Monday, January 24, 2011

శక్తివంతమౌతున్న దేశాలకు సవాల్‌ 2011

రపంచ వ్యాప్తంగా విశ్లేషకులు 2011 సంవత్సరంలో ఆర్థిక అంచనాలకు విశేష ప్రాధాన్యత ఇచ్చారు. మూడేళ్లుగా పెట్టుబడిదారీ వ్యవస్థ ఎదుర్కొంటున్న ప్రపంచ సంక్షోభానికి ముగింపు పలుకుతామా లేదా అన్న విషయం ఆ సంవత్సరం వివిధ దేశాలు ప్రత్యేకించి సంపన్నదేశాలు, శక్తివంతమవుతున్న దేశాలు సాధించే ఆర్థికాభివృద్ధి రేట్లపై ఆధారపడి ఉంటుంది. అందువల్లనే ఈ సంవత్సరపు ఆర్థిక అంచనాలకు అంత ప్రాధాన్యత ఉంది. అయితే సంవత్సరం ఆరంభంలోనే భారతదేశంతో సహా వివిధ వర్ధమాన దేశాలు ఎదుర్కొంటున్న ఆహారోత్పత్తుల అధిక ధరల సమస్య ఈ అంచనాలను తల్లకిందులు చేయనుంది. ప్రపంచ ఆహార సంస్థ డిసెంబరు చివరి వారంలో విడుదల చేసిన నివేదికలో కూడా ఇదే ఆందోళనను వ్యక్తం చేయటం గమనార్హం. ఆహారోత్పత్తుల ధరలతో పాటు పెరుగుతున్న ద్రవ్యోల్బణం ఆర్థికాభివృద్ధి రేట్లను ప్రశ్నార్థకం చేస్తోంది.

ముందుగా భారతదేశం అనుభవం పరిశీలిద్దాం. భారతదేశంలో ఆహారోత్పత్తుల ద్రవ్యోల్బణం నవంబరు, డిసెంబరు నెలల్లో ఎలా అదుపులేకుండా పోతోందో దిగువనున్న పట్టిక రుజువు చేస్తుంది. ఈ కాలంలోనే ఒక్క కిలో ఉల్లిపాయల ధర 20 రూపాయల నుండి 80 రూపాయలకు పెరిగింది. కిలో టమాటా ధర కూదా 20 నుండి 60కి పెరిగింది. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ కాలంలో పెరగని వంటగది సామాను ధరలు లేవంటే అతిశయోక్తి కాదు. ఇది కూడా ఉత్పత్తులు పంట చేలల్లోనుండి ఇళ్లకు చేరే సమయంలో ఈ రకంగా పెరగటం వెనక కేవలం స్వేఛ్చా మార్కెట్‌ విధానాలే మూలకారణమని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అక్టోబరు నాటికి 15 శాతంగా ఉన్న ఆహారోత్పత్తుల ద్రవ్యోల్బణం నవంబరులో 8.6 శాతానికి తగ్గిపోవటంతో ఇదంతా తమ ప్రతిభేనని ప్రభుత్వం చంకలు గుద్దుకుంది. ఏకంగా వృద్ధి రేటు 9 శాతానికి మించిపోతుందని ఆర్థిక మంత్రి సలహాదారు కౌశిక్‌బసు నొక్కిమరీ చెప్పారు. ఈ సంతోషం ప్రభుత్వానికి ఎంతో కాలం నిలవలేదు. డిసెంబరు నాల్గో వారానికి ఆహారోత్పత్తుల ద్రవ్యోల్బణం దేశంలో తిరిగి 14.44 శాతానికి పెరిగింది. దీనికి తోడు ప్రపంచ ఆహార సంస్థ విడుదల చేసిన తాజా నివేదికలో కూడా ఆహారోత్పత్తుల ధరలు 2008 నాటి స్థాయిని మించిపోతాయని హెచ్చరించింది. దీనికి అనేక కారణాలు ఉన్నాయని సదరు నివేదిక పేర్కొంది.

2000 జనవరి నాటికి 87.5 శాతం పెరిగిన ఆహారోత్పత్తుల ధరల పెరుగుదల రేటు 2008 నాటికి 213.5 శాతానికి పెరిగాయి. 2010 డిసెంబరు నాటికి ఇది మరింత పెరిగిపోయి 214.7 శాతానికి చేరింది. దిగువ చూపించిన గ్రాఫ్‌లలో ఈ పెరుగుదల తీవ్రత ఎలా ఉందో తెలుసుకోవచ్చు. 2008 ధరల పెరుగుదలకు చమురు ధరల పెరుగుదల ప్రధానకారణంగా చూపించిన ప్రభుత్వాలు నేడు ఏ కారణం చూపించాలో దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నాయి. నాడు బారెల్‌ చమురు ధర 145 డాలర్లుగా ఉంటే నేడు బారెల్‌ చమురు ధర 90 డాలర్లుగా ఉంది. పైగా ఉత్పత్తి తగ్గిపోయి ధరలు పెరుగుతున్నాయని అనుకోవటానికి కూడా వీల్లేదు. ఉల్లిపాయల విషయమే తీసుకుంటే గతసంవత్సరం కంటే ఈ సంవత్సరం 66 శాతం అదనంగా ఉత్పత్తి అయ్యాయని మార్కెట్‌ వర్గాలు తెలుపుతున్నాయి. అయినా పంటలు చేతికొచ్చే సమయంలో ఆహారోత్పత్తులు, ఇతర వ్యవసాయోత్పత్తుల ధరలు పెరగటం కేవలం ప్రభుత్వాలు అనుసరించే విధానాల్లో లోపాన్ని స్పష్టంగా ముందుకు తెస్తున్నాయి. అదేసమయంలో ఫార్వర్డ్‌ మార్కెట్‌ అమ్మకాలు కూడా గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం 33 శాతం పెరగటంతో మార్కెట్‌లో సరుకుల చలామణి తగ్గిపోయింది.


ఆహారోత్పత్తుల ధరల పెరుగుదల పర్యవసానాలు ఏమిటి ? 2008 నాటి అనుభవాలు పరిగణనలోకి తీసుకుంటే సుమారు 100కోట్ల మంది అదనంగా పెరిగిన ధరలతో కనీస ఆరోగ్యం కాపాడుకోవటానికి పేదరికంలోకి జారిపోయారని అంచనా. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ 4 శాతం వృద్ధి రేటు సాధించినప్పుడు పరిస్థితే ఇలా ఉంటే మరి 1 శాతం వృద్ధి రేటు సాధిస్తున్న ఈ కాలంలో పరిస్థితులు ఎంత దారుణంగా ఉంటాయో ఊహించనలవికాదు. 1998లో ఒకసారి ఈ తరహాలో ఆహార సంక్షోభం తలెత్తినపుడు ఏకంగా ప్రభుత్వాలే మారిపోయాయి. ఇండొనేషియాలో సుహార్తో ప్రభుత్వం కడతేరింది. ఈసారికూడా అటువంటి ముప్పు ముంచుకొచ్చే అవకాశం ఉందని ప్రపంచ ఆహార సంస్థ హెచ్చరించటం విశేషం. పెరిగిన ఆహారోత్పత్తుల ధరలతో కొనుగోలు శక్తి తగ్గిపోవటం తక్షణ పర్యవసారం. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ పట్టాలు ఎక్కటానికి ఆయా దేశాల ఆర్థిక వ్యవస్థల్లో బలంగా ఉండే కొనుగోలు శక్తే కీలకం కావటంతో నేడు పెరుగుతున్న ధరలు, ద్రవ్యోల్బణం ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కోలుకోవటాన్ని సవాలు చేస్తోంది. ప్రత్యేకించి చైనా భారతదేశం వంటి భారీ మార్కెట్లు ఉన్న దేశాల్లో దీని ప్రభావం మరింత ఎక్కువగా ఉండటంతో ఈ దేశాల ఆర్థికాభివృద్ధిపై ఆధారపడి రూపొందిస్తున్న ప్రపంచ ఆర్థిక వృద్ధి రేటు అంచనాలు ప్రశ్నార్ధకమవుతున్నాయి. పెరుగుతున్న ధరలతో ఆహారోత్పత్తుల్లో ఫ్యూచర్స్‌ వాణిజ్యం పుంజుకొంటోంది. దీంతో మార్కెట్లో ఉండాల్సిన సరుకులు గోదాముల్లోకి చేరుతున్నాయి.


డెలివరీలు నిలిచిపోతున్నాయి. గతంలో అయితే ఇటువంటి పరిస్థితిని బ్లాక్‌మార్కెటింగ్‌ అని ప్రకటించి దానికి వ్యతిరేకంగా చర్యలు తీసుకోవటానికి అవసరమైన చట్టాలు అందుబాటులో ఉండేవి. బ్లాక్‌ మార్కెట్‌ అంటే సాధారణంగా మార్కెట్‌లోకి విడుదల కావాల్సిన సరుకులను విడుదల కానీయకుండా దాచివేయటమే. దాంతో కొరత, కొరతననుసరించి వచ్చే ధరల పెరుగుదల, దాని ఆధారంగా వ్యాపారులు లాభాలు దండుకోవటం తదుపరి పర్యవసానాలుగా ఉండేవి. కానీ ప్రపంచీకరణ విధానాల నేపథ్యంలో ఒకప్పటి బ్లాక్‌ మార్కెటింగ్‌ ప్యూచర్స్‌ వాణిజ్యం రూపంలో చట్టబద్ధం అయిపోయింది. దాంతో ప్రభుత్వం బ్లాక్‌మార్కెట్‌ను అడ్డుకుంటాం, ధరలు తగ్గిస్తాం అని ఎంతగా గొంతు చించుకుంటున్నా దాని ప్రభావం మార్కెట్‌పై పడటం లేదు. పైగా ఫ్యూచర్స్‌ ట్రేడింగ్‌ భారీగా లాభసాటిగా మారటంతో వివిధ దేశాలకు చెందిన ద్రవ్యపెట్టుబడిదారులు తమ పెట్టుబడులు ఉత్పత్తిరంగం నుండి ఫ్యూచర్స్‌ ట్రేడింగ్‌ రంగానికి బదలీ చేస్తున్నారు. వీటన్నింటి ప్రభావం వెరసి చిల్లరమార్కెట్‌లో రోజువారీ కొనుగోలు చేసే సామాన్యమానవుడు నాలుగు వందల నుండి ఐదువందల రెట్లు అధిక ధరలు చెల్లించాల్సి వస్తోంది. ఇప్పటికే వేతనాలు పెరగ్గ, ఉపాధి అవకాశాలు తగ్గిపోయి జేబులు ఖాళీ అవుతున్న ప్రజానీకానికి ఈ భారం మోయరానిదిగా మారుతుందనటంలో సందేహం లేదు. అందువల్లనే రానున్న కాలంలో ఆహారోత్పత్తుల కోసం తిరుగుబాట్లు, దోపిడీలు జరిగే అవకాశం ఉందని ప్రపంచ ఆహార సంస్థ హెచ్చరించటం గమనించాల్సిన విషయం. వెరసి ఈ పరిణామాలు 2011లో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ వృద్ధి రేటును నీరుగార్చటమే కాక అమెరికా, జర్మనీ వంటి సంపన్న దేశాల సరసన చేరాలని ఉవ్విళ్లూరుతున్న భారతదేశం వంటి శక్తివంతమవుతున్న దేశాల్లో వృద్ధి రేటుకు సవాలు విసరనున్నాయి.

కొండూరి వీరయ్య

No comments: