Monday, April 12, 2010

ద్రవ్యోల్బణం పడగనీడన ఆహారభద్రత

Published in Prajasakti Business Watch, April 12th, 2010
దాదాపు రెండు దశాబ్దాల తర్వాత భారత ఆర్థిక వ్యవస్థ మరో మారు ద్రవ్యోల్బణం పడగనీడన విలవిల్లాడుతోంది. గత సంవత్సరం ఎన్నికల నేపథ్యంలో ద్రవ్యోల్బణం ప్రతికూల దశకు చేరుకున్నదనిపించినా నిజానికి దాని తీవ్రత ఏనాడు మందగించలేదు. అంతర్జాతీయ పెట్టుబడిదారీ సంక్షోభం పర్యవసానంగా భారతదేశంలో కూడా ద్రవ్యోల్బణంలో పారిశ్రామిక ఉత్పత్తుల వాటా మోతాదు తగ్గింది. దాంతో 2008 నాటికి రెండంకెలకు చేరిన ద్రవ్యోల్బణం తిరిగి 2009 ఫిబ్రవరి నాటికి ప్రతికూల దశకు చేరింది. నాటి నుండీ ప్రభుత్వ అంచనా ప్రకారమే వరుసగా 18 నెలల పాటు పారిశ్రామికోత్పత్తుల ధరల భారం స్థానంలో ఆహారోత్పత్తుల ధరల భారం ఆర్థిక వ్యవస్థను వెన్నాడుతూ వచ్చింది. 2010-2011 వార్షిక బడ్జెట్‌ను ప్రతిపాదిస్తూ ఆర్థిక మంత్రి ఈ సంవత్సరం ద్రవ్యోల్బణం 7-9 శాతం ఉంటుందని హామీ ఇచ్చినా బడ్జెట్‌ పార్లమెంట్‌ ఆమోదం పొందిన నెలరోజులు కూడా గడవక ముందే '' ద్రవ్యోల్బణం అదుపు తప్పేట్లుంది'' అంటూ సెలవిచ్చారు. కానీ ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రధాన సలహాదారు కౌశిక్‌ బసు మాత్రం ద్రవ్యోల్బణం 5 శాతం లోపే ఉంటుందని ఢంకా బజాయిస్తున్నారు. బసు మాటలను లెక్కపెట్టని ద్రవ్యోల్బణం మార్చి చివరి వారానికి 9.9 శాతానికి చేరింది. ఫిబ్రవరి, మార్చిల్లో 16 శాతానికి అటు ఇటుగా ఉన్న ఆహారోత్పత్తుల ద్రవ్యోల్బణం ఏప్రిల్‌ మొదటి వారానికి తిరిగి 18 శాతానికి చేరింది. దాంతో ఈ ఆర్థిక సంవత్సరం అంతా ఆర్థిక వ్యవస్థ రెండంకెల ద్రవ్యోల్బణం నీడన కొనసాగాల్సి వస్తుందన్న విషయం ఖాయంగా కనిపిస్తోంది.

భారతదేశం ఆర్థికాభివృద్ధి లాగానే ప్రధానంగా ఐదు అంశాలపై ఆధారపడి ఉంటుంది. ఉంది. అవి ద్రవ్యోల్బణం, వడ్డీ రేట్లు, రుతుపవనాలు, ముడిచమురు ధరలు, సంపన్న దేశాల ఆర్థిక వ్యవస్థలు తిరిగి స్తబ్ధతకు లోనుకాకుండా ఉండటం. ఇవన్నీ ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్న అంశాలు. తొలి అంశం ద్రవ్యోల్బణం ఇప్పటికే అదుపు తప్పిందని, ప్రభుత్వం ప్రతిపాదించిన బడ్జెట్‌ ద్రవ్యోల్బణం పెంచేదిగా ఉందన్న విషయంలో విమర్శలకు మధ్య ఏకాభిప్రాయం ఉంది. ఈ పరిస్థితుల్లో ద్రవ్యోల్బణాన్ని అదుపు చేసేందుకు అవసరమైన సమగ్ర విధానాన్ని ప్రతిపాదించటానికి బదులుగా ప్రభుత్వం, ముఖ్యంగా రిజర్వు బ్యాంకు ద్రవ్య చలామణి, వడ్డీ రేట్ల నియంత్రణ ద్వారా అదుపు చేయాలని ప్రయత్నిస్తోంది. మార్చి చివరి వారంలో రెపో రేట్లు, రివర్స్‌ రెపో రేట్లు పెంచటం ఇందులో భాగమే. రిజర్వు బ్యాంకు వడ్డీ రేట్లు పెంచటం ద్వారా మార్కెట్‌లో అదనంగా ఉన్న రొక్కం నిధులు తొలగించాలని తారాపూర్‌ వంటి ద్రవ్య ఆర్థిక వేత్తలు వాదిస్తున్నారు. వీరు సరఫరా వైపున ఉన్న సమస్యలకు అంత ప్రాధాన్యత ఇవ్వటం లేదు. 2008కు పూర్వం మార్కెట్లో ల్వికిడిటీ, ద్రవ్య సరఫరా ఈ స్థాయిలో లేదు. అయినా ద్రవ్యోల్బణం 16 శాతం వరకూ పెరిగింది. అప్పట్లో అంతర్జాతీయంగా పెరిగిన చమురు ధరలు కారణం అని ప్రకటించి ప్రభుత్వం చేతులు దులుపుకొంది. ఈ సంవత్సరం బారెల్‌ ముడి చమురు ధర 70-78 డాలర్లు ఉంటుందన్న అంచనాపై ఆధారపడి 2010-2011 బడ్జెట్‌ అంచనాలు రూపొందించబడ్డాయి. కానీ నెలరోజులు తిరక్కముందే చమురు ధర 85-90 డాలర్లకు చేరింది. కనీసం 20 శాతం పెరిగింది. ఈ భారం అంతా వర్థమాన దేశాల ఆర్థిక వ్యవస్థలపై పడుతుందనటంలో సందేహం లేదు. ఇక రుతుపవనాల సంగతి సరే సరి. జూన్‌, జూలై నాటికి కానీ దాని ప్రభావం పూర్తి స్థాయిలో అవగతం కాదు. చివరికి మిగిలింది సంపన్న దేశాల ఆర్థికాభివృద్ధి స్థితి గతులు. యూరప్‌ పరిణామాలు పరిశీలిస్తున్న వారికెవరికైనా అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ అంత తేలికగా కుదుట పడుతుందన్న నమ్మకం కలగటం లేదు. అమెరికా తాజాగా ఆమోదించిన ఆరోగ్య బీమా చట్టం వలన భారతదేశంలో ఐటి, బిపిఒ, ఔషధ పరిశ్రమలు లబ్దిపొందవచ్చునేమో కానీ మౌలిక ఆర్థిక రంగం లబ్ది పొందటం సాధ్యం కాదు. ఇటువంటి పరిస్థితుల్లో జాతీయ ఆర్థిక వ్యవస్థను కట్టుదిట్టం చేసి, ఉపాధి భద్రత, ఆహార భద్రత కల్పించటంద్వారా శ్రమశక్తిని పూర్తిస్థాయిలో వినియోగించుకుంటే తప్ప జాతీయ ఆర్థిక వ్యవస్థ 7.7 శాతం వృద్ధి రేటు సాధించటం వీలుపడదు.

కానీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు శ్రమశక్తి మార్కెట్‌కు పూర్తి స్థాయిలో పని కల్పించే విధంగా లేవు. ఒక్క బిఎస్‌ఎన్‌ఎల్‌లోనే మూడో వంతు ఉద్యోగులకు ఉద్వాసన పలకటానికి పిట్రోడా కమిటీ సిఫార్సు చేసింది. అదేవిధంగా నవరత్న, మినీ నవరత్న మొదలు లాభాలు ఆర్జిస్తున్న కంపెనీలన్నీ పెట్టుబడుల ఉపసంహరణ వధ్య శిలపై ఉన్నాయి. ఒక కంపెనీలో పెట్టుబడులు ఉపసంహరణ జరిగిన తర్వాత ఉపాధి అవకాశాలు పెరగటం మాట అటుంచి ఉన్న ఉపాధి అవకాశాలు నిలుపుకున్న దాఖలాలు గత రెండు దశాబ్దాల అనుభవంలో కనిపించటం లేదు. ఇప్పటికే గృహనిర్మాణ రంగం, రియల్‌ ఎస్టేట్‌ రంగాల్లో వృద్ధి రేటు మందగించటంతో ఈ రంగాలను ఆసరా చేసుకుని పట్టణాలకు వలస వచ్చిన కోట్లాదిమంది అసంఘటిత రంగ కార్మికులు ఆహార భద్రతకు దూరమవుతున్నారు. గ్రామీణ భారతంలో కోట్లకొద్దీ ఆకలి కడుపులు కనీసం ఒక్క పూట తిండి గ్యారంటీ కోసం ఎదురు చూస్తున్నాయి. గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా పెద్దఎత్తున వ్యవసాయ కార్మికుల చేతుల్లో ఆదాయాలు నింపుతున్నామని ప్రభుత్వ అధ్యయనాలు తెలుపుతున్నా, పెరుగుతున్న ధరల భారంతో పోల్చినపుడు ఈ ఆదాయాలు అంతంత మాత్రంగానే ఉన్నాయి. దీనికి తోడు ఆహారోత్పత్తుల విషయంలో ఫ్యూచర్స్‌ మార్కెట్‌, ఫార్వర్డ్‌ మార్కెట్‌లకు అనుమతించటం, అందులో కూడా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు అనుమతించే యోచనలో ప్రభుత్వం ఉండటంతో ధరలు దీపావళికి ముందే తారాజువ్వల్లా పైకెగుస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో ఆహార భద్రత చట్టం గురించి ప్రభుత్వం చర్చిస్తోంది. దీనికి తోడు ద్రవ్యోల్బణం, అంతర్జాతీయ చమురు ధరలు కలిసి ధరాఘాతం ఆహారోత్పత్తుల పరిధి దాటి పారిశ్రామికోత్పత్తులను తాకింది. ఇది చాలదన్నట్లు ప్రభుత్వం పలు రూపాల్లో పరోక్ష సుంకాలు పెంచి ఈ ద్రవ్యోల్బణాన్ని, ధరాఘాతాన్ని మరింత పెంచేలా చేసింది.

ఈ చర్చకు గ్రామీణ భారత వాస్తవికతకు ఏ మాత్రం పొంతన లేకుండా ఉంది. ఎప్పుడో 1973-1974లో రూపొందించిన పౌష్టికాహార ప్రమాణాల ప్రాతిపదికన 2010లో పౌష్టికాహార అవసరాలు గుర్తించటానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ మూడు దశాబ్దాల్లో ఆహార అలవాట్లే కాదు, అందుబాటులో ఉన్న ఆహారంలో పౌష్టికాహార మోతాదు కూడా మారిపోతోంది. ద్రవ్యోల్బణం కారణంగా సంవత్సరం క్రితం 20-30 రూపాయలు ఉన్న కిలో మంచి బియ్యం ధర నేడు 35-45 రూపాయలకు పెరిగింది. ఈ పెరుగుదలను పరిగణలోకి తీసుకోకుండా ప్రభుత్వం అంచనాలు తయారు చేసి నిధులు మంజూరు చేస్తే ఈ నిధులు ఒక రోజు తిండికి బదులు ఒక పూట తిండి పెట్టటానికే సరిపోతాయి. జాతీయ ఆహార అవసరాలు లెక్కించేటపుడు ప్రభుత్వం ఈ మార్పులను పరిగణనలోకి తీసుకోవాలి. కానీ పేదరికం గురించిన మేధోమధనం ఈ దిశగా జరగటం లేదు. ఎంతమందిని ఆకలిగొన్న వారిగా గుర్తిస్తారన్నది అవసరాన్ని బట్టి కాక అవకాశాన్ని బట్టి అన్నట్లు ప్రభుత్వం వ్యవహరిస్తోంది. అంటే నిజంగా ఎన్ని ఆకలి కడుపులు నింపాలి అన్నది ప్రాతిపదికగా కాక ఖజానాలో ఎన్ని నిధులున్నాయి, ఈ నిధులు ఎంతమందికి సరిపోతాయన్న ప్రాతిపదికన పేదరికాన్ని అంచనా వేసేందుకు ఆక్స్‌ఫర్డ్‌ నుండి హార్వార్డ్‌ విశ్వవిద్యాలయాల్లో అర్ధశాస్త్రం పట్టా పుచ్చుకున్న మేధావులు లెక్కలు వేస్తున్నారు. ఈ విషయం చూస్తుంటే మనిషి పొడవును బట్టి మంచం తయారు చేయటానికి బదులు ఉన్న మంచం పొడవుకు మనిషిని తగ్గించటం అన్న సామెత గుర్తుకు వస్తోంది. మారుతున్న జాతీయ, అంతర్జాతీయ ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో దేశంలో ఆహారభద్రతపై జరుగుతున్న చర్చ మరింత విశాల దృక్ఫథంతో జరగాలి. సంకుచిత దృక్ఫథంతో కాదు.

కొండూరి వీరయ్య

No comments: