Monday, August 30, 2010

ఢిల్లీలో 'జనంపాట-జనంమాట'



తెలంగాణా సాయుధ పోరాట యోధుడు, ప్రజా కవి సుద్దాల హనుమంతు శతజయంతి ఉత్సవం ఢిల్లీలో ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన 'జనంపాట-జనంమాట' కార్యక్రమం స్థానిక తెలుగు ప్రజలను ఉర్రూతలూగించింది. మూడు గంటలకు పైగా ఏకబిగిన సాగిన సాంస్కృతిక సాయంత్రం ఆహూతులను కట్టిపడేసింది. ఆదివారం ఇక్కడి ఆంధ్రప్రదేశ్‌ భవన్‌లో సాహితి, ఆంధ్ర అసోసియేషన్‌ సంస్థలు సంయుక్తంగా ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి తెలుగు ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. పాత్రికేయులు ఎ. కృష్ణారావు అధ్యక్షతన ఈ సందర్భంగా జరిగిన సదస్సులో ప్రజాశక్తి మాజీ సంపాదకులు వి.శ్రీనివాసరావు, సినీ గేయ రచయిత సుద్దాల అశోక్‌తేజ, ఉద్యమ గేయ రచయిత, గాయకుడు గోరటి వెంకన్న, ఆశుకవి అందెశ్రీ, ఆంధ్రా అసోసియేషన్‌ అధ్యక్షులు కోటగిరి వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. ప్రపంచీకరణ ప్రభావం వల్ల ప్రజా కళలు కార్పొరేట్‌ కౌగిలిలో విలవిలలాడుతున్నాయని తన ప్రారంభోపన్యాసంలో శ్రీనివాసరావు పేర్కొన్నారు. ' కామన్‌వెల్త్‌ క్రీడల కోసం తాను రూపొందించిన థీమ్‌సాంగ్‌కు ఎఆర్‌ రహమాన్‌ ఐదున్నర కోట్లు వసూలు చేశారు. పల్లెటూరి పిల్లగాడా....అంటూ తెలంగాణా ప్రజానీకాన్ని తట్టిలేపిన సుద్దాల హనుమంతకు మనం ఎన్నికోట్లు ఇవ్వాలి ?



ప్రజల కోసం పనిచేశాడు కాబట్టే వంద సంవత్సరాల తర్వాతా ఆయన్ను మనం స్మరించుకుంటున్నాం. ఆయన ప్రజాభక్త హనుమంతు..రామభక్త హనుమంతు కాదు..కాబట్టే ఆయన చిరంజీవి ' అని శ్రీనివాసరావు వ్యాఖ్యానించారు. అవార్డులు, రివార్డులు లేకపోయిన ప్రజలిచ్చిన ప్రజాకవి అన్న బిరుదు ముందు అన్నీ దిగదుడుపేనని పేర్కొన్నారు. ప్రజా కళలను హనుమంతు వంటి ప్రజా కళాకారులను ప్రభుత్వాలు ఉద్దేశపూర్వకంగానే మరుగునపరిచే ప్రయత్నం చేస్తున్నాయని విమర్శించారు. వ్యాపార ధోరణుల మధ్య చిక్కిశల్యమౌతోన్న ప్రజా కళలను కాపాడటమే హనుమంతుకిచ్చే నిజమైన నివాళి అని ఆయన పేర్కొన్నారు. తెలంగాణా ప్రజల దుర్భర జీవిత పరిస్థితులే తన తండ్రిని ఒక ప్రజాకవిగా మార్చాయని అశోక్‌తేజ పేర్కొన్నారు. ఆర్య సమాజంలో క్రియాశీలంగా పనిచేసిన తన తండ్రిని పేదల బాధలే కమ్యూనిస్టుగా మలిచాయని వివరించారు. నూరు ఉపన్యాసాలు, నాటికల కంటే ఒక్క పాట ఎంతో శక్తివంతమైనదని హనుమంతు సుధృడంగా నమ్మారని పేర్కొన్నారు. సుద్దాల హనుమంతు ట్రస్ట్‌ అధ్వర్యంలో ఇకపై ప్రతిఏటా జానపద గాయకులు, పరిశోధకులకు అవార్డు ఇవ్వనున్నట్లు అశోక్‌తేజ ప్రకటించారు. ఆస్తులు కూడబెట్టే అవకాశాలు ఉండీ, ప్రజల కోసం జీవితాన్ని త్యాగం చేసిన హనుమంతే తమకు స్ఫూర్తని వెంకన్న పేర్కొన్నారు. వేమన, అన్నమాచార్య వలె సుద్దాల నిజమైన ప్రజాకవని ప్రశంసించారు.

అలరించిన జానపదాలు

సదస్సు అనంతరం వక్తలు పాడిన జానపదాలు శ్రోతలను విశేషంగా ఆకర్షించాయి. మూడు గంటలకు పైగా ఎంతో ఉత్సాహంతో సభికులు ఈ కార్యక్రమంలో లీనమవ్వడమే ఇందుకు నిదర్శనం. పల్లె కన్నీరు పెడుతుందో...అంటూ వెంకన్న, నేలమ్మనేలమ్మ నేలమ్మా...అంటూ అశోక్‌తేజ, నది నడిచిపోతున్నదీ...అంటూ అందెశ్రీ ఉత్తేజపూరితంగా పాడిన పాటలు ఢిల్లీ తెలుగు ప్రజలను స్పందింప చేశాయి. ప్రజా కళాకారులు చైతన్య, ఉదరు తదితరులూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Monday, August 2, 2010

ద్రవ్యోల్బణంతో యుపిఎ-2 సయ్యాట

పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాలు మొదటి వారం రోజులు గడిచాయి. ధరాఘాతం సెగతో ఈ వారం రోజులూ ఎటువంటి చర్చలు, బిల్లులు చేపట్టకుండానే వాయిదా పడ్డాయి. ధరల పెరుగుదలను నియంత్రించటంలో యుపిఎ-2 ప్రభుత్వ వైఫల్యం గురించి వాయిదా తీర్మానంపై చర్చ జరపాలని ప్రతిపక్షాలు పట్టు పట్టాయి. ప్రతిపక్షాలు ప్రతిపాదించిన తీర్మానం కింద ఓటింగ్‌ జరుగుతుంది. ప్రభుత్వం ఇందుకు సిద్ధంగా లేదు. దాంతో స్పీకర్‌ మాటల్లో రోజువారీ వ్యవహారాలపై ఓటింగ్‌ ఆధారిత చర్చ జరపాలని పట్టుపట్టటం అసమంజసం అని ప్రకటింపచేసింది ప్రభుత్వం.

ఇదే సంవత్సరం ధరల సమస్యపై పార్లమెంట్‌ స్థంభించటం వరుసగా ఇది మూడో సారి. ఫిబ్రవరి చివరి వారంలో తీవ్రమైన చర్చ జరిగింది. ఏప్రిల్‌లో మరోమారు బడ్జెట్‌ సందర్భంగా ప్రతిపక్షాలకు అందుబాటులో ఉండే సాధనం కోత తీర్మానం ద్వారా ధరల నియంత్రణలో ప్రభుత్వ వైఫల్యంపై చర్చ జరిగింది. వివిధ సందర్భాల్లో ధరల అదుపు గురించి ప్రభుత్వం చేసిన ప్రకటనలు, వాగ్దానాలు, ఇచ్చిన హామీలు, చేరుకున్న అంచనాలను పరిశీలించినప్పుడు వాగ్దానాలకు, అంచనాలకు మధ్య పోలిక లేదని అర్థమవుతోందని. అయినా ధరల పెరుగుదలపై ఈ హామీలు, అంచనాలు, వాగ్దానాలు ఏమాత్రం ప్రభావం చూపలేకపోయాయి. బహుశా మూడునెల్ల వ్యవధిలో రెండు సార్లు ఒకే సమస్యపై దేశవ్యాపిత ఆందోళనలు జరిగాయి. అయినా ప్రభుత్వం తగిన ముందస్తు చర్యలు తీసుకోలేదు. పైగా తీసుకున్న ఇతర విధాన పరమైన చర్యలు కూడా ద్రవ్యోల్బణాన్ని, తద్వారా ధరల భారాన్ని పెంచాయే తప్ప తగ్గించలేకపోయాయి. దాంతో ఈ అంశంపై ప్రతిపక్షాలు పట్టుబట్టాయి. ప్రభుత్వం షరామామూలుగానే అంగీకరించలేదు. వారం రోజుల సమావేశాల్లో విలువైన సమయం దుర్వినియోగం కావటంపై పలువురు వ్యాఖ్యాతలు గుండెలు బాదుకుంటున్నారు. ప్రతిపక్షాలదే తప్పన్నట్లు వాదిస్తున్నారు. నిజానికి జరిగింది ఏమిటి అన్నది ఇక్కడ పరిశీలిద్దాం.

నవంబరు 2009 - ఆర్థిక సంవత్సరంముగింపునాటికి ఆహార ధాన్యాల ద్రవ్యోల్బణం అదుపులోకి వస్తుంది - అహ్లువాలియా

ఫిబ్రవరి 16, 2010 - ఆహార ధాన్యాల ధరలు పడిపోవటం ప్రారంభమైంది. రానున్న కాలంలో మరింత పడిపోతాయి. - పవార్‌

ఫిబ్రవరి 6, 2010 - ఇక కష్ట కాలం గట్టెక్కినట్లే - ప్రధానమంత్రి

మే 24, 2010 - డిశంబరు నాటికి ద్రవ్యోల్బణం ఆరు శాతానికి తగ్గుతుంది. - ప్రధానమంత్రి

జూలై 24, 2010 - రోజురోజుకు ఆహారోత్పత్తుల ద్రవ్యోల్బణం తగ్గిపోతోంది - ప్రధానమంత్రి

జూలై 24, 2010 - పంటల సీజన్‌ పూర్తయ్యాక ద్రవ్యోల్బణం అదుపులోకి వస్తుంది - పవార్‌

సాధారణంగా ఏ దేశంలోనైనా ఆర్థిక వ్యవస్థ రాజకీయ వ్యవస్థ ప్రయోజనాలకు అనుగుణంగా ఉంటుంది. రాజకీయ వ్యవస్థలో ఎన్నికైన ప్రభుత్వానికి, అధికారంలో ఉన్న వారిది పైచేయి. అంటే గద్దెనెక్కిన వారు తమ రాజకీయ ప్రయోజనాలకు అనుగుణంగా ఆర్థిక వ్యవస్థకు సంబంధించిన విధి విధానాలు ఎంచుకోవాల్సి ఉంది. అనుసరించాల్సి ఉంది. అంటే రాజకీయాలు ఆర్థిక వ్యవస్థను నిర్దేశిస్తాయి. నిర్దేశించాలి. అభివృద్ధికి సంబంధించిన ఆర్థిక విధానాలు, డెవలప్‌మెంటల్‌ ఎకనమిక్స్‌ అమలు జరిగే అన్ని దేశాల్లోనూ ఇదే జరుగుతుంది. కానీ ప్రపంచీకరణతో ఈ క్రమం తారుమారు అయ్యింది. ప్రపంచీకరించబడిన ఆర్థిక వ్యవస్థ అవసరాలు, అవకాశాల మేరకు దేశీయ ఆర్థిక విధానాలు రూపొందుతున్నాయి. అందువల్లనే ప్రభు త్వం వార్షికంగావిడుదల చేసే ఆర్థిక సర్వేలోనూ, రెండున్నర, మూడేళ్లకొకసారి విడుదల చేసే ప్రణాళిక మధ్యంతర సమీక్షలోనూ, ఐదేళ్లకొకసారి రూపొందించే పంచవర్ష ప్రణాళికలోనూ ... అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ పరిణామాలకు లోబడి... అన్న వాక్యం చేర్చటం సర్వసాధారణంగా మారింది. ఈ ఒక్క వాక్యంతో ప్రభుత్వాలు దేశీయంగా చేపట్టాల్సిన చర్యల నుండి తమ బాధ్యతను విరమించుకుని చేతులెత్తేస్తున్నాయి. ఈ క్రమంలో రాజకీయ వ్యవస్థపై ఆర్థిక రంగం స్వారీ చేయటానికి కావల్సిన పరిస్థితిని కల్పిస్తున్నాయి. పరిస్తితిని ఇలా కాకపోతే మరెలా అర్థం చేసుకోవాలి ?

2009 ఎన్నికలకు ముందు తారా స్థాయికి చేరిన ధరల గురించి సోనియా గాంధీ ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు మాంటెక్‌సింగ్‌ అహ్లువాలియాతో సమావేశం అయ్యారు. ఆ సమావేశం తర్వాత విలేకరులతో మాటా ్లడుతూ అహ్లువాలియా 2009 మార్చినాటికి ద్రవ్యోల్బణం అదుపులోకి వస్తుందని హామీ ఇచ్చారు. అంటే 2009 పార్లమెంట్‌ ఎన్నికల నాటికి ప్రభుత్వంపై ప్రజాగ్రహం లేకుండా చేయటానికి కావల్సిన కసరత్తు చేయగలమని చెప్పటమన్న మాట. 2009 ఎన్నికల తర్వాత వివిధ సందర్భాల్లో ప్రభుత్వాధినేతలు చేసిన ప్రకటనలు తేదీల వారీగా ఉన్నాయి. 2008లో ఆర్థిక వ్యవస్థను కట్టడి చేసి 2009 మార్చినాటికి ద్రవ్యోల్బణాన్ని అదుపు చేయగలిగిన ప్రభుత్వం 2009 తర్వాత ఎందుకు అదుపు చేయలేకపోతోంది ? 2009 ఎన్నికలకు ముందు ఆర్థిక వ్యవస్థ నడక తీరును సరిగ్గానే అంచనా వేయగలిగిన ప్రభుత్వం ఎన్నికల తర్వాత ఎందుకు అంచనా వేయలేకపోతోంది ? ప్రధానమంత్రి స్థాయిలోని వ్యక్తి ఫిబ్రవరి 6, 2009 నాటికి ప్రజలు ధరల విషయంలో కష్టకాలం నుండి గట్టెక్కినట్లేనని ఆశాభావం వ్యక్తం చేశారు. అంతేకాదు. 2009 మే 24, జూలై 24న చేసిన ప్రకటనల్లో సైతం డిశంబరు నాటికి ద్రవ్యోల్బణం పెరుగుదలను నియంత్రించగలమని ప్రకటించారు. కానీ మరి జరిగిందేమిటి ? తాజాగా 24 జూలై 2010న జరిగిన జాతీయ అభవృద్ధి మండలి సమావేశాల్లో వ్యవసాయ శాఖ మంత్రి ప్రణబ్‌ ముఖర్జీ మాట్లాడుతూ ఖరీఫ్‌ పంట రుతువు తర్వాత ద్రవ్యోల్బణం అదుపులోకి వస్తుందని అభిప్రాయపడ్డారు. తాజాగా గత నెల్లో పెంచిన పెట్రోలు ధరల ప్రభావం వల్ల మరో రెండు పాయింట్లు ద్రవ్యోల్బణం పెరిగిందని స్వయంగా ప్రభుత్వ ప్రధాన గణాంకాల అధికారి ప్రకటించారు. మరోవైపున ప్రభుత్వం ధరల సమస్యను నేడున్న పరిస్థితులకనుగుణంగా పరిష్కరించటానికి గాక ఫలానా సమయంలో పరిష్కరించబడుతుంది, ఫలానా తేదీ నాటికి అదుపు చేయబడుతుంది అని జోస్యం చెప్పటానికే పరిమితం అవుతుంది. ఈ ప్రకటనలన్నీ వ్యవసాయోత్పత్తుల దిగుబడి కాలంతో ముడి పడి ఉన్నాయి. అంటే వ్యవసాయ దిగుబడులు చేతికొచ్చే సమయానికి నిల్వలు పెరిగి, కాగితాలపై మాత్రం డిమాండ్‌ సరఫరా సూత్రం ప్రకారం ద్రవ్యోల్బణం తటస్థ స్థాయికి చేరుతుంది. మిగిలిన సమయానికంటే ప్రజల వద్ద కాస్తోకూస్తో అదనపు నిధులు సమకూరతాయి. దాంతో ఒక వేళ ధరలు అదే స్థాయిలో ఉన్నా గత ఏడెనిమిది నెల్లుగా అలవాటు పడిన ప్రజలు నెలసరి వెచ్చాల ఖాతాలో మార్పులు చేసుకుని సర్దుకు పోతారు. ఈ విషయం మనం నిత్యజీవితంలో చూస్తూ ఉన్నదే. అంతే తప్ప ప్రభుత్వం ధరల తగ్గింపు కోసం క్రియాశీలకంగా ఏదో నిర్ణయం తీసుకుని, ఆ తీసుకున్న నిర్ణయాన్ని అమలు చేయటం వల్ల ధరల ప్రభావంలో మార్పులు రావటం అనుకోవటానికి అవకాశమే లేదు. నేడు ప్రభుత్వం కూడా చెప్తున్న వాదన ఇదే. పెరుగుతున్న జనాభా రేటు, పెరుగుతున్న ఆహార ధాన్యాల ఉత్పత్తి రేటు, మారుతున్న ప్రజల ఆహారపు అలవాట్లు అధ్యయనం చేస్తే కొరతకు అవకాశం లేదు. కనుక ధరల పెరుగుదల ఎలా సాధ్యం అన్నది నయాఉదార ఆర్థిక వేత్తలు ముందుకు తెస్తున్న వాదన. మార్కెట్‌ తన పని తాను చేసుకుపోతోంది. ఏ ఉత్పత్తులకు గిరాకీ ఉంటే ఆ ఉత్పత్తులకు ధరలు పెరుగుతున్నాయి అన్నది మరో వాదన. మరి వంద కోట్లకు పైగా ఉన్న ప్రజలు రోజుకు ఒక పూట కడుపు నిండా తినాలన్నా ఆహార ధాన్యాల గిరాకీ పెరుగుతుందన్న మాట. మరి ప్రజలకు కావల్సిన ఆహార పదార్ధాలు కూడా మార్కెట్‌ దయకు వదిలేస్తే ఈ ప్రభుత్వాలు సాధించేది ఏమిటి ? సేవ చేస్తుంది ఎవరికి? అన్న ప్రశ్నలు తలెత్తటం సహజం. ఇక్కడే ద్రవ్యోల్బణానికి, రాజకీయాలకు మధ్య సంబంధం తెరమీదకు వస్తుంది. ప్రభుత్వం ఏ వస్తువుల ధరలు అదుపులో ఉంచితే పారిశ్రామిక వర్గాల లాభాలు సుస్థిరంగా ఉంటాయో ఆ వస్తువులు, ఉత్పత్తుల ధరలు అదుపు చేస్తోంది. ఉదాహరణకు ఇనుము, ఉక్కు అత్యధికంగా వినియోగించేది మౌలిక సదుపాయాల రంగంలోని కంపెనీలు. అంటే ఎస్‌ఇజెడ్‌లలో కొత్త యూనిట్లు ప్రారంభించే కంపెనీలు, జాతీయ రహదారులు నిర్మించే కంపెనీలు. ఈ ఉత్పత్తుల ధరలు పెరిగితే ప్రభుత్వం అగ్గిమీద గిగ్గలమైపోతుంది. వరుసగా ఈ సరుకు ఉత్పత్తిదారులు, మార్కెట్‌ విక్రయదారులతో సమావేశాలు ఏర్పాటు చేసి నయానో భయానో ధరలు తగ్గించేందుకు చర్యలు తీసుకుంటుంది. అవసరమైతే ఈ సరుకు ఉత్పత్తిదారులకు తగ్గే లాభాలను పూడ్చటానికి పన్ను రాయితీలుఇస్తుంది. మరి నిత్యం ప్రజలు ఉపయోగించే నిత్యావసర సరుకుల ధరలు పెరిగినపుడు అటువంటి ప్రయత్నం ఎందుకు చేయదు? ఈ విషయాన్ని చర్చించటానికే ప్రతిపక్షాలు వాయిదా తీర్మానం కోరుతున్నాయి. ఈ విషయంపై అంతగా ఆసక్తి, అవసరం లేని ప్రభుత్వం దీన్ని తిరస్కరిస్తోంది. అటువంటపుడు పార్లమెంట్‌ను స్తంభించటం మినహా మరో మార్గం లేకపోతోంది.

కొండూరి వీరయ్య