Wednesday, May 22, 2019

http://www.navatelangana.com/article/net-vyaasam/776811

మోడీ చేతుల్లో దేశం సురక్షితమేనా?

గత నెల రోజులుగా జాతీయ ప్రాంతీయ పత్రికల్లో మూడో పేజీలో పూర్తి పేజీ ప్రచార ప్రకటనలు వస్తున్నాయి. అంతకు ముందు టీవీల్లో కూడా అటువంటి ప్రకటనలు వచ్చాయి. ఇప్పటి వరకు జరగని అభివృద్ధి మోడీ పాలనలో మాత్రమే సాధ్యమైంది అన్నదే ఈ ప్రకటనల సారాంశం. బుధవారం సుప్రీం కోర్టులో ప్రభుత్వ అటార్నీ జనరల్‌ ప్రకటన కూడా ఈ కోవకే వస్తోంది. రక్షణశాఖ కార్యాలయం నుంచి రాఫెల్‌ కొనుగోలు ఒప్పందానికి సంబంధించిన పత్రాలు చోరీ అయ్యాయని నిస్సిగ్గుగా ప్రకటించారు. ఫిబ్రవరి 28న బాలాకోట్‌ దాడి తర్వాత ప్రధాని మోడీ ఓ బహిరంగ సభలో మాట్లాడుతూ ఇప్పుడు దేశ భద్రతకు ఢోకా లేదు అని విజయగర్వంతో మాట్లాడారు. మరునాడు జరిగిన ఓ అవార్డు ప్రదాన సభలో మాట్లాడుతూ.. అబ్బా.. ఈ సమయంలో గనక మన చేతుల్లో రాఫెల్‌ ఉంటే ఇంకెంత బాగుండేదో అన్నారు. అంతటితో ఆగలేదు. గతవారం రోజులుగా రాఫెల్‌ కొనుగోలును దేశద్రోహులైన ప్రతిపక్షాలు, కొన్ని పత్రికలు రాద్ధాంతం చేస్తున్నాయని అందుకే ఇంతవరకు రాఫెల్‌ విమానాలు దిగుమతి చేసుకోలేకపోయామనీ శెలవిచ్చారు.
కాస్త అటు ఇటుగా సుప్రీం కోర్టులో అటార్నీ జనరల్‌ వేణుగోపాల్‌ కూడా ఇదే భాష ప్రయోగించారు. ఆయన బాలాకోట్‌ అనంతరం సరిహద్దుల్లో జరిగిన వైమానిక దాడులను ప్రస్తావిస్తూ ''తాజాగా ఎఫ్‌ 16 యుద్ధ విమానాలతో మన దేశంపై దాడి జరిగింది. అటువంటి దాడుల నుంచి మనలను మనం కాపాడుకోవటానికి రాఫెల్‌ విమానాలు అవసరం'' అన్నారు. అంతేకాదు. ఈ విచారణ కొనసాగితే సుప్రీం కోర్టు న్యాయమూర్తుల ప్రతి వ్యాఖ్యను ఎన్నికల్లో ప్రతిపక్షాలు ఉపయోగించుకుంటాయని, ప్రభుత్వం ఆత్మరక్షణలో పడుతుందని వాపోయారు. రాఫెల్‌ కొనుగోలు పత్రాలు దొంగిలించటం ఏమిటి, ఎఫ్‌ 16 దాడులను ఎదుర్కోవాలంటే రాఫెల్‌ ప్రయోగించాలన్న వాదనలు సుప్రీం కోర్టుకు చేరటం ఏమిటి అన్న ప్రశ్నలు దేశభక్తులను కలచి వేస్తున్నాయి.

సీనియర్‌ న్యాయవాది ప్రశాంత్‌ భూషణ్‌, మాజీ కేంద్ర మంత్రులు అరుణ్‌ శౌరీ, యశ్వంత్‌ సిన్హాలు రాఫెల్‌ కొనుగోలు వివాదంలో వేల కోట్ల అవినీతి జరిగిందని, దీనిపై సీబీఐ ద్వారా దర్యాప్తు జరిపించాలని సుప్రీం కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఏతావాతా ఓ అడ్డగోలు వాదనను అడ్డం పెట్టుకుని సుప్రీం కోర్టు ఈ పిటిషన్‌ను తోసిపుచ్చింది. దానికంటే ముందు ప్రభుత్వం కొన్ని విషయాలు సీల్డ్‌ కవర్‌లో సుప్రీం కోర్టుకు తెలియచేసింది. ఇదిలా ఉండగా ప్రభుత్వం సుప్రీం కోర్టుకు సమర్పించిన వివరాలు అసత్యాలనీ, వాటి ఆధారంగా ఇచ్చిన తీర్పు చెల్లదని, రాఫెల్‌ కొనుగోలు వ్యవహారాన్ని పునఃపరిశీలించాలని మరో పిటిషన్‌ జనవరిలో దాఖలైంది. ఈ పిటిషన్‌ను విచారణ దశకు రానివ్వకుండా ఉంచటానికి ప్రభుత్వం శతవిధాలా ప్రయత్నించింది.
ఎట్టకేలకు మొన్న బుధవారంనాడు సుప్రీం కోర్టు ఈ పిటిషన్‌పై విచారణ ప్రారంభించింది. విచారణలో ప్రభుత్వం తరపున వాదనలు వినిపించటానికి వచ్చిన అటార్నీ జనరల్‌ కెకె వేణుగోపాల్‌ రక్షణశాఖ కార్యాలయం నుంచి కీలక పత్రాలు దొంగిలించబడ్డాయని, వాటి ఆధారంగానే ఈ రివ్యూ పిటిషన్‌ దాఖలైందనీ, దొంగిలించబడిన సాక్ష్యాలపై ఆధారపడకూడదని వాదించారు. ఈ వాదన విన్న దేశం నివ్వెరపోయింది. రక్షణశాఖకే మోడీ పాలనలో భద్రత లేదన్న కఠోర సత్యాన్ని మొట్టమొదటిసారి దేశం దృష్టికి తీసుకువచ్చినందుకు అటార్నీ జనరల్‌ అభినందనీయుడే. తన వాదనలో రివ్యూపిటిషన్‌లో ప్రస్తావించిన కారణాలు అసంబద్ధ మైనవని గానీ, నిర్హేతుకమైనవనిగానీ, అసత్యాలని గానీ ఎక్కడా చెప్పలేదు అటార్నీ జనరల్‌. అవి లీక్‌ అయిన పత్రాల ఆధారంగా దేశం ముందుకు వచ్చిన వివరాలు కాబట్టి వాటికి విలువ లేదని మాత్రమే 'నైతిక' వాదన ముందుకు తెచ్చారు. దీంతో ఈ క్రింది విషయాలు స్పష్టమవుతున్నాయి.

రాఫెల్‌ కొనుగోలు సందర్భంగా జరిగిన సంప్రదింపుల్లో ప్రధాని కార్యాలయం ప్రత్యేకించి జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ దోవల్‌ రాజ్యాంగేతర శక్తిగా వ్యవహరించారని, అందువల్ల భారత ఖజానాకు వేల కోట్ల రూపాయల నష్టం వాటిల్లిందని, అవసరానికి మించి ధర చెల్లించాల్సి వచ్చిందని సంప్రదింపుల బృందం అధికారులు అభ్యంతరాలు వ్యక్తం చేసిన మాట వాస్తవం. దోవల్‌ జోక్యంతోనే దస్సాల్ట్‌ కంపెనీ ఎటువంటి బ్యాంకు గ్యారంటీ లేకుండానే ఈ కాంట్రాక్టును స్వంతం చేసుకుందన్నదీ వాస్తవం. భద్రతా వ్యవహారాల మంత్రివర్గ ఉపసంఘం సమావేశం ఈ కొనుగోలు ప్రతిపాదనను ఆమోదించిన తర్వాత ఈ ఒప్పందంలో అవినీతి నియంత్రణకు సంబంధించిన క్లాజు తొలగింపునకు ప్రధాని ఆదేశాలిచ్చారన్నది వాస్తవం. అప్పటికే ఆర్థికంగా దివాళా అంచున ఉన్న దస్సాల్ట్‌ కంపెనీ ఇంత పెద్ద సంఖ్యలో యుద్ధ విమానాలు తయారు చేసి గడువులోపల మనకు అందించగలుగుతుందా అని భారత వాయుసేన అధికారులు అనుమానాలు వ్యక్తం చేసిన మాట వాస్తవం. 2015లో మోడీ ఈ కాంట్రాక్టును దస్సాల్ట్‌కు ఖాయం చేయటానికి కొన్ని రోజుల ముందే అనిల్‌ అంబానీకి దస్సాల్ట్‌ కంపెనీకి మధ్య రహస్య సమావేశం జరిగిన మాట వాస్తవం. రెండు ప్రభుత్వాల మధ్య జరిగే ఒప్పందంలో సార్వభౌమత్వంతో కూడా హామీ ఉంటుంది. ఈ హామీ ఇవ్వటానికి ఫ్రాన్స్‌ సిద్ధం కాకపోయినా ఈ విషయాన్ని మోడీ ప్రభుత్వం దాచిపెట్టిందన్న మాట కూడా వాస్తవం. వీటిల్లో ఏ ఒక్కదాన్నీ ప్రభుత్వం సుప్రీం కోర్టులో ప్రశ్నించలేకపోవటం మోడీ ప్రచారంలో ఉన్న డొల్లతనాన్ని బహిర్గతం చేస్తోంది.

అంతేకాదు. వరుసగా హిందు, కార్వాన్‌, వైర్‌ పత్రికల్లో వస్తున్న వార్తలను గమనిస్తే ఈ వివరాలన్నీ ప్రభుత్వం వద్ద ఉన్నాయి. అయినా డిశంబరులో జరిగిన విచారణలో ప్రభుత్వమే ఉద్దేశ్యపూర్వకంగా ఈ వివరాలు సుప్రీం కోర్టు దృష్టికి తీసుకు రాకుండా అత్యుతన్నత న్యాయస్థానం కండ్లు గప్పింది అన్న విషయం కూడా బుధవారంనాటి విచారణతో స్పష్టమైంది. ఓ సారి కొనుగోలు ఒప్పందాన్ని ఖరారు చేసిన తర్వాత దానిలో ఇష్టం వచ్చిన క్లాజులు తీసేయటం, ఇష్టం వచ్చిన క్లాజులు చేర్చటం, ప్రాధాన్యతలు మార్చటం తీవ్రమైన ఉల్లంఘనే అవుతుంది. ఈ ఉల్లంఘనలను సుప్రీం కోర్టుకు నివేదిస్తే మోడీ, దోవల్‌ ద్వయం శ్రీకృష్ణ జన్మస్థానానికి వెళ్లటం ఖాయం. వారిని కాపాడటానికి ఏకంగా న్యాయశాఖ, రక్షణశాఖ, ప్రధాని కార్యాలయం కీలక వాస్తవాలు సుప్రీం కోర్టుకు అందకుండా జాగ్రత్తపడ్డాయన్న విషయం కూడా నిన్నటి వాదనల్లో తేలిపోయింది.
తన గుట్టురట్టు అయిందని గ్రహించి బీజేపీ ప్రభుత్వం ముందుకు తెచ్చిన కొత్త వాదనే రక్షణశాఖ నుంచి పత్రాలు చోరీ కావటం. ఈ లీకేజికి కారణమైన విలేకరులను దేశం ముందు దోషులుగా చూపించే ప్రయత్నం. ఈ పరిణామాలన్నీ గమనిస్తే ప్రభుత్వం ఏదో దాయటానికి, ఎవరినో కాపాడటానికి తిప్పలు పడుతోందని స్పష్టమవు తోంది. ఏ న్యాయస్థానమైనా వచ్చిన వార్తలు లేదా ఆరోణల్లో వాస్తవం ఉందా లేదా అని నిర్ధారించటానికి బదులుగా లీకేజిలపై దృష్టి మళ్లిస్తే పరిపాలనలో పారదర్శకతకు కాలం చెల్లినట్లే. ఈ విషయాన్నే ప్రశ్నిస్తూ సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి ''రక్షణ పేరుతో ప్రభుత్వం ఏ కుంభకోణమైనా చేయవచ్చు. కానీ సుప్రీం కోర్టు సదరు కుంభకోణాలను విచారించటానికి సిద్ధమైతే రక్షణ రహస్యాల పేరుతో దాటవేస్తారా'' అని ప్రభుత్వాన్ని నిలదీశారు. జాతీయభద్రత పేరుతో ప్రభుత్వం ఇష్టం వచ్చినట్లు వ్యవహరించే స్వేఛ్చ లేదని విచారణ బెంచ్‌లో ఉన్న మరో న్యాయమూర్తి కెఎం జోసెఫ్‌ స్పష్టం చేయటం కొసమెరుపు.
నిజంగా ప్రభుత్వం చెప్పినట్టు రక్షణ శాఖ నుంచి పత్రాలు చోరీ అయి ఉంటే ఆ విషయాన్ని నవంబరులోనే సుప్రీం కోర్టుకు ఎందుకు నివేదించలేదు అన్న ప్రశ్నకు ప్రభుత్వం వద్ద సమాధానం లేదు. అధికారిక రహస్యాల చట్టం కింద కేసు నమోదు చేయాలని ఆలోచిస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది. నిజంగా అటువంటి ప్రమాదకర ఘటనే జరిగి ఉంటే ఇంతవరకు కేసు ఎందుకు నమోదు చేయలేదు అన్న ప్రశ్నకు కూడా ప్రభుత్వం సమాధానం చెప్పాల్సి ఉంటుంది. అంతే తప్ప ఈ అడ్డగోలు వాదనల చాటున ప్రభుత్వం తనను తాను రక్షించుకోవటానికి అసలు కుంభకోణంపై దర్యాప్తే అక్కర్లేదన్న వాదన తీసుకోవటం అనైతికం. చట్టవ్యతిరేకం. అవినీతిని, అడ్డదారి ప్రయత్నాలను, ఆశ్రిత పక్షపాతాన్ని అడ్డగోలుగా వెనకేసుకు వచ్చే ప్రయత్నమే. ఇటువంటి ప్రభుత్వం చేతుల్లో దేశరక్షణ భద్రంగా ఉంటుందని ఆశించటం అమాయకత్వమే కాదు. మూర్ఖత్వం కూడా అవుతుంది.
- కొండూరి వీరయ్య
సెల్‌: 9871794037

No comments: