Wednesday, May 22, 2019

 http://www.navatelangana.com/article/net-vyaasam/759646

కుహనా శాస్త్ర విజ్ఞానం... వలసవాద వారసత్వం

కేంద్రంలో బీజేపీ అధికారానికి వచ్చిన నాటి నుంచీ శాస్త్ర విజ్ఞాన రంగంలో భారతీయుల కృషిపేరుతో కుహనా శాస్త్ర విజ్ఞానం విచ్చలవిడిగా ప్రచారమవుతోంది. పదేండ్ల క్రితం పత్రికల్లో భారతీయ శాస్త్రవేత్తల కృషి గురించి వచ్చిన వార్తలకు, నేడు వస్తున్న వార్తలకు మధ్య తేడా గమనిస్తే దేశంలో శాస్త్ర విజ్ఞానం, శాస్త్రీయ ఆలోచనా కోణం ఎంతగా వెనకపట్టు పట్టిందో అర్థమవుతుంది. పదేండ్ల క్రితం యూరప్‌లో లార్జ్‌ హాడ్రన్‌ కొల్లైడర్‌ (విశ్వసృష్టి రహస్యాలు ఛేదించేందుకు జరుగుతున్న ప్రయోగం)లో భారతీయ శాస్త్రవేత్తల పాత్ర గురించి భారతీయ పత్రికలు విశ్లేషణలు ప్రచురించాయి. శాస్త్ర విజ్ఞానానికి సంబంధించి అమెరికా ఆంక్షలు అధిగమించి మరీ భారతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) క్రయోజనిక్‌ ఇంజన్‌ తయారు చేయడంలో భారతీయ శాస్త్రవేత్తల మేధో సామర్ధ్యం చూసి ప్రపంచం అబ్బురపడింది. ఇప్పుడు దీనికి భిన్నంగా 'కుండ'పోతలే టెస్ట్‌ట్యూబ్‌ శిశువులంటున్న కుహనా శాస్త్రవేత్తలను చూస్తున్నాం. ప్రపంచం చూడని యుద్ధ విమానాలు రావణుడి వద్ద ఉన్నాయని కుహనా మేధావులు నిస్సిగ్గుగా ప్రకటించటం ఆధునిక భారతీయ శాస్త్రవేత్తలు తలదించుకునేలా చేస్తోంది.
దీనికి ఆజ్యం పోసింది స్వయంగా ప్రధాని మోడీయే అనటంలో సందేహం లేదు. 2015లో జరిగిన ఇండియన్‌ సైన్స్‌ కాంగ్రెస్‌లో వినాయకుని జననం నాటి భారతంలోనే ప్లాస్టిక్‌ సర్జరీ అమల్లో ఉందని తెలియజేస్తోందని ఉపన్యసించారు. రాజును మించిన రాజభక్తులున్న దేశం మనది. కనుక ఆయన వెనకే వందలాదిమంది కుహనా శాస్త్రవేత్తలు బయల్దేరారు. వీరి ఉపన్యాసాలు వింటుంటే 1986లో మా పొరుగు గ్రామంలో జరిగిన సంఘటన గుర్తుకొస్తోంది. అప్పట్లో మేమంతా బళ్లో ఉన్నాం. ఊళ్లో గుప్పుమన్న వార్త ఇంటర్వెల్‌ సమయానికి బళ్లోకి వచ్చింది. పొరుగూర్లో ఓ గుడి ఉంది. గుడి ముందు రాగి చెట్టు వేప చెట్టు పెనవేసుకుని పెరిగాయి. పల్లెటూరి అనుభవం ఉన్న ప్రతివారికీ ఇది ఏమంత పెద్ద ఆశ్చర్యకరమైన సంఘటన కాదు. అయితే ఈ చెట్ల ద్వయం పాలు కారుస్తోంది అన్నది ఆ పుకారు. అంతే.... మండలంలో సగం ఊళ్ల నుంచి జనం అక్కడ ప్రత్యక్షమయ్యారు. భారతీయ శాస్త్ర విజ్ఞాన మహాసభలో పోగైన వారిని, వారి వ్యాఖ్యలను చూస్తే మూడు దశాబ్దాల క్రితం మా పొరుగూర్లో గుంపులు గుంపులుగా వెళ్లిన పామర జనానికీ వీరికీ తేడా లేదని అర్థమవుతోంది.

ఈ కుహనా శాస్త్రవిజ్ఞానం నిర్దిష్ట రాజకీయ లక్ష్యంతో సాగుతున్న ప్రచారం. అభివృద్ధి కోసం ఆరాటపడే అన్ని దేశాల్లో చోటు చేసుకున్న పరిణామమే. భారతదేశంలో సైతం మేధో ప్రతిభ ఆ దశ దాటి ముందుకు వచ్చింది. కానీ పాలకవర్గం ప్రజలను మాత్రం ఆ దశలోనే ఉంచాలని విశ్వ ప్రయత్నం చేస్తోంది. ఈ ప్రయత్నానికి ఆధునిక మూలాలు వలసవాదంతో పాటు భారతదేశంలో ప్రవేశించాయి క్రైస్తవ మిషినరీలు. వీటితో పాటే సాధారణ జనానికీ పరిచయమైంది తర్కం. దీంతో ఓ వైపు మిషినరీల ప్రభావాన్ని తట్టుకుని హిందూమతాన్ని కాపాడుకునే ప్రయత్నంలో అనేకమంది సంఘ సంస్కర్తలు ముందుకొచ్చారు. వివేకానంద, రామకృష్ణ పరమహంస, రాజారామ్మోహన రారు, దయానంద సరస్వతి, ఈశ్వరచంద్ర విద్యాసాగర్‌ వంటి వారు ఈ కోవకు చెందిన వారే. వీరి రచనల సారాంశం సనాతన చాంధస హిందూమతంలో సాధారణ తర్క విరుద్ధమైన విషయాలను తిరస్కరించటం ద్వారా ప్రజలకు తిరిగి హిందూమతంపై విశ్వాసం పెంపొందించడమే.. ఈ ప్రయత్నాలే తర్వాతి కాలంలో పెద్ద పెద్ద పీఠాలుగా, హిందూ ప్రచార వేదికలుగా చలామణి అవుతున్నాయి.
ఈ సమయంలోనే మరో ముఖ్యమైన ప్రయత్నం జరిగింది. వలసవాద పాలకులు భారతీయులను సమర్ధవంతంగా పరిపాలించాలంటే భారతీయ సంస్కృ‌తి, సాంప్రదాయాలను అర్థం చేసుకోవాల్సిన అవసరమొచ్చింది. కానీ ఇవన్నీ సంస్కృతంలో ఉన్నాయి. మనకు తెలీనిదంతా దైవమే అనుకోవటం తేలికైన పరిష్కారం. ఈ క్రమంలో పాశ్చాత్యులు ప్రాచ్య నాగరికతలను అర్థం చేసుకోవటానికి ఆయా దేశాల్లో పెద్ద పెద్ద సొసైటీలు ఏర్పాటు చేసి నిధులు కేటాయించారు. ఈ విధంగా 18వ శతాబ్దం చివరల్లో ఏర్పాటైన ఏషియాటిక్‌ సొసైటీ నడిపిన పత్రికలు, అందులోని వ్యాసాలు గమనిస్తే ఒక దేశాన్ని జయించటానికి వచ్చినప్పుడు సామ్రాజ్యవాదులు ఆ దేశపు సమాజాన్ని అర్థం చేసుకోవటానికి ఎంతగా ప్రయత్నిస్తారో మనం తెలుసుకోవచ్చు. ప్రాచీన మధ్యయుగాల్లో లౌకిక విజ్ఞానం, అలౌకిక విజ్ఞానం రెండూ మతం ముసుగులోనే చలామణీ అయ్యేవి.

భారతదేశంలో వరాహమిహరుడు, ఆర్యభట్టూ ఉన్నట్టే పాశ్చాత్య సంస్కృ‌తిలో టోలమీ ఉన్నాడు. ఖగోళ శాస్త్రం పేరుతో టోలమీ అప్పటి వరకు అంతరిక్షం గురించి పాశ్చాత్య సమజాంలో ఉన్న అభిప్రాయాలను, అంచనాలను క్రోడీకరించి గ్రంధస్తం చేశాడు. అంతకు పూర్వం క్రీస్తు పూర్వం 700 సంవత్సరం నాటికి పాశ్చాత్య సమాజంలోనూ ఖగోళాన్ని పన్నెండు రాశులుగా విభజించి ఒక్కో రాశికి ఒక్కో గుర్తు కేటాయించారు. ఆ గుర్తులన్నీ కుడిఎడంగా నేటికీ చలామణీ అవుతూనే ఉన్నాయి. ఆశ్చర్యమేమిటంటే రాశులకు కేటాయించిన గుర్తులన్నీ ప్రకృతిలో అత్యంత మౌలిక దశలో కనిపించే జంతువులు, వస్తువులే. ఈ విషయాన్ని మర్చిపోయి నాటికే ఆధునిక కాలెండర్‌ గురించి తెలుసునని మురిసిపోతే పాశ్చాత్య సమాజాలు శాస్త్రవిజ్ఞాన మార్గంలో ప్రగతి సాధించేవి కావు. అయితే పాశ్చాత్య సమాజాల పరిణామంలో కీలక పాత్ర పోషించింది తర్కం. ప్రశ్న. హేతువు. క్రీస్తు పూర్వం లౌకిక అలౌకిక విజ్ఞానాలు విడదీయరానంత పెనవేసుకున్నాయి. వాటిని విడదీసేందుకు పాటించిన ప్రమాణమే తర్కం. వాద, ప్రతివాదాలు. గ్రీకు నాగరికతలో వాదప్రతివాదాలకు సోక్రటీస్‌కు మధ్య ఉన్న సంబంధాన్ని వేరు చేయలేం. ఆ విధంగా ప్రశ్నను ప్రోత్సహించిన పాశ్చాత్య సమాజాలు విజ్ఞాన శిఖరాలుగా పురోగమించాయి.

భారతదేశంలో సైతం ఈ విధంగా లౌకిక, అలౌకిక జ్ఞానాన్ని వేరు చేసేందుకు లార్డ్‌ కారన్‌ వాలీస్‌ వైస్రాయిగా ఉన్నప్పుడే ఓ ప్రయత్నం మొదలైంది. అప్పట్లో సంస్కృత భాష కేవలం బ్రాహ్మణుల గుత్తసొత్తు. సోకాల్డ్‌ హిందూమత గ్రంధాలన్నీ సంస్కృత భాషలోనే ఉండేవి. దీంతో ఏది లౌకిక జ్ఞానం ఏది అలౌకిక జ్ఞానం అన్నది నిర్ధారించుకునేందుకు వలస పాలకులకు ఈ మేధావులే శరణ్యమయ్యారు. ఈ విధంగా భారతీయ సమజాన్ని వలసపాలకులు అదుపాజ్ఞల్లో పెట్టుకోవటానికి తొలిసాయమందించింది మేధో పాలకవర్గమే. ముందే చెప్పుకున్నట్టు క్రైస్తవ మిషినరీల ప్రవేశంతో పలువురు సంఘ సంస్కర్తలు హిందూమతాన్ని సంస్కరించే పనిలో పడ్డారు. ఈ సంఘ సంస్కర్తలే భారత స్వాతంత్య్ర పోరాట చరిత్రలో భారతీయ పునరుజ్జీవనోద్యమ పితామహులుగా గుర్తింపు పొందారు.
మరోవైపున వలసవాదులతో పాటు పరిపాలనలో భాగస్వాములైన బ్రాహ్మణవర్గం లౌకిక అలౌకిక జ్ఞానాలను వేరుచేసే పనిలో వలస పాలకులకు సహాయం చేయసాగింది. మధ్యయుగాల చివరిదశ వరకు భారతీయ వాంగ్మయం శృతిపరంపరపై ఆధారపడి ఉంది. అంటే ప్రాచీన ఇటలీ, గ్రీసుల్లో లాగా లిపి ఆధారిత సాహిత్యం కాదు. ఒక తరం మరో తరానికి, ఆ తరం తర్వాతి తరానికి చెప్పుకుంటూ (వాక్కు ద్వారా) రావటమే ప్రాచీన భారత వాంగ్మయం (దీన్నే వేదవాంగ్మయం అని కూడా పిలుస్తున్నారు) కొనసాగింపునకు మౌలిక ఆధారంగా ఉండేది. ఈ పరిస్థితుల్లో వీటన్నింటిలో ఏముందో తెలుసుకునే ప్రయత్నంలో మాక్స్‌ ముల్లర్‌ వంటి పాశ్చాత్య మేధావులు చివరకు సంస్కృతం నేర్చుకుని తాళపత్ర గ్రంధాలు చదవటానికి సైతం సిద్ధమయ్యారు. ఈ విధంగా వలసపాలకుల అవసరాల కోసం లౌకిక అలౌకిక జ్ఞానాన్ని వేరు చేసే క్రమంలోనే ప్రాచీన భారత చరిత్రలో ఆధారాలు ఉన్నవీ లేనివీ భారతీయతగా చలామణీ చేసే అవకాశం వచ్చింది. అన్నీ వేదాల్లోనే ఉన్నాయని నిరూపించే ప్రయత్నం ఈ క్రమంలో ముందుకొచ్చిందే. ఈ విధంగా చరిత్ర రచన గుర్రానికి ముందు బండి కట్టి నడిపించే దిశలో సాగింది. రానురాను బ్రిటిష్‌ పాలకవర్గం సంపూర్ణ బూర్జువావర్గంగా ఎదిగింది. ఈస్టిండియా కంపెనీ స్థానంలో ఏకంగా బ్రిటన్‌ వలసాధిపతిగా ముందుకొచ్చింది. పాలితులను అజ్ఞానంలో ఉంచటమే పాలకుల వర్గ ప్రయోజనాలు కాపాడుకునే ఏకైక మంత్రం. భారతీయులను సనాతన అజ్ఞానంలో మగ్గేలా చూడటమే ఆధునిక బ్రిటన్‌ పాలకవర్గానికి ప్రయోజనకారిగా కనిపించింది. దీంతో అలౌకిక జ్ఞానం కాస్తా లౌకిక జ్ఞానం ముద్ర వేసుకుని వీధుల్లోకి వచ్చింది. కుహనా శాస్త్ర విజ్ఞానమే అసలైన శాస్త్ర విజ్ఞానంగా చలామణీ అవటం ప్రారంభమైంది.

నాడు వలసవాద పాలకవర్గం తన ప్రయోజనాలు కాపాడుకోవటానికి కుహనా శాస్త్రవిజ్ఞానమే నిజమైన భారతీయ శాస్త్ర విజ్ఞానమని భ్రమలు కల్పించింది. నేటి పాలకవర్గ పార్టీకి మాతృక అయిన రాష్ట్రీయ స్వయం సేవక్‌ నాడు కారన్‌వాలీస్‌ హయాంలో పాలకవర్గంలో అంతర్భాగమైన బ్రాహ్మణవర్గానికి నిజమైన ప్రతినిధి. తన లక్ష్యాలు నెరవేరాలంటే ఈ దేశంలో ప్రశ్న, హేతువు, తర్కం మిగిలి ఉండకూడదు. ఈ మూడు ఆరెస్సెస్‌ ప్రేరేపిత భారతీయతకు, హిందూత్వ పరిరక్షణకు ప్రథమ శతృవులు. అందుకే భారతీయ సమాజంలో ఈ మూడు - తర్కం, ప్రశ్న, హేతువు-లకు తావు లేకుండా చేసే పనిలో నిమగమై ఉన్నాయి. అందులో భాగమే నాటి వలసవాదం తరహాలో కుహనా శాస్త్ర విజ్ఞానమే అసలైన శాస్త్ర విజ్ఞానంగా ప్రచారం చేయటం. పాశ్చాత్య శాస్త్ర విజ్ఞానంలో ఉన్న న్యూటన్‌ గురుత్వాకర్షణ సిద్ధాంతాన్ని వరాహమిహిరుడికి ఆపాదించటం, అణువిస్పోటనాన్ని భగవద్గీతలో కూర్చటం, కోపర్నికస్‌ కన్నా ముందే సూర్యుడిని నవగ్రహాధిపతిని చేసి ప్రధాన దేవాలయాల ముందు దిష్టిబొమ్మలుగా నిలబెట్టడం, వేదవ్యాసుడి మెదడులో టెస్ట్‌ట్యూబ్‌ బేబీల గురించిన ఆలోచనను కుక్కటం, నిన్న మొన్నటి వరకు హిందువులను సమీకరించటానికి విలన్‌ అవతారంలో చూపబడిన రావణుడు ఏకంగా వైమానిక పరిజ్ఞానం కలిగిన మేధావిగా మారటం యావత్తూ వలసవాద వారసత్వంతో మొదలైన కుహనా శాస్త్ర విజ్ఞానానికి ఆధునిక పునాది కల్పించటమే. ఇదే సమయంలో భారతీయ పాలకవర్గం తన వర్గ ప్రయోజనాలు కాపాడుకోవటానికి రాఫెల్‌ యుద్ద విమానాలు కావాలంటూనే ప్రజలను మాత్రం ఊహాజనితమైన రావణ విమానాల గొప్పలు చెప్పుకుని మురిసిపొమ్మంటోంది. వలసవాదానికి అత్యంత నమ్మదగిన మిత్రులు సావర్కార్‌, గోల్వాల్కర్‌. వీరిద్దరి శిష్యపరంపరలో ఎదిగి వచ్చిన ఆరెస్సెస్‌ పర్యవేక్షణలో పరిపాలన సాగించే బీజేపీ నుంచి ఇంతకన్నా గొప్పగా ఏమీ ఆశించలేం. భారతదేశాన్ని ప్రపంచం గుర్తించదగిన శక్తిగా మార్చాలంటే ఆధునిక శాస్త్రవిజ్ఞానం ప్రజలందరికీ అందుబాటులోకి తేవటం, శాస్త్రీయ ఆలోచన సార్వత్రికం చేయటం తక్షణ అవసరం. కేంద్రంలో బీజేపీ పరిపాలన ఈ రెండు లక్ష్యాల సాధనకు అవరోధం. నిజమైన దేశభక్తుల ముందున్న కర్తవ్యం సుస్పష్టమే.
- కొండూరి వీరయ్య
సెల్‌: 9871794037

No comments: