Monday, November 15, 2010

రచ్చ గెలుస్తున్నాం ... మరి ఇంటి సంగతీ...?


ఒబామా పర్యటన పూర్తయ్యింది. మన దేశం నుండి 15 బిలియన్‌ డాలర్ల పెట్టుబడులు తరలించుకు పొయ్యాడు. వాళ్ల దేశంలో 72వేల ఉద్యోగాలు కాపాడుకున్నాడు. కానీ మనకు ఒరిగింది ఏమిటి ? ఈ విషయాలు ఏమీ పట్టనట్లు ప్రధాన మంత్రి మాత్రం సియోల్‌లో అంతర్జాతీయ స్వేఛ్చా వాణిజ్యం, భారతదేశ పెట్టుబడులకు ప్రాధాన్యత స్థానం కల్పించటం వంటి విషయాల గురించి చర్చిస్తున్నారు. ఇది ఆయన తప్పు కాదు. సహవాస దోషం. ఒకసారి అగ్రరాజ్యంగా మనలను మనం భావించుకోవటంతో పాటు మిగిలిన వాళ్లు (అమెరికా) కూడా గుర్తించటం ప్రారంభిస్తే మన ప్రాధాన్యతలు కూడా మారిపోతాయి.
ఇప్పుడూ అదే జరుగుతోంది.


దేశం ఇంకా ఒబామా పర్యటన ప్రభావం నుండి బయటపడలేదు. పత్రికల్లో వస్తున్న వాఖ్యానాలే దీనికి ఉదాహరణ. బహుశా స్వతంత్ర భారత చరిత్రలో ఎన్నడూ లేని విధంగా వరుసగా పదేళ్ల వ్యవధిలో ముగ్గురు అమెరికా అధ్యక్షులు భారత్‌ సందర్శించటం రాజకీయ ప్రాధాన్యత సంతరించుకున్న పరిణామమే. ఇరువురు అధ్యక్షులకు కాంగ్రెస్‌ ప్రభుత్వం ఆహ్వానం పలకగా ఒక అధ్యక్షుడికి బిజెపి స్వాగతం పలికింది. అంతర్జాతీయ రాజకీయ చట్రంలో భారతదేశానికి ఇస్తున్న ప్రాధాన్యత పెరగుతుందనటానికి ఈ పర్యటనలు ఉదాహరణగా చెప్తున్నారు. ఇదే ఒబామా అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తొలినాళ్లల్లో జరిపిన ఆసియా పర్యటనలో భారతదేశానికి రాకపోవటం దేశంలో పాలకవర్గాలను నొప్పించింది. దాంతో పట్టుబట్టి మరీ ఒబామాను దేశానికి తీసుకురావటంలో మన్మోహన్‌సింగ్‌ ప్రభుత్వం ఫలప్రదం అయ్యింది. రాజు వెడలె రవితేజములలరగ... అన్న రీతిలో ఒబామా పర్యటనకు ఆకాశమంత పందిరి, భూదేవి అంత అరుగు వేయలేకపోయినా రాష్ట్రపతి భవన్‌లో చారిత్రక మొఘల్‌ గార్డెన్స్‌ మాత్రం సర్వాంగసుందరంగా తీర్చిదిద్దారు. దేశమంతా కళ్లు పెద్దవి చేసి చూసిన ఒబామా పర్యటన పూర్తయ్యింది. మన దేశం నుండి 15 బిలియన్‌ డాలర్ల పెట్టుబడులు తరలించుకు పొయ్యాడు. వాళ్ల దేశంలో 72వేల ఉద్యోగాలు కాపాడుకున్నాడు. కానీ మనకు ఒరిగింది ఏమిటి ? మొన్నటి వరకూ విదేశీ మార్కెట్లల్లో తమ పెట్టుబడుల ప్రవేశానికి ఎటువంటి అవాంతరాలూ ఉండకూదని హుంకరించిన అమెరికా నేడు తమ దేశంలో విదేశీ పెట్టుబడులు, సేవలు, ఉద్యోగులు ప్రవేశించరాదనీ, తమ దేశంలో ఉద్యోగాలు హరించుకుపోరాదనీ వేడుకొంటోంది. ప్రత్యేకించి అమెరికా పార్లమెంట్‌కు జరిగిన ఎన్నికల్లో చావుతప్పి కన్ను లొట్టపోయిన ఒబామాకు ఇదే ఏకైక లక్ష్యంగా మారింది. ఈ లక్ష్యాన్ని చేరుకోవటానికి ఎన్ని మార్గాలున్నాయో అన్ని మార్గాలను అవలంబిస్తుంది అమెరికా. అందులో ఒకటి భారతదేశానికి అగ్రరాజ్య హోదాను ఖరారు చేయటం. అమెరికా అంగీకరించినంత మాత్రాన ఏ దేశమైనా అగ్రరాజ్యం అవుతుందా అన్నది ముఖ్యమైన ప్రశ్న.

కేవలం అంతర్జాతీయంగా పలుకుబడి సంపాదించినంత మాత్రాన, ప్రతిష్ట పెంచుకున్నంత మాత్రాన ఒక దేశం అగ్రరాజ్యమైపోతుందా ? కాదు. దేశీయంగా ఆర్థిక వ్యవస్థలను అభివృధ్ధి చేయకుండా, జాతీయ లక్ష్యాల సాధనకు కట్టుబడకుండానే ఏ దేశమూ అగ్రరాజ్యంగా ఎదిగిన దాఖలాలు చరిత్రలో కనిపించవు. చివరకు తొలి ప్రధాని నెహ్రూ కూడా ఏ దేశానికైనా అంతర్జాతీయంగా వచ్చే కీర్తి పత్రిష్టలు, స్థానం, ఆ దేశం సాధించే అభివృద్ధిని బట్టే వస్తాయని అభిప్రాయపడ్డారు. అందుకే దేశాలు అనుసరించే విదేశాంగ విధానం దేశీయంగా అనుసరించే రాజకీయ ఆర్థిక విధానాలకు కొనసాగింపే తప్ప మరోటి కాదు అని ఆయన స్పష్టం చేశారు. చివరకు అమెరికాలో ఉద్యోగాలు కాపాడటానికి ప్రపంచ దేశాల వాణిజ్య విధానాల్లో మార్పులు తేవాలని ఒత్తిడి తెస్తోంది. మరి మన దేశం ఏమిటి చేస్తుంది ? మన దేశం పెట్టుబడులు మరో దేశానికి తరలి వెళ్లటం అన్నా, మరో దేశం వాణిజ్యోత్పత్తులు మన దేశానికి తరలి రావటం అన్నా మన దేశంలో పదిశాతానికి పైగా ఉన్న నిరుద్యోగం మరింత పెరగటం, వ్యవసాయ రంగం మరింత కుదేలు కావటమే. అమెరికా పర్యటన ముగిసిన వెంటనే సియోల్‌లో జరిగే జి20 సమావేశాలకు హాజరయ్యేందుకు వెళ్లిన ప్రధాన మంత్రి ఈ విషయాల గురించిగానీ, అమెరికా, జర్మనీ వంటి సంపన్న దేశాలు అనుసరిస్తున్న ఆత్మరక్షణ విధానాల గురించి పల్లెత్తు మాట మాట్లాడటం లేదు. పైగా గత మూడు దశాబ్దాలుగా అమెరికా ఆలపించిన రాగం స్వేఛ్చా వాణిజ్యమే అభివృద్ధికి మార్గం అన్న రాగాన్ని లంకించుకున్నారు. దేశంలో అభివృద్ధి, ఆర్థిక అసమానతలు, పేదరికం వంటి సమస్యలే లేనట్లు అంతర్జాతీయ వాణిజ్యంపైనే కేంద్రీకరించారు. ఏ దేశమైనా కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో అగ్రరాజ్యం హోదా తెచ్చుకున్నా స్వదేశంలో కోట్లాదిమందిని దారిద్య్రం నుండి బయట పడేయకుండా అగ్రరాజ్యంగా మనుగడ సాగించగలదా అని ప్రశ్నించుకుంటే వచ్చే సమాధానం సంస్కరణవాదులకు కోపం తెప్పిస్తుంది. గతంలో పట్టుమని పది పారిశ్రామిక కుంటుంబాలు ఉంటే నేడు వందలాది కుటుంబాలు ఉన్నాయి. గతంలో నాలుగు దశాబ్దాల క్రితం మూడు వేలకు అటూ ఇటూగా ఉన్న తలసరి ఆదాయం నేడు పాతికవేలకు పైబడింది. స్టాక్‌ మార్కెట్‌ సూచిక ఇరవై వేల పాయింట్లు దాటిపోయింది. రానున్న పదేళ్లల్లో లక్షల పాయింట్లకు చేరుకోనుందన్న అంచనాలు ఉన్నాయి. అగ్రరాజ్యం హోదాకు ఇంతకు మించిన అర్హతలు ఏమి కావాలి అని ఎదురు దాడికి దిగుతారు. కానీ వాస్తవాలు దీనికి భిన్నంగా ఉన్నాయి.

భారతదేశంలో ఆర్థికాభివృద్ధి ఎంతో వేగంగా జరుగుతోందని ఐఎంఎఫ్‌, ప్రపంచ బ్యాంకులు చెపుతుంటే అంతే వేగంగా అంతరాలు పెరుగుతున్నాయని ఐక్యరాజ్యసమితికి చెందిన వివిధ సంస్థలు హెచ్చరిస్తున్నాయి. భారతదేశం సాధిస్తున్న అభివృద్ధిలో ఆదాయ పునఃపంపిణీకి సంబంధించిన వ్యవస్థలు సమర్థవంతంగా పని చేయటం లేదని ప్రపంచ అభివృద్ధి గురించి అధ్యయనాలు చేసే వైడర్‌ సంస్థ నిర్ధారించింది. ఒబామా రాకడకు మూడు రోజులు ముందుగా విడుదల చేసిన మానవాభివృద్ధి నివేదిక 2010 వెల్లడించిన వివరాలు మరింత నిర్ఘాంతపర్చేవిగా ఉన్నాయి. మానవాభివృద్ధి నివేదిక వెల్లడించిన వివరాల ప్రకారం ఈ కాలంలో సగటు తలసరి ఆదాయం పెరిగిన దేశాల్లో భారతదేశం పదోస్థానం సంపాదించుకుంటే మానవాభివృద్ధి సూచికలో మాత్రం 119వ స్థానానికి పరిమితం అయ్యింది.

అంతే గత రెండున్నద దశాబ్దాలుగా జరుగుతున్న అభివృద్ధి ఫలాలు ప్రజలకు చేరటం లేదని, సామాజిక, సామూహిక అభివృద్ధి మార్గంలో ముందుకు సాగటం లేదని ఈ అంకెలు చెప్తున్నాయి. ప్రత్యేకించి ఆదాయ పంపిణీ, సమానత్వం సూచికలు పరిశీలించినపుడు భారతదేశంలో మానవాభివృద్ధి సూచిక సుమారు మరో ముప్పై నలభై స్థానాల దిగువకు పడిపోతుంది. 73, 74 రాజ్యాంగ సవరణల ద్వారా మహిళలకు రాజకీయ రంగంలో ప్రాధాన్యత పెరిగినా సామాజికంగా వారి స్థానంలో మార్పు రాలేదని ఈ నివేదిక స్పష్టం చేసింది. ఈ సారి బహుముఖ పేదరికం గురించి ప్రస్తావించిన మానవాభివృద్ది నివేదిక ''భారతదేశంలో 55 శాతం ప్రజలు బహుముఖాలుగా పేదరికం అనుభవిస్తున్నారు. మరో పదహారు శాతం బహుముఖ సామాజిక సేవలకు దూరంగా ఉన్నారు. వీరిని కలుపుకుంటే 71 శాతం ప్రజలు దారిద్య్రంతో మగ్గుతున్నట్లు చెప్పొచ్చు. సహస్రాబ్ది అభివృద్ధి లక్ష్యాలు మేరకు చూసుకున్నా రోజుకు 60 రూపాయల కంటే తక్కువ ఆదాయంతో జీవిస్తున్న వారి సంఖ్య మొత్తం దేశ జనాభాల్లో 53.5 శాతం ఉంది.'' ''దేశ రాజధాని ఢిల్లీలో బహుముఖ పేదరికం ఇరాక్‌ స్థాయిలో ఉంటే బీహార్‌, ఛత్తీస్‌గడ్‌ వంటి రాష్ట్రాల్లో ఇది అంతర్యుద్ధంతో అట్టుడుకుతున్న సియర్రా లియోన్‌, గినియా దేశాల కంటే అథమ స్థాయిలో ఉంది. దేశంలోని మొత్తం ఆదివాసీ జనాభాలో 81 శాతం బహుముఖ పేదరికంలో ఉంటే దళితుల్లో 66 శాతం ఈ సమస్యలతో కుంగిపోతున్నారు'' అని ప్రకటించింది.

ఈ విషయాలు, వాస్తవాలు ఏమీ పట్టనట్లు ప్రధాన మంత్రి మాత్రం సియోల్‌లో అంతర్జాతీయ స్వేఛ్చా వాణిజ్యం, భారతదేశ పెట్టుబడులకు ప్రాధాన్యత స్థానం కల్పించటం వంటి విషయాల గురించి చర్చిస్తున్నారు. ఇది ఆయన తప్పు కాదు. సహవాస దోషం. ఒక సారి అగ్రరాజ్యంగా మనలను మనం భావించుకోవటంతో పాటు మిగిలిన వాళ్లు కూడా గుర్తించటం ప్రారంభిస్తే మన ప్రాధాన్యతలు కూడా మారిపోతాయి. ఇప్పుడూ అదే జరుగుతోంది. దేశంలో పేదరికంలో మగ్గుతున్న సగానికి పైగా జనాభాను విముక్తి చేసే ప్రాధాన్యత స్థానంలో అంతర్జాతీయ పెట్టుబడిదారీ విధానాన్ని కాపాడటానికి అవసరమైన విధి విధానాలు, వ్యవస్థల నిర్మాణం ప్రధానమంత్రి, యుపిఎ-2 ప్రాధాన్యతల జాబితాలో చేరిపోయాయి.

అందువల్లనే అమెరికా ఎన్ని డాలర్లుఅచ్చువేసినా వచ్చే నష్టమేమీ లేదని స్వయంగా ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు అహ్లువాలియా ప్రకటిస్తున్నాడు. మొన్నటి వరకూ వర్ధమాన దేశాలతో జట్టు కట్టి వాణిజ్య చర్చల్లో సామ్రాజ్యవాద దేశాలను నిలువరించటానికి పని చేసిన భారతదేశం ఇపుడు అమెరికా మనకు తగిలించిన అగ్రరాజ్యం బిళ్లతో మనం వేరే జట్టులో చేరిపోతాము. వర్ధమాన దేశాలతో జట్టుకట్టటం నామోషీగా భావిస్తాము. ఎవరో ఇస్తే వచ్చేది కాదు అగ్రరాజ్యం హోదా. ఇతోధికంగా అభివృద్ధి సాధించటం, అభివృద్ధి ఫలాలు ప్రజలందరికీ అందేలా చేసినపుడే ఏ దేశమైనా ఒకరు గుర్తించినా గుర్తించకపోయినా అగ్రరాజ్యంగా అవతరిస్తోంది. నాడు సోవియట్‌ రష్యా అనుభవం గానీ, నేడు చైనా అనుభవం రుజువు చేస్తున్న అంశం ఇదే. ఈ వాస్తవాన్ని పక్కన పెట్టి ఎవరో ఇచ్చిన అగ్రరాజ్యం గంటలు తగిలించుకుని లేని ఓపికతో పరుగులు తీస్తే మోకాళ్లు పగలటం తప్ప మరోటి జరగదు. అందుకే ఇంట గెలిచి రచ్చ గెలవాలంటారు.

No comments: