Wednesday, May 22, 2019

 http://www.navatelangana.com/article/net-vyaasam/780845

ఓటమి భయంలో బీజేపీ

లోక్‌సభ ఎన్నికలకు తెర లేచింది. వివిధ పార్టీలు అస్త్రశస్త్రాలు సంధించటానికి సిద్ధంగా ఉన్నారు. షరామామూలు ఎన్నికల క్రమం ఎన్నికల షెడ్యూల్‌ జారీతో మొదలైనా దాదాపు గతేడాది నవంబరు నుంచీ దేశం ఎన్నికల మూసలోకి వెళ్లింది. ఈ ఎన్నికల్లో పాలక బీజేపీకి ఓటమి భయం పట్టుకుంది. ఈ విషయాన్ని నిర్ధారించుకోవాలంటే గత నాలుగు నెలలుగా జరుగుతున్న పరిణామాలను మననం చేసుకోవాలి. ఉత్తరప్రదేశ్‌, బీహార్‌, గుజరాత్‌, ఆంధ్రప్రదేశ్‌, మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, రాష్ట్రాల్లో 2014 బీజేపీ సాధించిన విజయాలు ఈసారి పునరావృతం చేసే అవకాశం లేదు. ఈ ఏడు రాష్ట్రాల నుంచి మొత్తం 273సీట్లు ఉంటే 2014 ఎన్నికల్లో 196సీట్లు అంటే 71శాతం సీట్లు బీజేపీ కైవశం చేసుకుంది.
మొదటిది, భావసారూప్యత కలిగిన ప్రతిపక్షాలు ఏకమవటంపై బీజేపీ దుష్ప్రచారం. మధ్యప్రదేశ్‌, చత్తీస్‌ఘఢ్‌, రాజస్థాన్‌లల్లో ఘోరపరాజయంతో బీజేపీ ఉలిక్కిపడింది. అప్పటి వరకు మోడీ అజేయుడనీ, 2019 ఎన్నికల్లో అలవోకగా బీజేపీ విజయం సాధిస్తుందన్న విశ్లేషణలు పుంఖాను పుంఖాలుగా వచ్చాయి. భావసారూప్యత కలిగిన ప్రతిపక్షాలు ఏకమవటం మొదలైంది. గత మూడునెల్లుగా ఢిల్లీ, కొల్‌కత్తా కేంద్రాలుగా ప్రతిపక్ష పార్టీల మధ్య చర్చలు జరిగాయి. ఈ సందర్భంగా ప్రధాని మోడీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షా విరజిమ్మిన విద్వేషం ఒక్కసారి గుర్తు చేసుకోవాలి. తాను అవినీతిపై పోరాటం చేస్తుంటే ఓర్వలేని ప్రతిపక్షాలు తమ అవినీతి బయటపడు తుందన్న భయంతో ఏకమవు తున్నాయని పలు బహిరంగసభల్లో మోడీ వ్యాఖ్యానించారు. ప్రతిపక్షాలను అనని మాట లేదు. ఫిబ్రవరి ఏడో తేదీన లోక్‌సభలో మోడీ మాట్లాడుతూ ప్రతిపక్షాల కూటమి కల్తీసరకని తూలనాడారు. ఇంతకాలం సైద్ధాంతిక విభేదాలున్న వారు కేవలం తనను ఓడించటానికే ఏకమవుతున్నారని ఆడిపోసుకున్నారు. ఎన్నికల్లో గెలవటానికి ఎవరి ప్రయత్నం వారు చేయటం సహజం. అంతమాత్రాన నీలాపనిందలు మోపాల్సిన అవసరం లేదు. ఈ విజ్ఞత కూడా మర్చిన మోడీ-అమిత్‌షా ద్వయం ప్రతిపక్షాల ఐక్యత కోసం కృషి చేస్తున్న నేతలపై అవాకులు చవాకులు పేలారు.

ఇప్పటి వరకు బీజేపీ 200స్థానాలకు ప్రాతినిధ్యం వహించే రాష్ట్రాలకు సంబంధించి పొత్తులు ఖరారు చేసింది. ఒకవైపున మోడీని ఒంటరి చేసి ఓడించటానికి పత్రిపక్షాలు అపవిత్ర కూటమి కడుతున్నాయని వాపోయిన బీజేపీ ఈ ఎన్నికల్లో నిజంగానే ఒంటరి పోరుకు సిద్ధమైందా? లేదు. గత మూడు నెల్లుగా అమిత్‌షా ప్రాంతీయ పార్టీలతో ముందస్తు ఎన్నికల పొత్తుల కోసం తిరగని రాష్ట్రం లేదు. చేయని ప్రయత్నం లేదు. తుమ్మితే ఊడిపోయే ముక్కులా మారిన బీజేపీ-జేడీయూ పొత్తును సంఘటితం చేసుకోవటం ఈ ప్రయత్నంలో మొదటి అడుగు. బీజేపీ, జేడీయూలు చెరి 17సీట్లకు, లోక్‌జనశక్తి పార్టీకి ఆరు సీట్లు కేటాయించాలని డిశంబరులోనే ఒప్పందం ఖరారు చేసుకున్నారు. 2014 ఎన్నికల్లో బీజేపీ ఒక్కటే 30సీట్లు పోటీ చేసి 22సీట్లు గెలుపొందింది. ఈసారి పోటీ చేస్తున్నదే కేవలం 17సీట్లు. మహారాష్ట్రలో శివసేనతో పొత్తు కోసం ఏకంగా అమిత్‌షా పలు దఫాలు ప్రయత్నం చేశాక శివసేన అధినేత గడప తొక్కక తప్పలేదు. ప్రశాంత్‌ కిషోర్‌ (2014లో మోడీ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించి ప్రస్తుతం జేడీయూ తరపున ఎంపీగా పోటీ పడుతున్నారు) దౌత్యంతో 2014లో మోడీ హవాతో శివసేనను కాలదన్నిన బీజేపీ నేడు అవసరార్థం అదే పార్టీ కాళ్లు పట్టుకోవటానికి సిద్ధమైందన్నది విదితం. తమిళనాడులో సైతం కాంగ్రెస్‌-డీఎంకెలు పొత్తులు ఖరారు చేసుకోవటానికి ముందే బీజేపీ ఎఐడీఎంకే, పీఎంకెలతో పొత్తులు ఖరారు చేసుకుంది. అప్పటికే నిట్టనిలువునా చీలిన ఎఐఎడీఎంకెతో కుదుర్చుకున్న పొత్తు ఏ మేరకు ఫలితాన్నిస్తుందో వేచి చూడాల్సిందే. ఆంధ్రప్రదేశ్‌లో జనసేన-వైయస్సార్‌సీపీలను దగ్గర చేయటానికి మంత్రసాని పాత్ర పోషించి విఫలమైన బీజేపీ చివరకు వైయస్సార్‌ సీపీకి లోపాయికారీ మద్దతు ప్రకటించిందని పరిశీలకులు భావిస్తున్నారు.

మూడో అంశం. నిన్న మొన్నటి వరకు ఈశాన్య రాష్ట్రాల్లో వలస వచ్చే హిందువులకు పౌరసత్వం ఇచ్చే బిల్లు విషయంలో బీజేపీ వైఖరి అస్సోం గణపరిషత్‌ సహా అనేక ప్రాంతీయ పార్టీలతో వైషమ్యాలు పెంచింది. చిట్టచివరకు రాజకీయ ప్రయోజనాలు, ఎన్నికలపై మారుతున్న అంచనాలు నేపథ్యంలో బీజేపీ మెట్టు దిగక తప్పలేదు. వివాదాస్పద బిల్లును తాత్కాలికంగా పక్కనపెడుతున్నట్టు స్వయంగా రామ్‌ మాధవ్‌ అస్సోం గణపరిషత్‌ వ్యవస్థాపక నేత ప్రపుల్లకుమార్‌ మహంతకు హామీ ఇచ్చాకనే అస్సాంలో పొత్తులు ఖరారయ్యాయి. ఇదే కాదు. ఎన్నికల్లో గెలవటానికి అత్యంత ప్రీతిపాత్రమైన రాజకీయ ఎజెండాను తాత్కాలికంగా గూట్లో పెట్టడం బీజేపీకి కొత్తేమీ కాదు. 1999లో తృటిలో జారిపోతున్న అధికారాన్ని చేజిక్కించుకోవటానికి వివాదాస్పద అంశాలు - రామమందిరం, ఉమ్మడి పౌరస్మృతి, 370 అధికరణం రద్దును తమ ఎజెండా నుంచే తీసేసింది బీజేపీ. ప్రస్తుతం ఈశాన్య రాష్ట్రాలతో సైతం అదే ఆట మొదలు పెట్టింది. అధికారం కోసం ఎన్ని అడ్డదారులైనా తొక్కటానికి, తన మౌలిక ఎజెండానుంచి పక్కకు తప్పుకుని పెద్దమనిషి ఫోజు పెట్టటానికి బీజేపీ వెనకాడ దన్న విషయాన్ని ఈ ఉదాహరణలు రుజువు చేస్తున్నాయి. ఏరు దాటాక బోడిమల్లయ్య అనటం బీజేపీకి వెన్నతో పెట్టిన విద్య.

నాల్గో అంశం. మోడీ స్వయంగా పార్లమెంట్‌లో ప్రస్తావించినట్టు ఎన్నికల పొత్తులన్నీ కల్తీలు, దురుద్దేశ్యంతో పెట్టుకునేవే అయితే మరి బీజేపీ పెట్టుకుంటున్న పొత్తుల వెనక ఉన్న దురుద్దేశ్యం ఏమిటి? ప్రతిపక్షాల కూటమి అధికారానికి వస్తే మోడీ పాలనలో సాగించిన కుంభకోణాల జాబితా బయటకు వస్తుందన్న భయం లేకపోతే ముందస్తు పొత్తుల గురించి అంత ఆందోళన ఎందుకు అన్న ప్రశ్నకు బీజేపీ నేతలు సమాధానం ఇవ్వాలి. బీజేపీలో ఓటమి భయం ఎంత పరాకాష్టకు చేరిందంటే చివరకు పుల్వామా ఘటనను ఉపయోగించు కుని జాతీయ భద్రత ఎజెండా మార్చటానికి కూడా వెనకాడలేదు. ఇంత చేసినా జాతీయంగానూ అంతర్జాతీయంగానూ బాలా కోట్‌ దాడి గురించి ఎదురవుతున్న ప్రశ్నలకు బీజేపీ గానీ ఇటు ప్రభుత్వం గానీ సమాధానం ఇచ్చుకోలేకోపోతోంది. బాలాకోట్‌ మంత్రం మహా అయితే పంజాబ్‌, రాజస్థాన్‌, గుజరాత్‌, ఉత్తరప్రదేశ్‌తో పాటు ఢిల్లీ, ముంబయి వంటి మధ్య తరగతి కేంద్రీకృతమైన ప్రాంతాల్లో మాత్రమే ఎంతో కొంత ప్రభావం చూపనుంది.
చివరిగా భారతదేశాన్ని కాపాడటానికి చిటికేస్తే ఆరెస్సెస్‌ సైనికులు మూడు నిముషాల్లో రంగంలోకి దిగుతారని ఆరెస్సెస్‌ అధినేత మోహన్‌ భాగవత్‌ జబ్బలు చరిచారు. ఉగ్రవాదులు దేశంలోకి ప్రవేశించకుండా నివారించటంలో సైన్యం విఫలమైందన్నదే ఈ వ్యాఖ్య సారాంశం. పుల్వామా దాడి జరిగి నెలరోజులు గడిచినా ఈ ఆరెస్సెస్‌ సైనికులు పత్తా లేరు. దేశ సరిహద్దులను కాపలా కాస్తున్న సైనికులకు ఇంతకన్నా ఎవ్వరూ అవమానించి ఉండరు. అయినా బాలాకోట్‌ మృతుల సంఖ్య విషయంలో వస్తున్న ప్రశ్నలకు మొహం చెల్లని బీజేపీ అలాంటి ప్రశ్నలు వేసేవారినందరినీ దేశ ద్రోహులనో, పాకిస్థాన్‌ మానస పుత్రులనో, సైన్యాన్ని కించపరుస్తారనో భావోద్వేగాలు రెచ్చగొట్టటానికి శాయశక్తులా ప్రయత్నం చేస్తోంది. మోడీ, బీజేపీ, ఆరెస్సెస్‌ కోరుకుంటున్న జాతీయ భద్రత ఏమిటి మరో మారు చర్చించుకుందాం. ఓటమి భయంతో బీజేపీ పడుతున్న పాట్లు, మోడీ - షా ద్వయం చేస్తున్న ఫీట్లు ప్రజలను ఒప్పించలేవు. మెప్పించలేవు.
- కొండూరి వీరయ్య
సెల్‌:9871794037

No comments: