Apr 02,2019
మారుతున్న సంఘ్' వ్యూహాలు..
http://www.navatelangana.com/article/net-vyaasam/787073
సామాజిక జీవితంపై ప్రభావంలోక్‌సభ ఎన్నికలకు గాంధీనగర్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి లాల్ కిషన్ అద్వానీ స్థానంలో బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షా నామినేషన్ దాఖలు చేయటంతో బీజేపీ తొలితరం నాయకత్వం పూర్తిగా తెరమరుగైంది. దాదాపు నాలుగు దశాబ్దాల పాటు పార్టీకి రాజకీయంగా సైద్ధాంతికంగా సారధ్యం వహించిన అటల్ బిహారీ వాజ్‌పేయి-అద్వానీ స్థానంలో అమిత్‌షా- నరేంద్రమోడీ ద్వయం పార్టీ వ్యవస్థపై సంపూర్ణ ఆధిపత్యం సంపాదించింది. ఎన్నికల ఫలితాలు ఎలా ఉన్నా పార్టీకి సారధ్యం వహించటంలో ఈ రెండు జోడీల మధ్య సాపత్య వ్యత్యాసాలు రానున్న కాలంలో చర్చనీయాంశం కానున్నాయి.మూడున్నర దశాబ్దాలుగా పార్టీకి వాజ్‌పేయి-అద్వానీ సారధ్యం వహించిన తీరుకు గత ఐదేండ్లుగా మోడీ-షా సారధ్యం వహిస్తున్న తీరుకూ మధ్య పోలిక లేదు. మోడీ-షా ద్వయం నాయకత్వంలో రాష్ట్రీయ స్వయం సేవక్‌సంఫ్‌ు పడగ నీడ అటు పార్టీపైనా ఇటు ప్రభుత్వంపైనా మర్రి ఊడలా పర్చుకుంటోంది. 1998లో ఎన్డీయే తొలిసారి అధికారానికి రావటంతో భారత రాజకీయాల్లో హిందూత్వ ఆధిపత్య రాజకీయాలు నిర్ణయాత్మక దశకు చేరుకుంటే 2014లో మోడీ-షా ద్వయం పగ్గాలు చేపట్టాక హిందూత్వ రాజకీయాలు కాస్తా హిందూ ఉన్మాద రాజకీయాలుగా రూపాంతరం చెందాయి. రెండు దశల్లోనూ సంఘపరివారం వ్యూహాత్మకంగానే వ్యవహరిం చింది. 1998లో ఎలాగైనా అధికారాన్ని చేపట్టాలన్న లక్ష్యంతో పరివార్‌కు కీలకమైన రాజకీయ విధానాలను కూడా పక్కన పెట్టింది. 2014లో ఎలాగైనా అధికారం చేజారిపోదు అన్న ధీమా వచ్చాక మోడీ-షా ద్వయం అప్పటి వరకు పక్కన పెట్టిన విధానాలు, వ్యవహారాలు, ఎజెండాలు అన్నీ తెరమీదకు తెచ్చేసింది.
ఇప్పటి వరకు కేంద్రంలో అధికారం చేపట్టిన పార్టీలకు వచ్చిన ఓట్ల శాతంతో పోల్చి చూస్తే 2014లో బీజేపీకి మాత్రమే అతి తక్కువ ఓట్ల శాతం -31 శాతం వచ్చాయి. అంటే సంఖ్యరీత్యా పార్లమెంట్‌లో బలంగా ఉన్నా ప్రజాపునాది రీత్యా అత్యంత బలహీనమైన ప్రభుత్వంగా మోడీ ప్రభుత్వం చరిత్రలో నిలిచిపోతుంది. కానీ మోడీ పరిపాలన ప్రాధాన్యతలు దేశాన్ని మరో రెండు దశాబ్దాల వరకు ప్రభావితం చేసేవిగా ఉన్నాయి. పరిమిత ప్రజా పునాది కలిగిన ప్రభుత్వం దేశ భవిష్యత్తును అపరిమితంగా ప్రభావితం చేసే విధానాలకు తెర తీసే అధికారం కలిగి ఉందా లేదా అన్న ప్రశ్న తలెత్తుతుంది.
ఇటువంటి విధానాలన్నీ రాజకీయ సైద్ధాంతిక సాంస్కృతిక రంగంలో ఏ విధంగా ప్రభావం చూపుతాయో అర్థం చేసుకుంటే తప్ప మోడీ ప్రభుత్వాన్ని గద్దె దించాల్సిన ఆవశ్యకతను అర్థం చేసుకోలేం. మరో మాటలో చెప్పాలంటే ఆధిపత్య రాజకీయాల స్వరూప స్వభావాలను అర్థం చేసుకోలేకపోతే ప్రజాస్వామిక వ్యవస్థపై విస్తరిస్తున్న సంఘపరివారం పడగ నీడ ప్రమాదాన్ని కూడా అర్థం చేసుకోవటం సాధ్యం కాదు. ఎన్నికల్లో గెలిచిన వాళ్లే ప్రభుత్వం ఏర్పాటు చేస్తారు, ఎవరు ప్రభుత్వంలోకి వస్తే ఏమిటి అన్న ప్రశ్నతో కాలం వెళ్లబుచ్చదల్చుకున్న వారికి ఓటు కేవలం ప్రభుత్వాలను ఎన్నుకోవటం కోసం మాత్రమే కాదనీ, ప్రజల భవిష్యత్తును, దేశ భవిష్యత్తుకు దిశా నిర్దేశం చేయటంలో ఓటు కీలకపాత్ర పోషిస్తుందన్న వాస్తవాన్ని గ్రహించటంలో విఫలమవుతాము.
మోడీ పరిపాలనలో భారతీయ సమాజంలో పెరుగుతున్న మితవాద ప్రజాతంత్ర వ్యతిరేక ధోరణుల పట్ల అప్రమత్తంగా ఉండాలంటే మోడీ పాలన ప్రభావాన్ని విశ్లేషించాలి. అర్థం చేసుకోవాలి. హిందూత్వ రాజకీయాల నాందీ ప్రస్తావన నుంచి పరిశీలిస్తే తప్ప దీన్ని అర్థం చేసుకోలేము. వలసవాదంతో మొదలైన హిందూ-ముస్లిం విభజన స్వాతంత్య్రానంతరం ఏయే రూపాలు తీసుకుంది, జాతీయ రాజకీయాల్లో కేంద్ర స్థానాన్ని ఆక్రమించిన తర్వాత పరిస్థితుల గురించిన ప్రశ్న అటువంటి వాటిలో ఒకటి. ముస్లిం వేర్పాటువాదానికి ప్రతిగా హిందూ మతోన్మాదం తలెత్తిందన్న వాదన తరచూ వినిపిస్తోంది. కానీ చరిత్రను పరిశీలిస్తే ఈ వాదన సత్యదూరమని తేటతెల్లమవుతుంది. వలస పాలనలో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఫ్‌ు ఆవిర్భÛవించిన దశాబ్దం తర్వాతే ముస్లింలీగ్ భారత రాజకీయాల్లో తెరమీదకు వచ్చింది. అందుకే సంఫ్‌ుపరివారానికి మొదటి శతృవు చరిత్ర. చరిత్రకారులు. చరిత్ర నుంచి పుట్టుకొచ్చిన సంస్కృతి. సాంస్కృతిక రంగ కార్యదక్షులు. దాదాపు నాలుగున్నర దశాబ్దాల బీజేపీ రాజకీయ ప్రస్థానంలో అనేక విధానపరమైన ప్రయోగాలు చేసింది. ప్రపంచ సోషలిస్టు శిబిరం పెట్టుబడిదారీ వ్యవస్థకు ప్రత్యామ్నాయంగా ఎన్ని పరిమితులతోనైనా కొనసాగుతున్న దశలో బీజేపీ వంటి పచ్చి మితవాద పార్టీ కూడా ప్రజల ముందుకు రావటానికి గాంధేయ సామ్యవాదం నినాదాన్ని స్వీకరించాల్సి వచ్చింది. బీజేపీ పూర్వావతారం భారతీయ జనసంఫ్‌ు ప్రజాస్వామ్య పరిరక్షణ ఉద్యమం పేరుతో సాగిన ఎమర్జెన్సీ వ్యతిరేక ఉద్యమంలో భాగస్వామ్యం వహించటం ద్వారా తన మతోన్మాద రాజకీయ కోణాలను జయప్రదంగా కప్పిపెట్టుకుని ప్రజల ముందుకు వచ్చింది. ఈ రెండు నినాదాలు పెద్దగా ఆరెస్సెస్ పరివారానికి పెద్దగా రాజకీయ ప్రాబల్యాన్ని తెచ్చిపెట్టలేక పోయాయి.
ఈ రెండు ప్రయోగాలు విఫలమయ్యాక బీజేపీ చేపట్టినదే రామమందిరం సమస్య. శతాబ్దాల తరబడి భారతీయ మానసికతలో అంతర్భాగంగా ఉన్న రాముడు, రామాయణాన్ని కుహనా చరిత్ర ఆధారంగా రాజకీయ సాధనంగా మార్చుకునే ప్రయత్నంలో భాగంగా ముందుకు వచ్చిందే అయోధ్యలో రామమందిర నిర్మాణం సమస్య. పూర్వపు రెండు ప్రయత్నాల కంటే ఈ ప్రయత్నం బీజేపీకి దాన్ని వెన్నంటి నడుపుతున్న ఆరెస్సెస్‌కు రాజకీయ ప్రాబల్యాన్ని, ప్రజామోదాన్ని తెచ్చి పెట్టింది. దీంతో రామమందిరం బీజేపీకి రాజ్యాధికార సోపానంగా మారింది. దీంతోపాటే ప్రపంచ వ్యాప్తంగా మారిన భౌగోళిక రాజకీయ వాతావరణం కూడా బీజేపీ ముస్లిం వ్యతిరేకత కాగడాను నిలిపి ఉంచటానికి దోహదం చేసింది.
2014లో మోడీ-షా ద్వయం నాయకత్వ స్థానానికి వచ్చాక హిందూత్వ రాజకీయాల సామాజిక పునాది పెరగటానికి, ప్రజామోదం పొందటానికి వీలుగా మతోన్మాద రాజకీయ చిహ్నాలు, వ్యూహాల్లో పరిణామాత్మక మార్పులు వచ్చాయి. కేవలం ధార్మిక జీవనమే కాక ప్రజా సాంస్కృతిక జీవన శైలి కూడా రాజకీయ కురుక్షేత్రంలో భాగమైంది. ఈ నేపథ్యంలో ముందుకు వచ్చినవే లవ్ జీహాద్, నవనిర్మాణ సేనలు, ఘర్‌వాపసీ క్రతువులు. వీటన్నింటికీ పరాకాష్ట గోరక్ష, మూక హత్యలు. ఈ నూతన ఎజెండా యావత్తు భారత సామాజిక జీవితాన్ని అతలాకుతలం చేసింది. మరీ ముఖ్యంగా మహిళలను నూతన ఆధిపత్య హిందూ రాజకీయాలకు కేంద్రంగా మార్చింది. ఈ విధంగా సాధారణ హిందూ మతావలంబీకులకు, హిందూమతోన్మాదులకు మధ్య ఉన్న సన్నని గీతను చెరిపేసేందుకు ఈ ఐదేండ్లల్లో జరిగిన కృషి భవిష్యత్తు భారతాన్ని మార్చటంలో బీజాక్షరాలుగా పని చేస్తాయనటం సందర్భరహితం కాబోదు.
తమ నిత్యజీవన సమస్యల పరిష్కారానికి బీజేపీ/మోడీ ప్రతిపాదించిన పరిష్కారాలను అమలు చేయాలని 2014లో ప్రజలు బీజేపీకి ఓటు వేశారు. కానీ బీజేపీ ఈ ఒక్క విషయాన్ని పక్కన పెట్టి తాను ఎంచుకున్న లక్ష్యాలను, నిర్దేశించుకున్న ఉద్దేశ్యాలతో ప్రజా జీవితాలను అతలాకుతలం చేస్తూ 21వ శతాబ్దంలో మధ్యయుగాల నాటి ప్రపంచం తిరస్కరించిన సామాజిక నిర్మాణాలను పున:ప్రతిష్టించటానికి శాయశక్తులా పని చేసింది. 2014 నాటి మోడీ పాలనకు ప్రజా పునాది పరిమితం అన్న సంగతి గుర్తెరిగారు కనకనే సామాజిక సమీకరణాల అవసరాన్ని బీజేపీ- సంఘపరివారం గుర్తించింది. వాజ్‌పేయి- అద్వానీ బీజేపీని అధికారానికి తేవటానికి రాజకీయ సంకీర్ణాలు నిర్మిస్తే మోడీ-షా ద్వయం సామాజిక సంకీర్ణాలను నిర్మిస్తోంది. రాజకీయ సంకీర్ణాలు ఐదేండ్లకొకసారి మారుతూ ఉంటాయి. కానీ సామాజిక సమీకరణాలు తరానికి ఒకసారో రెండు మూడు తరాలకు ఒకసారో మారతాయి. మోడీ-షా ద్వయం ప్రారంభించిన ఈ ప్రయత్నాలకు గండి కొట్టాలంటే 2019 ఎన్నికల్లో బీజేపీ కూటమిని ఓడించటం తప్ప మరో మార్గం లేదు. మరో రెండు మూడు తరాలను ఆధిపత్య మతోన్మాద భావజాలానికి బలి చేయకుండా ఉండాలంటే ప్రత్యామ్నాయం కోరుకునే లౌకిక ప్రజాతంత్ర శక్తులు రాజకీయంగా మతోన్మాదశక్తులను గద్దెనెక్కకుండా చూడటంతో పాటు సామాజిక సాంస్కృతిక జీవనం నుంచి మతోన్మాద శక్తులను వెలివేయాలి.
- కొండూరి వీరయ్య
సెల్: 9871794037
No comments:
Post a Comment