ఈ వారం బిజినెస్ వాచ్ పాఠకుల చేతుల్లోకి వచ్చేటప్పటికి పార్లమెంట్‌లో ఆర్థిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ 2011-2012 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ ప్రతిపాదిస్తూ ఉంటారు. ఈ సంవత్సరం బడ్జెట్ జాతీయంగానూ అంతర్జాతీయంగానూ విలక్షణ పరిస్థితుల్లో ముందుకొస్తోంది. అక్టోబరు 27న బిజినెస్ వాచ్‌లో రాసిన వ్యాసంలో భారత ఆర్థిక వ్యవస్థ మాంద్యోల్బణం దిశగా నడవనుందన్న సందేహం వ్యక్తం చేసిన విషయం పాఠకులకు గుర్తుండే ఉంటుంది. తాజా పరిణామాలు ఆ సందేహాన్ని రుజువు చేసేవిగా ఉన్నాయి. దాంతో జాతీయ ఆర్థిక వ్యవస్థను మాంద్యోల్బణం నుండి కాపాడేందుకు బడ్జెట్ ఏమి చేయబోతోందన్న ప్రశ్న ముందకొస్తోంది. ఆర్థిక వ్యవస్థలో ఏకకాలంలో అదుపులేని ద్రవ్యోల్బణం, కరెంట్ ఖాతా లోటు, నిరుద్యోగం పెరుగుదల, పారిశ్రామిక వృద్ధి రేటు పతనం వంటి ధోరణులు వ్యక్తమైతే ఈ పరిస్థితిని మాంద్యోల్బణం అని స్థూలంగా చెప్పుకోవచ్చు. బడ్జెట్‌కు ముందున్న ఆర్థిక వ్యవస్థ తీరుతెన్నులు పరిశీలిస్తే ఈ ధోరణులు గణనీయంగా ఉన్నట్లు కనిపిస్తోంది. ద్రవ్యోల్బణం గురించి పెద్దగా చర్చించనవసరంలేదు. ఒకవైపున ప్రధాని మొదలు, ప్రణాళికసంఘం ఉపాధ్యక్షుడు మాంటెక్ సింగ్ అహ్లువాలియా, ప్రధాని ఆర్థిక సలహా మండలి అధ్యక్షులు రంగరాజన్ వంటి వారందరూ మార్చి నెలాఖరుకు ద్రవ్యోల్బణం సాధారణ స్థాయికి చేరుకొంటుందని అంచనా వేస్తున్నా వాస్తవం దీనికి భిన్నంగా ఉంది.
ద్రవ్యోల్బణంలో పారిశ్రామికోత్పత్తులు, వ్యవసాయోత్పత్తులు, సేవారంగం వివిధ పాళ్లలో మిళితం అయి ఉంటాయి. వీటిలో మార్చి నెలాఖరు నాటికి పంటల కాలం పూర్తయి పుష్కలంగా ఆహారోత్పత్తులు ఇళ్లకు చేరే అవకాశం ఉంది. అంతేకాదు ఈ ఏడాది ఆహారోత్పత్తుల రంగంలో వృద్ధి రేటు గణనీయంగా ఉంటుందని అంచనాలు ఉన్నాయి. దీంతో ద్రవ్యోల్బణంలో ఒక కోణం ఆహారోత్పత్తుల ధరలు దారికి వస్తాయన్నది ప్రభుత్వ ఆర్థిక వేత్తల అంచనా. నిజానికి గత రెండు సంవత్సరాలుగా ఇటువంటి అంచనాలే వేస్తున్నా ఈ అంచనాలు వాస్తవిక రూపం దాల్చటం లేదు. తాజాగా పారిస్‌లో జరిగిన జి 20 దేశాల ఆర్థిక మంత్రుల సమావేశంలో మాట్లాడుతూ భారత ఆర్థిక మంత్రి ద్రవ్యోల్బణానికి ఫ్యూచర్స్ ట్రేడింగ్, స్పెక్యులేటివ్ ట్రేడింగ్ కారణమన్న విమర్శతో గొంతు కలిపారు. కానీ పార్లమెంట్ మొదలైన రెండో రోజు రాజ్యసభలో జరిగిన చర్చలో మాత్రం పేదలు కడుపునిండా తినటానికి అనుకూల పరిస్థితులు ఉండటం వల్లనే ఆహారోత్పత్తులకు గిరాకీ పెరిగి ధరలు అందనంత ఎత్తుకు పోతున్నాయని వితండవాదం మొదలు పెట్టారు. పైగా అంతర్జాతీయ పరిస్థితులతో భారత ఆర్థిక వ్యవస్థ ముడివేసుకుని ఉన్నందున అంతర్జాతీయ పరిణామాల నుండి జాతీయ ఆర్థిక పరిణామాలను వేరు చేసి చూడలేమని వాదించారు. అటువంటప్పుడు మార్చి నాటికి ద్రవ్యోల్బణం దారికొస్తుందన్న అంచనా అంతర్జాతీయ పరిస్థితులపై అంచనా ఆధారంగా చెప్తోందా లేదా అన్నది పరిశిలీంచాల్సి ఉంది.
ద్రవ్యోల్బణంలో ఒక ముఖ్యమైన పాత్ర పోషిస్తున్న అంశం చమురు ధరలు. 2009-2010 ఆర్థిక సంవత్సరంలో భారతదేశం దిగుమతి చేసుకున్న చమురు సగటు బ్యారెల్ ధర 69.76 డాలర్లుగా ఉంది. 2010-2011 ఆర్థిక సంవత్సరంలో ఈ సగటుధర 82.07 డాలర్లకు పెరిగింది. జనవరిలో ఇది మరింతగా పెరిగి 93 డాలర్లకు నేడు ఫిబ్రవరి చివరి వారంలో 99.85 డాలర్ల సగటు ధరకు చేరింది. ఈ వ్యాసం రాసే సమయానికి లిబియాలో ప్రజాందోళన తారాస్థాయికి చేరుకోవటం, పశ్చిమాసియాలో నియంతృత్వ ప్రభుత్వాలు ప్రజాగ్రహానికి గురవటంతో ఆయా దేశాల నుండి అంతర్జాతీయ మార్కెట్‌లోకి విడుదల కావాల్సిన చమురు నిల్వలు విడుదల కావటం లేదు. ప్రత్యేకించి ఈజిప్టులో పాలకులు గద్దె దిగిన వారం రోజుల్లోనే అంతర్జాతీయ మార్కెట్‌లో చమురు ధరలు బారెల్ 100 డాలర్లకు చేరుకొంది. 2011-2012 ఆర్థిక సంవత్సరంలో ఈ ధర 120-125 డాలర్లకు చేరుకోవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇదే జరిగితే రెండేళ్ల కాలంలో భారతదేశం దిగుమతి చేసుకునే చమురు ధర 69 డాలర్ల నుండి రెట్టింపు పెరిగినట్లు అవుతుంది. ఈ మేరకు చమురు ఉత్పత్తుల దిగుమతి ఖరీదు పెరుగుతుంది. దాంతో అనివార్యంగా ఎగుమతి-దిగుమతుల మధ్య ఉన్న వ్యత్యాసం మరింత పెరిగిపోతుంది. ఈ వ్యత్యాసాన్నే కరెంట్ ఖాతా లోటు అంటారు. కరెంట్ ఖాతా లోటు అంతిమంగా బడ్జెట్‌లోటును ప్రభావితం చేయనుంది.
ఈ పరిస్థితుల నుండి బయటపడేందుకు ఉన్న ఏకైక మార్గం ప్రభుత్వం తన ఆదాయాలు పెంచుకోవటం. ప్రభుత్వం ఆదాయాన్ని పెంచుకోవటానికి మళ్లీ రెండు మార్గాలు ఉంటాయి. పన్నుల వ్యవస్థను సంస్కరించటం ఒక మార్గం అయితే ఖజానా ఖాళీకాకుండా ఉండేందుకు సంక్షేమ చర్యలపై కోత విధించడం మరో మార్గం. గత రెండు దశాబ్దాల నుండీ ప్రభుత్వాలు రెండో మార్గాన్ని అనుసరిస్తూ రావటంతో పరిస్థితి నేటి దుస్థితికి చేరింది. చివరకు భారతదేశంలో సామాజిక అభివృద్ధి బంగ్లాదేశ్ సామాజిక అభివృద్ధి కంటే దారుణంగా ఉంది. ఆర్థికాభివృద్ధి కేవలం ఆర్థికరంగం కోసమే కాదని, సామాజిక అభివృద్ధి సాధించేందుకు ఒక సాధనం మాత్రమే అన్న సమగ్ర దృక్ఫథం భారతదేశంలో పాలకులకు లోపించటం పట్ల నోబెల్ బహుమతి గ్రహీత అమర్త్యసేన్ ఈ మధ్య కాలంలో తీవ్రంగా విమర్శించారు. ప్రభుత్వం ఈ విమర్శలకు ధీటుగా వ్యవహరిస్తుందా లేక అదే కోవలో కొట్టుకుపోతుందా అన్నది నేటి బడ్జెట్‌లో సంపన్న వర్గాలకు ప్రభుత్వం ఇచ్చే రాయితీల వల్ల ఎంత ఆదాయం నష్టపోయిందన్న వివరాలు వెల్లడైతేగానీ చెప్పలేము. 2008-09 బడ్జెట్లో రూ.4,14,099కోట్ల మేర పన్నుల రూపంలో రావాల్సిన ఆదాయాన్ని వదులుకోగా, 2009-10 బడ్జెట్లో రూ.5,02,299కోట్లు మేర ఆదాయం వదులుకుంది. అంటే సంపన్నులకు రూ.9,16,398కోట్లు రాయితీని ఇచ్చిందన్నమాట. ఇది ప్రభుత్వ ఆదాయంలో 79.54శాతం. ఇదే కాకుండా సంపన్నవర్గాల నుంచి వ్యక్తిగత ఆదాయాపు పన్ను ఖాతా కింద వసూలు చేయాల్సిన మరో రెండు లక్షల పాతిక వేల కోట్ల రూపాయలను కూడా వదులుకుంది. దీంతో సంపన్నవర్గాలకిచ్చిన రాయితీ మొత్తం రూ.11,41,398కోట్లకు చేరింది.
ప్రభుత్వం ఈ విషయాన్ని దాచిపెడుతోంది. కేవలం సబ్సిడీల వల్లే, లేదంటే ప్రజా సంక్షేమ పథకాల వల్లే ప్రభుత్వ లోటు పెరుగుతోందనే కుతర్కానికి పూనుకుంటోంది. ఉదాహరణకు దేశంలో ఉన్న 657 మంది మెగా సంపన్నుల వద్ద పోగుపడిన సంపద విలువ 16 లక్షల కోట్ల రూపాయలు ఉంటుందని అంచనా. ఈ సంపదపై 1 శాతం సంపద పన్ను, (ఆదాయ పన్ను కాదు) వేస్తే రూ.1,60,000 కోట్ల రూపా యలు ఆదాయం ప్రభుత్వానికి వస్తుంది. అంటే ఇది 2జి స్పెక్ట్రం కుంభ కోణంలో ప్రభుత్వం నష్టపోయిన ఆదాయంతో సమానం. అంతేకాక యుపిఎ-1 హయాంలో వామపక్షాల ఒత్తిడి మేరకు అమల్లోకి తెచ్చిన లాంగ్‌టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ పన్ను అమలు చేస్తే మరో పదివేల కోట్ల రూపాయలు ఆదాయం వస్తుంది. ఈ రకమైన నిర్ణయాలు తీసుకోవటం, తీసుకోకపోవటం వెనుక ప్రభుత్వానికి ప్రజల మీద ఏ మాత్రం ప్రేమ ఉంది, సంపన్న వర్గాల మీద ఏ మాత్రం ప్రేమ ఉందన్న విషయాలు తేటతెల్లమవుతాయి.ఆర్థిక వ్యవస్థ ముందున్న మరో సవాలు పారిశ్రామికాభివృద్ధి. ప్రభుత్వం గత పదేళ్లుగా కీలకమైన పారిశ్రామిక రంగంలో ప్రయివేటు భాగస్వామ్యానికి పెద్ద పీట వేసింది. ఈ మేరకు ప్రణాళిక సంఘం ఆధ్వర్యంలో ఒక విధానం - ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్య విధానం- కూడా రూపొందించింది. ప్రత్యేకించి గత సంవత్సరంలో వివిధ రంగాల్లో భారీఎత్తున అవకాశాలు కల్పించింది. ఈ అవకాశాలు వినియోగించుకునే వారికి వివిధ రూపాల్లో పెట్టుబడులు సమకూర్చుకోవటానికే కాక పన్ను రాయితీలు కూడా వేల కోట్లలో కల్పించింది. ఈ విధాన నిర్ణయాలకు సమర్థింపుగా ప్రభుత్వం ముందుకుతెచ్చిన వాదన, వివిధ అభివృద్ధికార్యక్రమాలకు అవసరమైన నిధులు ప్రభుత్వం వద్ద లేవు అన్నవాదన. ఇన్ని అవకాశాలు ఇచ్చినా ప్రైవేటురంగంలో పెట్టుబడులు గత సంవత్సరంతో పోల్చి చూస్తే ఈ సంవత్సరం 25.6 శాతం పడిపోయాయి. దీని ప్రభావం పారిశ్రామికాభివృద్ధి నత్తనడకపై కనిపిస్తోంది. మరోవైపు అంతర్జాతీయ పరిస్థితుల్లో వచ్చిన మార్పుల వల్ల 2009-2010 ఆర్థిక సంవత్సరం కంటే 2010-2011 ఆర్థిక సంవత్సరంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు 31 శాతం తగ్గిపోయాయి. ఈ ఆర్థిక సంవత్సరంలో దేశంలోకి వచ్చిన నికర విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు కేవలం 24 బిలియన్ డాలర్లు మాత్రమే. అంటే భారతదేశ పారిశ్రామిక రంగం ఇటు దేశీయ ప్రైవేటుపెట్టుబడులు లేక, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు రాక, ప్రభుత్వం పెట్టుబడులు పెట్టక దివాళాదిశగా నడుస్తోంది. ఈ పరిణామాలన్నీ మదింపు వేసి చూస్తే రానున్న కాలంలో భారత ఆర్థిక వ్యవస్థ తీవ్ర కష్టాల్లో పడనున్నట్లు స్పష్టమైన సూచనలు కనిపిస్తున్నాయి. మరి ప్రణబ్ ముఖర్జీ ప్రతిపాదించే బడ్జెట్ ఈ కష్టాల ఊబి నుండి ఆర్థిక వ్యవస్థను బయటకు లాగుతుందా లేక మరింత లోతైన ఊబిలోకి నెడుతుందా అన్నది పరిశీలించేందుకు బడ్జెట్ ఒక ముఖ్యమైన సందర్భంగా నిలవనుంది.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment