Tuesday, February 22, 2011

బడ్జెట్‌ దిశ ఎటు వైపు?

Business Watch, Prajasakti, February 21st 2011

యుపిఎ ప్రభుత్వం వరుసగా ఏడవ బడ్జెట్‌ను వచ్చే వారం పార్లమెంట్‌ ముందుంచబోతోంది. పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాల నేపథ్యంలో పలువురు విశ్లేషకులు ప్రభుత్వానికి దిశా నిర్దేశం చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఈ ప్రయత్నాల ముఖ్య సారాంశం ద్రవ్య నియంత్రణను మళ్లీ తెరమీదకు తేవటంగా కనిపిస్తోంది. ఈ ఏడు బడ్జెట్లలో మూడు బడ్జెట్‌లు పెట్టుబడిదారీ వ్యవస్థ సంక్షోభం నీడన రూపొందాయి. దాంతో ప్రభుత్వం పెద్దగా సంస్కరణల విషయంలో సాహసం చేయలేకపోయింది. దానికి తోడు కుదేలైన ఆర్థిక వ్యవస్థలో వృద్ధి రేటు కొనసాగించాలంటే ప్రభుత్వం పెద్దఎత్తున ఖర్చు పెట్టటం, ఖర్చు పెట్టగలిగిన స్తోమత ఉన్న వారికి రాయితీలు ఇవ్వటం వంటి చర్యలు అనివార్యంగా చేపట్టాల్సి వచ్చింది. గత మూడేళ్ల కాలంలో సంక్షోభం తీవ్రత వెనక పట్టుపట్టినా పూర్తిగా తొలగిపోయిందన్న దాఖలాలు కనిపించటం లేదు. ఈ పరిస్థితుల్లో గత మూడేళ్ల కాలంలో బడ్జెట్‌ లోటు పెరుగుతూ వచ్చింది. అదే సమయంలో ద్రవ్యోల్బణం, ప్రత్యేకించి ఆహారోత్పత్తుల ద్రవ్యోల్బణం అదుపు లేకుండా పెరుగుతోంది. ఈ పెరుగుదల ఆర్థిక వ్యవస్థను తీవ్రంగా ప్రభావితం చేస్తోంది. సాధారణ ప్రజల దైనందిన జీవితాన్ని మరింత దుర్భరం చేస్తోంది. దేశంలో కరెంట్‌ అక్కౌంట్‌ లోటు విపరీతంగా పెరుగుతోంది.ఈ లోటు స్థూలంగా బడ్జెట్‌ లోటును పెంచేస్తోంది. దీంతో సంస్కరణ వాదులు ఈ బడ్జెట్‌ లోటును నియంత్రించాలంటే మూడేళ్లుగా అమలు జరుగుతున్న ఉద్దీపన పథకాలను విరమించాలని, ప్రభుత్వ వ్యయంపై కోత విధించాలని ప్రతిపాదిస్తున్నారు. ఈ సందర్భంగా బడ్జెట్‌ సమావేశాల్లో ప్రభుత్వం ముందున్న కొన్ని ప్రాధాన్యతల గురించి పరిశీలిద్దాం.

ప్రభుత్వ ఆర్థిక వేత్తల అంచనా ప్రకారమే ఈ కాలంలో అంతర్జాతీయ వాణిజ్యం మందగించింది. అంతర్జాతీయవాణిజ్యంతో పాటే మన దేశం నుండి వెళ్లే ఎగుమతులు కూడా మందగించాయి. ప్రభుత్వం ప్రకటించిన రాయితీలు ఉపయోగించుకుని దేశంలోని గుత్తపెట్టుబడిదారులు, వివిధ తరగతులకు చెందిన పారిశ్రామిక వేత్తలు తమ ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంపొందించేందుకు అవసరమైన యంత్రసామాగ్రిని కొనుగోలు చేశారు. దాంతో ఎగుమతులు తగ్గినా, దిగుమతులు మాత్రం పెరిగాయి. రిజర్వు బ్యాంకు ఈ కాలంలో అనుసరించిన ద్రవ్య విధానం ఈ దిగుమతులకు అవసరమైన నిధుల లభ్యతను సులభతరం చేసింది. తక్కువ వడ్డీతో అందుబాటులో ఉన్న పెద్దమొత్తాలు వినియోగించుకుని పారిశ్రామిక సంస్థలు తమ భవిష్యత్తు విస్తరణకు అవసరమైన వస్తు సామాగ్రిని సమకూర్చుకున్నాయి. దీంతో కరెంట్‌ అక్కౌంట్‌ ఖాతా లోటు గణనీయంగా పెరిగింది. ఈ విషయాలు మరుగునపెట్టి ప్రభుత్వం అనుసరించే సంక్షేమ వ్యయం వల్లనే బడ్జెట్‌ లోటు 5 శాతానికి మించి పోతోందని, ద్రవ్యజవాబుదారీ,బడ్జెట్‌ నియంత్రణ చట్టాన్ని తు.చ.తప్పకుండా అమలు చేయటం ద్వారానే ద్రవ్య వ్యవస్థలో సమతౌల్యం కాపాడవచ్చన్న వాదన ముందుకొస్తోంది. ఇక్కడ ఒక వ్యత్యాసాన్ని గమనించాలి. సంపన్న వర్గాలకు ఇచ్చే రాయితీలు ద్రవ్య విధాన రూపంలో ఉన్నాయి. అంటే రిజర్వు బ్యాంకు వడ్డీ రేట్లు తగ్గించటం, మార్కెట్‌లో పుష్కలంగా నిధులు అందుబాటులోకి తేవటం వంటి రూపాల్లో ఈ రాయితీలను చూడవచ్చు. మరోవైపున ప్రభుత్వం నేరుగా సంపన్న వర్గాలకు ఇచ్చే రాయితీలు పన్ను రాయితీలు.విదేశీ మారకద్రవ్య నిల్వలు పెంచుకోవాలన్న మిషతో ఎగమతి సుంకాల రాయితీలు, దేశీయ ఉత్పత్తి సామర్థ్యం పెంచుకునే లక్ష్యం పేరుతో దిగుమతి సుంకాల రాయితీలతో పాటు వివిధ రకాల పన్ను రాయితీలు ఉద్దీపన పథకాల్లో అంతర్బాగÛంగా అమలు జరిగాయి. దీనికి భిన్నంగా పేదలకు ఇచ్చే రాయితీలు మాత్రం డబ్బుల మూట రూపంలో కనిపిస్తాయి. ప్రజా పంపిణీ వ్యవస్థ, ఎరువుల సబ్సిడీ, విద్యారంగంలో వ్యయం, మధ్యాహ్నభోజన పథకం, జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం వంటి రూపాల్లో ఈ వ్యయం కనిపిస్తోంది. ద్రవ్య జవాబుదారీ చట్టం రెండో తరహా వ్యయాన్ని మాత్రమే నియంత్రిస్తోంది తప్ప మొదటి తరహా వ్యయాన్ని కాదు. అంటే రానున్న బడ్జెట్‌లో ద్రవ్యనియంత్రణ చట్టం అమలు చేయటం అంటే పేదలకు ఇచ్చే రాయితీలపై వేటు వేసి ధనికులకు ఇచ్చే రాయితీలు కొనసాగించటం జరుగుతుంది.

బడ్జెట్‌ ముందున్న మరో ముఖ్యమైన కర్తవ్యం మౌలికసదుపాయాల రంగంలో వ్యయాన్ని పెంచటం. దీనికిగాను 11వ పంచవర్ష ప్రణాళికలో ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యం పద్ధతిని అధికారికంగా ఆమోదించారు. ఈ పథకం కింద అమలు జరిగే పనులకు కూడా ఉద్దీపన పథకం రాయితీలు వర్తిస్తున్నాయి. అయితే ఈ పథకం కేవలం జాతీయ ఆర్థిక వ్యవస్థకు కీలకమైన మౌలిక సదుపాయాలకు పరిమితం కాకుండా గ్రామీణాభివృద్ధి మొదలు, పర్యాటకరంగం అభివృద్ధి వరకూ అన్ని రంగాలకూ వరింపచేస్తున్నారు. ఈ విధమైన మూసపోత విధానం వల్ల కొన్ని ప్రాంతాలు, రాష్ట్రాలు మాత్రమే లబ్దిపొందుతున్నాయి. ఉదాహరణకు దేశంలో మిగిలిన రాష్ట్రాల్లో పనులు చేపట్టేందుకు చూపించే ఉత్సాహాన్ని ప్రైవేటు కంపెనీలు జమ్ము కాశ్మీర్‌ లేదా ఈశాన్యభారత రాష్ట్రాల్లో చేపట్టటానికి చూపించటం లేదు. దాంతో ఆయా రాష్ట్రాల్లో కీలకమైన అభివృద్ధి కార్యక్రమాలు వెనకపట్టు పడుతున్నాయి. ఉదాహరణకు మిజోరం, త్రిపుర,మేఘాలయ, అస్సాం వంటి రాష్ట్రాల్లో భౌగోళిక పరిమితుల కారణంగా ఇతర రాష్ట్రాల్లో వచ్చినంత లాభాలు ఈ రాష్ట్రాల్లో చేపేట్టే మౌలికసదుపాయాల నిర్మాణానికి రావు. ఇంకా విడమర్చి చెప్పాలంటే ఇతర రాష్ట్రాల్లో ఒక గ్యాస్‌ ఆధారిత విద్యుత్‌ ఉత్పత్తి కేంద్రం నెలకొల్పటానికి అవసరమైన సామాగ్రిని కేవలం నెలల వ్యవధిలో తరలించవచ్చు. కానీ త్రిపుర వంటి రాష్ట్రంలో ఈ ఉత్పత్తి సామాగ్రిని తరలించటానికి సంవత్సరాల తరబడి సమయం పడుతుంది. ఇంతకాలం కేవలం యంత్రసామాగ్రి తరలించటానికి వెచ్చిస్తే కాంట్రాక్టర్లకు వచ్చే లాభాలు తగ్గిపోతాయి. దాంతో ఎవ్వరూ ముందుకు రావటం లేదు.

అటువంటప్పుడు ఈ ప్రాంతాలు మొత్తంగా జాతీయ అభివృద్ధి స్రవంతి నుండి పూర్తిగా వెనకబడిపోతున్నాయి. ఇటువంటి కీలకమైన విధానం గురించి పునరాలోచించాల్సిన సమయం ఇది. మౌలికసదుపాయాల రంగంలో ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్య విధానాన్ని తొలిసారిగా అమలు జరిపిన బ్రిటన్‌ ప్రభుత్వమే ఈ విధానాల నుండి వెనక్కు మళ్లుతోంది. దేశంలో ప్రతిష్టాత్మకమైన ఢిల్లీ మెట్రో నిర్మాణంలో కన్నాట్‌ ప్లేస్‌ నుండి విమానాశ్రయం వరకూ ఉన్న రూటు నిర్మాణాన్ని ప్రైవేటు భాగస్వామికి అప్పగించారు. ఇప్పటి వరకూ ఈ నిర్మాణం పూర్తికాలేదు. హైదరాబాద్‌, బెంగుళూరు మెట్రోల నిర్మాణం కూడా ఇదే దారిలో నడుస్తున్నాయి. ఈ పరిస్తితుల్లో ప్రణాళిక సంఘం మద్దతుతో అమలు జరుగుతున్న ఈ విధానాన్ని సమీక్షించటానికి బడ్జెట్‌ వేదికగా మారితే ప్రయోజనకరంగా ఉంటుంది. ఇవి కాక ఉన్నత విద్యారంగం, సేవారంగం వంటి వాటిలో ప్రభుత్వరంగ వ్యయం పెంచాలన్న డిమాండ్‌ ఉండనే ఉంది. జాతీయ ఆర్థిక వ్యవస్థ పరిపుష్టం కావటానికి కేవలం భౌతికపరమైన మౌలికవసతులు కల్పిస్తే చాలదు. వాటిని వినియోగించుకోవటానికి అవసరమైన సామాజిక మౌలికసదుపాయాలు కల్పించాలి. అటువంటిది జరగాలంటే ఆర్థిక వ్యవస్థలో పెరుగుతున్న అసమానతలను అదుపుచేయాలి. ఈ దిశగా ప్రభుత్వం ఈ బడ్జెట్‌లో ఏ చర్యలుచేపట్టనున్నది వేచి చూడాలి.

No comments: