Tuesday, September 28, 2010

దారి మళ్లిన ఉద్దీపన ఫలాలు


Published in PRajasakti Business Watch on 27th September 2010

* పెరిగిన అమెరికా కంపెనీల లాభాలు
* మాంద్యం అనంతరం రెండేళ్లలో తగ్గిన శ్రామికుల వేతనాలు

కార్మికుల సంఘటిత శక్తి బలంగా ఉన్నపుడు, ఆర్థికాభివృద్ధి ఫలాలు గణనీయగా కార్మికవర్గానికి దక్కాయి. దాంతో ఆర్థికాభివృద్దితో పాటు దేశాలు సమగ్ర సామాజిక అభివృద్ధి దిశగా నడకసాగించాయి. కార్మికుల సంఘటిత శక్తి బలహీనమైనపుడు ఆర్థికాభివృద్ధి మాత్రం జరుగుతూనే ఉంటుంది. కానీ ఈ అభివృద్ధి 50, 60 దశకాల్లో చూసినట్లు సార్వజనీక సమగ్రాభివృద్ధిగా మారదు. కేవలం ఆర్థికాభివృద్ధిగా మాత్రమే మిగిలిపోతోంది.... అందుకే కార్మికులకు, అమెరికాలోనైనా ఆంధ్రప్రదేశ్‌లో నైనా....

సంఘం శరణం

గశ్చామి !


ప్రపంచ పెట్టుబడిదారీ విధానం సంక్షోభానికి లోనై రెండేళ్లు పూర్తయింది. ఈ కాలంలో వివిధ రంగాల్లో అనేక పరిణామాలు చోటు చేసుకున్నాయి. అమెరికా రాజకీయ రంగంలో గతంలో ఉన్నంత దూకుడుగా వ్యవహరించలేకపోతోంది. యూరప్‌ జర్మనీ నాయకత్వంలో క్రియాశీలక పాత్ర పోషించేందుకు సిద్ధమవుతోంది. చైనా ప్రపంచ ఆర్థిక శక్తిగా ఎదిగిన విషయాన్ని తాజా సంక్షోభం తదనంతర పరిణామాలు రుజువు చేశాయి. ఈ రెండేళ్ల కాలంలో ప్రపంచ దేశాల ప్రభుత్వాలు ఏకాభిప్రాయంతో అమలు జరిపిన ఉద్దీపన పథకాలు సంక్షోభాన్ని మరింత విస్తరించకుండా కట్టడి చేశాయి. అయితే మూడు దశాబ్దాలుగా ద్రవ్యోల్బణాన్ని నియంత్రించటం, ప్రభుత్వ వ్యయాన్ని పరిమితం చేయటం లక్ష్యాలుగా పని చేసిన నయా ఉదారవాద భావజాలం ఈ మార్పులను ఆహ్వానించలేకపోతోంది. దాంతో ఉద్దీపన పథకాలు వాటి వెన్నంటి వచ్చే ప్రభుత్వ వ్యయాన్ని నియంత్రించాలన్న డిమాండ్‌ను ముందుకు తెస్తున్నాయి. 2008లో సంక్షోభం ప్రారంభమైన సమయంలో ఆత్మరక్షణ ధోరణితో ఉన్న కార్మికోద్యమం ప్రపంచ వ్యాప్తంగా ఊపందుకొంటోంది.

భారతదేశంలో ఈ కాలంలోనే నాలుగు సార్లు రాజకీయ అంశాలపై కార్మికవర్గం జాతీయ స్థాయి ఆందోళనకు పూనుకొంది. ఈ ఆందోళనల్లో కార్మికులు, వివిధ వర్గాల ప్రజలు కోట్ల సంఖ్యలో పాల్గొన్నారు. యూరోపియన్‌ యూనియన్‌లో బ్రిటిష్‌ ఎయిర్‌వేస్‌ కార్మికుల సమ్మె, ఫ్రాన్స్‌లో ఫించను ఉపసంహరణకు వ్యతిరేకంగా జరిగిన సమ్మె, గ్రీస్‌లో సంస్థాగత సర్దుబాట్లకు వ్యతిరేకంగా జరిగిన సుదీర్ఘ ఆందోళన వంటి పరిణామలు కార్మికవర్గంపై సంక్షోభ ప్రభావం గురించిన చర్చను ముందుకు తెస్తున్నాయి. ప్రత్యేకించి సంక్షోభానికి అమెరికా కేంద్ర స్థానంగా ఉంది కనుక అమెరికాలోనే ఈ రెండేళ్ల కాలంలో కార్మికవర్గంపై పడిన భారాల గురించి, ఉద్దీపన పథకాల వల్ల ఒరిగిన మేలు గురించి ఈ వ్యాసంలో చర్చిద్దాం.

ప్రపంచ దేశాలు ఉద్దీపనల పేరుతో 11.4 ట్రిలియన్‌ డాలర్ల నిధులు మార్కెట్‌లో కుమ్మరించాయి. 2008లో ఉద్దీపనల గురించి చర్చించినపుడు ఈ పథకాలు సంక్షోభం నేపథ్యంలో పెరిగే నిరుద్యోగాన్ని అదుపు చేయవచ్చని దేశాధినేతలు చెప్పారు. అంతేకాదు, పారిశ్రామికోత్పత్తి సంక్షోభ పూర్వపు స్థాయికి చేరుతుందని, అంతర్జాతీయ వాణిజ్యం నిలకడగా ఉంటుందని, తద్వారా ఉపాధి అవకాశాలను కాపాడుకోవచ్చన్నది ఉద్దీపనల సమయంలో ప్రభుత్వాలు, పలువురు ఆర్థిక వేత్తలు ముందుకు తెచ్చిన వాదనలు. అయితే ఈ వాదనల్లో చివరి రెండు, అంటే పారిశ్రామికోత్పత్తి, అంతర్జాతీయ వాణిజ్యంలో పతనాన్ని అదుపుచేయటంలో మాత్రం ఉద్దీపనలు జయప్రదం అయ్యాయి. కానీ, కార్మికులకు సంబంధించి ఉపాధి అవకాశాలను కాపాడటంలో గానీ, సామాజిక భద్రతను విస్తరించటంలో గానీ, కుటుంబ ఆదాయాన్ని పెంచటంలోగానీ ఈ ఉద్దీపనలు లక్ష్యాలను చేరలేదు. దీనికి ఉద్దీపన ఫలాలు అమెరికాలో పంపిణీ అయిన తీరే నిదర్శనం. ఉద్దీపన పథకాలు అమలు జరిగిన కాలంలో అమెరికాలో కార్పొరేట్‌ లాభాలు 57.2 కోట్ల డాలర్ల మేర పెరిగాయి. అంటే 2008 నాటి లాభాలతో పోల్చి చూస్తే 57 శాతం పెరుగుదల అన్న మాట. ఇదే కాలంలో కార్మికుల వేతనాలు మాత్రం 2008 నాటి స్థాయి కంటే రెండు శాతం తక్కువగా ఉన్నాయి. అంతేకాదు, బ్యాంకేతర ఆర్థిక సంస్థల చేతుల్లో 1.84 ట్రిలియన్ల నిధులు పోగుపడ్డాయి. అంటే మొత్తం ప్రపంచ దేశాలు కుమ్మరించిన ఉద్దీపన నిధుల్లో ఆరవ వంతు వీరి చేతుల్లోకి చేరాయి. కంపెనీల లాభాలు పెరిగినంత వేగంగా పారిశ్రామికోత్పత్తి గానీ, ఉపాధి అవకాశాలు గానీ, వేతనాలుగానీ పెరగలేదు.

నిజానికి 2007 ఆర్థిక సంవత్సరం చివరి మూడు నెలల కాలంలో అమెరికా స్థూల జాతీయోత్పత్తి 13363 బిలియన్‌ డాలర్లు ఉండగా 2010 ఆర్థిక సంవత్సరం మొదటి మూడునెల్ల కాలంలో ఇది 13139 బిలియన్‌ డాలర్లకు పడిపోయింది. అంటే -1.7 శాతం తక్కువ. కానీ నిరుద్యోగం మాత్రం 4.8 శాతం నుండి 10 శాతానికి పెరిగింది. ఉత్పత్తిలో పతనానికి, నిరుద్యోగంలో పతనానికి మధ్య ఎక్కువ తేడా ఉండటం అంటే ఉన్న కార్మికులే ఎక్కువ ఉత్పాదకత సాధిస్తున్నారన్న మాట. ఆ విధంగా వేతనాల్లో పతనం ఉన్నా కార్మికులు ఎక్కువ ఉత్పత్తి సృష్టిస్తున్నారు. దాంతో కంపెనీల లాభాలు యథాతథంగా ఉండటమే కాదు, పెరుగుతున్నాయి. 2008 ఆర్థిక సంవత్సరం చివరి మూడు మాసాల్లో కంపెనీల నికర లాభాలు 995 బిలియన్‌ డాలర్లు ఉంటే 2010 ఆర్థిక సంవత్సరం మొదటి మూడు నెల్లల్లో ఈ లాభాలు1567 బిలియన్‌ డాలర్లుకు పెరిగాయి. ఈ విధంగా తక్కువ శ్రమ శక్తితో ఎక్కువ ఉత్పాదకత సాధించటం ద్వారా అమెరికా కంపెనీలు సంక్షోభ కాలంలో ప్రభుత్వ వ్యయంపై ఆధారపడి తమ లాభాలు పెంచుకున్నాయి.

ఈ ధోరణి కేవలం ఈ ఒక్క సంక్షోభ కాలానికే పరిమితం కాలేదు. 1980లో తెరమీదకు వచ్చిన మదుపు ఖాతాల సంక్షోభం నుండీ ఈ ధోరణి కొనసాగుతోంది. మదుపు ఖాతాల సంక్షోభం నుండి బయటకు వచ్చేందుకు జరిగిన ప్రయత్నాల్లో కార్మికవర్గానికి రాయితీలు దక్కాయి. అప్పట్లో అనుసరించిన విధానాలు కారణంగా కార్పొరేట్‌ వర్గాల ఆదాయం 15 బిలియన్‌ డాలర్లు ఉండగా కార్మికుల దక్కిన వాటా 148 బిలియన్‌ డాలర్లుగా ఉంది. ఈ విధానానికి 1991 తర్వాత తెరపడింది. 1990-1991లో అమెరికా కార్పొరేట్‌ లాభాల రేటు తిరోగమనంలో ఉంది. ఈ కాలంలో కార్మికవర్గం దక్కించుకున్న వాటాలు కూడా 80తో పోల్చితే సగానికి సగం తక్కువ. 1991 తర్వాత సైద్ధాంతిక, రాజకీయ బలాలు పెట్టుబడిదారీ దోపిడీకి అనుకూలంగా మారాయి. దాంతో 2001 నాటికి అమెరికా కార్పొరేట్‌ లాభాలు 93 బిలియన్ల్‌కు చేరుకోగా కార్మికుల వేతనాలు 80 బిలియన్‌ డాలర్లకు పరిమితమయ్యాయి. 2007-2009 నాటికి ఈ మార్పు పెట్టుబడికి అనుకూలగా కార్మికవర్గానికి వ్యతిరేకంగా స్థిరీకరించబడింది. తాజా సంక్షోభ కాలంలో పన్నులకు ముందు కంపెనీల లాభాల్లో పెరుగుదల 388 బిలియన్‌ డాలర్లకు చేరుకోగా కార్మిక వేతనాల్లో పెరుగుదల మాత్రం 68 బిలియన్‌ డాలర్లకు పరిమితమయ్యింది. అంటే ఈ కాలంలో కంపెనీల ఆదాయం కార్మికుల ఆదాయం కంటే 85 శాతం అదనంగా పెరిగింది. ఈ మార్పుకు అమెరికాలో కార్మికవర్గ పొందికలో వచ్చిన మార్పు ప్రధానమైన కారణంగా కనిపిస్తోంది.

ప్రధానంగా అమెరికా కార్మికవర్గంలో సంఘ చైతన్యం లోపించటం ఇందుకు ముఖ్యమైన కారణం. 1955 నాటికి మొత్తం అమెరికాలోని కార్మికుల్లో మూడోవంతు మంది ఏదో ఒక విధమైన కార్మిక సంఘాల్లో సభ్యులు.

ప్రతి పరిశ్రమలోనూ, ప్రైవేటు ఆఫీసులోనూ కార్మిక సంఘాలుపని చేసేవి. కలెక్టివ్‌ బార్గెయినింగ్‌ అన్న సూత్రం ఆధారంగా యాజమాన్యం, కార్మికవర్గం మధ్య వివాదాలు పరిష్కృతం అవుతూ ఉండేవి. మహా మాంద్యం నేపథ్యంలో ప్రభుత్వం అనుసరించిన ఆర్థిక విధనాలు కార్మికవర్గ ప్రయోజనాలను కూడా పాక్షికంగానైనా కాపాడేవిగా ఉండేవి. రీగన్‌ కాలంలో అమెరికా ప్రభుత్వం కార్మికవర్గ ప్రయోజనాలు పక్కన పెట్టి సంపూర్ణంగా పెట్టుబడిదారీ ప్రయోజనాలు కాపాడటానికి కంకణం కట్టుకోవటంతో కార్మికవర్గం దశాబ్దాల తరబడి పోరాటంతో సాధించుకున్న హక్కులన్నీ అటకెక్కాయి. దాంతో 1983 నాటికి కార్మిక సంఘాల సభ్యత్వం మొత్తం కార్మికవర్గంతో పోల్చినపుడు 20 శాతానికి పడిపోయింది. కోటి డెభ్బై లక్షలమంది కార్మికులు అమెరికాలో కార్మికసంఘాల్లో 1983 నాటికిసభ్యులుగా ఉండేవారు. 2009 నాటికి ఈ సభ్యత్వం కాస్తా కోటి యాభై లక్షలకు పడిపోయింది. మొత్తంగా ఉపాధి రహిత అభివృద్ధి నేపధ్యంలో మొత్తం అమెరికా శ్రమశక్తి మార్కెట్‌లో కేవలం 12.3 శాతం మాత్రమే కార్మిక సంఘాల్లో సభ్యత్వం కలిగి ఉన్నారు.గత మూడు దశాబ్దాలుగా తగ్గిపోతూ ఉన్న అమెరికా కార్మికుల సంఘటిత శక్తి, సంఘాల శక్తి పై గణాంకాల్లో కనిపిస్తోంది.

కార్మికుల సంఘటిత శక్తి తగ్గిపోవటం, చట్టపరమైన భద్రత లేకపోవటం, ఉపాధి అవకాశాల పతనం నేపథ్యంలో కలెక్టివ్‌ బార్గెయినింగ్‌ గురించిన చర్చే లేదు. ఈ పరిస్థితుల్లో తాజా సంక్షోభం నుండి బయట పడటానికి అమలు జరుగుతున్న చర్యల భారం ప్రధానంగా కార్మికవర్గంపై ఎక్కువగా ఉంటోంది. అందువల్లనే ఈ కాలంలో ఉద్దీపనల తర్వాత అమెరికా కంపెనీల లాభాల్లో 54 శాతం పెరుగుదల ఉంటే కార్మికుల వేతనాల్లో రెండు శాతం పతనం ఉంది. ఈ అనుభవాలు సంక్షోభాల సమయంలోనైనా, సానుకూల సమయంలోనైనా కార్మికులకు సంఘాలే బలం, సంఘటిత శక్తే కార్మికుల ప్రయోజనాలు కాపాడుతుందన్న విషయాన్ని రుజువు చేస్తున్నాయి. పైన ప్రస్తావించుకున్నట్లు కార్మికుల సంఘటిత శక్తి బలంగా ఉన్నపుడు, ఆర్థికాభివృద్ధి ఫలాలు గణనీయగా కార్మికవర్గానికి దక్కాయి. దాంతో ఆర్థికాభివృద్దితో పాటు దేశాలు సమగ్ర సామాజిక అభివృద్ధి దిశగా నడకసాగించాయి. కార్మికుల సంఘటిత శక్తి బలహీనమైనపుడు ఆర్థికాభివృద్ధి మాత్రం జరుగుతూనే ఉంటుంది. కానీ ఈ అభివృద్ధి 50, 60 దశకాల్లో చూసినట్లు సార్వజనీక సమగ్రాభివృద్ధిగా మారదు. కేవలం ఆర్థికాభివృద్ధిగా మాత్రమే మిగిలిపోతోంది.... అందుకే కార్మికులకు, అమెరికాలోనైనా, ఆంధ్రప్రదేశ్‌లోనైనా.... సంఘం శరణం గశ్చామి !

కొండూరి వీరయ్య

Tuesday, September 14, 2010

ఆర్థిక సంస్కరణల అమానవీయ ముఖం

published in Prajasakti Business Watch on Monday September 13th 2010


ప్రభుత్వాలు రూపొందించి, అమలు చేసే విధానాలన్నింటికీ ప్రజా సంక్షేమమే ప్రాతిపదిక అన్న భావన ఉండేది. సంక్షేమ రాజ్యంలో ఈ భావన మరింత హెచ్చు. కానీ ఎఫ్‌సిఐ గోదాముల్లో ముక్కిపోతున్న ఆహార ధాన్యాలను పేదలకు పంచే విషయమై ప్రధానమంత్రి చేసిన ప్రకటన, అంతకు ముందు పార్లమెంట్‌లో వ్యవసాయశాఖ మంత్రి శరద్‌ పవార్‌ చేసిన ప్రకటనలు ఈ భావనలను ప్రశ్నార్థకం చేస్తున్నాయి. 2001 నుండి సుప్రీం కోర్టు ఆహార భద్రత హక్కు గురించి అనేక సందర్భాల్లో జోక్యం చేసుకున్నా ప్రభుత్వాలకు చలనం లేకపోయింది. చివరకు కోర్టే ప్రత్యక్షంగా కమిషనర్లను నియమించి, పరిస్థితిని అధ్యయనం చేయించి నివేదిక తెప్పించుకొంటోంది. దీనర్థం ప్రభుత్వం అంత చావ చచ్చిపోయి ఉందని కాదు. అవసరమైన అన్ని చోట్లా, అంటే మార్కెట్‌కు అవసరమైన అన్నిచోట్లా ప్రభుత్వం క్రియాశీలకంగానే పని చేస్తోంది. ఉద్దీపన పథకాలు, కార్పొరేట్లకు నాలుగు లక్షల కోట్లకుపైగా పన్ను రాయితీలు, ఎగుమతి ప్రోత్సాహకాలు, కార్మిక సంస్కరణలు, అమెరికాతో అణుఇంధన ఒప్పందం వంటి విషయాల్లో ప్రభుత్వం క్రియాశీలత స్పష్టంగానే కనిపిస్తోంది. మార్కెట్‌ సూత్రాల అమలు సాధ్యం కాని ప్రజాపంపిణీ వ్యవస్థ, ఆహార ధాన్యాల సేకరణ, ప్రజలకు, పిల్లలకు పౌష్టికాహారం అందుబాటులోకి తేవటం వంటి చోట్ల మాత్రం ప్రభుత్వం నామమాత్రపు ఆసక్తిని కూడా ప్రదర్శించటం లేదు. 1991-96 మధ్య దేశ ఆర్థిక మంత్రిగా ఉన్న మన్మోహన్‌సింగ్‌ 95 నుండి మానవీయ ముఖంతో కూడిన ఆర్థిక సంస్కరణలు అన్న చర్చను ముందుకు తెచ్చారు. అటువంటి వ్యక్తి నేడు వాస్తవమైన, సంస్కరణల అమానవీయ ముఖాన్ని ఇంత తేలికగా బట్టబయలు చేస్తారని ఎవ్వరూ ఊహించలేదు.

ప్రధానమంత్రి ప్రకటనలో రెండు అంశాలు ఉన్నాయి. మొదటిది విధాననిర్ణయాల విషయంలో సుప్రీం కోర్టు జోక్యం అవసరం లేదు అన్నది. రెండో అంశం దేశంలో 37.7 శాతంగా ఉన్న పేదలకు ఉచితంగా సరఫరా చేయటం ఎలా సాధ్యమవుతుంది అన్నది. దీనికి అనుబంధంగా ప్రధానమంత్రి ముందుకు తెచ్చిన మరో చర్చ గోదాముల్లోని ఆహారధాన్యాలు సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఉచితంగా పంచి పెడితే ఇది రైతాంగానికి ఇచ్చే మద్దతు ధరపై ప్రభావం చూపుతుందన్నది. బహుశా దేశవ్యాప్తంగా విస్తరించి ఉన్న పేదలకు ఆహారధాన్యాలు ఉచితంగా అందచేయటం ఎలా అన్నది ప్రధాని ప్రశ్న అయి ఉండొచ్చు. సోనియా గాంధీ నేతృత్వంలోని జాతీయ సలహామండలి ఈ మధ్యే సమావేశమై పేదలందరికీ ఆహారధాన్యాలు అందచేయటం ఎలా అన్న అంశం చుట్టూ భారీ కసరత్తు నిర్వహించింది. అక్కడున్న మేధావులు ఏ ప్రమాణాలు పరిగణనలోకి తీసుకున్నారో ఏమో తెలియదు గానీ దేశవ్యాప్తంగా ఒకేసమయంలో పేదలందరికీ ఆహారధాన్యాలు చేర్చటం సాధ్యంకాదని తేల్చేశారు. కనుక ఆహారభద్రత హక్కు చట్టాన్ని జాతీయగ్రామీణ ఉపాధి హామీ చట్టం తరహాలో దశల వారీగా అమలు చేయాలని, ముందుగా కడుపేదలతో నిండిన 150 జిల్లాల్లో ఈ చట్టాన్ని ప్రయోగాత్మకంగా అమలు చేయాలని సలహా ఇచ్చారు. బహుశా ప్రధాని ఈ సలహా నుంచి స్పూర్తి పొందారేమో.. 37.7శాతంగా ఉండి, దేశవ్యాప్తంగా విస్తరించిన పేదలకు ఉచితంగా ఎలా సరఫరా చేయాలని బహిరంగంగా ప్రశ్నించారు.


ఇందులో మరో ప్రశ్న కూడా ఉంది. అసలు ఉచితంగానే సరఫరా చేయలేనపుడు నిజంగా చట్టం ద్వారా మాత్రం ఎలా సరఫరా జరుగుతుంది అన్నది ఆ ప్రశ్న. అంటే చైనా సరిహద్దుల్లో హిమగిరి శిఖరాలపై ఉన్న లేV్‌ా, తవాంగ్‌, హిందూమహాసముద్రంలో ఇమిడిపోయిన లక్షదీవులకు ఓటింగ్‌ సమయంలో ఎన్నికల సిబ్బంది క్షేమంగా చేరుకోగలిగారు. గానీ ఈ ప్రాంతాలకు ఆహారధాన్యాలు మాత్రం చేరుకోలేవన్నది ప్రధాని ప్రకటన సారాంశం. ఇది నిజమా ? ఒకవేళ నిజమైతే స్వాతంత్య్రానంతరం ఆరున్నర దశాబ్దాల తర్వాత ఈ పరిస్థితిని కల్పించిన నేరం ఎవరిది ? ఈ ప్రశ్న వేయటం ప్రజల తప్పు కాబోదు. సలహా మండలి సూచన అనుసారం దశలవారీగా అమలు ప్రారంభిస్తే ఈ సరఫరాలు అందుకునే వరకూ ఆకలిని వాయిదా వేయటం ఎలాగో సదరు మేధావులే శెలవిస్తే బాగుంటుంది. ఉచితంగా ఆహార ధాన్యాలు సరఫరా చేస్తే రైతంగానికి ఇచ్చే మద్దతు ధరపై దాని ప్రభావం ఉంటుందన్న మాజీ ఆర్థికవేత్తగారి లాజిక్కును పరిశీలిద్దాం. ఆ విషయంలోకి వెళ్లబోయే ముందు తక్షణ సమస్య గురించి ఒక విషయం పరిశీలిద్దాం. ఈ సంవత్సరం ఉత్తర భారతదేశంలో ఎన్నడూ లేనంతగా కురిసిన భారీ వర్షాలకు ఎగువన ఉండే పంజాబ్‌, హర్యానాలు జలమయ్యాయి. ఈ ప్రాంతంలోనే ఎఫ్‌సిఐ గోదాముల్లో పెద్దఎత్తున ఆహారధాన్యాల నిల్వలు పోగుపడ్డాయి. గోదాముల్లో చోటు లేకపోవటంతో అధికారులు రైతాంగం, మిల్లుల నుండి సేకరించిన లెవీ బియ్యాన్ని టార్పాలిన్లు కప్పి ఆరుబయటే ఉంచారు. ఆరుబయట ఉన్న ఈ ధాన్యం తడిచి ముక్కిపోయింది. ఈ ధాన్యాన్ని ముక్కిపోయేందుకు ఆరుబయట వదిలిపెట్టకపోతే ప్రజలకు పంచవచ్చు కదా అన్నది సుప్రీం కోర్టు. దానికి ప్రధానమంత్రిగారికి కోపం వచ్చింది. సాధారణ ఆర్థిక సూత్రాల పరిచయం ఉన్న వారికెవరికైనా తెలిసిన విషయం ఒకటే. గాదెలో ధాన్యం నూర్పిళ్ల సమయానికి ఖాళీ అయితేగానీ నూర్పిడితో వచ్చిన ధాన్యాన్ని తిరిగి గాదెలో నింపటం సాధ్యంకాదు. అంటే గోదాముల్లో ఇప్పుడున్న ధాన్యం ఖర్చు అయితేగానీ తిరిగి నింపే అవసరం రాదు. తిరిగి నింపే అవసరం ఉన్నపుడే ఎఫ్‌సిఐ రైతుల నుండి, మిల్లర్ల నుండి లెవీ ధాన్యం సేకరిస్తుంది.

లెవీ ధాన్యం సేకరించాలంటే మద్దతు ధర నిర్ణయించాలి. ప్రధానిగారి లాజిక్కుకు, ఆచరణలో ఉన్న వాస్తవ పరిస్థితికి మధ్య పొంతనే లేదు. అందుకే ప్రధాని చేసేది వితర్కమో కుతర్కమో అవుతుంది తప్ప అర్థవంతమైన తర్కం కాదు ఈ సంవత్సరం రుతుపవనాలు కనికరించటంతో పెద్దఎత్తున దిగుబడులు ఉంటాయని, ఆర్థిక వ్యవస్థ మరింతగా పుంజుకుంటుందని ప్రభుత్వమే చెప్తోంది. మరి గోదాముల్లో ఉన్న సరుకే కదలని పరిస్థితి ఉంటే కొత్తగా వచ్చే దిగుబడులు ఎక్కడ నింపుతారు ? ఈ వాదన పర్యవసానం మరింత దారుణంగా ఉంటుంది. ఎఫ్‌సిఐ లెవీ ధాన్యం సేకరించే అవసరం రాదు కాబట్టి రైతులనుండి సేకరణ నిలిపివేస్తుంది. దాంతో రైతులకు గిట్టుబాటు ధర రాదు. వాళ్లు కూడా ఇళ్లల్లోని గాదెల్లో ధాన్యం నింపుకుని కొనుగోలు చేసే వారి కోసం ఎదురు చూడాల్సి వస్తుంది. వాస్తవం ఇది. దీన్ని తిరగేసి చెప్తున్నారు మన ప్రధానమంత్రి. ఇది నిజానికి రైతాంగాన్ని దివాళా తీయించే వ్యవహారమే తప్ప వారిని ఆదుకునేందుకు కాదు.

యథారాజా తథా ప్రజా అన్నట్లు ప్రధానమంత్రే ఇలా ఉంటే ఆయన ప్రభుత్వంలోని మంత్రులు అధికారులు ఇందుకుభిన్నంగా ఎందుకుంటారు! ఉదాహరణకు ఒక్క అధికారి గురించి ప్రస్తావించుకుందాం. ఆయన ప్రధానమంత్రికి స్వయానా ఆర్థిక సలహాదారు. అమెరికాలో ఉదారవాద సిద్ధాంతాలు బోధించి వచ్చిన కౌషిక్‌ బసు. ఉచితంగా పంచిపెట్టటం సాధ్యం కాదు కనుక ఆహారధాన్యాన్ని ఎగుమతి చేద్దాం అన్నది ఆయన ప్రతిపాదన. తద్వారా ఎఫ్‌సిఐ గోదాములు ఖాళీ చేయొచ్చు. కొత్త పంటకు అవకాశం ఇవ్వవచ్చు. మరి దేశంలో ఆకలిగొన్న కడుపుల సంగతి ఏమిటన్న ప్రశ్న ఈ ఆర్థిక సలహదారుకు ఆలస్యంగా తట్టింది. దానికి ఆయన ఇచ్చిన పరిష్కారం రెండు మూడేళ్ల పాటు మన ధాన్యం విదేశాల్లో ఉంటుందట. తర్వాత ఎపుడు కావాలంటే అపుడు తిరిగి వెనక్కు తెచ్చుకోవచ్చట. ఈ విధంగా ప్రభుత్వాలతో ఒప్పందాలు కుదుర్చుకోవాలట...రోగికి పిచ్చి ముదిరిందని డాక్టరు వద్దకు వస్తే రోకలి తలకు చుట్టమన్నాడట సదరు డాక్టరు. పిచ్చి రోగికా, డాక్టరుకా అన్న విషయం పాఠకులకే వదిలేస్తున్నాను.

చివరిగా అసలు ఈ సమస్య ఎందుకు తలెత్తిందన్న విషయాన్ని సుప్రీం కోర్టు కూడా పరిగణనలోకి తీసుకోలేదు. నేడు మన గోదాముల సామర్ధ్యాన్ని మించి ఆహారోత్పత్తులు ఉత్పత్తి అవుతున్నాయి. నేడున్న ఎఫ్‌సిఐ గిడ్డంగులు 80వ దశకంలో నిర్మితమైనవి. ఆ తర్వాత టన్ను ధాన్యాన్ని అదనంగా నిల్వ చేసే సామర్థ్యాన్ని కూడా ప్రభుత్వం సృష్టించలేదు. కానీ వంగడాల్లో వచ్చిన మార్పుల వల్ల సేద్యపు భూమి తగ్గుతున్నా, ఉత్పాదకత పెరిగింది. కానీ వ్యవసాయోత్పత్తుల నిల్వ సామర్థ్యం మాత్రం పెరగలేదు. ప్రస్తుత సమస్యకు మూలకారణం ఇది. ఈ పరిస్థితుల్లో వ్యవసాయోత్పత్తుల నిల్వ సామర్థ్యం పెంచుకునే అవకాశాలు గురించి చర్చించకుండా ప్రభుత్వం చర్చను పక్కదారి పట్టిస్తోంది. ఇది వ్యవసాయానికీ, రైతాంగానికే కాదు. స్థూలంగా జాతీయ ఆర్థిక వ్యవస్థకే ముప్పు తెచ్చే వైఖరి. ఈ వైఖరి నుండి ప్రభుత్వాలు బయటపడనంత కాలం ఆహారభద్రత హక్కు, జీవించే హక్కు ఏ హక్కు అయినా వారికి కంటగింపుగానే కనిపిస్తుంది.

కొండూరి వీరయ్య