Tuesday, February 8, 2011

పశ్చిమాయాలో ప్రజాస్వామ్య కుసుమాలు


# సబ్‌ప్రైమ్‌ సంక్షోభంతో తలకిందులైన ఆర్థిక వ్యవస్థలు
కొత్త సంవత్సరం పశ్చిమాసియా దేశాల్లో ప్రజలకు కొత్త ఆశలు కలిగించింది. సంవత్సరారంభంతో మొదలైన ప్రజాస్వామిక ఉద్యమాలు నేడు దేశాధినేతల తలరాతలు మార్చే శక్తులుగా ఆవిర్భవించాయి. ప్రపంచీకరణ వ్యతిరేక ఉద్యమాలు ప్రపంచవ్యాప్తంగా ప్రజ్వరిల్లుతున్నా, పర్యావరణ పరిరక్షణోద్యమాలతో కొత్తగాలులు వీస్తున్నా, వివిధ దేశాల్లో రాజకీయ సామాజిక ఆర్థికసమస్యలపై ఉద్యమాలు ఉవ్వెత్తున ఎగసిపడుతున్నా పశ్చిమాసియా ప్రజానీకం మాత్రం నిస్తేజంగా చూస్తుండటం విస్మయపర్చే అంశమే. చమురు బావి నుండి చమురు ఉవ్వెత్తున ఉబికి వచ్చినట్లు పశ్చిమాసియా ప్రజానీకం అటువంటి నిస్తేజం నుండి, నిద్రాణావస్థ నుండి ఒక్కసారిగా మేల్కొంది. దాదాపు నాలుగు దశాబ్దాల పాటు ఆధునిక రాచరికం తరహా పాలనలో మగ్గిన ప్రజలు నేడు జూలు విదుల్చుతున్నారు. తమకు ప్రజాస్వామ్యం కావాలని నినదిస్తున్నారు. రాజకీయాల్లో వారం రోజుల వ్యవధి చాలా ఎక్కువ అన్న నానుడి ఉంది. ఈ నానుడిని నిజం చేస్తున్నాయి పశ్చిమాసియా దేశాల పరిణామాలు.

పశ్చిమాసియా దేశాల్లో తొత్తు ప్రభుత్వాలను గద్దె నెక్కించి వాటిని కాపాడటానికి అవసరమైన వ్యవస్థలు, సంస్థలను ఏర్పాటు చేయటంలో దిట్ట అయిన అమెరికా సైతం తాజా పరిణామాలను అంచనా వేయలేకపోయింది. ప్రపంచ దేశాల్లో చీమ చిటుక్కుమన్నా పట్టేసే సెంట్రల్‌ ఇంటెలిజెన్స్‌ ఏజెన్సీ ఏకంగా దేశ దేశాలే తిరుగుబాటుకు దిగుతుంటే గుర్తించలేకపోయింది. ఈ తిరుగుబాటుకు కారణాలు, లక్ష్యాలను అంచనా వేయలేకపోతోంది. ఇక తాజాగా ప్రపంచ పెట్టుబడిదారీ వ్యవస్థ ఎదుర్కొంటున్న సంక్షోభానికి, తాజా రాజకీయ పెను ఉద్యమాలకు మధ్య సంబంధాన్ని గుర్తించటంలో పాలకవర్గాల వైఫల్యం గురించి చెప్పుకోనవసరం లేదు. ఈ వ్యాసంలో తాజా ప్రపంచ సంక్షోభానికి, పశ్చిమాసియాలో దేశాధినేతల తలరాతలు మారుస్తున్న ఉద్యమాలకు మధ్య ఉన్న సంబంధాన్ని పరిశీలిద్దాం. గత నాలుగు దశాబ్దాలుగా సామ్రాజ్యవాద ప్రపంచీకరణకు అవసరమైన వనరులు, ప్రత్యేకించి ఇంధన వనరులు సరఫరా చేసింది పశ్చిమాసియా. సంపన్న దేశాల ఆర్థిక వ్యవస్థల పునఃనిర్మాణానికి అవసరమైన సరఫరాలు గ్యారంటీ చేసుకునేందుకు అమెరికా నాయకత్వంలో సామ్రాజ్యవాద దేశాలు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశాయి. నాలుగు దశాబ్దాల పాటు ఎన్నికలు జరుగుతున్నా ఒకే రాచకరిక కుటుంబాలు వరుసగా ఎన్నికవుతున్నాయంటే ఈ ప్రజాస్వామ్యంలో ప్రజల భాగస్వామ్యం ఏమాత్రం ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ నాలుగు దశాబ్దాల పాటు పశ్చిమాసియా దేశాలు క్రమం తప్పకుండా అమెరికాకు మంచి మిత్రులుగా వ్యవహరించాయి. ప్రపంచీకృత ఆర్థికవ్యవస్థకు అవరసరమైన ఇంధన రంగంలో ప్రభుత్వ నియంత్రణలు పాటిస్తూనే మరోవైపున సామాజిక రంగాల్లో ప్రైవేటీకరణ విధానాలు విచ్చలవిడిగా అమలు చేశాయి ప్రభుత్వాలు. దాంతో దిగువ పట్టికలో చూపిన విధంగా వివిధ దేశాల్లో నిరుద్యోగం ఊహించనంత స్థాయికి చేరింది.

ప్రజలకు తమ ఆగ్రహావేశాలు వ్యక్తం చేయటానికి అవసరమైన ప్రజాతంత్ర సాధనాలు, మార్గాలు పరిమితంగా ఉండటం, పాలకవర్గాలకు సామ్రాజ్యవాదుల ప్రత్యక్ష అండదండలు ఉండటంతో ప్రజలు గత్యంతరం లేక నిమిత్తమాత్రులయ్యారు. ప్రజల నుండి తమ విధానాలు, వాటి పర్యవసానంగా జరుగుతున్న సంపద కేంద్రీకరణ క్రమాలకు విఘాతం కలగకుండా ఉండటానికి ప్రపంచీకరణ విధానాలు అనుమతించినమేరకు సంక్షేమ చర్యలు అమలు జరిగాయి. పశ్చిమాసియాలో సంక్షేమ చర్యలు ప్రధానంగా నీటి సరఫరా రంగానికి, ఆహారోత్పత్తుల రంగానికి పరిమితం అయ్యాయి. ఈ దేశాల ప్రత్యేక భౌగోళిక పరిస్థితుల రీత్యా ఆహారోత్పత్తులు పరిమితం. దాంతో ఆయా దేశాలు తమ దేశీయ ఆహార అవసరాలు తీర్చుకోవటానికి సైతం విదేశీ దిగుమతులపై ఆధారపడాల్సి వచ్చేది. 1950,1960 దశకాల్లో ఈజిప్టు వంటి దేశాలు అప్పట్లో భారతదేశం తరహాలోనే దిగుమతులకు ప్రత్యామ్నాయ ఆర్థిక విధానాలు అవలంబించినా 70 దశకం వచ్చే సరికి పరిస్థితులు మారిపోయాయి. యాంకిప్పుర్‌ యుద్ధం తర్వాత ఈ ప్రాంతంలో ప్రజాతంత్ర ఉద్యమాలకు తలమానికంగా ఉన్న ఈజిప్టు క్రమంగా సామ్రాజ్యవాద శిబిరంలో జూనియర్‌ భాగస్వామిగా మారింది. దాంతో ఈ దేశం అనుసరించిన ఆర్థిక విధానాల రూపు రేఖలే మారిపోjయాయి.

పశ్చిమాసియా దేశాల్లో సమృద్ధిగా లభించే ఏకైక ముడిసరుకు చమురు. చమురు లేనిదే ప్రపంచ ఆర్థిక వ్యవస్థ లేదు. దాంతో ఒకప్పుడు సార్వభౌమత్వ దేశాల ఆధీనంలో ఉన్న ఈ చమురు వనరులపై హక్కులు అధికారాలు నేడు ప్రపంచీకరణకు చోదకశక్తులుగా ఉన్న అంతర్జాతీయ సంపన్నవర్గాల చేతుల్లోకి మారిపోయాయి. తొలుత ఈ మార్పు వల్ల పశ్చిమాసియా దేశాలకు ఆదాయ వనరులు పెరిగాయి. దాంతో మారిన ఆర్థిక విధానం వల్ల దేశంపై పడుతున్న అదనపు భారాలను తట్టుకుని నిలవగలిగాయి. కాలక్రమంలో అంతర్జాతీయ సంపన్నవర్గంలో భాగస్వాములుగా మారిన ఈ దేశాల పాలకవర్గాలు దేశ అవసరాలను ఎడారుల్లో వదిలిపెట్టాయి. దానికితోడు ఆ దేశాల ఆర్థిక వ్యవస్థలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థలతో మమేకం కావటంతో ప్రపంచ ఆర్థిక వ్యవస్థల్లో వచ్చే మార్పులకు ఈ దేశాల ఆర్థిక వ్యవస్థలు అతలాకుతలం అవుతున్నాయి. 1997 ఆసియా దేశాల ఆర్థిక సంక్షోభం తర్వాత పశ్చిమాసియా, ఆఫ్రికాదేశాలు విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు ఆకర్షించే కేంద్రాలుగా మారాయి. దాంతోపాటే సార్వభౌమ నిధులు, ఇతర ద్రవ్యసంకర రూపాలు తెరమీదకు వచ్చాయి. మార్కెట్‌లో స్పెక్యులేషన్‌ పెరిగిపోయింది.

తాజాగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థ సంక్షోభం, తదనరం నేడు దేశాలు ఎదుర్కొంటున్న ఆహార సంక్షోభంతో ప్రజలపై ఎనలేని భారాలు పడ్డాయి. ఆర్థిక సంక్షోభం కారణంగా ఈజిప్టు, ఇతర పశ్చిమాసియాదేశాలకు వచ్చే విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు తగ్గిపోయాయి. సంక్షోభం నేపథ్యంలో చమురు ఉత్పత్తుల విలువ పతనం కావటంతో ఆయా దేశాలకు వచ్చేఆదాయం కూడా పతనం అయ్యింది. అదే సమయంలో సంక్షోభం సైడ్‌ ఎఫెక్ట్‌గా దాదాపు మూడేళ్లపాటు ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో గిరాకీపడిపోయింది. తదనుగుణంగా ఉత్పాదకరంగం మందగించింది. ఉత్పాదకరంగానికి కీలకమైన ముడిసరుకులు సరఫరా చేసే ఆ దేశాల ఉత్పత్తులకు కూడా డిమాండ్‌ తగ్గింది. దాంతో పశ్చిమాసియాదేశాల ఆర్థిక వ్యవస్థలు అన్ని వైపుల నుండి చక్రబంధనంలో చిక్కుకుపోయాయి. ఒక్క ఈజిప్టులోనే సంక్షోభం కారణంగా స్థూల జాతీయోత్పత్తి 7 శాతం పతనం అయ్యింది. ఆహారోత్పత్తుల ధరలు, ఇంధన సబ్సిడీల భారం పెరిగిపోయాయి. పశ్చిమాసియాలో మిగిలిన దేశాలు సైతం సగానికిపైగా ఆహారోత్పత్తులు విదేశాల నుండి దిగుమతి చేసుకునేవే. ప్రతికూల పర్యావరణ పరిస్థితులు, స్పెక్యులేటివ్‌ వ్యాపారం ద్వారా పెరుగుతున్న ఆహారోత్పత్తుల ధరలు ఈ ఆర్థిక వ్యవస్థలపై భారంగా మారాయి. ఉదాహరణకు అల్జీరియాలో ఆహార వస్తువుల ధరలు గత సంవత్సర కాలంలో 30 శాతం పెరిగాయి. ఈజిప్టు ఆహార దిగుమతులకు అదనంగా 30 బిలియన్‌ డాలర్లు వెచ్చించాల్సి వచ్చింది. ఇదేసమయంలో ప్రపంచీకరణ వల్ల ఆయా దేశాల ఆర్థిక వ్యవస్థలు ద్వితీయశ్రేణి ఆర్థిక వ్యవస్థలుగా మారాయి. దానికితోడు పశ్చిమాసియా దేశాల్లో జనాభా పెరుగుదల 2.3 శాతంగా ఉంది. దాంతో ప్రైవేటీకరణ, జనాభా రేటు పెరుగుదల ఫలితంగా పెద్దఎత్తున ఉపాధి అవకాశాలు కల్పించాల్సిన పరిస్థితి వచ్చింది. ప్రపంచ బ్యాంకు అంచనా మేరకే 2035 నాటికి పశ్చిమాసియా దేశాలు 51 మిలియన్ల అదనపు ఉపాధి అవకాశాలు కల్పించాల్సి ఉంది.

గత నాలుగు దశాబ్దాల్లో హరితవిప్లవం ద్వారా వ్యవసాయ రంగంలో యాంత్రిక శక్తి వినియోగం పెరిగింది. దాంతో పెట్టుబడులు పెరిగాయి. చమురు వినియోగం పెరిగింది. నేడుచమురు ధరల్లో వచ్చే గాలివాటు మార్పులువల్ల పశ్చిమాసియా దేశాల్లో వ్యవసాయం పూర్తిగా నష్టదాయకంగా మారింది. దాంతో ఆహారోత్పత్తుల కొరత మరింత పెరింగింది. హరితవిప్లవం ఫలాలు తగ్గుముఖం పట్టనారంభించాయి. పర్యావరణంలో వచ్చే మార్పులతో తాగునీటి సమస్య ఈ దేశాల్లో కీలకమైన సమస్యగా అవతరించింది. ఉదాహరణకు పశ్చిమాసియాలో ఉండే మృతసముద్రంలో నీటిమట్టం బాగా పడిపోయింది. పర్యావరణంలో వచ్చిన మార్పుల వల్ల ఈ ప్రాంతంలో సగటు వర్షపాతం 20 శాతం తగ్గిపోయింది. ఈ పర్యవసానాలన్నీ వెరసి పశ్చిమాసియాదేశాల్లో జీవన సరిస్తితులు సామాజిక సంక్షోభం దిశగా మారుతున్నాయి. నేడు ఆయాదేశాల్లో ఉవ్వెత్తున ఎగసిపడుతున్న ఉద్యమాలు నిర్దిష్ట రూపం తీసుకుంటున్న సామాజిక సంక్షోభానికి వ్యక్తీకరణలే.

కొండూరి వీరయ్య

No comments: