానిక్‌, మరియు గృహోపకరణాలు ఉత్పత్తి చేసే ఎల్జీ కంపెనీ తమ ఉత్పత్తుల ధరల్లో 1.5 శాతం నుండి 3.5 శాతం పెంపుదలకు ఆదేశాలు జారీ చేసింది. గోద్రెజ్‌ కంపెనీ ఉత్పత్తులు బడ్జెట్‌కు ముందు రెండు శాతం తక్కువ ధర పలికితే బడ్జెట్‌ మరునాడు రెండు శాతం అదనపు ధర పలుకుతున్నాయి. వళ్‌పూల్‌ కంపెనీ తమ ఉత్పత్తుల న్నింటిపైనా సగటున రెండు శాతం ధరలు పెంచాలని నిర్ణయిం చుకుంది. ఎక్జైజు సుంకాలు పెరగటం వల్ల కార్ల కంపెనీల తమ ఉత్పత్తులపై 3000 నుండి 50000 వరకు పెంచుతూ నిర్ణయించాయి. కొత్త పన్నుల విధానం ద్వారా చేతిలో మిగిలిన డబ్బులు వెచ్చించాలని మార్కెట్‌లోకి అడుగుపెట్టే సోదరులారా... ఎంత ఖర్చుపెడుతున్నారు, ఎందుకు ఖర్చు పెడుతున్నారో ఒక్కసారి ఆలోచించుకోండి మరి....

పన్ను పరిధిలోకి గత ప్రస్తుత తేడా

వచ్చే ఆదాయం బడ్జెట్‌ బడ్జెట్‌ (మిగులు)

2,00,000 4120 4120 0

5,00,000 55620 35019 20,601

10,00,000 210120 158619 51,501

12,00,000 2,71,919 2,20,419 51,500

15,00,000 3,64,619 3,13,119 51,500

20,00,000 5,19,119 4,67,619 51,500

Wednesday, March 3, 2010

సంస్కరణలపై యావ తగ్గని ప్రభుత్వం

ప్రజాశక్తి -బిజినెస్‌డెస్క్‌కొండూరి వీరయ్య Sun, 28 Feb 2010, IST

ఊరందరిదీ ఒక దారి అయితే ఉలిపి కట్టెది వేరే దారట. సంస్కరణలను వేగవంతం చేసేందుకు మన భారతదేశం 2010-2011 బడ్జెట్‌లో పెద్ద పీట వేయటమే దీనికి ఉదాహరణ. గతవారం చెప్పుకొన్నట్లు రెండు దశాబ్దాల సంస్కరణల అనుభవాలు మదింపు చేసుకునేందుకు వచ్చిన అరుదైన అవకాశాన్ని ప్రభుత్వం వృధా చేసుకొందని చెప్పకతప్పదు. 1990-1991 సంస్కరణలకు ఆరంగేట్రం చేసిన ప్రణబ్‌ ముఖర్జీ, మన్మోహన్‌సింగ్‌, మాంటెక్‌ సింగ్‌ అహ్లువాలియాలే నేడు కూడా కీలక విధాన నిర్ణాయక హౌదాలో ఉన్నారు. పైగా మొదటి రెండు దశాబ్దాల్లో మౌలిక రంగాలకు పరిమితం అయిన సంస్కరణలను నేడు సామాజిక, అనుబంధ రంగాలకు కూడా విస్తరించటానికి వీరి నేతృత్వంలో ప్రభుత్వం నడుం కట్టినట్లు బడ్జెట్‌ ప్రసంగాన్ని పరిశీలిస్తే అర్థం అవుతుంది.

ఏ దేశానికి సంబంధించిన ఆర్ధిక వ్యవస్థలోనైనా రెండు భాగాలు ఉంటాయి. మొదటిది పరపతి విధానం. దాన్నే విస్తృతార్థంలో మానిటరీ పాలసీ అంటారు. రెండోది ద్రవ్య విధానం. దాన్నే ఫిస్కల్‌ పాలసీ అంటారు. పరపతి విధానం ద్వారా రిజర్వు బ్యాంకు మార్కెట్లో ఉండాల్సిన రొక్కం నిధులు, దానికి అవసరమైన విధి విధానాలను ప్రభుత్వాలు నియంత్రిస్తాయి. ద్రవ్య విధానంలో భాగంగా ప్రభుత్వం మార్కెట్‌లో ఉన్న నిధులు ఎవరి వద్దకు చేర్చాలి అన్న విషయంలో తన విచక్షణ ప్రదర్శిస్తుంది. ఇందులో ముఖ్యమైనది పన్నుల విధానం. ఏ ప్రభుత్వం అయినా ఎవరి పక్షపాతిగా ఉంది అని చెప్పటానికి సదరు బడ్జెట్‌లో అనుసరించిన పన్నుల విధానం కీలక ప్రాతిపదికగా ఉంటుంది. పరోక్ష పన్నులు (ఎక్సైజ్‌, కస్టమ్స్‌, సర్‌చార్జి వంటివి) నూటికి 95 శాతం ప్రజల జీవితాలను, ఆదాయ వ్యవయాలను నేరుగా ప్రభావితం చేస్తాయి. దీనికి భిన్నంగా ప్రతక్ష్య పన్నుల పరిధిలోకి వచ్చే ప్రజల వాటా కేవలం 5 శాతం మాత్రమే.95 శాతం మందిపై విధించే పన్నుల ద్వారా ప్రభుత్వానికి ఎక్కువ ఆదాయం సమకూరవచ్చు. కానీ ఆ మేరకు ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావం పడుతుంది. పదే పదే కౌటిల్యుడి ఆర్థిక సూత్రాల ప్రకారం బడ్జెట్‌ రూపొందించామని చెప్పుకున్న ప్రణబ్‌ ముఖర్జీ , ''మార్కెట్‌లో నియంత్రణలు లేని ధరల వల్ల వేర్వేరు వర్గాల ప్రజలు వేర్వేరు మోతాదుల్లో భారాలపాలవుతారు. ప్రత్యేకించి శ్రమజీవులపై ఈ భారం ఎక్కువగా ఉంటుంది'' అన్న కౌటిల్యుని సూత్రాన్ని మాత్రం మర్చిపోయారు. ఉత్పాదక క్రమాన్ని దెబ్బతీయకుండా ప్రభుత్వ ఆదాయం పెంచుకోవటానికి అవసరమైతే జూద గృహాలు (నేటి స్పెక్యులేటివ్‌ వ్యాపారులు)పై కూడా పన్ను వేయాలని కౌటిల్యుడు చెప్పిన సూత్రం మాత్రం ఆర్థిక మంత్రికి గుర్తుకు రాలేదు.

ప్రభుత్వం చమురు ధరలు, ఎరువులపై నియంత్రణ రద్దు చేస్తూ తీసుకున్న నిర్ణయం మొత్తంగా 95 శాతం మంది ప్రజానీకంపై భారాలు మోపటంతో పాటు ద్రవ్యోల్బణాన్ని పెంచుతుంది. దాంతో పాటే ధరలు కూడా పెరుగుతాయి. ధరలు పెరగటం అంటే మార్కెట్‌లో ప్రజల చేతిలో ఉన్న రొక్కం (లిక్విడిటీ) తగ్గిపోవటం అన్నమాట. ధరల రూపంలో ఈ నిధులు చేతులు మారి సంపన్నులకు చేరతాయి. అదే 5 శాతం మంది పారిశ్రామికవేత్తలు, కుబేరులపై విధించే పన్నులు పెంచటం వల్ల నేరుగా ఆర్థిక వ్యవస్థపై పడే భారం పరిమితంగా ఉంటుంది. కానీ ప్రభుత్వం మొదటి నిర్ణయానికే ప్రాధాన్యత ఇచ్చింది.సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ డైరెక్ట్‌ టాక్సెస్‌ (సిబిడిటి) అంచనా మేరకు కేవలం వివాదాల కారణంగా ప్రభుత్వం ఏటా పన్నుల ద్వారా రావాల్సిన ఆదాయంలో 50 వేల కోట్ల రూపాయలు కోల్పోతోంది. ప్రభుత్వం ఈ బడ్జెట్‌లో పరోక్ష పన్నుల ద్వారా వసూలు చేయదల్చుకొన్న మొత్తం ఆదాయంలో ఇది మూడోవంతు. అంతేకాదు. గత మూడు సంవత్సరాలుగా దేశ స్థూల జాతీయోత్పత్తిలో ప్రత్యక్ష పన్నుల వాటా, కార్పొరేట్‌ పన్నుల వాటా తగ్గిపోతోందని ఆర్థిక సర్వే స్పష్టంగా చెప్పింది. అయినా ఈ విషయాలు సరి చేయటం ద్వారా ఆదాయం పెంచుకునేందుకు ఉన్న మార్గాలు పరిశీలించటానికి ప్రభుత్వం నిరాకరిస్తోంది.

మధ్యతరగతి ప్రజల మెప్పు పొందటం కోసం ఆదాయపు పన్నుల్లో నామమాత్రపు మార్పులు చేసింది. చూడటానికి 1,60,000 రూపాయలకు లోబడి ఆదాయం వచ్చే వారిపై పన్ను భారం తగ్గించటం ద్వారా వారి చేతిలో ఖర్చుపెట్టటానికి పుష్కలంగా అవసరమైన నిధులు అందుబాటులో ఉంచామని ఆర్థిక శాఖ కార్యదర్శి ప్రకటించారు. అదే సమయంలో ధరల నియంత్రణను గాలికి వదిలేయటం ద్వారా కుడిచేత్తో ఇచ్చిన రొక్కాన్ని ఎడమ చేత్తో లాగేసుకున్నట్లయ్యింది. చమురు, ఎరువుల ధరలపై నియంత్రణ రద్దు చేయటం ఈ ఒక్క బడ్జెట్‌కే పరిమితమైన కసరత్తు కాదు. రానున్న కాలంలో ఈ ధరల నిర్ణయ క్రమాన్ని మార్కెట్‌ ఒడిదుడుకులకు అనుగుణంగా నిర్ణయించే స్వతంత్ర అధికారాన్ని ఆయా కంపెనీలకు చేతిలో కట్టబెట్టింది. గత నెల రిజర్వు బ్యాంకు వెలవరించిన ఒక నివేదికలో '' ప్రభుత్వం మార్కెట్‌ను ప్రతికూలంగా ప్రభావితం చేసేలా తీసుకున్న నిర్ణయాలు భారం తక్షణమే ప్రజలకు చేరుతుంది. సానుకూలంగా ప్రభావితం చేసేలా తీసుకున్న నిర్ణయాలు ప్రజలకు చేరేసరికి ఆలస్యం అవుతున్నాయి'' అని పేర్కొంది. అంతర్జాతీయ మార్కెట్‌లో పెద్దఎత్తున పతనం చవిచూసిన గత రెండు సంవత్సరాల్లో రిటైల్‌ ధరలు ఏమాత్రం తగ్గాయో మనం చూస్తూనే ఉన్నాము. అందువల్ల ఇకపై ప్రజలపై పడే ధరల భారం ఎగమోరతో ఉంటుందే తప్ప తిరుగుముఖం పట్టే అవకాశాలు లేవు.

సంస్కరణల విషయంలో చెప్పుకోవాల్సిన మరో కీలక అంశం వ్యవసాయ రంగంలో ప్రైవేటు పెట్టుబడులు పెంచాలన్న ప్రతిపాదన. విద్యా రంగంలో విదేశీ విశ్వవిద్యాలయాలకు పెద్ద పీట వేయాలన్న ప్రతిపాదన ముఖ్యమైనవి. ప్రభుత్వం మూడ్‌ గమనించిన రిజర్వు బ్యాంకు కూడా ఈ విధానాలకు మానిటరీ పాలసీలో ఉన్న అవాంతరాలు తగ్గించే విధంగా అవసరమైతే రూపాయి పూర్తి మారకాన్ని అనుమతించేందుకు వెనకాడబోమని ప్రకటించింది. ఆర్థిక సర్వేలో కూడా ఇప్పటి వరకు ప్రభుత్వం అనుసరిస్తున్న సంక్షేమ విధానాల దశ, దిశను మార్చాలని ప్రతిపాదించింది. పాశ్చాత్య దేశాల్లో సంక్షేమ రాజ్యం గురించి జరుగుతున్న చర్చల సారాంశాన్ని భారత ప్రభుత్వం తన విధాన పత్రాల్లో చొప్చించింది. తద్వారా భారతదేశంలో సంక్షేమ రాజ్యం గురించి జరుగుతున్న చర్చకు ఆందోళనకరమైన నూతన కోణాన్ని జోడించింది ఈ బడ్జెట్‌.