Monday, May 17, 2010

ప్రపంచం నెత్తిన యూరో పరిరక్షణ భారం !

Published in Prajasakti Business Watch May 17th

మే 3న బిజినెస్‌వాచ్‌లో గ్రీస్‌ను ఆదుకునేందుకు యూరోపియన్‌ యూనియన్‌ ముందున్న మార్గాలు గురించి ప్రస్తావించుకున్నాము. చిట్టచివరకు యూరోపియన్‌ యూనియన్‌ నేతలు ఆలస్యంగానైనా మేల్కొన్నారు. దాదాపు లక్ష కోట్ల డాలర్ల విలువైన గ్రీస్‌ సహాయ నిధిని ఏర్పాటు చేసేందుకు అంగీకరించారు. ఈ నిధి యూరో పరిరక్షణ నిధి అని పిలవటం మరింత సబబుగా ఉంటుంది. గతంలో చెప్పుకున్నట్లు గ్రీస్‌ పతనం కావటానికి అంగీకరించటం అంటే యూరో కరెన్సీపై అంతర్జాతీయ విశ్వాసాన్ని కోల్పోవటమే. అందువల్లనే మే మొదటివారంలో యూరోపియన్‌ యూనియన్‌ నేతల కసరత్తు అంతా ఈ విశ్వాసాన్ని నిలబెట్టుకునే దిశగా సాగింది. యూరోపియన్‌ యూనియన్‌ ఆవిర్భావ క్రమంలో లిస్బన్‌ ఒప్పందం ఒక ముఖ్య ఘట్టం. ఈ ఒప్పందంలోని ఆర్టికల్‌ 12.2లో '' సభ్య దేశాలు ప్రకృతి వైపరీత్యాలకు గురైనపుడు, లేదా ఇతర భారీ నష్టానికి గురైనపుడు మిగిలిన దేశాలు సదరు సభ్య దేశాన్ని ఆదుకోవాలి'' అని ఆదేశిస్తోంది. ఈ ఒప్పందం కింద తాజా గ్రీసు/యూరో పరిరక్షణ చర్యలు ప్రారంభమయ్యాయి. స్థూలంగా యూరోపియన్‌ యూనియన్‌, అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ ఐఎంఎఫ్‌లు సంయుక్తంగా రూపొందించిన పథకం ఇది. ఈ ఒప్పందం ద్వారా మొత్తం యూరోపియన్‌ యూనియన్‌ ద్రవ్య వ్యవహారాలను పర్యవేక్షించే అధికారం ఐఎంఎఫ్‌కు దఖలు పర్చారు. 1999 లాటిన్‌ అమెరికా దేశాల రుణ సంక్షోభం తర్వాత ప్రాధాన్యత తగ్గిపోయిన ఐఎంఎఫ్‌ తిరిగి ఈ రూపంలో తన పర్యవేక్షణ విధులకు తెరతీసింది.

పట్టిక-2లో చివరి రెండు పాయింట్లు ముఖ్యంగా పరిశీలించాల్సినవి. యూరోజోన్‌లో దేశాలకు దేశాలే రుణబారిన పడటంతో అంతర్జాతీయ మార్కెట్లో ఆయా ప్రభుత్వాలు నిధుల సమీకరణ కోసం విడుదల చేసే బాండ్లకు ( నేషనల్‌ సేవింగ్స్‌ సర్టిఫికెట్‌, ప్రభుత్వరంగ సంస్థల రుణ సేకరణ ఒప్పందాలు) మార్కెట్‌ ఆదరణ కరువైంది. లావాదేవీలు స్థంభించాయి. స్థంభించిన లావాదేవీలను పునఃప్రారంభించకుండా ద్రవ్య చలామణి సాధ్యం కాదు. అందువల్ల ఏకంగా యూరోపియన్‌ యూనియన్‌ సెంట్రల్‌ బ్యాంకే ఈ రుణ పత్రాలను, బాండ్లను కొనుగోలు చేయాలని నిర్ణయించటం జరిగింది. అదే సమయంలో అంతర్జాతీయ ద్రవ్య మార్కెట్‌లో జరిగే ఇటువంటి లావాదేవీలన్నీ రేటింగ్‌ ఏజెన్సీల అంచనాలను ప్రమాణంగా తీసుకుంటాయి. రేటింగ్‌ ఎజెన్సీ అంటే మార్కెట్‌లో బాండ్లు విడుదల చేసే సంస్థ, ప్రభుత్వం ఆదాయ వ్యయాలు పరిశీలించి ఈ బాండ్ల ద్వారా సేకరిస్తున్న రుణాలు చెల్లించగల స్థితిలో ఉన్నాయా లేదా అన్నది నిర్ధారిస్తుంది. రుణ చెల్లింపు సామర్థ్యం ఆధారంగా గ్రేడులు ఇస్తారు. యూరోపియన్‌ యూనియన్‌లో కొన్ని దేశాల ఆర్థిక స్థితిగతులు శిధిలావస్థకు చేరుకోవటంతో రేటింగ్‌ బాగా పడిపోయింది. రేటింగ్‌ లేని దేశాలు విడుదల చేసే బాండ్లను ఎవ్వరూ కొనుగోలు చేసే పరిస్థితి లేదు. అందువల్లనే పై పట్టికలో చివరి క్లాజు. రేటింగ్‌ ప్రమాణాలతో నిమిత్తం లేకుండా యూరోపియన్‌ యూనియన్‌ ప్రభుత్వాల బాండ్లు కొనుగోలు చేయటానికి సెంట్రల్‌ బ్యాంకు గ్రీన్‌ సిగల్‌ ఇచ్చింది. అంటే ఒకరకంగా చెప్పాలంటే అమెరికాలో బ్యాంకులు, నియంత్రణ సంస్థలు, రేటింగ్‌ ఎజెన్సీలు సబ్‌ప్రైం రుణాలకు ఆమోదం ఇచ్చినట్లన్నమాట. దీని పర్యవసానం తాత్కాలికంగా యూరో బాండ్‌ మార్కెట్‌లోనూ, ద్రవ్య మార్కెట్‌లోనూ కదలిక వచ్చినా దీర్ఘకాలంగా యూరో సంక్షోభం అన్ని దేశాలను ఆవహించటానికి మార్గం సిద్ధం అవుతుంది. అంటే గ్రీస్‌, స్పెయిన్‌, పోర్చుగల్‌, ఇటలీ దేశాలు విడుదల చేసే బాండ్లను మిగిలిన దేశాల్లోని ద్రవ్య సంస్థలు కొనుగోలు చేస్తాయి. ఈ కొనుగోళ్లకు గతంలో ఆయా ప్రభుత్వాలే హామీ ఉంటే ఇపుడు ఏకంగా యూరోపియన్‌ సెంట్రల్‌ బ్యాంకు హామీగా ఉంటుంది. తద్వారా యూరోపియన్‌ యూనియన్‌ దేశాల్లోని నష్టాలు, కష్టాలన్నీ సెంట్రల్‌ బ్యాంకు వద్ద కేంద్రీకృతమవుతాయి.యూరోపియన్‌ యూనియన్‌ బడ్జెట్‌ రూపంలో ఒక దేశంలో నష్టాలకు మరో దేశం బీమా పథకాలు అమలు జరుగుతాయి. ఉదాహరణకు గ్రీసులో జరిగే నష్టాలను పూడ్చుకోవటానికి జర్మనీ బడ్జెట్‌ వాటా నుండి నిధులు వెచ్చించాల్సి వస్తుంది. ఈ పరిస్థితి అంతిమంగా యూరోజోన్‌లో రాజకీయ అస్థిరతకు దారితీసినా ఆశ్చర్యపడాల్సిన పని లేదు. ఇప్పటికే ఈ ఒప్పందం తర్వాత రైన్‌, వెస్ట్‌ఫాలియా స్థానిక ఎన్నికల్లో జర్మన్‌ అధికార కూటమి చావుదెబ్బతిన్నది. దాంతో ఐఎంఎఫ్‌ ఆదేశాలకు అనుగుణంగా విధించాల్సిన సంక్షోభ నివారణ పన్ను వంటి కొత్త పన్నులను నిరవధికంగా వాయిదా వేసింది జర్మన్‌ ప్రభుత్వం. పోర్చుగల్‌ కూడా ఈ తరహాలోనే నూతన పన్నుల వడ్డనకు సిద్ధమవుతోంది. గ్రీస్‌లో పెల్లుబికిన ఆగ్రహ జ్వాలలు ఈ దేశాలకూ విస్తరించటం అనివార్యం. ఈ విధంగా ఇపుడు దేశీయ సరిహద్దులకు పరిమితం అయిన సంక్షోభాన్ని యూరోజోన్‌ సరిహద్దులకు విస్తరించటానికి రంగం సిద్ధం అయింది.

ఈ అవగాహనలో మరో ముఖ్యమైన అంశం యూరోజోన్‌లోని అన్ని దేశాలు పరిరక్షణ, పునరావాస చర్యల్లో పాలు పంచుకోవాలన్న షరతు. ఈ షరతు ఆచరణలో ఏ రూపం తీసుకొంటుందో పక్కనున్న పట్టికను పరిశీలిస్తే మరో విషయం స్పష్టమవుతుంది. ఈ షరతు అమల్లో భాగంగా ప్రభుత్వాలు తీసుకునే పొదుపు చర్యలు యూరో జోన్‌లో ఎగుమతులు, దిగుమతులను పెద్దఎత్తున ప్రభావితం చేయనున్నాయి. ఇయు బడ్జెట్‌లో ఆయా దేశాల వాటాల నిష్పత్తికి అనుగుణంగానే 440 బిలియన్‌ యూరోల భారాన్ని ఆయా దేశాలు పంచుకుంటాయి. మరోవైపున ఐఎంఎఫ్‌ విడుదల చేసే 250 బిలియన్‌ యూరోల భారాన్ని మొత్తం ఐఎంఎఫ్‌ సభ్య దేశాలు పంచుకోవాలి. అంటే గ్రీసు పరిరక్షణ భారం ఎంతో కొంత భారతదేశ ప్రజానీకం కూడా మోయాల్సి ఉంటుందన్నమాట. ఈ ప్యాకేజిని అమలు చేయాలంటే జర్మనీ 187 బిలియన్‌ డాలర్ల భారాన్ని మోయాలి. ఇది జర్మనీ ప్రభుత్వ రుణంలో ఆరు శాతం. అదేవిధంగా ఫ్రాన్స్‌ 143 బిలియన్‌ డాలర్ల భారం, ఇటలీ 122 బిలియన్‌ డాలర్ల భారాన్ని మోయాలి. మిగిలిన దేశాలు కూడా ఇదే తరహాలో తమవంతు భుజాన్ని అరువు ఇవ్వాల్సి ఉంటుంది. తత్పర్యవసానంగా ఆయా దేశాల ఆర్థిక వ్యవహరాలను ఈ ప్యాకేజీ ప్రభావితం చేయనున్నాయి. ఏ విధంగా చూసుకున్నా గ్రీసు పరిరక్షణతో ప్రారంభమైన యూరోజోన్‌ చర్యలు చివరకు యూరో పరిరక్షణ భారాన్ని మొత్తం ప్రపంచ దేశాల నెత్తిన పెట్టాయి.

యూరోపియన్‌ బెయిలవుట్‌కు ఎవరు ఎంత చెల్లించారు ?

యూరోప్‌ ఆర్థిక స్థిరత్వానికి గాను యూరోపియన్‌ యూనియన్‌ నిధి నుండి 60 బిలియన్‌ యూరోలు కేటాయింపు

ఈ స్థిరత్వాన్ని సాధించేందుకు సభ్య దేశాలు అందరూ 440 బిలియన్‌ యూరోల విలువైన రుణాలు మంజూరు చేయాలి.

250 బిలియన్‌ యూరోల నిధిని ఐఎంఎఫ్‌ సమకూర్చాలి.

ఈ విధంగా ఏర్పాటైన నిధినుండి ఏ దేశమైనా సహాయం పొందాలంటే సదరు దేశం ఐఎంఎఫ్‌ కనుసన్నల్లో సంస్కరణలు అమలు చేయాలి.

యూరోపియన్‌ సెంట్రల్‌ బ్యాంకు యూరో సభ్య దేశాల బాండ్లను కొనుగోలు చేస్తుంది.

బాండ్‌ మార్కెట్‌లో కదలిక తెచ్చేందుకు రేటింగ్‌ ఏజెన్సీల ప్రమాణాలను తిరస్కరించి కొనుగోళ్లు చేయటానికి అంగీకారం కుదిరింది.

అయితే ఈ చర్యలు యూరో జోన్‌కు స్థిరత్వాన్ని సాధిస్తాయా అన్నది కీలక ప్రశ్న.

No comments: