Monday, June 14, 2010

డెరివేటివ్స్‌ : ఒక పరిచయం Share Buzz up! మార్క్సిస్టు Thu, 3 Jun 2010, IST

కొండూరి వీరయ్య, డా|| బి. గంగారావు

డెరివేటివ్స్‌ అంటే ఒకరకమైన బొమ్మా బొరుసు పందెం కాయటం. ఈ పందెం ఎందువల్ల కాయల్సి వస్తుంది? అసలు అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ పందేలు కాయటంపై ఎందుకు ఆధారపడాల్సి వచ్చింది? నేడు మనం చూస్తున్న ప్రపంచీకరణ ఆర్థిక విధానాలకూ, ఈ డెరివేటివ్స్‌కు మధ్య ఏమైనా సంబంధం ఉందా? భారత ఆర్థిక వ్యవస్థలో డెరివేటివ్స్‌ మార్కెట్‌ పాత్ర ఏమిటి?

ఆర్థిక వ్యవహారాలు రోజువారీ పరిశీ లించే వారికి నేడు నిత్యం వినిపించే పదం డెరివేటివ్స్‌. రెండేళ్ల క్రితం వరకూ అంతర్జాతీయ మార్కెట్‌ విశ్లేషకులు, దేశీయంగా ఆర్థిక రంగ నిపుణులు, ప్రభుత్వ విధాన రూపకర్తలకు పరిమి తం అయిన డెరివేటివ్స్‌ చర్చ నేడు సర్వసాధా రణంగా మారింది. ప్రత్యేకించి పెట్టుబడిదారీ వ్యవస్థ సంక్షోభంలో కూరుకుపోయిన గత రెండేళ్లుగా ప్రపంచం డెరివేటివ్స్‌ గురించి విస్తృతంగా అధ్యయనం చేస్తోంది. గత మూడేళ్లుగా విరామ లేకుండా పెరిగిపోతున్న ధరలకూ, అంతర్జాతీయంగా పుంజుకుంటున్న డెరివేటివ్స్‌ వాణిజ్యానికీ మధ్య విడదీయరాని సంబంధం ఉంది. అమెరికా సంక్షోభానికి- డెరివేటివ్స్‌ వాణిజ్యానికీ మధ్య సంబంధం ఉంది.

డెరివేటివ్స్‌ అంటే ఒకరకమైన బొమ్మా బొరుసు పందెం కాయటం. ఈ పందెం ఎందువల్ల కాయల్సి వస్తుంది? అసలు అంత ర్జాతీయ ఆర్థిక వ్యవస్థ పందేలు కాయటంపై ఎందుకు ఆధారపడాల్సి వచ్చింది? నేడు మనం చూస్తున్న ప్రపంచీకరణ ఆర్థిక విధానాలకూ, ఈ డెరివేటివ్స్‌కు మధ్య ఏమైనా సంబంధం ఉందా? భారత ఆర్థిక వ్యవస్థలో డెరివేటివ్స్‌ మార్కెట్‌ పాత్ర ఏమిటి? అన్న విషయాలు తెలుసుకునేందుకు ప్రయత్నిద్దాం.

ప్రాథమిక పరిచయం

పెట్టుబడి లాభాన్ని ఆశిస్తుంది. వెచ్చించిన రూపాయి ఉత్పత్తి దశ దాటి సరుకు రూపంలో మార్కెట్‌లోకి వెళ్లి తిరిగి లాభం రూపంలో పెట్టుబడిదారుడిని చేరుకోవటమే ఆర్థికవ్యవస్థ సారాంశం. ఈ మొత్తం వలయం పూర్తయ్యే లోపు అనేక అవాంతరాలు ఎదురవుతాయి. వీటినే వాణిజ్యపరిభాషలో రిస్క్‌ అంటారు. ఏ వ్యాపారంలోనైనా రిస్క్‌ ఉంటుంది. ఈ రిస్క్‌ మార్కెట్‌ కారణాల వల్ల కావచ్చు. మార్కెటేతర కారణాల వల్ల కావచ్చు. ప్రకృతిపరమైన కారణాలు కావచ్చు. ఏ వ్యాపారాన్ని ప్రారంభిం చటానికైనా ముందు ఆ వ్యాపారంలో రిస్క్‌ ఎంత ఉంది, ఎంత మేర లాభాలు సంపాదించ వచ్చు, రిస్క్‌ ఎదురైతే బయటపడే మార్గాలు ఏమిటి అన్నది ఆలోచించటం వ్యాపారస్తుల సహజలక్షణం. ఈ లక్షణంతో తీసుకునే జాగ్ర త్తల పర్యవసానంగా అనేక నూతన వాణిజ్య పద్ధతులు, విధి విధానాలు, సరుకులు తెరమీ దకు వచ్చాయి. ఉదాహరణకు బీమా. జీవిత బీమా గురించి మనందరికీ తెలుసు. ఒక వ్యక్తికి జీవితంలో ఎదురయ్యే రిస్క్‌ ప్రభావం కుటుం బం మీద పడకుండా ఉండేందుకు జీవిత బీమా పాలసీ తీసుకోవటం సర్వసాధారణంగా మనం చూస్తున్నాము. పంటల బీమా గురించి కూడా మనం విన్నాము. చూస్తున్నాము. ప్రకృతి వైపరీ త్యాల వల్ల నష్టం జరిగినపుడు రైతుకు నష్టపరిహారం చెల్లించేందుకు వీలుగా ప్రభుత్వం ఏర్పాటు చేసే పథకాలు ఇవి. అదేవిధంగా సరుకుల వాణిజ్యంలోనూ ఉంటుంది. నౌకా వాణిజ్యంలో ఎదురయ్యే ప్రమాద నష్టాలు నుండి బయటపడేందుకు వ్యాపారులు, బ్యాం కులకు ప్రీమియం చెల్లించి సరుకులకు బీమా తీసుకుంటారు. ఈ విధంగా ఉనికిలోకి వచ్చిందే ఫ్యూచర్స్‌ ట్రేడింగ్‌. అంటే ఫలానా సంవత్సరం, ఫలానా రోజుకు ఫలానా సరుకు ధర ఇంత ఉంటుందని ఇప్పుడే అంచనాకు వచ్చి సదరు భవిష్యత్తు సరఫరాకు సంబంధించి ఇపుడే ఒప్పందం కుదుర్చుకోవటం. ఇది డెరివేటివ్స్‌లో ఒక లక్షణం మాత్రమే. ఇటువంటి ఒప్పందాలు క్రీస్తు పూర్వం 17వ శతాబ్దికి చెందిన మెసప టోమియా నాగరికత కాలం నుండీ అమల్లో ఉన్నాయని చరిత్రకారులు చెబుతున్నారు. అయితే అవి కేవలం ప్రకృతి వైపరీత్యాల కార ణంగా తలెత్తే నష్టాలనుండి వ్యాపారాలను కాపాడుకోవటానికి అమల్లోకి వచ్చిన ప్రత్యా మ్నాయ మార్గాలు. ఈస్టిండియా కంపెనీ పాలనలో మన దేశంలో కూడా అటువంటి ఒప్పందాలు అమల్లో ఉండేవి. వీటిని ఫ్యూచర్స్‌ అనే వారు. అయితే ఆధునిక పెట్టుబడిదారీ విధానం అభివృద్ధి చెందక ముందు మనం చూసిన ఫ్యూచర్స్‌ ట్రేడింగ్‌కు నేడు మనం చూస్తున్న పరిణామం పూర్తిగా విభిన్నమైనది. అందుకు దారితీసిన పరిస్థితుల గురించి క్లుప్తంగా తెలుసుకుందాం.

డెరివేటివ్స్‌ భావనను విస్తృత పర్చిన ప్రపంచీకరణ

19వ శతాబ్దం చివరి భాగం, 20వ శతా బ్దంలో మూడొంతుల కాలం ప్రధానంగా ప్రభు త్వ యాజమాన్యంలో ఆర్థిక వ్యవస్థ సాగింది. దీంతో ఇటువంటి ఆకస్మిక నష్టాలకు అవకాశం తగ్గిపోయింది. అంతర్జాతీయంగా కూడా నికరమైన వడ్డీరేట్లు ఉన్నాయి. ప్రభుత్వమే పెట్టు బడిసమీకరణ సాధనంగా మారింది. అటువంట పుడు డెరివేటివ్స్‌ అవసరం తగ్గిపోయింది. ఈ కాలంలో అంతర్జాతీయ ఆర్థిక, ద్రవ్య మార్కెట్లలో చెప్పుకోదగ్గ స్థాయిలో స్థిరత్వం ఉంది. కానీ 1970 దశకం నుండీ అంతర్జాతీయ ఆర్థిక చట్రంలో వచ్చిన మార్పులు, సామ్రాజ్యవాద ప్రపంచీకరణ నేపథ్యంలో ఈ స్థిరత్వానికి కాలం చెల్లింది. తొలుత బంగారం స్థానంలో డాలర్‌ అంతర్జాతీయ కరెన్సీగా రూపుదాల్చింది. దాంతో పాటు వివిధ దేశాల ద్రవ్యమార్కెట్లలో ప్రభుత్వం పాత్ర గణనీయంగా తగ్గిపోతూ వచ్చింది. సుమారు మూడు దశాబ్దాల పాటు దేశీయ ఆర్థిక అవసరాల రీత్యా నిలకడగా సాగిన వడ్డీ రేట్లు నిలకడతనం కోల్పోయాయి. తొలుత ఏడాది కొకసారి మారటం ప్రారంభించిన వడ్డీ రేట్లు నేటికి మూడు నెల్లకొకసారి మారిపోతూ ఉన్నాయి. అంతర్జాతీయ వాణిజ్యంలో వేగం పెరి గింది. రాత్రికి రాత్రి శతకోట్ల డాలర్లు చేతులు మారుతున్నాయి. దాంతో స్పాట్‌ వ్యాపారం గణనీయంగా విస్తరించింది. ఉదాహరణకు బ్యాంకులు వినియోగదారులకు ఇచ్చే రుణాలపై వడ్డీ నిర్ణయించే విధానాన్నే తీసుకోండి. పాతికేళ్ల క్రితం లక్ష రూపాయలు నాలుగు సంవత్సరాలకు అప్పు తీసుకుంటే నాలుగేళ్ల పాటూ ఒకే వడ్డీ రేటు అమలయ్యేది. కానీ నేడు రెండు రకాల వడ్డీ రేట్లు, స్థిర వడ్డీరేటు, అస్థిర వడ్డీ రేటు వర్తింపచేస్తున్నారు. స్పాట్‌ వడ్డీ రేటు క్రమంగా తెరమీదకు వచ్చింది. వీటన్నింటి పర్యవసానంగా జాతీయ, అంతర్జాతీయ ద్రవ్య మార్కెట్లు, పెట్టు బడి మార్కెట్లలో అస్థిరత వేగం పెరిగింది. పెరుగుతున్న అస్థిరతతో పాటు కొత్త రకాల రిస్కులు తెరమీదకు వచ్చాయి. దాంతో పాటే ఈ రిస్కులను అంచనా వేసి వాటి నుండి తమను తాము కాపాడుకునేందుకు పెట్టుబడిదారులు ప్రయత్నాలు ప్రారంభించారు. ఈ ప్రయత్నాల పర్యవసానంగా తెరమీదకు వచ్చిందే నేడు మనం చర్చించుకుంటున్న డెరివేటివ్స్‌ భావన. తొలుత 1973లో ఫిషర్‌ బ్లాక్‌, మైరోన్‌ ష్కోల్స్‌ అనే ఆర్థికవేత్తలు రిస్కును అంచనా వేసి దానికి వెలకట్టేందుకు కొత్త ఫార్ములా కనిపెట్టారు. ఇదే బ్లాక్‌-ష్కోల్స్‌ ఫార్ములాగా నేడు డెరివేటివ్‌ మార్కెట్లలో చలామణి అవుతుంది. ఈ ఫార్ములాను మార్కెట్‌కు అన్వయించటానికి వీలుగా రూపొందించినందుకు నోబెల్‌ బహు మతి కూడా ప్రకటించారు. స్థూలంగా చెప్పా లంటే అంతర్జాతీయ ద్రవ్య పెట్టుబడి మార్కెట్లో చోటుచేసుకుంటున్న ఉత్థాన పతనాల వలన కలిగే నష్టం నుండి బయటపడేందుకు రూపొం దించిన ప్రక్రియే డెరివేటివ్స్‌.

నిర్వచనం

అంతర్జాతీయంగా డెరివేటివ్స్‌ను నిర్వచిం చేందుకు శతవిధాలా ప్రయత్నం జరుగుతోంది. సామాన్య మార్కెట్‌ పరిభాషలో ఏదైనా సరుకు, వస్తువు, సేవల వర్తమాన విలువకు బదులు భవిష్యత్తు విలువను అంచనా వేసి ఆ విలువపై లావాదేవీలు సాగించటం. ఆర్థిక పరిభాషలో చెప్పాలంటే డెరివేటివ్‌ అంటే మరో సరుకుకు ఫలానా సమయానికి, ఫలానా చోట ఫలానా విలువ ఉంటుందని అంచనా వేయటం. ఆ మేరకు కుదుర్చుకునే వాణిజ్య ఒప్పందాలను డెరివేటివ్‌లు అంటారు. ఏ వాణిజ్య ఒప్పందం లో సరుకుల లావాదేవీలు ఉంటాయో వాటినే ఆధారభూతమైన సరుకు (అండర్‌లయ్యింగ్‌ ఎస్సెట్‌)అంటారు. అటువంటి ఆధారభూతంగా ఉన్న సరుకు ఉత్పత్తి, సరఫరా, వినియోగంలో మారుతున్న విలువతో పాటు డెరివేటివ్‌ విలువ కూడా మారుతూ పోతుంది. డెరివేటివ్స్‌ను నిర్వచించేందుకు 1990 దశకం నుండీ ప్రయ త్నాలు ముమ్మరం అయ్యాయి. 1992లో రూపొందించిన ఫైనాన్షియల్‌ రిస్క్‌ మేనేజిమెంట్‌ డిక్ష్టనరీ నిర్వచనం ప్రకారం డెరివేటివ్స్‌ అంటే వాణిజ్యానికి ఆధారభూతమైన సెక్యూరిటీ, ఫ్యూచర్‌ లేదా ఇతర వాణిజ్య సాధనం విలువతో పాటు విలువ మార్చుకుంటూ పోయే సరళమైన వాణిజ్య ఒప్పందం. 1995లో ఈ నిర్వచనాన్ని మరింత విస్తృతపర్చింది బ్యాంక్‌ ఆఫ్‌ ఇంటర్నే షనల్‌ సెటిల్‌మెంట్స్‌. బిఐఎస్‌ నిర్వచనం ప్రకారం ఆధారభూతమైన వాణిజ్య సరుకు విలువతో పాటు తన విలువ మార్చుకోవటమే కాదు, డెరివేటివ్స్‌లో మౌలిక వాణిజ్య సాధనా లపై పెత్తనం చేతులు మారదు అని వివరిం చింది. మొదటి నిర్వచనంలో లేని యాజమాన్య బదలాయింపు గురించిన స్పష్టత రెండో నిర్వచ నంలో వచ్చింది. ద్రవ్య మార్కెట్‌లో డెరివేటివ్స్‌ పాత్ర పెరిగే కొద్దీ ఈ నిర్వచనం పరిధి కూడా విస్తృతమవుతూ వచ్చింది. చివరిగా 1998లో అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ డెరివేటివ్స్‌ను నిర్వచిస్తూ మరో ద్రవ్య మార్కెట్‌ సాధనంతో అనుసంధానించబడిన ఏ మార్కెట్‌ సాధనాన్నైనా డెరివేటివ్‌గా పిలవవచ్చు అని చెప్పింది. ఇది కేవలం ఒక సూచి, ఇండెక్స్‌ కావచ్చు, సరుకు కావచ్చు. ఈ విధంగా అనుసంధానించే క్రమం లో రూపొందే ఉత్పత్తులపై స్వతంత్రంగా లావా దేవీలు నిర్వహించగల స్థోమత కలిగి ఉంటాయి అని నిర్ధారించింది. ఈ చివరి నిర్వచనం డెరివేటివ్స్‌ స్వభావంలో మౌలికమైన మార్పును తెచ్చింది.

డెరివేటివ్స్‌లో రకాలు

డెరివేటివ్స్‌ అన్నది సర్వనామం వంటిది. ఈ సర్వనామం సూచిక కింద అనేక నామవా చకాలు ఉన్నాయి. వీటిని రెండు తరగుతులుగా విభజించవచ్చు. మొదటివి సరుకులకు సంబంధించిన డెరివేటివ్‌లు కాగా రెండో తరగతి ద్రవ్య సరుకులకు సంబంధించిన డెరివేటివ్‌లు. మళ్లీ వీటిలో ముఖ్యమైనవి, అంతర్జాతీయ మార్కెట్లు గుర్తించినవి మూడు రకాలు. మొదటివి ఫార్వార్డ్‌ తరహావి. రెండోది ఆప్షన్‌ డెరివేటివ్‌లు, మూడో మిశ్రమ డెరివేటివ్‌లు. ఫార్వార్డ్‌ డెరివేటివ్‌లు అంటే నిర్దిష్ట భవిష్యత్తులో నిర్దిష్ట ప్రదేశంలో ఒక సరుకును నిర్దిష్ట పరిణామంలో నిర్దిష్ట ధరకు కొనుగోలు చేయటానికి ఒప్పందం కుదుర్చుకోవటం. ఈ సరుకు పారిశ్రామిక సరుకు కావచ్చు. వ్యవసాయ సరుకు కావచ్చు. ద్రవ్యమార్కెట్‌ సరుకు కావచ్చు. స్టాక్‌ మార్కెట్‌ షేరు కావచ్చు. ఫార్వార్డ్‌ డెరివేటివ్‌లను తిరిగి మూడు రకాలుగా విడగొట్టవచ్చు. ఫార్వార్డ్‌ కాంట్రాక్టులు, ఫ్యూచర్స్‌, బదలాయింపులు (శ్వాప్‌లు). ఇందులో మొదటిది ఫార్వార్డ్‌ కాంట్రాక్టులు ప్రధానంగా నిర్దిష్ట అవసరాలు తీర్చుకోవటానికి వినియోగించబడతాయి. ఫార్వార్డ్‌ డెరివేటివ్‌లకిచ్చిన వివరణే వీటికీ సరిపోతుంది. ఫార్వార్డ్‌ కాంట్రాక్ట్‌లో స్థలం, కాలం, పరిమాణం గురించిన స్పష్టమైన ఒప్పం దం ఉండదు. ఇక ఫ్యూచర్స్‌ విషయానికొస్తే, ఫార్వార్డ్‌ కాంట్రాక్టుకున్న అన్ని లక్షణాలతో పాటు స్థలం, కాలం, పరిమాణం, నాణ్యత, ధరల గురించిన స్పష్టత ఇందులో ఉంటుంది. మూడో ది, బదలాయింపులు. ఫార్వార్డ్‌ కాంట్రాక్టు, ఫ్యూచర్స్‌ కాంట్రాక్టు ప్రధానంగా ఉత్పత్తితో ముడిపడి ఉంటాయి. బదలాయింపులు ఉత్పత్తితో సంబంధం లేని ద్రవ్య మార్కెట్‌లో జరిగే లావాదేవీలు. ఈ ఒక్క ప్రత్యేకత మినహా ఫార్వార్ట్‌, ఫ్యూచర్స్‌ కాంట్రాక్టులకున్న లక్షణాలన్నీ శ్వాప్‌లకు ఉంటాయి.

రెండో కేటగిరీ ఆప్షన్‌లు: ఫార్వార్డ్‌ డెరివే టివ్‌లలో సరుకుల లావాదేవీలకు సంబంధించి హక్కులు, బాధ్యతలు ఉంటాయి. ఆప్షన్‌ల కేటగిరీలో హక్కులే తప్ప బాధ్యతలు ఉండవు. అంటే కుదుర్చుకున్న కాంట్రాక్టును అమలు చేయవచ్చు, చేయకపోవచ్చు కూడా.

మూడో కేటగిరీ మిశ్రమ డెరివేటివ్‌లు: మిశ్రమ డెరివేటివ్‌లు ప్రధానంగా ఉత్పత్తితో సంబంధం లేని రంగాల్లో జరిగే లావాదేవీల్లో రిస్కు తగ్గించుకునే సాధనాలు. డెరివేటివ్‌ల వల్ల రిస్కు తగ్గుతుందనుకోవటం పొరపాటు. ఇవి కేవలం రిస్కును వాయిదావేయటానికీ లేదా మరొకరి నెత్తిన మోపటానికీ ఉపయోగపడే సాధనాలే. ప్రస్తుతం అమెరికా సంక్షోభం అనుభవంలో మనకు రుజువైన అంశం ఇదే. ఈ కొత్త పరిణామం కూడా పెట్టుబడిదారీ వ్యవస్థ పతనం నుండి కాపాడలేకపోయింది.

వివరణ

పశ్చిమగోదావరి జిల్లాలో ఆధునిక ఫ్లోర్‌ మిల్లులు ఉన్న విషయం తెలుసు. ఫ్లోర్‌ మిల్లు యజమాని ఒక గ్రామంలో రైతుల నుండి పంట నూర్పిడి తర్వాత మొత్తం సరుకు తన మిల్లుకే తోలాలని ఒప్పందం కుదుర్చుకోవటం ఫార్వార్డ్‌ కాంట్రాక్టు అయితే నూర్పిడి సమయానికి 1000 క్వింటాల ధాన్యం 700 రూపాయలు చొప్పున కొనుగోలు చేయాలని ఒప్పందం కుదుర్చు కోవటం, 200 కాయిదా, బయానా తీసుకోవటం ఫ్యూచర్స్‌ అవుతుంది. కొనుగోలు షరతులు కుదరని పక్షంలో కాయిదా ఇచ్చిన 200 రూపాయలు వదిలేసుకుని పోవటం ఆప్షన్‌ అవుతుంది. ఇదే 200 రూపాయల బయానా తో మరో మిల్లుకు సరుకు తోలించటం శ్వాప్‌ అవుతుంది.

మార్కెట్‌ వాదనలు

డెరివేటివ్‌ మార్కెట్‌ గురించి పెట్టుబడిదారీ ఆర్థిక వేత్తలు ప్రధానంగా నాలుగు వాదనలు ముందుకు తెస్తున్నారు. మార్కెట్‌ రిస్కును సరిగ్గా అంచనా వేసి నివారించవచ్చు. వాణిజ్య సామర్థ్యం పెరుగుతుంది. గాలివాటు వాణిజ్యం తో లాభాలు పెంచుకోవచ్చు. ఉత్పత్తులకు సాధ్యమైనంత ఎక్కువ విలువ సాధించవచ్చు. ధరవరల స్థిరీకరణకు సాధనంగా ఉపయోగించ వచ్చు. ప్రభుత్వం మరో అడుగు ముందుకు వేసి వ్యవసాయోత్పత్తుల మార్కెట్‌లో డెరివేటివ్‌ వాణిజ్యం వలన రైతులకు మరింత ధర వస్తుందనీ, డెరివేటివ్స్‌ల మార్కెట్‌ కొనుగోళ్ల ద్వారా ముందస్తుగానే సరుకు సేకరణ ప్రారం భించటం వల్ల మార్కెట్‌లో సరుకులు నిరాటం కంగా వస్తుంటాయనీ, దాంతో కొరత నివా రించవచ్చుననీ చెబుతోంది. అవసరాల ప్రాతిపదిన అమ్మకం జరుగుతుంది కనుక సరసరమైన ధరలకు సరుకులు అందుబాటులోకి వస్తాయని చెబుతోంది.

భారతదేశంలో డెరివేటివ్స్‌ మార్కెట్‌గమనం

న్యూయార్క్‌లో తొలి డెరివేటివ్స్‌ ఎక్జేంజి 1875లో ఏర్పాటైతే భారతదేశంలో అంతకు పూర్వమే పత్తి వ్యాపారులతో ఈస్టిండియా కంపెనీ ఫార్వార్ట్‌ ట్రేడింగ్‌ ఒప్పందాలు కుదుర్చుకొన్నది. 1875లో బొంబాయి కాటన్‌ అసోషియేషన్‌ వ్యవసాయోత్పత్తులపై ఫ్యూచర్స్‌ ట్రేడింగ్‌ సంస్థాగతం చేసింది. స్వాతంత్య్రం వచ్చే వరకూ ఈ వ్యాపారం నిరాఘాటంగా కొనసాగింది. ఈ వ్యాపారంతో పాటే సరుకుల అక్రమ నిల్వలు పెరిగిపోయాయి. 1952లో అప్పటి కేంద్ర ప్రభుత్వం ప్రజలకు అవసరమైన వ్యవసాయ, పారిశ్రామికోత్పత్తులు మార్కెట్లోకి తెచ్చే లక్ష్యంతో డెరివేటివ్‌ ట్రేడింగ్‌ను చట్ట విరుద్ధంగా ప్రకటించంతో పాటు సరుకుల మార్కెట్‌ను నియంత్రించటానికి నిత్యావసర సరుకుల చట్టాన్ని అమల్లోకి తెచ్చింది. నాటినుండీ ఐదు దశాబ్దాలపాటు డెరివేటివ్స్‌ వాణిజ్యంపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేస్తూ 1995లో ద్రవ్యసరుకుల మార్కెట్‌లో డెరివేటివ్స్‌ వాణిజ్యాన్ని అనుమతిస్తూ కేంద్ర ప్రభుత్వం తొలిసారి ఆర్డినెన్స్‌ తెచ్చింది. దిగువనున్న పట్టిక 1995 నుండీ డెరివేటివ్స్‌ మార్కెట్‌ వేళ్లూనుకునేందుకు ప్రభుత్వం ఎంత వేగంగా చర్యలు చేపట్టిందో తెలియచేస్తోంది.

1995- సెక్యూరిటీస్‌ చట్ట సవరణ ద్వారా ద్రవ్య ఉత్పత్తుల్లో వాణిజ్యానికి తెర తీశారు.

1996 - ఇండెక్స్‌ల్లో ఫ్యూచర్స్‌ ట్రేడింగ్‌కు సంబంధించిన విధి విధానాల రూపకల్పనకు ఎల్‌ సి గుప్త కమిటీ నియమాకం

1998 - గుప్త కమిటీ నివేదిక సమర్పణ

1999 - ఓవర్‌ ది కౌంటర్‌ ఫార్వార్డ్‌ కాంట్రాక్టులకు ఆర్‌ బి ఐ అనుమతి

మే 2000- నిఫ్టి స్టాక్‌ ఎక్జేంజిలో ఇండెక్స్‌ లపై ఫ్యూచర్స్‌ ట్రేడింగ్‌ ప్రారంభం

జూన్‌ 2000- బోంబే స్టాక్‌ ఎక్చేంజిలో ఫ్యూచర్స్‌ ట్రేడింగ్‌కు అనుమతి

జూన్‌ 2000- నిఫ్టిలో ఫ్యూచర్స్‌ ట్రేడింగ్‌కు అనుమతి

ఆగస్టు 2000- నిఫ్టి, బోంబే స్టాక్‌ ఎక్జేంజి లో ఫ్యూచర్స్‌, ఆప్షన్స్‌లో ట్రేడింగ్‌ ప్రారంభం

2001- సింగిల్‌ స్టాక్‌ ఫ్యూచర్స్‌, ఈక్విటీ ఇండెక్స్‌లో ఫ్యూచర్స్‌ ట్రేడింగ్‌ ప్రారంభం

2002 - ఆహారోత్పత్తులల్లో ఫ్యూచర్స్‌ ట్రేడింగ్‌పై ఉన్న ఆంక్షల రద్దు

2008- ద్రవ్యమార్కెట్‌ ఉత్పత్తుల్లో ఫ్యూచర్స్‌ ట్రేడింగ్‌కు అనుమతి.

విస్తృతమవుతున్న డెరివేటివ్స్‌ మార్కెట్‌

నేడు భారతదేశంలో జాతీయ స్థాయి సరుకుల ఎక్జేంజిలు 16 ఉన్నాయి. అందులో అహ్మదాబాద్‌ కేంద్రంగా నడుస్తున్న నేషనల్‌ మల్టీ కమోడిటీస్‌ ఎక్చేంజి, ముంబయి కేంద్రంగా నడుస్తున్న కమోడిటీస్‌ డెరివేటివ్స్‌ ఎక్సేంజి, మల్టీ కమోడిటీస్‌ ఎక్సేంజి, ఇండియా కమోడిటీస్‌ ఎక్సేంజిలు ముఖ్యమైనవి. ఇవికాక వ్యవసా యోత్పత్తుల లభ్యతను బట్టి ఆయా ప్రాంతాల్లో ఒక్కో ఉత్పత్తికి సంబంధించిన ఎక్చేంజిలు ఉన్నాయి. ఉదాహరణకు పసుపు కొమ్ముల డెరివేటివ్‌ మార్కెట్‌కు నిజామాబాద్‌ మార్కెట్‌ యార్డు కేంద్రంగా ఉంటే గుంటూరు మిర్చియార్డు ఎర్రమిరపకాయల డెరివేటివ్‌ మార్కెట్‌గా ఉంది. కాకినాడ చమురు ఉత్పత్తుల డెరివేటివ్‌లకు కేంద్రంగా ఉంది. 2000 నాటికి కేవలం 8 రకాల వ్యవసాయోత్పత్తుల గురించి డెరివేటివ్‌ మార్కెట్‌ లావాదేవీలు సాగితే నేడు 64 వ్యవసాయోత్పత్తులకు సంబంధించి డెరివేటివ్‌ మార్కెట్‌ నడుస్తోంది. మరో 16 ఖనిజోత్పత్తులకు సంబంధించి కూడా డెరివేటివ్‌ మార్కెట్‌ ఈ కాలంలో విస్తరించడింది. 2000 లో ఫ్యూచర్స్‌ మార్కెట్‌లో 1,50,000 కోట్ల విలువైన లావాదే వీలు జరగ్గా, 2009-2010 ఆర్థిక సంవత్స రానికి లావాదేవీల విలువ 77,64,754 కోట్లకు చేరింది. ఇది స్థూల జాతీయోత్పత్తికి రెట్టింపు. అంటే సగటున రోజుకు 13,792 కోట్ల మేర లావాదేవీలు జరుగుతున్నాయి. ఇక ద్రవ్య ఉత్పత్తులకు సంబంధించిన మార్కెట్‌ కూడా దీనికంటే వెనకబడేమీ లేదు. ఇందులో ముఖ్యమైనది ఈక్విటీ ఇండెక్స్‌లో జరిగే వాణిజ్యం. నేషనల్‌ స్టాక్‌ ఎక్చేంజిలో జరిగే లావాదేవీల విలువ కంటే ఇదే ఎక్చేంజిలో ద్రవ్య ఉత్పత్తులపై జరిగే లావాదేవీల విలువ ఎక్కువ. ఉదాహరణకు 2008లో నేషనల్‌ స్టాక్‌ ఎక్జేంజి లో డబ్బు ఆధారిత లావాదేవీల విలువ 35,51,038 కోట్లు కాగా డబ్బుకు సంబంధిం చిన డెరివేటివ్‌ మార్కెట్‌లో జరిగిన లావాదేవీల విలువ 1,30,90,477.75 కోట్లు. అంటే 400 రెట్లు ఎక్కువ. 2008-2009 ఆర్థిక సంవత్స రంలో అంతర్జాతీయ సంక్షోభం నేపథ్యంలో ఈ వేగం కొంత మందగించి డెరివేటివ్స్‌ మార్కెట్‌ 76,50,896.80 కోట్లకు పరిమితం అయ్యింది. వ్యవవసాయోత్పత్తులపై డెరివేటివ్‌ వాణిజ్యం కంటే ద్రవ్య ఉత్పత్తులపై డెరివేటివ్‌ వాణిజ్యం మరింత ప్రమాదకరం. ఎందుకంటే ద్రవ్య ఉత్పత్తుల డెరివేటివ్‌ వాణిజ్యం కాగితాలకే పరిమితం అవుతుంది. ఉత్పత్తితో ఏమాత్రం సంబంధం లేదు. అంటే కనీసం ఒక్క యువకు డికి కూడా అదనంగా ఉద్యోగ అవకాశం కలిగించకుండా, ఒక్క ధాన్యం బస్తాగానీ, పారిశ్రామిక సరుకుగానీ, మీటరు గుడ్డగానీ ఉత్పత్తి చేయకుండానే 1,30,90,477.75 కోట్లు విలువైన వాణిజ్యం జరిగిపోయింది. ఇంత డబ్బు ఎక్కడ నుండి వచ్చినట్లు ? ఎవరికి జేబులోకి వెళ్లినట్లు?

ద్రవ్యపెట్టుబడిదారులకు ఆటస్థలం

డెరివేటివ్స్‌ వాణిజ్యం వల్ల దేశానికి, ప్రజలకు ఎదో ఒరిగి పడుతుందన్న వాదన సత్య దూరం. సాధ్యమైనంత ఎక్కువ విలువ రాబట్టుకోవటం అన్నది కూడా పాక్షిక సత్యమే. పై వాదనల్లో ఒక్కటే సంపూర్ణ సత్యం. గాలి వాటు వాణిజ్యం ప్రోత్సహించటం ద్వారా లాభాలుపెంచుకొనే అవకాశం ఈ డెరివేటివ్‌ మార్కెట్‌ వల్ల కలుగుతుంది. ఈ డెరివేటివ్‌ వాణిజ్య క్రీడలో సామాన్య పౌరులెవ్వరూ పాల్గొనలేరు. ఎందుకంటే మల్టీ కమోడిటీస్‌ ఎక్సేంజిలో సభ్యతం తీసుకోవాలంటేనే 26 లక్షల సుంకం చెల్లించాలి. ఈ మొత్తం చెల్లించ లేని వారు ఈ క్రీడలో పావులుగా మారతారే తప్ప క్రీడాకారులు కాలేరు. ఎక్చేంజిలో సభ్యత్వం తీసుకోవటానికి అంత సొమ్మే ఉంటే రైతుకు గిట్టుబాటు ధర రాలేదని ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరం ఉండదు కదా ! కనీస స్థాయిలో పాతిక కోట్లు పెట్టుబడి పెట్టి ఈ మార్కెట్‌లో ప్రవేశం పొందుతారు. పాతికోట్ల పెట్టుబడి అంటే ఈ మార్కెట్లో సముద్రంలో చెంబుడు నీళ్లు పోయటంతో సమానం. ఏతా వాతా కేవలం జాతీయ అంతర్జాతీయ కార్పొరేట్‌ సంస్థలే ఈ మార్కెట్‌లో ప్రవేశించగలుగుతాయి. దాంతో దేశంలో 99.999 శాతం ప్రజలు ఈ లావాదేవీలకు దూరంగా ఉంటారు.

డెరివేటివ్స్‌ మార్కెట్‌ పర్యవసానంగా సరు కులు దైనందిన మార్కెట్‌లోకి రావటం తగ్గుతుంది. భవిష్యత్తులో మరింత మంచి రేటు వస్తుందన్న ఆశ, అంచనా మరింత రిస్కు తీసుకో వటానికి ప్రేరేపిస్తుంది. దాంతో ఉన్న సరుకులు కాస్తా గోడౌన్లలో మూలుగుతుంటాయి. ఉదాహరణకు 40 క్వింటాళ్ల మిర్చి పండించిన రైతు మరో ఆర్నెల్ల తర్వాత మంచి రేటు పలుకుతుందంటే ఆ ఆర్నెల్లపాటు సరుకు కోల్డ్‌ స్టోరేజిలో ఉంచటానికి సిద్ధమవుతాడు. అయితే ఆర్నెల్ల తర్వాత రేటు ఇప్పుడున్న రేటు కంటే ఖచ్చితంగా పెరుగుతుందని ఎవ్వరూ హమీ ఇవ్వరు. రైతే రిస్క్‌ తీసుకోవాలి. సరుకులు చేతులు మారుతున్నాయా లేదా అన్న దానితో నిమిత్తం లేకుండా వాస్తవిక మార్కెట్‌లో భవిష్యత్తు ధరల అంచనాతో నేడు సరుకుల రేట్లు పోటెత్తు తాయి. ఉదాహరణకు యాలక్కాయలు కిలో ధర గత సంవత్సరం 650-700 రూపాయలు పలికింది. ఈ సంవత్సరం ఉత్పత్తి తగ్గిపోతుం దన్న వార్తలు రావటంతో ఫ్యూచర్స్‌ మార్కెట్‌లో దీని ధర ఒక్కసారిగా రెట్టింపయ్యింది. ఇప్పుడు దైనందిన మార్కెట్‌లోకూడా రేటు పెరిగి 1300కు చేరింది. పసుపు పరిస్థితి కూడా అదే. జనవరి 2010లో 7398 పలికి క్వింటా ధర మేనెల వచ్చే సరికి 14,851కి చేరుకొంది. దీని ప్రభావం దైనందిన మార్కెట్‌లో పడుతుంది. 2002లో ఎన్డీయే ప్రభుత్వం ఆహారోత్పత్తుల మార్కెట్‌లో ఫ్యూచర్స్‌ ట్రేడింగ్‌పై ఉన్న ఆంక్షలు రద్దు చేయటంతో పాటు డెరివేటివ్‌ మార్కెట్‌ లావాదేవీలు జరిగే ఉత్పత్తుల సంఖ్య 61 నుండి 80 కి పెంచింది. దీని ప్రభావం వల్ల రెండేళ్ల క్రితం వరకూ కిలో 28 రూపాయలు ఉండే చక్కెర నేడు 48 రూపాయలకు చేరింది. 38-48 రూపాయల మధ్య ఉన్న వంటనూనెల ధరలు నేడు 80-100కు చేరాయి. ఢిల్లీలో ఐదు రూపాయలు ఉండే గోధుమ పిండి ధర నేడు 11 రూపాయలకు చేరింది. అలాగని ఈ పెరిగిన మార్కెట్‌ ధరల కనుగుణంగా రైతుల వద్ద కొనుగోలు ధరలూ పెరగలేదు.

ఏ రూపంలో చూసుకున్నా లాభాలు పోగేసు కునే విషయంలో తప్ప మిగిలిన ఏ విషయం లోనూ డెరివేటివ్స్‌ మార్కెట్‌ అటు జాతీయ ఆర్థిక వ్యవస్థల అవసరాలూ తీర్చలేదు. ఇటు సామాన్య ప్రజల అవసరాలు అంతకంటే తీర్చలేదు. ఇది దేశీయ అనుభవం, అంతర్జాతీయ అనుభవం ఇంతకంటే భిన్నంగా ఏమీ లేదు. 2006- 2008 మధ్య ప్రాఛ్య దేశాలు ఆహార సంక్షో భాన్ని ఎదుర్కొన్న విషయం గుర్తుకు తెచ్చు కోవాలి. తాజా దశ ఆహార సంక్షోభానికి మూల కారణం ఉత్పత్తిలో కొరత కాదు. కొనుగోలు శక్తిలో కొరత. ప్రపంచవ్యాప్తంగా వ్యవసాయో త్పత్తుల డెరివేటివ్స్‌ వాణిజ్యం వలన ధాన్యం ధర 2006-2008 మధ్య 217 శాతం పెరిగింది. గోధుమల ధర 136 శాతం, మొక్క జొన్నలు 125 శాతం పెరిగాయి, సోయాబీన్‌ గింజలు 107 శాతం పెరిగాయి. ఇదే కాలంలో చికాగో స్టాక్‌ఎక్సేంజిలో గోధుమల డెరివేటివ్‌ వాణిజ్యం వల్ల 73 శాతం అదనపు లాభాలు వచ్చాయని అంచనా వేయగా సోయా నూనె డెరివేటివ్‌ల ద్వారా 44 శాతం లాభాలు అదనంగా వచ్చాయి.

ఎవరు, ఎందుకు ప్రోత్సహిస్తున్నారు ?

ఇన్ని వివరాలు పరిశీలించిన తర్వాత సమాజంలోని 99.999 శాతం మంది ప్రజలకు నష్టం చేకూరుస్తున్న ఈ డెరివేటివ్స్‌ మార్కెట్‌ను ఎవరు ప్రోత్సహిస్తున్నారు, ఎందుకు ప్రోత్సహిస్తున్నారు అన్న ప్రశ్నలు తలెత్తడం సహజం. ఈ ప్రశ్నలకు సమాధానం తెలుసుకో వాలంటే ముందుగా అంతర్జాతీయ ద్రవ్య మార్కెట్‌కు, సామ్రాజ్యవాద ప్రపంచీకరణ మార్కెట్‌కూ, డెరివేటివ్‌ మార్కెట్‌కూ మధ్య ఉన్న సంబంధాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఈ సంబంధాలు పెట్టుబడిదారీ వ్యవస్థ మౌలిక లక్షణం లాభాల రేటు పతనం సిద్థాంతాన్ని మరోసారి చర్చకు తీసుకొస్తున్నాయి.

పెట్టుబడిదారీ వ్యవస్థలో ఉత్పత్తి క్రమంలో ఉన్న మౌలిక వైరుధ్యం, ఉత్పత్తి సంబంధాల్లో ఉన్న వర్గ ఘర్షణ అనివార్యంగా ఈ వ్యవస్థను మౌలిక లక్షణమైన లాభాల రేటు పతనం దిశగా నెడుతుంది. ఇది పెట్టుబడిదారీ వ్యవస్థను సంక్షోభంలోకి నెడుతుంది. ఆయా స్థల కాల పరిస్థితులను బట్టి సంక్షోభం నుండి బయట పడటానికి కొన్ని సార్లు ప్రభుత్వాలే దోహదం చేస్తే మరికొన్ని సార్లు ప్రజలు ప్రభుత్వాలను మార్చి వ్యవస్థను సంక్షోభం నుండి బయటకు తెచ్చుకుంటారు. విప్లవాత్మక మార్పులకు అవకాశం లేకుండానే ఈ పతనాన్నీ, సంక్షోభాన్నీ నివారించేందుకు పెట్టుబడిదారీ వ్యవస్థ గత నాలుగు శతాబ్దాల నుండి ప్రయత్నాలు చేస్తూనే వచ్చింది. శాస్త్రసాంకేతిక విజ్ఞాన రంగాల్లో వస్తున్న మార్పులు ఉత్పత్తి సామర్ధ్యాన్ని పెంచటంతో పాటు నిరుద్యోగాన్ని సృష్టించటం ద్వారా కొనుగోలు శక్తి పతనాన్ని కూడా వేగవంతం చేశాయి. గుత్తపెట్టుబడి ద్రవ్య పెట్టుబడిగా మారే పరిణామం మొదటి ప్రపంచ యుద్థానికి ముందు ఆరంభస్థాయిలో ఉంటే నేడు అవధుల్లేని స్థితికి చేరింది. ఉత్పత్తికి అవసరమైన అదనపు నిధులు సమకూర్చుకునే సాధనంగా తెరమీదకు వచ్చిన స్టాక్‌మార్కెట్‌లు నేడు జూదశాలలుగా మారాయి. ఉత్పత్తి క్రమంలో నెలకొన్న వైరుధ్యం, ఉత్పత్తి శక్తులు, ఉత్పత్తి సాధనాల మధ్య ఉన్న వైరుధ్యం నుండి బయటపడటానికి పెట్టుబడిదారీ వర్గం మార్కెట్‌ లో తిమ్మిని బమ్మిని చేయటం ద్వారా సంక్షోభం నుండి బయటపడేందుకు ప్రయత్నాలు ముమ్ము రం అయ్యాయి. దీని ఫలితమే మనం నేడు చూస్తున్న సామ్రాజ్యవాద ప్రపంచీకరణ.

ఈ ప్రపంచీకరణ పర్యవసానమే మొత్తం ఆర్థిక వ్యవస్థలు ద్రవ్యీకరణ చెందటం. అంటే ఆర్థిక వ్యవస్థలు పారిశ్రామిక సరుకుల ఉత్పత్తి క్రమం కంటే మార్కెట్‌లో ద్రవ్య సరుకుల ఉత్పత్తికి ప్రాధాన్యత ఇస్తాయి. వాస్తవిక మార్కెట్‌ కంటే ద్రవ్య సరుకుల మార్కెట్‌ ఎన్నో రెట్లు పెరుగుతుంది. ఒక్క భారతదేశంలోనే ఈ తేడా ఎంతుందో పైన చూశాము. అంతర్జాతీయంగా చూసుకున్నపుడు 2008లో ప్రపంచ స్థూల ఉత్పత్తి విలువ 60 లక్షలకోట్ల (ట్రిలియన్ల) డాలనేకల అయితే ఒక్క డెరివేటివ్‌ మార్కెట్‌ లావాదేవీల విలువ 1140 లక్షలకోట్ల (ట్రిలి యన్‌) డాలర్లు. సాధారణ ఆర్థిక అవగాహన మేరకు ఉత్పత్తి అయిన సరుకు మార్కెట్‌కు చేరి వినిమయదారుడి వద్ద నున్న రొక్కంతో మార్పిడి జరిగితే సరుకుల వలయం పూర్తవుతుంది. ఈ వలయం పూర్తయినపుడే నికర లాభం చేతులు మారుతుంది. తిరిగి ఉత్పత్తికి కావల్సిన పెట్టు బడి సమకూరుతుంది. కానీ డెరివేటివ్‌ మార్కెట్‌ దీనికి భిన్నమైంది. దీన్లో వినియోగం, పెట్టుబడి తిరిగి చేతికి రావటం ఉండదు. దాంతో ఉన్న లెక్కలన్నీ కాగితాలకే పరిమితం అవుతాయి. ఉత్పత్తి ఆధారిత పెట్టుబడి సహజంగా దీర్ఘకా లిక పెట్టుబడి. దాని స్థానంలో మార్కెట్‌ ఆధారిత కార్యకలాపాలకు అవసరమైన స్వల్పకాలిక పెట్టుబడిపై కేంద్రీకరణ మళ్లింది. స్వల్పకాలిక పెట్టుబడితో రిస్కును కాలచక్రంలో బంధించవచ్చన్న అవగాహన దీనికి మూలం.

సూత్రీకరణగా చెప్పుకోవాలంటే పై పరిణామాలన్నీ క్రోడీకరించబడ్డాయి. వీటికి తోడు శాస్త్ర సాంకేతిక రంగాలు ప్రత్యేకించి కంప్యూటర్‌ గణాంక ప్రక్రియలు గణితంలో నూతన ఫార్ము లాలకు దారితీశాయి. ఈ నూతన ఫార్ము లాలను ఆర్థిక రంగానికి వర్తింపచేయటానికి వేగంగా చర్యలు చేపట్టబడ్డాయి. దాంతో ప్రపంచీకరణ వేగానికి మించి డెరివేటివ్‌ అంతర్జాతీయ మార్కెట్‌ను కమ్ముకున్నాయి. ఇంత జరిగినా ఇవి కేవలం మార్కెట్‌ లావాదేవీల పర్యవసానంగానే మిగిలిపోయాయి తప్ప ఉత్పత్తి క్రమంతో అనుసంధానించబడలేదు. అందువల్లనే అమెరికా ఎదుర్కొన్న తాజా సంక్షోభంలో డెరివేటివ్‌లు కీలక పాత్ర పోషిం చాయి. ఈ మార్కెట్‌ వలయంలో అట్టడుగు స్థానంలో ఉన్న వినియోగదారులు ఉత్పత్తి క్రమంతో నిమిత్తం లేని ద్రవ్యీకరణలో పావు లుగా మారారు. ఉత్పత్తి లేకపోతే ఉపాధి లేదు. ఉపాధి లేకపోతే కొనుగోలు శక్తి లేదు. దీంతో కేవలం అమ్మకాలకే పరిమితమైన డెరివేటివ్‌ మార్కెట్‌ సరుకుల వలయాన్ని పూర్తి చేయలేకపోయింది. ఈ వైఫల్యంతో ద్రవ్య పెట్టుబడి ప్రధాన కార్యకలాపాలు సరుకుల ఉత్పత్తికి బదులు గణాంక పద్ధతుల్లో స్పెక్యులేషన్‌ లావాదేవీల నడపడమే అని తేలిపోయింది. ఒకప్పుడు ఆర్థిక వ్యవస్థలో ఎదురయ్యే రిస్కు నుండి పెట్టుబడులు, లాభాలు గ్యారంటీ చేసుకునేందుకు ఉనికిలోకి వచ్చిన డెరివేటివ్‌లు నేడు రిస్కును మొత్తంగా ఆర్థిక వ్యవస్థకు మూల మూలలా విస్తరింపచేస్తున్నాయి. అయినా గత రెండు దశాబ్దాలుగా డెరివేటివ్‌ మార్కెట్‌ విస్తరణతో తేలికగా లాభాలు పోగేసుకోవటమే కాదు, సంక్షోభ భారాలను అంతే తేలికగా ఇతరులపై నెట్టటానికి సాధనాలుగా మారటంతో అంతర్జాతీయ ద్రవ్య పెట్టుబడిదారులు తాజా సంక్షోభం నుండి పాఠాలు నేర్చుకోవటం కాక ఈ ధోరణిని కొనసాగించే దిశగా ముందుకు సాగుతున్నారు.

No comments: