Wednesday, May 22, 2019

May 04,2019
http://www.navatelangana.com/article/net-vyaasam/802210


ప్రజాస్వామ్యం.. ధన స్వామ్యం

ప్రజాస్వామ్యం రంగు మారుతోంది. కరెన్సీ కట్టలు రంగు మారినట్టే. నానాటికీ సమాజం సత్యానికి దూరంగా జరుగుతుంటే నిజం చెప్పే వాళ్లనే నిజం అసహ్యించుకుంటుందని జార్జి ఆర్వెల్‌, ప్రముఖ ఆంగ్ల నవల రచయిత అంటారు. సర్వకాలాల్ల నికరంగా నిలబడేదే నిజం. కానీ నేడు మనమున్నది సత్యానంతర సమాజం. ఇంకా చెప్పాలంటే సత్యదూరమైన సమాజం. ఇక్కడ నాణేనికి బొమ్మా బొరుసు ఉన్నట్టే సత్యానికి కూడా బొమ్మా బొరుసు ఉంటాయి. ఎవరి నిజం వారిదే. కానీ కొన్ని నిజాలు నిప్పులాంటివి. అందులో ఒక నిజం ఎన్నికల్లో డబ్బు పాత్ర గురించిన నిజం.
            ప్రజల చేత ప్రజల కోసం ప్రజల వలన సాగే పాలన ప్రజాస్వామ్యమని అప్పుడెప్పుడో అబ్రహాం లింకన్‌ ప్రజాస్వామ్యానికి నిర్వచనం చెప్పారు. భారత లోక్‌సభ ఎన్నికల తీరు గమనిస్తే బహుశా లింకన్‌ ముక్కు మీద వేలేసుకునేవాడేమో. ఎటువంటి ప్రలోభాలకు తావు లేకుండా ప్రజలను ఒప్పించి ఇతరులను నొప్పించక ఓటు వేయించుకోవటం ఎన్నికల ప్రక్రియలో కీలకమైన ఘట్టం. కానీ ఇక్కడ ప్రలోభాలకు కొదవలేదు. లోక్‌సభ నియోజకవర్గంలో పోటీచేసే అభర్థి 70లక్షలకు మించి ఖర్చు పెట్టకూడదు. అంతకన్నా ఎక్కువ ఖర్చు పెట్టినట్టు రుజువయితే సదరు అభ్యర్థి గెలిచినా అనర్హునిగా ప్రకటించే అధికారం కేంద్ర ఎన్నికల సంఘానికి ఉన్నది. అనంతపురం లోక్‌సభ స్థానానికి తెలుగుదేశం అభ్యర్ధిగా బరిలోకి దిగిన సిట్టింగ్‌ ఎంపీ జేసీ దివాకరరెడ్డి 50కోట్ల వరకు ఈ ఎన్నికల్లో ఖర్చు పెట్టాల్సి వచ్చిందని వాపోయారు. పూట గడవని వ్యవసాయ కూలీలు దళితులు కూడా నిలబెట్టి నాయకుల వద్ద ఓటు విలువ వసూలు చేశారని తెగబాధ పడిపోయారు. బహుశా నిమ్న వర్గాల శ్రమ దోచుకోవటానికి తేరగా అవకాశాలు కల్పించే ఈ వ్యవస్థలో అటువంటి వారి ఓటుకు ఖరీదు కట్టాల్సి రావటం ఈయనకి అంతగా రుచించలేదు కాబోలు. ఏపీ లోక్‌సభ ఎన్నికల్లో ఏ ఒక్క అభ్యర్థి పది కోట్లకు తక్కువ ఖర్చు పెట్టలేదని ఒక టీవీ ప్రసారం చేసిన ప్రత్యేక కథనం వెల్లడిస్తోంది. ఎన్నికల ప్రచారం మరో రెండ్రోజుల్లో ముగుస్తుంది అనగా హైదరాబాద్‌లో బీజేపీ ఏకంగా ఎనిమిది కోట్లు బ్యాంక్‌ నుంచి డ్రా చేసి తీసుకెళ్తుండగా పోలీసులకు పట్టుబడింది. ఒక సాధారణ ఖాతాదారునికి ఒకేసారి పదివేలకు మించి ఇవ్వటానికి నానా యాగీ చేసే బ్యాంకు నిబంధనలు పాలక పార్టీకి ఏకంగా ఒకే రోజు ఎనిమిది కోట్ల రూపాయలు ఎలా డ్రా చేసుకోవటానికి అనుమతినిచ్చాయో అడిగే నాధుడు కరువయ్యాడు.

                దేశంలో అత్యంత ధనం మూట గట్టుకున్న పార్టీకి నాయకత్వం వహించే వ్యక్తి తనను తాను ఫకీరునని చెప్పుకుంటున్నాడు. ఊళ్ళో పెళ్లికి ఎవరికో సందడి అన్నట్టు ఎన్నికలంటే ఎక్కడెక్కడి నిధులు నదుల్లా పొంగి పొర్లుతాయి. దేశంలో నల్ల ధనాన్ని మాయం చేస్తానంటూ మోడీ నోట్లరద్దు మంత్ర దండాన్ని గాల్లో తిప్పాడు. కానీ ఈ ఎన్నికల్లో దొరికిన దాదాపు 4వేల కోట్ల రూపాయలు నల్లధనం ఏ కలుగులో నుంచి వచ్చిందో కనుక్కునే ప్రయత్నం కూడా చేయటం లేదు ప్రభుత్వం.
         ఉత్తరప్రదేశ్‌ ఎన్నికల సందర్భంగా ప్రతిపక్ష పార్టీల ఖాతాలకి గొళ్ళెం పెట్టి మరీ బీజేపీ వేల కోట్లు ఎన్నికల్లో పెట్టుబడి పెట్టింది. ఇదేశైలి త్రిపుర ఎన్నికల వరకు కొనసాగింది. సన్యాసులు సాధువులు సంత్లు నాయకులుగా ఉన్న పార్టీకి ఇన్ని నిధులు ఎలా వచ్చాయన్న విషయాన్ని దర్యాప్తు చేయాల్సిన సంస్థలన్నీ బీజేపీ పెరట్లో పలుపు తాళ్లకు కట్టేయబడ్డాయి. దాంతో అసలైన నిజాలు ఎన్నటికీ ప్రజల దృష్టిలోకి వచ్చే అవకాశం లేదు. కానీ ప్రత్యామ్నాయ మార్గాల్లో అందుబాటులో ఉన్న సమాచారం మేరకు మనం కొన్ని నిర్ధారణలకు రావచ్చు.

                మోడీ మంత్ర దండమో అమిత్‌షా తంత్ర గండమో తెలీదు కానీ రాజుగారి గంగాణం నిధులతో పొంగి పొర్లుతోంది. ఇంకా చెప్పాలంటే కార్పొరేట్‌ కంపెనీల లాభాల రేటును మించి బీజేపీ ఖాతాలో నికర నిల్వలు పెరుగుతూ వచ్చాయి. యూపీఏ హయాంలో జరిగిన కుంభకోణాల్లో లబ్దిదారులంతా బీజేపీకి చందాలు ఇచ్చి కాంగ్రెస్‌కు కరువు కాలం చూపినట్టు కనిపిస్తోంది. వేరే పార్టీల విషయంలో ఇలా జరిగి ఉంటే జాతిని మేల్కొలపటానికి అటు ప్రభుత్వంలోని ఇటు పాత్రికేయ రంగంలోని నిఘావర్గాలు జూలు విదిలించి ఉండేవి. కానీ ఇక్కడ ఆయా నిఘా వ్యవస్థలను మేల్కొల్పాల్సిన చౌకీదారే కండ్లు మూసుకున్నారు.
             ఈ ఎన్నికల్లో ప్రధాన బూర్జువా పార్టీలు పెట్టిన ఖర్చు నిస్సందేహంగా ఎన్నికల సంఘం అనుమతించిన పరిమితి కంటే వంద రెట్లు ఎక్కువగా ఉంది. ఎన్నికల ప్రచారానికి బీజేపీ ఒక్కటే 125 హెలికాఫ్టర్లు అద్దెకు తీసుకున్నది. ఇక ప్రయివేటు విమానాల సంఖ్య తేలాల్సి ఉంది. ఒకే రోజు ఉత్తరప్రదేశ్‌ నుంచి ఏపీ మీదుగా కేటాల5 వరకు జరిగిన బహిరంగసభల్లో బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షా హాజరయ్యారు. ప్రయివేటు విమానం ఉంటే తప్ప ఇది సాధ్యం కాదు. సగటున హెలికాప్టర్ల అద్దె గంటకు ఏడున్నర వేల డాలర్లు. అంటే సుమారు ఐదు లక్షల రూపాయలు. కనీసం ఓ మీటింగ్‌కు ఢిల్లీ నుంచి బయల్దేరి వచ్చి మీటింగ్‌లో ఉపన్యాసం ఇచ్చి తిరిగి వెళ్లితే ఎంత లేదన్నా 4 గంటల సమయం అవసరం. అంటే 20లక్షల ఖర్చు. ఈ విధంగా ఏ పార్టీకి చెందిన ఎంత మంది నాయకులు ఇలాంటి మీటింగ్‌లల్లో ఎన్నింటిలో పాల్గొన్నారో లెక్క తీయటం బ్రహ్మ విద్య ఏమీ కాదు. దేశీయ పౌర విమానయాన సంస్థ ఆధ్వర్యంలో నడిచే ఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోల్‌ విభాగాల వద్ద గగన వీధుల్లో తిరిగిన గాలిమరల వివరాలు అన్నీ నిక్షిప్తం అయి ఉంటాయి. ఎన్నికల సంఘం కనీసం కండ్లు తెరిచి వ్యవహరించి ఈ వివరాలు తెప్పించుకుంటే ఏ పార్టీ స్టార్‌ నాయకుల ప్రయాణాలకే ఎంత ఖర్చు పెట్టిందో లెక్క తేల్చవచ్చు. ఓ సారి అలాంటి లెక్క తీసాక ఆ ఖర్చు మొత్తాన్ని లెక్కిస్తే బూర్జువా పార్టీలు ప్రత్యేకించి బీజేపీ అభర్థులందరినీ అనర్హులుగా ప్రకటించవచ్చు. ఇవి కాక జేసీ దివాకర్‌ రెడ్డి వెల్లడించిన వివరాలు పోగేస్తే ఏ పార్టీ లేదా ఏ అభ్యర్థి ఎంత ఖర్చు పెట్టాడో లెక్క తేల్చడం కూడా పెద్ద శ్రమతో కూడిన వ్యవహారం కాదు.

                    ఈ ఆర్భాటాల్లో బీజేపీని మించగల శక్తి మరో పార్టీకి లేదు. 2015-16 ఆర్థిక సంవత్సరానికి బీజేపీ ఖాతాలో రూ.570 కోట్లు జమ పడ్డాయి. 2016-17నాటికి ఈ మొత్తం 1034 కోట్లకు పెరిగింది. ఇవన్నీ కేంద్ర ఎన్నికల సంఘానికి బీజేపీ ఇచ్చిన వివరాలలోని విషయాలే. రాజకీయ పార్టీలకు ఇచ్చే చందాల విషయంలో పారదర్శకతకు మంగళం పాడిన తర్వాతనే బీజేపీకి ఈ నిధుల వరద పెరిగిన విషయం స్పష్టంగా కనిపిస్తుంది. ఈ స్థాయిలో నిధులు సమీకరించుకునే వెసులుబాటు బీజేపీకి మాత్రమే ఉంది. కాబట్టి ఈ చందాలు ఎలా వచ్చాయి? ఎవరిచ్చారు? అనే విషయాలు బహిర్గతం చేయాల్సిన అవసరం లేకుండా మోడీ ప్రభుత్వం చట్టం తెచ్చింది. ఈ చట్టాన్ని సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో కేసు నడిచింది. వాద ప్రతివాదనలు విన్నాక ఏ పార్టీకి ఎంత మొత్తంలో కార్పొరేట్‌ కంపెనీల నుంచి నిధులు అందాయో మార్చి 31నాటికి తెలియ చేయాలని ఆదేశించింది.
               ఎన్నికల వ్యవస్థే బూర్జువావర్గ పాలనను పరిరక్షించే మార్గాల్లో ఒకటి అన్న అంచనా ఉన్నపుడు ఈ ఎన్నికల్లో ఎవరు ఎంత ఖర్చు పెడితే ఏమిటి ఎవరు గెలిస్తే ఏమిటి అన్న ప్రశ్న తలెత్తడం సహజం. ఎంత అస్త వ్యస్థంగా ఉన్నా ఈ ఎన్నికల వ్యవస్థలో ఎంతో కొంత మేర ప్రజల వాణి వినిపించే వామపక్షాల లాంటి శక్తులు చట్టసభల్లో అడుగు పెట్టగలుగుతున్నాయి. ప్రత్యామ్నాయ రాజకీయ శక్తులు బలంగా ఉన్న కేరళ, బెంగాల్‌, త్రిపుర వంటి రాష్ట్రాల్లో ఎన్నికల్లో ధన ప్రభావం మిగతా రాష్ట్రాల్లో ఉన్న స్థాయిలో లేదు. ఎన్నికల ప్రచారం ఎంతో కొంత విధానాలకు పరిమితమయ్యే పరిస్థితి ఆయా రాష్ట్రాల్లో ఉంది. కానీ సరళీకరణ విధానాలు దేశంలో అన్ని వ్యవస్థలను దిగమింగుతున్నట్టు రాజకీయ వ్యవస్థను పార్టీలను కూడా దిగ మింగుతోంది. ఎన్నికల్లో ధన ప్రభావాన్ని దీనికి ఓ మార్గంగాను, రహస్య మార్గాల్లో పార్టీలకు చందాలు చేరవేయటం ఓ సాధనంగానూ మారింది. సాధారణంగా ఎన్నికల్లో కోటీశ్వరులు కార్పొరేట్‌ వర్గం బరిలోకి దిగాక ఎన్నికల ప్రచారంలో రైతు వ్యవసాయ కార్మిక సమస్యలు, గిట్టుబాటు ధరలు, కనీస వేతనాలు, ధరల భారం, నిరుద్యోగ సమస్య వంటి సాధారణ పౌరుల ఈతిబాధలకు ఎన్నికల ప్రచారంలో చోటు దక్కుతుందని ఆశించటం నేతి బీరకాయలో నేయి చందమే.

ఎన్నికల బరిలో దిగిన అభ్యర్థుల్లో ఎవరు ఎక్కువ ఖర్చు పెడితే వారి గెలుపునకు 91శాతం అవకాశాలు ఉన్నాయని ఓ అధ్యయనం వెల్లడిస్తోంది. గత 20ఏండ్లల్లో జరిగిన ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు, గెలుపొందిన అభ్యర్థుల ఆర్థిక స్థితిగతులు విశ్లేషిస్తే కోట్లల్లో ఖర్చు పెట్ట గలిగిన అభ్యర్థులు 84శాతం గెలిచారు. మిగిలిన 16శాతం బహుశా వామపక్షాల అభ్యర్థులు, రిజర్వుడ్‌ నియోజక వర్గాల్లో పోటీ చేసిన అభ్యర్థులు అయి ఉంటారు.
అభ్యర్ధుల ధన బలానికి పార్టీల ధన బలం తోడైతే? ఇక పర్యవసానం ఏమిటో ఊహించుకోవటం పెద్ద కష్టమేమీ కాదు. ఎన్నికల్లో రానురాను పెరుగుతున్న ధన ప్రభావం ఎన్నికలను కార్పొరేట్‌ కంపెనీలు పెట్టుబడులు పెట్టి లాభాలు ఆర్జించే మరో రంగంగా మారుతోంది.
              ఎన్నికల్లో ధన ప్రభావాన్ని అడ్డుకోకుండా ప్రత్యామ్నాయ రాజకీయ శక్తులు చట్టసభల్లో ప్రవేశించలేవు. అటువంటి శక్తులకు చట్టసభల్లో ప్రవేశం లేకుండా ప్రజా సమస్యల మీద చట్ట సభల్లో చర్చకు అవకాశం లేదు. ప్రత్యామ్నాయ రాజకీయాల కోసం పోరాడే శక్తులు ప్రత్యామ్నాయ ఎన్నికల వ్యవస్థ గురించిన చర్చ కూడా తమ ఎజెండాలో చేర్చుకోవాలి. కార్పొరేట్‌ శక్తులకు ధారాదత్తమవుతున్న ప్రజా ప్రాతినిధ్య వ్యవస్థలను కాపాడుకోవటం కూడా ప్రత్యామ్నాయ రాజకీయ శక్తుల తక్షణ కర్తవ్యం కావాలి. చేజారిపోతున్న ప్రజాస్వామిక వ్యవస్థలను కాపాడుకోవాల్సిన అవసరం గురించి ప్రజల్లో చైతన్యం కలిగించాలి.
- కొండూరి వీరయ్య
సెల్‌: 9871794037

No comments: