Wednesday, May 22, 2019

ఏది భారత జాతీయత?

(నిన్నటి సంచిక తరువాయి)
స్వాతంత్య్రోద్యమంలో భాగంగా ప్రజాతంత్ర జాతీయవాదానికి పునాదులు వేసిన మరో మైలురాయి భాషా ప్రయుక్త రాష్ట్రాల ఉద్యమాలు. యిప్పుడు చెప్పుకున్న దశల్లో చివరి దశలో తెరమీదకు వచ్చిన ఈ ఉద్యమాలు అవిభక్త బెంగాల్‌ నుంచి ఒరిస్సాను వేరు చేయటంతో ప్రారంభమై రాష్ట్రాల పునర్వవ్యవస్థీకరణ సంఘం సిఫార్సులకు అనుగుణంగా స్వతంత్ర భారతంలో భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుతో ముగిసాయి. నాటి నుండీ నేటి వరకు కొనసాగుతున్న ఆర్‌ఎస్‌ఎస్‌కు గానీ, స్వాతంత్య్రానంతరం ఆరెస్సెస్‌ రాజకీయ విభాగాలుగా తెరమీదకు వచ్చిన జనసంఫ్‌ుకు గానీ, నేటి బీజేపీకి గానీ ఈ ఉద్యమాలతో ఏ మాత్రం సంబంధం లేదు. స్వాతంత్రోద్యమ పోరాటంలో మరో కీలక కోణం కూడా ఉంది. నాడు పోరాటం విదేశీ పాలకులకు వ్యతిరేకంగా సాగింది. దేశీయ ఆర్థిక వనరుల మీద వారి పెత్తనానికి వ్యతిరేకంగా సాగిన పోరాటం. జాతీయ వనరుల మీద ఈ దేశ ప్రజలందరికీ సమాన హక్కు కోసం జరిగిన పోరాటం. ఈ పోరాటంలోనే జాతీయత అన్న భావనలో ప్రజలు, వారి ఆర్థిక అవసరాలు, వనరులపై ప్రజల ఆధిపత్యం ఇమిడి ఉన్నాయి.
సమీకృత, సమ్మిళిత భారతీయ జాతీయతకు ఆర్థిక పునాదులు వేసిన స్వాతంత్య్రోద్యమ స్పూర్తిని, ఆ స్ఫూర్తిని కాగడాల పట్టి నిలిపిన మహౌన్నతుల త్యాగాలను తృణీకరిస్తూ నేటి ఆరెస్సెస్‌, బీజేపీ భక్తులు ముందుకు తీసుకొస్తున్నది కుహనా భారత జాతీయత. అంబేద్కర్‌, గాంధీ, నెహ్రూ, మౌలానా ఆజాద్‌, భగత్‌సింగ్‌ వంటి నేతల త్యాగాలతో స్ఫూర్తి పెనవేసుకుపోయింది. అందుకే ఈ స్వాతంత్య్రోద్యమ సేనానులను దూషించి, తూలనాడి, తృణీకరించి, బహిరంగంగా అవమానపరిస్తే తప్ప వారితో పాటు పెనవేసుకుపోయిన జాతీయతా భావాన్ని తప్పుపట్టడం సాధ్యం కాదు. నెహ్రూని ఏకంగా హిందూస్థాన్‌ని దోచుకున్న బందిపోటు ముఠా నాయకుడు అని బీజేపీ అధికార ప్రతినిధి సంబిత్‌ పాత్ర టీవీ చర్చలో వ్యాఖ్యానించినా మందలించిన పాపాన పోలేదు బీజేపీ నాయకత్వం. తాజాగా అరుణ్‌ జైట్లీ నెహ్రూవల్లనే భారతదేశానికి దక్కాల్సిన ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి శాశ్వత సభ్యత్వం చైనా తన్నుకుపోయిందని వ్యాఖ్యానించటం కూడా ఇందులో భాగమే.

ప్రపంచీకరణ, ఆర్థిక సంస్కరణల పేరుతో తిరిగి దేశాన్ని ఆర్థిక సామ్రాజ్యవాద శక్తులకు కుదవపెట్టేందుకు జరిగే ప్రయత్నాలను ప్రతిఘటించే ఉద్యమాలను బలహీనం చేసే కుట్రపూరిత ప్రయత్నమే భారత జాతీయత అంటే కేవలం హిందూ జాతీయత అని చెప్పడం. ఈ దేశంలో మిగిలిన సామాజిక, ధార్మిక తరగతులను దేశం నుంచి జాతీయ ఆర్థిక జీవన స్రవంతి నుంచి వెలివేస్తేనే ఇది సాధ్యమవుతుందన్నది వీరి భావన! ఈ విధంగా దేశంలో వివిధ మత విశ్వాసాలకు చెందిన వారిని, రాజకీయ ప్రత్యర్థులను, అంతర్గత ప్రత్యర్థులను దేశద్రోహులుగా ముద్ర వేసుకుంటూ పోతే చివరకు ప్రభుత్వమే దేశం, ప్రభుత్వానికి నాయకత్వం వహిస్తున్న పార్టీయే దేశంగా మారటం, చిట్టచివరకు సదరు పార్టీనాయకుడే దేశంగా మారుతుందని నియంతృత్వాల చరిత్ర నిర్ధారిస్తుంది. ఈ క్రమంలోనే ఏకంగా మోడీ దైవాంశ సంభూతుడన్న నాటి కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు వ్యాఖ్యలను గమనించవచ్చు. ఇంతకు ముందు చెప్పినట్టు ప్రభుత్వమే దేశం, ప్రభుత్వ వ్యతిరేకతే దేశ వ్యతిరేకత అని ఆరెస్సెస్‌ మందీ మార్బలం సాగిస్తున్న ప్రచారం చివరకు ప్రభుత్వానికి నాయకత్వం వహిసుస్తన్న పార్టీయే ప్రభుత్వం అన్న స్థాయికి పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని దిగజారుస్తోంది.

ఈ క్రమంలో సదరు ప్రభుత్వానికి నాయకత్వం వహించే పార్టీ సిద్ధాంతాలను, వివిధ సామాజిక ఆర్థిక సాంస్కృతిక వ్యవహారాలపై వారి అభిప్రాయాలను ప్రశ్నించటం, తిరస్కరించటం అంతిమంగా దేశద్రోహంగా మారే విపరీత పరిస్థితి సృష్టించింది. ఇక్కడ పాఠకులు, పాలకులు ఒక విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి. భారత రాజ్యాంగం ప్రపంచ దేశాల్లోకల్లా అత్యంత ప్రజాతంత్ర రాజ్యాంగం. ఎందుకంటే రాజ్యాంగ పీఠిక భారతీయులమైన మేము భారత దేశాన్ని సర్వ సత్తాక ప్రజాతంత్ర లౌకిక సామ్యవాద గణతంత్ర రాజ్యంగా ప్రకటిస్తున్నాము అని చెప్పటం ద్వారా ఇక్కడ ప్రతి ఒక్క భారతీయుడు రాజ్యాంగ నిర్మాతగా మారాడు. గత ఆరు దశాబ్దాల్లో వివిధ సందర్భాల్లో రాజ్యాంగ పీఠిక రాజ్యాంగ మౌలిక లక్షణాల్లో ఒకటి అని సుప్రీం కోర్టు రాజ్యాంగ ధర్మాసనం పదే పదే గుర్తు చేస్తూనే వచ్చింది. ఈ రాజ్యాంగం, తద్వారా సంక్రమించిన అధికారాలను వినియోగించే న్యాయవ్యవస్థనే గుర్తించ నిరాకరిస్తున్న సంఘ పరివారం ప్రభుత్వంపై సంపూర్ణ ఆధిపత్యం చెలాయించే అవకాశం కల్పించటం భారత రాజ్యాంగంలోని ప్రజాతంత్ర స్వభావానికి తాజా ఉదాహరణ.
మోడీ కేబినెట్‌లో పలువురు ఆరెస్సెస్‌ యూనిఫారం ధరించటం మానేశారు తప్ప ఆరెస్సెస్‌ మౌలిక లక్ష్యాలను మక్కికి మక్కీ అమలు చేస్తున్నారు. అటువంటి వారి చేతుల్లో రాజ్యాంగయంత్రం నేడు బందీ అయ్యింది. ఈ రాజ్యాంగ యంత్రం దేశ వాసులందరికీ సమాన హక్కులు అవకాశాలు కల్పించాల్సిన బాధ్యత నుంచి నిర్దిష్ట సామాజిక సమూహాలకు దేశ వనరులు, అవకాశాలు, హక్కులను దఖలు పరుస్తూ మిగిలిన వారిని ద్వితీయశ్రేణి పౌరులుగా మార్చేందుకు బాహాటంగానే కృషి చేస్తోంది. బీజేపీ చేస్తున్న విధ్వంసం కేవలం దేశంలో జాతీయవాద భావాలు తగ్గినందువల్ల దాన్ని పెంపొందించటానికి చేస్తున్న ప్రయత్నంగా చెప్పబూనుకోవటం విడ్డూరం. నిజమైన జాతీయవాదం, రాజ్యాంగ నిర్మిత జాతీయవాదానికి తూట్లుపొడవటానికి జరుగుతున్న ప్రయత్నమే తప్ప మరోటి కాదు అన్న విషయాన్ని అర్థం చేసుకోవటంలో విఫలమైతే స్వాతంత్య్రో ద్యమం ప్రజాతంత్ర లక్ష్యాలు ఆశయాలకు ప్రాతనిధ్యం వహిస్తూ నిర్మితమైన పలు రాజ్యాంగ వ్యవస్థలకు ఆరెస్సెస్‌ భావజాల ప్రేరేపిత ప్రభుత్వం తెచ్చిపెడుతున్న ముప్పు పట్ల ఏమరుపాటు వహించిన వాళ్లమే అవుతాము.

ప్రపంచ దేశాల రాజ్యాంగాల్లో వ్యక్తి స్వేచ్ఛకు సంబంధించి, సామాజిక అభివృద్ధికి సంబంధించిన అత్యంత పురోగామి భావాలను రాజ్యాంగ బద్ధమైన హక్కులు, అవకాశాలు, బాధ్యతలు, విధులు కింద మార్చటంలో రాజ్యాంగ రచనా సంఘం అధ్యక్షులు బిఆర్‌ అంబేద్కర్‌ పాత్ర అద్వితీయం. రాజ్యాంగం ప్రతిపాదించిన ఇటువంటి అనేక అవకాశాలు ప్రజాతంత్ర జాతీయతను పరిపుష్టం చేశాయి. నేడు జాతీయత పేరుతో ఆరెస్సెస్‌ ముందుకు తెస్తున్న వాదనలన్నీ ఈ రాజ్యాంగ మౌలిక సూత్రాలకు వ్యతిరేకంగా ముందుకు వస్తున్నాయి. రాజ్యాంగ బద్ధంగా పరిపాలన సాగిస్తామని రాష్ట్రపతి ముందు ప్రమాణం చేసిన ప్రభుత్వం రాజ్యాంగ విరుద్ధమైన దాడికి నాయకత్వం వహించటం దేశాధ్యక్షుడుగా ఉన్న హిట్లరే స్వయంగా జర్మనీ పార్లమెంట్‌కు నిప్పంటించే కుట్రకు వ్యూహం పన్నిన సందర్భాన్ని గుర్తుకు తెస్తుంది. రష్యాలో గోర్బచేవ్‌ నాయకత్వంలో విప్లవ రష్యా రాజ్యాంగాన్ని, విప్లవ పతాకాన్ని, పార్టీని, పార్టీ కార్యక్రమాన్ని రద్దు చేసి జార్‌ కాలం నాటి చిహ్నాలను చట్టబద్ధం చేసిన సందర్భంతోనూ మోడీ పాలనకు పోలికలున్నాయి. అదికూడా బిఆర్‌ అంబేద్కర్‌ 125వ జయంతి ఉత్సవాల సందర్భంగా పార్లమెంట్‌ ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసి ఆయనకు మొక్కుబడిగా నీరాజనాలు పలుకుతూ మరోవైపు ఆయన అందించిన రాజ్యాంగంలోని ప్రజాతంత్రయుతమైన హక్కులను 'హిందూ'మహా సముద్రంలో నిమజ్జనం చేయటానికి పాచికలు వేస్తోంది ఆరెస్సెస్‌. ఆరెస్సెస్‌ శకుని తరహాలో ఆడిస్తున్న పాచికలాటను దుర్యోధనుడు ఆడినట్టుగా మోడీ, కౌరవ సమూహంలా ఆయన మంత్రివర్గంలోని హేమా హేమీలు ఆడుతున్నారు. నాటి మహాభారతంలో ద్రౌపది వస్త్రాపహరణానికి గురైతే నేటి భారతంలో రాజ్యాంగంలోని ప్రజాతంత్ర హక్కులు వస్త్రాపహరణానికి గురవుతున్నాయి.
ఈ పరిస్థితుల్లో డాక్టర్‌ అంబేద్కర్‌ ఆశయాల పరిరక్షణకు పాటుపడటం అంటే అంబేద్కర్‌ విరచిత రాజ్యాంగాన్ని, దాని ప్రజాతంత్ర స్వభావాన్ని, స్వాంత్య్రోద్యమ వారసత్వంగా అందివచ్చిన ప్రజాతంత్ర జాతీయతను కాపాడుకోవటానికి పోరాడటమే. ఇదే నిజమైన దేశభక్తుల కర్తవ్యం. జాతీయవాదం ముసుగులో రాజ్యాంగ విరచిత ప్రజాతంత్ర జాతీయత స్థానంలో ఆరెస్సెస్‌ విరచిత మతోన్మాద జాతీయతను ముందుకు తేవటానికి, అదే అసలైన జాతీయతగా చిత్రించేందుకు జరుగు తున్న కుయత్నాలను ఆమూలాగ్రం వ్యతిరేకించి పోరాడటమే నిజమైన భారతీయతకు నీరాజనం పట్టే మార్గం. ఈ సందర్భంగా స్వాతం త్యోద్యమం తోనూ, స్వాతంత్య్రోద్యమం అందించిన ప్రజాతంత్ర జాతీయవాద భావనలతోనూ ఏ మాత్రం సంబంధం లేని ఆరెస్సెస్‌ బీజేపీలు ఏ విధంగా మిథ్యా జాతీయవాదాన్ని తెరమీదకు తెస్తున్నాయో వివరించే ప్రయత్నం చేయాలి. ఆరెస్సెస్‌ కుట్రలకు అడ్డు కట్ట వేయాలి. ఈ కుట్రలకు ఆజ్యం పోస్తున్న శక్తులను గద్దె దింపాలి. దీనికి 2019 ఎన్నికలే తగిన సందర్భం.
- కొండూరు వీరయ్య
సెల్‌: 9871794037

No comments: