Monday, July 5, 2010

ఫైనాన్స్‌ పెట్టుబడి పడగ నీడన జి 20


జి 20 కూటమి సమావేశాలు జూన్‌ చివరి వారంలో కెనడాలోని టొరంటోలో జరిగాయి. ఈ కూటమి అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ పగ్గాలు చేపట్టిన తర్వాత ఇది నాల్గో సమావేశం. దీనికి ముందు జి 20 ఆర్థిక మంత్రుల సమావేశం జూన్‌మొదటి వారంలో జరిగింది. ఈ సమావేశాల తీరు, తీర్మానం గమనిస్తే పెట్టుబడిదారీ వ్యవస్థ తాజా సంక్షోభం నుండి కూడా ఏమాత్రం పాఠాలు నేర్వలేదని స్పష్టమవుతోంది. టొరంటో సమావేశాల చర్చలన్నీ అభివృద్ధి వర్సెస్‌ లోటు నియంత్రణ చుట్టూ తిరిగాయి.అంతర్జాతీయంగా పెట్టుబడిదారీ వ్యవస్థ ఎదుర్కొంటున్న సంక్షోభం నుండి ప్రపంచాన్ని బయటపడేసే శక్తి అమెరికాకు,దాని నాయకత్వంలో పని చేస్తున్న జి 8కు లేకపోయింది. తొలుత 97లో ఆసియా ఆర్థిక సంక్షోభం భారాన్ని మోయడానికి జి20 వేదికగా మారింది. నేడు దశాబ్ధం తరువాత (2008లో) అంతర్జాతీయ ఆర్థిక సంక్షోభ భారాన్ని మోపేందుకు మళ్లీ జి 20 కావాల్సి వచ్చింది. అంటే అప్పటి వరకూ ప్రపంచ పెట్టుబడిదారీ వ్యవస్థ మండువా లోగిలిని నిలబెట్టటానికి దాదాపు నాలుగు దశాబ్దాల పాటు ఎనిమిది స్థంభాలు జి8 శాయశక్తులా కృషి చేశాయి. ఇంటిని నిలబెట్టి ఉంచాల్సిన నిట్టాడుల కూసాలకు చెదలు పడితే ఇళ్లునెలమట్టమవుతుంది. అటువంటపుడు రెండే మార్గాలు. పాత స్థంభాల నడుమ కొత్త స్థంభాలు నిలబెట్టి పాతవాటిపై భారాన్ని తగ్గించటం ద్వారా మరికొంత కాలం ఇంటిని నిలబెట్టటం. లేదా పూర్తిగా పడేసి కొత్త పునాదులపై కొత్త ఇల్లు కట్టుకోవటం. పెట్టుబడిదారీ వ్యవస్థ సంక్షోభ భారానికి జి8 కూసాలు కుళ్లిపోయాయి. దాంతో మరో పన్నెండె కూసాలు అదనంగా చేర్చి దాన్ని నిలబెట్టేప్రయత్నం జరిగింది. ఆ విధంగా 2008లో అంతర్జాతీయ వ్యవహారాల్లో బేరసారాల వేదికగా ఉన్న జి20 అమాంతంగా బలమైన ఆర్థిక శక్తిగా ముందుకు వచ్చింది.

ఈ పరిణామాన్ని అప్పట్లో పలువురు విశ్లేషకులు ఆహ్వానించారు. జి20 సరైన దిశలో నడిస్తే ప్రపంచ పెట్టుబడిదారీ వ్యవస్థ ఏకధృవ ప్రపంచం నుండి బహుళ ధృవ ప్రపంచంగా మారుతుందని దాంతోపాటే సామ్రాజ్యవాద ప్రపంచీకరణ దూకుడు తగ్గుతుందని ఆశించారు. ఈ కలలు కల్లలేనని రుజువు చేసింది టొరంటో సమావేశం. ప్రపంచ ఆర్థిక వ్యవస్థను సంక్షోభం నీడ నుండి బయటకు తేవటానికి గల మార్గాలు ఏమిటి, ఈ దిశగా ఏదేశం ఏమి చేయగలదు అన్న చర్చకు బదులుగా జాతీయ ఆర్థిక వ్యవస్థల్లో పెరిగి పోతున్న లోటు గురించిన చర్చ కేంద్రక స్థానం ఆక్రమించింది. తుది ప్రకటనలో కూడా దేశాలు తరతమ స్థాయిల్లో లోటు తగ్గించేందుకు చర్యలు ప్రారంభించాలని పిలుపునిచ్చారు.

గత రెండేళ్లలో ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ఉద్దీపనల పేరుమీద 11.9 ట్రిలియన్‌ డాలర్ల మేర నిధులు కుమ్మరించారు. అయినా ఉపాధి కల్పన, ఉత్పత్తి, ఎగుమతుల వృద్ధి ఆశించిన స్థాయికి చేరుకోలేకపోయిందని దేశాధినేతలు విచారం ప్రకటించారు. ఇంత మొత్తంలో అదనపు నిధులు ఆర్థిక వ్యవస్థలో కుమ్మరించేందుకు మద్దతుగా కీన్స్‌ను తిరిగి బతికించారు. మహా మాంద్యం నేపథ్యంలో ప్రపంచ ఆర్థిక వ్యవస్థను బతికించటానికి ప్రభుత్వాలు లోటుతో కూడిన ఆర్థిక విధానాలు అమలు జరిపినా తప్పు లేదని ఆయన ప్రతిపాదించారు.

లోటుతో కూడిన ఆర్థిక విధానాలు అంటే ప్రభుత్వాలకు వచ్చే ఆదాయం కంటే ఎక్కువ ఖర్చు చేయటం అన్నమాట. ఈ విధంగా చేసే అదనపు ఖర్చు ఉపాధి కల్పన పెంచేందుకు, నిజ ఆర్థిక వ్యవస్థలో కదలిక తెచ్చేందుకు వెచ్చించాలని ఆయన సిఫార్సు చేశారు. కీన్స్‌ పేరుతో అమలు జరుగుతున్న నేటి ఉద్దీపనలన్నీ ఈ మౌలిక సూత్రాన్ని పక్కన పెట్టాయి. పైన పేర్కొన్న మొత్తాన్ని ద్రవ్య మార్కెట్లోకి కుమ్మరించాయి. దాంతో ద్రవ్య మార్కెట్‌లో కదలిక వచ్చింది. పెద్ద పెద్ద ద్రవ్య సంస్థల లాభాలు పెరిగాయి. తప్ప ఉత్పాదక రంగంలో పెద్దగా మార్పు రాలేదు. చైనా, భారతదేశం వంటి చోట్ల ఉద్దీపనలు లేకపోతే ఈ మాత్రం వెసులుబాటు కూడా ఉండేది కాదు. ద్రవ్య మార్కెట్‌ కాస్తంత ఊపిరి తీసుకోవటంతో ద్రవ్య పెట్టుబడిదారీ వ్యవస్థకు తిరిగి కొమ్ములువచ్చాయి. ఈ ద్రవ్య పెట్టుబడి సమర్థకులు పెరుగుతున్న లోటు గురించి గొంతు చించుకుని అరవటం ప్రారంభించారు. దీనికితోడు యూరోపియన్‌ యూనియన్‌లో దేశాలకు దేశాలే దివాళా తీసే స్థితి వచ్చింది. వెరసి జాతీయ ఆర్థిక వ్యవస్థల్లో లోటు తగ్గించుకోకపోతే కష్టమన్న నిర్ధారణకు వచ్చాయి యూరోపియన్‌ యూనియన్‌ ప్రభుత్వాలు. జర్మనీ, బ్రిటన్‌లు ఈ వాదన లంకించుకున్నాయి. అమెరికా కూడా ఇందుకు భిన్నంగా లేకపోయినా తానున్న ఆర్థికస్థితిలో ఇయుతో పెద్దగా వివాదానికి సిద్ధపడే పరిస్థితి లేదు. దాంతో ఇయు మాట నెగ్గింది. ద్రవ్యలోటు నియంత్రణ చర్యలు గురించిన చర్చ కొలిక్కి వచ్చింది. 2015 గడువుగా నిర్దేశించుకుని సంపన్న దేశాలు ద్రవ్య లోటు తగ్గించాలని టొరంటో సమావేశాలు తీర్మానించాయి.

ఈ పరిణామాలు చూస్తుంటే ఉద్దీపన నేపథ్యంలో కనపిస్తున్న కాస్తంత అభివృద్ధి వాపును చూసి ఇదే తమ బలమని ద్రవ్య పెట్టుబడి భావిస్తున్నట్లు కనిపిస్తోంది. బ్యాంకింగ్‌ లావాదేవీలపై పన్ను విధించే విషయంలోనూ, పన్నుఎగవేతదారుల స్వర్గధామాలపై చర్చ విషయంలోనూ ద్రవ్య పెట్టుబడి ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. దీంతో కీన్స్‌ ప్రతిపాదించిన ఆర్థిక విధానాల మద్దతుదారుల మాటకు విలువ లేకుండా పోయింది. మరోవైపున ఆర్థిక వ్యవస్థ సరిగ్గా గాడిలో పడలేదన్న విషయాన్ని దృష్టిలోకి తీసుకుని నోబెల్‌ బహుమతి గ్రహీత పాల్‌ క్రుగ్‌మాన్‌ వంటి ఆర్థిక వేత్తలు ఉన్న ఫళంగా ఉద్దీపన వ్యయంలో కోత కోస్తే జపాన్‌ తరహా అనుభవాలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు ఎదురవుతాయని హెచ్చరిస్తున్నారు. అంతేకాదు. జి 20 సమావేశాలకు ముందు అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ విడుదల చేసిన నేపథ్య పత్రంలో కూడా ఇప్పుడున్న ఉద్దీపనలను యథావిధిగా కొనసాగిస్తూ ఆర్థికాభివృద్ధికి అవసరమైన మిగిలిన చర్యలు చేపడితే రానున్న ఐదేళ్లలో అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ స్థూలంగా సగటున రెండు శాతం అభివృద్ధి సాధించే అవకాశాలు ఉన్నాయని, మొత్తంగా ప్రపంచంలో మూడు కోట్ల మందికి ఉపాధి అవకాశాలు కల్పించే అవకాశాలు వస్తాయని అంచనా వేసింది. ఈ పరిస్థితుల్లో ఉద్దీపన రద్దు చేస్తే ఆసియాదేశాలు సాధించగలుగుతాయనుకుంటున్న ఆర్థికాభివృద్ధి కూడా ప్రశ్నార్థకంగా మారుతుంది. ఈ చర్చ మొత్తం 1937-38 నాటి కీన్స్‌, ఆయన ప్రత్యర్ధులకు మధ్య జరిగిన సంవాదాన్ని గుర్తు చేస్తోంది. బ్రిటన్‌, మరియు ఇతర యూరోపియన్‌ దేశాల్లో రెండో ప్రపంచ యుద్ధ సన్నాహాల నేపథ్యంలో ప్రభుత్వ వ్యయం భారీగా పెరగటంతో యూరప్‌ సాధ్యమైనంత త్వరగా మహా మాంద్యం నుండి బయటపడగలిగింది.

అదే సమయంలో రూజ్వెల్డ్‌ ప్రభుత్వం అమలు జరుపుతున్న సంక్షేమ విధానాల్లో పెద్దఎత్తున కోత విధించటం, ప్రభుత్వ వ్యయాన్ని తగ్గించటంతో అమెరికా ఆర్థిక వ్యవస్థ తిరిగి సంక్షోభంలోకి కూరుకుపోయింది. విచిత్రమేమిటంటే తాజా సంక్షోభం నేపథ్యంలో అమెరికా ఉద్దీపనలను కొనసాగించాలని వాదిస్తుంటే యూరోపియన్‌ యూనియన్‌ దేశాలు ప్రత్యేకించి బ్రిటన్‌, జర్మనీ దేశాలు ఉద్దీపన నిధుల్లో కోత కోయాలని నిర్ణయించాయి.ఏతావాతా చూసుకుంటే ఏ ద్రవ్య పెట్టుబడిని పరిరక్షించే విధానాలు తాజా సంక్షోభానికి కారణం అయ్యాయో జి20 దేశాధినేతలు అవే ద్రవ్య పెట్టుబడి పరిరక్షణ విధానాల పంచన చేరాలని చూస్తున్నారు. ఇది ఏ ఒక్క దేశానికో కాక మొత్తంగా అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థకే అశనిపాతంలా మారే ప్రమాదం ఉంది. ప్రపంచ దేశాలు, ఆర్థిక మేధావులు ద్రవ్య పెట్టుబడి ప్రభావం నుండి బయట పడనంత వరకూ ఈ ముప్పు కొనసాగుతూనే ఉంటుంది.

No comments: