Wednesday, May 22, 2019

Apr 18,2019
http://www.navatelangana.com/article/net-vyaasam/794807


పొట్ట విప్పి చూడ పురుగులుండు..!

ఒక్కోసారి సమకాలీన వాస్తవికతకు దర్పణం పట్టేలా చెప్పాలంటే గతంలోకి వెళ్లాలి. సామాజిక రుగ్మతలపై తెలుగులో వేమన సరళమైన భాష, శైలిలో అందించినంత సాహిత్యాన్ని మరో తెలుగు కవి అందించలేదంటే అతిశయోక్తి కాదు. అందుకే మోడీ అవినీతిపై సాగిస్తున్న పోరాట స్వభావాన్ని ఎత్తి చూపటానికి వేమన పద్యాన్ని ఆశ్రయించాల్సి వచ్చింది. భారతదేశంలో అవినీతి ప్రవాహాలకు వెయ్యి చేతులతో అడ్డుకట్ట వేసే కార్తవీర్యార్జునుడు అని బీజేపీ శ్రేణులు భజన చేశాయి. మనసా వాచా కర్మణా నీతి తప్పని నేతగా మోడీ వ్యక్తిత్వాన్ని ప్రచారం చేయటానికి ఎన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చయ్యాయో, ఆ సొమ్ము బీజేపీకి లేదా మోడీకి ఎలా దక్కిందో బట్టబయలు చేస్తే పారదర్శక పాలన నినాదం పట్ల బీజేపీకి ఉన్న నిబద్ధతను విశ్వసించవచ్చు. ఐదేండ్ల పాలనలో అవినీతి ఆరోపణలు ఎదుర్కోని ఏకైక ప్రభుత్వం, ఏకైక నాయకుడు అని భుజకీర్తులు తగిలించేందుకు కుహనా విశ్లేషకులు, ఎన్డీ టీవీ యాంకర్‌ రవిష్‌ తివారీ మాటల్లో పాలకుల ఒళ్లో ఒదిగిపోయిన మీడియా విశ్లేషకులు శాయశక్తులా ప్రయత్నం చేశారు. అయినా రాఫెల్‌ కుంభకోణం విషయంలో సుప్రీం కోర్టు ఇచ్చిన ఆదేశాలు పరిశీలించాక అవినీతిపై మోడీ సాగిస్తున్న పోరాటం మేడిపండువంటిదనీ, విదేశీ స్వదేశీ కార్పొరేట్‌ శక్తుల ముందు మోడీ రెక్కలు తెగిన జటాయువులా పడిపోయాడని రుజువవుతోంది.
మోడీ అధికారానికి వచ్చాక తాను అవినీతికి పాల్పడే అవకాశం లేదని జనాన్ని నమ్మించేందుకు రెండు విషయాలు చెప్పారు. మొదటిది తనకు కుటుంబం, వారసులు లేరన్నది అందులో మొదటిది. తనకు కుటుంబంలేదని చెప్పటం ద్వారా మోడీ కాంగ్రెస్‌ నేతలు కుటుంబం కోసం కోట్లు వెనకేసుకునే ప్రయత్నంలో అవినీతికి పాల్పడ్డారన్న అర్థం వచ్చేలా మాట్లాడారు. మరో సందర్భంలో తాను పకీరునని, పదవి నుంచి దిగిపోతే జోలె పట్టుకుని తన మానాన తాను పని చేసుకుంటానని చెప్పుకున్నారు. మోడీ ఏ వ్యాఖ్య చేసినా, ఏ ఉపన్యాసం చేసినా, ఏ నిర్ణయం చేసినా నోరు మాట్లాడుతుంటే నొసలు వెక్కిరిస్తుంటాయన్న సామెతను నెమరేసుకుని మరీ మోడీ వ్యాఖ్యలు, విమర్శలు, ఉపన్యాసాలు చూడాలి. ఇక్కడ అవినీతి ఏదో వ్యక్తిగత బలహీనత వల్ల చోటుచేసుకునే పరిణామం అన్న అభిప్రాయాన్ని కల్పించటానికి విదేశీ గుత్తపెట్టుబడిదారీ సంస్థలు, ద్రవ్యపెట్టుబడి కంపెనీలు గత మూడు దశాబ్దాలుగా సాగిస్తున్న ప్రచారాన్నే దేశంలో బీజేపీ నెత్తికెత్తుకున్నది.

రాఫెల్‌ యుద్ధ విమానాల కొనుగోలు విషయంలో అవినీతి, నిబంధనల ఉల్లంఘన జరిగిందన్న ఆరోపణలపై నడుస్తున్న వ్యాజ్యంపై గతేడాది డిసెంబరులో సుప్రీం కోర్టు ఓ తీర్పు ఇచ్చింది. ఆ తీర్పుకు ఆధారం ప్రభుత్వం ఇచ్చిన కొన్ని పత్రాలు, కోర్టుకు నివేదించిన కొంత సమాచారం. ఈ పత్రాలు, సమాచారం అవాస్తవాలని, అత్యున్నత న్యాయస్థానాన్ని సైతం మోసగించేందుకు మోడీ ప్రభుత్వం పూనుకున్నదని తేటతెల్లం కావటానికి పెద్దగా సమయం పట్టలేదు. గత మూడు నెల్లుగా పత్రికల్లో వస్తున్న వివరాలు నేపథ్యంలో ప్రశాంత్‌ భూషన్‌, అరుణ్‌శౌరీ, యశ్వంత్‌సిన్హాలు మరోసారి సుప్రీం గడప తొక్కారు. డిసెంబరులో న్యాయస్థానం ఇచ్చిన తీర్పును సమీక్షించాలన్నది వారి అభ్యర్థన. ఈ అభ్యర్థనపై విచారణ మొదలవటం అంటే గతంలో ప్రభుత్వం ఇచ్చిన సమాచారం పాక్షికమైనదీ, న్యాయస్థానాన్ని దారితప్పించేదీ అని అంగీకరించటమే. అంతే కాదు. పత్రికల్లో వచ్చిన వాస్తవాలేనని కూడా అంగీకరించినట్టు. ఈ పరిస్థితిని అడ్డుకోవటానికి మోడీ ప్రభుత్వం చేసిన ప్రయత్నాలు, ముందుకు తెచ్చిన వాదనలు, వ్యాఖ్యలు బహుశా భారత న్యాయవ్యవస్థలో ఎన్నడూ జరిగి ఉండవు.
ఎట్టకేలకు ఈ పిటిషన్‌ను సుప్రీం కోర్టు విచారణకు స్వీకరించింది. ఈ పిటిషన్‌తో పాటు మీడియా ద్వారా అందుబాటులోకి వచ్చిన కొన్ని దస్తావేజులను సైతం సాక్ష్యాలుగా పరిగణించేందుకు సుప్రీం కోర్టు అంగీకరించింది. ఫలితంగా గత రెండేండ్లుగా రాఫెల్‌ యుద్ధ విమానాల కొనుగోలులో జరిగిన అవినీతిని బట్టబయలు చేసేందుకు జరుగుతున్న న్యాయ, న్యాయేతర పోరాటం ఓ కొలిక్కి రానుంది. గత వారం సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు మూడు విషయాలను స్పష్టం చేస్తోంది.

మొదటిది రాఫెల్‌ కొనుగోలు గురించి మీడియా వెలుగులోకి తెచ్చిన అనేక పత్రాలు, దస్తావేజులు, ఒప్పందాలు, అధికారిక పత్రాలు వాస్తవమైనవే అన్నది. ఈ కుంభకోణం గురించి లోతైన పరిశోధన చేసిన హిందూ పత్రిక అధినేత ఎన్‌ రామ్‌ తనకు అందిన పత్రాలు అధికారికమైనవేనని కూడా స్పష్టం చేశారు. ఈ పత్రాలు ప్రకారం రాఫెల్‌ కొనుగోలు విషయంలో రక్షణశాఖను పక్కనపెట్టి నేరుగా ప్రధాని కార్యాలయం జోక్యం చేసుకోవటం పతాక స్థాయి ఉల్లంఘనగా రక్షణశాఖ అభిప్రాయపడింది. ఓ స్వచ్ఛంద సంస్థకు గ్రాంట్‌ ఇచ్చినా ప్రభుత్వం వారి నుంచి బాండ్‌ తీసుకుంటుంది. అలాంటిది వేల కోట్ల విలువైన వస్తువులు కొనుగోలు చేసేటప్పుడు ఏ దేశం నుంచి కొనుగోలు చేస్తున్నామో ఆ దేశ ప్రభుత్వం హామీ ఉండాలన్న షరతు అంతర్జాతీయ వాణిజ్య షరతు. ఈ షరతుతో పని లేదని మోడీ కార్యాలయం తేల్చిచెప్పటం వెనక ఉన్న మతలబు వెలుగు చూడాల్సి ఉంది. అంతేకాదు. అటువంటి కొనుగోళ్లల్లో అవినీతికి తావు లేకుండా కూడా కొన్ని షరతులు కొనుగోలు దార్లు అమ్మకం దార్లకు మధ్య కుదిరే ఒప్పందాల్లో కొన్ని షరతులు, ఒడంబడిక ఉంటాయి. వీటిని కూడా రద్దు చేయాలని ప్రధాని కార్యాలయం ఆదేశించింది. యుద్ధ విమానాలు కొనుగోలు చేయాల్సిన దస్సాల్ట్‌ ఏవియేషన్‌ కంపెనీకి నిజంగా ఒప్పందం మేరకు అన్ని యుద్ధ విమానాలు ఉత్పత్తి చేసి నిర్దిష్ట గడువులో సరఫరా చేయగలదా లేదా అన్న విషయంపై రక్షణశాఖ అధికారులు లేవనెత్తిన అభ్యంతరాలను కూడా ప్రధాని కార్యలయం తొక్కిపట్టింది. ఇవన్నీ విధానపరమైన అవినీతికి సంబంధించిన విషయాలు.

గతేడాది జరిగిన విచారణలో సుప్రీం కోర్టుకు కేంద్ర ప్రభుత్వం అన్ని వాస్తవాలు నివేదించలేదన్నది రెండో విషయం. న్యాయస్థానాలు తీర్పు ఇచ్చే పద్ధతి వింతగా ఉంది. వాస్తవంతో న్యాయస్థానానికి పని లేదు. కేవలం ఆధారాలు మాత్రమే పరిశీలిస్తుంది. కక్షిదారులు తమ ముందుంచిన వివరాలు మాత్రమే తీర్పుకు ప్రాతిపదికగా ఉంటాయి. ఎక్కువ సందర్భాల్లో వాస్తవాలు కక్షిదారులు కోర్టు ముందుకు తేగలిగిన ఆధారాల కంటే వాస్తవాలు చాలా విశాలంగానూ లోతైనవిగానూ ఉంటాయి. కానీ న్యాయస్థానం ఇవన్నీ పరిశీలించదు. అందుకే ఓ న్యాయస్థానం ఇచ్చిన తీర్పును మరో న్యాయస్థానం కొట్టేస్తుంది. సుప్రీం కోర్టులోనే ఏక సభ్య న్యాయస్థానం తీర్పులను బహుళసభ్య న్యాయస్థానాలు కొట్టేయటమో సవరించటమో చేసిన సందర్భాలు కోకొల్లలు. అటువంటి పరిమితులకు లోబడిందే డిసెంబరులో రాఫెల్‌ వివాదంపై సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు అని నేడు స్పష్టమైంది. దీనికి కారణం న్యాయస్థానానికి మోడీ ప్రభుత్వం పూర్తి వాస్తవాలు నివేదించకపోవటం ద్వారా న్యాయస్థానాన్ని తప్పుదారి పట్టించిందన్న విషయం ఈ తీర్పుతో రుజువైంది. అటువంటి వాటిలో రక్షణ ఉత్పత్తుల సేకరణ విధానం, కేంద్ర రక్షణ వ్యవహారాల మంత్రివర్గ ఉపసంఘం, కేంద్ర విజిలెన్స్‌ విభాగం మార్గదర్శకాలు, మధ్యవర్తుల బృందం (ఫ్రాన్స్‌ కంపెనీతో చర్చలు జరిపిన బృందం) అభ్యంతరాలు వంటి అనేక కీలక పత్రాలను ప్రభుత్వం సుప్రీం మెట్లు ఎక్కకుండా తొక్కిపట్టింది. ఇది కేవలం అవినీతి మాత్రమే కాదు. మోడీ దేశ ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసినప్పుడు రాజ్యాంగం మీద ప్రమాణం చేసి మరీ చేసిన వాగ్దానం, జాతీయ ప్రయోజనాలకు విఘాతం కలిగించే విషయాన్నీ అనుమతించనన్న వాగ్దానాన్ని ఉల్లంఘించటమే. ఇది అత్యంత నీతిబాహ్యమైన చర్య.
ఫ్రాన్స్‌కు చెందిన లిమోండె పత్రిక సంచలన వార్త మూడో విషయం. ఈ వార్త సారాంశం అనిల్‌ అంబానీ కంపెనీ ఫ్రాన్స్‌ ప్రభుత్వానికి చెల్లించాల్సిన పన్నులు అపరాధ రుసుముల్లో దాదాప 12వందల కోట్ల రూపాయలు మాఫీ చేశారన్నది. భారతదేశంలో బడా కంపెనీలకు సుమారు రూ.ఐదు లక్షల కోట్లు రుణాలు మాఫీ చేసినందున ఫ్రాన్స్‌ 1200కోట్లు మాఫీ చేయటం గొప్ప విషయం కాదు. కానీ రాఫెల్‌ విడిభాగాల తయారీ కాంట్రాక్టు అనిల్‌ అంబానీ కంపెనీకి కట్టబెట్టిన తర్వాత ఈ అపరాధ రుసుము మాఫీ కావటంలోనే కిటుకంతా ఉంది. ఇక్కడ విడివిడిగా కనిపిస్తున్న మూడు విషయాలను కలిపి చూస్తే తప్ప ఈ కుంభకోణంలో తుదీ మొదలూ వెలుగులోకి రావు. అలాంటి ఈ మూడు విషయాలు.

మొదటిది అటు ఫ్రాన్స్‌లో దస్సాల్ట్‌, ఇటు భారత్‌లో రిలయన్స్‌ జూనియర్‌ కంపెనీలు ఆర్థికంగా దివాళా తీసి ఉన్నాయి. రెండు కంపెనీలకూ ఈ యుద్ధ విమానాలు తయారు చేయటానికి కావల్సిన పెట్టుబడి పెట్టే ఆర్థిక స్థోమత కానీ విడి భాగాలు తయారు చేయటానికి కావల్సిన నిధులు కానీ లేవు. దాంతో ఈ కాంట్రాక్టు అవసరం వచ్చింది. కాంగ్రెస్‌ హయాంలోనే ఈ ఒప్పందం గురించిన చర్చలు ఓ మేరకు పురోగమించాయి. ఈ అవకాశాన్ని అదునుగా తీసుకుని మోడీ తన కార్పొరేట్‌ భక్తి ప్రదర్శించదల్చుకున్నారు.. హిందూస్థాన్‌ ఏరోనాటిక్స్‌ లిమిటెడ్‌ను విడిభాగాల తయారీకి భాగస్వామిగా అంగీకరిస్తే దస్సాల్ట్‌ ఆర్థిక అవసరాలు తీరుతాయేమో కానీ అనిల్‌ అంబానీ దివాళా నుండి బయట పడరు. అందుకే ప్రభుత్వరంగ స్థానంలో ప్రయివేటు కంపెనీ తెరమీదకు రావటం, దానికి లేని అర్హతలకు మెరుగులు దిద్దటం జరిగింది. ఈ తప్పుడు పనికి ఫ్రాన్స్‌ ఎందుకు ఒప్పుకుంది అన్నది ప్రశ్న. దస్సాల్ట్‌ కంపెనీ మూతపడితే వేల మంది కార్మికులు రోడ్డున పడతారు. బలంగా ఉన్న ప్రభుత్వ వ్యతిరేకత మరింత పుంజుకుంటుంది. ఉద్యమాలకు వేదికవుతుంది. దీనికి బదులు ఇలాంటి ఓ కాంట్రాక్టు సంపాదిస్తే దేశంలో కార్మికుల మద్దతు పొందవచ్చు. ఈ రెండు లక్ష్యాలు నెరవేరుతున్నాయి కాబట్టి ఫ్రాన్స్‌ కూడా అనిల్‌ అంబానీ కట్టాల్సిన రూ.12వందల కోట్ల అపరాధ రుసుము కూడా మాఫీ చేసింది.
అర్హత లేని అనిల్‌ అంబానీ కంపెనీకి కాంట్రాక్టు కట్టబెట్టడానికి మోడీ ప్రభుత్వం అప్పటి వరకు ఉన్న విధి విధానాలను, ప్రమాణాలు, చట్టాలు, పద్ధతులను తుంగలో తొక్కింది. వడ్డించేవాడు మనవాడే అయితే దివాళా తీసిన కంపెనీలకు కూడా వేల కోట్ల కాంట్రాక్టులు కట్టబెట్టవచ్చని నిరూపించారు. తనకంటూ కుటుంబమే లేని మోడీ, ఫకీర్‌ అయిన మోడీ ఏ ప్రయోజనం ఆశించి ఈ అడ్డగోలు వ్యవహారాలకు, చివరకు సుప్రీం కోర్టును మోసం చేయటానికి బరితెగించారు?
- కొండూరి వీరయ్య
సెల్‌: 9871794037

No comments: