Tuesday, November 30, 2010

ఉపాధిపై ప్రదాని కప్పదాటు

- ఎన్‌ఎస్‌ఎస్‌ఒ సర్వే ప్రకారం 2007 నాటికి దేశంలో నిరుద్యోగం 2.8 శాతం మాత్రమే. కానీ కార్మిక బ్యూరో నివేదిక ప్రకారం అది 9.4 శాతానికి చేరింది. అంటే దేశంలో సుమారు 4 కోట్ల మంది నిరుద్యోగులు ఉన్నారు.

- 2007 నాటికి మొత్తం ఉపాధి కల్పనలో 67 శాతం వ్యవసాయరంగంలోనే ఉంటే 2009 నాటికి వ్యవసాయ రంగ ఉపాధి కల్పన సామర్థ్యం తగ్గిపోయింది. ప్రస్తుతం వ్యవసాయ రంగం కేవలం 45 శాతం మందికి మాత్రమే ఉపాధి కల్పించే స్థితిలో ఉంది. ఈ పరిణామం వ్యవసాయరంగంలో రూపుదాల్చుతున్న తీవ్రమైన సంక్షోభానికి తార్కాణం.

- వేతన కార్మికులు 16 శాతం పక్కన పెడితే మిగిలిన రెండు తరగతుల కార్మికులు, స్వయం ఉపాధి, కాజువల్‌ కార్మికులు రోజువారీ కార్మికులు కారు. ఎక్కువలో ఎక్కువ సీజనల్‌ కార్మికులుగా మాత్రమే ఉంటారు. ఈ రెండు తరగతుల్లో కనీసం మరో పది శాతం తేలికగా నిరుద్యోగ సైన్యంలో కలిసిపోవటానికి అర్హత కలిగి ఉంటారు.

తాజాగా భారత కార్మిక మహాసభ (నేషనల్‌ లేబర్‌ కాన్ఫరెన్స్‌) వార్షిక సమావేశాలనుద్దేశించి మాట్లాడుతూ ప్రధానమంత్రి కార్మిక చట్టాలను తక్షణమే సవరించాల్సి ఉందని ప్రకటించారు. ప్రభుత్వం తీసుకుంటున్న అనేక అభివృద్ధి చర్యల మేరకు దేశంలో పెరగాల్సినంతగా ఉపాధి అవకాశాలు పెరగటం లేదని దీనికి కారణం చట్టాలు సహకరించకపోవటమేనని ఆయన వాపోయారు. అంటే ప్రభుత్వం దేశంలో ఉపాధి అవకాశాలు పెంచాలని ప్రయత్నిస్తుంటే చట్టాలు దీనికి అడ్డుపడుతున్నాయన్నది ఆయన వాదన. ఇప్పుడున్న చట్టాలు ఎటువంటి ఉపాధి అవకాశాల వ్యవస్థను కాపాడుతున్నాయి, ప్రభుత్వం ఎటువంటి ఉపాధి అవకాశాల వ్యవస్థను ముందుకు తెస్తుంది అన్న విషయాలు మాత్రం ఆయన ప్రస్తావించకుండా జాగ్రత్తపడ్డారు. ఈ వార్షిక సమావేశాలకు వారం రోజులు ముందుగా కార్మికమంత్రిత్వ శాఖ పరిధిలో పని చేసే లేబర్‌ బ్యూరో ఒక నివేదిక విడుదల చేసింది. ఇంటింటికీ తిరిగి నిర్వహించిన మొదటి సర్వే ఆధారంగా రూపొందించబడిన నివేదిక ఇది. 2009-2010 సంవత్సరాలకు గాను నిర్వహించిన ఈ నివేదిక భారతదేశంలో శ్రమశక్తి మార్కెట్‌కు సంబంధించి అత్యంత తాజా నివేదిక. ఇప్పటి వరకూ భారతదేశంలో ఉపాధి, నిరుద్యోగం గురించి సమాచారం సేకరించాలంటే కేవలం జాతీయ నమూనా సర్వే ఎన్‌ఎస్‌ఎస్‌ఒ నివేదికలపైనే ఆధారపడాల్సి వచ్చేది.

ఈ సారి స్వయంగా కార్మిక శాఖ ఈ వివరాలు సేకరించి దేశం ముందుంచేందుకు పూనుకోవటం హర్షించదగ్గ పరిణామమే. ఎన్‌ఎస్‌ఎస్‌ఒ నివేదిక లక్షా పాతికవేల మందిని సర్వే చేస్తే కార్మిక బ్యూరో నివేదిక 46వేలమందిని సర్వే చేసింది. ఎన్‌ఎస్‌ఎసస్‌ఒ నివేదిక కాలండర్‌ సంవత్సరాన్ని సర్వేకు ప్రమాణంగా తీసుకుంటే కార్మిక బ్యూరో నివేదిక ఆర్థిక సంవత్సరాన్ని ప్రమాణంగా తీసుకొంది. ఈ నివేదిక వెల్లడించిన వివరాలు భారతదేశంలో ఉపాధి రంగంలో వాస్తవికతను ప్రదర్శిస్తున్నాయి. ఆందోళననూ కలిగిస్తున్నాయి.ఎన్‌ఎస్‌ఎస్‌ఒ సర్వే వెల్లడించిన ప్రాథమిక సర్వే ఫలితాల గురించి అక్టోబరు మొదటి వారంలో బిజినెస్‌వాచ్‌లో చర్చించుకున్నాము. ఆ వ్యాసంలోని ప్రాథమిక నిర్ధారణలను ఖరారు చేసేవిగా సర్వే తుది వివరాలు ఉన్నాయి. గత మూడేళ్లల్లో ఉపాధి కల్పన రేటు దారుణ స్థాయికి పడిపోయింది. 2004-2005, 2007-2008 ఆర్థిక సంవత్సరాల కాలంలో మొత్తం శ్రమశక్తి మార్కెట్‌లో 80 లక్షల మంది పెరిగితే అందులో కేవలం సంవత్సరానికి ఎనిమిది లక్షల మందికి మాత్రమే ఉద్యోగాలు కల్పించింది భారత ఆర్థిక వ్యవస్థ. ఈ కాలంలోనే స్థూల జాతీయోత్పత్తి వృద్ధి రేటు 9 శాతం వరకూ ఉన్న విషయాన్ని గమనంలోకి తీసుకోవాలి. 11వ ప్రణాళికలో సంవత్సరానికి 90 లక్షల మందికి ఉపాధి అవకాశాలు కల్పించాలని నిర్ణయించుకున్నాము. పెరుగుతున్న శ్రమశక్తి మార్కెట్‌కు, ప్రణాళిక లక్ష్యానికి, వాస్తవికతను పోల్చి చూస్తే కేవలం పదోవంతు మాత్రమే చేరుకోగలిగాము.

శ్రమశక్తి మార్కెట్‌లోకి వస్తున్న యువత నికరమైన ఉపాధి అవకాశాలు లేకపోవటంతో అనివార్యంగా స్వయం ఉపాధి అవకాశాల వైపు మళ్లాల్సి వస్తోంది. దీంతో పాటే స్వయం ఉపాధిలో ఉండే ఎగుడుదిగుడులు వారి ఆదాయ వనరుల్లో కూడా కనిపిస్తాయి. దేశంలో నిరుద్యోగం విషయంలో అటు కార్మిక బ్యూరో, ఇటు ఎన్‌ఎస్‌ఎస్‌ఒ గణాంకాల మధ్య చాలా వ్యత్యాసం ఉంది. ఎన్‌ఎస్‌ఎస్‌ఒ సర్వే ప్రకారం 2007 నాటికి దేశంలో నిరుద్యోగం 2.8 శాతం మాత్రమే. కానీ కార్మిక బ్యూరో నివేదిక ప్రకారం అది 9.4 శాతానికి చేరింది. అంటే దేశంలో సుమారు 4 కోట్ల మంది నిరుద్యోగులు ఉన్నారు. ఇందులో వేతన కార్మికులు 16 శాతం పక్కన పెడితే మిగిలిన రెండు తరగతుల కార్మికులు, స్వయం ఉపాధి, కాజువల్‌ కార్మికులు రోజువారీ కార్మికులు కారు. ఎక్కువలో ఎక్కువ సీజనల్‌ కార్మికులుగా మాత్రమే ఉంటారు. ఈ రెండు తరగతుల్లో కనీసం మరో పది శాతం తేలికగా నిరుద్యోగ సైన్యంలో కలిసిపోవటానికి అర్హత కలిగి ఉంటారు. కానీ మనం అనుసరించే గణాంక ప్రమాణాలు వీరిని ఈ కేటగిరీ నుండి పక్కన పెట్టాయి.

ఈ సర్వే ముందుకు తెచ్చిన మరో ఆందోళనకర పరిణామం వ్యవసాయ రంగంలో ఉపాధి కల్పన గురించిన అంశం.2007 నాటికి మొత్తం ఉపాధి కల్పనలో 67 శాతం వ్యవసాయరంగంలోనే ఉంటే 2009 నాటికి వ్యవసాయ రంగ ఉపాధి కల్పన సామర్థ్యం తగ్గిపోయింది. ప్రస్తుతం వ్యవసాయ రంగం కేవలం 45 శాతం మందికి మాత్రమే ఉపాధి కల్పించే స్థితిలో ఉంది. ఈ పరిణామం వ్యవసాయరంగంలో రూపుదాల్చుతున్న తీవ్రమైన సంక్షోభాన్ని మన దృష్టికి తెస్తోంది. ఒకరకంగా చూసినపుడు వ్యవసాయరంగంలో ఉపాధి అవకాశాలు తగ్గి పారిశ్రామికరంగంలో ఉపాధి అవకాశాలు పెరగటం బలోపేతం అవుతున్న ఆర్థిక వ్యవస్థకు చిహ్నం. దీనికి భిన్నంగా మన దేశంలో వ్యవసాయరంగం ఉపాధి కల్పన సామర్థ్యం తగ్గిపోతోంది. అయితే పారిశ్రామికరంగం ఉపాధి కల్పన సామర్థ్యం మాత్రం పెరగటం లేదు. వ్యవసాయ రంగంలో ఉపాధి సామర్థ్యం గణాంకాలకు సంధించి ఒక ప్రత్యేక పరిస్థితి ఉంది. పారిశ్రామిక రంగంలో పరిశ్రమ మూతపడితేనే,కార్మికులను గెంటివేస్తేనో, విఆర్‌ఎస్‌ వంటి పథకాలు అమలు చేస్తేనో ఉపాధి/నిరుద్యోగం మధ్య వ్యత్యాసం తేలికగా గుర్తించవచ్చు. ఒకసారి కంపెనీలో ఉద్యోగంకోల్పోయిన కార్మికుడు ఉద్యోగం కోసం తిరగటం మనకు కనిపిస్తూనే ఉంటుంది.

కానీ వ్యవసాయరంగంలో నిరుద్యోగం అంత స్పష్టంగా కనిపించదు. మొదటిది, వ్యవసాయరంగం సీజనల్‌ రంగం. రెండోది, ఒకవేళ ఈ వ్యవసాయ కార్మికులు ఉన్న ఊర్లో పని దొరక్కపోతే మండల కేంద్రానికి వెళ్లి రిజిష్టరు చేయించుకుని తమకు పని కావాలని అని అడగరు. తిరిగి చిన్నా చితకా పొలం పనులు వచ్చే వరకూ ఎదురు చూస్తారు. ఎందుకంటే ఒకసారి గ్రామీణ ప్రాంతంలో ఫలానా వ్యక్తికి, కుటుంబానికి ఆదాయం వచ్చే వనరు లేదని తెలిస్తే కుటుంబం గడుపుకోవటానికి తీసుకునే చేబదుళ్లు కూడా కష్టమవుతాయి. పరపతి తగ్గిపోతుంది. ఇటువంటి పరిస్థితులను గమనంలోకి తీసుకంటే వ్యవసాయ రంగంలో నిరుద్యోగం/ ఉపాధి కల్పన సామర్థ్యం మరింత తీవ్రస్థాయిలో ఉన్న సమస్య అని అర్థమవుతుంది. ప్రత్యేకించి జాతీయ గ్రామీణ ఉపాధి చట్టం అమలు జరుగుతున్న ఈ కాలంలో వ్యవసాయం, అనుబంధ రంగాల్లో ఉపాధి అవకాశాలు తగ్గిపోవటం అనేది మరింత లోతైన సంక్షోభానికి చిహ్నం అని భావించక తప్పదు.శ్రమశక్తి మార్కెట్లో నికరమైన అవకాశాలు లేకపోవడం, వ్యవసాయరంగంలో ముదురుతున్న సంక్షోభం పెరుగుతున్న నిరుద్యోగానికి, తగ్గుతున్న ఉపాధికి కారణమవుతుండగా ప్రధాని మన్మోహన్‌సింగ్‌ మాత్రం కార్మిక చట్టాల వల్లే ఉపాధి తగ్గుతోందని చెప్పడం వాస్తవాలను కప్పిపుచ్చడమే అవుతుంది. ఇలాంటి సూత్రీకరణలు, విశ్లేషణల వల్ల ఉపాధి సమస్య పరిష్కరింప పడకపోగా మరింత జఠిలంగా మారుతుంది. యుపిఎ-2 ఈ వాస్తవాన్ని ఎంత తొందరగా గుర్తిస్తే అంత మంచిది.

No comments: