Monday, December 20, 2010

వికీలీక్స్‌ విస్ఫోటనం



'కుడి ఎడమైతే పొరపాటు లేదోరు ఓడిపోలేదోరు...' అని పాడతాడు దేవదాసు. కానీ మొత్తం భూమండలంపై ఏకఛత్రాధిపత్యం వహించాలని చూస్తున్న అమెరికా మాత్రం కుడి ఎడమైతే కొంపలంటుకుపోతాయని తెలుసుకున్నట్టుంది. అందుకనే మొదట్లో చైనాకు వ్యతిరేకంగా, ప్రపంచవ్యాప్తంగా ప్రజాస్వామిక వ్యవస్థల ప్రచారం కోసం అంటూ తెరమీదకు వచ్చిన వికీలీక్స్‌ పొరుగు దేశాల రహస్యాలు తమకు చేరవేయటానికి బదులు తమ రహస్యాలే బట్టబయలు చేయటంతో అమెరికా అధినేతల గొంతులో వెలక్కాయ పడింది. పత్రికలు పాలకవర్గాల చంకల్లో పిల్లులుగా మారుతున్న సంపన్న దేశాల్లో 'ఎంబెడెడ్‌ జర్నలిజం' సైతం వికీలీక్స్‌ విడుదల చేసిన పత్రాలకు ముఖ్యమైన ప్రతికలు పతాకశీర్షికల్లో స్థానం కేటాయించాల్సిన పరిస్థితి వచ్చింది. పత్రికా స్వాతంత్య్రం, ప్రజాస్వామిక హక్కుల గురించి ప్రపంచానికి పాఠాలు చెప్పే అమెరికా తన గురివింద నైజాన్ని బయట పెట్టుకుంది. విలక్షణమైన కేసులో వికీలీక్స్‌ ప్రధాన బాధ్యుడు జూలియన్‌ అసాంజేను అరెస్టు చేయించింది. అమెరికా, ఆస్ట్రేలియా, స్వీడన్‌, స్విట్జర్లాండ్‌, బ్రిటన్‌లు కూడబలుక్కున్నట్లు వ్యవహరించి అమెరికా విదేశాంగ నీతికి సంబంధించి కీలక పత్రాలు బయట పెట్టిన వికీలీక్స్‌ పీక నొక్కే ప్రయత్నం చేస్తున్నాయి. లైంగిక విషయాల్లో అసాంజేని దోషిని చేయటం ద్వారా వికీలీక్స్‌ వ్యక్తిత్వాన్ని దెబ్బతీయాలనుకోవటం అటువంటి ప్రయత్నాల్లో ఒకటి. అసలు ఇంటర్నెట్‌ ఆధారంగా నడిచే చిన్న సంస్థపై అమెరికా వంటి దేశం అంత పెద్ద దాడి చేయాల్సిన అవసరం ఏమొచ్చింది ? వికీలీక్స్‌ ఎవరు నడుపుతున్నారు? ప్రధాన స్రవంతికి చెందిన ప్రసార సాధనాలు వాషింగ్టన్‌ పోస్ట్‌, న్యూయార్క్‌ టైమ్స్‌, వాల్‌స్ట్రీట్‌ జర్నల్‌, టైమ్స్‌, గార్డియన్‌ వంటి పత్రికలు చేయలేని పనిని కొద్ది మంది కంప్యూటర్‌ రహస్యాలు ఛేదించే హాకర్స్‌గా మారిన యువకులు ఎలా చేయగలుగుతున్నారు? అన్న విషయాలు ఈ వారం అట్టమీదికథలో పరిశీలిద్దాం.

వికీలీక్స్‌ పేరుతో వెబ్‌సైట్‌ 2006 అక్టోబరు 4న రిజిష్టరు అయ్యింది. కంప్యూటర్‌తోనూ, ఇంటర్నెట్‌తోనూ పరిచయం ఉన్న వారందరికీ వికీపీడియా గురించి తెలుసు. ఒక్కమాటలో చెప్పాలంటే ఇది కంప్యూటర్‌ విజ్ఞాన సర్వస్వం. అదే తరహాలో అందరికి అందుబాటులో ఉన్న బ్రాండ్‌తో ప్రారంభమైంది ఈ సంస్థ (అయితే ఈ రెంటికీ సంబంధం లేదు. వికీపీడియా దీన్ని మొదట్లోనే పేర్కొంటున్నది). ప్రారంభంలో ఈ సంస్థ నిర్వాహకులు తమను తాము చైనాకు చెందిన అసమ్మతివాదులుగా ప్రకటించుకొన్నారు. దాంతోపాటు తైవాన్‌-చైనాతో నిరంతరం ఘర్షణ పడుతున్న దేశం- యూరప్‌, ఆస్ట్రేలియా, దక్షిణ ఆఫ్రికాలకు చెందిన కంప్యూటర్‌ ఇంజనీర్లు, గణిత మేథావులు పర్యవేక్షణలో పనిచేసే సంస్థగా ప్రకటించుకోవటంతో అమెరికాతో సహా పశ్చిమ దేశాల్లో ఆశ్రయం సంపాదించటం వారికి తేలికైంది. ఆసియా, మాజీ సోవియట్‌ రష్యాకు చెందిన దేశాల్లో అప్రజాస్వామిక ప్రభుత్వాల గుట్టురట్టు చేయటం తమ లక్ష్యం అని ప్రకటించుకోవటం ద్వారా అమెరికాకు ప్రీతిపాత్రమైన రాజకీయ క్రీడలో తేలికగా ప్రవేశించగలిగారు ఈ సంస్థ నిర్వాహకులు. ఈ విధంగా పశ్చిమ దేశాలకు ప్రత్యేకించి అమెరికాకు అభ్యంతరం కాని విధంగా పని ప్రారంభించిన వికీలీక్స్‌ సంస్థ 2007 జనవరి నాటికి తమ వద్ద వివిధ ప్రభుత్వాల వ్యవహారాలకు సంబంధించి 12 లక్షల పత్రాలు ఉన్నాయని ప్రకటించింది. ఇదే కాలంలో అమెరికా ఇంటర్నెట్‌ ద్వారా అమెరికాకు వ్యతిరేకంగా జరుగుతున్న ప్రచారాన్ని అడ్డుకునే నిమిత్తం ప్రత్యేక ప్రయత్నాలు ప్రారంభించింది. ఇందులో భాగంగా అనేక ఘోస్ట్‌ వెబ్‌సైట్లు ప్రారంభించింది. వికీలీక్స్‌ కూడా అందులో ఒకటన్న భావన సర్వత్రా నెలకొంది.

పేరు ప్రతిష్టలు


ప్రభుత్వ విధానాల్లో పారదర్శకత లక్ష్యంగా వికీలీక్స్‌ చేపట్టిన చర్యలు అనతికాలంలోనే ఉద్యమరూపం తీసుకున్నాయి. ప్రత్యేకించి కెన్యా వంటి దేశాల్లో పాలకులు దేశాన్ని దోచుకుతింటున్న తీరును విపులంగా చిత్రీకరించటం, దాన్ని అంతర్జాతీయ మీడియాకు విడుదల చేయటం వంటి చర్యల ద్వారా వికీలీక్స్‌ పారదర్శకత కోసం, ప్రజాస్వామిక సంస్కరణల కోసం పని చేసే సంస్థగా గుర్తింపు తెచ్చుకుంది. 2008లో లండన్‌కు చెందిన 'ఎకానమిస్టు' పత్రిక వికీలీక్స్‌ సంస్థకు నూతన మీడియా దోరణులకు ఇచ్చే అవార్డు ఇచ్చి సత్కరించింది. మానవహక్కుల కోసం పని చేసే 'ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్‌' 2009 సంవత్సరానికి గాను ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్‌ బ్రిటన్‌ అవార్డును ఇచ్చి వికీలీక్స్‌ పేరు ప్రతిష్టలు మరింత పెంచింది. 2008లో కెన్యా ప్రభుత్వ దురాగతాలను, మానవహక్కుల ఉల్లంఘనను వెల్లడి చేస్తూ 'రక్త దాహం -కెన్యాలో మానవహక్కుల ఉల్లంఘనలు, అదృశ్యమవుతున్న ప్రజల గాథలు' రూపంలో డాక్యుమెంటరీ రూపొందించినందుకు గాను ఈ అవార్డు పొందింది వికీలీక్స్‌. న్యూయార్క్‌ కేంద్రంగా నడిచే డైలీ న్యూస్‌ అనే పత్రిక రానున్న కాలంలో మీడియా రంగంపై తీవ్రమైన ప్రభావం చూపగల పరిణామంగా వికీలీక్స్‌ను గుర్తించింది. దౌత్య రహస్యాలు వెల్లడి చేసిన తర్వాత రష్యా ప్రభుత్వం ఒక ప్రకటనలో వికీలీక్స్‌కు నోబెల్‌ శాంతి బహుమతి అందచేయాలని బహిరంగంగా సిఫార్సు చేసింది.

పాఠాలు నేర్పిన వికీలీక్స్‌

వికీలీక్స్‌ వెల్లడించిన విశేషాల గురించి పత్రికల్లో ప్రముఖంగానే చోటు చేసుకున్నాయి. గతంలో ఇటువంటి ప్రయత్నాలు జరిగినపుడు వచ్చిన ప్రచారం, ప్రాచుర్యం కంటే ఇప్పుడు ఎక్కువ ప్రచారం, ప్రాచుర్యం వచ్చాయి. నిన్న మొన్నటి వరకూ అమెరికా యుద్ధ క్రీడలో పావులుగా సైనికులుగా వ్యవహరించిన వారు, ప్రభుత్వ విధానాల పట్ల పూర్తి వైముఖ్యం ఉన్న వారు, పెట్టుబడిదారీ విధానాన్ని సైద్ధాంతికంగా వ్యతిరేకించే వారు అనేక మంది అమెరికా ప్రభుత్వం అనుసరిస్తున్న తప్పుడు విధానాలను తూర్పారపట్టేందుకు సిద్ధమవుతున్నారు. జేమ్స్‌ పెట్రాస్‌ వంటి వారు మొదటి కోవకు చెందిన వారైతే మంత్లీరివ్యూ పత్రిక నిర్వాహకులు రెండో కోవకు చెందిన వారు. అయితే వీరికి అంతర్జాతీయంగా వికీలీక్స్‌కు వచ్చినంత ప్రాధాన్యత రాలేదు. జేమ్స్‌పెట్రాస్‌ తన ఆక్రోశాన్ని, అనుభవాలను 'దళారీ పశ్చాత్తాపం' రూపంలో వెల్లడి చేసుకోవాల్సి వచ్చింది. ఈ పుస్తకం విడుదలైన తర్వాత కూడా అమెరికాకు చెందిన ముఖ్యమైన మీడియా సంస్థలు పెట్రాస్‌ అనుభవాలు అమెరికా వ్యవహారశైలికి సంబంధించి సార్వత్రిక సత్యాలుగా పరిగణించటానికి వీలు లేదని, ఏదో కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో ఆయన చెప్పిన విషయాలు వాస్తవాలు అయి ఉండే ఉండవచ్చని వ్యాఖ్యానాలు రాసి అమెరికా వరకు ఈ పుస్తకానికి ఆదరణ లేకుండా చేశాయి. వికీలీక్స్‌ వెల్లడి చేసిన వివరాలు పెట్రాస్‌ అనుభవాలు కేవలం వ్యక్తిగతం కాదని, అమెరికా ఆర్థిక రాజకీయ వ్యవస్థలో సంస్థాగతమైన పద్ధతులు అవేనని మరోసారి రుజువు చేస్తున్నాయి.

నిన్న విశిష్టుడు! నేడు దుష్టుడు!!

జూలియన్‌ అసాంజే.. ఈ పేరు ప్రపంచాధిపత్యశక్తిని ప్రకంపింపచేస్తోంది. వికీలీక్స్‌ వ్యవస్థాపకుడైన అసాంజే అమెరికా ఆఫ్ఘన్‌ తదితర దేశాల ప్రజల పాలిట శత్రువనే ప్రచారం మోత మొగుతున్నది. అతన్ని లండన్‌లో అరెస్టు చేసి విచారణ జరుపుతున్నారు. తమకు అప్పగించాలని స్విట్జర్లాండ్‌ వత్తిడి చేస్తుంటే తెర వెనక నుంచి అమెరికా వేట సాగిస్తున్నది. ఇంతకూ ఈ వికీ విలన్‌ నిన్న విశ్వ విఖ్యాత హక్కుల యోధుడుగా ఇదే శక్తులతో నీరాజనాలందుకున్నాడంటే నమ్మడం కష్టమే, కాని నిజం. చాలా మంది సంచలనకారులు వివాద కారకుల్లాగే అసాంజే జీవితం కూడా ఆసక్తికరమైన మలుపులతో నిండి వుంటుంది. నాటకీయత పొంగిపొర్లుతుంటుంది. 1971 జులై 3న ఆస్ట్రేలియాలో జన్మించిన అసాంజే బాల్యం తల్లి విడాకులు పునర్వివాహాల మధ్య నడిచింది. చిన్నప్పటి నుంచీ సాంకేతిక పరిజ్ఞానం ఎక్కువే కావడంతో 16 ఏళ్లకల్లా ప్రపంచ స్థాయి కంప్యూటర్‌ హ్యాకర్‌ అయ్యాడు. అంటే కంప్యూటర్లలో నిక్షిప్తమైన సమాచారాన్ని రాబట్టే లాఘవం అన్న మాట. ఒకానొక చలన చిత్రంలోని పేరును తీసుకుని మాండెక్స్‌ పేరిట హ్యాకింగ్‌ వ్యవస్థను ఏర్పాటు చేశాడు. ఇదంతా చేసేప్పుడు 'కంప్యూటర్లు పాడవకూడదు, తీసుకున్న సమాచారాన్ని మార్చకూడదు, దాన్ని అందరితో పంచుకోవాలి' అని మూడు సూత్రాలు పెట్టుకున్నాడు. 1989 లో 'టేల్స్‌ ఆఫ్‌ హ్యాకింగ్‌' తదితర పుస్తకాల రచనలో పాలుపంచుకున్నాడు. 1991 నాటికి రహస్య సమాచార సేకరణ అందరూ గుర్తించే స్థాయికి చేరింది. 1992లో కంప్యూటర్‌ సంస్థలైన నొడైల్‌, మోడెమ్‌లను హ్యాక్‌ చేశాడు. 2006లో వికీలీక్స్‌ స్థాపించి దానికి ప్రధాన సంపాదకుడుగా పనిచేస్తున్నాడు. మానవ హక్కుల కోసం విశేషంగా కృషి చేస్తున్నందుకు 2008లో ఎకనామిస్ట్‌ పత్రిక అవార్డు ఇచ్చింది. కెన్యాలో చట్టవిరుద్ధ హత్యాకాండను గురించి బయటపెట్టినందుకు ఆయనకు 2009లో ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్‌ అవార్డు ఇచ్చారు. అలాగే ఆఫ్రికాలో విష పదార్థాల గుమ్మరింపు గురించి, ఆ ప్రాంతంలోని ఒక చర్చి నిగూఢ కార్యకలాపాల గురించిన సమాచారాన్ని కూడా ప్రపంచానికి అందించాడు. ఇవన్నీ అసాంజే గురించిన ఆసక్తిని పెంచాయి. ఆయన ఎక్కడు వుంటాడనే దానిపై ఎవరికీ స్పష్టత వుండేది కాదు. ఆస్ట్రేలియా దేశస్థుడైనా అక్కడ వున్నది తక్కువ. కెన్యా, స్విట్జర్లాండ్‌, బ్రిటన్‌, ఐస్‌లాండ్‌ వగైరా చోట్ల నివసిస్తూ ఎక్కడున్నా రహస్య సమాచార సేకరణ కొనసాగిస్తూ వచ్చాడు. అయితే 2010 నవంబరు 20 అమెరికా విదేశాంగ కార్యాలయానికి సంబంధించిన రహస్య పత్రాల ప్రకటన ప్రారంభించగానే ఈ పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. మానవ హక్కుల యోధుడు కాస్తా దేశ ద్రోహి అయిపోయాడు! ఇంతకూ వీటిని ప్రచురించింది ప్రసిద్ధ పత్రికలే. దాంతో ఒక్కసారిగా అమెరికా సైనిక రాజకీయ నేతలు హడలెత్తిపోయారు. నవంబరు 20న ఆయన ఈ పని ప్రారంభించగా 30న స్విట్జర్లాండులో అత్యాచారాల కేసు నమోదైంది. మరో వంక దేశ రహస్యాల చట్టం కింద ఆయనను అప్పగించాలని అమెరికా వత్తిడి పెంచింది. ఈ నేపథ్యంలోనే లండన్‌లో తనుగా దొరికి పోయిన అసాంజే కోర్టులో హాజరైనాడు. అసాంజే గురించిన నిజానిజాలన్ని పూర్తిగా తెలియక పోయినా ఈ సమయంలో వేటాడటం వెనక రాజకీయాలున్నాయన్నది స్పష్టం. అందుకే అంతర్జాతీయంగా తనపట్ల సంఘీభావం కూడా వ్యక్తమవుతున్నది. రహస్యాలు కాపాడుకోలేకపోవడం అధికారుల లోపం తప్ప అందిన వాటిని ప్రచురించడం మీడియా తప్పు కాదన్నది సాధారణ అభిప్రాయం.ఇదే విధమైన కేసుల్లో అమెరికా పత్రికా స్వాతంత్య్రం పేరిట చేసిన హడావుడి అందరికీ తెలుసు. అసాంజేకు ఆమ్నెస్టీ తదితర అవార్డులు ఇచ్చినపుడు తమకే ఉపయోగపడతాడనుకున్నారు..వాస్తవంలో 2010 నోబుల్‌ బహుమానం ఆయనకే ఇవ్వాలని టైమ్‌ పత్రిక ప్రతిపాదించింది కూడా! ఎదురు తిరిగేసరికి ద్రోహి అంటున్నారు.అయితే బ్రెజిల్‌ అధినేత లూలా డిసిల్వా వంటివారు బహిరంగంగానే అసాంజేను సమర్థిస్తున్నారు. రష్యా కూడా మొదటి నుంచి అసాంజేకు మద్దతునిస్తున్నది. ఆయన బెయిలుకోసం ప్రసిద్ధ దర్శకుడు మైకేల్‌ మూర్‌ జామీను మొత్తం చెల్లించినప్పటికీ ఇంకా విడుదల కాలేదు. అతన్ని స్విట్జర్లాండుకు అప్పగిస్తారన్న సూచనలున్నాయి.

-పీపీ

2000 సంవత్సరం జరిగిన ఎన్నికల్లో బుష్‌ ఫ్లోరిడా రాష్ట్రంలో రిగ్గింగ్‌కు పాల్పడకపోతే గెలిచి ఉండేవాడు కాదని గ్రెగ్‌ పలాస్ట్‌ అనే విలేకరి ఆధారాలతో సహా రుజువు చేశాడు. అయితే ఈ వివరాలను ప్రచురించటానికి అప్పట్లో అమెరికా పత్రికలు గానీ, టీవీలుగానీ ముందుకు రాలేదు. చివరకు ఆయన ఇంగ్లాండ్‌ వచ్చి లండన్‌ పత్రికలకు ఈ విషయాలు వెల్లడించిన తర్వాత గానీ బుష్‌ గుట్టు రట్టు కాలేదు. ఆ తర్వాత కూడా గార్డియన్‌ వంటి పత్రికల ద్వారా పలాస్ట్‌ కృషిపై నీళ్లు పోసేందుకు విశ్వ ప్రయత్నాలు జరిగాయి. చివరకు గత్యంతరం లేని పరిస్థితుల్లో తానే పుస్తకం రాసి అమ్మకానికి అనువైన అతిగొప్ప ప్రజాస్వామ్యం అని ప్రచురించాడు గ్రెగ్‌ పలాస్ట్‌.ఇదే విధమైన పరిస్థితి మంత్లీ రివ్యూ నిర్వాహకులది. అమెరికా ఆర్థిక రాజకీయ వ్యవస్థ విషయంలో నికరమైన శాస్త్రీయ విమర్శకులుగా ఉంది ఈ పత్రిక. కానీ ఈ పత్రిక ప్రభావం, పలుకుబడి పరిమితం కావటంతో ఈ పత్రిక వెల్లడి చేసే విశ్లేషణలు, వాస్తవాలు జనసామాన్యానికి చేరుకునే పరిస్థితి లేదు. దాంతో పత్రిక నిర్వాహకులే ముఖ్యమైన పరిణామాలకు సంబంధించిన వ్యాసాలు పుస్తకాలుగా మార్చి అంతర్జాతీయ మార్కెట్‌లో విడుదల చేస్తున్నారు. తాజా ఉదాహరణ ప్రపంచం ఎదుర్కొంటున్న సంక్షోభానికి సంబంధించినది. మంత్లీ రివ్యూ పత్రికలో 2004 నుండే రానున్న సంక్షోభం గురించి పెద్దఎత్తున హెచ్చరికలు, విశ్లేషణలు వచ్చాయి. కానీ బుష్‌ నేతృత్వంలో సామ్రాజ్యవాదం కిక్కు తలకెక్కించుకున్న అమెరికా పాలకులకు, విధాన నిర్ణేతలు ఈ హెచ్చరికలను పెడచెవిన పెట్టారు. దాంతో సంక్షోభం మొదలైన తర్వాత 2008-2009 మధ్య మంత్లీ రివ్యూ రచయితలు రెండు చిన్న పుస్తకాలు ఈ వ్యాసాలను అచ్చేశారు.

ఈ విషయాలకు, వికీలీక్స్‌కు మధ్య సంబంధం ఏమిటన్న ప్రశ్న పాఠకులకు తలెత్తవచ్చు. ఇది జర్నలిజం వృత్తి నైపుణ్యానికి సంబంధించిన అంశం. దాదాపు శతాబ్ద కాలం క్రితం మీడియా సాధనాలపై గుత్తాధిపత్యం పెరగటం, ఈ గుత్తాధిపత్యం వహిస్తున్న శక్తులకు, ఆయా దేశాల్లోని రాజకీయ ఆర్థిక పెత్తనం చలాయిస్తున్న శక్తులకు మధ్య అవినాభావ సంబంధం ఉండటంతో తాము ఇచ్చే వార్తలు, వెల్లడించే రహస్యాలు నిష్పాక్షికమైనవని మీడియా సంస్థలు రుజువు చేసుకోవాల్సి వచ్చింది. ప్రత్యేకించి ఆర్థిక వ్యవహారాలకు సంబంధించిన పత్రికలు ముందుకు తెచ్చే నూతన ప్రత్యామ్నాయాలు, విధానాల వెనక నిర్దిష్టంగా కొన్ని కంపెనీలకు లాభం చేకూరే అవకాశాలు ఉన్నాయి. ఉదాహరణకు అమెరికాకు చెందిన జనరల్‌ ఎలక్ట్రికల్స్‌, వెస్టింగ్టన్‌ వంటి అణు ఇంధన రియాక్టర్లు తయారు చేసే కంపెనీలకు ప్రపంచవ్యాప్తంగా అణు ఇంధన ఉత్పత్తి ప్రారంభమైతే ప్రయోజనం. వారికి గిరాకి తగులుగుతుంది. అందుకనే స్వచ్ఛమైన ఇంధనం, హరిత ఇంధనం పేరుతో దశాబ్దంన్నరకు పైగా స్వతంత్ర సంస్థల ద్వారా ప్రచారం చేపట్టారు. చివరకు భారతదేశంతో అణు ఇంధన ఒప్పందం కుదుర్చుకున్నారు. అదేవిధంగా అమెరికాకు చెందిన ఎఐజి కంపెనీ. బీమా రంగంలో, పెన్షన్‌ రంగంలో విదేశీ కంపెనీల ప్రవేశానికి అవసరమైన వార్తలు, విశ్లేషణలు వచ్చి, ఈ వార్తలు విశ్లేషణలు మనలాంటి దేశంలో ఏ ప్రణాళికా సంఘాన్నో, ఆర్థిక శాఖలో ఉన్నతాధికారులనో ప్రభావితం చేస్తే ఎఐజి వంటి కంపెనీలు మన దేశంలో యదేచ్ఛగా ప్రవేశించవచ్చు.

ప్రధాన మీడియాకు ప్రత్యామ్నాయం!

గుత్తాధిపతుల ప్రత్యక్ష పరోక్ష ప్రభావాలు ప్రలోభాల వల్ల కనిపించే వాస్తవాలను ప్రజలకు నివేదించడంలో ప్రధాన స్రవంతి మీడియా సాధనాల వైఫల్యం పెద్దఎత్తున కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. ఈ వైఫల్యాన్ని పూరించేందుకు బ్లాగ్‌ల రూపంలో, లాభాపేక్ష ఆశించని ఇంటర్నెట్‌ మీడియా సాధనాల రూపంలో, సోషలిస్టు భావాలు వ్యాప్తి చేసే సాలిడ్‌ నెట్‌ రూపంలో అనేక ప్రత్యామ్నాయ మీడియా సాధనాలు ముందుకొచ్చాయి. ఆ విధంగా తెరమీదకు వచ్చిన వికీలీక్స్‌ కంప్యూటర్‌ ద్వారా రహస్యాలు ఛేదించే ప్రక్రియ హ్యాకింగ్‌ నైపుణ్యంతో వివిధ దేశాల ప్రభుత్వ వ్యవహారాలకు సంబంధించిన సమాచారాన్ని తమ వద్ద నిక్షిప్తం చేయగలిగింది.ఇంటర్నెట్‌ యుగంలో సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చిన సమయంలో సమాచారానికి కొరత లేదు. అయితే ఏ సమాచారం, ఎంత మేర అందుబాటులో ఉండాలి అన్న విషయాన్ని నిర్థారించేది ప్రభుత్వాలు, ప్రభుత్వాలతో కుమ్మక్కైన ఇంటర్నెట్‌ సంస్థలు పారదర్శకత జపం చేస్తూనే తమ పాలకుల వర్గ ప్రయోజనాలకు నష్టం లేని సమాచారాన్ని మాత్రమే అందుబాటులోకి తెస్తాయి. ప్రపంచం ముందుంచుతాయి. ఉగ్రవాదంపై యుద్ధ సమయంలో అమెరికాలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా జరిగిన పరిణామం అదే. ఎంపిక చేయబడిన మీడియా సంస్థల ప్రతినిధులకు ప్రభుత్వమే సమాచారం ఇచ్చి విశ్లేషణలు, వ్యాఖ్యానాలు రాయించటం ద్వారా - కెజి బేసిన్‌ గ్యాస్‌ ధర విషయంలో నీరా రాడియా సూచనల మేరకు వీర్‌సంఘ్వి విశ్లేషణ రాసినట్లు- హాని లేని సమాచారాన్ని మాత్రమే బయటకు వదలటం మీడియా మేనేజ్‌మెంట్‌లో భాగంగా మారింది. ఆంధ్రప్రదేశ్‌లో సంస్కరణలు అమలు జరిగిన సమయంలో 1994-2004 మధ్యకాలంలో ప్రపంచ బ్యాంకు ఎంతవరకు సమాచారం అందుబాటులోకి తెస్తే అంతే సమాచారాన్ని ఢిల్లీ ప్రతికలు యథాతథంగా అచ్చేసేవి. రాష్ట్రంలో ప్రపంచ బ్యాంకు విధానాలకు తీవ్రమైన ప్రతిఘటన వ్యక్తమైన తర్వాత మాత్రమే ప్రపంచ బ్యాంకు విధానాలను ప్రశ్నిస్తూ వచ్చే కథనాలు అది కూడా కొన్ని పత్రికల్లో మాత్రమే అచ్చయిన విషయం పాఠకులకు గుర్తుండే ఉంటుంది.

ఈ విధమైన పరిస్థితిలో ప్రజలు సదరు పత్రికల్లో వచ్చే వార్తలను నమ్మటం సాధ్యం కాదు. దీనికి ప్రత్యామ్నాయంగా వచ్చిందే వృత్తినైపుణ్యం కలిగిన పాత్రికేయత. ఈ తరహా పాత్రికేయత్వంలో రాసే వార్తకు ఎంత ప్రాధాన్యత ఉంటుందో, ఏ సమాచారం ఆధారంగా సదరు వార్త రాస్తున్నామో అన్న విషయానికి కూడా అంతే ప్రాధాన్యత ఉంటుంది. ప్రత్యేకించి పాశ్చాత్య దేశాల్లో దీనికి మరింత ప్రాధాన్యత ఉంటుంది. పై అనుభవాల నేపథ్యంలో అమెరికా మీడియా శక్తి సామర్థ్యాలు అర్థం చేసుకున్న వికీలీక్స్‌ నిర్వాహకులు భిన్నమైన వ్యూహం రూపొందించారు. తమవద్ద ఉన్న రహస్య పత్రాలు, వివిధ దేశాలకు, అమెరికాకు మధ్య ఉన్న సంబంధాన్ని వివరించేవి కావటం వీరికి కలిసి వచ్చిన అంశం. దాంతో లండన్‌, పారిస్‌, బెర్లిన్‌, వాషింగ్టన్‌ల నుండి ఒక్కో పత్రికను ఎంచుకుని తమ వద్ద ఉన్న రహస్యాలను ముందుగా ఆయా పత్రికలకు చేరవేశారు. ఇవన్నీ వృత్తినైపుణ్యం కలిగిన పాత్రికేయుల చేతుల్లోని పత్రికలు. దాదాపు రెండు నెలలుగా శోధించి, సరి చూసుకుని, వికీలీక్స్‌ వద్ద ఉన్న పత్రాలు అసలువా, నకిలీవా అన్న విషయాన్ని రుజువు చేసుకున్న తర్వాతనే ఈ పత్రికలు కొద్ది కొద్ది సమాచారాన్ని ప్రచురించాయి. ఉదాహరణకు న్యూయార్క్‌ టైమ్స్‌, గార్డియన్‌ పత్రికలు వికీలీక్స్‌ ఇచ్చిన సమాచారానికి సంబంధించిన వివరాలు రేఖామాత్రంగా ఇంటర్నెట్‌లో ఉంచారు. ఒకటి రెండురోజుల్లో అది కూడా తీసేశారు. ఈ విధంగా వృత్తినైపుణ్యం పట్ల మక్కువ చేసే సంపన్న దేశాల పాత్రికేయులకు అదే వృత్తినైపుణ్యంతో గుణపాఠం నేర్పింది వికీలీక్స్‌.

వికీలీక్స్‌ ప్రవాహం...

చివరిగా వికీలీక్స్‌ వెల్లడించిన వివరాల గురించి క్లుప్తంగా ప్రస్తావించుకుందాం. ఇప్పటి వరకూ మూడు దఫాలుగా వికీలీక్స్‌ తన వద్ద ఉన్న సమాచారాన్ని వెల్లడించింది. తొలుత ఆఫ్రికా దేశాల్లో మానవ హక్కుల ఉల్లంఘనకు సంబంధించిన వాస్తవాలు వెలుగులోకి తేవటం ద్వారా పాశ్చాత్య ప్రభుత్వేతర సంస్థలు, మీడియాకు దగ్గరైంది. తర్వాతి దశలో ఇరాక్‌ యుద్ధం గురించిన వివరాలు వెల్లడించింది. ఈ వివరాల్లో కొత్తదనం ఏమీ లేకపోయినా తెరవెనుక జరిగిన పరిణామాలు, అమెరికా వివిధ దేశాలను ఏ విధంగా కట్టడి చేసి మరీ యుద్ధంలోకి దించిందన్న విషయాలు తొలిసారిగా వెలుగు చూశాయి. యుద్ధ సమయంలో అమెరికా అనుసరించిన వికృత చేష్టలు, మానవహక్కుల ఉల్లంఘనలు, అబుగ్రాయిబ్‌ వంటి ఉదంతాలు మరికొన్ని ఉన్నాయన్న విషయాన్ని ఈ లీకులు స్పష్టం చేస్తున్నాయి. చివరిది దౌత్య రహస్యాలకు సంబంధించిన లీకులు. సాధారణంగా దౌత్యవేత్తలు, దౌత్య సిబ్బంది తమ మాతృదేశ ప్రయోజనాలకు అవసరమైన సమచారాన్ని సేకరించటానికి వివిధ పద్ధతులు అనుసరిస్తారు. ఈ సమాచారాన్ని నిర్దిష్టంగా రికార్డు చేయాల్సిన బాధ్యత కూడా ఉంటుంది. ఈ రికార్డు చేయాల్సిన అవసరం, ఉన్నత అధికారులకు రిపోర్టు చేయాల్సిన అవసరం నేపథ్యంలోనే మొబైల్‌, కంప్యూటర్‌, ఇంటర్నెట్‌ వంటి సాధనాలను విరివిగా వాడతారు.

ఒకసారి వీటిని హ్యాక్‌ చేస్తే అందులో ఉన్న సమాచారం వరదలా నలువైపులా ప్రవహిస్తుంది. వికీలీక్స్‌ చేసింది కూడా అదే. దేశాల వారీగా ఏయే సమాచారం వెలుగులోకి వచ్చిందన్న విషయాన్ని రోజువారి పత్రికలు కాస్తో కూస్తో రాస్తూనే ఉన్నాయి. విశేషమేమిటంటే ఈ సమాచారానికి, ఆదేశాలకు, వాటి అమలుకు అమెరికాయే కేంద్రంగా ఉంటోందన్న విషయాన్ని ఈ లీకులు ప్రపంచం ముందుంచాయి. వివిధ దేశాలు తీసుకునే విధాన నిర్ణయాల వెనక అమెరికా ఆదేశాలు, దాని ప్రయోజనాలు ఏ విధంగా ఇమిడి ఉంటున్నాయన్న విషయాన్ని తెలుసుకోవటానికి ఈ లీకులు అక్కరకొస్తాయి. ఇటువంటి విషయాలు రెండు మూడు దశాబ్దాల తర్వాత సదరు ప్రభుత్వాలే విడుదల చేస్తాయి. కాస్ట్రోపై ఎన్ని సార్లు హత్యాప్రయత్నం చేసిందన్న విషయాన్ని స్వయంగా సిఐఎ వెల్లడించింది. ఇందిరాగాంధీ పట్ల అమెరికా అవగాహనను కిసింజర్‌ పత్రాల ద్వారా అమెరికా ప్రభుత్వమే వెల్లడించింది. సదరు సమాచారం మూడు నాలుగు దశాబ్దాల తర్వాత వెలుగు చూస్తే దాన్ని విశ్లేషించి అంచనాకు వచ్చే పని పరిమిత సంఖ్యలో ఉన్న చరిత్రకారులు చేస్తారు. దీనికి భిన్నంగా వర్తమాన ప్రపంచం, వర్తమాన జీవితం, దేశాల వర్తమానం గురించిన వాస్తవాలు, రహస్యాలు, కథనాలు ఎప్పటికపుడు వెలుగు చూస్తే సదరు పరిణామాల పట్ల ప్రజలందరూ స్పందిచేందుకు అవకాశం ఉంటుంది. కనీసం ప్రజలు తెలుసుకునేందుకు వీలు కలుగుతుంది.

ఈ విధంగా చూసుకున్నపుడు వికీలీక్స్‌ దౌత్య రహస్యాల వెల్లడి ద్వారా ప్రభుత్వాల గుట్టు రట్టు చేయటం విలక్షణ చర్య అని చెప్పక తప్పదు. తాజా వాస్తవాలు తాజాగా ప్రజలకు చేరిపోతే ప్రభుత్వాలు, పాలకుల తలరాతలు మారిపోతాయి. అందువల్లనే హిల్లరీ క్లింటన్‌ అంతగా గగ్గోలు పెడుతోంది.

ఇంటర్నెట్‌ యుగంలో పారదర్శకత - మీడియా

గతంలో ప్రభుత్వ విధి విధానాలు తెలుసుకోవటం, అవి ఎవరికి ప్రయోజనం ఎవరికి నష్టం అన్న విషయాన్ని గుర్తించటం చాలా శ్రమతో కూడిన పని. వర్థమాన దేశాల్లో మీడియా స్వభావానికి, సంపన్న దేశాల్లో మీడియా స్వభావానికి మధ్య మౌలికమైన వ్యత్యాసం ఉంది. ఏ దేశంలోనైనా మీడియా సంస్థలు ఆయా దేశ ప్రయోజనాల పరిధిలోనే వ్యవహరిస్తూ వచ్చాయి. వర్థమాన దేశాల్లో దేశ విముక్తి కోసం జరుగుతున్న పోరాట నేపథ్యంలో మీడియా సాధనాలు నిర్దిష్ట రూపం తీసుకున్నాయి. అటువంటి వర్థమాన దేశాల్లోనే ప్రభుత్వ నిర్ణయాలను ప్రశ్నించటంలో మీడియా ఎన్నో అవాంతరాలు ఎదుర్కోవాల్సి వచ్చింది. భారతదేశంలో ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌కు ప్రభుత్వానికి 70 దశకంలో జరిగిన వివాదాలు దేశంలో ప్రసారమాధ్యమాల స్వతంత్రతను కాపాడటంలో కీలక సాధనాలుగా మారాయి. ఈ పరిణామం అమెరికా వంటి దేశాల్లో 19వ శతాబ్దం చివర్లోనే పూర్తయ్యింది. పెట్టుబడిదారీ విధానంతో పాటే మీడియా, ప్రభుత్వం మధ్య సంబంధాల్లో కూడా పెద్దఎత్తున మార్పులు వచ్చాయి. 'జాతీయ ప్రయోజనాలు' అన్న ముసుగులో మీడియా సాధనాలు ప్రభుత్వాలను నిలదీయటం ఎప్పుడో మానేశాయి. మీడియా స్వయంప్రతిపత్తి పేరుతో ప్రభుత్వాలు కూడా మీడియా వ్యవహారాల్లో జోక్యం చేసుకోవటం మానేసి మీడియా సంస్థల యజమానులకు కావాల్సినన్ని ప్రయోజనాలు చేకూర్చటం ద్వారా వాటి నోరు మూయించే స్థితి వచ్చింది. దానికి తోడు మీడియా సంస్థల యాజమాన్యం కొన్ని శక్తివంతమైన బహుళజాతి కంపెనీల చేతుల్లోకి మారిపోవటంతో ఒక్కో మీడియా ఒక్కో కంపెనీ ప్రయోజనాల పరిరక్షణకోసం పని చేయటం సంపన్న దేశాల్లో ప్రత్యేకించి అమెరికాలో సర్వసాధారణ అంశంగా మారింది. భారతదేశంలో ఈ పరిణామం ఇంకా అమెరికా స్థాయికి చేరుకోకపోయినా నీరా రాడియా టేపుల వివరాలు పరిశీలిస్తే ఈ క్రమం ప్రారంభమైందన్న విషయం రుజువు అవుతుంది.

ఇటువంటి పరిస్థితుల్లో సాంకేతిక పరిజ్ఞానం, ఇంటర్నెట్‌, దాంతో వచ్చిన మార్పులు, తదనుగుణంగా ప్రభుత్వ పాలనలో కూడా మార్పులు వచ్చాయి. ప్రత్యేకించి 24 గంటలు వార్తలు ప్రసారం చేసే టీవీలు వచ్చాక వార్తలు ప్రజలకు చేరవేసే సాధనాల సామర్థ్యం పెరిగింది. అయినా ప్రధాన స్రవంతికి చెందిన వార్తా సంస్థలు కంపెనీలతోనో, పాలకపార్టీలతో ప్రత్యక్ష అనుబంధం కలిగి ఉండటంతో నిష్పాక్షికమైన వార్తలు ప్రజలకు చేరవేయటంలోనూ, వాస్తవాలు ప్రజలు ముందుంచటంలోనూ సమర్థవంతంగా పని చేయలేకపోతున్నాయి. ప్రత్యేకించి ఈ పరిణామం అమెరికాలో పతాక స్థాయికి చేరుకొంది. ఉగ్రవాదంపై పోరాటం పేరుతో ఇరాక్‌, ఆఫ్ఘనిస్తాన్‌లపై అమెరికా సాగించిన దారుణ మారణకాండ సమయంలో అమెరికా మీడియా ఏకంగా పెంటగాన్‌ అధికార ప్రతినిధిగా వ్యవహరించటంతో ప్రధాన స్రవంతి మీడియా పట్ల ప్రజలకు విశ్వాసం సన్నగిల్లింది. ఈ విషయంపై వ్యాఖ్యానిస్తూ అమెరికాకు చెందిన ప్రముఖ వామపక్ష మేధావి జాన్‌ బెల్లమీ ఫాస్టర్‌ ''సంక్షోభ సమయంలో ప్రజాతంత్ర మీడియా వ్యవస్థ ప్రతి ఘటనకు సంబంధించి విస్పష్టమైన వాస్తవికతను ప్రజల ముందుంచాలి. అధికారంలో ఉన్న వారి చర్యలను, నిర్ణయాలను నిరంతరం తరచి తరచి ప్రశ్నించాలి...దీనికి భిన్నంగా అమెరికాలో జర్నలిస్టు మేధావులు 9/11 నేపథ్యంలో జర్నలిస్టు ప్రమాణాలు పాటించటం వదిలేశారు'' అని విమర్శిస్తాడు.

Monday, December 13, 2010

కాంకున్‌ పర్యావరణ సదస్సులో దేశ ప్రయోజనాలు ఫణంగా పెట్టిన యుపిఎ 2


Published in Prajasakti Business Watch on 13th December 2010
'భారతదేశం విడుదల చేసే కాలుష్యకారకాల్లో సంపూర్ణ నియంత్రణ పాటించేందుకు సిద్ధమ'ని ప్రకటించటం ద్వారా జైరాం రమేష్‌ మరోసారి వివాదానికి తెరతీశారు. కాంకున్‌ బయలు దేరే ముందు జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో ఈ అంశం చర్చకురాలేదు. మిగిలిన దేశాలు ముఖ్యంగా సంపన్న దేశాలు తమ దేశాల్లో కాలుష్య హరణ చర్యలకు సంబంధించి నిర్దిష్ట ప్రతిపాదనలు ముందుకు తెచ్చినపుడే వర్ధమాన దేశాలు ప్రత్యేకించి భారతదేశం ఇవ్వాల్సిన తదుపరి రాయితీల గురించి చర్చించాలని మంత్రివర్గం నిర్ణయించింది. దీనికి భిన్నంగా ప్రధానమంత్రి శుక్రవారం, డిశంబరు10నచేసిన ప్రకటనలో జైరాం ప్రకటనలో అభ్యంతరం ఏమీ ఉండాల్సిన అవసరం లేదన్నారు. దాంతో గత రెండు దశాబ్దాల నుండి భారతదేశం అనుసరిస్తూ వచ్చిన పర్యావరణ విధానానికి లోపాయికారీగా తూట్లు పొడిచారు.

కేంద్ర ప్రభుత్వం అనుకున్నంత పనీ చేసింది. క్రియాశీలకమైన పర్యావరణ శాఖ మంత్రి కాంకున్‌లో భారతదేశ ప్రయోజనాలు, ఆర్థికాభివృద్ధిని ఫణంగా పెట్టారు. వ్రతం చెడ్డా ఫలితం దక్కలేదన్నట్లు వర్ధమాన దేశాల కూటమిలో కీలక బాధ్యతల్లో ఉన్న భారతదేశం కార్బన్‌ విడుదల తగ్గింపు విషయంలో స్వతంత్రంగా పరిమితులు విధించుకుంటామని ప్రకటించినా సంపన్న దేశాలు ముందుకు రాలేదు. దాంతో క్యోటో ఒప్పందం కొనసాగింపు సందేహాస్పదంగా మారింది. ప్రపంచ పర్యావరణ పరిరక్షణకు సంబంధించి ఏయే దేశాలు ఏయే బాధ్యతలు నెరవేర్చాలో నిర్దేశించింది క్యోటో ఒప్పందం. ఈ ఒప్పందం ప్రకారం 2012 నాటికి సంపన్న దేశాలు, పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన దేశాలు (వీటినే ఎనెక్స్‌ 1 దేశాలు అంటారు) ఒక్కో దేశం తాము విడుదల చేసే కర్బన వాయువుల్లో ఎంతమేర తగ్గించాలో నిర్ధారించాయి. ఆర్థికాభివృద్ధికీ, పేదరిక నిర్మూలనకు, కాలుష్యానికి మధ్య ఉన్న అవినాభావ సంబంధం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. పేదరికం తగ్గాలంటే ఉపాధి పెరగాలి.

ఉపాధి పెరగాలంటే పరిశ్రమలు పెట్టాలి. పరిశ్రమలు పని చేస్తే కాలుష్యం పెరుగుతుంది. అయినప్పటికీ వర్ధమాన దేశాలు, వెనకబడిన దేశాలు ఇంకా అభివృద్ధి సాంధించాల్సి ఉన్నందున, కోట్లాదిమంది ఆయా దేశాల్లో పేదరికంలో జీవిస్తున్నందున ఆ దేశాలు విడుదల చేసే కర్బనవాయువుల పరిమాణం, దానిలో కోత గురించి అప్పట్లో చర్చ జరగలేదు. తర్వాత మారిన ప్రపంచ ఆర్థిక చట్రం, ప్రపంచీకరణ నేపథ్యంలో వర్ధమాన దేశాల్లో కొన్ని చైనా, భారతదేశం, బ్రెజిల్‌, దక్షిణ ఆఫ్రికా వంటి దేశాల్లో పారిశ్రామికరంగం గణనీయంగా అభివృద్ధి చెందింది. ఉన్నత స్థాయి వినిమయవాదం కూడా విస్తరించింది. దీంతో ఈ దేశాలు కూడా వాతావరణాన్ని కలుషితం చేయటంలో గణనీయమైన పాత్ర పోషిస్తున్నాయి కనుక ఈ దేశాలు బాధ్యత నెత్తిన వేసుకుంటేనే మిగిలిన దేశాలు ముందుకొస్తాయన్నది అమెరికా, జపాన్‌ వంటి దేశాల వాదన. 2009లో కోపెన్‌హెగన్‌లో జరిగిన చర్చలు ఈ అంశంపైనే అసంపూర్తిగా మిగిలిపోయాయి.

కోపెన్‌హెగన్‌కు ముందే భారతదేశం, చైనా, బ్రెజిల్‌ దేశీయంగా పర్యావరణ పరిరక్షణకు సంబంధించిన అనేక విధి విధానాలు ప్రకటించాయి. భారతదేశంలో యుపిఎ-2 ప్రభుత్వం ఏకంగా 12 మిషన్‌లు ప్రకటించింది. ఇందులో భాగంగా స్వతంత్రంగా కొంతమేర కర్బనవాయువుల పరిమాణం తగ్గిస్తామని కూడా ప్రభుత్వం అప్పట్లో చెప్పింది. దాన్ని వ్యతిరేకించిన ప్రతిపక్షాలకు 2009 డిసెంబరు మొదటివారంలో పార్లమెంటులో సమాధానమిచ్చిన జైరాం రమేష్‌ పార్లమెంటు ప్రతిపాదించిన సూత్రాల మేరకే పర్యావరణ ఒప్పందం ఉంటే సంతకం చేస్తామని, లేదంటే లేదని స్పష్టం చేశారు. ఇదంతా కోపెన్‌హెగన్‌లో మిగిలిన దేశాలతో బేరసారాలు ఆడేందుకేనని నమ్మబలికింది. మనలను చూసి మిగిలిన దేశాలు కూడా ఇదే తరహాలో కొన్ని చర్యలు ప్రతిపాదిస్తే అది మొత్తంగా పర్యావరణ పరిరక్షణకు దోహదం చేస్తుందని ఆశచూపింది.

కోపెన్‌హేగెన్‌లో ఈ విషయంపై చర్చ జరిగిన అన్ని దేశాలు తదుపరి సమావేశం 2010 నాటికి పర్యావరణ పరిరక్షణకు సంబంధించి జాతీయ కార్యాచరణ ప్రణాళికలు రూపొందించాలని ఆదేశించింది. కానీ కీలకమైన కాలుష్యకారకం అమెరికా ఈ విషయంలో స్వతంత్ర విధాన ప్రకటన ఏమీ చేయలేకపోయింది. దిగువనున్న పట్టికలోని వివరాలు సంపన్నదేశాలు పర్యావరణ పరిరక్షణ దిశగా దేశీయ విధానాలు రూపొందించడంలో, అమలు చేయడంలో విఫలమయ్యాయని స్పష్టం చేస్తున్నాయి. హరిత ఇంధనం బిల్లు పేరుతో ఆర్భాటంగా ఒబామా ప్రతిపాదించిన బిల్లు అమెరికా పార్లమెంట్‌ ఎగువసభలో చిక్కుకుపోయింది. ఇపుడు దిగువ సభలో సైతం రిపబ్లికన్లు మెజారిటీ సాధించారు. ఇకపై ఆ బిల్లు ఆమోదం పొందటం సాధ్యం కాదు.

కానీ కాంకున్‌ సమావేశాల్లో ప్రభుత్వం వైఖరి దీనికి పూర్తిగా భిన్నంగా ఉంది. రెండు వారాలు జరిగే ఈ సమావేశాల్లో మొదటి వారం పది రోజుల్లో అధికారులు, సాంకేతిక నిపుణులు మేథోమదనం చేసి ప్రభుత్వాధినేతల ముందు ఒక ప్రతిపాదన పెట్టాలి. తర్వాత దశలో మూడునాలుగు రోజులు పర్యావరణ మంత్రులు ఈ ప్రతిపాదనలు జాతీయ ప్రయోజనాలకు అనుగుణంగా ఉన్నాయా లేదా అన్న విషయాన్ని పరిశీలించుకుని తుది ముసాయిదాను ముందుకు తెస్తారు. అప్పుడు గానీ దేశాధినేతలు ఈ ఒప్పందాన్ని ఆమోదిస్తూ తీర్మానిస్తారు. అయితే గత రెండు దఫాలుగా జరిగినట్లే అధికారులు, సాంకేతికనిపుణుల స్థాయిలోనే ఉమ్మడి ప్రతిపాదనలపై అంగీకారం కుదరలేదు. డిశంబరు 4న కాంకున్‌ బయలు దేరటానికి ముందే ఢిల్లీలో ఒక విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ కేంద్ర పర్యావరణ మంత్రి జైరాం రమేష్‌ దేశీయంగా తాము తీసుకున్న కాలుష్యహరణ చర్యల అమలుపై అంతర్జాతీయ పర్యవేక్షణ జరుపుకోవచ్చని ప్రకటించి తొలి వివాదానికి తెరతీశారు. ఇప్పటి వరకూ ఒక ప్రభుత్వం తీసుకునే జాతీయ నిర్ణయాలను మరో ప్రభుత్వం, అంతర్జాతీయ సంస్థ మదింపు చేయకూడదన్నది ప్రామాణిక వైఖరిగా ఉంది.

ఈ వైఖరి నుండి తొలిసారిగా భారత్‌ వైదొలగింది. ఇప్పుడు కూడా బేరసారాలు ఆడేందుకే అని చెప్పినా వర్ధమాన దేశాల కూటమికి నాయకత్వం వహిస్తున్న బేసిక్స్‌ (బ్రెజిల్‌, భారత్‌, దక్షిణ ఆఫ్రికా, చైనా)లోని మూడు దేశాలూ ఈ ప్రతిపాదనను వ్యతిరేకించాయి. కాంకున్‌లో డిశంబరు 8వ తేదీన బేసిక్స్‌ సమావేశం నుండి బయటకు వచ్చిన జైరాం రమేష్‌ తన ప్రతిపాదనను మిగిలిన దేశాలు అంగీకరించటం లేదని ప్రకటించారు. మరుసటి రోజే 'భారతదేశం విడుదల చేసే కాలుష్యకారకాల్లో సంపూర్ణ నియంత్రణ పాటించేందుకు సిద్ధమ'ని ప్రకటించటం ద్వారా జైరాం రమేష్‌ మరోసారి వివాదానికి తెరతీశారు. కాంకున్‌ బయలు దేరే ముందు జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో ఈ అంశం చర్చకురాలేదు. మిగిలిన దేశాలు ముఖ్యంగా సంపన్న దేశాలు తమ దేశాల్లో కాలుష్య హరణ చర్యలకు సంబంధించి నిర్దిష్ట ప్రతిపాదనలు ముందుకు తెచ్చినపుడే వర్ధమాన దేశాలు ప్రత్యేకించి భారతదేశం ఇవ్వాల్సిన తదుపరి రాయితీల గురించి చర్చించాలని మంత్రివర్గం నిర్ణయించింది. దీనికి భిన్నంగా ప్రధానమంత్రి శుక్రవారం, డిశంబరు10నచేసిన ప్రకటనలో జైరాం ప్రకటనలో అభ్యంతరం ఏమీ ఉండాల్సిన అవసరం లేదన్నారు.దాంతో గత రెండు దశాబ్దాల నుండి భారతదేశం అనుసరిస్తూ వచ్చిన పర్యావరణ విధానానికి లోపాయికారీగా తూట్లు పొడిచారు.

అంతేకాదు. పర్యావరణ పరిరక్షణకు ప్రధాన బాధ్యత తమపై మోపిన క్యోటో ఒప్పందాన్ని సమూలంగా రద్దు చేయాలని, దాని స్థానంలో కొత్త ఒప్పందాన్ని తెరమీదకు తేవాలని సంపన్నదేశాలు నడుం కట్టాయి. కాంకున్‌లో బేసిక్స్‌ దేశాలు కూడా ఈ బాధ్యత తీసుకోకపోతే తాను సమావేశాల నుండి వైదొలుగుతానని బెదిరించాయి. దీనికి తోడు కాంకున్‌ సమావేశాలు మరో మూడు రోజుల్లో ముగుస్తాయనగా గతంలో అమెరికా తరపున చర్చల్లో పాల్గొన్న అధికారులందరూ కాంకున్‌ చర్చలు విఫలం కానున్నాయని ఇంటర్వూలు ఇవ్వటం ద్వారా అటు ఆతిథ్య దేశం, ఇటుచిన్న చిన్న దీవుల వంటి దేశాలకు ఆందోళన కలిగించాయి. ఈ పరిస్థితుల్లో జైరాం రమేష్‌ చేసిన ప్రకటన కేవలం చర్చలను బతికించటానికే అనుకున్నా ఈ ఉడత ఊపులకు అమెరికా గానీ,జపాన్‌ గానీ దిగొచ్చింది లేదు. క్యోటో ఒప్పందంలో మరో కీలక అంశం ఉంది.

అది తరతమ స్థాయిలో ఉమ్మడి బాధ్యతకు సంబంధించినది. పర్యావరణ పరిరక్షణ ఉమ్మడి కర్తవ్యం. పర్యావరణానికి తరతమ స్థాయిలో హాని కలిగిస్తున్న దేశాలు అదే స్థాయిలో పరిరక్షణకు చర్యలు చేపట్టాలన్నది క్యోటో ఒప్పందం సారాంశం. అన్ని దేశాలూ కర్బనవాయువుల విడుదలల నియంత్రణకు నిర్దిష్ట చర్యలు తీసుకోవాలన్న ప్రతిపాదన ముందుకు తేవటం ద్వారా అమెరికా, జపాన్‌ వంటి ప్రధాన కాలుష్యకారక దేశాలు కోరుకుంటున్న అంశాన్నే జైరాం రమేష్‌ భారత ప్రభుత్వ ప్రతిపాదన రూపంలో చర్చకు పెట్టాడు. ఈ ప్రతిపాదన అంగీకరించటం అంటే క్యోటో స్థానంలో నూతన ఒప్పందాన్ని, ఈ బాధ్యత అన్ని దేశాలకూ సమానంగా పంపిణీ చేసే ఒప్పందాన్ని అమల్లోకి తేవటమే. అందువల్లనే మిగిలిన వర్ధమాన దేశాల నుండి ఈ ప్రతిపాదన పట్ల తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అయ్యింది. ఈ వ్యాసం పూర్తిచేసే సమాయానికి కాంకున్‌ సమావేశం ఇంకా తుది తీర్మానం పై అంగీకారానికి రాలేదు.

కాంకున్‌ తీర్మానం సంగతి ఎలా ఉన్నా భారతదేశం మాత్రం సామ్రాజ్యవాద దేశాల పంచన చేరి, వర్ధమాన దేశాల అభివృద్ధితో సహా జాతీయ ఆర్థికాభివృధ్ధిని కాంకున్‌లో ఫణంగా పెట్టింది. ఇటువంటి విషయాలు బయటకు పొక్కుతాయన్న ఉద్దేశ్యంతోనే పార్లమెంటరీ ప్రతినిధి బృందాన్ని కాంకున్‌ చేరనీయకుండా మరీ పర్యావరణ శాఖ, ప్రధాని కార్యాలయం మోకాలడ్డాయి. ఏతావాతా పర్యావరణ పరిరక్షణ విషయంలో జైరాం రమేష్‌, ప్రధాని వైఖరి కాకులను కొట్టి గద్దలకు వేయటం అన్న చందంగా మారింది. పివి నరసింహారావు ప్రభుత్వం గాట్‌ ఒప్పందంపై సంతకం చేయటంతో తర్వాత వచ్చిన ప్రభుత్వాలు సైతం ఇష్టాయిష్టాలతో నిమిత్తం లేకుండా ప్రపంచ వాణిజ్య సంస్థలో భాగస్వాములు కావాల్సి వచ్చినట్లే జైరాం రమేష్‌ నేడు తీసుకున్న ఈ నిర్ణయం రానున్న ప్రభుత్వాల మెడకు గుదిబండగా మారనుంది.

కొండూరి వీరయ్య

Tuesday, December 7, 2010

ఆర్థిక సంక్షోభం: కరెన్సీ యుద్ధాలు

మార్క్సిస్టు Sun, 5 Dec 2010

అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థలో కరెన్సీ యుద్ధం తాజా చర్చనీయాంశంగా మారింది. సంపన్న దేశాలు ప్రత్యేకించి అమెరికా తన కరెన్సీ, డాలర్‌ విలువను కృత్రిమంగా తగ్గించ టం ద్వారా ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై కరెన్సీ యుద్ధం ప్రకటిస్తోందని అక్టోబరులో బ్రెజిల్‌ ఆర్థిక మంత్రి గిడో మాంటెగా విమర్శించటంతో ఈ అంశం ప్రపంచం దృష్టిని ఆక్రమించింది. గత సంవత్సర కాలంగా జి20 దేశాల మధ్య అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థకు సంబంధించిన పలు కీలక అంశాల మధ్య ఏకాభిప్రాయం సాధ్యం కావటం లేదు. తాజాగా జరిగిన సియోల్‌ శిఖరాగ్ర సదస్సు కూడా వైఫల్యంతోనే ముగిసింది. వీటన్నింటికీ మూలం అమెరికా, చైనాల మధ్య కరెన్సీ విలువ గురించిన వైరు ధ్యమే. అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ విడుదల చేసిన వార్షిక నివేదికలో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఎదుర్కొంటున్న కొత్త సమస్య కరెన్సీ యుద్ధాలు అని ప్రకటించటం ద్వారా ఈ అంశం రాజకీయ ఆర్థిక చర్చల్లో కీలక స్థానం ఆక్రమించింది.

కరెన్సీ యుద్ధం అంటే ఏమిటి ?

అంతర్జాతీయ వాణిజ్యం అనేది అంతర్జా తీయ ఆర్థిక వ్యవస్థలో అంతర్భాగం. ఈ వాణి జ్యంలో ఏ దేశమైనా తన ఉత్పత్తులు అమ్ము కోవాలంటే అనేక మార్గాలు అవలంబిస్తుంది. అత్యున్నత సాంకేతిక పరిజ్ఞానంతో ఉత్పత్తులు తయారు చేయటం మొదలు సరుకులు ఎగుమతి చేయటం, పెట్టుబడులు ఎగుమతి చేయటం వంటి అనేక మార్గాలు అమల్లో ఉంటాయి. పెట్టుబడులు తరలించి వస్తువులు, సేవలు దిగుమతి చేసుకుంటే దాన్ని ఔట్‌సోర్సింగ్‌ అంటున్నాము. దానికి బదులు వస్తువులు సేవలు ఎగుమతిచేయాలంటే ఆ దేశపు ఉత్పత్తులు అంతర్జాతీయ మార్కెట్‌లో చౌకగా ఉండాలి. అపుడే అమ్ముడవుతాయి. ఉత్పత్తయ్యే వస్తువులు, సేవల విలువ తక్కువగా ఉండాలంటే ప్రభు త్వాలు ఉత్పత్తికి కీలకమైన పెట్టుబడి, శ్రమ శక్తి విలువ తగ్గించాలి. పన్నుల రాయితీలు, ప్రభుత్వమే మౌలిక వసతుల రంగాన్ని నిర్మించి సిద్ధం చేసి ఉంచటం, బడ్జెట్‌ ప్రతిపాదనల్లో టాక్స్‌ హాలిడేస్‌ వంటి రూపాల్లో పెట్టుబడి విలువ తగ్గించవచ్చు. దేశీయంగా శ్రమశక్తి విలువ తగ్గించాలంటే ఏకైక మార్గం సంక్షేమ ఆర్థిక విధానాలు అవలంబించటమే. తద్వారా శ్రమశక్తి పునరుత్పత్తికి అవసరమైన వ్యయాన్ని తగ్గించ వచ్చు. నయాదారవాద సిద్ధాంతాలు తలకెక్కిన ప్రభుత్వాలు దీనికి సిద్ధపడవు. మరో మార్గం అంతర్జాతీయ వాణిజ్య సాధనంగా ఉన్న కరెన్సీ విలువను తగ్గించుకోవటం. అంతర్జా తీయ కరెన్సీ మార్కెట్‌ పరస్పరాధారితం. అంత ర్జాతీయ రిజర్వు కరెన్సీ హౌదా కలిగిన కరెన్సీతోపాటు అటువంటి హౌదా లేని కరెన్సీల మధ్య సంబంధాలు పరస్పరం విలోమాను పాతంలో ఉంటాయి. అంటే రిజర్వు కరెన్సీ విలువ పెరిగితే మిగిలిన కరెన్సీల విలువ తగ్గు తుంది. అంతర్జాతీయ మార్కెట్‌లో కరెన్సీల మధ్య సంబంధాలు ఆయా దేశాల ఆర్థిక ద్రవ్య విధా నాల నేపథ్యంలో నిర్దిష్ట నిష్పత్తిని పాటిస్తున్నపుడే మార్కెట్‌ సమతూకం కొనసాగుతుంది. అలాకాక ఏవైనా కొన్ని దేశాలు కృత్రిమ చర్యల ద్వారా తమ కరెన్సీ విలువలను అంతర్జాతీయ మార్కెట్‌ లో తక్కువ చేసి ఉంచటానికి పోటీ పడితే అంత ర్జాతీయ వాణిజ్య మార్కెట్‌లో సమతౌల్యం దెబ్బ తింటుంది. ఇటువంటి పరిస్థితిని కరెన్సీ యుద్ధా లు అంటారు.

ఎందువల్ల ఈ పరిస్థితి తలెత్తుతుంది?

ఏ దేశ ఆర్థిక వ్యవస్థ అయినా జాతీయంగా అంతర్జాతీయంగా రాణించాలంటే ఉత్పత్తి సామర్థ్యం పెంచుకోవటంతో పాటు విదేశీ వాణి జ్యంలో ఆధిపత్య స్థానం కలిగి ఉండాలి. వాణి జ్యంలో ఆధిపత్య స్థానం ఉండాలంటే ఉత్పత్తి లోనూ అదే ధోరణితో ఉండాలి. ఉత్పత్తికి అవ సరమైన రెండు కీలక సాధనాలు పెట్టుబడి, శ్రమశక్తికి చేతి నిండా పని కల్పించగల స్థాయి లో ఉండాలి. అదేసమయంలో మిగిలిన దేశాల ఉత్పత్తులతో విలువలోనూ, నాణ్యత లోనూ పోటీ పడి మార్కెట్‌ స్థానాన్ని నిలుపుకోగలిగి ఉండాలి. ఏ దేశంలోనైనా పెట్టుబడిని ఉత్పత్తికి వినియోగించడం లేదు అంటే పెట్టుబడికి తగిన లాభం రావట్లేదని అర్థం. అటువంటి పరిస్థితుల్లో పెట్టుబడులు రూపాంతరం చెంది విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు,(ఎఫ్‌డిఐ) సంస్థాగత పెట్టుబడులు (ఎఫ్‌ఐఐ) దాతృత్వపు పెట్టుబడులు ( యుఎస్‌ ఎయిడ్స్‌, డిఎఫ్‌ఐడి, జపాన్‌ సహకార బ్యాంకు వంటివి) రూపంలో మిగిలిన దేశాలకు వలస వెళ్తాయి. శ్రమశక్తిని ఆ విధంగా ఎగుమతి చేయ టం సాధ్యం కాదు కనుక దేశీయంగానే ఉపయోగించుకోవాలి. అలా ఉపయోగించుకోలేని పరిస్థితుల్లో పెద్దఎత్తున మార్కెట్‌ను కబ్జా చేయటం ద్వారా భారీ ఉత్పత్తితో ఉత్పత్తులకయ్యే ఖర్చు పాక్షికంగా తగ్గించుకోవచ్చు. దేశీయంగా జరిగే ఈ పరిణామాన్ని ఉత్పాదక పెరుగుదల అంటారు. శ్రమశక్తికి విలువ తగ్గించటం ఉత్పాదక పెంచటంలో అనివార్యమైన అంత ర్భాగం. సాంకేతిక పరిజ్ఞానంపై పెట్టుబడులు పెంచటం ద్వారా, ఉత్పత్తిని ముక్కలు ముక్కలు చేసి అసంఘటిత రంగానికి బదిలీ చేయటం ద్వారా దీన్ని సాధించవచ్చు. ఈ ప్రక్రియకు కూడా పరిమితులు ఉంటాయని తాజా ప్రపంచ ఆర్థిక వ్యవస్థ గమనం రుజువు చేస్తోంది.

దేశీయంగా ఉన్న ఈ సాధనాల నిడివి పరిమితం అయినది. ఒకదశ తర్వాత పునరు త్పత్తి స్థాయికంటే దిగువన వేతన మార్కెట్‌ను కొనసాగించటం సాధ్యం కాదు. అటువంటప్పుడు అంతర్జాతీయ మార్కెట్‌లో మరింత వాటా కోసం దేశాలు పాకులాడతాయి.1940 దశకా నికి ముందు ఇటువంటి పాకులాటలు యుద్ధా లతో ముగిసేవి. రెండో ప్రపంచ యుద్ధానికి ముందు ఇటువంటి పోటీ తలెత్తితే యుద్ధం ద్వారా పరిష్కరించుకున్న సామ్రాజ్యవాద దేశా లు ఈ యుద్ధంలో వచ్చిన అనుభవాలతో గత ఐదు దశాబ్దాలుగా ఇచ్చి పుచ్చుకునే ధోరణితో పోటీని పరిష్కరించుకుంటున్నాయి. ఈ ప్రయ త్నాల సారాంశం తన ఆధిపత్యాన్ని కాపాడు కోవటం, ఆధిపత్యానికి మూలమైన రాజకీయ పట్టును నిలిపి ఉంచుకునేందుకు అవసరమైన ఉపాధి కల్పన, జీవన ప్రమాణాలు పెంచటమే. ప్రపంచ వాణిజ్య సంస్థ ఇటువంటి ఇచ్చి పుచ్చుకునే ఒప్పందాలకు ముఖ్యమైన వేదికగా ఆవిర్భవించింది. ఈ కాలంలోనే వస్తూత్పత్తి రంగం తన పునాదిని ఒకదేశం నుండి మరో దేశానికి బదిలీ చేయటంతో పాటు ఒకప్పుడు బలమైన ఉత్పాదక వ్యవస్థలు కలిగిన దేశాలు నేడు ప్రధాన దిగుమతి దారులుగా మారటంతో అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థలో మౌలికమైన వ్యవస్థాగత మార్పులు, మారుతున్న భౌగోళిక కేంద్రీకరణకు తెరతీశాయి. దాంతో రెండో ప్రపంచయుద్ధకాలం వరకూ ప్రధాన దిగుమతి దారులుగా ఉన్న ఆసియా దేశాలు గత మూడు దశాబ్దాలుగా ఎగుమతి మార్కెట్‌లో కీలక స్థానంలోకి ప్రవేశించాయి. అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థలో ఒక దేశం అనుభవించే నష్టాలు కష్టాలు మరో దేశానికి లాభాలు వరాలుగా మారతాయి. ఈ మార్పుల్లో భాగంగా నేడు సంపన్న దేశాలుగా చెప్పబడుతున్న మాజీ సామ్రాజ్యవాద దేశాలకు పరిమితమైన ఉత్పాదక శక్తుల అభివృద్ధి, 60 దశకం తర్వాత ప్రపంచ వ్యాప్తంగా పుంజుకోవటం, మహా మాంద్యం నేపథ్యంలో అమెరికా అనుసరించిన సంక్షేమ విధానాలు చరమాంకానికి చేరటం వంటి పరిస్థితుల్లో అమెరికాలో నిరుద్యోగం, ద్రవ్యోల్బణం, మాంద్యం పరిస్థితులు తలెత్తాయి. ఈ నేపథ్యంలో ఎవరు కీలకమైన ఎగుమతి దారులుగా ఉంటారో ఆ దేశం మిగిలిన దేశాలు అనుసరించాల్సిన ఆర్థిక విధానాలను ప్రత్యక్షం గానో, పరోక్షంగానో నిర్దేశించటం ఆనవాయితీగా వస్తోంది. సామ్రాజ్యవాద ప్రపంచీకరణ విధా నాల రూపంలో మనం ఈ మార్పులు చూస్తు న్నాము. అంతర్జాతీయంగా ఈ పరిణామాలు చోటుచేసుకునే సమయంలో దేశీయంగా పరిణామాలు ప్రతికూల ప్రభావాలు చూపి స్తాయి. అదేవిధమైన పరిస్థితిని నేడు అమెరికా ఎదుర్కొంటోంది. ఒకప్పుడు ప్రపంచ దేశాలకు వస్తువులు, సేవలు, సాంకేతిక పరిజ్ఞా నం,పెట్టుబడులు ఎగుమతి చేసిన అమెరికా నేడు వస్తువులు సేవల విషయంలో ప్రధాన దిగుమతి దారుగా మారింది. దాంతో పాటే ఆ దేశ ఉత్పత్తి వ్యవస్థలు చితికిపోయాయి. లక్షల కోట్ల డాలర్ల అదనపు పెట్టుబడులు కంపెనీల ఖాతాల్లో మూలుగుతున్నాయి. అయినా పెట్టుబడులు పెట్టేందుకు కంపెనీ యజమానులు సిద్ధంగా లేరు. అటువంటి పరిస్థితుల్లో ఇతర దేశాలు అంతర్జాతీయ వాణిజ్యంలో తన స్థానాన్ని కోల్పో తే తప్ప అమెరికా వాటా పెరగదు. ఇపుడున్న పరిస్థితుల్లో ఉన్న ఫళంగా చితికిపోయిన ఉత్పాదక వ్యవస్థలను దారికి తేవటం సాధ్యం కాని పని. దాంతో కరెన్సీ విలువను తారు మారు చేయటం ద్వారా తన పూర్వపు స్థానాన్ని సంపా దించాలని అమెరికా ప్రయత్నిస్తోంది. అందువల్లనే కీలకమైన దేశాల మధ్య కరెన్సీ యుద్ధాలు చోటుచేసుకునే పరిస్థితి వచ్చింది. అమెరికా వాణిజ్యంలో తన వాటా పెంచు కోవాలంటే అంతర్జాతీయ మార్కెట్‌లో కీలకమైన వాటాదారులు తమ దేశాల మారక ద్రవ్యం విలువ పెంచటం ద్వారా తమ ఉత్పత్తుల విలువ కృత్రిమంగా పెంచాలి. అలా చేయటం ఆయా దేశాల్లో ఉత్పాదక వ్యవస్థలపై ప్రతికూల ప్రభా వం చూపించనుంది. నిరుద్యోగం పెరగటం, అది రాజకీయ అస్థిరతకు దారితీయటం వంటి సమాంతర ధోరణులుకూడా వ్యక్తమయ్యే అవకాశం ఉంది. అందువల్లనే మిగలిన దేశాలు అమెరికా ప్రతిపాదించిన ఈ పరిష్కారాన్ని వ్యతిరేకిస్తున్నాయి. దీన్నే కరెన్సీ యుద్ధమని ఆర్థిక వేత్తలు ప్రకటిస్తున్నారు.

చరిత్ర ఏమి చెప్తోంది?

పెట్టుబడిదారీ విధానం వాణిజ్య పెట్టుబడి దారీ విధానం నుండి సంపూర్ణ పెట్టుబడిదారీ విధానంగా పరిణామం చెందే క్రమంలో ఆధి పత్యం కలిగిన దేశాల అవసరాలకు అనుగు ణంగా కరెన్సీ విలువలు నిర్ధారితమయ్యేవి. 18వ శతాబ్దం వరకూ దేశాల మధ్య జరిగే వాణిజ్యం విలువ నామమాత్రంగానే ఉండేది. దాంతో కరెన్సీ మారకం విలువలు అప్పట్లో సమస్యగా కనిపించలేదు. 19వ శతాబ్దంలో బ్రిటన్‌, ఫ్రాన్స్‌ల మధ్య జరిగిన సుదీర్ఘ యుద్ధాల సమ యంలో ఫ్రెంచి కరెన్సీ విలువను ఉద్దేశ్యపూర్వ కంగా తగ్గించినట్లు ఆర్థిక చరిత్రకారులు స్పష్టం చేశారు. పెట్టుబడిదారీ విధానం సామ్రాజ్య వాదం స్థాయికి చేరుకుని, నేటి వర్ధమాన దేశాలను వలసలుగా మార్చుకున్న కాలంలో తమ వాణిజ్యోత్పత్తుల మార్కెట్‌ కోసం పోటీ పడ్డాయి. అయితే ఈ పోటీ కరెన్సీ విలువల తారుమారు స్థాయికి చేరుకోలేదు. వలసపాలన దశలో మార్కెట్‌ ఆధిపత్యం సాధించే మర్గాలు వేరుగా ఉండేవి. భారతదేశంలో ఫ్రెంచి, డచ్‌, బ్రిటిష్‌ కంపెనీల మధ్య జరిగిన ఘర్షణల చరిత్ర ఈ విషయాన్ని రుజువు చేస్తోంది. వలస పాలన కాలంలో బ్రిటిష్‌ ప్రభుత్వ వాణిజ్య, రాజకీయ అవసరాల మేరకు భారతదేశ రూపాయి విలువ ఉండాలని కీన్స్‌ ప్రతిపాదిస్తే అంబేద్కర్‌ దీనికి భిన్నమైన ప్రతిపాదనలు చేశారు.

మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత బ్రిటన్‌ దఫ దఫాలుగా పౌండ్‌ మారకం రేటును మార్చటం, చివరకు బంగారం రిజర్వు కరెన్సీగా అంగీకరించకపోవటంతో తొలిసారిగా బహుళ కరెన్సీలు అంతర్జాతీయ మార్కెట్‌లో ఒకే సమ యంలో వేర్వేరు నిర్దిష్ట విలువలతో చలామణి అయ్యేందుకు అవకాశం వచ్చింది. రెండో ప్రపంచ యుద్ధానికి ముందు జర్మనీ, బ్రిటన్‌లు మరోసారి బంగారాన్ని రిజర్వు కరెన్సీగా అంగీక రించబోమని ప్రకటించాయి. ప్రత్యేకించి 1929 నాటి మహామాంద్యం అంతర్జాతీయ ఆర్థిక వ్యవ స్థలో కరెన్సీ విలువల ప్రాధాన్యతను పెంచింది. పైనచెప్పుకున్నట్లు ఆర్థిక వ్యవస్థల్లోని మిగిలిన సాధనాలు విఫలమైనప్పుడు ఆర్థిక పరిశోధకులు ఈ అంశంపై దృష్టి సారించారు. మారుతున్న అంతర్జాతీయ రాజకీయ వాతావరణంలో ఈ సాధనం ప్రయోజనకరమైనదిగా మారటంతో ప్రభుత్వాలు తక్షణమే స్వంతం చేసుకున్నాయి. మొదటి ప్రపంచ యుద్ధ కాలంలో వచ్చిన నష్టాలను పూడ్చుకుని వలసలకు ఎగుమతులు ముమ్మరం చేసేందుకు బ్రిటన్‌ పౌండ్‌ విలువ తగ్గించింది. మహా మాంద్యం కాలంలో అన్ని దేశాల్లో నిరుద్యోగం, ఉత్పత్తి పతనం, లాభాల పతనం వంటి పరిణామాలు చోటు చేసుకు న్నాయి. దాంతో ఏ దేశానికి ఆ దేశం ఈ సమస్యల నుండి బయటపడటానికి అంతర్జాతీయ మార్కెట్‌లో తమ దేశంలో ఉత్పత్తి అయ్యే మరిన్ని సరుకులను కుమ్మరించటమే పరిష్కారమనీ, అందుకు కరెన్సీ విలువ తగ్గించటం సాధనమన్న నిర్ధారణకు వచ్చాయి. జర్మనీలో నెలకొన్న ఆర్థిక స్తబ్దత నుండి బయట పడి, పెరుగుతున్న నిరుద్యోగాన్ని పరిష్కరించుకునేందుకు జర్మనీ మార్క్‌ విలువలో కోత విధించింది. తద్వారా రెండో ప్రపంచ యుద్ధానికి ముందు జర్మనీ, ఇంగ్లాండ్‌లలో పారిశ్రామికోత్పత్తి రేటు పెరిగిం దని చరిత్ర చెప్తోంది.

రెండు ప్రపంచ యుద్ధాల నడుమగల కాలంలో బ్రిటన్‌ అనుసరించిన పద్ధతినే నేడు అమెరికా అనుసరించబూనుకొంటోంది. రెండో ప్రపంచ యుద్ధం తర్వాతి కాలంలో యూరోపి యన్‌ ఆర్థిక వ్యవస్థ యుద్ధ పదఘట్టనల నడుమ చచ్చుపడి పోయింది. దాంతో సత్వరం కోలుకోవ టానికి అవసరమైన వస్తువులు, సేవలు ఉత్పత్తి చేసే సామర్థ్యం దానికి లేకపోయింది. దాంతో తక్కువ నష్టంతో బయటపడ్ద అమెరికా ఈ బాధ్యత నెత్తిన వేసుకుంది. ఒకవైపు యూరో పియన్‌ మార్కెట్‌కు అవరసరమైన వస్తువులు, సేవలు ఉత్పత్తి చేసి ఎగుమతి చేయటంతోపాటు దీర్ఘకాలంలో పెట్టుబడులు ఎగుమతి చేయటం ద్వారా అమెరికాలో ఉపాధి అవకాశాలు విపరీ తంగా పెంచుకోగలిగింది. ఈ సమయంలో మిగిలిన దేశాలు తమ దేశాల కరెన్సీ విలువ లను తారుమారు చేయకుండా చూసేందుకు బ్రెటన్‌వుడ్స్‌ యంత్రాంగం కీలక సాధనంగా పని చేసింది. రెండో ప్రపంచ యుద్ధం ముగింపు సమయంలో తెరమీదకు వచ్చిన అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ నిర్మాణానికి అమెరికాలోని బ్రెటన్‌ వుడ్స్‌లో జరిగిన సమావేశం పునాదులు వేయ టంతో ఈ వ్యవస్థను బ్రెటన్‌ వుడ్స్‌ యంత్రాంగం అంటున్నారు. యుద్ధంలో చితికిపోయిన వివిధ దేశాల ఆర్థిక వ్యవస్థలను పునర్నిర్మించటానికి ప్రపంచ బ్యాంకూ, అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ లో కరెన్సీ నిల్వలు, రిజర్వు కరెన్సీ, వాణిజ్యం వంటి విషయాలు పర్యవేక్షించటానికి అంతర్జా తీయ ద్రవ్య నిధి సంస్థా ఈ బ్రెటన్‌ వుడ్స్‌ పునాదులపై పుట్టుకొచ్చినవే. ఈ యంత్రాంగం ఏ దేశ ద్రవ్యానికి ఎంత మారకం రేటు ఉండాలన్న విషయాన్ని నిర్ధారించి అన్ని దేశాల కరెన్సీలను బంగారం విలువతో ముడిపెట్టారు. ఈ వ్యవస్థ రెండున్నర దశాబ్దాల పాటు సజా వుగానే పనిచేసింది.

ఈ కాలంలో వివిధ దేశాలు తమ కరెన్సీ విలువలను వివిధ స్థాయిల్లో తగ్గించినా అన్ని దేశాలూ సామూహికంగా ఈ పనికి పాల్పడ లేదు. ఒక దేశం ఈ నిర్ణయం తీసుకున్నపుడు మిగిలిన దేశాలు సమర్థిస్తూ వచ్చాయి. ఎక్కువ సందర్భాల్లో అంతర్జాతీయ ద్రవ్య వ్యవస్థల సమతౌల్యం కాపాడే బాధ్యత నెత్తిన వేసుకున్న ఐఎంఎఫ్‌ ఆదేశాలతోనే దేశాల కరెన్సీ విలువలు తగ్గాయి. భారతదేశమే దీనికి ఉదాహరణ. 1982-83లో తొలిసారి ఐఎంఎఫ్‌ వద్ద అప్పు కు వెళ్లినపుడు డాలర్‌తో పోల్చి రూపాయి మారకం విలువ తగ్గింది. తర్వాత 1991లో మరో దఫా అప్పుకు వెళ్లినపుడు కూడా ఇదే పరిణామం చోటుచేసుకుంది. 1989 నాటికి డాలరు విలువ సుమారు 17 రూపాయలు ఉంటే 1991 నాటికి అది 35 రూపాయలకు చేరింది. 1970 దశకం నాటికి ప్రపంచ వ్యాప్తం గా ఉత్పాదక వ్యవస్థలు నిర్ణీత స్థాయికి చేరాయి. దాంతో అమెరికా సరుకులతో పాటు మిగిలిన దేశాల సరుకుల అంతర్జాతీయ మార్కెట్‌లో పోటీ పడే స్థితి వచ్చింది. ఈ పరిస్థితి నుండి బయట పడి తన ఆధిపత్యాన్ని కాపాడుకోవటానికి నిక్సన్‌ హయాంలో డాలరు-బంగారం విలువల మధ్య సమతౌల్యాన్ని తారుమారు చేసింది అమెరికా. అప్పట్లో సోషలిష్టు దేశాలతో జరుగుతున్న ప్రచ్ఛన్న యుద్ధంలో సామ్రాజ్యవాద శిబిరానికి అమెరికా నాయకత్వం వహిస్తూండటంతో మిగి లిన దేశాలు అయిష్టంగానే అయినా ఈ తారు మారు ప్రక్రియను అంగీకరించి బంగారం స్థానం లో అనధికారికంగా డాలరును అంతర్జాతీయ రిజుర్వు ద్రవ్యంగా గుర్తించాయి. ఈ రకంగా సామ్రాజ్యవాద శిబిరానికి రాజకీయ నాయకుడు గా ఉన్న అమెరికా, సామ్రాజ్యవాద ప్రపంచీకరణ ను కూడా డాలర్‌ నాయకత్వంలో ముందుకు నడిపించేందుకు నడుం కట్టింది. అయితే అదే సామ్రాజ్యవాద ప్రపంచీకరణ నేపథ్యంలో ఈ పరిస్థితులు తలకిందులయ్యాయి. డాలర్‌ ఆధిపత్యం అట్టే కాలం నిలిచే సూచనలు కనిపిం చటం లేదు.

కరెన్సీ విలువలను మార్కెట్‌ నిర్ధారిస్తుందన్న సూత్రం 70 దశకం నుండీ ఐఎంఫ్‌ షరతుల్లో అనివార్యమైన అంతర్భాగమైంది. ఈ సూత్రం మేరకు ప్రభుత్వాలు అంతర్జాతీయ మార్కెట్‌లో తమ జాతీయ కరెన్సీ విలువల విషయంలో జోక్యం చేసుకోవటం మానేశాయి. దాంతో ఎగుమతులు ఎక్కువగా జరిగినపుడు విదేశీ మారక ద్రవ్యం నిల్వలలు పేరుకుపోవటం, దేశీ య కరెన్సీ విలువ పెరగటం, తర్వాత ఎగుమ తులు పడిపోవటం వంటి పరిణామాలు క్రమాను గతంగా చోటుచేసుకుంటూ వచ్చాయి. 1997 ఆసియా దేశాల ఆర్థిక సంక్షోభం తర్వాత జాతీ య కరెన్సీ విలువలను మార్కెట్‌ నిర్దేశిస్తుందన్న సూత్రంపై ప్రభుత్వాలు విశ్వాసం కోల్పోయాయి. దాంతో ఏ దేశానికి ఆ దేశం తగిన స్థాయిలో మారకద్రవ్యం నిల్వలు పోగేసుకోవటం ప్రారం భించాయి. తూర్పు ఆసియా దేశాలు, మరికొన్ని ముఖ్యమైన దేశాలు క్రమంగా డాలర్‌ విలువతో తెగతెంపులు చేసుకుని ప్రత్యామ్నాయ కరెన్సీలతో తమ విలువలు ముడి పెట్టుకోనారంభించాయి. ఈ క్రమంలోనే చైనా తన విదేశీ మారకద్రవ్యం నిల్వలలను డాలర్లతో పాటు బ్రెజిల్‌ కరెన్సీ, యూరోలలో కూడా పెట్టుబడులు పెట్టటంతో పాటు డాలర్‌ నిల్వలతోనే ఆఫ్రికా వంటి దేశాల్లో పెట్టుబడులు పెట్టడం ద్వారా తన ఆర్థిక వ్యవ స్థపై ప్రపంచీకరణ ద్వారా వచ్చిన డాలర్‌ ఆధి పత్యానికి స్వస్తి చెప్పింది. యూరప్‌లో అమెరి కాకు బంటుగా ఉన్న బ్రిటన్‌ స్థానంలో స్వతంత్ర శక్తిగా ఆధిపత్య స్థానం కోసం చూస్తున్న జర్మనీ ప్రధాన ఆర్థిక శక్తిగా ఎదిగింది. వర్ధమాన దేశాల్లో కొరియా, బ్రెజిల్‌ వంటి దేశాలు అంతర్జా తీయ వాణిజ్యంలో తమకున్న ప్రయోజనాల రీత్యా కేవలం డాలరుపై ఆధారపడటానికి సిద్ధం గా లేవు. ఈ సమయంలో నిక్సన్‌ తరహాలో డాలర్‌ విలువను తారుమారు చేయటం అంత తేలికైన వ్యవహారం కాదు. 1930-36 నాటి అనుభవాలు గమనంలోకి తీసుకుంటే నేటి కరెన్సీ యుద్ధాలకూ, నాటి కరెన్సీ యుద్ధానికీ మధ్య కొన్ని మౌలిక వ్యత్యాసాలు ఉన్నాయి. మొదటిది నాడు అంతర్జాతీయ ఎగుమతిదారులకు జరగ నున్న నష్టాన్ని పూడ్చుకునేందుకు మెరుగైన బీమా సాధనాలు ఉన్నాయి. ఈ సాధనాలకు అనుగుణ మైన అంతర్జాతీయ ద్రవ్య మార్కెట్‌ అభివృద్ధి చెంది ఉంది. నాడు సంపన్న దేశాలైన అమె రికా, బ్రిటన్‌, జర్మనీలు కరెన్సీ విలువల తగ్గింపు వల్ల నష్టపోతే నేడు చైనా, బ్రెజిల్‌, భారతదేశం వంటి శక్తివంతమవుతున్న దేశాలు (ఎమర్జింగ్‌ కంట్రీస్‌) భారీగా నష్టపోనున్నాయి.

తాజా చర్చ

రెండో ప్రపంచయుద్ధం తర్వాత కరెన్సీ సమస్యపై ప్రధానమైన దేశాల మధ్య ఇంత స్థాయిలో వివాదం నెలకొనటం ఇదే మొదటి సారి. ఈ వివాదానికి పునాదులు 2008లో మొదలైన అంతర్జాతీయ ద్రవ్య పెట్టుబడి సంక్షో భంలో ఉన్నాయి. పైన ఉదహరించుకున్నట్లు ప్రపంచీకరణ నేపథ్యంలో అమెరికా ఆర్థిక శక్తి క్షీణించింది. గత దశాబ్దకాలంగా దాచుకుంటూ వచ్చిన ఆనేక బలహీనతలు తాజా సంక్షోభంతో బట్టబయలు అయ్యాయి. ఒక్క అమెరికాలోనే నిరుద్యోగం పది శాతానికి చేరుకొంది. యూరోపి యన్‌ యూనియన్‌ సంఘటితమవుతున్న కొద్దీ గతంలో లాగా అమెరికా ఉత్పత్తులు యూరప్‌ మార్కెట్‌ను ముంచెత్తలేకపోతున్నాయి. దానికి తోడు యూరప్‌లో ఐర్లాండ్‌, స్పెయిన్‌, గ్రీస్‌, పోర్చుగల్‌ వంటి దేశాలు ఎదుర్కొంటున్న సార్వ భౌమత్వ రుణసంక్షోభం (సావరిన్‌ డెట్‌ క్రైసిస్‌)తో జర్మనీ నాయకత్వంలో పలు దేశాలు సహాయక చర్యలు చేపడుతున్నాయి. సహజంగానే ఆయా దేశాల మార్కెట్లను జర్మనీ తన ఉత్పత్తులతో నింపటానికి ఏర్పాట్లు చేసుకొంటోంది. మరో వైపున జపాన్‌ ఆర్థిక పరిస్థితి యథాతథంగా మాంద్యోల్బణంతో ఈడికగా సాగుతోంది. గతం లో ఎగుమతి మార్కెట్‌లో జపాన్‌ ఆక్రమించిన వాటాను కొరియా, ఇండొనేషియా, సింగపూర్‌ వంటి దేశాలు ఆక్రమించాయి. పెట్టుబడికి పడిపోతున్న లాభాల రేటు కాపాడుకోవటానికి ప్రత్యామ్నాయ ఉత్పత్తి స్థావరంగా చైనా మారిం ది. ఈ పరిస్థితుల్లో ఉన్నఫళంగా అమెరికా అవసరాలకు అనుగుణంగా మిగిలిన దేశాలు తమ జాతీయ ద్రవ్యం విలువను తగ్గించు కోవాలన్న డిమాండ్‌ అసమంజసం. ఆచరణ సాధ్యం కానిది కూడా. ఈ డిమాండ్‌ను బలవం తంగా ఆయా దేశాల నెత్తిన రుద్దే శక్తి అమెరికాకు ప్రస్తుతం లేదు. అందువల్లనే సియోల్‌ జి20 సదస్సుకు ముందు అదనంగా 600 శతకోటి (బిలియన్‌) డాలర్లు అచ్చు వేసి మార్కెట్‌లోకి వదులుతామని ప్రకటించిన అమెరికా ప్రస్తుతానికి ఆపని వాయిదా వేసింది.

పర్యవసానాలు

కరెన్సీ యుద్ధాల పర్యవసానాల గురించి చెప్పుకునే ముందు 1931-36 మధ్య కాలంలో జరిగిన కరెన్సీ విలువల తగ్గింపు పర్యవసానాల గురించి క్లుప్తంగా తెలుసుకుందాం. అప్పట్లో ద్రవ్యోత్పత్తుల మార్కెట్‌ నేడున్న స్థాయిలో విస్తరించి లేదు. అంతేకాక అప్పట్లో బంగారం రిజర్వు ద్రవ్యంగా చలామణి అవుతోంది. దాంతో తమ తమ దేశాల్లోని బంగారం నిల్వలు పెంచుకునేందుకు, దాంతో పాటు దేశీయ కరెన్సీ విలువలు తగ్గించుకునేందుకు దేశాలు ప్రయత్నిం చాయి. దాంతో దేశీయ ఆర్థికవ్యవస్థల్లో ద్రవ్య సరఫరా పెరిగింది. అంతర్జాతీయంగా బంగా రం విలువలో అట్టే మార్పు లేదు కనుక దీని ప్రభావం అంతర్జాతీయ వస్తూత్పత్తిరంగంపై లేదు. ఆంతరంగిక శక్తి సామర్థ్యాలు ఉన్న దేశాల ఆర్థిక వ్యవస్థలు ద్రవ్య సరఫరా పెరగటం ద్వారా అదనంగా మార్కెట్‌లోకి వచ్చిన నిధులను ఉపయోగించుకుని ఉత్పత్తి రంగాన్ని బలోపేతం చేసుకున్నాయి. మార్కెట్లో ద్రవ్య సరఫరా పెరగటం వల్ల ద్రవ్యోల్బణం ప్రభావం పెరిగినా యుద్ధ అవసరాలు, యుద్ధానంతరం నెలకొన్న ప్రత్యేక రాజకీయ ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో అనుసరించిన వేతనవిధానాలు, సంక్షేమ చర్యలు ద్రవ్యోల్బణం ప్రభావాన్ని అదుపు చేయటానికి, ద్రవ్యోల్బణం పెరుగుదలతో వచ్చే విపరీతాలను ఎదుర్కోవటానికి కావల్సిన రంగం సిద్ధమైంది. అంతేకాదు. అప్పట్లో వడ్డీ రేట్లు సున్నా కంటే ఎక్కువగానే ఉన్నాయి. వడ్డీ రేట్లలో కొద్ది పాటి దిగువముఖంగా సడలింపు ద్వారా మార్కెట్‌లో నిధులు పెంచే అవకాశం ఉండేది. నేడు ఈ మూడు లక్షణాలకు సంబంధించి పరిస్థితులు మారిపోయాయి. ముందుగా వడ్డీ రేట్ల పరిస్థితి చూద్దాం.

అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థలో కీలక స్థానం ఆక్రమించిన జపాన్‌, అమెరికాల్లో వడ్డీ రేట్లు సున్నాకు చేరిపోయాయి. ఇంతకంటే తగ్గించటం మరిన్ని దుష్ఫలితాలకు దారితీయ నుంది. రెండో అంశం రిజర్వు కరెన్సీ, దాని విలువ. 70 దశకంనాటి సంక్షోభం నేపథ్యంలో క్రమంగా అంతర్జాతీయ ద్రవ్య వ్యవస్థల మధ్య సంతులనం దెబ్బతింది. ప్రపంచీకరణ విధా నాల నేపథ్యంలో ఇది మరింత కృశించిపో యింది. నేడు డాలర్‌కున్న రిజర్వు కరెన్సీ హౌదా అనధికారికమైనదే తప్ప అధికారికమైనది కాదు. 1997 ఆసియా సంక్షోభం, 1999 రష్యా బాండ్ల సంక్షోభం, 2000-2004 మధ్య లాటిన్‌ అమెరికా దేశాల సంక్షోభాల తర్వాతి కాలంలో పలు దేశాలు రిజర్వు కరెన్సీగా డాలరును ఆమోదించే స్థితిలో లేవు. కేవలం నాలుగు దశాబ్దాల్లోనే తాను అంతర్జాతీయ రిజర్వు కరెన్సీ బాధ్యతలు నిర్వహించలేనని డాలర్‌ తేల్చేసింది. నేడు డాలర్‌ విలువే తగ్గుముఖం పట్టింది. ఇక వినూత్న ద్రవ్యోత్పత్తుల మార్కెట్‌ పరిస్థితి. నాడున్న పరిస్థితుల్లో నిజ ఆర్థిక వ్యవస్థ పునాదిగా తెరమీదకు వచ్చిన ఫ్యూచర్స్‌, ఫార్వార్డ్‌ ట్రేడింగ్‌ తప్ప నేడు మనం చూస్తున్న విన్నూత్న ద్రవ్యోత్పత్తులు లేవు. నేటి పరిస్థితి దానికి భిన్నమైనది. ప్రాథమిక సరుకులు, కమోడిటీస్‌ ఫ్యూచర్స్‌ మాత్రమే కాదు. తనఖా ఆస్తులు, ఒకటి నుండి పది దొంతరల నడుమ పేరుకుపోయి, విస్తరించిన తనఖా పెట్టబడిన రుణాలపై ఒప్పం దాలు వంటివి అనేకం ఉన్నాయి. తాజాగా సూక్ష్మ రుణ సంస్థల పోర్ట్‌ఫోలియోలను కూడా ఈ విధమైన దొంతరలతో ద్రవ్య ఉత్పత్తులుగా మార్చేందుకు రేటింగ్‌ సంస్థలు సిద్ధమవు తున్నా యి. ఈ పరిస్థితుల్లో ద్రవ్య మార్కెట్‌ దాహాన్ని తీర్చటానికి ఎన్ని నిధులైనా సరిపోవు. ఉత్పత్తి రంగ అవసరాల గురించిన ప్రస్తావనే నేటి పరిస్థితుల్లో రాదు. మరోవైపున వస్తూత్పత్తి రంగం పాత్ర కృశించుకుపోతోంది. ఉపాధి అవకాశాల కల్పన ఎండమావిగా మారింది. మార్కెట్‌లో ద్రవ్య సరఫరా ఉపాధి కల్పనకు ప్రమాణం అనుకుంటే ఇప్పటికే రెండు లక్షల కోట్ల డాలర్ల మేర నిల్వలు అమెరికా కంపెనీల ఖాతాల్లో ఉన్నాయి. ఈ నిధులు ఉత్పత్తి మార్కెట్‌ లోకి వచ్చే సూచనలు మచ్చుకైనా కనిపించటం లేదు. అటువంటప్పుడు పరిమాణాత్మక సడ లింపు, క్వాంటిటేటివ్‌ ఈజింగ్‌కు పాల్పడకపోతే తమ ఆర్థిక వ్యవస్థల్లో ఉపాధి అవకాశాలు పెంచలేమన్న అమెరికా, బ్రిటన్‌ వాదనలు అర్థం లేనివి.

నూతన పరిస్థితుల నేపథ్యంలో కరెన్సీ విలువల తారుమారు మరో కొత్త ప్రమాదాన్ని ముందుకు తెచ్చే అవకాశం ఉంది. అదే కరెన్సీ బదిలీ వ్యాపారం - క్యారీ ట్రేడ్‌. అంటే ద్రవ్య మార్కెట్‌ శక్తులు సున్నా వడ్డీకి అమెరికాలో అప్పులు తీసుకుని భారతదేశంలో 7-8 శాతం వడ్డీకి తిరిగి అప్పులిస్తాయి. ఇది భారతదేశంలో బ్యాంకులు ఇచ్చే వడ్డీ రేటు కంటే తక్కువ కాబట్టి మన పారిశ్రామిక సంస్థలు విదేశీ వాణిజ్య రుణాలు ఎక్స్టర్నల్‌ కమర్షియల్‌ బారోయింగ్స్‌ రూపంలో అప్పులు తీసుకుంటాయి. ఆ విధంగా కూడా దేశంలో విదేశీ మారకద్రవ్య నిల్వలు పెరుగుతాయి. ఒకవైపున పెరుగుతున్న విదేశీ మారక ద్రవ్య నిల్వలు, మరోవైపున దేశీయ కరెన్సీకి అంటే రూపాయికి తగ్గుతున్న గిరాకీ నేపథ్యంలో దేశీయ కరెన్సీ విలువలు మరింత పడిపోతాయి. ఇదే తరహాలో ఉత్పత్తి రంగానికి వెళ్లని నిధులతో కరెన్సీ ఫ్యూచర్స్‌, ఇతర అనేక రకాలైన డెరివేటివ్‌, బదలాయింపు వాణిజ్యాలు చోటుచేసుకునే ప్రమాదం ఉంది. ఇవన్నీ గాలివాటు పెట్టుబడుల్లో అంతర్భాగమే. ఉత్పత్తి అవసరాలు, వినియోగం అవసరాల ఆధారంగా ఉపయోగానికి వచ్చే పెట్టుబడులు కావు. బొమ్మా బొరుసూ, జూదం వంటి ఆటల్లో పెట్టుబడులు పెరుగుతాయి. వీటివల్ల ఆర్థిక వ్యవస్థ మరింత అస్థిరతకు లోనవుతుంది.

తక్షణ పరిష్కారాలు

పైన చెప్పుకున్న విపరీత పరిణామాలు చోటు చేసుకోకుండా ఉండాలంటే దేశీయంగా పెట్టుబడికి డిమాండ్‌ కల్పించే మార్గాలు వెతకాలి. అదేసమయంలో అంతర్జాతీయంగా స్థూల ఆర్థిక వ్యవస్థకు అక్కరకురాని పెట్టుబడి కార్యకలాపాలు, స్పెకుల్యలేటివ్‌ పెట్టుబడుల చలనాన్ని నియం త్రించే చర్యలు చేపట్టాలి. భారతదేశంలో ప్రతి పాదించిన సెక్యూరిటీస్‌ ట్రాన్సాక్షన్‌ పన్ను, పశ్చిమ దేశాల ఆర్థికవేత్తల్లో కొందరు ప్రతిపాదించినట్లు టోబిన్‌ పన్ను వంటివి రెండో కోణం కిందకు వస్తాయి. అంతేకాదు, టాక్స్‌ హెవెన్స్‌లను అంతర్జాతీయ మనీలాండరింగ్‌ చట్టాల పరిధి లోకి తీసుకురావటం, ఫోర్బ్స్‌ ప్రకటించే టాప్‌ 500 కంపెనీలకు సంబంధించి లాభాల విని యోగంపై సామాజిక నియంత్రణలు వంటి వినూత్న చర్యలు గురించి ఆలోచించాలి. ఇక దేశీయంగా పెట్టుబడికి డిమాండ్‌ కల్పించటం అంటే ఆయా దేశాల్లో ఉత్పాదక రంగ పునాదిని విస్తరించటం. ఈ దిశగా నామమాత్రపు వడ్డీలకు సాంకేతికపరిజ్ఞానం, ఇతర రూపాల్లో పరిశ్రమల ఆధునీకరణకు అకాశం కల్పించాలి. ప్రత్యేకించి ప్రపంచం పర్యావరణ ముప్పును ఎదుర్కొంటోంది. అందువల్ల ఇంధన వనరులు పొదుపు చేసుకునే విధంగా ప్రత్యామ్నాయ ఉత్పత్తి ప్రక్రియల గురించి పరిశోధనలకు, భూమి పై హరితం పెంచేందుకు అవసరమైన పెట్టు బడులు సమకూర్చవచ్చు. అన్నిటికంటే ముఖ్యంగా శ్రమశక్తికి విలువ పెంచాలి. సార్వత్రిక సంక్షేమ పథకాలు అమలు చేయటంతో పాటు నేరుగా కార్మికుల చేతికి వచ్చే ఆదాయం పెరిగేలా వేతనాలు పెంచాలి. భవిష్యత్తు లాభాలను దృష్టిలో పెట్టుకుని కంపెనీలు జస్టేషన్‌ పీరియడ్‌ ఎక్కువగా ఉండే రంగాల్లో పెట్టుబడులు పెడుతున్నారో అదేవిధంగా మానవాభివృద్ధి విషయంలో కూడా అదేవిధమైన పెట్టుబడులు పెట్టాలి. తద్వారా దేశంలో అదనంగా ఉన్న ద్రవ్యసరఫరాను సద్వినియోగం చేసుకోవటంతో పాటు దుర్వినియోగం కాకుండా చూడవచ్చు.

ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కరెన్సీ యుద్ధాల పరిస్థితికి చేరుకోవటం వెనక ముఖ్యమైన కారణం అంతర్జాతీయ వాణిజ్యం తగ్గిపోవటం. తాజా సంక్షోభం నేపథ్యంలో ప్రపంచ వాణిజ్యం 12 శాతం పడిపోయిందని అంచనా. పరిమి తమైన మార్కెట్‌లో ఎవరి ఉత్పత్తులు వారు అమ్ముకోవటానికి అనేక మార్గాలు అనుసరిస్తు న్నారు. సంపన్న దేశాలు అనుసరించే కరెన్సీ విలువ తగ్గింపు అందులో ఒక సాధనం. అందు వల్ల పైన పేర్కొన్న ప్రత్యామ్నాయ చర్యల ద్వారా అంతర్జాతీయ డిమాండ్‌ పెంచవచ్చు. తద్వారా అసలు కరెన్సీ యుద్ధాలకు దారితీసే పరిస్థితులే లేకుండా చేయవచ్చు. ఇవీ, ఇంకా ఇటువంటి అనేక ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోవటంలో విఫలమైతే 1930 నాటి పరిస్థితుల్లో ప్రపంచం ముందుకొచ్చినట్లు తొలుత వాణిజ్య ఉద్రిక్తలు, తర్వాత రాజకీయ ఉద్రిక్తతలు పెరిగిపోయే ప్రమాదం ఉంది. ఈ ఉద్రిక్తతలు ఆయా స్థలకాల పరిస్థితులను బట్టి ఏ రూపం అయినా తీసుకోవచ్చు.

కె. వీరయ్య