Monday, October 4, 2010

తిరోగమిస్తున్న ఉద్యోగ కల్పన


దేశంలో ఉపాధి కల్పన సామర్థ్యం, వాస్తవిక ఉపాధి కల్పన, నిరుద్యోగం గురించి తాజాగా జాతీయ నమూనా సర్వే సంస్థ ఒక అధ్యయనం నిర్వహించింది.2007-2008 సంవత్సరాల కాలానికి గాను ఈ సర్వే జరిగింది. 2004-2005 తర్వాత ఇటువంటి సర్వే జరగటం ఇదే మొదటిసారి. ఈ సర్వే నిర్ధారణలు పరిగణనలోకి తీసుకొంటే భారత ఆర్థిక వ్యవస్థ మరోమారు ఉపాధి రహిత అభివృద్ధి దిశగా సాగు తున్నట్లు చెప్ప వచ్చు. ఈ సర్వే యుపిఎ1 పాలనా కాలంలోని మొదటి మూడు సంవత్సరాల్లో ఉపాధి స్థితిగతులను అధ్యయనం చేసింది. 64వ సర్వేగా పిలవబడుతున్న ఈ సర్వేలో అనేక విషయాలు వెలుగు చూశాయి. ఇందులో ఉపాధిరంగం తీరు తెన్నులు, ధోరణులు, రంగాలవారీ విస్తరణ వంటి విషయాలను సర్వే ప్రస్తావించింది.


ఈ విషయం లోతుగా పరిశీలించటానికి ముందు భారత ఆర్థిక వ్యవస్థలో ఉపాధి కల్పన తీరు తెన్నుల గురించి తెలుసుకుందాం. 1991 తర్వాత భారతదేశంలో శ్రమశక్తి మార్కెట్‌ విస్తరణ మందగించింది. అదేసమయంలో ఆర్థిక వ్యవస్థ వృద్ధి రేటు 4 శాతం నుండి 8 శాతానికి పెరిగింది. నిజానికి ఉద్యోగశ్రేణి సంఖ్య 9.3శాతం నుంచి 7.5 శాతానికి పడిపోయింది. అంటే ఈ కాలంలో భారత ఆర్థిక వ్యవస్థ తక్కువ మంది కార్మికులతో ఎక్కువ ఉత్పత్తి సాధించింది. దీన్నే ఆర్థిక వేత్తలు ఉత్పాదకత పెరుగుదల అంటున్నారు. ఈ ఉత్పాదకత పెరుగుదల, దాంతోపాటు లాభాల పెరుగుదల వల్ల దేశంలో శతకోటీశ్వరుల సంఖ్య పెరిగిందే తప్ప కార్మికవర్గానికి ఒరిగింది ఏమీ లేదు. సంస్కరణల తర్వాత కాలంలో ఉపాధికాలం నిడివి అస్థిరత, అభద్రతతో కూడుకున్న కాలంగా ఈ కాలాన్ని చెప్పుకోవచ్చు.అంటే ఈ కాలంలో మూకుమ్మడి తొలగింపులు జరిగాయి. కార్మిక హక్కులైన కనీస వేతనాలు, కలెక్టివ్‌ బార్గెయినింగ్‌, శాశ్వత ఉద్యోగాలు వంటి వాటి ఊసు లేదు. 80 దశకం వరకూ ఆర్థిక వ్యవస్థ కల్పిస్తూ వచ్చిన శాశ్వత ఉపాధి అవకాశాలకు, 90 దశకం చివర, 21వ శతాబ్దం మొదట్లో అందుబాటులోకి వచ్చిన అశాశ్వత ఉపాధి అవకాశాలకు మధ్య వ్యత్యాసం ఉంది. మొదటి దశలో కల్పించబడిన ఉపాధి అవకాశాలు దేశంలో నిలకడైన మధ్యతరగతివర్గం రూపొందటానికి దోహదం చేశాయి. ఈ మధ్యతరగతి వర్గం దేశవ్యాప్తంగా సమానపాళ్లలో అభివృద్ధిచెందటంతో ఆర్థిక వ్యవస్థలో ముఖ్యమైన పాత్ర పోషించింది.

రెండో దశలో కూడా ఆర్థిక వ్యవస్థ ఐటి ఉద్యోగాల రూపంలో నూతన మధ్యతరగతిని సృష్టిస్తున్నా ఈ మధ్యతరగతి మనుగడకాలం నిలకడగా లేకపోవటంతో పాటు దేశవ్యాప్తంగా పరిమిత కేంద్రాల్లో మాత్రమే ఈ వర్గం ఉనికిలోకి వచ్చింది. ఈ కాలంలోనే భారతదేశంలో వ్యవసాయ, పారిశ్రామిక రంగాల్లో సాధించలేని ఉపాధి అవకాశాల కల్పన ఐసిటి, ఇన్ఫర్మేషన్‌ కమ్యూనికేషన్స్‌ మరియు టెక్నాలజీ రంగం సాధిస్తుందని ప్రభుత్వ ఆర్థిక వేత్తలు, సంస్కరణల మద్దతుదారులు సూత్రీకరణలు చేశారు. దాంతో మిగిలిన దేశాలు అనుసరించిన విధంగా పారిశ్రామికీకరణ ద్వారా ఆర్థికాభివృద్ధి సాధించాల్సిన అవసరంలేదని, సేవారంగం ఈ పాత్ర పోషించగదలన్న వాదనను పలువురు ఆర్థిక వేత్తలు ముందుకు తెచ్చారు. కానీ ఆచరణలో ఐసిటి రంగం, సేవారంగం ఆశించిన లక్ష్యాలు చేరలేకపోయిందని అనుభవం రుజువు చేస్తోంది. వ్యవసాయేతర రంగాల్లో ఈ ఉపాధి అవకాశాలు విస్తరించాయని ఈ అధ్యయ నం చెప్తోంది. ఎన్డీయే హయాంలో వ్యవసాయం కుదేలైన విషయం అందరికీ తెలిసిందే. వ్యవసాయరం గంలో ఉపాధి అవకావాలు స్థబ్దతకు లోనుగావటంతో ప్రజలు పెద్దఎత్తున పొట్ట చేతపట్టుకుని పట్టణాలకు వలస వచ్చారు. ఈ విధంగా వలస వచ్చిన వారందరూ పట్టణాల్లో అసంఘటితరంగంలో రోజువారీ కూలీలుగా చేరిపోయారు. ఈ పరిణామాన్నే ప్రభుత్వం వ్యవసాయేతర రంగాల్లో ఉపాధి విస్తరణ అని గౌరవంగా చెప్పుకొంటోంది.

ఇక 64వ రౌండ్‌ సర్వే ఫలితాలు చూద్దాం. 2005-2008 మధ్య కాలానికి గాను జరిగిన ఈ అధ్యయనంలో సంవత్సరానికి 0.8 మిలియన్లు మాత్రమే ఉపాధి అవకాశాలు కల్పించగలిగినట్లు ఈ సర్వే అంచనా వేసింది. ఈ మూడేళ్ల కాలంలో దేశంలో మొత్తం అన్ని రకాల కార్మికుల సంఖ్య 457.9 మిలియన్ల నుండి 460. మిలియన్లకు చేరింది. అంటే వార్షిక పెరుగుదల రేటు 0.17 శాతం మాత్రమే. ఎన్డీయే హయాంలో వ్యవసాయ సంక్షోభంతో పట్టణ ప్రాంత అసంఘటితరంగంలో కార్మికుల సంఖ్య పెరిగితే యుపిఎ 1 హయాంలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం చలవతో గ్రామీణ ప్రాంతంలో 44 లక్షల ఉద్యోగాలు పెరిగాయి. అయితే ఈ కాలంలో స్థూల జాతీయాభివృద్ధి రేటు 7 శాతం నుండి 9 శాతం వరకూ పెరిగింది. అయినా కీలక రంగాల్లో ఉపాధి అవకాశాల విస్తరణ సాధ్యం కాలేదని సర్వే స్పష్టం చేసింది. అంటే దేశం ఉపాధిరహిత అభివృద్ధి దశలోకి ప్రవేశిస్తోందన్న ఆందోళన కలుగుతోంది.


ఈ వివరాలు పరిశీలిస్తే స్థూల జాతీయాభివృద్ధి రేటుకు, ఉపాధి కల్పనకు మధ్య ఉన్న సంబంధం గురించి చర్చ ముందుకు వస్తోంది. 2010 జూలైలో కేంద్ర కార్మికమంత్రిత్వ శాఖ విడుదల చేసిన నివేదిక ప్రకారం - వివరాలకు జూలై 28 బిజినెస్‌వాచ్‌ చూడండి- నేడున్న శ్రమశక్తిని తగిన రీతిలో వినియోగించుకో వాలంటే జిడిపి 10 శాతం వరకూ పెరగాల్సి ఉందని అంచనా వేసింది. అంటే జిడిపి పెరిగితే ఉపాధి పెరుగుతుందన్నది ప్రభుత్వం అంచనా. కానీ 64వ ఎన్‌ఎస్‌ ఎస్‌ఒ సర్వే ఫలితం, ఈ అంచనాకు భిన్నంగా ఉందని గణాంకాలతో రుజువు చేస్తోంది. సెప్టెంబరు 2010లో ఐక్యరాజ్యసమితి పరిధిలోని వాణిజ్య అభివృద్ధి మండలి విడుదల చేసిన నివేదిక కూడా ఈ విషయాన్ని నొక్కి చెప్తోంది. ఒక అధ్యా యానికి ఏకంగా సేవారంగం సాధించిన వృద్ధి రేటు ఉపాధి అవకాశాలపై ప్రభావం చూపుతుందా అన్న ప్రశ్నతో మొదలవుతోంది.

1991 తర్వాత భారత ఆర్థిక వ్యవస్థ అంగనిర్మాణంలో వచ్చిన మార్పులను విశ్లేషించిన ఈ నివేదిక '' భారతదేశం తొలి నాళ్లలో (1950-1980) అనుసరించిన అభివృద్ధి వ్యూహం దిగుమతులను అదుపుచేయటానికి వీలుగా దేశాన్ని పారిశ్రామికీకరిం చటం. ఈ విధానంతో కాస్తంత సంపద పంపిణీపై కూడా శ్రద్ధ ఉండేది. ఈ శ్రద్ధకు ఆ కాలంలో సమాజంలోని వివిధ వర్గాలు సాగించిన పోరాటాలు, వలసవాద వ్యతిరేక విముక్తి పోరాటాలు కారణం. అయితే కాలక్రమంలో బూర్జువా భూస్వామ్య వర్గాలు తమ సంఖ్యాబలానికి మించి పాలక పార్టీలను ప్రభావితం చేశాయి. దాంతో రాజ్యాంగయంత్రం అభివృద్ధితో పాటు సమానత్వాన్ని సాధించే వ్యూహాల నుండి వైదొలగింది. 1960,70 దశకాల్లో పాలక పార్టీ నినాదం పేదరిక నిర్మూలన అయినప్పటికీ ఈ నినాదం ప్రజాకర్షణ స్థాయిని మించి ముందుకు పోలేదు. దాంతో వస్తూత్పత్తి రంగం సమకాలీన తూర్పు ఆసియా దేశాల్లో పురోగతి సాధించినట్లుగా భారతదేశంలో పురోగతి సాధించలేకపోయింది.

గత రెండు దశాబ్దాలుగా విధాన ప్రాధాన్యతల్లో వచ్చిన మార్పులు వ్యవసాయం, వస్తూత్పత్తి రంగాలకంటే సేవారంగంపై దృష్టి కేంద్రీకరించాయి. దీనివలన స్థూల జాతీయోత్పత్తి పెరిగిన మాట నిజమే. అయితే కేవలం సేవారంగంలో ఆధిపత్యం సాధించటం ద్వారానే భారతదేశం మారుతున్న ప్రపంచ ఆర్థికరంగంలో తన స్థానాన్ని నిలుపుకోగలుగు తుందా అన్నది సందేహాస్పదమే. భారతదేశంలో ఉపాధి కల్పన వృద్ధి సాంప్రదాయక అభివృద్ధి ధోరణులను ప్రతిబింబించటం లేదు'' అని నిర్ధారించింది. చివరిగా సంస్కరణల కాలంలో పారిశ్రామిక రంగం ఉత్పాదకత పెరిగింది. కానీ ఈ ఉత్పాదకత శ్రమశక్తి పెరగటంతో సాధించిన ఉత్పాదకత కాదు. వెరసి ఎన్‌ఎస్‌ఎస్‌ఓ 64వ దఫా సర్వే భారత ఆర్థిక వ్యవస్థ మరోమారు ఉపాధి రహిత అభివృద్ధి దశలోకి ప్రవేశిస్తుందన్న సందేహాన్ని బలోపేతం చేస్తోంది.

కొండూరి వీరయ్య

No comments: