Sunday, October 24, 2010

ఉపాధి రహిత అభివృద్ధి ఎందువల్ల?

* పెట్టుబడి పక్షపాతులైన ప్రభుత్వాలు
* ఆర్థిక వ్యవస్థలో లోపిస్తున్న సమతౌల్యం
* వికటిస్తున్న శ్రమ - పెట్టుబడి సంబంధాలు

ప్రపంచ ఆర్థిక వ్యవస్థ సంక్షోభం నుండి బయటపడుతున్న నేపథ్యంలో ఐక్యరాజ్యసమితి మొదలు ఐఎంఎఫ్‌ వరకూ ఉపాధి రహిత అభివృద్ధి గురించి ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. జాతీయ ఆర్థిక వ్యవస్థల వివరాలతో అమెరికా, భారతదేశాల్లో ఉపాధి రహిత అభివృద్ధి తీరుతెన్నుల గురించి గత రెండు వారాలుగా చర్చించుకున్నాము. ఈ వారం అసలు అభివృద్ధి ఉపాధి రహితంగా ఎందుకు మారుతుందన్న మౌలిక ప్రశ్న గురించి చర్చించుకుందాం.

సంస్కరణల వేగంతో మరుగుపడిన వ్యవస్థాగత సమతౌల్యం

తాజా సంక్షోభానికి పూర్వం కూడా ఉపాధి రహిత అభివృద్ధి గురించి అంతర్జాతీయ కార్మిక సంస్థ, ఐక్యరాజ్యసమితి మానవాభివృద్ధి నివేదికలు హెచ్చరిస్తూనే వచ్చాయి. సాంకేతిక పరిజ్ఞానం పాత్ర పెరిగే కొద్దీ ఆర్థిక వ్యవస్థల్లో వృద్ధి రేట్లు వేగంగా పెరుగుతున్నాయని, అంతే వేగంగా ఉపాధి కల్పన పెరగట్లేదు. వ్యవస్థల మధ్య సమతౌల్యం దెబ్బతింటోందనీ ఐఎల్‌ఒ మూడు దశాబ్దాలుగా మొత్తుకుంటూనే ఉంది. కానీ ప్రపంచీకరణ గాలుల్లో విహరిస్తున్న దేశాధినేతలకు ఈ హెచ్చరికలు చెవికెక్కలేదు. 2007లో సంక్షోభం తెరమీదకు రావటానికి ముందు కూడా ఐక్యరాజ్యసమితి అభివృద్ధి కార్యక్రమం - యుఎన్‌డిపి, ఐఎల్‌ఒ సంయుక్త అధ్యయనాన్ని నిర్వహించాయి. గతంలో వేగంగా అభివృద్ది చెందిన ఆసియా దేశాలుగానీ, నేడు అభివృద్ధి చెందుతున్న దక్షిణాసియా దేశాలుగానీ జాతీయ ఆర్థికాభివృధ్దితో సమానంగా ఉపాధి కల్పనలో అభివృద్ధి సాధించలేకపోయాయని ఆ అధ్యయనంలో తేల్చింది. అంతేకాదు. ఈ అసమతౌల్యం మున్ముందు ప్రపంచ ఆర్థిక వ్యవస్థను దెబ్బ తీస్తుందని కూడా హెచ్చరించింది.

ప్రపంచ ఆర్థిక వ్యవస్థ అంతకంతకూ సమీకృతమవుతున్న కొద్దీ, ఆర్థిక వ్యవస్థలపై పెట్టుబడి ఆధిపత్యం బిగుస్తున్న కొద్దీ అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఉపాధి-అభివృద్ధి మధ్య సమన్వయం లోపించటం గత మూడు దశాబ్దాలుగా జరుగుతున్న పరిణామం. తొలుత సంపన్న దేశాల్లో 80వ దశకం చివర్లో కనిపించిన ఈ పరిణామం 90వ దశకం నాటికి విశ్వవ్యాప్త పరిణామంగా మారింది. స్థూలంగా చెప్పాలంటే ప్రపంచ ఆర్థిక వ్యవస్థలు 2003-2009 మధ్య కాలంలో సగటున 6శాతం చొప్పున వృద్ధి రేటు సాధిస్తే ఉపాధి కల్పన వృద్ధి రేటు మాత్రం 2 శాతానికి పరిమితం అయ్యింది. దీంతో వేగంగా పతనమ వుతున్న ఉపాధి అవకాశాలు పేదరికం నిర్మూలించాలన్న లక్ష్య సాధనపై ప్రభావం చూపిస్తున్నాయని తాజాగా ముగిసిస ఐక్యరాజ్యసమితి వార్షిక సమావేశాలు ఆందోళన వ్యక్తం చేశాయి. సహస్రాబ్ది లక్ష్యాల సాధనలో పురోగతి గురించి ఈ సమావేశాలు చర్చించాయి.

మూలాలు తడమని ఉద్దీపనలు

గత రెండు సంవత్సరాలుగా వివిధ దేశాలు అమలు చేసిన ఉద్దీపనలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మరో దీర్ఘకాల మాంద్యంలోకి ప్రవేశించకుండా అడ్డుకోగలిగాయన్న విషయంలో ఆర్థిక వేత్తలు, విశ్లేషకులూ ఏకాభిప్రాయంతో ఉన్నారు. అయితే, దీనికి భిన్నంగా, ఆర్థికవ్యవస్థలు కోలుకొంటున్న వేగంతోనైనా ఉపాధి అవకాశాలు కనిపించకపోవటంతో దీర్ఘకాల మాంద్యం ప్రమాదం పూర్తిగా తొలగిపోలేదన్న సందేహాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. గత మూడు దశాబ్దాలుగా ప్రపంచీకరణ నేపథ్యంలో అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థలో ఉత్పత్తి - వినిమయం మధ్య ఉండాల్సిన సమతౌల్యం కూడా దెబ్బతిన్నది. ఉదారవాద విధానాలు పెట్టుబడికి డిమాండ్‌ను సృష్టించటంపై చూపించినంత శ్రద్ధాసక్తులు శ్రమశక్తికి డిమాండ్‌ సృష్టించటంపై చూపించకపోవటమే ఈ అసమతౌల్యానికి కారణం. ఈ అసమతౌల్యమే కొనుగోలు శక్తిపతనం, మదుపు చేయలేకపోవటం, ఆర్థిక వ్యవస్థల్లో వివిధ దశల్లో జరగాల్సిన కాపిటల్‌ ఫార్మేషన్‌ ప్రక్రియకు అంతరాయం కలగటం వంటి రూపాల్లో ప్రతిబింబిస్తోంది. దీని స్థానంలో పెట్టుబడి పోగుపడటం (కాపిటల్‌ ఎక్యుములేషన్‌) ప్రారంభమైంది. ఈ విషయంపై అంతర్జాతీయ కార్మిక అధ్యయనాల సంస్థ ప్రత్యేక అధ్యయనం నిర్వహించింది. అత్యధిక సందర్భాల్లో ఉద్దీపనలు సంక్షోభానికి కారకులైన బహుళజాతి ద్రవ్యసంస్థల లాభాలు నిలబెట్టటానికే దారితీశాయి. ఉద్దీనల కింద వెచ్చించిన నిధులు కూడా ఉత్పాదక రంగాన్ని పూర్తిగా విస్మరించి, నేరుగా మార్కెట్లోకి ప్రవేశించాయి. దాంతో లక్షల కోట్ల నిధులు వెచ్చించటం ద్వారా కలిగే ప్రయోజనాలు ఒనగూడలేదు. అందువల్లనే ఉద్దీపనల మోతాదు ఎక్కువగా ఉన్న అమెరికాలో కంపెనీలు, ద్రవ్య సంస్థల వద్ద లక్షల కోట్ల డాలర్ల నిల్వలుపేరుకుపోతున్న విషయాన్ని గతంలో ప్రస్తావించుకున్నాము. ఈ నిధులు మార్కెట్లోకి ప్రవేశిస్తే మళ్లీ స్పెక్యులేటివ్‌ కార్యక్రమాలకు తెరతీస్తాయి. ఇప్పటికే భారత స్టాక్‌ మార్కెట్లో విదేశీ సంస్థాగత నిధుల ప్రవాహం ఎలా ఉందో గమనిస్తూనే ఉన్నాము. ప్రపంచ వ్యాప్తంగా వడ్డీ రేట్లు సున్నాకు దగ్గరకావటం, కుప్పలు తెప్పలుగా రుణాలు అందుబాటులోకి రావటంతో ఈ విధంగా సేకరించిన నిధులను వర్ధమానదేశాల స్టాక్‌ మార్కెట్లలో కుమ్మరిస్తున్నాయి. తద్వారా స్వల్పకాలంలో లాభాలు సంపాదించుకుని తిరిగి ఎక్కడ నుండి రుణం ద్వారా ఈ నిధులు సమకూర్చబడ్డాయో ఆయా మార్కెట్లకు వెళ్లిపోతున్నాయి. తాజా సంక్షోభానికి మూలపునాదిగా ఉన్న ఆర్థిక అంతరాలను పరిష్కరించటానికి ఉద్దీపనలు పూనుకోకపోవటంతో 'సంపన్న దేశాల్లో అభివృద్ధి తిరిగి సంక్షోభ పూర్వపు లక్షణాలు-ఆర్థిక అంతరాలు పెంచేదిశగా పయనిస్తోంద'ని ఐక్యరాజ్యసమితి వాణిజ్య అభివృద్ధి మండలి వార్షిక నివేదిక ఆందోళన వ్యక్తం చేసింది.

విస్తృతమవుతున్న పెట్టుబడి- శ్రమ శక్తి మధ్య వైరుధ్యం

ఈ పరిణామాలన్నీ పెట్టుబడికి, శ్రమశక్తికి మధ్య ఉన్న చారిత్రక వైరుధ్యాన్ని విస్తృతీకరిస్తున్నాయి. పైన చెప్పుకున్నట్లు ఆర్థిక వ్యవస్థలో ఉత్పాదక అవసరాలు తీర్చాల్సిన పెట్టుబడి సమీకరణ నేడు కొద్దిమంది చేతుల్లో బందీ అయ్యింది. గత మూడు దశాబ్దాలుగా ప్రభుత్వాలు అనుసరించిన విధానాలు ఈ ప్రక్రియను మరింత వేగంతం చేసేవిగా ఉన్నాయి. ఏ దేశ ఆర్థిక వ్యవస్థలో చూసుకున్నా ప్రభుత్వాలు రూపొందించే విధానాలు, అమలు చేసే నిర్ణయాలు పెట్టుబడికి డిమాండ్‌ సృష్టించేవిగా ఉంటున్నాయి. అంటే పెట్టుబడే ఆర్థిక వ్యవస్థలో సర్వస్వం అని నిర్ధారించుకుని పెట్టుబడి అవసరాలు తీర్చటమే తమ కర్తవ్యంగా భావిస్తున్నాయి. ఈ మేరకే విధానాలు రూపొందిస్తున్నాయి. ఈ విధానాలు ఎగుమతి దిగుమతి విధానాల రూపంలో ఉండవచ్చు, ప్రత్యక్ష పరోక్ష పన్నుల రూపంలో ఉండవచ్చు. నేడు మన దేశంలో చర్చిస్తున్నట్లు పారిశ్రామిక రంగానికి ఇస్తున్న రాయితీల రూపంలో కనిపించవచ్చు. ఈ చర్యలన్నింటి వెనక ఉన్న సారాంశం, తర్కం ఒక్కటే. పెట్టుబడి అవసరాలు మనం తీర్చగలిగితే మన అవసరాలు పెట్టుబడి తీరుస్తుందన్న తర్కం. ఆర్థిక వ్యవస్థ అభివృద్ధికి చిహ్నం ఉత్పత్తిసామర్థ్యం పెరగటం, వినిమయ సామర్థ్యం పెరగటం. లాభాలు సంపాదించటం. ఇవన్నీ సాధించటానికి పెట్టుబడి అనివార్యం. అయితే పెట్టుబడి ఒక్కటి ఉంటేనే సరిపోదు. ఏ ఆర్థిక వ్యవస్థల్లోనైనా స్థూల జాతీయోత్పత్తిలో మూడో వంతు శ్రామికవర్గం జత చేసే శ్రమ శక్తి. ప్రభుత్వ విధాన కర్తలు ఇప్పటి వరకూ ఈ జాతీయోత్పత్తికి దోహదం చేస్తున్న ఈ అంశం గురించి మర్చిపోయారు. దాంతో శ్రమశక్తి, పెట్టుబడి మధ్య వైరుధ్యంలో రాజ్యాంగయంత్రం పెట్టుబడి పక్షం వహించటంతో శ్రమశక్తి బలహీనపడింది. ఈ వైరుధ్యాన్ని సరిచేయటానికి శ్రమశక్తికి ఉన్న ఏకైక ఆయుధం సంఘం, సమైక్యత, సంఘటన, సంఘటిత పోరాటం మాత్రమే.

ఈ శ్రమ శక్తి అవసరాలు గురించి పట్టించుకోకకుండా కేవలం పెట్టుబడి అవసరాల ద్వారానే ఆర్థిక వ్యవస్థల అవసరాలు తీరతాయని భావించటం ప్రపంచీకరణ విధానాల్లోని ముఖ్యమైన లోపం. ఈ లోపమే ప్రపంచ ఆర్థిక వ్యవస్థను మరో మహా మాంద్యం అంచులవరకూ తెచ్చింది. పెట్టుబడికి డిమాండ్‌ సృష్టించే విధానాల వల్ల తక్కువ వ్యయంతో ఎక్కువ ఉత్పత్తి సాధించే సామర్థ్యం సంపాదించటంతో పాటు విదేశాల్లో వాణిజ్య కార్యకలాపాలు విస్తరించుకోవటం, పన్నుఎగవేతల స్వర్గధామాల్లో నిధులు దాచుకోవటం వంటి చర్యలతో పాటు ఉత్పత్తి క్రమంలో శ్రమశక్తి-పెట్టుబడి మధ్య ఉండాల్సిన నిష్పత్తి దెబ్బతింటోంది. ఫలితంగా ఉపాధిరహిత అభివృద్ధి జరుగుతోంది. ఈ నిష్పత్తిని, సమతౌల్యాన్ని సరిచేయాలంటే పెట్టుబడి డిమాండ్‌ సృష్టించే విధానాల నుండి వైదొలగి శ్రమశక్తి మార్కెట్‌కు డిమాండ్‌ సృష్టించే విధానాలను ప్రభుత్వం చేపట్టాలి. దీనికి అనేక మార్గాలు ఉన్నాయి. స్థూల సూక్ష్మ ఆర్థిక యాజమాన్యంలో మార్పులు తేవటం ద్వారా ఈ విధానాలను అమలు చేయవచ్చు. ఈ దిశగా విధానాలు మళ్లనంత వరకూ ఐరాస వాణిజ్య అభివృద్ధి మండలి అభిప్రాయపడినట్లు ''2011 నాటికి ప్రపంచ ఆర్థిక వ్యవస్థ దీర్ఘకాల మాంద్యంలోకి ప్రవేశించే ముప్పు'' నుండి ప్రపంచం బయటపడబోదు.

No comments: