Wednesday, May 5, 2010

''కమ్యూనిస్టు వ్యతిరేకులారా ఇక మీ విమర్శలు చాలించండి''

Published in Marxistu, May 2010

* ''ఫస్ట్‌ యాజ్‌ ట్రాజెడీ, దెన్‌ యాజ్‌ ఫార్స్‌'' Book Review
* స్లావొజ్‌ జిజెక్‌ వెర్సొ ప్రెస్‌ పేజీలు : 157, వెల : రూ. 650

21వ శతాబ్దంలో పెట్టుబడిదారీ వ్యవస్థ ఎదుర్కొంటున్న తొలి సంక్షోభం గురించి అనేక రచనలు వచ్చాయి. ఇందులో కొన్ని రచ నలు సంక్షోభం తీరు తెన్నుల వర్ణణకు పరిమితం అయితే, మరికొన్ని రచనలు సంక్షోభ కారణాలు వెతికే ప్రయత్నం చేశాయి. కొన్ని రచనలు మాత్రమే సంక్షోభానికి పరిష్కారాలు చూపించే ప్రయత్నం చేశాయి. అందులో కూడా సాంప్ర దాయక పరిష్కారాలు చూపించే రచనలే ఎక్కువ. వీటన్నింటికి భిన్నంగా వర్తమాన సంక్షో భాన్ని సరికొత్త కోణంలో పరిశీలించిన రచన స్లావోజ్‌ జిజెక్‌ రచించిన ''తొలుత ఒక విషాదంగా తరువాత ఒక ప్రహసనంగా'' (ఫస్ట్‌ యాజ్‌ ట్రాజెడీ, దెన్‌ యాజ్‌ ఫార్స్‌) అన్న గ్రంథం. మార్క్స్‌ ప్రసిద్ధ గ్రంథం లూయీ బోనపార్టీ 18వ బ్రూమెయిర్‌ రచనలో ఒక వాక్యాన్ని తన రచనకు శీర్షికగా ఎంచుకోవడం ద్వారా జిజెక్‌, సంక్షోభంపై తన విమర్శ మిగిలిన విమర్శలకు భిన్నంగా ఉంటుందని చెప్పే ప్రయత్నం చేశారు. లండన్‌ విశ్వవిద్యా లయంలో బిర్క్‌బెక్‌ ఇనిస్టిట్యూట్‌ ఫర్‌ హ్యుమాని టీస్‌లో డైరెక్టర్‌గా పని చేస్తున్నారు జిజెక్‌. ఈ కాలంలో అత్యధిక విశ్లేషణలు నిర్దిష్టంగా పెట్టుబడిదారీ విధానాన్ని బ్రతికించే ఏకైక లక్ష్యంతో వచ్చాయి. కాని వారంతా బయటికి మాత్రం తటస్థ విశ్లేషకులుగా వ్యవహరించారు. అటువంటి వారికి భిన్నంగా జిజెక్‌ ''ఇక్కడ నేను తటస్థ విశ్లేషణను ముందుంచటం లేదు. సంపూ ర్ణమైన పక్షపాతంతోనే వాదనలు ముందుకు తెస్తున్నాను. అవి కూడా పాక్షికమైనవే. ఎందు కంటే సత్యం పాక్షికమైనది. అటువంటి పాక్షిక సత్యాన్ని చేరుకోవాలంటే పక్షపాత వైఖరి తీసుకోక తప్పదు. ఇక్కడ నేను కమ్యూనిజం పక్షం వహిస్తున్నాను'' అంటూ స్పష్టంగా చెప్పారు. అంతేకాదు, ''కమ్యూనిజాన్ని నమ్మిన వారు ఇకపై ఏ మీమాంసకు లోను కావాల్సిన అవసరం లేదు. కమ్యూనిస్టు వ్యతిరేకులారా, ఇక చాలిం చండి. ఇంతకాలం అవాకులు చెవాకులు పేలారు. వాటన్నింటిని క్షమించి వదిలేస్తున్నాము. ఇకనైనా విషయాన్ని తీవ్రంగా పరిశీలించండి'' అని పేర్కొన్నాడు.

పెట్టుబడిదారీ వ్యవస్థ ఆర్థిక సంక్షోభాన్ని మాత్రమే కాదు, సైద్ధాంతిక సంక్షోభాన్ని కూడా ఎదుర్కొంటున్నది. ఈ సైద్ధాంతిక సంక్షోభం నుండి బయటపడేందుకు ముందుకొచ్చిన, వస్తున్న పలు సంక్లిష్ట వాదనలను కేవలం 160 పేజీల్లో సంక్షిప్తీకరించటం ద్వారా జిజెక్‌ ఒక నూతన ప్రపంచాన్ని పాఠకుల కళ్ల ముందు ఆవిష్కరించే ప్రయత్నం చేశారు. పుస్తకాన్ని 1. బడుద్ధాయిలూ...ఇది సైద్ధాంతిక పోరాటం, 2. కమ్యూనిస్టు ప్రత్యామ్నాయం అన్న రెండు భాగా లుగా విభజించారు. మధ్యమధ్యలో ఉపశీర్షికలు ఉన్నాయి. జిజెక్‌ తన గ్రంథంలో అత్యంత సంక్లిష్ట వాదనలను సంక్షిప్తంగా పాఠకుల ముందుంచే ప్రయత్నం చేశాడు. పుస్తకం చిన్నదే అయినా చదివి అర్థం చేసుకోవటానికి సమయం పడుతుంది. ఇందులో ఉన్న వాదనలు, ప్రతి వాదనలు అంత వైవిధ్యమైనవి కావటమే దీనికి కారణం. తాజా సంక్షోభం వలన విప్లవ రాజకీ యాలు, విముక్తి రాజకీయాలు తమంతతాముగా విజృంభించబోవనీ, సంక్షోభం కాస్తా సామాజిక సంక్షోభంగా మారి కార్మికవర్గంపై దాడి పదు నెక్కుతుందనీ, జాత్యంహంకార వివక్ష, యుద్ధం, పేదరికం విజృంభిస్తాయనీ, అన్ని దేశాల్లోనూ పేదలు సంపన్నుల మధ్య అంతరాలు మరింత పెరుగుతాయనీ పేర్కొన్నారు. ఈ పరిస్థితి నుండి బయట పడాలంటే పెట్టుబడిదారీ వ్యవస్థ చట్రం పరిధికి బయటే పరిష్కారం వెదకాలని ప్రతి పాదించారు.

మొదటి భాగాన్ని ప్రధానంగా పెట్టుబడి దారీ సంక్షోభాన్ని సమర్థించుకోవటానికి జరుగు తున్న పలు ప్రయత్నాలనూ, వాటి రాజకీయ పర్యవసానాలనూ విశ్లేషించటానికి కేటాయిం చారు. రెండో భాగంలో కమ్యూనిస్టు ప్రతిపా దనలు ముందుకు తెచ్చారు. పెట్టుబడిదారీ విధానం గురించీ, కమ్యూనిస్టు ప్రతిపాదనల గురించీ ఆయన ప్రధానంగా సామాజిక రాజ కీయ విశ్లేషణకు బదులు సామాజిక మనస్తత్వ వివశ్లేషణ చేయడానికి ప్రయత్నించారు. దాంతో ఈ రచనలో క్రియాశీల రాజకీయ కోణంపై డోలయమానం కనిపిస్తుంది. పెట్టుబడిదారీ విధానాన్ని విశ్లేషించటంలో సమర్థవంతంగా వ్యవహరించినా కమ్యూనిజానికి సంబంధించిన పలు ప్రతిపాదనల విషయంలో యూరప్‌లోని సైద్థాంతిక ధోరణుల పరిమితి నుండి బయట పడలేకపోయారని ఆయన ముందుకు తెచ్చిన పలు ప్రతిపాదనలు గమనిస్తే అర్థమవుతుంది.

సంక్షుభితమైన పెట్టుబడిదారీ విధానానికి కమ్యూనిజం స్థాపన మినహా మరో ప్రత్యా మ్నాయం లేదంటూ ప్రత్యక్ష రాజకీయకార్యా చరణకు ప్రోత్సహించే పుస్తకం ఇది. అదేసమ యంలో కమ్యూనిజం భావనలు వేళ్లూనుకో కుండా ఉండేందుకు, దృష్టి మళ్లించేందుకు అత్యంత మితవాదులు, ఉదారవాదులే కమ్యూ నిస్టు పరిభాషలో వాదనలు ముందుకు తెస్తారని అటువంటి వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని ఆయన పిలుపునిస్తారు. అమెరికా ఆధునిక చరిత్రలో ప్రత్యేకించి 21వ శతాబ్దంలో చోటు చేసుకున్న రెండు సంఘటనలు- 9/11 ఉగ్రవాదుల దాడి, తదనంతర పరిణామాలు, 2007-2008లో పెల్లుబుకిన పెట్టుబడిదారీ సంక్షోభం...ఈ రెంటినీ పోలుస్తూ విశ్లేషణ మొదలవుతుంది. ఈ రెండు సందర్భాల్లోనూ అమెరికా పాలక వర్గాలు ముందుకు తెచ్చిన వాదనలు - అమెరికా విలువలనూ, జీవన విధానానీ కాపాడుకోవాలన్న వాదనలను ప్రస్తా విస్తూ వాటిపై తన ప్రతివాదన వినిపించారు. ఈ సందర్భంగానే 1989లో బెర్లిన్‌ గోడ పతనం సందర్భంగా ముందుకు వచ్చిన చరిత్ర అంతం, మానవ సమాజ అభివృద్ధిలో పెట్టుబడిదారీ విధానమే ఆఖరి దశ, సంతోషదాయకమైన 90వ దశకం అన్న వాదనలు ఊహాజనిత వాదనలని జిజెక్‌ నిర్ధారించాడు. ఫ్రాన్సిస్‌ ఫుకుయామా ప్రతిపాదించిన చరిత్ర అంతం సిద్ధాంతం కూడా తప్పని రెండు సార్లు రుజువయిందని చెప్పారు.

పెట్టుబడిదారీ వ్యవస్థ సంక్షోభం గురించి మొదటి భాగంలో విపులంగా చర్చించిన జిజెక్‌ మిగిలిన వారికి మల్లే ఈ చర్చను పెట్టుబడిదారీ విధానం పరిధిలో నుండే చూడకుండా దాని పరిధి బయట నుండి సమీక్షించటం ఇందులోని ప్రత్యేకత. అదేసమయంలో ఈ నూతన విశ్లేషణకు అవసరమైన సైద్ధాంతిక పునాదిని మాత్రం జిజెక్‌ చూపలేకపోయాడు. ఈ వైఫల్యం కమ్యూనిస్టు ప్రతిపాదనల గురించిన చర్చలో మరింత కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. పెట్టుబడి దారీ విధానంలోని తాజా ధోరణుల గురించి చర్చను రచయిత ఆయిదు అంశాలుగా విభజిం చాడు. 1. అమెరికాలో వాల్‌స్ట్రీట్‌కు, మెయిన్‌ స్ట్రీట్‌కు మధ్య జరుగుతున్న చర్చ 2. సమానత్వం ప్రాతిపదికన సంపద పంపిణీకీ, పెట్టుబడిదారీ విధానంలో కనిపించే సంపద వడపోతకు మధ్య జరుగుతున్న సంవాదం 3. ఆర్థిక వ్యవస్థలో ప్రభుత్వ జోక్యమే తాజా సంక్షోభానికి మూల కారణమనే చర్చ 4. సంక్షోభ రహిత పెట్టుబడి దారీ విధానం గురించిన చర్చ. తటస్థ మార్కెట్‌ అంటూ ఏదీ లేదని, ఏ సందర్భ పరిమితుల్లోనైనా మార్కెట్‌ను రాజకీయాలు నిర్దేశిస్తాయని ఆయన పేర్కొన్నాడు. చివరిగా పెట్టుబడిదారీ విధానానికి ప్రపంచ స్థాయిలో ప్రత్యామ్నాయాన్ని ముందుకు తీసుకురాలేకపోతే ఈ వాద ప్రతివాదాల వల్ల వామపక్ష భావజాలానికే ఎక్కువ నష్టం జరుగు తుందని రచయిత అభిప్రాయపడ్డాడు. ఈ దిశగా పాలకవర్గాలు సంక్షోభ కారణాల గురించిన శక్తివంతమైన వ్యాఖ్యానాన్ని విస్తృతంగా ప్రచారం చేస్తాయి. తాజా సంక్షోభం పెట్టుబడిదారీ వ్యవస్థలో ఉన్న సంక్షోభం కాదని, నిజానికి పెట్టు బడిదారీ విధానం నుండి వైదొలగిన ఫలితమే ఈ సంక్షోభమనే వాదనలు పాలక వర్గాల వ్యాఖ్యానాల్లో అంతర్భాగంగా ఉంటాయి. ఇటు వంటి వాఖ్యానం ప్రజలను నిద్ర నుండి మేల్కొ ల్పేది కాదు. మరింత గాఢ నిద్రకు ఉపక్రమింప చేసేది. అంతేకాదు, పెట్టుబడిదారీ విధానం ఒక తటస్థ సామాజిక యంత్రాంగం అన్నదే ఒక సైద్థాంతిక వాదన. ప్రజలను ఆశల పల్లకి లోకి ఎక్కించిన వ్యవస్థ ఏదైనా ఉంటే అది పెట్టుబడిదారీ వ్యవస్తే. పెట్టుబడిదారీ విధానం తన ఆధిపత్యాన్ని కొనసాగించుకోవటానికిగాను వస్తు ఆరాధాన, వస్తు కాంక్షతో పాటు భావ ఆరాధానను కూడా ప్రోత్సహిస్తుంది. ఒకసారి దేని గురించైనా ఆరాధ్యభావం ఏర్పర్చిన తర్వాత సదరు విషయం వలన కలుగుతున్న దుష్ప్రభా వాన్ని తగ్గించి చూపటంలో ఇది దోహదం చేస్తుంది. పెట్టుబడిదారీ విధానం భావ ఆరా ధన రూపంలో నిర్మిస్తున్న మిథ్యావాదంపై కూడా పోరాడాల్సిన అవసరముంది అని రచయిత విశదీకరించాడు.

శతృ శిబిరం ప్రచార యుద్ధం గురించి సమగ్రంగా వివరించే ప్రయత్నం చేశాడు రచయిత. శతృ శిబిర ప్రచార యుద్ధపు ఏకైక లక్ష్యం ఉనికిలో ఉన్న ఒక శక్తిని... ప్రతిఘటించే సామర్థ్యం గల శక్తిని హతమార్చటం కాదు, అసలు అటువంటి ప్రతిఘటించే సామర్థ్యం ఉన్న శక్తే ఉనికిలోకి వచ్చే అవకాశం లేకుండా చేయటమే దాని లక్ష్యం. అందువల్లనే తాజా సంక్షోభం వ్యవస్థకు సంబంధించిన సంక్షోభంగా కాక వ్యవస్థపై నమ్మకానికి సంబంధించిన సంక్షోభం అన్న వాదన ముందుకు తేవటం ద్వారా మొత్తంగా చర్చనే పక్కదారి పట్టించే ప్రయత్నం జరుగుతున్నది. తాజా సంక్షోభం నేపథ్యంలో పెట్టుబడిదారీ విధానం కొత్త ముసుగు తొడుక్కుని ముందుకు వస్తుంది. ''సామాజికంగా బాధ్యతాయుతమైన పర్యావరణ పెట్టుబడిదారీ విధానం'' రూపంలో ఇది మనకు కనిపిస్తుంది. అమెరికాలో హరిత విద్యుత్‌ బిల్లు, భారత దేశంలో సాంప్రదాయేతర ఇంధన వనరుల విస్తరణ గురించి జరుగుతున్న చర్చలను ఈ నేపథ్యంలోనే మనం చూడాలి. కోపెన్‌హేగెన్‌ సదస్సులో సంపన్న దేశాలు వ్యవహరించిన తీరు ఇందుకు నిదర్శనాలు. ఇటువంటి ధోరణులు పెట్టుబడిదారీ విధానంలో ఆధునికోత్తర వాదంగా చెప్పుకోవచ్చు. వీటి పర్యవసానం సాంప్రదాయక పెట్టుబడిదారీ విధానం కంటే మరింత దారుణంగానూ, తీవ్రంగానూ ఉంటుంది. ప్రతి సంక్షోభం నేపథ్యంలో వామ పక్షాల జోక్యానికి ఎంతగా అవకాశాలు అందివ స్తాయో అంతకంటే ఎక్కువ అవకాశాలు ఒంటెత్తు పోకడలకు, ప్రజలను దారి మళ్లించే రాజకీయాలకూ వస్తాయనీ, దీనికి యూరోపియన్‌ దేశాల అనుభవాలే నిదర్శనాలనీ రచయిత చెప్పాడు.

మానవత్వం, మానవతావాదం గురించిన చర్చకు కూడా జిజెక్‌ సమర్థవంతమైన జవా బిచ్చారు. సైద్థాంతిక భావజాలాలకు అతీతంగా ఉండాలంటూ ముందుకు వస్తున్న కొన్ని భావ నలు, చర్చలు నిస్సందేహంగా సైద్ధాంతిక కోణం నుండి వస్తున్నవే తప్ప సైద్ధాంతిక భావజాలానికి అతీతమైనవి కావని ఆయన చెప్పారు. అమెరికా ప్రతిపాదిస్తున్న ప్రజాస్వామ్యం కేవలం ఎత్తుగడే తప్ప దానికి వాస్తవిక పునాది లేదన్నాడు. రాజకీయాలకు, ప్రజా జీవనానికి మధ్య పెరుగు తున్న అంతరానికీ, అస్తిత్వ రాజకీయాల ఆవిర్భా వానికీ మధ్య మధ్య సంబంధం ఉందని చెబుతూ ''ఇతరులు'' అన్న భావన రాజకీయ భావజాలంలో ఎలా ప్రవేవించింది, నాటి నుండి మనవాళ్లు, ఇతరుల అన్న అర్థంతో జరుగుతున్న చర్చలకు, అస్తిత్వ రాజకీయాలకు మధ్య ఉన్న సంబంధాన్ని కూడా స్పృజించాడు రచయిత. చారిత్రక పరిణామ క్రమంలో తెరమీదకు వచ్చిన బహుముఖ అస్తిత్వాల గురించిన సమగ్ర అంచనా లేకపోతే ప్రజలు అస్తిత్వవాదానికి, విముక్తి వాదానికి మధ్య ఉన్న వ్యత్యాసాన్ని గుర్తించలేరని ఆయన చెప్పాడు.

నేడు మనం చూస్తున్న పెట్టుబడిదారీ విధానాన్ని అంగీకరించగలమా అన్న ప్రశ్న వేసి దానికి సమాధానంగా కమ్యూనిస్టు పరిష్కారాలు ప్రతిపాదించాడు రచయిత. ఈ అధ్యాయంలో జరిగిన చర్చ అంతా అనేక ప్రతిపాదనలు, సూచనలు చుట్టూ తిరుగుతుంది. సంపూర్ణమైన మార్క్సిస్టు -లెనినస్టు అర్థంలో కమ్యూనిజం సాధన అన్న పదబంధాన్ని రచయిత వాడలేదనిపిస్తుంది. మరోవైపున కమ్యూనిజం సాధనకు కీలకమైన మార్క్సిస్టు లెనినిస్టు సూత్రాలపై నడిచే కమ్యూనిస్టు పార్టీ, విప్లవానికి అవసరమైన కార్మికవర్గ నాయకత్వం, విప్లవానం తరం బూర్జువా రాజ్యాంగయంత్రం స్థానంలో కార్మికవర్గ నియంతృత్వం స్థాపనల గురించి రచయిత చర్చను వాయిదా వేశాడు. కార్మిక వర్గం పొందికలో వచ్చిన మార్పులను ప్రసా ్తవిస్తూ ప్రపంచీకరణ నేపథ్యంలో పలు రకాలుగా చీలిపోయిన కార్మికవర్గాన్ని ఐక్యం చేయాల న్నాడు. పోరాడితే పోయేదేమీ లేదు బానిస సంకెళ్లు తప్ప అన్న నినాదం నాడు కార్మికవర్గాన్ని సమీకరించటానికి దోహదం చేస్తే పోరాడకపోతే సర్వం కోల్పోతామన్న ఆందోళన నేటి సమీక రణకు పునాదిగా ఉండాలని రచయిత ప్రతిపా దించాడు. అయితే ప్రస్తుత పెట్టుబడిదారీ సంక్షో భం నుండి బయట పడి కమ్యూనిజం సాధన కోసం పోరాడేందుకు అవసరమైన సమగ్ర రాజ కీయ వ్యూహాన్ని ప్రతిపాదించటంలో రచయిత వెనకంజ వేశాడు.

నేడు పెట్టుబడిదారీ వ్యవస్థ ముందుకు తెస్తున్న సంక్లిష్టమైన సమస్యల పరిధి, నిడివి దృష్టిలో పెట్టుకున్నపుడు కమ్యూనిజం ఒక్కటే ఈ సమస్యలకు శాశ్వత పరిష్కారం ఇవ్వగల దని రచయిత నిర్థారించాడు. ఈ మధ్య కాలం లో ప్రముఖ చరిత్రకారుడు ఎరిక్‌ హాబ్స్‌బాం ప్రచురించిన ''సోషలిజం విఫలమైంది, పెట్టు బడిదారీ విధానం దివాళా తీసింది. ప్రత్యామ్నా యం ఏమిటి?'' అన్న ప్రశ్నకు రచయిత కమ్యూ నిజం సమాధానంతో ముందుకు వచ్చాడు. ఈ పరిష్కారం దిశగా ప్రపంచ కార్మికవర్గం పయ నించకుండా నిరోధించే ప్రయత్నంలో భాగంగానే పెట్టుబడిదారీ విధానం పరిమిత సామ్యవాద భావనలను ప్రచారాస్త్రాలుగా మారుస్తోందనీ, ప్రకృతి వనరులపై ప్రజల ప్రత్యక్ష హక్కు అన్న పర్వావరణ ఉద్యమకారుల వాదనలు ఇందులో భాగమేనని ఆయన పేర్కొన్నాడు. ఇటువంటి వాదనలన్నింటికీ సమాధానం ఇవ్వాలంటే కమ్యూనిజం నిరంతరం ప్రగతిశీల నూతనత్వా న్ని తనలో ఇముడ్చుకోవాలంటాడు. సామ్రాజ్య వాద ప్రపంచీకరణ నేపథ్యంలో మెజారిటీ ప్రజలు కార్మికవర్గంలో చేరుతున్నారు. అంతర్జా తీయంగా రిజర్వు కార్మికవర్గ సైన్యం విస్తరి స్తోంది. ముందు ముందు వీరందరూ ప్రజా స్వామ్యంపేర చెలామణీ అవుతున్న బూర్జువా రాజకీయ క్రమంలో కూడా స్థానం సంపాదిం చుకునే పరిస్థితుల్లో ఉండరు. అందువల్ల ఇటువంటి పరిస్థితుల్లో మార్క్స్‌ ప్రతిపాదించిన అత్యున్నత విముక్తి సిద్ధాంతంలోని వాస్తవిక ప్రతిపాదనల గురించి ప్రజలను చైతన్యపర్చా ల్సిన అవసర ముంది అని జిజెక్‌ తన గ్రంథం లో చెప్పాడు. సామ్రాజ్యవాదపు ఆధిపత్య వ్యాఖ్యానం నడుమ వాస్తవిక విషయాలు ప్రజలకు చేరటం లేదు. అందువల్ల ప్రజలు మిథ్యావాదానికి దగ్గరవుతున్నారు. పైన చెప్పుకున్నట్లు ఈ మిథ్యావాదపు ఉపరితలాన్ని బద్దలు కొట్టి వాస్తవాలు ప్రజలకు చేరేలా చేయటం కూడా నేడు సైద్ధాంతిక పోరాటంలో అంతర్భాగమే అవుతుందని ఆయన పేర్కొ న్నాడు.

యూరోపియన్‌ దేశాల రాజకీయాలపై పట్టు కలిగిన జిజెక్‌ ఫ్రాన్స్‌, ఇటలీల్లో జరుగు తున్న రాజకీయమార్పులపై కూడా దృష్టి సారించాడు. ఫ్రెంచి అధ్యక్షుడు, ఇటలీ ప్రధానిల శృంగార క్రీడలు, ఆయా దేశాల రాజకీయాల్లో వాటి ప్రభావం గురించి రేఖా మాత్రంగా పాఠకుల దృష్టికి తెస్తూ, ఇవన్నీ రాజకీయాల పట్ల ప్రజా దృక్ఫధాన్ని మార్చటంలో భాగమనీ రచయిత అభిప్రాయపడతాడు. కారణాలు ఏవైనా ఇటువంటి ఏవగింపు చర్యలపై చర్చ మొదలు పెట్టిన తర్వాత ప్రజానీకం ఎదుర్కొం టున్న దైనందిన జీవన సమస్యలపైకి దృష్టి మళ్లించటం సాధ్యం కాదని, తద్వారా పాలక వర్గాలు తమ ప్రయోజనాలను యథాతథంగా కొనసాగించుకోవటంలో కృతకృత్యులవుతాయని చెప్పాడు. పైన చెప్పుకున్నట్లు సంక్షోభం పర్యవ సానంగా మితవాద రాజకీయాలు, కార్మిక వర్గంపై దాడి పెరుగుతాయి. వివిధ దేశాల్లో ఈ దాడులు ప్రారంభం కావటానికి ముందు జరుగుతున్న చర్చల ధోరణిని రచయిత ప్రస్తా వించిన తీరు ఇంగ్లాండ్‌, అమెరికా, ఆస్ట్రేలి యాల్లో ప్రవాసుల పట్ల జరుగుతన్న వ్యవహార శైలిని కళ్లకు కట్టినట్లు చూపిస్తోంది. ప్రవాసుల వల్లనే దేశీయ యువత నిరుద్యోగం బారిన పడుతుందన్న వాదన ముందుకు తేవటం ద్వారా నిరుద్యోగ యువతను ప్రభుత్వ వైఫల్యం నుండి దృష్టి మళ్లించటంలో వివిధ దేశాల్లోని పాలక వర్గాలు కృతకృత్యులయ్యాయి. ఈ ధోరణి ఆస్ట్రేలియాలో భారతీయ విద్యార్థులపై జరుగుతున్న దాడుల్లో మరింత స్పష్టంగా కనిపిస్తోంది.

వామపక్ష వాదనల్లో ఆధునికానంతర వాదనల గురించి కూడా రచయిత ఈ గ్రంధంలో ప్రస్తావించాడు. కార్మిక వర్గ నియంతృత్వం సిద్థాంతాన్ని వ్యతిరేకించే వారిని రచయిత ఆధునికానంతర వామపక్ష వాదులుగా వర్గీకరించాడు. కార్మికవర్గ నియంతృత్వాన్ని ఆచరణలోకి తెచ్చింది లెనిన్‌ నేతృత్వంలోని బోల్షివిక్‌ పార్టీ. అందువల్ల వీరు సహజంగానే లెనిన్‌ సూత్రీకరణలకు వ్యతిరేక వాదనలు ముందుకు తెస్తారు. వేతన కార్మికుల పోరాటాలను కమ్యూనిస్టు పోరాటాల్లో అంతర్భాగంగా చూడకపోవటం కూడా ఆధునికోత్తర వామపక్ష వాదనల్లో భాగంగా ఉంటుంది. దీనికి గాను వీళ్లు ముందుకు తెచ్చే వాదన ''వేతన శ్రమకు కాలం చెల్లింది. పెట్టుబడికి, శ్రమశక్తికి మధ్య వైరుధ్యం గతం మాట. దీని స్థానంలో ప్రభుత్వం, బహుముఖ వ్యవస్థల మధ్య వైరుధ్యం ముందుకొస్తోంది. కాబట్టి మనం దానిపై కేంద్రీకరించాల''న్న నూతన సామాజిక ఉద్యమకారుల సైద్థాంతిక వాదనలను తీవ్రంగా విమర్శిస్తాడు రచయిత. అంతేకాదు. కమ్యూనిజాన్ని ఆచరణ సాధ్యమైన ప్రాజెక్టుగా మలచాలంటే పెట్టుబడిదారీ విధానంపై మరింత కేంద్రీకరించాల్సిన అవసరం ఉందని రచయిత చెప్పాడు. ప్రజాస్వామ్యాన్ని అర్థం చేసుకోవటానికి రచయిత ''ఎన్నికల ప్రజాస్వామ్యం ఏకాభిప్రాయంతో కూడిన పెట్టుబడిదారీ విధానమే. దీన్నే నేడు మనం మార్కెట్‌ ఆర్థిక వ్యవస్థ అని పిలుచుకుంటున్నాము'' అంటూ ప్రజాస్వామిక వ్యవస్థ పరిధిలోనే శాశ్వత పరిష్కారం వెతకాలని ప్రయత్నించటం సరికాదని పేర్కొన్నాడు. అందుకనే ''కమ్యూనిస్టు వ్యతిరేకులారా, ఇక మీ విమర్శలు చాలించండి. ఇంతవరకు మీరు చేసిన విమర్శలను సహించి మిమ్ములను క్షమిస్తున్నాము. ఇకనైనా పరిస్తితి తీవ్రతను గమనించండి'' అంటూ కార్యోన్ముఖులను చేయబూనుకుంటాడు జిజెక్‌.

No comments: