PRajasakti May3th 2010
గ్రీసులో నెలకొన్న ఆర్థిక సంక్షోభం మొత్తం యూరోపియన్ యూనియన్‌ను ముంచెత్తనుంది. ఐఎంఎఫ్, ప్రపంచబ్యాంకులు ఏటా ఏప్రిల్‌లో జరిపే సమావేశాలు ఈ సారి ఏప్రిల్ 23-24 తేదీల్లో ముగిశాయి. మొదట్లో గ్రీసును ఆర్థిక సంక్షోభం నుండి ఆదుకోవటానికి అభ్యంతరాలు తెలిపిన జర్మనీ ఎట్టకేలకు తమ వంతు వాటా అందిస్తామని ప్రకటించింది. మొత్తం గ్రీసు రుణాలు 300 బిలియన్ యూరోలు. దీనిమీద ప్రతి ఏడాదీ పెరుగుతున్న వడ్డీ భారం 54 బిలియన్ యూరోలు. ఇది కాక బాండ్ల మీద చెల్లించాల్సింది షుమారు 45 బిలియన్ యూరోలు. ఇందులో మే మాసం చివరికి 8.5 బిలియన్ యూరోలు చెల్లించాల్సి ఉంది. ఇవన్నీ కలుపుకుని చూస్తే గ్రీసు బడ్జెట్‌లోటు 13 శాతానికి పైమాటే. యూరోపియన్ యూనియన్ పదకొండేళ్ల క్రితం ఉమ్మడి కరెన్సీకి సంబంధించిన విధి విధానాలు రూపొందించేటపుడు ఒక ఒప్పందం కుదుర్చుకొంది. దీన్నే మాస్ట్రిచ్ ఒప్పందం అంటారు. ఈ ఒప్పందం ప్రకారం యూరోపియన్ యూనియన్‌లో చేరి ఉమ్మడి కరెన్సీగా యూరోను అంగీకరించిన దేశాలు తమ బడ్జెట్ లోటును సగటున మూడు శాతానికి మించకుండా చూసుకోవాలి. ఇటువంటిదే మన దేశంలో ఎన్డీయే ప్రభుత్వం ఆమోదించిన ఎప్‌ఆర్‌బిఎం చట్టం. గ్రీసు తక్షణం ఎదుర్కొంటున్న సంక్షోభం నుండి బయటపడేయటానికి కావల్సిన నిధులు 145 బిలియన్‌లు. పెట్టుబడిదారీ విధానం ఎదుర్కొంటున్న సంక్షోభం నుండి గట్టెక్కటానికి షుమారు 5 ట్రిలియన్ డాలర్లు నిధులు వివిధ రూపాల్లో కుమ్మరించిన సంపన్న దేశాలు, సంపన్నులమవుదామనుకుంటున్న దేశాలు గ్రీసును ఆదుకోవటానకిఇ 145 బిలియన్ యూరోల నిధిని సమీకరించలేకపోవటం ఆశ్చర్యంగా ఉంది.
యూరోపియన్ యూనియన్ ముందు నేడు రెండు ప్రత్యామ్నాయాలు ఉన్నాయి. గ్రీసును దివాళా తీయించటం ఒకటి. గ్రీసును ఆదుకోవటం ద్వారా గ్రీసు ఆర్థిక వ్యవస్థ ఎదుర్కొంటున్న సంక్షోభాన్ని యూరోపియన్ దేశాలన్నీ పంచుకోవటం మరోటి. ఈ రెండు ప్రత్యామ్నాయాల్లో దేన్ని ఎంచుకోవాలన్న విషయంలో యూరోపియన్ యూనియన్ దేశాల మధ్య తర్జనభర్జనలు సాగుతున్నాయి. ప్రశ్చన్న యుద్ధ కాలంలో వివిధ దేశాల మధ్య కుదిరిన నాటో, సీటో, సెంటో రక్షణ ఒప్పందాలు మనకు తెలుసు. ఈ ఒప్పందాల ప్రకారం సదరు కూటముల్లో ఏ ఒక్క సభ్యదేశమైనా శతృదాడిని ఎదుర్కొంటున్న పక్షంలో మిగిలిన అన్ని దేశాలు దాడికి గురవుతున్న దేశానికి రక్షణగా నిలవాలి. కుడి ఎడంగా ఇదే సూత్రాల మీద ఆధారపడి ఉనికిలోకి వచ్చినవే ప్రాంతీయ ఆర్థిక మండళ్లు. ఇందులో యూరోపియన్ యూనియన్ ఆవిర్భావానికి 1970 దశకం నుండీ పెద్దఎత్తున కృషి సాగితే ఉత్తర అమెరికా స్వేఛ్చా వాణిజ్య ఒప్పందం 90లలో ముందుకొచ్చింది. మిగిలిన ప్రాంతీయ కూటములు సార్క్, ఏషియాన్, జి8+వంటివి ప్రధానంగా రాజకీయ కూటములుగానే ఉన్నాయి. పరిపూర్ణమైన ఆర్థిక కూటమిగా యూరోపియన్ యూనియన్ ఆవిర్భవించింది. తద్వారా ఈ యూనియన్‌లోని సభ్యదేశాలన్నీ ఉమ్మడి బ్యాంకు, ఉమ్మడి కరెన్సీ, ఉమ్మడి ఆర్థిక విధానాల ప్రాతిపదికన ముందుకు సాగుతున్నాయి. ఈ ఒప్పందం వెనుక ఉన్న సైద్ధాంతిక ప్రాతిపదిక పెట్టుబడిదారీ విధానం అజేయం అన్న భావన. ప్రత్యేకించి 90 దశకంలో తూర్పు యూరప్ దేశాల్లో సోషలిస్టు రాజ్యాలు పతనం అయిన తర్వాత ఈ భావన మరింత వేళ్లూనుకొంది. దాంతో అప్పటి వరకు నత్తనడక నడుస్తూ వచ్చిన యూరోపియన్ యూనియన్ భావన అంగలు పంగల మీద ఒక కొలిక్కి వచ్చింది. దానికనుగుణంగానే విధి విధానాలు రూపొందాయి. ఈ పరిస్థితుల్లో గ్రీసును ఒంటరిగా దివాళా తీయించటం ఇయు కోసం ఏర్పాటు చేసుకున్న చట్రం పరిధిలో సాధ్యం కాదు. అలా చేయటం అంటే సభ్య దేశాల ఆర్థిక స్థిరత్వానికి ఇయు హామీ ఇవ్వలేదన్న సారాంశాన్ని ప్రపంచానికి తెలియచేయటమే. ఇదే జరిగితే అమెరికా, డాలర్ ఆర్థిక శక్తి సామర్థ్యాలకు దీటుగా తెరమీదకు వస్తుందనుకున్న యూరో, యూరోపియన్ యూనియన్ భవిష్యత్తు ప్రశ్నార్థకం అవుతుంది. అంతర్జాతీయంగా దీని పర్యవసానాలు తీవ్రంగా ఉండనున్నాయి.
మిగిలింది అమెరికా సంక్షోభ భారాన్ని ప్రపంచం మొత్తం పంచుకున్నట్లుగా గ్రీసు సంక్షోభ భారాన్ని యూరోపియన్ దేశాలు పంచుకోవటం. అలా చేయాలంటే అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థతో పాటు యూరోపియన్ యూనియన్ కూడా కొంత భారాన్ని భరించాలి. ఇయులో సభ్య దేశాల హౌదాకు అనుగుణంగా ఈ భారాల పంపకం ఉంటుంది. అంటే ఈ భారంలో సింహభాగం జర్మనీ భరిస్తే, తదుపరి ముఖ్యవాటాలు ఫ్రాన్స్, బ్రిటన్ వంటి దేశాలు పంచుకోవాలి. అంటే ఈ దేశాలు తమ జాతీయ అవసరాల కోసం కేటాయించుకున్న నిధుల్లో కొంత మొత్తాన్ని తగ్గించి గ్రీసుకు రుణాలు ఇవ్వాలి. దీనివల్ల ఆయా దేశాల్లో సామాజికరంగ వ్యయం తగ్గిపోవటం అనివార్యం. అంతేకాదు. ఈ దేశాల బ్యాంకుల్లో గ్రీసును దివాళా తీయించిన బాండ్లు వచ్చి చేరతాయి. తద్వారా ఆయా దేశాల బ్యాంకింగ్ వ్యవస్థల సామర్థ్యం తగ్గిపోతుంది. దీని ప్రభావం అంతర్జాతీయ ద్రవ్యరంగంపైనా పడుతుంది.
ఈ రెండింటిలో ఏ నిర్ణయానికి వచ్చినా ముప్పు అనివార్యం. అందువల్లనే ఈ ముప్పు గురించి యూరోపియన్ దేశాల ప్రజలు చర్చించకుండా చేయటానికి గ్రీసు ప్రభుత్వం మాస్ట్రిచ్ ఒప్పందాన్ని అమలు చేయాలని, బడ్జెట్‌లోటును 3 శాతానికి తగ్గంచాలని అటు ఐఎంఎఫ్, జర్మనీలు ఒత్తిడి తెస్తున్నాయి. 13 శాతంగా ఉన్న బడ్జెట్ లోటును ఒక్కసారిగా 3 శాతానికి తగ్గించటం అంటే సామాజిక, రక్షణ రంగాల్లో ప్రభుత్వ కేటాయింపులు పెద్దఎత్తున కోతకు గురికావాలి. కనీసం 70 శాతం వరకూ ఈరంగాల్లో వ్యయం తగ్గించుకోవాల్సి ఉంటుంది. ఇప్పటికే పదిశాతానికిపైగా ఉన్న నిరుద్యోగం మరింత పెరగటం ఖాయం. ఐఎంఎఫ్ మాజీ అధ్యక్షుడు కెన్నెత్ రోగాఫ్ '' గ్రీసు ప్రభుత్వం ఈ చర్యలు తీసుకోకపోతే అంతర్జాతీయ ద్రవ్యపెట్టుబడిని ఒప్పించటం సాధ్యం కాదు. ఈ విషయంలో ప్రభుత్వం మీన మేషాలు లెక్కించటం వల్లనే స్టాండర్డ్ మరియు పూర్ రేటింగ్ సంస్థ గ్రీసు ప్రభుత్వ బాండ్లను చిత్తుకాగితాల కోవలోకి చేర్చింది. ఈ సంస్కరణలు చేపట్టనిదే ఐఎంఎఫ్ కూడా నిధులు విడుదల చేయటం సాధ్యం కాదు'' అని ప్రకటించారు. గ్రీసు ఆర్థిక వ్యవస్థ ఐఎంఎఫ్ చేతుల్లో పునర్వవస్థీకరణకు గురవటం అంటే 70 దశకం నుండి వర్ధమాన దేశాలు అమలు జరిపిన ఆర్థిక సంస్కరణలను గ్రీసు అమలు జరపటమే. దీని పర్యవసానం రాజకీయ అస్థిరతకు దారితీస్తుందని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. పైగా ఈ సంస్కరణలను దేశీయంగా కొనుగోలుశక్తిని మరింత తగ్గించి వేస్తాయి. దాంతో గ్రీసు ఆర్థిక వ్యవస్థ 70,80 దశకాల్లో అర్జెంటీనా ఆర్థిక వ్యవస్థ తరహాలో అంతర్జాతీయ ద్రవ్య సంస్థల దయా దాక్షిణ్యాలపై ఆధారపడాల్సి ఉంటుంది.
ఏ రకంగా చూసుకున్నా గ్రీసు ఆర్థిక సంక్షోభం ప్రపంచాన్ని కమ్ముకున్న పెట్టుబడిదారీ ఆర్థిక సంక్షోభంలో ఒక కీలకమైన మలుపుగా నిలవబోతోంది. అంతర్జాతీయ విశ్లేషకులు, ప్రపంచ బ్యాంకు, ఐఎంఎఫ్ వంటి సంస్థలతో సహా ఇప్పుడిపుడే ప్రపంచ ఆర్థిక వ్యవస్థ 2007 నాటి సంక్షోభం నీడ నుండి బయటకు వస్తోందని అంచనా వేస్తున్నారు. గ్రీసు పరిణామాలు, గ్రీసు పరిణామాలనే పోలిన పోర్చుగల్, స్పెయిన్, ఐర్లండ్, ఇటలీ ( ఈ దేశాల మొదటి అక్షరాలను ఒక చోట చేర్చి పిగ్స్ అని పిలుస్తున్నారు.) దేశాల పరిణామాలు పెట్టుబడిదారీ వ్యవస్థ పునరుత్థానంపై కీలకమైన ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి.
Monday, May 3, 2010
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment