Wednesday, May 22, 2019

 http://www.navatelangana.com/article/net-vyaasam/748098

మోడీ మౌనవ్రతం వెనక...

దేశాన్ని కుదిపేస్తున్న అనేక సమస్యల పట్ల ప్రధానమంత్రి మోడీ మౌనవ్రతం పట్ల అనేక ప్రశ్నలు వస్తున్నాయి. తొలిసారి బీజేపీ జాతీయ స్థాయిలో అధికారానికి వచ్చినప్పుడు కేవలం పార్లమెంటరీ వ్యవస్థే దుర్వినియోగమైంది. రెండోసారి అధికారానికి వచ్చినప్పుడు ఈ దుర్వినియోగం రాజ్యాంగ యంత్రంలోని అన్ని వ్యవస్థలకూ, విభాగాలకూ పాకింది. ఈ మొత్తం ప్రక్రియలో విశ్లేషకులు దృష్టి సారించని ఓ కీలకమైన అంశం ఉంది.
                     ఏ దేశంలోనైనా ఉనికిలో ఉన్న రాజ్యాంగ యంత్రాన్ని కూలదోయాలంటే అది నిస్సహాయమైనదన్న అభిప్రాయం కలిగించటమే కాదు, జరుగుతున్న పరిణామాల పట్ల నిశ్చేష్టురాలై ఉండిపోయేలా చేయటం, నిస్సత్తువతో కూలబడిపోయేలా చేయటం కీలకమైన వ్యూహం. ఈ వ్యూహాన్ని అనుసరించడానికి ఆరెస్సెస్‌ సుశిక్షితమైన పద్ధతులు రూపొందించి అమలు చేస్తోంది. 1960 దశకంలో గోరక్షణ ఓ ధార్మిక అంశంగా మాత్రమే మొదలైంది. ఆరెస్సెస్‌ శ్రేణులు ఈ సమస్యను చేపట్టాక రాజకీయ అంశంగా మారింది. నేడు ఏకంగా పాలక పార్టీ చేతుల్లో అస్త్రంగా మారింది. పోలీసులను హత్య చేసే వరకు ఈ నినాదం సాధనంగా పని చేస్తోంది. 1970 దశకంలో కేవలం గోరక్షణ కోసమే ఆరెస్సెస్‌ శ్రేణులు చలో పార్లమెంట్‌ పిలుపునిచ్చాయి. అప్పటి వరకు పార్లమెంట్‌ భవనం బాహ్యవలయం వరకు సాధారణ ప్రజల రాకపోకలుండేవి. దాన్ని అవకాశంగా తీసుకుని గోరక్షణ ఉద్యమం పార్లమెంట్‌ ముట్టడికి పిలుపునిచ్చింది. దీంతో అనుభవం పొందిన రాజ్యాంగ యంత్రం పార్లమెంట్‌ చుట్టూ రక్షణ వలయాన్ని విస్తరించుకుంటూ పోయింది. చివరకు వివిధ ఉద్యమాలు, ఆందోళనలు, చలో పార్లమెంట్‌ పిలుపులకు వేదిక అయిన బోట్‌ క్లబ్‌ క్రమంగా కనుమరుగైంది. ఈ విధంగా రాజ్యాంగ యంత్రాన్ని బయటి నుంచి నీరుగార్చటంలో ఆరెస్సెస్‌ది ప్రత్యేక శైలి.

           జనతా ప్రభుత్వం పుణ్యమా అంటూ జాతీయ స్థాయి అధికారంలో పాలుపుంచుకునే అవకాశాన్ని దక్కించుకుంది నాటి జనసంఫ్‌. నేటి బీజేపీ నాటి నుంచే క్రమం తప్ప కుండా రాజ్యాంగ వ్యవస్థలను నిర్వీర్యం చేయటంలో నిమగమైంది. ఈ వ్యవహారం మోడీ హయాంలో పతాక స్థాయికి చేరుకుంది. తమిళనాడు రైతులు రెండున్నర సంవత్సరాలకుపైగా జంతర్‌ మంతర్‌లో నిరసన వ్యక్తం చేస్తున్నా ప్రభుత్వం నోరు మెదపదు. బీజేపీ ఎంఎల్యేలు, ఎంపీలు వారి ఆశ్రితులు మహిళలపై పాశవిక దాడులకు పాల్పడుతున్నా బేటీ బచావో అన్న నినాదంతో హోర్డింగులకెక్కిన మోడీ చిరునవ్వు చెదరలేదు. నోట్ల రద్దుతో దేశవ్యాప్తంగా ఉన్న సాధారణ ప్రజానీకం, వారికి జీవనోపాధి కల్పించే ఆర్థిక వ్యవస్థ కకావికలమవుతున్నా మోడీ విదేశీ పెట్టుబడుల కోసమంటూ సాగే యాత్రలు అక్కినేని నాగేశ్వరరావు సినిమా బహుదూరపు బాటసారిని గుర్తుకు తెస్తూనే ఉంటాయి.
కనీసం యూపీఏ ప్రభుత్వం హయాంలో కరువు ప్రాంతాల ప్రకటన, ప్రకృతి వైపరీత్యాల నిధి వెచ్చింపు వంటి పనులు జరుగుతూ ఉండేవి. మోడీ ప్రభుత్వం గద్దెనెక్కిన మొదటి రెండున్నరేండ్లు ఐదు పంటలు (రెండు కార్లు రబీ, మూడు కార్లు ఖరీఫ్‌) ధ్వంసమైనా కరువు ప్రాంతాల ప్రకటన లేదు. పది మందిగా ఉన్న మొబైల్‌ కంపెనీల యాజమాన్యం 70 వేల కోట్ల రాయితీ కావాలని సుప్రీం కోర్టును ఆశ్రయించవచ్చు. పదుల సంఖ్యలో ఉన్న ప్రయివేటు విద్యుత్‌ ఉత్పత్తి కంపెనీల ప్రయోజనాలు కాపాడటానికి ఏకంగా రిజర్వు బ్యాంకు రీతి రివాజులనే మార్చేయవచ్చు. జాతీయ భద్రత భజన చేస్తూనే ఆ భధ్రతకు ముప్పు తెచ్చే రీతిలో యుద్ధ విమానాల కొనుగోలును దివాళా తీసిన ఆశ్రితులకు పెట్టుబడులు సమకూర్చే క్రతువుగా మార్చవచ్చు. ఈ ఆరోపణలు ఆధారాలతో సహా కనిపిస్తున్నా మోడీ 'స్థిత ప్రజ్ఞ' చెక్కు చెదరలేదు. తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మోడీ ప్రచారం చేసిన శాసనసభ నియోజకవర్గాల్లో 75శాతం నియోజక వర్గాల్లో బీజేపీ ఓడిపోయినా మోడీ మౌనవ్రతం వీడలేదు. 2జీ స్పెక్ట్రం కుంభకోణం దర్యాప్తునకు సంయుక్త పార్లమెంటరీ సంఘం కోసం మూడు దఫాలుగా పార్లమెంట్‌ను స్థంభింప చేసిన బీజేపీ ఇప్పుడు రాఫెల్‌ కొనుగోళ్లపై అదే పని చేయటానికి, అవినీతిపై పోరాటంలో నిబద్దతను చాటుకోవటానికి సిద్ధం కావటం లేదు. పార్లమెంట్‌ రోజూ మిల్టన్‌ చెప్పిన పాండిమోనియంను తలపిస్తున్నా చట్టసభలను దారికి తెచ్చే చొరవ చూపటం లేదు. అటు పార్లమెంట్‌, ఇటు న్యాయ వ్యవస్థ, కార్యనిర్వాహక వ్యవస్థలు అన్నింటినీ ఆరెస్సెస్‌ ఎజెండాకు అనుగుణంగా నిరీర్యం చేయటంలో మోడీ మైఖేల్‌ మదన కామ రాజు పాత్రలు పోషిస్తున్నాడు.


             దేశం నిరంతర రావణకాష్టంగా మారుతున్నా మోడీ మౌనవ్రతాన్ని వీడకపోవటం గమనిస్తే మౌనం అర్థాంగీకారం అన్న సామెతను తిరగరాయాల్సిన అవసరం కనిపిస్తోంది. తన బలం, స్థాన బలంతో పాటు రాజకీయాల్లో సమయ బలం కూడా విలువైనదే. దేశంలో జరుగుతున్న పరిణామాలు మోడీ దూకుడుకు అడ్డు కట్ట వేస్తున్నాయి. అటువంటి సమయంలో ఆ అడ్డు కట్టలు తొలగించాలంటే ఎక్కువ శ్రమ చేయాలి. దానికి బదులు మౌనవ్రతం పాటించటం కన్నా మెరుగైన వ్యూహం మరోటి ఉండదు. ఈ పరిణామాలు, స్పందించాల్సిన అధినాధులు ఓరకంట గమనిస్తూ పెదవి విప్పక పోవటం గమనిస్తుంటే మత గ్రంధాల్లో కనిపించే ఓ పోలిక గుర్తుకొస్తోంది. సమస్త విశ్వం ప్రళయం విపత్తు అంచున ఉన్నప్పుడు, మునిగిపోతున్నప్పుడు, అస్థిత్వం కోల్పోతున్నప్పుడు హిందూ మతంలో ఒక్కో అవతార మూర్తి ఉద్భవించి ఆ ప్రళయం, విపత్తు, నాశనం నుంచి విశ్వాన్ని ఆదుకొంటాడు. క్రైస్తవంలో అయితే నోవా ఆఫ్‌ ఆర్క్‌ ఘటన దీన్ని ప్రతిబింబిస్తుంది. బీజేపీ కూడా అటువంటి ఘటన కోసం ఎదురు చూస్తూ ఉన్నట్టుగా కనిపిస్తోంది.

                    అయితే సాధారణ భక్తులకు ఇక్కడ ఓ ప్రశ్న తలెత్తుతుంది. అంత శక్తి శాలి అయిన భగవంతుడు అని చెప్పబడే వ్యక్తి లేదా శక్తి ఇటువంటి విపత్తును నిలువరించి జరిగే నష్టాన్ని కూడా నిరోధించవచ్చు కదా అన్న ప్రశ్న. అయితే ఇక్కడే పెట్టుబడి పాత్ర వస్తుంది. మతానికి నమ్మకం పెట్టుబడి. ఈ నమ్మకం నాలుగు కాలాల పాటు వర్ధిల్లాలంటే అన్ని కాలాల్లోనూ ఇలాంటి విపత్తులు జరుగుతూ ఉండాలి. నష్టం కనిపిస్తూ ఉండాలి. అలా నష్టపోయిన జీవులకు ఆఖరి ఆశగా సో కాల్డ్‌ భగవంతుడు ఉద్భవించాలి. ఇదీ మతం యొక్క (కు)తంత్రం. ఇదే వ్యూహతంత్రాన్ని మోడీ తు.చ తప్పకుండా పాటిస్తున్నాడు. కనిపించని కల్కి అవతారంలో వచ్చే దేవుడు కండ్ల ముందు జరిగే ఘోరాలన్నింటికీ చరమగీతం పలుకుతాడు అన్న నమ్మకం మనకు తెలుసు. మోడీ కూడా కల్కి అవతారమెత్తాలని ఆరెస్సెస్‌ శ్రేణులు వ్యూహరచన చేస్తున్నాయి. అందులో భాగమే కోట్లాది మంది ప్రజలు కష్టాలు, కడగండ్లకు గురవుతున్నా ప్రధాని మౌనవ్రతం.

                 ఇది నయా కార్పొరేట్‌ పరిపాలన పద్ధతి. ఏదైనా ఓ పెద్ద కంపెనీలో దిగువ స్థాయిలో అనేక సమస్యలు రోజూ కనిపిస్తుంటాయి. అయితే కంపెనీ కీలక యజమాని రోజూ స్పందిచడు. కార్మికులు లేదా పరిపాలన విభాగంలోని ఉద్యోగులు తమ అర్జీలు సమర్పించుకునేందుకు, బాధలు వినిపించేందుకు సదరు యజమాని అందుబాటులో ఉండడు. తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావుదీ ఇదే శైలి. అలా ప్రజలకు అందనంత ఎత్తులోనో, దూరంలోనో ఉన్నప్పుడే అటువంటి వాళ్ల శక్తి సామర్ధ్యాల పట్ల అభూతకల్పనలు అల్లటానికి అవకాశం ఉంటుంది. అటువంటి అభూత కల్పనలను సజావుగా ఉంచగలగటం ఆధునిక రాజకీయ ప్రచార వ్యూహం. విజయమంత్రం. మోడీ పాటిస్తున్నదీ అదే. సాధారణంగా సమస్యలు పరిష్కరించి ప్రజల మన్ననలు పొందటం పాతకాలపు సాంప్రదాయక రాజకీయ ప్రచార వ్యూహం. సమస్యలు కుప్ప పోసి వీటిని పరిష్కరించాలంటే ఆ ఒక్కడు మాత్రమే చేయగలడు అని నమ్మించటం, రాజకీయ ప్రయోజనం పొందటం, ఎన్నికల్లో గెలుపొందటం తదనుగుణంగా ప్రచార వ్యూహం రూపొందించుకోవటం ఆధునిక కార్పొరేట్‌ రాజకీయ వ్యూహం.

               అందులో భాగమే రాజ్యాంగ వ్యవస్థలన్నింటినీ నిర్వీర్యం గావించటం. ఒకటి తర్వాత ఒకటిగా అన్నింటినీ నీరుగార్చి చివరకు కల్కి అవతారంలో వచ్చి ఈ కుదేలైన వ్యవస్థలను నిలబెట్టే బాహుబలిగా మోడీని చిత్రీకరించటంలో భాగం ఈ మౌనవ్రతం. లేని ఉత్పాతాన్ని చూపించటం, బూచిని చూపించి ఓటర్ల చేత చేదు గుళికలు మింగించాలంటే ఈ మాత్రం మౌనం అవసరం. ఈ స్థాయిలో గందరగోళం చెలరేగకపోతే పొడచూపే ఆశారేఖల కోసం జనం ఆబగా ఎదురుచూడరు. భారతదేశంలో నేడు ఆశ - నిరాశలు, సంక్షోభం - పరిష్కారాలు, గందరగోళం - క్రమశిక్షణలు, పాలనా వ్యవస్థల నిష్క్రియాపరత్వం - పాలకుల దన్నుతో సాగే మూక హత్యలు (బులంద్‌ షహర్‌ తరహాలో) జోడెద్దులుగా సాగుతున్నాయి. ఈ మౌనం చెలరేగుతున్న సంఫ్‌ు పరివార్‌ శ్రేణుల దుష్కృత్యాలకు ప్రభుత్వం ప్రకటించే మద్దతు. మోడీ ఈ నాలుగున్నరేండ్లలో తొలిసారి ఇచ్చిన ఇంటర్వూ కేవలం ఏకపాత్రాభినయంగానే మిగిలిపోతుంది. ఇందులో దేశం ఎదురు చూస్తున్న ప్రశ్నలకు సమాధానాలు లేవు. రాజు గారి కొత్త బట్టల సామెతే. దేశం ఎదుర్కొంటున్న సమస్యలుగా ప్రజలు భావిస్తున్న వాటికి ఈ ఇంటర్వూలో మౌనమే సమాధానంగా ఉంది. మోడీ, పాలక ఆరెస్సెస్‌ బీజేపీలు సమాధానాలు ఇచ్చే ప్రశ్నలు మాత్రమే ఇంటర్వూలో అడిగారు. ఇలాంటి వ్యూహాత్మక మౌనం వెనక ఉన్న రాజకీయ దురుద్దేశాన్ని దేశం ముందుంచటమే బాధ్యతాయుతమైన ప్రతిపక్షాల కర్తవ్యం.

కొండూరి వీరయ్య
సెల్‌: 9871794037

No comments: