18 May 2019
Nava Telangana
సంస్కృతిక జాతీయవాదం దిశగా బీజేపీ ప్రయాణం
బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షా లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా కోల్‌కతాలో నిర్వహించిన రోడ్‌షో తృణమూల్ కాంగ్రెస్, బీజేపీ మధ్య కండబల ప్రదర్శన కేంద్రంగా మారింది. గతేడాది రోడ్‌షోకు అనుమతించకపోవటంపై బీజేపీ ఏకంగా సుప్రీం కోర్టును ఆశ్రయించింది. జాతీయ స్థాయిలో బీజేపీ బెంగాల్‌లో తృణమూల్ ప్రధానశక్తులుగా ఆవిర్భవించటంతో రెండు పార్టీలూ రాజకీయ పోరాటానికి కొత్త నిర్వచనం ఇచ్చాయి. దాదాపు ఆరు దశాబ్దాల పాటు బెంగాల్ రాజకీయాలను మలుపు తిప్పిన కార్మిక కర్షక పోరాటాల స్థానాన్ని మూకస్వామ్యం ఆక్రమించింది. దాదాపు రెండు దశాబ్దాల కాలంలో ఇలాంటి వీధిపోరాటాల నడుమనే రాజకీయ అస్థిత్వాన్ని వెతుక్కున్న మమతా బెనర్జీని ఎదుర్కోటానికి బీజేపీ కూడా అదే మార్గాన్ని అనుసరిస్తున్నది.ప్రజాస్వామిక వ్యవస్థలను తుత్తునియలు చేయటానికి మూకస్వామ్యం రూపంలో బీజేపీ వినూత్న వ్యూహాలను ఎలా అనుసరిస్తుందో శబరిమల తీర్పు నేపథ్యంలో కేరళ పరిణామాలు రుజువు చేస్తున్నాయి. బీజేపీ దృష్టిలో రాజకీయ ఆందోళన అంటే ప్రత్యర్థి శ్రేణులపై భౌతికదాడులే. 2011నుంచీ బెంగాల్‌లో పోలింగ్ సందర్భంగా జరుగుతున్న హింసాకాండ గురించి కేంద్ర ఎన్నికల సంఘానికి పదేపదే సీపీఐ(ఎం) విన్నవించినా వీడియోలు ఫోటోలు అందచేసినా అటు ఎన్నికల సంఘం గానీ ఇటు కేంద్ర ప్రభుత్వం కానీ స్పందించలేదు. అప్పట్లో సీపీఐ(ఎం)ను ఓడించటం పాలకవర్గాల ఏకైక లక్ష్యంగా నిలిచింది. దాంతో వేలాదిమంది సీపీఐ(ఎం) కార్యకర్తలు ప్రాణాలు కోల్పోవటమేకాక పార్టీకి చెందిన వందలాది కార్యాలయాలను తృణమూల్ ఆక్రమించింది. ఇదే మార్గాన్ని నేడు బీజేపీ అనుసరిస్తోంది. ఫలితంగా దేశంలో అత్యంత హింసాత్మక సంఘటనలు జరిగిన రాష్ట్రంగా ఈ సారి బెంగాల్ నమోదైంది.
అదలా ఉంచితే అమిత్‌షా రోడ్‌షో సందర్భంగా ఈశ్వరచంద్ర విద్యాసాగర్ కళాశాల ప్రాంగణంలో నిలబెట్టిన విద్యాసాగర్ విగ్రహాన్ని బీజేపీ శ్రేణులు ధ్వంసం చేయటం దేశాన్ని నివ్వెరపర్చింది. త్రిపురలో అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించాక లెనిన్ విగ్రహాన్ని బుల్డోజర్‌తో కూల్చి వేసిన ఫోటోలు వీడియోలు దేశమంతా వైరల్ అయితే సోకాల్డ్ ప్రజాతంత్ర శక్తులు నోరు మెదపలేదు. అదే సాంప్రదాయాన్ని బీజేపీ ఇప్పుడు బెంగాల్‌కు వ్యాపింపచేసింది. ఏకంగా ఆధునిక బెంగాల్ నిర్మాతగా పేరుగాంచిన ఈశ్వరచంద్ర విద్యాసాగర్ విగ్రహాలను కూల్చివేతకు తెరలేపింది. విగ్రహాల కూల్చివేతకు ముందు జరిగిన పరిణామాలు రాజకీయ ప్రాధాన్యత కలిగినవి. బెంగాల్‌లో ఎన్నికల ప్రచారసభల్లో పాల్గొన్న మోడీ రామనామాన్ని జపిస్తే బెంగాల్‌లో ప్రభుత్వం అరెస్టులు చేస్తోందని ఉపన్యసించారు. దీన్నే మంత్రంగా పరిగణించిన బీజేపీ శ్రేణులు జై శ్రీరాం అంటూ వీధుల్లోకి రావటం మొదలైంది. చివరి దశలో పోలింగ్ జరగనున్న తొమ్మిది నియోజకవర్గాలు ప్రధానంగా పట్టణ ప్రాంత నియోజకవర్గాలే. పట్టణ ప్రాంతాల్లో బలం పుంజుకున్న బీజేపీ తృణమూల్ ఆధిపత్యాన్ని సవాలు చేయబూనుకుంది.
బీజేపీకి రాష్ట్రస్థాయిలో చెప్పుకోదగ్గ పార్టీ నిర్మాణంలేదు. ఈ మధ్యకాలం వరకు బీజేపీ భావజాలాన్ని నమ్మిన శ్రేణులూ పెద్దగా లేవు. ప్రధానంగా తృణమూల్, కాంగ్రెస్‌లలో సీట్లు దక్కని నేతలే బీజేపీకి తొలి పెట్టుబడిగా మారారు. రాష్ట్రంలో బీజేపీకి పెద్దగా ప్రజాదరణ లేకపోయినా రెండు వనరులు మాత్రం పుష్కలంగా ఉన్నాయి. మొదటిది నిరుద్యోగం. రెండోది డబ్బు. 2011వరకు ఎన్నికల్లో ధన ప్రభావం నామమాత్రంగా ఉండేది. విధానాలే కేంద్రంగా ఎన్నికల ప్రచారం జరిగేది. సీపీఐ(ఎం) స్థానంలో టిఎంసీ అధికారానికి రావటంతో క్రమంగా ఎన్నికల రంగం రూపురేఖలు మార్చుకొంది. ధన ప్రభావానికి తెరతీసింది. ఇప్పుడు దేశవ్యాప్తంగా బీజేపీని ఈ విషయంలో ఢ కొట్టే పార్టీలు లేవు. దాంతో బీజేపీ పెద్దఎత్తున రాష్ట్రంలోకి కోట్ల కట్లను దించింది. నిరుద్యోగులను సైన్యంగా మార్చుకుంది. వీధిపోరాటాలే వ్యూహంగా ఎంచుకుంది.
గత ఆరు దశాబ్దాలుగా చాపకింద నీరులాగా పని చేసిన ఆరెస్సెస్ శాఖలు నేడు మితవాద రాజకీయాలకు కేంద్రంగా మారాయి. కోల్‌కతా వాణిజ్యమంతా మార్వాడీల చేతుల్లో ఉంటుంది. ఈ మార్వాడిలే ఆరెస్సెస్‌ను రాష్ట్రంలోకి ప్రవేశపెట్టారు. 1990వరకు ఆరెస్సెస్ కార్యకలాపాలు, ఉపన్యాసాలు హిందీలో జరిగేవి. తర్వాతి కాలంలో ఉపన్యాసాలన్నీ బెంగాలీలోనే జరపాలని సంఫ్‌ు పట్టుబట్టి పెద్దఎత్తున సాహిత్యాన్ని బెంగాలీ భాషలోకి అనువదించి విచ్చలవిడిగా అందుబాటులోకి తేవటం ప్రారంభించింది. ఇక్కడే ఓ విషయాన్ని ప్రస్తావించాలి బెంగాల్‌లో సీపీఐ(ఎం) ముస్లింలను ఓటుబ్యాంకుగా వాడుకుందని బూర్జువా పార్టీలు విమర్శిస్తూ వచ్చాయి. అరుణ్‌శౌరీ లాంటి వాళ్లు బెంగాల్‌లో ముస్లింల జనాభా గురించి పుంఖాను పుంఖాలుగా రాశారు. అయినా వామపక్ష సంఘటన అధికారంలో ఉన్నంత కాలమూ సంఫ్‌ుపరివారం కార్యక్రమాలు సాధారణ స్థాయి దాటలేదు. కానీ సీపీఐ(ఎం)ను గద్దె దించే లక్ష్యంతో కాంగ్రెస్ సహకారంతో తృణమూల్ 28శాతంగా ఉన్న ముస్లింలను ఓటుబ్యాంకుగా మార్చుకోవటం మొదలు పెట్టిన తర్వాతనే సంఘపరివారం కార్యకలాపాలు విస్తరించటానికి కావల్సిన ఇంధనాన్ని సమకూర్చి పెట్టింది. దాంతో అటు దుర్గాపూజ కమిటీలను స్పాన్సర్ చేయటంతో పాటు క్రమంగా రామనవమి యాత్రలు, హనుమాన్ జయంతు లను కూడా తృణమూల్ ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వ నిధులతో నిర్వహించటం మొదలుపెట్టింది. అప్పటివరకు నిద్రాణంగా ఉన్న సంఘపరివారం కార్యకలాపాలు రాష్ట్ర ప్రభుత్వ అండదండలతో ఊపందుకోవడం మొదలైంది. అది నిద్రపోతున్న సంఘపరివారం జూలు విప్పటానికి కారణమైంది. ఈ విధంగా తృణమూల్ అనుసరించిన కాంపిటేటివ్ మత సమీకరణలు బెంగాల్ రాజకీయ రంగాన్ని సమూలంగా మార్చేశాయి. దాని ఫలితమే రోడ్ షో సందర్భంగా జరిగిన ఘర్షణలు, దాడులు, ఈ ఎన్నికల్లో బెంగాల్‌లో జరిగిన హత్యాకాండ.
గతేడాది తృణమూల్ విద్యార్థి విభాగం జనసంఫ్‌ు వ్యవస్థాపకుడు శ్యాంప్రసాద్ ముఖర్జీ విగ్రహాన్ని కూల్చటానికి ప్రతీకారంగా బీజేపీ శ్రేణులు విద్యాసాగర్ విగ్రహాన్ని కూల్చేశాయి. విద్యాసాగర్ జీవితాంతం కట్టుబడి ఉన్న విలువలకు ఆరెస్సెస్ అవగాహన పూర్తిగా భిన్నమైనది. రాజారామ్మోహన్ రారు కంటే ముందే బాల్య వివాహాల రద్దు, వితంతు పునర్వివాహాలు, మహిళా సాధికారిత, ప్రజాతంత్ర హక్కులు వంటి అంశాలపై జీవితాంతం కృషిచేశారు. బంగ్లబాషకు వర్ణమాల రూపొందించారు. మహిళా విద్యాభ్యాసానికి పెద్దపీట వేశారు. దేశంలో మహిళల కోసం ప్రత్యేకంగా పాఠశాలలు స్థాపించిన ఇరువురిలో ఒకరిగాఖ్యాతి గడించారు. వారిలో ఒకరు జ్యోతిబాపూలే కాగా, మరొకరు ఈశ్వరచంద్ర విద్యాసాగర్. అంతేకాదు. అప్పటివరకు పండిత పుత్రులకు మాత్రమే అవకాశం ఉన్న సంస్కృత విద్యను అన్ని కులాల వారికీ అందించేందుకు అడ్మిషన్ పద్ధతిలో మార్పులు తెచ్చారు. ఆ తర్వాతనే శూద్రులు కూడా సంస్కృత పాఠశాలలో విద్యార్థులయ్యారు. ఈ విలువలకు ఆది నుంచీ ఆరెస్సెస్ బద్ద వ్యతిరేకి. దీంతో ఈ ఘటన ఆధునిక బెంగాల్ సంస్కృతిపై దాడిగా పరిగణించబడుతోంది.
బీజేపీ ఎక్కడ రాజకీయాలు చేసినా అవి ముందుగా సాంస్కృతిక రాజకీయాలుగానే ఉంటాయి. బీజేపీ తొలినినాదమే సాంస్కృతిక జాతీయవాదం. దీన్ని సాధించుకోవటానికి ప్రజాదరణ పొందిన సంస్కృతిని ధ్వంసం చేయటం ఏకైక వ్యూహంగా బీజేపీ రాజకీయాలు సాగుతాయి. ఉమ్మడి విలువలు, ఉమ్మడి వారసత్వం, ఉమ్మడి సాంప్రదాయాలను ధ్వంసం చేయాలంటే అటువంటి ఉమ్మడి స్వభావానికి పునాదులు వేసిన త్యాగధనులను వారి స్ఫూర్తిని కాలరాయాలి. విగ్రహాలు కూల్చివేత ఇందులో ఓ అంకం మాత్రమే. వ్యవస్థల విధ్వంసం మరో అంకం. గత ఐదేండ్లల్లో కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ జాతీయ స్థాయి పాలనా వ్యవస్థలను కుప్పకూల్చిన తీరు పాఠకుల ముందు ఉంది. ఇప్పుడు సాంస్కృతిక వైవిధ్యానికి గల పునాదులు ద్వంసం చేయటంలో నిమగమైంది. ఆధునిక భారత నిర్మాణం బెంగాల్ నవనిర్మాణంతోనే మొదలైంది. ఆధునిక భారత్‌ను అంధకారంలోకి నెట్టాలంటే బెంగాలీ చైతన్యాన్ని దారి మళ్లించటం తక్షణ అవసరం. బెంగాల్‌లో బీజేపీ అనుసరిస్తున్న ఈ వ్యూహం రానున్న కాలంలో బీజేపీ సంఘపరివారం అనుసరించనున్న సాంస్కృతిక జాతీయవాద రాజకీయాలకు సూచికగా, వైవిధ్యభరితమైన భారతీయ సంస్కృతికి హెచ్చరికగా నిలుస్తోంది.
- ప్రశాంత్
No comments:
Post a Comment