Feb 19,2019
http://www.navatelangana.com/article/net-vyaasam/768904
పుల్వామా దాడి నిఘా వైఫల్యమా? విధాన వైఫల్యమా?
నలభైమంది బలైపోయిన సంఘటన పట్ల దేశమంతా అవాక్కయ్యింది. సోషల్ మీడియాలో దేశభక్తి పెల్లుబికింది. ప్రణాళిక ప్రకారం కొవ్వొత్తుల ప్రదర్శనలు, నినాదాలు, ప్రతిజ్ఞలు జరిగిపోయాయి. ఇంకా మరికొందరు 'దేశభక్తులు' మరో అడుగు ముందుకేసి దేశ పౌరులంతా తమ దినసరి ఆదాయంలో ఒక్కో రూపాయి అమర జవాన్‌ల నిధికి కేటాయించాలని, దేశభక్తి ఉన్న వారైతే సదరు మెస్సేజ్ చదివాక తమ పోన్‌లలో ఉన్న సోషల్ మీడియా గ్రూపుల్లో ఫార్వార్డ్ చేయాలని కూడా పిలుపునిచ్చారు. ఇంకొందరి దుందుడుకుతనం హద్దుమీరింది. డెహ్రాడూన్‌లో ఓ కాలేజీ చదువుతూ హాస్టల్లో నివశిస్తున్న జమ్ము కాశ్మీర్ విద్యార్థులపై దాడికి పూనుకున్నారు. వాట్సప్ సందేశాల్లో ఫిబ్రవరి 14ను ప్రేమికుల రోజుకు బదులు అమరుల దినోత్సవంగా జరపాలన్న ప్రతిపాదన కూడా వైరలైంది.మరోవైపు మీడియాలో అనేక సూచనలు, సలహాలతో కూడిన విశ్లేషణలు వచ్చాయి. కొందరు చేయి తిరిగిన రచయితలు దేశ యువత సహనం కోల్పోయిందని, తక్షణమే ప్రభుత్వం పాకిస్థాన్ పీచమణచాలని సూచించారు. మరికొందరు రచయితలు జైషే మొహ్మద్ ఉగ్రవాద సంస్థ తరహాలో భారతదేశం కూడా పాకిస్థాన్‌లో కోవర్ట్ ఆపరేషన్ నిర్వహించాల్సిన దళాలను తయారు చేసుకోవాలని కోరారు. సాంస్కృతిక సంబంధాలు తెంచుకోవాలని కొందరు, ఆర్థిక సంబంధాలు తెంచుకోవాలని కొందరు వాఘా బోర్డర్ వద్ద బాలీవుడ్ బాజార్ ఎత్తేయాలని మరికొందరు... చెప్పుకుంటూ పోతే మహాభారతమే అవుతుంది. తాజాగా ప్రభుత్వం రాష్ట్రాల వారీగా ఈ అమరుల జాబితా తయారు చేసి ఆయా రాష్ట్రాల్లో ఘన నివాళి అర్పించే వ్యూహరచన చేసింది. ఈ నివాళి ప్రణాళిక గమనిస్తే గోధ్రా రైలు మృతుల నివాళిపేరుతో విశ్వహిందూ పరిషత్ సాగించిన మారణకాండ గుర్తుకొస్తోంది. ఈ ప్రణాళిక ఇప్పటికే పని చేయటం ప్రారంభించింది. హైదరాబాద్‌లో ప్రవేశించే వారికి ఎల్బీనగర్ మొదలు సికిందరాబాద్ స్టేషన్ వరకు అన్ని హౌటళ్లలో ఖుదాగవా, బోర్డర్, సర్‌ఫరోష్ వంటి సీమాంతర ఉగ్రవాదం కథనంగా ఉన్న సినిమా పాటలు పెట్టారు. అన్ని పాఠశాలలు, కాలేజీల్లో విద్యార్థులకు నేషనల్ కాడెట్ కోర్సు వేషధారణలో సంఘీభావ ప్రదర్శనలు నిర్వహించటం చూడొచ్చు. బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షా అస్సాంలో భారతీయ యువమోర్చా సమావేశంలో మాట్లాడుతూ కేంద్రంలో గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం కాబట్టి చేతులు ముడుచుకు కూర్చున్నదని మోడీ నాయతక్వంలో బీజేపీ ప్రభుత్వం పాకిస్థాన్‌కు తగిన రీతిలో సమాధానం చెపుతుందని హుంకరించారు. ఏదో ఒక సంఘటనను ఉపయోగించుకుని దేశభక్తి పేరుతో ఆరెస్సెస్ తన ఎజండా ఎలా జొప్పిస్తుందో గుర్తించేందుకు ఈ పరిణామాలు ఓ ఉదాహరణగా నిలుస్తాయి. దేశభక్తి పేరుతో జరిగే ప్రతి చర్య, నినాదం వెనక దేశభక్తిని మించిన రాజకీయ ఎజెండా దాగి ఉందన్న వాస్తవాన్ని విడమర్చి చెప్పటానికే ఇన్ని ఉదాహరణలు.
పుల్వామాకు ఆనుకుని ఉన్న పింగ్లాన్ గ్రామంలో తలదాచుకున్న జైషే మొహ్మద్ అధినేత మౌలానా మసూద్ అజర్ కుడిభుజం అని చెప్పబడుతున్న కమ్రాన్‌ను దుర్ఘటన జరిగిన నాలుగు రోజుల్లోనే భారత సైన్యం మట్టుబెట్టిందన్న వార్తలొచ్చాయి. ఈ రెండు రకాల వార్తలను జాగ్రత్తగా పరిశీలిస్తే పుల్వామా దుర్ఘటనకు నిఘా వ్యవస్థల వైఫల్యం కారణమంటూ వస్తున్న వార్తలు నిజం కాదని స్పష్టం. ఇటువంటి దాడికి సీమాంతర ఉగ్రవాద సంస్థలు పాల్పడే అవకాశం ఉందన్న సమాచారం నిఘా సంస్థల ద్వారా కేంద్రానికి, ప్రధాని కార్యాలయానికి, జాతీయ భద్రతా సలహాదారు వద్ద ముందే పోగుపడిందన్న విషయం స్పష్టమవుతోంది. ఏటా ఆగస్టు 15కో, జనవరి 26కో ఉగ్రవాదదాడి పొంచి ఉందంటూ మహానగరాల నుంచి మారుమూల పట్టణాల వరకు కాశ్మీర్‌లోని గుల్‌మోహర్ మొదలు ఏపీలోని గుంటూరు వరకు పొలీసులు, రిజర్వు బలగాల పహారా పెడుతూ ఉంటారు. ప్రజాతంత్ర యుతంగా ఎన్నికైన జమ్ము కాశ్మీర్ రాష్ట్ర ప్రభుత్వాన్ని రద్దుకు కూడా కేంద్రం ఈ ఉగ్రవాదుల భయాన్నే వాడుకుంది. ఏకంగా రాష్ట్ర గవర్నర్ మాలిక్ రాష్ట్ర ప్రభుత్వం ఉగ్రవాదులతో చేతులు కలిపే అవకాశాలు ఉన్నందున మొహబూబా ముఫ్తి నేతృత్వంలోని ప్రభుత్వ రద్దు చేసి రాష్ట్రపతి పరిపాలన విధించారు. రాష్ట్రపతి పాలన అంటే ఏకంగా మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వ పాలనే. 1996లో యునైటెడ్ ఫ్రంట్ నేతృత్వంలో అప్పటి వరకు దాదాపు దశాబ్దంన్నరకు పైగా కొనసాగిన రాష్ట్రపతిపాలన రద్దు చేసి ఎన్నికలు జరిపే సాహసానికి పూనుకున్నది. కానీ 56అంగుళాల ఛాతీ కలిగిన మోడీ నాయకత్వంలో రెండు దశాబ్దాల తర్వాత తిరిగి రాష్ట్రపతి పాలన పడగనీడకు చేరింది జమ్ముకాశ్మీర్. మరి ఈ రెండు దశాబ్దాల పాటు అందుబాటులో ఉన్న శాంతియుత పరిస్థితుల్ని ఉపయోగించుకుని జమ్ము కాశ్మీర్ యువతను ప్రధాన జనజీవన స్రవంతిలోకి తేవటానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేసిన ప్రయత్నాలేమిటి? అటువంటి ప్రయత్నాలు జయప్రదమై ఉంటే సీమాంతర ఉగ్రవాదమే కాదు, గ్రహాంతర ఉగ్రవాదం కూడా దేశాన్నేమీ చేయలేదు. పాలకవర్గాల ఈ వైఫల్యాన్ని కప్పి పుచ్చుకోవటానికి దేశభక్తి పేరుతో ప్రజల కండ్లు గప్పేందుకు ప్రయత్నం చేయటం ప్రజాస్వామ్యానికి ప్రమాద కరం. కాశ్మీరీ యువతను నిరుద్యోగులుగా గుర్తించి ఉపాధి అవకాశాలు పెంచే విధానాలు రూపకల్పన చేయటానికి బదులు బీజేపీ ప్రభుత్వం ఈ కాశ్మీరీ యువతను ముస్లింలుగానూ, పాకిస్థాన్ మద్దతు దారులుగానూ చూపించటం ద్వారా చేతులు దులిపేసుకునేందుకు సిద్ధమవుతోంది. కాశ్మీర్‌కు దేశానికి మధ్య మరింత దూరం పెంచుతోంది.
ప్రధాని కార్యాలయంలో జాతీయ భద్రతా సలహాదారు మాటే శాసనం. దేశంలోనే అత్యంత చాకచక్యం కలిగిన నిఘా అధికారి అజిత్ దోవల్ అటువంటి కీలక బాధ్యతల్లో ఉన్నారు. ఒకవైపున దేశ చరిత్రలోనే అత్యంత దైర్యవంతుడైన, భారీ ఛాతీ కలిగిన మోడీ, మరో వైపున భారతీయ జేమ్స్ బాండ్ అని ముద్రను స్వంతం చేసుకున్న దోవల్ ద్వయం ఆధిపత్యం చలాయిస్తున్నా పుల్వామా ఘటన ఎందుకు జరిగింది? ఎలా జరిగింది? గత కొద్ది కాలంగా ప్రత్యేకించి డిసెంబరు, జనవరిల్లో జరిగిన అనేక పరిణామాలు పరిశీలిస్తే ఈ ప్రశ్నకు సమాధానం దొరుకుతుంది.
నవంబరులో మొదలైన సీబీఐ సంక్షోభం జనవరి నాటికి ఓ రూపానికొచ్చింది. బాద్యతల్లో ఉన్న సీబీఐ అధికారి అలోక్‌వర్మను ఇంటికి సాగనంటానికి కేంద్ర ప్రభుత్వం రీసెర్చ్, అనాలసిస్ వింగ్(రా) సిబ్బందిని ఉపయోగించింది. రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలు కుంభకోణాన్ని కప్పి పుచ్చటానికి నిఘావిభాగపు కీలక అధికారులను పనిలో పెట్టింది. మోడీకి డిసెంబర్, జనవరి అత్యంత కీలకమైన సమయం. బ్యాంకు రుణాల ఎగవేతదారులను, వేలకోట్లల్లో అక్రమ విదేశీ వ్యాపారాలు చేసే వారిని నియంత్రించాల్సిన ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ప్రతిపక్ష నాయకులను వెంటాడటంలో బిజీగా ఉండటంతో దాదాపు రూ.3లక్షల కోట్ల బ్యాంకు రుణాలు ఎగ్గొట్టిన భారీ కంపెనీల అధిపతులు కులాసాగా తిరుగుతున్నారు.
డిసెంబరులో జరిగిన శాసనసభ ఎన్నికల్లో కీలకమైన మధ్యప్రదేశ్, రాజస్థాన్, చత్తీస్‌ఘఢ్‌లలో బీజేపీ ఓడిపోయింది. అప్రమత్తమైన మోడీ దేశంలో వివిధ ప్రాంతాల్లోని నిఘా విభాగం ఉన్నతాధికారులందరినీ ఢిల్లీలో సమావేశపర్చి బీజేపీ ఓటమికి కారణాలు విశ్లేషించాలని పురమాయించారు. వచ్చేఎన్నికల్లో బీజేపీ విజయావకాశాల గురించీ అంచనా కట్టాలన్నది వారికి ఇచ్చిన ఆదేశాలు. ఇక జాతీయ భద్రతను తన భుజస్కంధాలపై మోస్తున్న అజిత్ దోవల్ సరిగ్గా ఆ బాధ్యతలు విస్మరించి రాఫెల్ ఒప్పందాన్ని గట్టెక్కెంచేందుకు రిలయన్స్ కంపెనీకి ఆర్థిక భద్రత కల్పించేందుకు తన శక్తి సామర్ధ్యాలు ధారపోయటంలోనే గడిపేస్తున్నారు.
ప్రభుత్వ విధాన లోపాల ఫలితమే పుల్వామా దుర్ఘటన అన్న విషయాన్ని కప్పిపుచ్చటానికి దేశభక్తిని ముందుకు తెస్తున్నారు. ఈ సంఘీభావ ప్రదర్శనల్లో పాల్గొన్న లక్షలాదిమందిది మాత్రమే నిజమైన దేశభక్తి అనీ, ప్రభుత్వం, నాయకుల వైఫల్యాలు ఎత్తి చూపేవారిది దేశద్రోహం అని ముద్రవేసేందుకు జరుగుతున్న ప్రయత్నాలు ప్రజాస్వామ్యానికి రానున్న కాలంలో పొంచి ఉన్న ప్రమాద ఘంటికల గురించి హెచ్చరికలే.
- కొండూరి వీరయ్య
సెల్: 9871794037
No comments:
Post a Comment