Monday, November 22, 2010

రూపొందుతున్న బహుళధృవ ప్రపంచానికి దర్పణం : సియోల్‌ జి -20 శిఖరాగ్రం

అందరూ ఊహించినట్లే గత వారాంతంలో సియోల్‌లో జరిగిన జి 20 దేశాధినేతల శిఖరాగ్ర సదస్సు ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు జవసత్వాలు కల్పించే ఔషధం ఏమిటన్న విషయంపై ఏకాభిప్రాయం లేకుండానే ముగిసింది. గత పిట్స్‌బర్గ్‌ సమావేశ నిర్ణయాలనే ఈ సమావేశం పునరుద్ఘాటించింది. ఒకటి 2011 నాటికి వివిధ దేశాలు అనుసరించే కరెన్సీ విలువకు సంబంధించి ఏకాభిప్రాయానికి రావాలని, రెండు ఆర్థిక వ్యవస్థల తీరుతెన్నులపై పరస్పర సమీక్ష, మూడు ఎంతపెద్దవైతే అంత బలమైనవన్న సూత్రాన్ని విడనాడి శక్తివంతమైన బ్యాంకులను నియంత్రించేందుకు చట్టాలు చేయాలని, నాలుగు అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ నిర్మాణంలో మార్పులు చేసి శక్తివంతమైన దేశాల సరసన చేరనున్న భారత్‌వంటి దేశాల వాటా పెంచాలని పిట్స్‌బర్గ్‌ సమావేశం నిర్ణయించింది. ఈ కాలంలో మొత్తం ఈ నాలుగు కీలక నిర్ణయాలకు గాను రెండు మాత్రమే అమలు అయ్యాయి. బేసెల్‌ 3 ఒప్పందం ద్వారా వివిధ దేశాలు ఆయా దేశాల బ్యాంకింగ్‌ వ్యవస్థల బలోపేతానికి చర్యలు చేపట్టేందుకు అంగీకరించాయి. అయితే ఈ బేసెల్‌ 3 నిర్ణయాల అమలు 2018కు వాయిదా వేయటంతో తక్షణం ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారం ఎండమావిగానే మిగిలిపోయింది. పోతే ఏతావాతా అమలు జరిగిన నిర్ణయం ఐఎంఎఫ్‌లో వర్థమాన దేశాల వాటా పెంచటం. ఈ సంవత్సరంన్నర కాలంలో పిట్స్‌బర్గ్‌ నిర్ణయాల అమల్లో వైఫల్యానికి కారణాలు ఏమిటన్న విషయంపై సియోల్‌ సమావేశం దృష్టిపెట్టలేకపోయింది. సియోల్‌ సమావేశాలకు సన్నాహకంగా జరిగిన 20 దేశాల ఆర్థిక మంత్రులు, రిజర్వు బ్యాంకు గవర్నర్ల సమావేశం కూడా ఈ విషయంలో ఏకాభిప్రాయానికి రాలేకపోయింది.

గత సంవత్సరం అక్టోబరులో ఇస్తాంబుల్‌లో జరిగిన జి7 దేశాల శిఖరాగ్ర సదస్సుతో ఆర్థిక వ్యవస్థ కోలుకోవటానికి తీసుకుంటున్న చర్యల్లో పెద్దఎత్తున మార్పు వచ్చింది. 2007-2008 మధ్య కాలంలో అన్ని దేశాలు ఒక్కమాట మీదకు వచ్చి ఉద్దీపన పథకాలు అమలు చేశాయి. దాంతో ఈ కాలంలో ప్రపంచ ఆర్థిక వ్యవస్థలోకి రెండున్నర లక్షల కోట్ల డాలర్ల మేర నిధులు విడుదలయ్యాయి. ఈ లోగా అమెరికాలో ఒబామా పలుకుబడి వీగిపోవటం, తిరిగి ఆర్ధిక ఛాందసవాదం టీ పార్టీ ఉద్యమం రూపంలో వెర్రి తలలు వేయటం, ఐరోపాలో దేశాలకు దేశాలే సంక్షోభంలో కూరుకుపోవటంతో మార్కెట్‌ దారిన మార్కెట్‌ను వదిలేయాలన్న పాతకాలపు నయా ఉదారవాద సిద్ధాంతం వైపు మొత్తం చర్చ మళ్లింది. ఈ విషయాన్ని పక్కకు నెట్టటానికి ఇస్తాంబుల్‌లో జరిగిన సంపన్న దేశాల సదస్సు ప్రయత్నించింది.

అంతర్జాతీయ సంక్షోభానికి సామ్రాజ్యవాద ప్రపంచీకరణలో ఉన్న వ్యవస్థాగత వైఫల్యాలు కారణం కాదనీ, అంతర్జాతీయ వాణిజ్యంలో చోటుచేసుకుంటున్న అసమానతలే కారణమనే ఏకాభిప్రాయం ఈ సదస్సులో వ్యక్తం అయ్యింది. తమ దేశాల్లోని అంతర్గత పరిస్థితుల నుండి దారి మళ్లించేందుకు ఈ అభిప్రాయం ఉపయోగపడుతుండడంతో మిగిలిన దేశాలు కూడా ఇదే పల్లవిని అందుకున్నాయి. ఇప్పుడున్న పరిస్థితుల్లో అంతర్జాతీయ వాణిజ్యంలో చైనా, జర్మనీలు అదనపు నిల్వలతో మెరుగైన దేశాలుగా ఉన్న విషయం అందరికీ తెలిసిందే. అమెరికా ఎగుమతి చేయలేకపోవటం వల్లనే చైనా ఎగుతులు ప్రపంచ మార్కెట్‌ను ఆక్రమిస్తున్నాయన్నది పై వాదన సారాంశం. తద్వారా ప్రపంచ ఆర్థిక వ్యవస్థ సంక్షోభానికి చైనా, అక్కడి కమ్యూనిస్టు ప్రభుత్వం అనుసరిస్తున్న ద్రవ్యవిధానాలే కారణమనే విశ్లేషణలకు ఆర్థికవేత్తలు పూనుకున్నారు.

నయాఉదారవాద మేధావుల అండ, దేశంలో రాజకీయ ఓటమి నేపథ్యంలో చైనాపై ఆంక్షలు విధించేందుకు అమెరికా ఒంటెత్తు పోకడలకు పోయింది. కానీ ఈ అమెరికా పన్నాగం సియోల్‌లో జరిగిన 20 దేశాల శిఖరాగ్ర సదస్సులో తత్తునియలు అయ్యింది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు సంబంధించి ఏదైనా కొత్త నిర్ణయం తీసుకునే ముందు పిట్స్‌బర్గ్‌లో ముక్తకంఠంతో ఆమోదించిన నిర్ణయాలను అమలు చేయాలన్న కోణంవైపుకు చర్చను చైనా మళ్లించగలిగింది. నిరంతరాయంగా నిరుద్యోగం పెరుగుతున్న నేపథ్యంలో పరిణామాత్మక చర్యల ద్వారా (క్వాంటిటేటివ్‌ ఈజింగ్‌) ద్రవ్యమార్కెట్లో మరో 600 బిలియన్‌ డాలర్ల నిధులు విడుదల చేయాలని అమెరికా ఈ మధ్యే నిర్ణయించింది. ఇది అనేక వర్థమాన దేశాల మార్కెట్లను అతలాకుతలం చేయనుంది. దీంతో మిగిలిన దేశాలు కూడా సియోల్‌లో అమెరికాను ఏకాకి చేశాయి. అటు రాజకీయంగానూ, ఇటు ఆర్థికంగానూ ఏకాభిప్రాయం సాధించేందుకు అమెరికా ఆర్థిక కార్యదర్శి తిమోతి గీథనర్‌ నేతృత్వంలో జరిగిన ప్రయత్నాలు కూడా విఫలమయ్యాయి. వివిధ దేశాలు భిన్న స్వరాలు వినిపించగలిగాయి. సియోల్‌లో భారత ప్రతిపాదనలకు పెద్ద ఎత్తున సానుకూల స్పందన వ్యక్తం అయ్యిందని, సదస్సు ముగిసిన తరువాత తిరుగు ప్రయాణంలో తన వెంట వచ్చిన విలేకరుల ముందు ఢంకా బజాయించారు. దాంతో 13,14 తేదీల్లో పత్రికలన్నీ మన్మోహన్‌ ప్రతిపాదనలను అందలమెక్కిస్తూ తెగ పొగిడేశాయి. ఈ రకమైన ప్రత్యామ్నాయ ప్రతిపాదనలకు కనీసం స్థానమైనా దక్కింది. ఈ పరిస్థితికి దారితీసిన పరిణామాల గురించి మాత్రం అటు ప్రభుత్వంగానీ ఇటు ప్రభుత్వ సమర్థకులైన విశ్లేషకులుగానీ దృష్టి సారించలేదు.

గత మూడున్నర దశాబ్దాలుగా అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థను పట్టి ఉంచిన అయస్కాంత శక్తిగా అమెరికా డాలర్‌ ఉంది. తాజా పరిణామాల నేపథ్యంలో డాలర్‌ ఆర్థికంగా తన శక్తిని, రాజకీయంగా తన పలుకుబడిని కోల్పోతోంది. 1991నుండి 1997 వరకు చోటు చేసుకున్న వివిధ సంక్షోభాల అనంతర పరిణామాలు గమనిస్తే ఈ విషయం మరింత స్పష్టమవుతుంది. అప్పట్లో ఆయా దేశాలు సంక్షోభంలో చిక్కుకుపోతే డాలర్‌ రూపంలో ఉన్న విదేశీ పెట్టుబడులు చడీ చప్పుడు లేకుండా అమెరికాకు వచ్చి వాలిపోయేవి. ఇలా వచ్చిన వచ్చిన వాటిని రీసైక్లింగ్‌ చేసి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులుగా మార్చి అమెరికా ఎగుమతి చేసేది. కానీ నేడు ఆ పరిస్థితి లేదు. తాజా సంక్షోభానికి పునాదులు అమెరికాలోనే ఉండటంతో పెట్టుబడులు, ప్రత్యేకించి ద్రవ్య పెట్టుబడులు అమెరికాను నమ్ముకని నీళ్లల్లో దిగటానికి వెనకాడుతున్నాయి. దానికి ఏకైక కారణం అమెరికాలో ప్రజల కొనుగోలు శక్తి పతనం కావటం. అమెరికాలో పెట్టే పెట్టుబడులపై రేట్‌ ఆఫ్‌ రిటర్న్స్‌ (లాభాలు) గ్యారంటీ లేకపోవటం. జర్మనీ, చైనా, భారతదేశం వంటి దేశాల్లో పెట్టే పెట్టుబడులకు అటువంటి లాభాలు గ్యారంటీ ఇచ్చే శక్తి ఇంకా ఉంది. అందుకనే అమెరికా ఎంత కాదన్నా పెట్టుబడులన్నీ ఆసియా మార్గం పడుతున్నాయి. ఆసియాలో ప్రధాన ఆర్థిక శక్తిగా అవతరించిన చైనాకు వెళ్లటంలో ప్రత్యేకత ఏమీ లేదు.

అమెరికా ఈ విషయాలను పరిగణనలోకి తీసుకునేందుకు నిరాకరిస్తోంది. అంతర్జాతీయ మార్కెట్లో చైనా కరెన్సీ విలువ తక్కువ కావటంతో ఆ దేశం వాణిజ్య మిగులను సంపాదించగలుగుతుందని, కాబట్టి ఆ దేశం కూడా తన కరెన్సీ విలువ పెంచటం ద్వారా వాణిజ్య మిగులును తగ్గించుకోవాలని ఒత్తిడి తెస్తోంది. తద్వారా పెట్టుబడులు స్వదేశంలోనే ఉంటాయని, అలా కట్టడి చేయగలనని అమెరికా భావిస్తోంది. చైనా కృత్రిమంగా తన కరెన్సీ విలువ తగ్గిస్తోందని దుమ్మెత్తి పోస్తున్న అమెరికా చేస్తుంది ఏమిటి? మార్కెట్లో అవసరానికి మించి, అవసరమైతే ముద్రించి మరీ డాలర్లను కుమ్మరించడం ద్వారా డాలర్‌ విలువ తగ్గిపోయేందుకు కృత్రికమగా చర్యలు తీసుకుంటోంది. ఈ విషయాన్ని ప్రశ్నించినందుకే చైనా రిజర్వు బ్యాంకు గవర్నర్‌పై ఉదారవాద మేధావులు విరుచుకుపడ్డారు. అంతర్జాతీయ వాణిజ్యంలో ఏ దేశ కరెన్సీకి మారకం రేటు తక్కువగా ఉంటుందో ఆ దేశం ఎక్కువగా ఎగుమతి చేయగలుగుతుంది. ఎందుకంటే ఆ దేశంలో ఉత్పత్తి వ్యయం తక్కువగా ఉంటుంది. దాంతో తక్కువ ఖర్చుతో ఉత్పత్తి అయ్యే వస్తువులు అంతర్జాతీయ పోటీ మార్కెట్లో తక్కువ ధరకు అందుబాటులోకి వస్తాయి. ఈ సూత్రం గత నాలుగు దశాబ్దాలుగా అమెరికా నేతృత్వంలోని సరళీకరణ సిద్ధాంతవేత్తలు అమలు చేస్తూ వచ్చిన సిద్ధాంతం, అమలు చేయాలంటూ ప్రపంచం మీద ఒత్తిడిని కూడా తీసుకొచ్చారు. తన చాప కిందకు నీళ్లు వచ్చే సరికి అమెరికాకు తడి ఏమిటితో తెలిసింది. దాంతో ఉన్న ఫళంగా కరెన్సీ విలువలను పెంచాలంటూ చైనాను, ఇతర దేశాలను డిమాండు చేస్తోంది. ఒక్క భారతదేశం తప్ప మిగిలిన దేశాలేవీ ఈ డిమాండ్‌కు తలొగ్గలేదు. దాంతో భారత కరెన్సీ రూపాయి విలువ పెరిగింది. గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం ఇప్పటికే రూపాయి విలువ 12 శాతం పెరిగిందని అంచనా.

ఈ పరిణామాలన్నీ ఒక విషయాన్ని రుజువు చేస్తున్నాయి. ఆర్థిక వ్యవస్థ తిరిగి కోలుకొనేలా చేయటానికి దేశీయంగా తీసుకునే చర్యలకు పరిమితులు ఉన్నాయి. ఈ పరిమితులు ఒక దశకు చేరుకున్న తర్వాత అంతర్జాతీయంగా కరెన్సీ విలువలను తారుమారు చేయటం ద్వారా ఈ చర్యలను ముందుకు తీసుకెళ్లేందుకు దేశాలు ప్రయత్నిస్తాయి. అది కూడా దేశీయంగా ఉత్పత్తి, వినిమయం వ్యవస్థల్లో నెలకొన్న అసమానతలను పరిష్కరించలేనపుడు, పరిష్కరంచరాదని అనుకున్నపుడు మాత్రమే ఈ చర్యలు కీలకమైన సాధనాలుగా మారతాయి. జి 20 దేశాల సదస్సు కరెన్సీ చర్యలపై నియంత్రణలను అంగీకరించకపోవటం ద్వారా ఈ పరిణామాన్ని వాయిదా మాత్రమే వేయగలిగాయి. ఫలితంగా ఒక కొత్త పరిస్థితి నేడు తలెత్తనుంది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ చైనా, అమెరికా, జర్మనీ దేశాల కరెన్సీల మధ్య ఉండే సంబంధాలపై ఆధారపడే నూతన పరిస్థితే అది. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఆరున్నర దశాబ్దాలుగా అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థకు గురుత్వాకర్షణ శక్తినిచ్చి, కేంద్ర స్థానంలో కొనసాగిన అమెరికా నేడు ఆ స్థానాన్ని కోల్పోనుంది. ఫలితంగా అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ బహుళధృవ ఆర్థిక వ్యవస్థగా రూపాంతరం చెందనుంది. ఈ సమయంలో ఈ పరిణామాలను అజమాయిషీ చేయటానికి జి20 వంటి ప్రజాతంత్రీకరించబడిన అంతర్జాతీయ ఆర్థిక నిర్మాణాలు అవసరం ఎంతైనా ఉంది.

No comments: