Wednesday, October 27, 2010

దిగాలుపడిన వస్తూత్పత్తి రంగం - ముప్పు దిశగా వాణిజ్య లోటు


కేంద్ర ప్రభుత్వం జాతీయ ఆర్థిక వ్యవస్థ దిశ, దశను సూచించేందుకు వివిధ రకాల గణాంకాలు, సూచికలు, అంచనాలు విడుదల చేస్తూ ఉంటుంది. అందులో రోజువారీ కనిపించే సెన్సెక్స్‌ సూచిక మొదలు నెలసరి విడుదల చేసే పారిశ్రామికోత్పత్తి సూచిక, రిజర్వు బ్యాంకు విడుదల చేసే గణాంక నివేదికలు, మంత్రిత్వ శాఖలు విడుదల చేసే ప్రగతి నివేదికలు ఉంటాయి. సంవత్సరానికి ఒకసారి విడుదల చేసే ఆర్థిక సర్వే ఈ గణాంక నివేదికలకు తలమానికం. అయితే సాధారణంగా పాఠకులు, పత్రికలు రోజువారీ సెన్సెక్స్‌కు ఇచ్చినంత ప్రాధాన్యత మిగిలిన సూచికలకు ఇవ్వరు. సెన్సెక్స్‌ సూచిక రోజువారి స్టాక్‌మార్కెట్‌లో జరిగే లావాదేవీలను ప్రతిబింబిస్తే పారిశ్రామికోత్పత్తి సూచిక ఆర్థిక వ్యవస్థ తీరుతెన్నులను, దశను, దిశను అర్థం చేసుకోవటానికి ఉపయోగపడుతుంది. అందువల్లనే జాతీయ ఆర్థిక వ్యవస్థల ప్రామాణికతను తెలుసుకోవటానికి నెలకొకసారి విడుదల అయ్యే పారిశ్రామికోత్పత్తి సూచిక కొలమానంగా ఉంటోంది. గత వారం ప్రభుత్వం ఆగస్టు 2010కి సంబంధించి పారిశ్రామికోత్పత్తి గురించిన గణాంకాలు విడుదల చేసింది. సెప్టెంబరు చివరి వారంలో సెన్సెక్స్‌ 20,000 పాయింట్లు అధిగమించటంతో ఈ విషయం పత్రికల్లో పతాక శీర్షికలకెక్కింది. కానీ పారిశ్రామికోత్పత్తి గణాంకాల నివేదిక మాత్రం అటు వాణిజ్య పత్రికల్లోనూ, ఇటు దినపత్రికల్లో వాణిజ్య పేజీల్లోనూ ఏదో మూల చిన్న పట్టికలకు పరిమితం అయ్యింది. పారిశ్రామికోత్పత్తి సూచికలను సహజంగా గత సంవత్సరం ఇదే నెల్లో జరిగిన ప్రగతి, తిరోగమనం ఆధారంగా పరిశీలించటం ఉపయోగకరంగా ఉంటుంది.

2009 ఆగస్టులో పారిశ్రామికోత్పత్తి 10.6 శాతంగా నమోదైంది. అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ సంక్షోభంలో చిక్కుకున్న తర్వాత ఈ స్థాయిలో పారిశ్రామికోత్పత్తి సాధించటం ఇదే ప్రథమం. దాంతో ఇటు దేశీయంగాను, అటు అంతర్జాతీయంగానూ భారత ఆర్థిక వ్యవస్థ శక్తి సామర్థ్యాలపై ఎనలేని విశ్వాసం వ్యక్తం అయ్యింది. చివరకు ఐఎంఎఫ్‌, ప్రపంచబ్యాంకు, ఐక్యరాజ్యసమితి మొదలు అన్ని అంతర్జాతీయ సంస్థలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థను బయటకు తీసుకొచ్చే శక్తి చైనాతో పాటు కేవలం భారతదేశానికి మాత్రమే ఉందని నిర్ధారణలకు రావటం మొదలైంది. సంవత్సరం తిరిగేలోపే పరిస్థితులు పూర్తిగా మారిపోతున్నాయి. ఈ సంవత్సరం ఆగస్టులో ప్రభుత్వం విడుదల చేసిన గణాంకాల ప్రకారం పారిశ్రామికోత్పత్తి 2010 ఆగస్టు నాటికి 6.5 శాతానికి తగ్గింది. గత 15 నెలల్లో ఇదే అతి తక్కువ అని ప్రభుత్వమే ప్రకటించింది. ఇందులోనూ ముఖ్యంగా విద్యుదుత్పత్తి వృద్ధి రేటు గత సంవత్సరం ఆగస్టులో 10.6 శాతంగా ఉంటే ఈ సంవత్సరం ఆగస్టులో 1 శాతానికి పరిమితం అయ్యింది. అంతకంటే ముఖ్యమైనది వస్తూత్పత్తి రంగం. వస్తూత్పత్తి రంగం (మాన్యుఫాక్చరింగ్‌) గత సంవత్సరం ఆగస్టులో 10.6 శాతం వృద్ధి రేటు సాధిస్తే ఈ సంవత్సరం ఆగస్టులో కేవలం 5.6 శాతానికి పరిమితం అయ్యింది. గనుల తవ్వకం రంగంలో కూడా తిరోగమనమే కనిపిస్తున్నా మిగిలిన రంగాలంత నిరాశాజనకంగా లేదు. గత సంవత్సరం ఆగస్టులో 11 శాతంగా ఉన్న గనుల తవ్వకం వృద్ధి రేటు ఈ సంవత్సరం ఆగస్టులో 7 శాతానికి తగ్గిపోయింది. ఏ దేశంలోనైనా ఆర్థిక వ్యవస్థ బలం, బలహీనతలకు ఈ మూడు రంగాలు కీలకమైన సంకేతాలు అనటంలో సందేహం లేదు.

పారిశ్రామికోత్పత్తి సూచిక అనేక ఆందోళనలను ముందుకు తెస్తోంది. ముందుగా గనుల తవ్వకం రంగం గురించి పరిశీలిద్దాం. ఆగస్టులో భారతదేశంలో గనుల తవ్వకం రంగానికి సంబంధించి రెండు కీలక నిర్ణయాలు జరిగాయి. ఒరిస్సాలో వేదాంత కంపెనీకి ఇచ్చిన మైనింగ్‌ లీజును కేంద్ర ప్రభుత్వం రద్దు చేయటం ఇందులో మొదటిది కాగా కర్ణాటక నుండి ఇనుప ఖనిజం ఎగుమతుల విషయంలో ఆంక్షలు విధించటం ఈ పతనానికి ముఖ్యకారణంగా చెప్పుకోవచ్చు. ఈ రెండు మినహాయిస్తే గనులతవ్వకం రంగం వృద్ధి రేటులో గత సంవత్సరంతో పోల్చి చూస్తే పెద్దగా వ్యత్యాసం ఏమీ లేదని చెప్పుకోవచ్చు. అందువల్లనే గనులు, ఖనిజవనరులకు సంబంధించిన కంపెనీల షేర్ల సూచికలో పెద్దగా మార్పు రాలేదు. సరుకుల ఫ్యూచర్స్‌ ట్రేడింగ్‌ ఇంకా గాలివాటు అంచనాలతో ముందుకు వెళ్తూనే ఉంది.

వస్తూత్పత్తి రంగం గురించి ఇపుడు పరిశీలిద్దాం. ఏ దేశంలోనైనా ఆర్థిక వ్యవస్థకు అవసరమైన పారిశ్రామిక సరుకులు, వస్తువులు ఆ దేశ వస్తూత్పత్తిరంగం అందిస్తోంది. వస్తూత్పత్తి రంగంలో వృద్ది రేటు తగ్గిపోయిందంటే మార్కెట్‌లోనూ, గోదాముల్లోనూ ఉన్న సరుకుల కదలికలు మందగించాయని అర్థం. అంతేకాదు. ఈ కాలంలో భారతదేశంలో తాత్కాలిక కార్మికులను పనిలోకి తీసుకునే రేటు పెరిగిందని పలు సర్వేసంస్థలు అంచనా వేశాయి. పాశ్చాత్య ఆర్థిక వ్యవస్థల తరహాలో వారాల ప్రాతిపదికన ఈ అంచనాలు విడుదలవుతున్నాయి. నిజానికి ఈ అంచనాలు కేవలం ఐటి రంగాన్ని దృష్టిలో పెట్టుకుంటున్నాయి తప్ప ఆర్థిక వ్యవస్థకు ఇరుసుగా ఉన్న వస్తూత్పత్తి రంగంలో మార్పులు గమనంలోకి తీసుకోవటం లేదన్న విషయాన్ని ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఐటి రంగం, ఇతర సేవారంగాల తరహాలో వస్తూత్పత్తి రంగం తాత్కాలిక కార్మికులు అదికూడా వారాలు, నెలల వారీగా పని చేసే కార్మికులతో నడవదు. వస్తూత్పత్తిరంగంలో దీర్ఘకాల అవసరాలను దృష్టిలోకి తీసుకుని వనరుల సమీకరణ ప్రణాళిక తయారు చేయటం జరుగుతుంది. ప్రభుత్వమే ప్రకటించిన విధంగా వస్తూత్పత్తిరంగంలో వృద్ధి రేటు పతనం అవుతున్నపుడు పరిశ్రమాధిపతులు ఎక్కువమంది కార్మికులను పనిలోకి తీసుకుంటారని విశ్వసించలేము. ఎందుకంటే పరిశ్రమాధిపతులు పెట్టే ప్రతి రూపాయి పెట్టుబడికి లాభం ఆశించటం ఆ వర్గ లక్షణం. అందువల్ల వస్తూత్పత్తిరంగంలో తగ్గుతున్న వృద్ధి రేటు, పెరుగుతున్న నిరుద్యోగం రేటు సమాంతరంగా ఉన్నాయి.

తగ్గుతున్న వస్తూత్పత్తిరంగం వృద్ధి రేటు ప్రభావం అంతర్జాతీయ వాణిజ్యంలో ప్రతిఫలిస్తోంది. ఈ సంవత్సరం భారతదేశం నుండి జరిగే ఎగుమతుల వాటా తగ్గుతూ వస్తోంది. ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థ గురించి ఎంతగా గొప్పలు చెప్పుకుంటున్నా దేశం నుండి జరిగే ఎగుమతుల విషయంలో కేంద్ర వాణిజ్య శాఖ నెలసరి నివేదికలు వాస్తవాలను దాయలేకపోతున్నాయి. వ్యవసాయోత్పత్తుల మొదలు పారిశ్రామికోత్పత్తుల వరకూ దేశం నుండి ఎగుమతులు తగ్గుతున్నాయి. అదే సమయంలో దిగుమతుల్లో మార్పు ఉండటం లేదు. దాంతో జాతీయ ఆర్థిక వ్యవస్థలో వాణిజ్య లోటు పెరిగిపోతోంది. గత సంవత్సరం 4.5 బిలియన్‌ డాలర్లుగా ఉన్న వాణిజ్య లోటు ఈ సంవత్సం ఇప్పటికే మూడు రెట్లు పెరిగి 13 బిలియన్‌ డాలర్లకు చేరుకొంది. కరెంట్‌ అక్కౌంట్‌ ( తాత్కాలిక ఖాతా) లోటులో వాణిజ్య లోటు కీలకమైన వాటా కలిగి ఉంటుంది. దాంతో కరెంట్‌ అక్కౌంట్‌ లోటు ఇప్పటికే బడ్జెట్‌లో అంచనా వేసిన 1 శాతం కంటేమించి పోయింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగియటానికి మరో ఆర్నెల్ల వ్యవధి ఉండటంతో ఈ లోటు మరింత పెరిగిపోతుందన్న ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి.

మరోవైపున ఆహారోత్పత్తుల ద్రవ్యోల్బణం, పారిశ్రామికోత్పత్తుల ద్రవ్యోల్బణం పెరుగుదలను కట్టడి చేసే విషయంలో ఎటువంటి మార్పూ కనిపించటం లేదు. ఫలితంగా వర్తమాన భారత ఆర్థిక వ్యవస్థలో ద్రవ్యోల్బణం, పారిశ్రామికోత్పత్తి వృద్ది రేటు పతనం, నిరుద్యోగం పెరుగుదల, వాణిజ్యలోటు ఏకకాలంలో ప్రతికూల లక్షణాలు ప్రతిబింబిస్తున్నాయి. ఈ నాలుగు లక్షణాలు ఆర్థిక వ్యవస్థలో ఏకకాలంలో వ్యక్తమైతే దీన్ని మాంద్యోల్బణంగా ఆర్థికవేత్తలు పరిగణించటం పరిపాటి. గతంలో 1990 దశకంలో భారత ఆర్థిక వ్యవస్థ అనుభవించిన ఉపాధి రహిత అభివృద్ధి దశ మరోమారు సంభవించే సూచనలు కనిపిస్తున్నాయని చర్చించుకున్నాము. ప్రభుత్వం విడుదల చేసిన పారిశ్రామికోత్పత్తి గణాంకాలు 80 దశకంలో జాతీయ ఆర్థిక వ్యవస్థ అనుభవించిన మాంద్యోల్బణం లక్షణాలను మరోసారి ముందుకు తెస్తోంది. ఇది ఇటు జాతీయ ఆర్థిక వ్యవస్థలో ఉత్పాదకతతో ముడిపడిన వృద్ధి రేటును ప్రశ్నార్థకం చేయటంతో పాటు అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థను తాజా డోలయమానం నుండి బయటకు తేవటంలో భారత్‌ పోషించే పాత్రను ప్రశ్నార్థకం చేయనుందనటంలో సందేహం లేదు. (మాంద్యం-విదేశీ పెట్టుబడుల ప్రవాహం-రూపాయి విలువ పెరగటం గురించిన విషయాలు వచ్చే వారం చర్చించుకుందాం.)

No comments: