Wednesday, May 22, 2019

Apr 22,2019
 http://www.navatelangana.com/article/net-vyaasam/797093


హిందూయిజం - హిందూత్వ ఉగ్రవాదం

 గత నాలుగు దశాబ్దాల్లో చూడని స్థాయిలో ఎన్నికల రణరంగం కొత్త పుంతలు తొక్కుతోంది. ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘనలో పాలక బీజేపీ ముందంజలో ఉంది. కులమతాల పేరుతో ఓట్లు అడగ్గకూడదన్నది మౌలిక నిబంధనగా ఉంది. దీన్ని ఉల్లంఘించటానికి అటు మోడీకి కానీ ఇటు ఆయన శిష్య బృందానికి గానీ ఏ మాత్రం వెరపు లేదు. ఇటువంటి ఉల్లంఘనలపై కొరడా ఝుళిపించాల్సిన ఎన్నికల సంఘం గోళ్లు, కోరలు పీకిన తెగ్గోసిన పులిలా నిల్చుంది. బీజేపీ విజయానికి గండికొట్టే త్రిపుర, బెంగాల్‌, ఉత్తరప్రదేశ్‌, దక్షిణాది రాష్ట్రాల్లో మాత్రమే ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ యంత్రాలు మొరాయిస్తున్నాయి. సాంప్రదాయకంగా బీజేపీ కేంద్రాలుగా ఉన్న రాష్ట్రాల్లో ఈ యంత్రాలు సజావుగా పని చేస్తున్నాయి. ఇప్పటి వరకు ఎన్నికల సంఘం రెండున్నర వేల కోట్లు జప్తు చేసింది. ఇందులో 95శాతం ప్రతిపక్ష పాలిత రాష్ట్రాల్లోనే జప్తు అయ్యింది. బీజేపీకి పెట్టని కోటలుగా ఉన్న రాష్ట్రాలు, నియోజకవర్గాల్లో ఎన్నికలను ప్రభావితం చేయటానికి యథేచ్ఛగా పంపిణీ అవుతున్న నల్లధనం కంటే ప్రతిపక్ష పాలిత రాష్ట్రాల్లో పంపిణీ అవుతున్న నల్లధనమే ఎన్నికల సంఘానికి ప్రమాదకారిగా కనిపిస్తోంది. ఎన్నికల సంఘం అనుసరించే ద్వంద్వ ప్రమాణాలను అర్థం చేసుకోవటానికి ఈ ఒక్క ఉదాహరణ చాలు.
ఈ ఎన్నికల్లో మరో ప్రమాదకరమైన ధోరణిని బీజేపీ ముందుకు తెస్తోంది. ఇప్పటి వరకు దేశ ప్రజల దృష్టిలో ఉగ్రవాదం విషయంలో ఏకాభిప్రాయం ఉంది. ఉగ్రవాదం పేరుతో ప్రజల ప్రాణాలు తీయటం తీవ్రమైన నేరం అన్న అభిప్రాయమే ఉంది. కానీ ఇప్పుడు స్వయంగా ప్రధాని మోడీ ఉగ్రవాదాన్ని కూడా మతాల ప్రాతిపదికన చీల్చి హిందూ ఉగ్రవాద చర్యలకు పాల్పడిన వారి తరపున ఓట్ల వేట సాగిస్తున్నారు. ఎమర్జెన్సీ తర్వాత మతాల ప్రాతిపదికన ఓటర్లను చీల్చటం మొదలైన ఈ క్రమం మోడీ పాలనలో మరింత సిగ్గు విడిచి బరితెగింపు స్థాయికి చేరింది. మాలేగాం బాంబు పేలుళ్లల్లో ప్రధాన సూత్రధారి, నేరస్తురాలు అయిన 'సాధ్వి' ప్రగ్యను ఏకంగా భోపాల్‌ లోక్‌సభ స్థానంలో బీజేపీ అభ్యర్థిగా నిలబెట్టారు. అంతకు ముందే హైందవోన్మాద ఉగ్రవాదం దేశంలో లేనే లేదనీ, ఈ పేరుతో కేవలం హిందూ మతాన్ని అప్రతిష్ట పాల్జేసేందుకు కాంగ్రెస్‌ కంకణం కట్టుకుందన్న విమర్శలకు స్వయంగా ప్రధాని మోడీ ఒడిగట్టారు.

దేశంలో మతోన్మాద రాజకీయాల జోరు, ఉగ్రవాద చర్యల ఉధృతి, మిశ్రమ ఆర్థిక విధానం స్థానంలో ప్రపంచీకరణ విధానాలకు తెరతీయటం కుడిఎడంగా ఒకే సమయంలో మొదలయ్యాయి. ప్రపంచీకరణ గావించబడిన ఆర్థిక శక్తిగా భారతదేశం ఎదుగుదలతో పాటే లౌకిక రాజ్యంగా భారత్‌ పతనం కూడా మొదలైంది. ప్రపంచీకరణ విధానాల్లో కీలకమైనది ఆర్థిక విధాన నిర్ణయాల్లో ప్రభుత్వ పాత్రను కుదించటం. ఈ సూత్రాన్ని రాష్ట్రీయ స్వయం సేవక్‌ సంఫ్‌ు మార్గదర్శకత్వంలో బీజేపీ మరింత నవీకరించింది. సామాజిక జీవితంలో సైతం ప్రభుత్వం పాత్ర, సామాజిక తప్పొప్పులను సరి చేయటంలో ప్రభుత్వ పర్యవేక్షక పాత్రను కుదించటం కూడా ప్రపంచీకరణలో అంతర్భాగమేనని బీజేపీకి చెందిన మేధావులు వ్యాఖ్యానిస్తున్నారు. పాలకవర్గాల ప్రయోజనాలకు విఘాతం కలిగించకుండా ప్రజలను గాడిలో పెట్టడానికి ఉనికిలోకి వచ్చిన సాధనమే ఆధునిక రాజ్యం అన్న సూత్రం నానాటికీ రుజువవుతోంది. సామాజిక జీవితంలో ప్రభుత్వ పాత్ర కుదించుకుపోవటంతో అనివార్యంగా ధామస్‌ హాబ్స్‌ చెప్పిన కర్ర ఉన్న వాడిదే బర్రె అన్న సూత్రం ముందుకొస్తోంది. మందబలం సామాజిక జీవితాన్ని నియంత్రించే సాధనంగా మారటం ఈ సూత్రానికి విస్తరణే. ఏ దేశమైనా ఉగ్రవాదాన్ని నిర్వచించేందుకు ఒకే ప్రమాణాన్ని పాటించాలి. ఉగ్రవాదం విషయంలో ప్రభుత్వమే ద్వంద్వ ప్రమాణాలు ప్రత్యేకించి మతాల ప్రాతిపదిక ద్వంద్వ ప్రమాణాలు పాటించటం మొదలు పెట్టడం దేశ భద్రతకు ముప్పుగా మారుతుందనటంలో సందేహం లేదు. కాశ్మీర్‌లో ముస్లిం ఉగ్రవాదుల పట్ల, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో పెంచి పోషిస్తున్న హైందవోన్మాద ఉగ్రవాదం పట్ల బీజేపీ అనుసరిస్తున్న ద్వంద్వ ప్రమాణాలకు నిదర్శనమే 2019 ఎన్నికల్లో మోడీ ఉపన్యాస శైలి.

హైదరాబాద్‌లోని మక్కా మసీదు బాంబు లోనూ, అజ్మీర్‌లోని షరీఫ్‌ దర్గాలో, అమృతసర్‌- లాహౌర్‌ మధ్య నడిచే సంఝౌతా ఎక్స్‌ప్రెస్‌ రైలు పేల్చివేత వంటి కేసుల్లో కేంద్ర హౌం శాఖ ప్రారంభించిన దర్యాప్తు తీగలాగితే డొంకంతా కదిలినట్టు నాగపూర్‌ మీదుగా లెఫ్టినెంట్‌ కల్నల్‌ శ్రీకాంత్‌ పురోహిత్‌, స్వామి అసీమానంద, సాధ్వి ప్రగ్యా ఠాకూర్‌ల వద్దకు చేరింది. 2006 సెప్టెంబర్‌ 8న మాలెగాంలో జరిగిన పేలుళ్లల్లో 36మంది చనిపోయారు. 2007 ఫిబ్రవరి 18న జరిగిన సంఝౌతా పేల్చివేతలో 68మంది అక్కడికక్కడే చనిపోయారు. అదే ఏడాది మే 18న మక్కామసీదు ప్రాంగణంలో జరిగిన బాంబు పేలుళ్లలో 16మంది, అక్టోబరు 11, 2007న అజ్మీర్‌ షరీఫ్‌ దర్గా ప్రాంగణంలో జరిగిన పేలుళ్లలో ముగ్గురు చనిపోయారు. ఆయా రాష్ట్రాల పోలీసు యంత్రాంగం, సీబీఐ నిర్వహించిన ప్రాథమిక దర్యాప్తులో ఇది ఇస్లామిక్‌ ఉగ్రవాదుల చర్యలు కావని నిర్ధారణ కావటంతో ఉగ్రవాద చర్యల నియంత్రణ కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన జాతీయ నిఘా సంస్థ (ఎన్‌ఐఎ)కు ఈ కేసులు 2011లో బదిలీ అయ్యాయి. ఈ కేసుల దర్యాప్తు 2014కు ముందే పూర్తి అయినా ప్రత్యేక న్యాయస్థానాల్లో విచారణ మాత్రం 2014 తర్వాత కూడా కొనసాగింది. దర్యాప్తు సమయంలోని విలువైన సాక్ష్యాధారాలన్నీ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం గద్దెనెక్కాక చిత్తుకాగితాలుగా మారాయి. ఈ కేసుల్లో ప్రధాన సూత్రధారిగా దర్యాప్తులో నిగ్గు తేలిన పురోహిత్‌, స్వామి అసీమానందలతో పాటు పని చేసిన వారంతా నిర్దోషులుగా బయటకొచ్చారు. న్యాయవ్యవస్థను తొలుచుకుంటూ పోయిన ప్రత్యేక యంత్రాంగం, దానికి రాజ్యం అండదండలు లేనిదే ఈ కేసులు తారుమారు అయ్యాయని భావించగలమా? బహుశా ఇందుకేనేమో సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి రంజన్‌ గగొరు న్యాయవ్యవస్థకు వ్యతిరేకంగా ఓ బలమైన అదృశ్య శక్తి పని చేస్తోందని దేశాన్ని హ్చెరిస్తున్నారు.

ఇక్కడ కోర్టుల్లో జరిగిన కొన్ని పరిణామాలు పాఠకుల దృష్టికి తేవాలి. 2010 డిసెంబరు 18న అసీమానంద కోర్టులో వాంగ్మూలమిచ్చారు. 42పేజీల వాంగ్మూలాన్ని తెహెల్కా పత్రిక యథాతథంగా ప్రచురించింది. పైన ప్రస్తావించిన బాంబు పేలుళ్లన్నీ అత్యున్నత స్థాయిలో హిందూత్వ నాయకుల ప్రత్యక్ష పరోక్ష ప్రమేయంతో సాగినవేన్నది సారాంశం. దేశ విభజన సమయంలో నాటి నిజాం నవాబు పాకిస్థాన్‌లో విలీనం కావాలని ప్రయత్నం చేశాడనీ అందుకే హిందూత్వ నేతల మార్గదర్శకత్వంలో మక్కా మసీదును లక్ష్యంగా బాంబుదాడి జరిగిందని స్వయంగా వెల్లడించారు. ఇదే తరహాలో అజ్మీర్‌ దర్గా బాంబు పేలుళ్ల కేసులో నిందితులు దేవేంద్ర గుప్త, భవేష్‌ పటేల్‌, సునీల్‌ జోషి (ఆరెస్సెస్‌ జాతీయ నాయకుల్లో ఒకరు) దోషులుగా నిర్ధారింపబడ్డారు. కానీ అసీమానంద మాత్రం నిర్దోషిగా బయట కొచ్చారు. అజ్మీర్‌ దర్గా కేసులో ప్రభుత్వ ప్రాసిక్యూటర్‌గా పని చేసిన అశ్వని శర్మ, జాతీయ నిఘా సంస్థ (ఎన్‌ఐఏ) అధికారులనుద్దేశించి ''అనేకమంది సాక్ష్యులను నిందితుల తరపున న్యాయవాదులు ప్రభావితం చేస్తున్నారు. దర్యాప్తు అధికారులు సాక్ష్యుల ఫోన్‌ కాల్‌ వివరాలు సేకరిస్తే ఈ విషయం నిర్ధారణవుతుంది. నిందితుల తరపు న్యాయవాది సాక్ష్యులతో ఓ హౌటల్లో సమావేశ మయ్యారు. సదరు హౌటల్‌ నుంచి సీసీి కెమెరాల రికార్డులు తెప్పించినా ఈ విషయం రుజువవు తుంది. సాక్ష్యులను కాపాడుకోవాల్సిన బాధ్యత దర్యాప్తు అధికారులదే'' అన్న హెచ్చరికలు మోడీ పాలనలో న్యాయదేవత కురుసభలో ద్రౌపదిగా మారిన తీరు తేటతెల్లమవుతోంది. దర్యాప్తు సంస్థ న్యాయ విచారణలో ప్లేటు ఫిరాయించటంతో న్యాయస్థానం లో ఇచ్చిన వాంగ్మూలాలు సైతం చెల్లని ప్రకటనలు గా మారి హైందవోన్మాద ఉగ్రవాదులు నిర్దోషులు గా జనారణ్యంలో అడుగుపెట్టడం సాధ్యమైంది.
సాధారణంగా సీబీఐ గానీ మరో కేంద్ర ప్రభుత్వ సంస్థగానీ చిన్న చిన్న కేసుల విషయంలో దిగువ న్యాయస్థానాల్లో ఓడిపోతే పై న్యాయస్థానాల్లో అప్పీలు చేస్తాయి. ఉదాహరణకు 2018లో ఒంగోలుకు చెందిన ఓ యువకుడు ఐఎఎస్‌గా ఎంపికయ్యారు. అతని సర్టిఫికెట్ల విషయంలో వివాదం తలెత్తింది. సదరు అభ్యర్థి హైదరాబాద్‌లో అడ్మినిష్ట్రేటివ్‌ ట్రిబ్యునల్‌లో యూపీఎస్సీ మీద దావా నడిపి గెలిచాడు. దీనికి వ్యతిరేకంగా యూపీఎస్సీ హైదరాబాద్‌ హైకోర్టుకు ఆ తర్వాత సుప్రీం కోర్టుకు అప్పీలు చేసింది. కానీ దేశ భద్రతకు ప్రమాదంగా మారిన ఉగ్రవాదానికి సంబంధించిన కేసుల్లో మాత్రం కేంద్ర హౌం శాఖ అప్పీలు చేయటానికి సిద్ధం కాలేదు. అసీమానందతో పాటు సాధ్వి ప్రగ్య, కల్నల్‌ పురోహిత్‌ హిందూత్వ ఉగ్రవాద కార్యక లాపాల వ్యూహకర్తలు. 2008లో బాంబు దాడి తర్వాత ఈ ముగ్గురు నిందితులూ అరెస్టయ్యారు. జైల్లో ఉన్నారు. దర్యాప్తు పూర్తి అయ్యింది. విచారణ జరుగుతోంది. ఉన్నట్టుండి 2016 ఏప్రిల్‌ 13న ఎన్‌ఐఏ సంస్థ కోర్టులో ఓ అనుబంధ పత్రం దాఖలు చేసింది. ఈ పత్రం ప్రకారం ప్రగ్య ఠాకూర్‌ను నిర్దోషిగా భావిస్తున్నామని తెలిపింది. అంతకు ముందే ఈ విచారణలో కేంద్ర ప్రభుత్వం తరపున న్యాయాధికారిగా పని చేస్తున్న రోహిణి సాలియాన్‌ ఈ కేసులో నిందితులకు వ్యతిరేకంగా మరింత లోతుగా విచారణ చేయొద్దని కేంద్ర హౌం శాఖ హెచ్చరికలు జారీ చేసిందని ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌కు ఇచ్చిన ఇంటర్వూలో చెప్పారు.

ఇక్కడ రెండు విషయాలు స్పష్టమవుతున్నాయి. పాలక పార్టీ ఎవరి పక్షాన ఉంటే వాళ్లకు రాఫెల్‌ కాంట్రాక్టులు దక్కటమే కాదు. ఏ నిందితుల పక్షాన ఉంటే ఆ నిందితులు నిర్దోషులుగా బయటకొస్తారని కూడా బీజేపీ ఈ ఐదేండ్లలో రుజువు చేసింది. ప్రభుత్వం ఎంత సమర్థించుకున్నా ఉగ్రవాద చర్యలను మత ప్రాతిపదికన విడదీసి హైందవో న్మాద ఉగ్రవాదులు చేసేది హిందూమత పరిరక్షణ చర్య ఇస్లామిక్‌ ఉగ్రవాదులది దేశ వ్యతిరేక చర్య అని చెప్పటానికి ఓ ప్రధాని స్థాయి వ్యక్తి దిగజారటం ప్రజాస్వామ్యానికి పొంచి ఉన్న ప్రమాదాన్ని వెల్లడిస్తోంది. హిందూమతం అంటే హైందవో న్మాదుల ఉగ్రవాద చర్యలు కాదని నిజమైన హిందువులు పాలక బీజేపీకి స్పష్టం చేయాల్సిన అవసరం ఉంది.
- కొండూరి వీరయ్య
సెల్‌: 9871794037

No comments: