Mar 20,2019
పాలకపార్టీ మానసపుత్రికలుగా మారిన పత్రికలు
http://www.navatelangana.com/article/net-vyaasam/781334
నిష్పాక్షికంగా వాస్తవాలు ప్రజల ముందుంచి ప్రజలను చైతన్యవంతుల్ని చేసి ప్రజాస్వామ్యానికి నాల్గో స్తంభంగా వ్యవహరించాల్సిన మీడియా ప్రభుత్వాన్ని నిలబెట్టే నాల్గో స్తంభంగా మారుతోంది. గత నెలరోజులుగా దేశంలో నెలకొన్న ఉద్రిక్త వాతావరణం ఈ విషయాన్ని మరింత స్పష్టం చేసింది. దేశాన్ని దేశభక్తితో ఉర్రూతలూగించేందుకు అటు ప్రభుత్వం, ఇటు మీడియా రంగం శక్తివంచన లేకుండా పని చేస్తున్నాయి. ఎక్కడన్నా దేశభక్తిని రెచ్చ గొట్టేందుకు జరిగే ప్రయత్నాలు మందకొడిగా సాగుతున్నాయనిపిస్తే ఆయా సందర్భాల్లో ఏకంగా మంత్రులు, పాలక పార్టీ టిక్కెట్లమీద ఎంపికైన ప్రజాప్రతినిధులు గొంతెత్తుతున్నారు. ఇదే అదనుగా మీడియా ప్రత్యేకించి పత్రికా రంగం కూడా గుండెలు చీల్చి రామభక్తి ప్రదర్శించిన హనుమంతుడిని ఆదర్శంగా తీసుకుని పేజీలు తెరిచి మరీ దేశభక్తిని అక్షరాలతో అలంకరిస్తున్నాయి. ఈ విధంగా దేశభక్తి భావన పత్రికారంగం తలకెత్తుకోవటం ప్రజాస్వామ్యానికి చేటు అని గత మూడువారాల పరిణామాలు రుజువు చేస్తున్నాయి.ఇందుకు దారితీసిన సందర్భాన్ని క్లుప్తంగా నెమరు వేసుకుందాం. ఫిబ్రవరి 14న పారామిలిటరీ దళాలను తీసుకెళ్తున్న సైనిక వాహనాలపై జరిగిన ఉగ్రవాద దాడిలో 40మంది సైనికులు మరిణించారు. పాకిస్థాన్ కేంద్రంగా పని చేస్తున్న జైష్ ఎ మొహ్మద్ ఉగ్రవాద సంస్థ ఇది తమ పనే అని ప్రకటించింది. ఈ రెండు వారాలు కేంద్ర ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టింది. సింధు నదీ జలాల ఒప్పందాన్ని రద్దు చేసుకుంటున్నట్టు ప్రకటించింది. వాణిజ్యోత్పత్తులు ఎగుమతి చేయటానికి అత్యంత ఆసక్తి గలిగిన దేశంగా పాకిస్థాన్‌కు ఇచ్చిన గుర్తింపు రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది. గతంలో ప్రభుత్వం ఓ నిర్ణయం తీసుకున్న తర్వాత ప్రజలు చర్చించుకునేవాళ్లు. కానీ సోషల్ మీడియా పుణ్యమా అంటూ ఓ సమీకృత ఉద్యమ రూపంలో పాకిస్థాన్ వ్యతిరేకత పేరుతో ముస్లిం వ్యతిరేక భావాలూ ఆలోచనలు గుప్పించబడ్డాయి. దీన్నే సాకుగా తీసుకుని ప్రజల మనోభావాలు దెబ్బతిన్నాయన్న సాకుతో ప్రభుత్వం మరింత బరితెగించింది. ఎట్టకేలకు బాలాకోట్ ప్రాంతంలో జైష్ ఎ మొహ్మద్ శిక్షణా శిబిరంగా గుర్తించిన ఓ ప్రాంతంపై భారత వాయుసేన బాంబుదాడికి దిగింది. విదేశాంగ శాఖ కార్యదర్శి గోఖలే 'ఈ దాడిలో పెద్దసంఖ్యలో ఉగ్రవాదులు మరణించారు' అని ప్రకటించారు. భారత వాయుసేన దాడిని ధృవీకరిస్తూనే పాకిస్థాన్ సైన్యం బాంబులు వేసిన ప్రాంతం అడవి అనీ, ప్రాణనష్టం లేదనీ ప్రకటించింది.
ఈ మొత్తం విషయాన్ని ప్రజలకు చేరవేయాల్సిన మీడియా గందరగోళంతో కూడిన వార్తలు ప్రజలకు చేరవేసింది. ఈ నివేదికలు వార్తలూ కథనాలూ ఒకదానికొకటి పొంతన లేక పోవటం విశేషం. యథా ప్రకారం మీడియా సంస్థలు తాము రాసిన కథనాలకు కట్టుకథలకు '' ప్రభుత్వ వర్గాలు అందించిన సమాచారం మేర''కో ''ఆయుధ నిపుణుల అంచనా మేర''కో ''విశ్వసనీయ వర్గాల కథనా'' లనో ఆధారంగా ప్రస్తావిస్తాయి. ఏ మాత్రం విచక్షణ వర్తింపచేయకుండా వార్తల రూపం తీసుకున్న ఈ అభిప్రాయాలను ఆబగా చదివి తలకెక్కించుకున్న దేశభక్తులు రోడ్డున పడ్డారు.
ఈ వార్తా కథనాల్లో ప్రస్తావించిన వాస్తవాల గురించి మీడియా సంస్థలు స్వతంత్ర పరిశోధనతో నిర్ధారించుకున్నవి కావు. ప్రభుత్వం అధికారికంగా నిర్వహించిన విలేకరుల సమావేశంలో పాల్గొన్న విదేశాంగ మంత్రిగానీ, విదేశాంగ శాఖ కార్యదర్శి గానీ విలేకరులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వలేదు. ''పేర్లు ప్రస్తావించటానికి'' అంగీకరించని సమాచార వనరుల ఆధారంగా రాసే కథనాలు ప్రధానంగా అభిప్రాయాలు కుమ్మరించేవే తప్ప విషయాలు యథాతథంగా ప్రజలకు చేరవేసే ప్రయత్నం కాదు.
ఈ విషయాలు గమనిస్తే పుల్వామా తర్వాత కానీ, బాలాకోట్ దాడులు, అనంతర పరిణామాల గురించి కానీ నిజానికి భారతీయులకు విస్పష్టమైన సమాచారం చేరలేదు. చనిపోయిన ఉగ్రవాదుల సంఖ్యలో వ్యత్యాసాల మొదలు వాయుసేన ప్రయోగించిన బాంబుల బరువు వరకూ అన్నీ పరస్పరం పొసగని అంకెలే వివిధ పత్రికలు, టీవీలు వెల్లడించాయి. ఈ పొసగనితనాన్ని ప్రశ్నించిన వారంతా దేశద్రోహులయ్యారు. కారుబాంబుకు, టీవీ బాంబుకు జూబిలీ హిల్స్‌లో ఇళ్లు పేలిపోయిన వార్తలు చదివాం. బకెట్ బాంబులకు బ్రిడ్జిలు కూలిపోయిన సంఘటనలు, ఊహాజనితమే అయినన్పటికీ (అరవింద సమేత వీరరాఘవ)చూశాం. గిలిటెన్ స్టిక్స్ ప్రయోగంతో చత్తీస్‌గఢ్‌లో కార్లల్లో ప్రయాణిస్తున్న రాజకీయ నాయకులు శవాల గుట్టలైన సందర్భాన్ని చూశాము.
కానీ వందల కిలోమీటర్ల ఎత్తునుంచి వేల కిలోల బరువున్న ఆధునిక బాంబులు, కంప్యూటర్ పర్యవేక్షణలో ప్రయోగించిన బాంబులు పేలిస్తే పరిసర ప్రాంతాల్లో ఇంటి కప్పులు మాత్రమే ఎగిరిపోయాయనీ, అయినా ఈ బాంబుదాడిలో వందలమంది ఉగ్రవాదులు హతులయ్యారనీ, పాకిస్థాన్ బెంబేలెత్తి ఎదురుదాడికి దిగిందనీ చదువుతున్నాము. రెండు మూడు వారాల తర్వాత కూడా ఈ వార్తా కథనాల్లో ఉన్న లోపాలను సరిదిద్దుకోవటానికి ఏ వార్త సంస్థ ప్రయత్నం చేయలేదు. అంటే ఉద్దేశ్యపూర్వకంగానే ఈ గందరగోళ వార్తలు ప్రసారంతో దేశంలో నెలకొన్న రాజకీయ గందరగోళాన్ని మరింత పెంపొందించే లక్ష్యంతోనే ఈ వార్తలు ప్రసారం చేసినట్టు అర్థమవుతున్నది.
ఈ మొత్తం వ్యవహారంలో పత్రికలు ప్రభుత్వ ఆలోచనలకు బాకాలుగా మారాయి. రాత్రికి రాత్రే టీవీ వార్తల్లో కనిపించే వ్యాఖ్యాతలందరూ యుద్ధతంత్ర నిపుణులుగా మారారు. ఎఫ్-16 యుద్ధ విమానాలకు సుఖోరు యుద్ధ విమానాలకు మధ్య ఉన్న వ్యత్యాసం, భారత వాయుసేన ప్రయోగించిన ఆయుధ సామాగ్రికి, పాకిస్థాన్ వాయుసేన వద్ద ఉన్న ఆయుధసామాగ్రికి మధ్య పోలికలు ధారాళంగా చర్చించి వీక్షకుల జ్ఞానాన్ని పెంచేందుకు శక్తివంచన లేకుండా పని చేశారు. మరికొన్ని హనుమంతుడిని మించిన భక్తులు స్టూడియోలను యుద్ధచిత్రాలు, సన్నివేశాలతో నింపేసి మరీ వార్తలు (వాదనలు) వినిపించారు.
ఈ మొత్తం గందరగోళంలో గత నెల రోజుల్లో ఉగ్రవాద నియంత్రణ పేరుతో జమ్ము కాశ్మీర్‌లో ఖైదుచేసిన యువత గురించిన వార్తలకు తావు లేకుండా పోయింది. జమ్ము కాశ్మీర్‌లో లోక్‌సభ ఎన్నికలు జరపటానికి అవకాశం కల్పిస్తున్న శాంతి భద్రత పరిస్థితులు శాసనసభ ఎన్నికలు జరపటానికి ఎందుకు అవకాశం కల్పించలేకపోతున్నాయో విశ్లేషించే ప్రయత్నాలకు తావు లేకుండా పోయింది. సీమాంతర కాల్పుల్లో గాయపడిన, చనిపోయిన పౌరుల గురించిన ఊసే లేకుండా పోయింది. ఈ తుపాకీ కాల్పుల మోతలో జమ్ము కాశ్మీర్‌లో ఖూనీ అవుతున్న ప్రజాస్వామ్యం కేకలు కూడా వినిపించకుండా పోయాయి.
అప్పటివరకు పతాక శీర్షికల స్థానాన్ని ఆక్రమించిన రాఫెల్ కుంభకోణం పత్తా లేకుండా పోయింది. ఆ తర్వాత సుప్రీం కోర్టు ఈ విషయమై చేపట్టిన విచారణకు కూడా తగిన స్థానం దక్కలేదు. బాలాకోట్ దాడులకు ముందు అత్యంత ప్రాధాన్యత కలిగిన విషయంగా ఉన్న నిరుద్యోగం, ఆర్థికాభివృద్ధి స్థానంలో ఈ దాడుల తర్వాత జాతీయ భద్రత కీలక ప్రాధాన్యత కలిగిన అంశంగా మారింది. కోట్లాదిమంది అటవీవాసుల హక్కుల గురించిన గోడు పాఠకులకు, వీక్షకులకు చేరకుండా పోయింది. మీడియా సంస్థలు ఈ కాలంలో ప్రాతినిధ్య స్వభావాన్ని కోల్పోయాయి. రిలయన్స్ వంటి దేశీయ బహుళజాతి సంస్థల గుత్తాధిపత్యంలోకి వెళ్లిపోయాయి. స్వతంత్ర ప్రదర్శించిన సీనియర్ పాత్రికేయులకు శ్రీముఖాలందాయి. ఈ నేపథ్యంలో మూక హింస, మూక హత్యలు వంటి హిందూధర్మ పరిరక్షణ పేరుతో సాగుతున్న వికృత అకృత్యాలు ప్రజలకు చేరవేయటానికి మీడియా ఆలంబనగా మారింది. పుల్వామా-బాలాకోట్ అనంతర పరిణమాలపై మీడియా వైఖరి గత నాలుగేండ్లుగా వస్తున్న మార్పును మరింత బలోపేతం చేస్తోంది. ప్రజాస్వామ్యానికి నాల్గో స్తంభంగా వ్యవహరించాల్సిన మీడియా ప్రభుత్వాన్ని నిలబెట్టే నాల్గో స్తంభంగా మారటం ప్రాతినిధ్య ప్రజాస్వామ్యానికి చేటు దాపురిస్తుందన్న వాస్తవాన్ని హెచ్చరిస్తోంది.
- ధీర
సెల్: 9871794037
No comments:
Post a Comment