Monday, November 1, 2010

రూపాయి విలువ ఎందుకు పెరుగుతోంది ?

గత నెల రోజులుగా ప్రాంతీయ పత్రికలు మొదలు అంతర్జాతీయ పత్రికల వరకూ ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో చోటుచేసుకుంటున్న కరెన్సీ యుద్ధాల గురించి వ్యాఖ్యానిస్తూ వచ్చాయి. ఈ కరెన్సీ యుద్ధాలకు మూల కారణం అమెరికా పార్లమెంట్‌ ఆమోదించిన చట్టం. ఈ చట్టం ప్రకారం చైనా కరెన్సీ విలువ పెంచేందుకు చర్యలు తీసుకోకపోతే చైనా ఎగుమతులు, దిగుమతుల విషయంలో అమెరికా ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవచ్చన్నది సారాంశం. ఇదే అంశం అక్టోబరు నెలలో జరిగిన ఐఎంఎఫ్‌, ప్రపంచ బ్యాంకు వార్షిక సమావేశాలు, జి 20 దేశాల ఆర్థిక మంత్రులు, రిజర్వు బ్యాంకు గవర్నర్ల సమావేశంలో కీలకమైన ఎజెండాగా మారింది. చివరకు ఈ విషయమై ఎటువంటి నిర్ధారణ లేకుండానే సమావేశాలు ముగిశాయి. చైనాతో పాటు జర్మనీ, ఫ్రాన్స్‌, జపాన్‌ వంటి దేశాలు కూడా కరెన్సీ విలువల విషయంలో ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలన్న అమెరికా ప్రతిపాదనకు అడ్డుచెప్పాయి. ఇదిలా ఉండగా భారతదేశంలో కూడా ఇదే తరహా చర్చ జరుగుతోంది. పెరుగుతున్న రూపాయి విలువ గురించిన చర్చ అది. అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థలో విదేశీ పెట్టుబడుల ప్రవాహం విపరీతంగా ఉందని ఐఎంఎఫ్‌ విడుదల చేసిన వార్షిక నివేదిక అంచనా వేసింది. ఈ ప్రవాహం ప్రత్యేకించి ఆసియా దేశాల వైపు మళ్లుతోందని, దాంతో ఆయా దేశాల ఆర్థిక వ్యవస్థల్లో కరెన్సీ సమస్యలు తలెత్తుతున్నాయని సదరు నివేదిక హెచ్చరించింది. ఈ మొత్తం చర్చకు పునాదిగా ఉన్న కారణాల గురించి మాత్రం అటు ఐఎంఎఫ్‌ నివేదిక గానీ, ఇటు పైన చెప్పుకున్న సమావేశాలు గానీ మాటమాత్రం ప్రస్తావించకపోవటం ఆశ్చర్యం కలిగించటం లేదు. పైగా పశ్చమ దేశాల ఆర్థిక మేధావులు తాజా అనుభవం తర్వాత సైతం నయాఉదారవాద సైద్ధాంతిక ప్రభావం నుండి బయట పడలేదన్న విషయం మరోమారు రుజువు అవుతుంది.


ఇతర దేశాలు ఆయా దేశాల కరెన్సీ విలువలను తగ్గించాలని కొరడా ఝుళిపిస్తున్న అమెరికా ఆ దేశం నుండి ఇబ్బడి ముబ్బడిగా బయటకు తరలివెళ్తున్న పెట్టుబడులపై ఆంక్షలు ఎందుకు విధించటం లేదు అన్న ప్రశ్న తలెత్తుతుంది. ప్రస్తుతం లక్షలాది కోట్ల డాలర్ల నిల్వలు అమెరికా కంపెనీల వద్ద పేరుకుపోయాయి. అమెరికా ఆర్థిక వ్యవస్థలో లాభాలు వచ్చే గ్యారంటీ లేకపోవటంతో ఈ నిల్వలు పెట్టుడులుగా మారటం లేదు. ఈ పరిస్థితుల్లో కాస్త ఊపు మీదున్నవి ఆసియా దేశాలైన భారత్‌, చైనాలేనన్నది నిస్సందేహం. దాంతో సహజంగానే ద్రవ్య పెట్టుబడి రూపంలో విదేశీ నిల్వలు ఇబ్బడిముబ్బడిగా పెరుగుతున్నాయి. గత వారం జరిగిన ఆర్‌బిఐ ఉన్నతస్థాయి కమిటీ అంచనా మేరకు భారతదేశంలో ప్రస్తుత ఆర్థిక సంత్సరంలో ఇప్పటికి 15 బిలియన్‌ డాలర్ల నిధులు జమపడ్డాయి. దీంతో స్టాక్‌ మార్కెట్‌ సూచి మూడేళ్ల తర్వాత 20వేల పాయింట్లు దాటింది. లక్షల కోట్ల మేర ఈక్విటీల్లో వచ్చి పడ్డ నిధులే దీనికి కారణమని మార్కెట్‌ వర్గాలే చెబుతున్నాయి. మరో 50వేల కోట్ల రూపాయల మేర రుణ మార్కెట్‌లో నిధులు చేరాయి. వీటి ప్రభావంతో జాతీయ స్థూల ఉత్పత్తి విలువను మించి దేశంలో కరెన్సీ చలామణిలో ఉంది. వీటన్నింటివల్ల రూపాయి విలువ పెరుగుతోంది. అంటే ప్రపంచీకృత ఆర్థిక వ్యవస్థలో ఏ దేశంలోనైనా, అందులోనూ ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు బలమైన పునాదిగా ఉన్న అమెరికా వంటి దేశ ఆర్థిక వ్యవస్థలో స్తబ్దత చోటు చేసుకుని అది మాంద్యం దిశగా ప్రయాణిస్తుంటే ఆ దేశం నుండి వచ్చిన పెట్టుబడులు ఇతర దేశాల కరెన్సీ విలువల రేట్లు పెంచుతాయన్న మాట.


పెరగటం మంచిదే అయినపుడు మనం దీనికి గురించి ఇంత రాద్ధాంతం చేయటం ఎందుకు అన్న ప్రశ్న రావటం సహజం. ఇక్కడే అసలు మతలబు ఉంది. ఐఎంఎఫ్‌ నివేదిక ప్రకారమే భారతదేశంలోకి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి కంటే విదేశీ సంస్థాగత పెట్టుబడి ఎక్కువగా వస్తోంది. సుమారు 18.8 బిలియన్‌ డాలర్ల నిధులు ఈ ఆర్థిక సంవత్సరంలో సంస్థాగత పెట్టుబడుల రూపంలో వచ్చే కేవలం అందులో సగం 8 బిలియన్‌ డాలర్లకు పరిమితం అయ్యింది. ప్రత్యక్ష పెట్టుబడులు దేశ ఆర్థిక వ్యవస్థకు బలం చేకూర్చే అవకాశం ఉంది. కానీ సంస్థాగత పెట్టుబడులు అటువంటి బలం చేకూర్చలేవు. పైగా వచ్చినంత లాభాలు దండుకుని అదును చూసి పారిపోతాయి. ఇది మనం ఆందోళన చెందాల్సిన కారణాల్లో ఒకటి. మరో కారణం ఏమిటంటే ఆర్థిక వ్యవస్థకు ఏమీ మేలు చేయలేకపోయినా, నష్టం మాత్రం చేకూరుస్తాయి. అదెలాగో పరిశీలిద్దాం.


హాట్‌మనీ రూపంలో వచ్చిన నిధుల నిల్వలు పెరగటం వల్ల రూపాయి మారకం విలువ పెరుగుతుందన్న విషయాన్ని పైన చెప్పుకున్నాం. అలా పెరుగుతున్న మారకం విలువతో ఎగుమతులు విలువ పెరుగుతుంది. దిగుమతుల విలువ తగ్గుతుంది. దాంతో ఎగుమతిదారుల ఆదాయాలు తగ్గిపోతాయి. దిగుమతి దారుల ఆదాయాలు పెరుగుతాయి. ఇటువంటి సందర్భాల్లోనూ పారిశ్రామిక వర్గం తమ పరిశ్రమలను విస్తరించుకోవటానికి అవసరమైన వస్తు సామాగ్రిని దిగుమతి చేసుకుంటుంది. తక్కువ ఖర్చుతో ఎక్కువ ప్రయోజనం పొందుతుంది. ఇదేవిధంగా ఈ సంవత్సరం ఏప్రిల్‌ నాటికి 27.70 బిలియన్‌ డాలర్ల మేర దిగుమతులు జరగ్గా అగస్టు నాటికి మరో రెండు బిలియన్‌ డాలర్ల దిగుమతులు పెరిగి మొత్తంగా 29.67 బిలియన్‌ డాలర్లకు చేరుకున్నాయి. కాగా ఎగుమతులు మాత్రం 16.84 బిలియన్‌ డాలర్ల విలువ నుండి తగ్గిపోయి 16.64కు చేరింది. దాంతో వాణిజ్య లోటు పెరుగుతోంది. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం ఎగుమతులు భారం కాకుండా చూడటానికి చర్యలు చేపట్టాలి. లేనిపక్షంలో ఎగుమతి ఆధారిత పరిశ్రమల అభివృద్ధి కుంటుపడుతుంది. పెరుగుతున్న రూపాయి విలువ భారాన్ని వేరే రూపంలో తగ్గించుకోలేని ఎగుమతిదారులు ఆయా పరిశ్రమల్లో ఉద్యోగులపై తమ ప్రతాపం చూపిస్తారు. దాంతో వేతనాల్లో కోత, ఉద్యోగాల్లో కోత, అదనపు ఆదాయం లేని పరిశ్రమల మూత వంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి. అందువల్లనే రిజర్వు బ్యాంకు పెరుగుతున్న విదేశీ పెట్టుబడుల నిల్వలను నియంత్రించాలని ప్రతిపాదిస్తోంది. కానీ అందుకవసరమైన సూత్రబద్దమైన చర్యలు మాత్రం ప్రస్తావించటం లేదు. కేవలం బ్యాంకు వడ్డీ రేట్లలో మార్పులు తెచ్చినంత మాత్రాన అది జాతీయ ఆర్థిక వ్యవస్థలో ద్రవ్యోల్బణాన్ని పెంచి ప్రజలపై మరిన్ని భారాలు వేస్తుందే తప్ప పెద్దగా ఉపయోగపడదు. దానికి బదులుగా విదేశీ పెట్టుబడలపైనే అనేక చర్యలు తీసుకోవచ్చు. వచ్చిన పెట్టుబడులు నిర్దిష్ట కాలం వరకూ కదలకూడదనే ఆంక్షలు విధించటం మొదలు, వచ్చిన పెట్టుబడులపై పన్ను వేయటం, వస్తూత్పత్తి రంగాల్లో పెట్టుబడులు వచ్చేలా సవరణలు చేయటం వంటి అనేక మార్గాలు ఉన్నాయి. కానీ ప్రభుత్వం పాత్ర అంటే సుతరామూ ఇష్టం లేని ఈ విదేశీ పెట్టుబడులు తిరిగి పారిపోతాయేమోనన్న భయం పాలకులకు ఉంది. ఇక్కడ ఒక విషయాన్ని మనం గమనంలోకి తీసుకోవాలి. అది 90 దశకం నాటి అనుభవాలు.


90 దశకంలో కూడా ఇదేవిధంగా ఎగుమతులు స్థంభించిపోయి, దిగుమతులు పెరిగాయి. దాంతో వాణిజ్య లోటుపెరిగింది. దేశంలో వస్తూత్పత్తి రంగం కుదేలవటం, ఎగమతుల్లో మన దేశం వాటా తగ్గిపోవటం, అదేసమయంలో ఉన్నత మధ్యతరగతి ప్రయోజనాలు కాపాడే రీతిలో విలాసవంతమైన సరుకులు దిగుమతి చేసుకోవటానికి పెద్దఎత్తున నిధులు కుమ్మరించటంతో ఈ పరిస్థితి దాపురించింది. విదేశీ పెట్టుబడులు బలహీనమైన ఆర్థిక వ్యవస్థలోకి రావు. దాంతో చెల్లింపుల సంక్షోభం నెలకొంది. దీన్నుండి బయటపడేందుకు రూపాయి విలువ తగ్గించుకున్నాము. నేటి పరిస్థితి దీనికి భినన్నమైనది. నాడు మన దేశ అవసరాల రీత్యా విదేశీ పెట్టుబడులు ఆహ్వానించాము. దాని అవసరాలకు తగ్గట్లుగా తలాడించాము. నేడు అవసరం విదేశీ ద్రవ్య పెట్టుబడిది. మన దేశంలో ఆంక్షలు విధించినంత మాత్రాన మరెక్కడకో పారిపోయేపరిస్థితి దానికి లేదు. ఎందుకంటే యూరప్‌ ఆర్ధిక వ్యవస్ధ చిద్రమై ఉంది. చైనాకు వెళ్లి అక్కడి ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసి బలమైన శతృవును తయారు చేసుకోవటం అమెరికాకు ఏమంత ప్రయోజనకరం కాదు. అటువంటి పరిస్థితుల్లో జపాన్‌, భారతదేశం వంటి దేశాల్లోనే అమెరికా పెట్టుబడులు పెట్టాలి. ఈ విధంగా వచ్చే పెట్టుబడులు ద్రవ్యమార్కెట్లో కాక వస్తూత్పత్తి రంగంలో పెట్టేలా ప్రభుత్వం ఎత్తుగడలు వేయగలగాలి. నాలుగైదేళ్ల క్రితం వరకూ అమెరికా భారత్‌ సంబంధాల్లో రక్షణపరమైన వ్యూహాత్మక భాగాస్వామ్యానికి ప్రాధాన్యత ఉండేది. నేడు ఆర్థికపరమైన భాగస్వామ్యం దిశగా మారే అవకాశం వచ్చింది. నవంబరు మొదటి వారంలో అమెరికా అధ్యక్షుడి వెంట వచ్చే బృందంలో పారిశ్రామికవేత్తల సంఖ్య ఎక్కువగా ఉండటం, వివిధ రంగాల్లో భారత పరిశ్రమాధిపతులతో ఒప్పందాలు చేసుకునేందుకు వారు సిద్ధపడటం ఈ మార్పుకు సంకేతం. ఈ కీలకసమయంలో ఇంకా మనం జూనియర్‌ భాగస్వామిగా ఉండాలనే ఆలోచన నుండి బయట పడి మన శక్తి సామర్ధ్యాలకు తగ్గట్లు వ్యవహరించలేకపోతే మనకు ఐఎంఎఫ్‌లో ఓట్లు ఎక్కువ వచ్చినా, ఐక్యరాజ్యసమితి భద్రతా సమితిలో స్థానం దక్కినా కలిగే ప్రయోజనం ఏమీ ఉండదు. అమెరికా చెప్పిన వారికి చెప్పినట్లు ఓటు వేయటం మినహా..

No comments: