Feb 28,2019
http://www.navatelangana.com/article/net-vyaasam/773094
ఉద్రేకాలు పెంచటంతో ఉగ్రవాదం అంతమౌతుందా?
బాలాకోట్ అడవుల్లో దాగి ఉన్న ఉగ్రవాద శిక్షణా కేంద్రాన్ని భారత వాయుసేన ధ్వంసం చేసింది. దాడిలో భాగంగా గ్వాలియర్, ఆగ్రా, భటిండా మూడు వైమానిక శిబిరాల నుంచి 12 యుద్ధ విమానాలు గాల్లోకి లేచాయి. అంబాలా వైమానిక బేస్ వరకు మూకుమ్మడిగా ప్రయాణించిన ఈ యుద్ధ విమానాలు అక్కడ నుంచి వేర్వేరు దారుల్లో ముందుగా వేసుకున్న పథకం ప్రకారం చీలిపోయాయి. మధ్యలో గగనతలంలోనే యుద్ధ విమానాలకు అవసరమైన చమురు సరఫరాకు కూడా ఏర్పాట్లు జరిగాయి. యుద్ధ వ్యూహం రీత్యా ఇది చూడటానికి, చదవటానికి ఆసక్తిగానే ఉంటుంది. ఉదయం 11.30 ప్రాంతంలో విలేకరుల సమావేశంలో మాట్లాడిన విదేశాంగ శాఖ కార్యదర్శి నిఘా వర్గాల సమాచారం మేరకు భారతదేశంపై మరింత ఉధృతమైన దాడులకు జెయిషే మొహ్మద్ తీవ్రవాద సంస్థ సిద్ధపడుతున్నందున, ముందస్తు జాగ్రత్తగా సైనికేతర దాడికి పాల్పడ్డామని, ఈ దాడిలో సాధారణ ప్రజలకు ఎటువంటి హాని జరక్కుండా జాగ్రత్త పడ్డామని ప్రకటించారు.ఏది ఏమైనా ప్రభుత్వ ప్రకటనల ప్రకారమే భారత వైమానిక దళం పాకిస్థాన్ సరిహద్దులోకి చొచ్చుకుపోయి బాంబులు వేసింది. ఈ బాంబు దాడిలో ఉగ్రవాద శిక్షణా శిబిరంలో తలదాచుకున్న మూడువందల మందికి పైగా ఉగ్రవాదులు చనిపోయారు. జైషే మొహ్మద్ వ్యవస్థాకుడు మసూద్ అజర్ మేనల్లుడు, శిక్షణ దళపతి కూడా చనిపోయినట్టు ప్రభుత్వం ప్రకటించింది. ఆ తర్వాత రక్షణ దళాల మంత్రివర్గ ఉపసంఘం సమావేశం జరిగింది. అయితే అప్పటికే పాకిస్థాన్ త్రివిధ దళాల అధికార ప్రతినిధి గఫార్ తన ట్వీటర్ పోస్టులో భారత వైమానిక దాడి గురించి ప్రస్తావించటంతో ప్రపంచం మేల్కొంది. వ్యూహాత్మకంగా రాజస్థాన్‌లోని చురు జిల్లాలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో నా చేతిలో దేశ భద్రతకు ఢోకా లేదు అంటూ ఉపన్యసించిన మోడీ 2019 ఎన్నికల్లో బాలాకోట్ దాడులను వ్యూహాత్మక ప్రచార సాధనంగా మార్చుకోబోతున్న విషయాన్ని చెప్పకనే చెప్పారు.
ఈ దాడి ద్వారా భారతదేశం సాధించదల్చుకున్న లక్ష్యాలు ఏమిటి? భారతదేశంలో ఎంచుకున్న ప్రాంతంలో ఎంచుకున్న రీతిలో పాక్ మద్దతుతో ఉగ్రవాదులు దాడి చేయగల సామర్ధ్యం కలిగి ఉండటం సైన్యంతో సహా భారతీయులెవ్వరికీ మింగుడు పడనిది. ఈ నేపథ్యంలో భారత సైన్యం కూడా పాకిస్థాన్‌లోకి చొరబడి క్షేమంగా వెనక్కు తిరిగిరాగవలని నిరూపించటం ఈ వ్యూహత్మక సైనిక లక్ష్యంలో మొదటి అంశం. బాలాకోట్ ప్రాంతంలో బాంబుదాడి జరిగిన చోట పెద్ద గుంట కనిపించిందని స్థానికులు చెప్పినట్టు రాయటర్స్ వార్తా సంస్థ ప్రకటించింది. 300మందికి పైగా మరణించిన చోట కనిపించాల్సిన కకావికలమన పరిస్థితులు అక్కడ కనిపించలేదన్నది ఈ వార్త సారాంశం. భారతీయ నిఘా వర్గాల అంచనా ప్రకారం అక్కడ శిక్షణా కేంద్రం ఉండి ఉండవచ్చు. పుల్వామా దాడి తర్వాత ఉగ్రవాదులందరూ బాలాకోట్‌లోనే తలదాచుకుని ఉన్నారా అన్న సందేహం ఇప్పుడు అంతర్జాతీయ సందేహంగా మారింది.
వాయుసేన చేపట్టిన ఈ దాడి విజయవంతమైందని ప్రభుత్వం ప్రకటిస్తోంది. కానీ ఈ విజయాలను ఖరారు చేసే విధంగా ఏరకమైన ఫొటోలు, కనీసం బాంబుదాడికి గురైన ప్రదేశానికి సంబంధించిన భౌగోళిక చిత్రపటాలు, మ్యాప్‌లు కూడా విడుదల చేయలేదు. ఖాళీ స్థలంలో బాంబులు పడటంతో అక్కడ పెద్దగుంట పడిందంటూ పాకిస్థాన్ సైనిక అధికార ప్రతినిధి ట్విటర్‌లో విడుదల చేసిన ఫోటోలు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. ఈ దాడిలో ఫాల్కన్ యుద్ధ విమానాలు కూడా ఉపయోగించారనీ, మిరేజ్ యుద్ధ విమానాల్లో లేజర్ కిరాణాల ద్వారా లక్ష్యాలను గుర్తించారని వార్తలు వచ్చాయి. అటువంటి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని కలిగిన యుద్ధ విమానాలు దాడి తర్వాత ఉన్న పరిస్థితికి సంబంధించిన ఏ వివరాలు మోసుకు రాలేకపోయాయంటే ఆశ్చర్యం వేస్తోంది. 1990లో ఇరాక్‌పై జరిగిన దాడిలో స్కడ్ క్షిపణులు మోసుకెళ్లిన ఈ ఫాల్కన్ విమానాలే దాడి అనంతరం దాడిలో జరిగిన నష్టాన్ని ధృవీకరించే చిత్రాలను కూడా సీఎన్‌ఎన్ ఇంటర్నేషనల్ టీవీ ద్వారా ప్రపంచానికి అందచేశాయి. బహుశా ఈ ఆధారాలన్నీ ప్రపంచం ముందుంచితే ప్రతిదాడి చేయాలంటూ పాకిస్థాన్ ప్రజలు ఆ ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తారని, ఉపఖండంలో యుద్ధ వాతావరణం మంచిది కాదన్న ఉద్దేశ్యంతో జరిగిన నష్టానికి సంబంధించిన సాక్ష్యాధారాలు దాచి ఉంచితే మంచిదే. కానీ మోడీ ప్రభుత్వపు ఈ చర్య సఫలత ఈ రోజుకు ఈరోజే రుజువయ్యేది కాదు. రానున్న కాలంలో జైషే మొహ్మద్ ఉగ్రవాద ఘాతుకాలు ఏ మేరకు తగ్గుతాయో ఆమేరకు ఈ చర్యలు ఫలితాన్ని ఇచ్చినట్టు భావించాలి. కార్గిల్ విజయం పార్లమెంట్‌పై దాడి జరక్కుండా నిలువరించ లేకపోయిన సంగతిని, యూరి సర్జికల్ దాడులు పుల్వామా జరక్కుండా ఆపలేకపో యాయి అన్న విషయాన్నీ గుర్తు పెట్టుకోవాలి.
దాడికి ప్రభుత్వం నిర్దేశించుకున్న మరో లక్ష్యమే - మోడీ సామర్ధ్యాలను నిరూపించే లక్ష్యం - మరింత ఆందోళనకరమైనది. నిజమైన దేశభక్తులు, శాంతికాముకులు తీవ్రంగా పరిగణించాల్సిన విషయం. ఇందులో భాగమే 1971యుద్ధం తర్వాత తొలిసారి వాయుసేనను ప్రయోగించే సాహసం మోడీ మాత్రమే చేయగలిగాడన్న వాదన. ఇటువంటి చర్యలు ద్వారా సీమాంతర ఉగ్రవాదాన్ని నిలువరించటం, అడ్డుకట్టవేయటం సాధ్యం కాదన్న విషయాన్ని గుర్తించినందునే గత ప్రభుత్వాలు ఇందుకు పూనుకోలేదన్న వాస్తవం ఈ ప్రచార హౌరులో మరుగున పడిపోతోంది. 2001లో వాజ్‌పేయి ప్రభుత్వం, 2008లో మన్మోహన్ సింగ్ ప్రభుత్వం కూడా ఈ విధమైన లేప్రొస్కోపిక్ దాడుల గురించిన ప్రతిపాదనలను చర్చించినప్పటికీ ఈ దాడుల వల్ల ఒనగూడే రాజకీయ ప్రయోజనం కంటే ఆర్థికనష్టమే ఎక్కువని గుర్తించి తోసిపుచ్చాయి. ఉగ్రవాదాన్ని అంతమొందించటానికి వైమానిక దాడులే మార్గం అయితే అఫ్ఘనిస్తాన్, ఇరాక్‌ను నేలమట్టం చేయటానికి బదులు భారతదేశం కంటే శక్తివంతమైన వైమానిక సాయుధ సంపత్తి కలిగిన అమెరికా ఆయా దేశాల్లోని ఉగ్రవాద శిబిరాలపై దాడి చేస్తే సరిపోయేది. ఇజ్రాయెల్ ఎంత బలప్రయోగానికి పూనుకున్నా పాలస్తీనా ప్రజల తిరుగుబాటు చర్యలు, సైనికులు ఉగ్రవాద దాడులు కొనసాగుతూనే ఉండటం చూస్తూనే ఉన్నాం. దేశభక్తి హౌరులో, మోడీ భజన మోతలో వాస్తవాలు గుర్తించలేని స్థితికి చేరుతున్నామా అన్నది ఇక్కడ పరిశీలించాలి.
పుల్వామా దాడితో దెబ్బతిన్న భారతీయుల మనోభావాలను గౌరవించేందుకు మోడీ సర్కార్ ఈ దాడికి పూనుకున్నది అన్న వాదన చాలా ప్రమాదకరమైంది. భారతదేశ ప్రజల మనోభావాల పేరుతో మన ప్రభుత్వం ఒకవైపూ, పాకిస్థాన్ ప్రజల మనోభావాల పేరుతో ఆ పాలకులు మరోవైపు స్పందిస్తే జరిగేదేమిటీ? ఉపఖండం యుద్ధ మేఘావృతమవుతుంది. రెండు దేశాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న దైనందిన సమస్యలు పక్కదారి పడతాయి. ఈ వ్యాఖ్య రాసే సమయానికి రెండు దేశాల వైమానిక, పదాతి దళాలు పరస్పరం ఆధిపత్య నిరూపణ కోసం బరిలో దిగాయన్న వార్తలు వస్తున్నాయి. ప్రజలలో భావోద్వేగాలు సహజం. పాలకులు వాటిని ఎగదోయకూడదు. రాజకీయ పార్టీలు వాడుకునే ప్రయత్నం చేయకూడదు.
-కొండూరి వీరయ్య
సెల్: 9871794037
No comments:
Post a Comment