Monday, May 10, 2010

జాతీయ సహజవనరుల వినియోగ విధానం కావాలి

నాలుగేళ్ల పాటు కోర్టుల్లోనూ, ఆరేళ్లకుపైగా కుటుంబవివాదాల్లోనూ మగ్గిన కెజి బేసిన్‌ గ్యాస్‌ ధర వివాదం ఎట్టకేలకు ఒక కొలిక్కి వచ్చింది. కుటుంబ వివాదం, ప్రభుత్వ నిర్వాకం, అధికారుల కుమ్మక్కు, కంపెనీల లాభాపేక్ష కలిసి కెజి బేసిన్‌ గ్యాస్‌ ధర నిర్ణయించే ప్రక్రియను వివాదాస్పదంగా మార్చాయి. ఈ తెరలన్నీ తొలగిస్తూ శుక్రవారం నాడు అత్యుతన్నత న్యాయస్థానం రెండు విషయాలు స్పష్టం చేసింది. మొదటిది, కార్పొరేట్‌ రంగంలో కుటుంబ వివాదాలు న్యాయ వ్యవస్థ పరిధిలోకి రావని ప్రకటించటం మొదటిది కాగా జాతీయ సహజసంపదపై సంపూర్ణ హక్కు ప్రభుత్వానిదేనని, ప్రజా ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకుని వాటిని సమగ్రంగా వినియోగించుకునేందుకు విధానం రూపొందించే హక్కు ప్రభుత్వానికి ఉందన్న రూలింగ్‌ రెండోది. ఈ తీర్పుపై వచ్చిన వ్యాఖ్యానాలు గమనిస్తే ఆశ్చర్యం కలుగుతుంది. మొదటిగా కుటుంబ వివాదాలు ప్రత్యేకించి ఆస్తి వివాదాలు, ఒప్పందాలు న్యాయవ్యవస్థ పరిధిలోకి వస్తాయా రావా అన్న ప్రశ్నను తీసుకుందాం.

ప్రతి కుటుంబంలోనూ ఆస్తి పంపకాలు జరుగుతాయి. ఇదేమీ కొత్త కాదు. ప్రతి కుటుంబంలోని తల్లిదండ్రులు పిల్లలకు తలో వాటా అప్పగిస్తూ వీలునామా రాయటం కూడా కొత్తేమీ కాదు. వారసత్వపు హక్కు చట్టబద్ధమే. ఒక వేళ తల్లితండ్రులు వీలునామా రాయకుండా గతించిన పక్షంలో వారసత్వ హక్కు చట్టం ద్వారా ఆస్తివివాదాలు పరిష్కరించుకోవటం మనం చూస్తూనే ఉన్నాము. ఇటువంటి విషయాల్లో వీలునామా, లేదా ఒక ఒప్పందం ఉండీ కూడా వివాదాలు వచ్చినపుడు పరిష్కరించుకోవటానికి ఈ వీలునామా, ఒప్పందం ఒక్కటే ఆధారం. దేశంలోని న్యాయస్థానాల్లో జరుగుతున్న సివిల్‌ దావాల్లో అత్యధికం అటువంటివే. చివరకు కుటుంబ సభ్యులు ఒక అంగీకారానికి వచ్చి రాజీ పడటమో లేదా కోర్టు ఇచ్చిన తీర్పు ఆధారంగా నడుచుకోవటమో జరుగుతుంది.ఇది నిత్యం మనం చూస్తున్న విషయం. మరి అంబానీల కుటుంబ ఒప్పందం మాత్రం న్యాయ వ్యవస్థ పరిధిలోకి రాదని అత్యున్నత న్యాయస్థానం ఎందుకు భావించిందో ధర్మాసనంలో కూర్చున్న ముగ్గురు న్యాయమూర్తులకే తెలియాలి. ఇదే సూత్రం అయితే కుటుంబాల్లోని ఆస్తి వివాదాలన్నింటినీ న్యాయవ్వవస్థ పరిధి నుండి మినహాయించొచ్చు కదా!


ఇక రెండో విషయాన్ని పరిశీలిద్దాం. 2008లో ఈ వివాదంపై పెద్దఎత్తున పార్లమెంట్‌లో చర్చ జరిగేవరకూ ప్రభుత్వం కెజి బేసిన్‌ గ్యాస్‌ ధర విషయంలో తాను నిమిత్తమాత్రురాలేనన్న వాదన ఎత్తుకొంది. పార్లమెంట్‌లో ప్రతిపక్షాలు నిలదీసిన తర్వాత గానీ ప్రకృతివనరులన్నింటిపై ప్రభుత్వానిదే సంపూర్ణ హక్కు అని పెట్రోలియం మంత్రి ప్రకటించాల్సి వచ్చింది. రాజ్యాంగాన్ని తిరగేసిన వారికెవరికైనా ఒక దేశంలోని ప్రకృతి వనరులు ఆ దేశ సార్వభౌమత్వం పరిధిలోనే (చట్టం పరిభాషలో దీన్నే సావరిన్‌ డొమెయిన్‌ అంటారు) ఉంటాయన్నది ఇట్టే తెలిసిపోతుంది. ఈ విషయాన్ని గుర్తు చేసుకోవటానికి సుప్రీం కోర్టు నాలుగేళ్ల పాటు మేథో మథనం చేస్తే గానీ మనం తెలుసుకోలేని పరిస్థితి లేదు. అయినా ప్రభుత్వం ఈ హక్కును వినియోగించుకోవటంలో, అధికారాన్ని ప్రదర్శించటంలో నీళ్లునములుతూ వచ్చింది. అదే జాతీయ రహదారులకు అవసరమైన స్థల సేకరణ విషయంలో ప్రజల అభిప్రాయాలకు వీసమెత్తు విలువ ఇవ్వని ప్రభుత్వం కెజి బేసిన్‌ గ్యాస్‌ విషయంలో మాత్రం అంబానీ అభిప్రాయానికి ఎదురు తిరిగి పల్లెత్తు మాట అనేకలేకపోయింది. ఎట్టకేలకు సుప్రీం కోర్టు ముందుకొచ్చి '' ప్రభుత్వాధినేతలూ, ఇవీ మీ హక్కులు, అధికారాలు'' అని గుర్తు చేయాల్సి వచ్చింది. తీర్పు వచ్చిన తర్వాత ''మా మాటే నెగ్గింది'' అని ప్రభుత్వం చంకలు కొట్టుకుంటోంది. ఒకసారి ప్రకృతి వనరుల విషయంలో ప్రభుత్వం సంపూర్ణహక్కుదారు అని అంగీకరించిన తర్వాత దాని వెన్నంటే మరో ప్రశ్న తలెత్తుతోంది. అటువంటి ప్రకృతివనరుల వినియోగంలో ప్రభుత్వ పాత్రకు సంబంధించిన ప్రశ్న అది.

ప్రభుత్వం నిర్దిష్టవనరుపై తన హక్కును గుర్తించటంతో పాటు దాన్ని విశాల ప్రయోజనాల దృష్ట్యా వినియోగించటానికి అవసరమైన విధి విధానాలు రూపొందించాల్సిన బాధ్యత కూడా దానిపై ఉంటుంది. ఈ విషయాన్ని కూడా ప్రభుత్వానికి సుప్రీం కోర్టు గుర్తు చేయాల్సి రావటం చూస్తుంటే ప్రభుత్వం ఎంత బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తుందో అర్థం చేసుకోవచ్చు. ఈ బాధ్యతారాహిత్యం ఒక్క గ్యాస్‌ కేటాయింపులు విషయంలోనే కాదు. టెలికాం రంగానికి ప్రాణవాయువులాంటి స్పెక్ట్రం, ఇంధనవనరుల రంగానికి కీలకమైన బొగ్గు, జలవనరులు విషయంలోనూ కనిపిస్తోంది. ఒక్క 3జి సేవలు వేలం వేయటం ద్వారా ప్రభుత్వం ఇప్పటి వరకూ 40 వేల కోట్లకు పైగా ఆదాయం పొందింది. అదే రీతిలో 2జి స్పెక్ట్రం సేవలు వేలం వేసి ఉంటే కనీసం 20 వేల కోట్ల రూపాయల ఆదాయం అయినా వచ్చి ఉండేది. బొగ్గు గనుల కేటాయింపులోనూ ఇదే సూత్రం వరిస్తుంది. ఇంతటి ఆదాయ మార్గాలు అవినీతిపరుల పాలుజేసి ప్రభుత్వ నిర్వహణకు అవసరమైన నిధుల సమీకరణకు ప్రజలపై భారాలు పెంచాలని ప్రభుత్వం వాదించటం సిగ్గు చేటు. తిరిగి విషయానికి వద్దాం.

ప్రపంచీకరణ నేపథ్యంలో ప్రైవేటు రంగం ప్రత్యేకించి గుత్తపెట్టుబడిదారుల శక్తి సామర్ధ్యాలు భారీఎత్తున పెరిగాయి. దాంతో పాటే ప్రభుత్వ విధానాలను ప్రభావితం చేసే శక్తికూడా పెరిగింది. దీనికి అనేక మార్గాల్లో పని చేస్తాయి గుత్తపెట్టుబడిదారీ సంస్థలు. వీటికి అంతర్జాతీయ ద్రవ్య పెట్టుబడి తోడైతే ఇక చెప్పేదేముంది ! ప్రభుత్వాలకు వాళ్లు చెప్పిందే వేదం. చేసిందే వాదం. ఈ మాయలో పడిన ప్రభుత్వాలు చివరకు తమ హక్కులు, అధికారాలు వదులుకునేందుకు కూడా సిద్ధం అవుతున్నాయి. కెజి బేసిన్‌ గ్యాస్‌ ధర నిర్ధారణ విషయంలోనూ అదే లక్షణం కనిపిస్తోంది. రానురాను విద్యుత్పత్తిలో గ్యాస్‌ పాత్ర పెరుగుతుందన్న విషయం ప్రభుత్వానికీ తెలుసు. అటువంటి గ్యాస్‌ నిక్షేపాలు పరిమితంగా ఉన్నాయనీ తెలుసు. అటువంటి పరిమిత సహజవనరులను ప్రజా ప్రయోజనాల దృష్టితో ఉపయోగించాలే తప్ప ఒకటో రెండో కార్పొరేట్‌ సంస్థలకు సర్వాధికారాలు కట్టబెట్టే ప్రయత్నం తప్పని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. ఆర్థిక వ్యవస్థపై కార్పొరేట్‌ రంగానికి సంపూర్ణాధికారం ఇచ్చేందుకు ప్రపంచీకరణ విధానాలు మరింత ఊపు తెస్తాయి. ఇటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వాలు తమ హక్కులు, బాధ్యతలు తెలుసుకొని ప్రవర్తించాలని సుప్రీం కోర్టు హెచ్చరిక సమకాలీన ప్రాధాన్యత కలిగి ఉంటుంది. అంతేకాదు. ఒకప్పుడు ప్రైవేటురంగానికి అవధుల్లేని స్వేచ్చ కల్పించాలని చెప్పిన సుప్రీం కోర్టు నేడు కీలకమైన సేవలు ప్రభుత్వ రంగంలోనే ఉండాలని కూడా ప్రభుత్వానికి హితవుచెప్పింది.

అనిల్‌ అంబానీ నిర్మించ తలపెట్టిన దాద్రి విద్యుత్‌ కంపెనీకే కాదు. ఆంధ్రప్రదేశ్‌లోని పలు విద్యుత్‌ ఉత్పత్తి కేంద్రాలతో మొదలు పెట్టి నవరత్న కంపెనీ ఎన్టీపిసీ నిర్మిస్తున్న విద్యుత్‌ ఉత్పత్తి కేంద్రాలకు కూడా గ్యాస్‌ ఇంధనం అవసరం. అటువంటపుడు ముఖేష్‌ అంబానీకే ఈ గ్యాస్‌పై సంపూర్ణ హక్కులు కట్టబెట్టటం ఎంతవరకు సబబో ప్రభుత్వం ఆలోచించాలి. ప్రైవేటు కంపెనీలు ఉత్పత్తి వ్యయాన్ని ఎక్కువ చేసి చూపించటం ఇదే మొదటిసారి కాదు. అందులోనూ ప్రభుత్వానికి సరఫరా చేయటం అనేసరికి ఉత్పత్తి వ్యయం ఒక్కసారిగా వందరెట్లు కూడా పెరుగుతుంది. ముఖేష్‌ అంబానీ కంపెనీ కూడా అదే తరహాలో వ్యయం ఎక్కువ చేసి చూపింది. ప్రభుత్వం అంగీకరించింది. దాంతో షుమారుగా మూడు డాలర్లుగా ఉన్న టన్ను గ్యాస్‌ ధర ఒక్కసారిగా దాదాపు 9 డాలర్లకు చేరింది. దాంతో గ్యాస్‌ ఆధారిత విద్యుత్‌ ఉత్పత్తి వ్యయం ఒక్కసారిగా మూడు వందల రెట్లు పెరిగింది. ఈ భారం తిరిగి ప్రజల నెత్తినే పడుతుంది. ఈ విషయాన్ని గుర్తించటంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. ఇప్పటికైనా కాలం మించి పోలేదు. సుప్రీం కోర్టు తీర్పు నేపథ్యంలో అంబానీ సోదరులు తమ మధ్య ఒప్పందాన్ని పున:సమీక్షించుకుంటున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్లు తెరవాలి. విశాల దేశ ప్రయోజనాలు గమనంలో కి తీసుకుని గ్యాస్‌ ధర నిర్ణయించటానికి ఆర్‌ఐఎల్‌ కంపెనికి ఇచ్చిన విచ్చల విడి అధికారాలను సమీక్షించాలి. దానికి గాను ప్రభుత్వం ముందుగా సహజవనరుల వినియోగానికి సంబంధించి నిర్దిష్ట ప్రమాణాల ఆధారంగా ఒక జాతీయ విధానాన్ని రూపొందించాలి. ఈ విధానం పరిధిలో ప్రకృతివనరుల ధరవరల నిర్ణయం జరగాలి. అపుడే ప్రజానీకం ధరల భారం నుండి కాస్తయినా ఊపిరి పీల్చుకోగలుగుతుంది.


కొండూరి వీరయ్య

No comments: