Monday, November 8, 2010

రిజర్వు బ్యాంకు మధ్యంతర సమీక్ష గాలి బుడగలను నియంత్రించగలదా ?

* వడ్డీ రేట్ల నియంత్రణ ద్వారా ద్రవ్యోల్బణాన్ని అదుపులోకి తేవాలన్న ఆర్‌బిఐ లక్ష్యం ఆచరణ సాధ్యం కానిదిగా మారిపోనుంది. వెరసి రానున్న కాలంలో జాతీయ ద్రవ్యసరఫరా విధానం మరింత ఒత్తిడికి లోనయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. మారిన జాతీయ అంతర్జాతీయ పరిస్థితులు, ద్రవ్యమార్కెట్ల ప్రపంచీకరణ వంటి పరిణామాలు సాంప్రదాయ ద్రవ్యసరఫరా నియంత్రణ చర్యల పాత్ర గురించి పునరాలోచించాల్సిన అవసరాన్ని ముందుకు తెస్తున్నాయి.

రిజర్వు బ్యాంకు నవంబరు2వ తేదీన ద్రవ్యసరఫరా విధాన మధ్యంతర సమీక్ష నివేదిక విడుదల చేసింది. ద్రవ్యోల్బణాన్ని నియంత్రించటం, ఆర్థికాభివృద్ధికి అవాంతరం లేకుండా చూడటం మౌలిక లక్ష్యాలుగా పేర్కొంటూ ఈ సమీక్షలో భాగంగా ద్రవ్య సరఫరాను ప్రభావితం చేసే అనేక చర్యలను రిజర్వు బ్యాంకు చేపట్టింది. ఇందులో ముఖ్యమైనవి ఆర్థిక వ్యవస్థలోకి విడుదల చేసే నిధుల విషయంలో వడ్డీ రేట్లు 6.25 శాతంగా (రెపో రేటు) నిర్ధారిస్తే ఆర్థిక వ్యవస్థ నుండి వెనక్కు మళ్లే ద్రవ్య నిధులపై వడ్డీ రేట్లు 5.25 గా నిర్ధారించింది. అంతేకాదు రియల్‌ ఎస్టేట్‌ రంగంలో ప్రత్యేకించి ఆస్తులు కూడబెట్టుకునే రంగంలో గాలిబుడగలు ఏర్పడుతున్నాయంది. వీటి ప్రభావం ఆర్థిక వ్యవస్థపై ప్రతికూలంగా ఉంటుందని చెప్పింది. అందుకే వడ్డీ రేట్లు పెంచుతున్నానంది. తద్వారా పెరిగిన వడ్డీ రేట్లను తట్టుకోగలిగిన వారే గృహనిర్మాణ రంగంలో ప్రవేశిస్తారని, అప్పుడు సబ్‌ప్రైమ్‌ తరహా లావాదేవీలు నియంత్రించవచ్చని రిజర్వు బ్యాంకు అంచనా వేసింది. ఈ చర్యల రెండో లక్ష్యం ఆర్థిక వ్యవస్థలో పెరిగిపోతున్న ద్రవ్యోల్బణాన్ని అదుపులోకి తేవటం అని కూడా రిజర్వు బ్యాంకు ప్రకటించింది. ఈ రెండు లక్ష్యాల సాధనకు ప్రస్తుత విధానం ఎంతవరకు దోహదం చేస్తుంది అన్న అంశంతో పాటు ద్రవ్య పెట్టుబడి ప్రపంచీకరణ నేపథ్యంలో రిజర్వుబ్యాంకు ముందున్న విధాన పరిమితులు గురించి కూడా చర్చించుకుందాం.

రియల్‌ ఎస్టేట్‌ రంగంలో సబ్‌ప్రైమ్‌ తరహా ఆస్తులు, లావాదేవీలు పోగుపడకుండా ఉండటానికి ఇళ్ల నిర్మాణానికి ఇచ్చే రుణాలపై వడ్డీ రేట్లు పెంచాలని ఆర్‌బిఐ వాణిజ్య బ్యాంకులను కోరింది. అంతే కాదు. 75 లక్షల ఖరీదైన ఇళ్ల నిర్మాణం విషయంలో రుణాలు ఇచ్చేటప్పుడు బ్యాంకులు మరింత కఠినంగా వ్యవహరించాలని, గాలిబుడగల తరహా రుణాల జోలికి వెళ్లవద్దని హెచ్చరించింది. ఇళ్ల నిర్మాణానికి సంబంధించి బ్యాంకులు సగటున 20 ఏళ్ల నిడివి గల రుణాలు మంజూరు చేస్తాయి. దిగువ మధ్యతరగతి, మధ్యతరగతితో పాటు నిలకడ లేని ఆదాయం ఉన్న వర్గాలను కూడా ఆకర్షించేందుకు వీలుగా బ్యాంకులు వడ్డీ రేట్లను రీస్ట్రక్చర్‌ చేయటం పరిపాటి. ఇందులో భాగంగా మొత్తం ఇరవయ్యేళ్లలో వసూలు చేయాల్సిన రుణం, వడ్డీ మొత్తాలను విభజించి తొలుత తక్కువ వడ్డీ చెల్లించేలా చేయటం, తర్వాత ఎక్కువ వడ్డీ చెల్లించేలా రుణ ఒప్పందాలు కుదుర్చుకోవటం జరుగుతుంది. ఇటువంటి ప్రక్రియ ద్వారా చివర్లో పెద్దమొత్తం చెల్లించాల్సి వచ్చేటప్పటికి బకాయిదారులు దివాళా తీస్తున్నారని దాంతో బ్యాంకులు నష్టపోతున్నాయన్నది రిజర్వు బ్యాంకు వాదన. అంతేకాదు.

గతంలో మొత్తం విలువలో 10 శాతం చెల్లిస్తే మిగిలిన 90 శాతం వరకూ రుణాలు ఇస్తూ వచ్చాయి బ్యాంకులు. దాని స్థానంలో ఇప్పుడు కనీసం 20 శాతం అసలు చెల్లించనిదే రుణాలు మంజూరు చేయటానికి వీలు లేదని ఆర్‌బిఐ స్పష్టం చేసింది. దీనివల్ల నిజంగా నివాస అవసరాల కోసం ఇల్లు కొనుక్కుందామనకునే వారికి ఈ విధానం భారంగా మారనుంది. గతంలో పది శాతం డిపాజిట్‌ చేస్తే వచ్చే రుణానికి ఇపుడు ఇరవై శాతం డిపాజిట్‌ చేయాల్సి వస్తోంది. అంటే వినియోగదారుడు తన జేబులో నుండి మరో పది శాతం నిధులు ఇందుకు వెచ్చించాలి.దీని ప్రభావం వినియమ మార్కెట్లోకి వచ్చే నిధులు మరో పది శాతం తగ్గనున్నాయి. తద్వారా వస్తు వినియోగ డిమాండ్‌ పడిపోయే అవకాశం ఉంది. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే ఈ నిర్ణయం దిగువ స్థాయిలో ఉన్న సాధారణ రుణగ్రహీతలపై భారంగా మారుతుందే తప్ప ధనికవర్గం, రియల్‌ ఎస్టేట్‌ వాణిజ్యంలో ఉన్న వారిపై ఈ నిర్ణయ ప్రభావం ఏమీ ఉండబోదు. ఎందుకంటే వారికి బ్యాంకింగ్‌ మార్గాల ద్వారా కాక బ్యాంకింగేతర మార్గాల ద్వారా నిధులు సమకూర్చుకోగల సామర్థ్యం ఉన్న వారే. బ్యాంకింగేతర సంస్థలు ఆర్‌బిఐ విధాన పరిధిలోకి రావు కనుక ఈ నిర్ణయాలు వారిని ఏమీ ప్రభావితం చేయలేవు. దాంతో గాలిబుడగల వంటి ఆస్తులు కూడబెట్టే అవకాశం వారికి ఎప్పుడూ ఉంటూనే ఉంది.

ద్రవ్యసరఫరా నియంత్రణ ద్వారా ఆర్‌బిఐ సాధించదల్చుకున్న మరో ముఖ్యమైన లక్ష్యం ద్రవ్యోల్బణ నియంత్రణ. స్థూలంగా చెప్పాలంటే జాతీయ ఆర్థిక వ్యవస్థలో వస్తువులు, సేవల విలువకు మించి ద్రవ్యసరఫరా ఉంటే అది ద్రవ్యోల్బణానికి దారితీస్తుందన్నది అవగాహన. గత మూడు మాసాలుగా విదేశీ సంస్థాగత పెట్టుబడుల రూపంలో జాతీయ ఆర్థిక వ్యవస్థలోకి పెద్దఎత్తున నిధులు వచ్చిపడుతున్నాయి. అదనపు నిధులతో ద్రవ్యోల్బణం పెరుగుతుందని ఆర్‌బిఐ నిర్ధారణకు వచ్చింది. దాంతో రెపో రేటు, రివర్స్‌ రెపో రేటు పెంచటం ద్వారా ఈ అదనపు నిధులను మార్కెట్‌ చలామణి నుండి తప్పించవచ్చన్న అంచనా ఈ నిర్ణయానికి కారణం. ఇందులో ఒక ముఖ్యమైన పరిమితి, బలహీనత ఉన్నాయి. ఆర్‌బిఐ తీసుకునే నిర్ణయాల వల్ల జాతీయ వనరుల సరఫరా ప్రభావితం అవుతుంది తప్ప అంతర్జాతీయ వనరుల సరఫరా ప్రభావితం కాదు. సంపన్న దేశాల ఆర్థిక వ్యవస్థల్లో అనుసరిస్తున్న లూజ్‌ మనీ విధానాలు, దారితప్పిన ఉద్దీపనల కారణంగా పెట్టుబడి సంస్థలు, కంపెనీల వద్ద లక్షల కోట్ల నిధులు మురుగుతున్నాయి. ఈ నిధులన్నీ వర్ధమాన దేశాల మార్కెట్లలోకి వరదలా ప్రవహిస్తున్నాయి. అమెరికా రిజర్వు బ్యాంకు ఫెడరల్‌ రిజర్వు రానున్న కాలంలో మరో 500 బిలియన్‌ డాలర్ల నిధులు మార్కెట్లోకి విడుదల చేయనున్నట్లు ప్రకటించింది.

అంటే మున్ముందు మన ఆర్థిక వ్యవస్థలో ద్రవ్య సరఫరా తీవ్రత పెరిగే అవకాశం ఉంది. ఆర్‌బిఐ ద్రవ్య సరఫరా విషయంలో తీసుకునే నిర్ణయాలు అంతర్జాతీయ సంస్థాగత పరిణామాలను నియంత్రించలేవు. దాంతో దేశీయ నిధులు మార్కెట్లో లేకపోయినా విదేశీ నిధులతో మార్కెట్‌ నిండిపోయే ప్రమాదం ఉంది. మరో కోణం నుండి చూస్తే ఆర్‌బిఐ తీసుకున్న నిర్ణయం అంతర్జాతీయ పెట్టుబడుల చలామణికి మార్గం మరింత సుగమమం చేస్తోంది. అటువంటి పరిస్థితుల్లో ఉన్న ఫళంగా విదేశీ సంస్థాగత పెట్టుబడులు వెనకపట్టు పడితే దాని ప్రభావం ఆర్థిక వ్యవస్థపై మరింత తీవ్రంగా ఉండనుంది. దాంతో దేశీయ నిధులతో తెరమీదకు వచ్చే దేశీయ ద్రవ్యోల్బణం ముందు ముందు విదేశీ నిధులతో దేశంలోకి వచ్చే ద్రవ్యోల్బణంగా మారే ప్రమాదం ముందుకొచ్చింది. వడ్డీ రేట్లు పెంచటం వల్ల ద్రవ్య సరఫరాపై ప్రభావం ఎంతవరకు ఉంటుందన్నది కూడా ఇపుడు ప్రశ్నార్థకమే. ఎందుకంటే గత రెండు నెలల క్రితమే దేశంలో జాతీయ బ్యాంకులన్నీ బేస్‌ రేటు విధానాన్ని అమలు చేయాలని ఆర్‌బిఐ ఆదేశించింది. ఆ మేరకు ఆగస్టులో అన్ని బ్యాంకులు వడ్డీరేట్లను సంస్కరించాయి. ఇపుడు తాజాగా ఆర్‌బిఐ మధ్యంతర సమీక్ష నేపథ్యంలో మరోసారి వడ్డీరేట్లు సంస్కరించటం సాధ్యం కాదని బ్యాంకులు తేల్చి చెప్పాయి.

దాంతో ఇపుడు ఆర్థిక వ్యవస్థల్లో వ్యక్తం కానున్న మౌలిక లక్షణాలు ఇవి. ఇటు బ్యాంకులు వడ్డీ రేట్లల్లో మార్పులు చేయకపోటం ద్వారా ఆర్‌బిఐ వడ్డీ రేట్ల ప్రభావాన్ని ప్రశ్నార్థకం చేయటం ఒకటి. ఈ వడ్డీ రేట్లు దీర్ఘకాలిక పెట్టుబడులపై ప్రభావం చూపిస్తే అది ఆర్థిక వ్యవస్థ వృద్ధి రేటును దెబ్బ తీస్తుంది. తాత్కాలిక పెట్టుబడులను ప్రభావితం చేయటం ద్వారా మార్కెట్లో ద్రవ్య సరఫరా తగ్గించినప్పటికీ విదేశీ సంస్థాగత పెట్టుబడులు, సంపన్న దేశాలు అనుసరించే లూజ్‌ మనీ విధానాలతో మార్కెట్‌ నిండుగా ఉండే అవకాశం ఉంది. దాంతో వడ్డీ రేట్ల నియంత్రణ ద్వారా ద్రవ్యోల్బణాన్ని అదుపులోకి తేవాలన్న ఆర్‌బిఐ లక్ష్యం ఆచరణ సాధ్యం కానిదిగా మారిపోనుంది. వెరసి రానున్న కాలంలో జాతీయ ద్రవ్యసరఫరా విధానం మరింత ఒత్తిడికి లోనయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. మారిన జాతీయ అంతర్జాతీయ పరిస్థితులు, ద్రవ్యమార్కెట్ల ప్రపంచీకరణ వంటి పరిణామాలు సాంప్రదాయ ద్రవ్యసరఫరా నియంత్రణ చర్యల పాత్ర గురించి పునరాలోచించాల్సిన అవసరాన్ని ముందుకు తెస్తున్నాయి.

No comments: