Friday, February 4, 2011

బెంగాల్‌ను అస్థిరత నుండి సుస్థిరతకు నడిపిన లెఫ్ట్‌ ఫ్రంట్‌

Published in Marxistu Feb 2011
బెంగాల్‌లో దీర్ఘకాలంగా నిద్రాణంగా ఉన్న విఛ్చిన్నకర శక్తులకు నేడు తృణమూల్‌ కాంగ్రెస్‌ ఒక వేదికగా మారింది. దాంతో ఇప్పటి వరకూ బెంగాల్‌లో కనిపించని అస్థిత్వ వాదాలు, తిరోగమన వాదాలు నేడు మనకు కనిపిస్తున్నాయి. ఈ శక్తులు బెంగాల్‌ గత మూడున్నర దశాబ్దాలుగా సాధించిన రాజకీయ సుస్థిరతనూ, ప్రజాతంత్ర చైతన్యాన్నీ, ఆర్థిక ఫలాలనూ ధ్వంసం చేయబూనుకుంటున్నాయి. వీటికి జాతీయస్థాయిలోని ప్రగతినిరోధక శక్తులు చేదోడువాదోడుగా నిలుస్తున్నాయి.

నేడు పశ్చిమబెంగాల్‌ రాజకీయ పరిణా మాలు కేవలం వామపక్ష శ్రేయోభిలాషుల దృష్టినే కాదు. మొత్తం ప్రపంచ దృష్టినాకర్షి స్తున్నాయి. వరుసగా ఏడు సార్లు అసెంబ్లీ ఎన్ని కల్లో విజయ దుందుభి మోగించిన వామపక్ష సంఘటన ఎనిమిదోసారి కమ్యూనిస్టు పతాకాన్ని ఎగరవేస్తుందా లేదా అని వామపక్ష అభిమానులు ఆత్రంగా ఎదురు చూస్తున్నారు. ఈ కాలంలో రాష్ట్రంలో చోటు చేసుకున్న పలు ఆర్థిక రాజకీయ పరిణామాలు నేపథ్యంలో వామపక్ష వ్యతిరేకులు విషప్రచారానికి ఒడిగడుతున్నారు. బెంగాల్‌లో వామపక్ష ప్రభుత్వం సాధించి విజయాలను చిన్నవి చేసి చూపే ప్రయత్నాలు ప్రారంభ మయ్యాయి. దానికి తోడు నేడు దేశంలోనూ, బెంగాల్‌లోనూ మూడొంతుల మంది ఓటర్లు 70 దశకం తర్వాత పుట్టిన వారు కావటంతో అంతకు పూర్వపు రాజీకయ సామాజిక పరిస్థి తులు ఏ పరిస్థితుల్లో బెంగాల్‌ ప్రజలు వామపక్ష సంఘటనకు పట్టం కట్టారు, దానికి ముందు రాష్ట్రం కాంగ్రెస్‌ పాలనలో ఏ విధంగా నష్టపో యింది అన్న విషయాలు గురించి తెలుసుకునే అవకాశం లేదు. ఈ నేపథ్యంలో 60-70 దశకాల నాటి దేశ రాజకీయ పరిస్థితిని స్థూలంగా, బెంగాల్‌ రాజకీయ చిత్రాన్ని వివ రంగా పాఠకులముందుంచే ప్రయత్నమే ఈ వ్యాసం.

నేపథ్యం

స్వాతంత్య్రానంతర తొలి రెండు దశాబ్దా లు నెహ్రూ ప్రత్యక్ష పర్యవేక్షణలో అమలు జరిగిన అభివృద్ధి వ్యూహానికి గల పరిమితులు అనతికాలంలోనే వెల్లడయ్యాయి. రాజ్యాంగం అందరికీ అందించిన హక్కులు, అవకాశాలను ప్రజలు సంపూర్ణంగా అనుభవించే పరిస్థితి లేకపోయింది. ప్రజా సమీకరణే ప్రధాన వ్యూహంగా స్వాతంత్య్రోద్యమంలో పని చేసిన కాంగ్రెస్‌, అధికారానికి వచ్చిన తర్వాత హక్కుల సాధనకు ప్రజాసమీకరణకు బదులు అధికార యంత్రాంగంపై ఆధారపడే స్థితికి మారింది. దాంతో దానిపై భ్రమలు తొలగిపోడానికి ప్రజ లకు అట్టే కాలం పట్టలేదు. తొలి దశాబ్దంన్నర కాలంలో ప్రభుత్వం అమలు జరిగిన పలు విధానాలు, అభివృద్ధి వ్యూహాల పర్యవసానంగా పాలక సంకీర్ణంలోని వర్గ పొందికలో పెద్ద ఎత్తున మార్పులు వచ్చాయి.

నెహ్రూ రూపొందించినఅభివృద్ధి వ్యూహం ప్రధానంగా ప్రభుత్వ పెట్టుబడి, దాన్ని వినియో గించేందుకు తెరమీదకు వచ్చిన ప్రణాళిక వ్యవస్థలపై ఆధారపడి ఉంది. స్వాతంత్య్రా నంతరం తక్షణమే రూపొందించిన ఈ అభివృద్ధి నమూనాలో, అభివృద్ధి ఫలాల్లో అందరికీ భాగ స్వామ్యం ఉండాలన్న లక్ష్యం ఎంతో కొంత ఉండేది. తొలుత నెహ్రూ తన అభివృద్ధి నమూనా చుట్టూ కాంగ్రెస్‌లోని భిన్న వర్గాలను సమీకరించ గలిగారు. ఈ అభివృద్ధి వ్యూహం మేరకు వేగ వంతమైన పారిశ్రామిక విధానానికి సమాంత రంగా గ్రామీణ ప్రాంతంలో వ్యవసాయ సంస్కరణలూ అమలు జరగాల్సి ఉంది. కానీ రాష్ట్ర ప్రభుత్వాల్లో నిర్ణయాత్మక పాత్ర పోషించిన ధనిక రైతాంగం, దానికి నాయకత్వం వహిస్తున్న రాష్ట్ర స్థాయి కాంగ్రెస్‌ నేతృత్వం ఈ వ్యవసాయ సంస్కరణలకు మోకాలడ్డింది. దాంతో 60 దశకం తర్వాత దేశవ్యాప్తంగా వ్యవసాయ సంస్కరణలకూ, దానికి పర్యాయపదంగా నిలిచిన భూసంస్కరణల చట్టాలకూ కాంగ్రెస్‌ నాయకత్వం తూట్లు పొడిచింది. ఈ సమయం లోనే నెహ్రూ అస్తమించారు. కాంగ్రెస్‌ నాయ కత్వం క్రమంగా తిరోగామి వాదుల చేతుల్లోకి మారింది. దాంతో పాటే అప్పటి వరకూ అమల్లో ఉన్న కేంద్ర రాష్ట్ర సంబంధాల్లోనూ, కాంగ్రెస్‌లోనే జాతీయ నాయకత్వం, రాష్ట్ర నాయకత్వం మధ్య ఉండే సంబంధాల్లోనూ సమతౌల్యత దెబ్బతిన్నది. నెహ్రూ హయాంలో ప్రధాన దృష్టి జాతీయ రాజకీయాలపై ఉండటంతో రాష్ట్ర స్థాయి నాయకత్వానికి రాష్ట్ర స్థాయి అవసరాల నేపథ్యంలో రాజకీయ విధి విధానాలు రూపొందించటంలో అవసరమై నంత స్వేఛ్చ, స్వతంత్రత ఉండేవి. నెహ్రూ తర్వాత పార్టీ పగ్గాలు, ప్రభుత్వ పగ్గాలు చేపట్టిన ఇందిరా గాంధీ హయాంలో ఈ స్వేచ్చ కరువైంది. జాతీయ స్థాయిలోనూ, రాష్ట్ర స్థాయి లోనూ కాంగ్రెస్‌ నాయకత్వం అస్థిత్వాన్ని కోల్పోయి ఇందిరా గాంధీ భజన బృందంగా మారింది. జాతీయ రాజకీయాల్లో విధాన పరమైన చర్చల స్థానంలో వ్యక్తి కేంద్రంగా చర్చలు మొదలయ్యాయి. కాంగ్రెస్‌లో అంతర్గత సుస్థిరతే దేశానికి సుస్థిరత అన్న నినాదం ముందు కొచ్చింది. ఈ మార్పు ఒక్క పార్టీ నిర్మాణానికే పరిమితం కాలేదు. దేశం అనుసరించాల్సిన ఆర్థికాభివృద్ధి విధానం పెద్దఎత్తున ఒడిదుడు కులకు లోనైంది. అధికారంపై పట్టు కాపాడు కునేందుకు సామాజిక న్యాయం ప్రాతిపదికన అప్పటి వరకూ అనుసరిస్తూ వచ్చిన విధానాల స్థానంలో ఎకామడేటివ్‌ విధానాలు తెరమీదకు వచ్చాయి. పారిశ్రామికాభివృద్ధిలో రెండో పంచవర్ష ప్రణాళిక చూపించిన మార్గంనుండి ప్రభుత్వం వైదొలగింది. వ్యవసాయ సంస్కర ణల్లో భూసంస్కరణలకు పెద్ద పీట వేయటం ద్వారా గ్రామీణ నిరుద్యోగం, ద్రవ్యోల్బణం తగ్గించటం, పారిశ్రామికాభివృద్ధికి అవసరమైన రిజర్వు వనరులు సృష్టించటానికి బదులు సాంకేతిక పరిజ్ఞానం వినియోగం ద్వారా వ్యవసాయ ' ఉత్పాదకత' పెంచటం ప్రభుత్వ లక్ష్యంగా మారింది. సమగ్రాభివృధ్ధి లక్ష్యంగా కాక నిర్దిష్ట ఓటుబ్యాంకులను సంఘటితం చేసుకోవటం ఆర్థిక విధానాల లక్ష్యంగా మారింది. ఈ ఓటుబ్యాంకు ఆధారంగా అధికా రానికి వచ్చిన కాంగ్రెస్‌ ఇందిరాగాంధీ నేతృ త్వంలో ప్రజాస్వామ్యం ఖూనీకి పాల్పడింది. ఈ పరిస్థితుల్లో రాజ్యాంగం కనీస హామీ ఇచ్చిన ప్రజాస్వామ్యభారతాన్ని పరిరక్షించుకునేందుకు ప్రత్యామ్నాయ రాజకీయ ఉద్యమం అవసర మైంది.

స్వాతంత్య్రానంతరం

బెంగాల్‌ రాజకీయ చిత్రం

దేశవ్యాప్తంగా వ్యవసాయ రంగంలో వచ్చిన మార్పుల లాగానే బెంగాల్‌లో కూడా వ్యవసాయరంగంలో వర్గాల ఏర్పాటు, సంఘ టితం కావటం భూసంస్కరణలతో పూర్తి అయ్యి ంది. మిగిలిన రాష్ట్రాల మాదిరిగా ఆధిపత్య కులం గానీ, ఆధిపత్య కులాల చేతుల్లో భూ కేంద్రీకరణ గానీ బెంగాల్‌లో లేవు. దాంతో రాష్ట్ర వ్యాప్తంగా వైవిధ్యభరితమైన భూ సంబం ధాలు, వర్గ సంకీర్ణాలు తెరమీదకు వచ్చాయి. ఆధిపత్య కులం కేంద్రంగా సామాజిక సమీకర ణాలు లేకపోవటంతో రాజకీయ పార్టీలు వర్గం ప్రాతిపదికన ప్రజలను సమీకరించటానికి మార్గం సుగమమం అయ్యింది. స్వాతంత్య్రపోరాట కాలంలో కూడా విప్లవ భావాలకు బలమైన పునాదులు కలిగిన బెంగాల్‌ స్వాతంత్య్రా నంత రం ఆ ప్రత్యేకతను నిలుపుకొంది. బలమైన వామపక్ష ఉద్యమానికి కేంద్రంగా మారింది. స్వాతంత్య్రానంతరం దేశ విభజన నేపథ్యంలో రాష్ట్రాభివృద్ధికి అవసరమైన మౌలిక వనరులు, విశాలమైన భూభాగం నాటి తూర్పు పాకిస్తాన్‌ వశం కావటం, దేశ విభజన నేపథ్యంలో బెంగాల్‌కు నిర్వాసితుల ముప్పు ఎదురవటానికి కారణం కాంగ్రెస్‌ అనుసరించిన విధానాలే అన్న అభిప్రాయంతో బెంగాల్‌లోని విద్యాధికులు కాంగ్రెస్‌కు దూరమయ్యారు. జమీందారీ రద్దు వంటి చర్యలతో రైతాంగం లబ్ది పొందినా పైన పేర్కొన్న చారిత్రక కారణాల వల్ల బెంగాల్‌లో కాంగ్రెస్‌ పార్టీ వేళ్లూనుకునేందుకు పరిమిత అవకాశాలే వచ్చాయి. మిగిలిన రాష్ట్రాల్లో లాగా స్వాతంత్య్రానికి ముందు బెంగాల్‌లో కాంగ్రెస్‌ పార్టీ ఏ స్థాయిలోనూ ప్రభుత్వంలో చలామణి కాలేదు. ఇన్ని పరిమితులు ఉన్నప్పటికీ స్వాతం త్య్రానంతరం తొలి దశాబ్దంన్నర కాలంలో దేశ వ్యాప్తంగా ఉన్న సానుకూల పవనాల నేపథ్యం లో బెంగాల్‌లో సైతం కాంగ్రెస్‌ పార్టీ అధికా రానికి రాగలిగింది.

1960ల నాటి నుండీ రాష్ట్రంలో కాంగ్రెస్‌ పతనం ప్రారంభమైంది. ఇందిరా గాంధీ నేతృత్వంలో ఈ పతనం సంపూర్ణమైంది. అధికారాన్నీ, పార్టీపై పెత్తనాన్నీ కాపాడు కోవటానికి ఇందిరా గాంధీ ప్రజాస్వామిక పద్ధతులను గాక నిరంకుశ, ప్రజాస్వామ్య విరుద్ధ పద్ధతులు అవలంబించటంతో అప్పుడే ఆవిర్భ విస్తున్న మేధావి వర్గం కాంగ్రెస్‌కు దూరమైంది. నిర్మాణ పరంగా చూసుకుంటే బిసి రారు, అతుల్యఘోష్‌ వంటి వారు బెంగాల్‌ పిసిసికి నాయకత్వం వహించినపుడు వారి స్వతంత్ర పని విధానానికి నెహ్రూ ఇచ్చినంత అవకాశం ఇందిరా గాంధీ ఇవ్వలేదు. దానికి తోడు బలమైన స్థానిక నాయకత్వానికి వ్యతిరేకంగా మరో గ్రూపును తయారు చేయటం, దాన్ని ప్రోత్సహించటం ద్వారా రాష్ట్ర స్థాయిలో కాంగ్రెస్‌ నాయకత్వం ముఠాకుమ్ములాటల్లో మునిగి తేలేలా చేయటం, అదను చూసుకుని నమ్మిన బంట్లను పార్టీ అధ్యక్షులు చేయటం అన్న ఇందిరా గాంధీ విధానం రాష్ట్ర కాంగ్రెస్‌లో మరింత కుమ్ములాటలకు దారి తీసింది. వెరసి రాష్ట్ర స్థాయిలో కాంగ్రెస్‌ వైఫల్యంతో 1967 నాటికి రాజకీయ శూన్యం ఏర్పడింది. జాతీయ కమ్యూనిస్టు ఉద్యమంలో వచ్చిన చీలికతో అప్పుడే తెరమీదకు వచ్చిన భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు) పూర్తిస్థాయిలో ఈ శూన్యాన్ని పూరించేందుకు సిద్ధమయ్యే పరిస్థితి లేకపో యింది. రాష్ట్ర రాజకీయ రంగంలో సిపిఐ(ఎం) తిరుగులేని శక్తిగా అవతరించటానికి, కాంగ్రెస్‌ వైఫల్యంతో ఏర్పడిన శూన్యాన్ని పూరించి రాజకీయ అస్థిరత స్థానంలో సుస్థిరత సాధించ టానికి రాష్ట్రానికి దాదాపు దశాబ్దకాలంపైగా సమయం పట్టింది. ఈ దశాబ్దకాలంలో జాతీయ స్థాయిలో కాంగ్రెస్‌ ప్రజాదరణ కోల్పోవటం, కాంగ్రెస్‌లో చీలికలు రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేశాయి.

దశాబ్దకాలపు అస్థిరత

1960 దశకం నాటికి కాంగ్రెస్‌ దేశవ్యా ప్తంగా ప్రతికూల పవనాలు ఎదుర్కోవాల్సి వచ్చింది. నెహ్రూ ప్రారంభించిన అభివృద్ధి విధానాల నుండి వైదొలగటం, ఆర్థిక సంక్షోభం, ఆహార సంక్షోభం, కాంగ్రెస్‌ సంస్థాగత కారణాలు, చైనా-భారత్‌ యుద్ధం ఈ ప్రతికూల పవనాల వేగాన్ని పెంచాయి. వివిధ రాష్ట్రాల్లో ప్రజలు ప్రత్యామ్నాయ రాజకీయ శక్తుల వైపు నడవటం ప్రారంభమైంది. తమిళనాడులో డిఎంకె, కేరళలో సిపిఐ(ఎం) ఈ దిశగా దేశానికి దారి చూపాయి. పశ్చిమబెంగాల్‌లో కాంగ్రెస్‌ పతనం మిగిలిన చోట్ల కంటే మరింత వేగంగా జరిగింది. బెంగాల్‌ కాంగ్రెస్‌లో తొలితరం నేతలు అంతరించిన తర్వాత వారి స్థానాన్ని పూరించే స్థాయికి ఏ నేతా ఎదగలేదు. బిసి రారు, అతుల్య ఘోష్‌ వంటి నేతలు పార్టీకి రాష్ట్ర వ్యాప్తి యంత్రాంగాన్ని రూపొందించటంలో కీలక పాత్ర పోషించారు. 1962లో బిసి రారు మరణం తర్వాత బెంగాల్‌ కాంగ్రెస్‌లో ముఠా కుమ్ములాటలు పెచ్చరిల్లాయి. జాతీయ స్థాయిలో 1967లో కాంగ్రెస్‌ ఓటమి చవిచూస్తే బెంగాల్‌ లో అంతకు ఐదేళ్ల పూర్వమే కాంగ్రెస్‌ చీలిపోయి బలహీనపడింది. ఓటమి పాలయ్యింది. తద్వా రా రాజకీయ అస్థిరతకు లోనైంది బెంగాల్‌.

1968-1971 మధ్య కాలంలో రాష్ట్రంలో ఏర్పడిన రెండు సంకీర్ణ ప్రభుత్వాలూ ప్రధానంగా వర్గ సంకీర్ణాలు. ఒకవైపున బూర్జువా, భూస్వామ్య వర్గానికి ప్రాతినిధ్యం వహించే పార్టీలూ మరోవైపున ఈ శక్తులను వ్యతిరేకించే వామపక్ష పార్టీలు సంకీర్ణ ప్రభుత్వంలో కీలక భాగస్వాములు కావటంతో వాటి మధ్య సమన్వ యం కొరవడటం, వర్గ సామరస్యం లోపించటం సహజమైంది. అయితే ఈ సమన్వయ లోపానికి వర్గ దృక్ఫధంతో కూడిన విధానాలు అనుసరిం చాలని వామపక్షాలు నిర్ణయించటం కారణం. ఈ విధానాలతో వామపక్షాలు ప్రజలకు మరింత దగ్గరయ్యాయి. 71 ఎన్నికలకు ముందు వామపక్షాలు మూడింట ఒకవంతు ఓట్లు సాధిం చేవని పైన చెప్పుకొన్నాము. అప్పట్లో వామ పక్షాల ప్రజాకర్షణ శక్తికి ఏర్పడ్డ పరిమితులను ఈ రెండు సంకీర్ణ ప్రభుత్వ ప్రయోగాల ద్వారా వదిలించుకో గలిగాయి. రాష్ట్రంలో వర్గ సమీక రణాలు మారి, శ్రమజీవులందరూ ఒక పక్షం గానూ, దోపిడీ దారులందరూ మరో పక్షంగానూ చీలిపోయిన వాతావరణం నెలకొంది. సంకీర్ణం లోని భాగస్వాములు తమ బలాన్ని పెంచుకు నేందుకు ఒకరిని మించి ఒకరు ఎత్తులు వేసుకు న్నారు. ప్రజా ప్రయోజనం, శ్రామికవర్గ ప్రయో జనం, ప్రజాస్వామిక విలువల పరిరక్షణ, రాజ్యాంగం హామీ ఇచ్చిన కనీసహక్కులు ప్రజ లకు అందుబాటులోకి తేవటమే లక్ష్యంగా ఎంచుకున్న భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు) అందుకనుగుణంగా ప్రజాసమీకరణ, తద్వారా వర్గ శక్తుల పొందికలో మార్పు సాధనే లక్ష్యంగా ఈ కాలంలో పోరాటాలు చేేసింది. ఈ కాలంలో జరిగిన పారిశ్రామిక ఆందోళనల్లోనే జ్యోతిబసు లయన్‌ ఆఫ్‌ ది సమ్మర్‌ (మండువేస విలో గర్జించే సింహంగా) పేరుపొందాడు. ఎక్కడ ఏ చిన్న సమస్య తలెత్తినా పార్టీ అక్కడ ప్రత్యక్షమయ్యే స్థితికి పార్టీ సభ్యులు, శ్రేయోభి లాషుల పునాది విస్తరించింది. ఈ కాలంలోనే సిపిఐ(ఎం) భారతదేశంలో విప్లవానికి కార్మిక, కర్షక మైత్రి పునాది అన్న పార్టీ కార్యక్రమ సారాంశాన్ని ఆచరణలో పెట్టింది.

ఈ పరిస్థితుల్లో రాష్ట్రంలో బలమైన శక్తిగా ఉన్న సిపిఐ(ఎం) ప్రధాన ప్రతిపక్షంగా ఎది గింది. ప్రజలముందు రాజకీయ ఆర్థిక ప్రత్యా మ్యాయాన్ని ఉంచింది. 77కు ముందు జరిగిన అన్ని ఎన్నికల్లోనూ వామపక్ష పార్టీలు మూడింట ఒకవంతు ఓట్లు సంపాదించుకుని కీలకమైన శక్తిగా ఉన్నాయి. ప్రజాందోళనల ద్వారా వామ పక్షాలు, ప్రత్యేకించి సిపిఐ(ఎం) ప్రజలకు మరింత దగ్గరైంది. ఈ కాలంలో రాష్ట్రంలో అస్థిరతతో పాటు అణచివేత కూడా కాంగ్రెస్‌ చేతిలో కీలక సాధనంగా మారింది. స్వేఛ్చా పిపాసులైన బెంగాల్‌ ప్రజలు ఈ అణచివేతను తీవ్రంగా వ్యతిరేకించారు. తొలిసారి రాష్ట్రంలో 1967లో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడింది. ఈ సంకీర్ణ ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు) వివిధ వర్గాల ప్రజలకు చేరువయ్యేందుకు వీలుగా హౌం శాఖతో పాటు వ్యవసాయ శాఖ, కార్మికశాఖ వంటి మంత్రిత్వ శాఖలు చేపట్టింది. ఈ కాలంలోనే రాష్ట్ర ప్రభుత్వం తొలిసారి శాంతి భద్రతల సమస్యను రెండు రకాలుగా విభజి చింది. ఒకటి వర్గపోరాటాలు, రెండోది వ్యక్తిగత విషయాలు, చట్టాల ఉల్లంఘన, దోపిడీలు, అరాచకత్వానికి సంబంధించిన శాంతిభద్రతల సమస్య. జ్యోతిబసు నేతృత్వంలోని హౌంశాఖ శాంతిభద్రతల సమస్యలపై తీవ్రంగా స్పందిం చేది. కాని వర్గపోరాటాల విషయంలో జోక్యం చేక్యానికి పరిమితులు విధించింది. తద్వారా రాజ్యాంగ యంత్రం వర్గ పోరాటాల విషయంలో తాటస్థ్యం ప్రదర్శించేలా చేయగలిగింది సిపిఐ(ఎం) నేతృత్వంలోని ప్రజాతంత్ర ఉద్య మం. బహుశా ప్రపంచంలోనే ఇది వామపక్షా లకు కొత్త అనుభవం. జాతీయ స్థాయిలో రాజ్యాంగ యంత్రం వర్గ ఉద్యమాల పట్ల అణచివేత వైఖరి అనుసరిస్తూ ఉండగా ఒక నిర్దిష్ట ప్రాంతంలో మాత్రం రాజ్యాంగ యంత్రం వర్గ పోరాటాల పట్ల తటస్థ ధోరణి అనుసరించేలా చేయగలగటం ఆ ప్రాంత వామపక్ష ఉద్యమం సాధించిన ప్రత్యేక విజయంగా చెప్పుకోవాలి.

బెంగాల్‌లో వర్గ పోరాటాలను రాజ్యాంగ యంత్రం జోక్యం పరిధి నుండి మినహాయిం చంటం ద్వారా పాలనా వ్యవస్థలో ఏర్పడిన శూన్యాన్ని భర్తీ చేయటానికి ప్రజా ఉద్యమాలను సిపిఐ(ఎం) సాధనంగా మల్చుకొంది. ఈ విధమైన ఎత్తుగడ ప్రజలకు తక్షణ ప్రయోజ నాలూ, ఉద్యమానికి ఫలితాలూ చూపించటంతో మరింత మంది ప్రజానీకం ఉద్యమంలోకి ప్రవేశించేలా ప్రోత్సహిచింది. అదేసమయంలో ప్రజా ఉద్యమం స్థానికంగా పాలనా యంత్రాం గం పాత్ర కూడా పోషిస్తూ ముందుకు సాగింది. వర్ధమాన దేశంలో నిర్దిష్ట ప్రాంతంలో రాజ్యాంగ యంత్రాన్ని బలహీనం చేసి ప్రజా ఉద్యమం ఆ స్థానం ఆక్రమించుకోవటం అన్నది బెంగాల్‌ ప్రయోగంలోనే సాధ్యమైంది. దానికి ముందు తెలంగాణా సాయుధ పోరాట కాలంలో పరిమిత ప్రాంతంలో ఈ ప్రయోగాన్ని అమలు చేసింది కమ్యూనిస్టు పార్టీ.

ఈలోగా 1971లో పాకిస్తాన్‌తో జరిగిన యుద్ధం, బంగ్లాదేశ్‌ ఆవిర్భావంతో జాతీయస్థా యిలో వెల్లువెత్తిన ప్రజాదరణతో కాంగ్రెస్‌ ఇందిరా గాంధీ నేతృత్వంలో తిరిగి అధికారానికి వచ్చింది. బ్యాంకుల జాతీయీకరణ, రాజభర ణాల రద్దు వంటి చ్యలతో పాటు 71లో పాకిస్తాన్‌ తో జరిగిన యుద్ధం, దాని నేపథ్యం, సిద్ధించిన విజయం కూడా జాతీయ స్థాయిలో కాంగ్రెస్‌ పార్టీలో నెలకొన్న అస్థిరతను ఒక కొలిక్కి తెచ్చింది. ఇందిరా గాంధీ కాంగ్రెస్‌ పార్టీకి తిరుగులేని నేతగా మారారు. నెహ్రూ మరణం తర్వాత జాతీయ స్థాయిలో కాంగ్రెస్‌కు ఆ విధమైన ఆదరణ లభ్యం కావటం ఇదే మొదటి సారి కావటంతో ఇందిరా గాంధీ కోటరీకి కన్ను మిన్నూ గానని పరిస్థితి ఏర్పడింది. 71లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో ప్రత్యేకించి బెంగాల్‌లో ప్రజాస్వామిక విలువలకు పాతర వేశారు. చివరకు ఎన్నికల్లో పాలకపార్టీ అనుసరించిన అప్రజాస్వామిక చర్యలకు నిరసనగా జ్యోతిబసు సైతం ఎంఎల్యే పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. దీర్ఘకాలంగా బెంగాల్‌లో వామపక్షాల ఎదుగుదలను అడ్డుకో వాలని కాంగ్రెస్‌ చేసిన అన్ని ప్రయత్నాలు విఫలం కావటం, జాతీయ స్థాయిలో పెరిగిన ప్రజాదరణ దన్నుతో వచ్చిన అధికారాన్ని సక్రమంగా ప్రజోపయోగ చర్యలకు వినియో గించటానికి బదులు బంధుపీతికి, అధికార దుర్వినియోగానికి, రాజకీయ నిరంకుశత్వానికి, ప్రతిపక్షాల ఏరివేతకు కాంగ్రెస్‌ ఉపయోగించు కొంది. ఈ దుర్బుద్ధి మరింత విస్తరించి చివరకు దేశాన్ని అత్యవసర పరిస్థితి వైపు నెట్టింది. ఈ కాలంలో సుస్థిరమైన సంకీర్ణం ఏర్పడేందుకు అవకాశం లేకపోయింది. పాలనా యంత్రాంగం రాష్ట్రాభివృద్ధికి సంబంధించిన సామాజిక ఆర్థిక అంశాలపై దృష్టి కేంద్రీకరించే సామర్ధ్యాన్ని కోల్పోయింది.

వర్గపోరాటాలు

రాజకీయ అస్థిరతతో, పాలనా యంత్రాం గం వైఫల్యంతో కకావికలైన బెంగాల్‌లో వర్గపోరాటాలు పుంజుకున్నాయి. సంకీర్ణ ప్రభు త్వాల నేతృత్వంలో అమలు జరిగిన భూ సంస్కరణల ఫలాలు పరిరక్షించుకునే క్రమంలో రాష్ట్రంలో ప్రతి గ్రామం వర్గపోరాట వేదికగా మారింది. రాష్ట్రంలో సంకీర్ణ ప్రభుత్వాలను రద్దు చేసిన ప్రతిసారీ కేంద్రం రాష్ట్రపతి పాలన విధించింది. రాష్ట్ర పాలనా పగ్గాలు చేపట్టింది. రాష్ట్రంలో జరుగుతున్న పోరాటం అప్పటి వరకు సాధించిన విజయాలను సంఘటితంచేసుకోవ టానికే అన్న విషయాన్ని అర్థం చేసుకోలేని పార్టీలోని కొన్ని శక్తులు నక్సల్‌బరీ ప్రాంతంలో పార్టీని ధిక్కరించి సాయుధ చర్యలకు పాల్పడటం తో నక్సలైట్‌ ఉద్యమం ఆవిర్భవించింది. రాష్ట్రం లో అస్థిరతను మరింత పెంచి పోషించటంలో నక్సలైట్‌ ఉద్యమం తనవంతు పాత్ర పోషిం చింది. పైగా ఈ ఉద్యమం ప్రారంభం అయిన కొద్దికాలానికే సిపిఐ(ఎం)ను తన ప్రధాన శతృవుగా ఎంచుకొంది. నేడు ఒరిస్సా, బీహార్‌, జార్ఖండ్‌ సరిహద్దు ప్రాంతాన్ని కేంద్రంగా చేసుకుని మావోయిస్టులు బెంగాల్‌లో కార్యక్రమా లు నెరపినట్లే నాడు నక్సలైట్లు భౌగోళిక వెసులు బాటును ఆసరాగా తీసుకున్నారు. దేశవ్యాపి తంగా అత్యవసర పరిస్థితి కింద ప్రజల హక్కు లు నలిగిపోతుంటే నక్సలైట్లు బెంగాల్‌లో కాంగ్రెస్‌తో కలిసి వామపక్షాలు ప్రత్యేకించి సిపిఐ(ఎం) కార్యకర్తలను ఊచకోత కోయటం ప్రారంభించింది. ఈ పరిణామమే ఆధునిక బెంగాల్‌లో అర్థఫాసిస్టు పాలనగా రికార్డుల కక్కింది. ఈ కాలంలో కేంద్రంలోని కాంగ్రెస్‌ ప్రభుత్వం బెంగాల్‌ను దారిలోకి తెచ్చుకునేం దుకు అనేక చర్యలు చేపట్టింది. అందులో రెండు ముఖ్యమైన పరిపాలనాపరమైన మార్పులు న్నాయి. ఒకటి ప్రభుత్వం అనుసరించే అణచి వేత విధానం రాజ్యాంగపరిమితులకు బయట ఉంటుందని ప్రకటించటం. ఇందులో భాగంగా పోలీసులు ఏ పరిస్థితుల్లో కాల్పులకు పాల్పడినా దానిపై న్యాయవిచారణ ఉండదని ప్రకటించ టంతో ఉద్యమాలపై పోలీసులు విరుచుకుపడ టానికి తెర తీసినట్లైంది. రెండోంది గూఢచారి విభాగానికి నక్సలైట్‌ సమస్య పరిష్కార బాధ్యతలు అప్పగించటం. కేంద్రం నక్సలైట్‌ అన్న పదానికి ఇచ్చిన నిర్వచనం చాలా విస్తృత మైనది. రాష్ట్రంలో ప్రధాన రాజకీయ స్రవంతిలో పని చేస్తున్న వామపక్షాలు, సిపిఎం కార్యకర్తలకు కూడా వర్తించే విధంగా మార్చి వీరందరినీ ఏరివేసే బాధ్యత గూఢచర్య విభాగానికి అప్ప గించారు. ఈ విధంగా పోలీసులకు అదుపు లేని అణచివేత అధికారాలు ఇవ్వటం, నేరస్తులు, రాజకీయ నేరస్తుల మధ్య గీతను చెరిపేయటం ద్వారా అర్థఫాసిస్టు పాలనకు తెరతీసింది ఇందిరా గాంధీ నేతృత్వంలోని కాంగ్రెస్‌ ప్రభు త్వం. ఈ కర్తవ్యాన్ని తన భుజస్కంధాలపై వేసు కున్న వ్యక్తి సిద్ధార్థ శంకర్‌ రే.

ఈ కాలంలో జరిగిన మారణహౌమం గురించి తెల్సుకునేందుకు మచ్చుకు రెండు ఉదాహరణలు ప్రస్తావించుకుంటే సరిపోతుంది. 1972లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పెద్దఎత్తున రిగ్గింగు, అక్రమాలకు పాల్పడి విజ యం సాధించిందని అప్పట్లో టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా కలకత్తా విలేకరిగా ఉన్న సజల్‌ బసు విపులంగా రాశారు. ఎన్నికలకు ముందు, తర్వాత కిరాయి గూండాలతో మారణహౌమం సృష్టించి ప్రతిపక్ష పార్టీలకు చెందిన కార్యకర్తలు, నాయకులను హతమార్చిన తీరునుకూడా టైమ్స్‌ఆఫ్‌ ఇండియా సవివరంగా చిత్రీకరిం చింది. సజల్‌ బసు మాటల్లో అరవయ్యో దశకం చివర్లో రాష్ట్రం చవిచూసిన హింస కంటే ఈ కాలంలో చవిచూసిన హింస మోతాదులోనూ, భీభత్సంలోనూ అధికంగా ఉందని అభిప్రాయ పడింది. శంకర్‌ ఘోష్‌ అనే రచయిత చేపట్టిన అధ్యయనంలో ఈ కాలంలో ఒక్క భీర్‌భూం జిల్లాలోనే కనీసం రోజుకు మూడునాలుగు రాజకీయ హత్యలుజరిగాయని నిర్ధారించారు. 1971 జూన్‌లో రాష్ట్రపతి పాలన విధించిన కొద్ది నెలల్లోనే కాశీపూర్‌-బారానగర్‌ ప్రాంతం లో నక్సలైట్లన్న నెపంతో 150మంది యువకులను పోలీసులు ఊచకోత కోశారు. ఘోష్‌ అప్పట్లో హిందూస్థాన్‌ స్టాండర్డ్‌ పత్రిక ప్రతినిధిగా ఈ విషయాన్ని వెలుగులోకి తెచ్చారు. పట్టపగలే ఈ ప్రాంతంలో శవాలు, చేతులు, కాళ్లు తెగిన మొండాలు చెల్లా చెదరుగా పడి ఉన్నాయని రాశారు. ఈ శవాలను, మొండేలను పోగుచేసి పట్టపగలే అందరూ చూస్తుండగా రిక్షాల్లో తీసుకెళ్లి హుగ్లీ నదిలో విసిరేశారని తెలిపాడు. ఘోష్‌ మాటల్లోనే, ''ఈ కాలంలో రాష్ట్రంలో భయో త్పాతం తారాస్థాయికి చేరింది. రాత్రుళ్లు యువకులైన వారెవ్వరూ ఇళ్లల్లో ఉండే పరిస్థితి లేకపోయింది. పోలీసు లాకప్‌కు వెళ్లని నడివయస్కులు లేరంటే ఆశ్చర్యం లేదు.'' ఇదీ, ఇందిరాగాంధీ కనుసన్నల్లో బెంగాల్‌లో ప్రజాస్వా మ్యాన్ని ఖూనీ చేసిన తీరు. ఈ రకమైన హత్యా కాండతో పాటు 60 దశకం చివర్లో సిపిఐ (ఎం) ఆధర్యంలో జరిగిన భూసంస్కరణలను కాంగ్రెస్‌ నేతృత్వంలోని రాష్ట్రపతిపాలన తిరగ దోడటం ప్రారంభించింది. దాంతో పాటు బెంగాల్‌లో నెలకొన్న రాజకీయ అస్థిరత నేప థ్యంలో పెద్దఎత్తున పెట్టుబడులు వలస పోయా యి. పారిశ్రామిక రంగం కుదేలైంది. ఈ కాలంలో మొత్తంగా ప్రభుత్వ పరిపాలనా యంత్రాంగమే పక్షవాతం సోకిన మాదిరిగా మారిపోయింది.

బెంగాల్‌లో సుస్థిరత సాధించిన వామపక్ష ప్రభుత్వం

ఈ నిర్భంధాన్ని వ్యతిరేకించి ప్రజాతంత్ర ఉద్యమానికి ఊపిరిలూదింది సిపిఐ(ఎం). కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో జరుగుతున్న ప్రజాస్వామిక వ్యవస్థ ఖూనీకి వ్యతిరేకంగా రాష్ట్రంలోనే కాక దేశవ్యాప్తంగా ప్రజాతంత్ర శక్తులను సమీకరించి ప్రజాస్వామ్య పరిరక్షణా ఉద్యమాన్ని నిర్మించింది భారత కమ్యూనిస్టుపార్టీ మార్క్సిస్టు. ఈ ఉద్యమాన్ని బెంగాల్‌ ప్రజలు ఆదరించారు. సమర్థించారు. మద్దతిచ్చారు. ఉద్యమంలో ప్రత్యక్ష భాగస్వాములయ్యారు. ప్రత్యేకించి 1971-77 మధ్యకాలంలో భూమిహక్కు కోల్పోయిన పేద, మధ్యతరగతి రైతులందరూ ప్రజాస్వామిక పరిరక్షణపోరాటానికి బాసటగా నిలిచారు. దీనికి తోడు 1971 పూర్వం ఐక్య సంఘటన ప్రభుత్వాల్లో వచ్చిన అనుభవాల ఆధారంగా సిపిఎం తన నిర్మాణాన్ని పటిష్టం చేసుకొంది. ఏ వర్గాల్లో పార్టీ విస్తరణ బల హీనంగా ఉందో ఆయా వర్గాలను పార్టీ పరిధి లోకి తెచ్చుకోవటానికి ప్రత్యేక కృషి జరి గింది. ఈ కాలంలో ప్రత్యేకించి గ్రామీణ ప్రాంతాల్లో పార్టీ నిర్మాణాన్ని పటిష్టపర్చు కునేందుకు పెద్దఎత్తున ప్రయత్నాలు జరిగాయి. తద్వారా యునైటెడ్‌ ఫ్రంట్‌ ప్రభుత్వంలో పాల్గొనటం ద్వారా తాను చేపట్టిన ప్రజానుకూల విధానాల ద్వారా ప్రభావితులైన వర్గాలను నిర్మాణంలో సంఘటితం చేసుకోవటానికి పార్టీ ప్రాధాన్యత ఇచ్చింది. దీంతో పాటు దేశ వ్యాప్తంగా కాంగ్రెస్‌ అప్రదిష్ట పాలుగావటం, దేశవ్యాప్తంగా జరిగిన ప్రజాస్వామ్య పరిరక్షణ ఉద్యమంలో సిపిఐ(ఎం) నిర్వహించిన పాత్ర పార్టీ విశిష్టత పెరగటానికి దోహదం చేసింది. వెరసి 1977 ఎన్నికల్లో 35.8 శాతం ఓట్లతో సిపిఐ(ఎం) రాష్ట్ర రాజకీ యాల్లో ఏకైక బలమైన శక్తిగా అవతరించింది. మిగిలిన వామపక్షా లకువచ్చిన ఓట్లు శాతాన్ని పరిగణనలోకి తీసుకొంటే పోలైన ఓట్లలో 50 శాతం పైగా ఓట్లు సాధించేశక్తి సంపాదించింది వామపక్ష సంఘటన. స్వతంత్ర భారతదేశంలో మెజారిటీ ఓట్లతో ప్రభుత్వం ఏర్పడటం ఇదే ప్రథమం. నెహ్రూ నేతృత్వంలో ఏర్పడిన ప్రభు త్వాలకు కూడా సీట్లు ఎక్కువ వస్తేవచ్చాయి గానీ ఓట్లు 40 శాతానికి మించి దక్కలేదు. ఈ రకంగా బెంగాల్‌ వామపక్ష సంఘటన ప్రభు త్వం పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో విలక్షణ మైన రికార్డు సృష్టించింది. తద్వారా రాష్ట్రంలో మూడు దశాబ్దాల పాటు కనిపించని రాజకీయ సుస్థి రతకు వామపక్ష సంఘటన పాలన తెరతీ సింది. ప్రజాస్వామిక రాజ్యాంగం పరిధిలో ప్రత్యా మ్నాయ ప్రభుత్వాలు మనుడగ సాగించ వచ్చని ఈ ప్రయోగం రుజువు చేసింది.

77 ఎన్నికల తర్వాత పరిపాలనా వ్యవస్థ ను పట్టాల మీదకు తేవటం, రాజకీయహింసను కట్టడి చేయటం వామపక్ష ప్రభుత్వ తక్షణ ప్రాధా న్య తలుగా మారాయి. రాజకీయ సుస్థిరత, బూర్జువా ఆర్థిక వ్యవస్థ పరిధిలో ఆర్థికాభివృద్ధి, భూసంస్క రణల అమలు వామపక్ష సంఘటన ప్రభుత్వ పాలనా కర్తవ్యాలుగా మారాయి. మిగిలిన రాష్ట్రాల్లో ప్రభుత్వాలు చేసే వాగ్దానాల అమలు స్థాయి కంటే బెంగాల్‌లో వామపక్ష సంఘటన ప్రభుత్వం చేసిన వాగ్దానాల అమలు స్థాయి ఎక్కువగా ఉండటాన్ని అప్పట్లో రాజకీయ పరిశీలకులందరూ గుర్తించారు. శక్తివంతమైన పార్టీ యంత్రాంగం ఉండటంతో ప్రభుత్వ విధా నాల ఫలాల విషయంలో న్యాయబద్ధమైన లబ్ది దారుల ఎంపిక సాధ్యం అయ్యింది.

దీర్ఘకాలం అధికారంలో ఉండటంతో ఆర్థికంగా వెనకబడిన వర్గాల్లో ప్రభుత్వం పట్ల, పార్టీ పట్ల ఆశాభావం సహజంగానే ఎక్కువగా ఉంది. వీరి ఆకాంక్షలను చేరుకునేలా వ్యవహ రించే బాధ్యత ప్రభుత్వంపైనా, పార్టీపైనా పడింది. ఆర్థిక సంస్కరణల నేపథ్యంలో రాష్ట్రాల ఆర్థిక వనరులు బలహీనపడటంతో రాష్ట్ర ప్రభుత్వాలు గతంలో వలె అత్యధిక ప్రజల ఆకాంక్షలు నెరవేర్చే శక్తి సామర్ధ్యాలు బలహీన పడ్డాయి. ప్రత్యేకించి దీర్ఘకాలంగా పెట్టుబడుల వలసను చవిచూసిన బెంగాల్‌లో ఈ సమస్య మరింత పెద్దదిగా కనిపించటం సహజం. ఉన్న పరిమితుల్లోనే వామపక్ష సంఘటన సాధిం చిన విజయాలు, అందిచిన సేవలను ప్రజలు విశ్వసించారు. ఆహ్వానించారు. ప్రముఖ రాజకీయశాస్త్ర నిపుణుడు అతుల్‌ కోహ్లి మాటల్లో ''మిగిలిన రాష్ట్రాల్లో పార్టీలు, ప్రభుత్వాలతో పోల్చి చూసినపుడు బెంగాల్‌లో సిపిఎం పార్టీ ప్రభుత్వం చేసే వాగ్దానాలు చిన్నవైనా సాధించిన విజయాలు పెద్దవి. ప్రత్యేకించి సామాజికంగా బలహీనవర్గాలకు వామపక్ష సంఘటన ప్రభుత్వం అందిచిన సేవలు ఏరాష్ట్రంలో ఏ ప్రభుత్వమూ అందించలేదు. అందులో ముఖ్యమైనది భూమి పై హక్కు కల్పించటం. ఇది గ్రామీణ ప్రజల ఆదాయవనరులు పెంచింది. తద్వారా పార్టీ, ప్రభుత్వం, ప్రజల మధ్య విడదీయరాని సాన్ని హిత్యం ఏర్పడింది.'' అని వ్యాఖ్యానించటం గమనించాల్సిన విషయం.

ప్రజాతంత్ర వ్యవస్థలను మరింత వేళ్లూను కునేలా చేయటంలో బెంగాల్‌ దేశానికే ఆదర్శం గా నిలిచింది. మొదటిసారిగా మూడంచెల పంచాయితీరాజ్‌ వ్యవస్థను అమలు చేయటంతో పాటు పంచాయితీలకు అధికారాలు, ఆర్థిక వనరులు కూడా బదలాయించి ప్రజాతంత్ర ప్రజాస్వామిక వ్యవస్థను ఉనికిలోకి తెచ్చింది. ప్రభుత్వ ఫలాలు నేరుగా ప్రజలకు చేరేలా చేయటంలో సశక్తులైన ఈ పంచాయితీరాజ్‌ వ్యవస్థలు ముఖ్యమైన సాధనంగా పని చేశాయి. అదేసమయంలో గ్రామీణ ప్రాంతాల్లో సైతం రాజకీయ చైతన్యాన్ని, హక్కుల గురించి ప్రశ్నించ గలిగే ప్రజాతంత్ర చైతన్యాన్ని అందిచటంలో వామపక్ష సంఘటన అమలు జరిపిన పంచా యితీరాజ్‌ సంస్కరణలు కీలక పాత్ర పోషించా యి. అతుల్‌కోహ్లి మాటల్లోనే '' ఈ రకమైన పంచాయితీరాజ్‌ సంస్కరణల వల్ల కేంద్ర ప్రభు త్వం అమలు జరుపుతున్న అనేక సంక్షేమ పథ కాలు - ఉదాహరణకు పనికి ఆహార పథకం వంటివి -మిగిలిన రాష్ట్రాల్లో కంటే బెంగాల్‌లోనే సమర్థవంతంగా అమలు జరిగింది.''

సుస్థిరతకు సవాళ్లు

ఈ పరిస్థితుల్లో దేశాన్ని ఉప్పెనలా చుట్టు ముట్టిన ఆర్థికసంస్కరణల భావజాలం ఇటువంటి ప్రత్యామ్నాయ అభివృద్ధి విధానాలను అవలం బించే ప్రభుత్వాలకు మరింత కష్టకాలం తెచ్చి పెట్టాయి. దశాబ్దంన్నర కాలంగా అమలు జరు పుతూ వచ్చిన సంపద పున:పంపిణీ విధానాలను కొనసాగించటం క్లిష్టంగా మారింది. సంస్కరణ లతో దేశవ్యాప్తంగా ప్రభుత్వయంత్రాంగానికి ఉన్న పరిమిత ప్రజాతంత్ర స్వభావాన్ని కోల్పో సాగింది.

దీనికి తోడు బెంగాల్‌ రాజకీయాల్లో లంపెన్‌ వర్గం క్రియాశీల పాత్ర పోషించటానికి మరో ముఖ్య కారణం ఉంది. అది కాంగ్రెస్‌ వైఫల్యం. ఒక రాజకీయ పార్టీగా కాంగ్రెస్‌ వైఫల్యం అత్యవసర పరిస్థితి కాలంలో ప్రారంభమై 90దశకం చివరి నాటికి తారాస్థాయికిచేరింది. తొలుత రాష్ట్రాల్లో ఈ వైఫల్యం వ్యక్తీకృతమైంది. క్రమంగా రాజీవ్‌ గాంధీ అనంతర కాలంలో ఈ వైఫల్యం అఖిల భారత స్థాయికి విస్తరిం చింది. ఈ స్థానాన్ని పూరించేందుకు వివిధ రాష్ట్రాల్లో వివిధ రకాల శక్తులు తలెత్తాయి. మహారాష్ట్రలో మతోన్మాద శివసేన రాజకీయ రంగంలో ప్రధాన శక్తిగా అవతరించగా దక్షిణా ది రాష్ట్రాల్లో ప్రాంతీయబూర్జువా వర్గాలకు ప్రాతినిధ్యం వహించేపార్టీలు బలం పుంజకు న్నాయి. ఉత్తరాది రాష్ట్రాల్లో అస్థిత్వరాజకీయాలు కాంగ్రెస్‌ వైఫల్యంతో ప్రేరణ పెచ్చరిల్లాయి. ఈ కోవకు చెందిందే బెంగాల్‌లో తృణమూల్‌ విజృంభణ. రాష్ట్రంలోని లంపెన్‌ వర్గానికి ఒక వేదిక కావల్సిన తరుణంలో తెరమీదకువచ్చింది తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీ. దీర్ఘకాలంగా నిద్రాణంగా ఉన్న విఛ్చిన్నకర శక్తులకు తృణమూల్‌ వేదికగా మారింది. దాంతో ఇప్పటి వరకూ బెంగాల్‌లో కనిపించని అస్థిత్వ వాదాలు, తిరోగమన వాదాలు నేడుమనకు కనిపిస్తున్నాయి. ఈశక్తులు బెంగాల్‌ గత మూడున్నర దశాబ్దా లుగా సాధించిన రాజకీయ సుస్థిరతను, ప్రజా తంత్ర చైతన్యాన్ని, ఆర్థిక ఫలాలను ధ్వంసం చేయబూనుకుంటున్నాయి. వీటికి జాతీయస్థాయి లోని ప్రగతినిరోధక శక్తులు చేదోడువాదోడుగా నిలుస్తున్నాయి. ప్రజాతంత్ర ప్రయోగానికి, ప్రజా స్వామ్య పటిష్టీకరణకు నిదర్శనంగా నిలిచిన బెంగాల్‌లోని వామపక్ష సంఘటన పాలన నేడు ఈ సవాళ్లను అధిగమించి తన మహాప్రస్థానాన్ని ముందుకు నడిపించటానికి దేశవ్యాప్తంగా ఉన్న ప్రజాతంత్ర శక్తులు తమవంతు మద్దతు అందిం చాల్సిన సమయం ఆసన్నమైంది.

No comments: