Wednesday, May 22, 2019

Apr 11,2019
http://www.navatelangana.com/article/net-vyaasam/791442


గాడి తప్పుతున్న ప్రాతినిధ్య ప్రజాస్వామ్యం

భారత ప్రజాస్వామ్యం గాడి తప్పుతుందా? రాజ్యాంగ నిర్మాతలు ఒక మనిషి, ఒక ఓటు, ఒక విలువ సూత్రం స్వాతంత్య్రానంతర ప్రాతినిధ్య ప్రజాస్వామ్యానికి మూల సూత్రంగా ఉంది. బీజేపీ హిందూత్వ ఆధిపత్య రాజకీయాలు కేంద్ర స్థానం ఆక్రమించటం మొదలయ్యాక ఈ సూత్రం - ఒక మనిషి, ఒక ఓటు, ఒక విలువ - సూత్రానికి కొత్త నిర్వచనం అమల్లోకి వచ్చింది. భారతీయ ప్రజాస్వామ్యం భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతినిధిగా ఉండాలని రాజ్యాంగ నిర్మాతలు ఆశించారు. కానీ నేడు అధికారంలో ఉన్న బీజేపీ మౌలిక అవగాహనలో దేశంలో ఎటువంటి భిన్నత్వానికి తావు లేదు. దేశమంతా అఖండ హిందూ దేశమే. ప్రాతినిధ్య ప్రజాస్వామ్యానికి బీజేపీ ఇస్తున్న నిర్వచనం కూడా ఈ అవగాహనకు తగ్గట్టుగానే ఉంది. బీజేపీ నమూనా ప్రజాస్వామ్యంలో కొన్ని సామాజిక తరగతులకు ప్రాతినిధ్యం అక్కర్లేదు. ముస్లింలు అటువంటి ఓ సామాజిక తరగతి.
సాధారణంగా ఎన్నికల పోరాటంలో బరిలోకి దిగేటప్పుడు రాజకీయ పార్టీలు సాధ్యమైనన్ని ఓట్లు సంపాదించేందుకు అనుగుణంగా అభ్యర్థులను ఎంపిక చేస్తాయి. అభ్యర్ధుల పొందిక ఆయా సామాజిక తరగతుల నుంచి ఓట్లు రాబట్టడంలో ఉపయోగపడుతుందా లేదా అన్నది అభ్యర్థుల ఎంపికలో పని చేసే ఏకైక సూత్రం అదేసమయంలో భారతదేశంలోని భిన్నత్వానికి అనుగుణంగా చట్టసభల్లో భిన్నత్వం ప్రాతినిధ్యం వహిస్తుందా లేదా అన్నది కూడా ప్రజాస్వామ్యం ఎంత ప్రజాతంత్రయుతంగా అమలవుతున్నదో వివరించే ఒక ఉదాహరణ. ఈ సారాంశాన్ని గాలికొదిలి కేవలం అభ్యర్థుల పొందిక ఆయా సామాజిక తరగతుల ఓట్లు రాబట్టే ఒక తాత్కాలిక వ్యూహంగా మారింది. చట్టసభలు ప్రజలందరి ప్రయోజనాల కోసం ఉద్దేశించినవి. కాలక్రమంలో అస్థిత్వ రాజకీయాలు ముందుకొచ్చిన తర్వాత ఆయా సామాజిక తరగతులకు చట్టసభల్లో ప్రాతినిధ్యం ఉందా లేదా అన్న ప్రశ్నకు, ఆయా తరగతుల ప్రయోజనాలకు ఏ మేరకు ప్రాతినిధ్యం ఉంటుందా లేదా అన్న ప్రశ్నకు మధ్య సంబంధం ఉంది. అటువంటి ఓ సామాజిక తరగతి సమకాలీన రాజకీయాల్లో ప్రాతినిధ్య రాహిత్యాన్ని ఎదుర్కొంటోంది. అది ముస్లిం సామాజిక తరగతి. 2019లో ముస్లిం సామాజిక తరగతి రాజకీయ హక్కుల గురించి మాట్లాడటానికి ఎంతో కొంత సాహసం కావాలి.

భారత రాజకీయ సామాజిక వ్యవస్థకు పునాదిగా ఉన్న లౌకిక వ్యవస్థపై ఆరెస్సెస్‌, జనసంఫ్‌ు, బీజేపీలు గత ఐదారు దశాబ్దాలుగా సాగిస్తూ వచ్చిన సైద్ధాంతిక దాడి మోడీ పరిపాలనలో పతాకస్థాయికి చేరింది. దీంతో లౌకిక ప్రజాతంత్ర రాజకీయాల స్థానంలో హిందూ ఆధిపత్య రాజకీయాలే ప్రధాన స్రవంతి రాజకీయాలుగా తెరమీదకు వచ్చాయి. 2019 లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో మోడీ ఉపన్యాసాలు దీనికి పెద్ద ఉదాహరణ. దేశం అంటే హిందూమతం, హిందూమతమే దేశంగా మోడీ ఉపన్యాస ధోరణి ఉండటం గాడితప్పిన ప్రాతినిధ్య ప్రజాస్వామ్యానికి చిహ్నం.
ఒకసారి మతం, మతోన్మాద స్థాయికి చేరాక లౌకిక ప్రజాతంత్ర విలువలు వెనకపట్టు పడతాయి. స్వాతంత్య్రోద్యమ విలువలను పుణికిపుచ్చుకున్న లౌకిక ప్రజాతంత్ర విలువల ఆధారిత సామాజిక చైతన్యం స్థానే మత విశ్వాసాల ఆధారిత సామాజిక చైతన్యం నూతన రాజకీయ వేదికగా మారింది. సాధారణంగా చైతన్యం అనే భావన ఓ పురోగామి దృక్ఫధాన్ని ప్రతిబింబించే భావన. కానీ మతోన్మాద రాజకీయాల వేళ్లూనుకుపోయే కొద్దీ ఈ పురోగామి దృక్ఫథం, విశాల దృక్కోణం కాస్తా సంకుచిత అస్థిత్వాల చుట్టూ గిరిగీసుకుపోయే తిరోగామి భావనగా మారింది. సాధారణంగా జనసామాన్యంలో వాడుకలో ఉన్న భావనలకు కొత్త కొత్త టీకా తాత్పర్యాలను రూపొందించి ప్రచారంలో పెట్టడంలో ఆరెస్సెస్‌ది అందె వేసిన చేయి. అటువంటి ప్రచారం గత ఐదేండ్లుగా ఇంకా చెప్పాలంటే 2002నుంచీ ఓ ఉద్యమంలా సాగించింది ఆరెస్సెస్‌. దాంతో సామాజిక అవగాహన యావత్తూ తిరోగమన పట్టాలెక్కింది. దీనికి సరైన ఉదాహరణ చట్టసభల్లో ముస్లింల ప్రాతినిధ్యానికి సంబంధించిన సమస్య.

బీజేపీ, దాని మాతృక ఆరెస్సెస్‌ అవగాహనలో భారతదేశంలో ముస్లింలు ద్వితీయశ్రేణి పౌరులు. ప్రజాస్వామ్యంలో పౌరులను శ్రేణులవారీగా విభజించి వ్యవహరించే పద్ధతి లేదు. సమాజంలోని పౌరులను దొంతర్లుగా విభజించి సామాజిక నిర్మాణంలో ఆయా దొంతరకున్న స్థానాన్ని బట్టి హక్కులు, అవకాశాలు కల్పించటం భూస్వామ్య, అర్థ భూస్వామ్య వ్యవస్థ లక్షణం. ఒకవైపున దేశాన్ని 21వ శతాబ్దంలో ఆర్థికంగా ప్రపంచ అగ్రరాజ్యాల సరసన నిలబెట్టాలని వాగ్దానాలు చేస్తూనే సామాజికంగా దేశాన్ని చీకటియుగాలకు తీసుకెళ్లటం బీజేపీ, ఆరెస్సెస్‌ ద్వంద్వ వైఖరి. ఏ విషయంలో నైనా ద్వంద్వ వైఖరిని ఆరెస్సెస్‌ పెట్టింది పేరు. ప్రతిధ్వని సినిమాలో రాజకీయ నాయకుని పాత్ర శైలిలో.
2014లో ఎన్నికైన 16వ లోక్‌సభలో అత్యంత తక్కువగా 22మంది పార్లమెంట్‌ సభ్యులు ముస్లిం మైనారిటీలున్నారు. లోక్‌సభలో ఆధిపత్యం వహిస్తున్న బీజేపీ నుంచి ఒక్కరు కూడా ముస్లిం ఎంపి లేకపోవటం గమనించాల్సిన విషయం. స్వాతంత్య్రానంతరం జరిగిన తొలి ఎన్నికల్లో మొదటిసారి 23మంది ముస్లిం అభ్యర్థులు ఎన్నికయ్యారు. నాటి నుంచీ పూర్తిగా జనాభా ప్రాతినిధ్యానికి అనుగుణంగా కాకపోయినా మెరుగైన మోతాదులో ముస్లిం అభ్యర్ధులకు పార్టీలు టిక్కెట్లు ఇవ్వటం, వారిని గెలిపించటం సాంప్రదాయంగా మారింది. గత ఐదు దశాబ్దాలుగా లౌకికతత్వం అంటే (హిందు, ముస్లింలు సమానమనే భావన) ముస్లిం ఓటు బ్యాంకు రాజకీయమే అంటూ ఆరెస్సెస్‌ సాగించిన ప్రచారం ప్రభావం నేడు చట్టసభల్లో కనిపిస్తుంది. అటు ప్రజలకు ప్రాతినిధ్యం వహించే లోక్‌సభలో తమ పార్టీ తరపున ముస్లింలకు ప్రాతినిధ్యం వహించకుండా రాజ్యాధికారాన్ని చేజిక్కించుకోవచ్చన్న నమ్మకం కలిగాక బీజేపీ మరింత బరితెగించింది. 2016లో జరిగిన ఉత్తరప్రదేశ్‌ శాసనసభ ఎన్నికల్లో కనీసం ఒక్క ముస్లిం అభ్యర్ధిని కూడా నిలబెట్టకుండా ఎన్నికల్లో గెలిచింది. ఈ క్రమం 2002లో గుజరాత్‌ శాసనసభ ఎన్నికలతో మొదలైంది.

దాదాపు 14శాతంగా ఉన్న ముస్లిం జనాభాకు చట్టసభల్లో ప్రాతినిధ్యం లేకుండా వారి ప్రయోజనాలు కాపాడే మార్గం ఉందా? ఇక్కడ ముస్లిం ప్రాతినిధ్యం గురించి చేస్తున్న చర్చ అస్థిత్వ రాజకీయాల చర్చగా పరిగణించరాదు. లౌకిక ప్రజాతంత్ర కోణం ఇందులో ఉంది. పురోగామి లక్షణాలకు, తిరోగామి లక్షణాలకు, ప్రజాతంత్ర స్వభావానికి, నిరంకుశాధిపత్యానికి మధ్య ఉన్న సన్నని గీతను గమనించకపోతే అస్థిత్వ రాజకీయాలు మితవాదులు, మతోన్మాదులు, ఫాసిస్టుల చేతుల్లో ఆయుధాలుగా మారతాయి. ముస్లింలు ద్వితీయ శ్రేణి పౌరులు అన్న మధ్యయుగాల అవగాహనతో వారికి చట్టసభల్లో ప్రాతినిధ్యం దూరం చేయటం ప్రజాతంత్ర రాజ్యాంగాన్ని పరిరక్షించుకునే చర్య కాదు. దేశ జనాభాలో హిందువుల తర్వాత అతి పెద్ద సామాజిక తరగతి ముస్లింలు. అటువంటి ముస్లింలను చట్టసభల నుండి వెలి వేయటం, ద్వితీయ శ్రేణి పౌరులుగా చూడటం అంటే సామాజిక జీవనంలో వారి పాత్రను కుదించటమే. అటువంటి సంకుచిత రాజకీయా లతో హిందూ ఓటు బ్యాంకుపై గుత్తాధిపత్యం సాధించేందుకు బీజేపీ ముస్లింలను శతృవులుగా చూపబూనుకొంటోంది.
మోడీ ప్రభుత్వాన్ని, ప్రభుత్వ చర్యలను వ్యతిరేకించే వారినందరినీ దేశ ద్రోహులుగా ముద్ర వేయటం ఈ కాలంలో పెరిగిన ఆందోళనకర పరిణామం. ఇది మరింత ముదిరి మోడీ లేదా బీజేపీ లేదా ఆరెస్సెస్‌ వ్యతిరేకులు పాకిస్థాన్‌కు వెళ్లవచ్చన్న చర్చలు బాహాటంగా ఎంపీలు, మంత్రులు, పార్టీ సీనియర్‌ నాయకులే చేస్తున్నారు. వీటి ఖండించేందుకు ప్రయత్నం చేయకపోగా మోడీ స్వయంగా దీన్ని మరింత విస్తరించి హిందూత్వం = దేశభక్తి = ఉగ్రవాద వ్యతిరేకత = పాకిస్థాన్‌ వ్యతిరేకత = ముస్లిం వ్యతిరేకత అన్న అర్థంలో ఎన్నికల ప్రచారం మొదలు పెట్టారు. మతం పేరుతో ఓటర్లను ప్రభావితం చేయరాదన్న చట్టం ప్రధానికి వర్తించదా? బాహాటంగా హిందూ ప్రయోజనాలే దేశ ప్రయోజనాలు అని గాండ్రించటం ప్రాతినిధ్య ప్రజాస్వామ్యాన్ని మరణశయ్యపైకి చేర్చటమే తప్ప మరోటి కాదు. ప్రాతినిధ్య ప్రజాస్వామ్యం, లౌకిక ప్రజాతంత్ర విలువలతో కూడిన సామాజిక చైతన్యం, ఒక మనిషి ఒక ఓటు ఒక విలువ సూత్రం అమలు జరగాలంటే రానున్న ఎన్నికల్లో బీజేపీని గద్దె దించటం మినహా మరో మార్గం లేదు.
- కొండూరి వీరయ్య సెల్‌: 9871794037

No comments: