Wednesday, July 28, 2010

మూలాలను తడమని ఉపాధి నివేదిక




కేంద్ర ప్రభుత్వం జూలై 1వ తేదీన దేశంలో ఉపాధి గురించిన నివేదిక విడుదల చేసింది. గత ఐదేళ్లలో దేశంలో ఉపాధి కల్పన వృద్ధి రేటు రెండు శాతంగా ఉందని చెప్పుకుని మురిసిపోయింది. రానున్న ఐదేళ్ల కాలంలో మరో 2.5 శాతం వృద్ధి రేటు సాధించనున్నట్లు ఆశాభావం వ్యక్తం చేసింది. ఈ రకంగా ఉపాధి కల్పన గురించి ప్రత్యేకంగా నివేదిక విడుదల చేయటం హర్షదాయకమనే చెప్పాలి. ఇక్కడ ప్రభుత్వం చెప్పకుండా దాచిన విషయం ఒకటి ఉంది. గడచిన ఐదేళ్లలో సగటున వృద్ధి రేటు 8 శాతానికిపైగానే ఉంది. ఈ కాలంలో ఉపాధిలో వృద్ధిరేటు రెండుశాతం మాత్రమే ఉంది. వచ్చే అయిదేళ్ల కాలంలో 2.5శాతం వృద్ధి సాధించాలంటే ఆర్థికాభివృద్ధి రేటు అంతకంటే ఎక్కువగా ఉండాలన్నది నిర్వివాదం. అయితే మారిన అంతర్జాతీయ ఆర్థిక పరిస్థితులు, ద్రవ్య సంక్షోభం నేపథ్యంలో ఈ వృద్ధి రేటు సాధ్యమా అన్న ప్రశ్న వేసుకున్నపుడు ఉపాధి వృద్ధి రేటు అంచనా వేయటంలో ప్రభుత్వం ఈ అభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకున్నట్లు కనిపించటం లేదు. ముందు ఉపాధి నివేదికలోని ముఖ్యాంశాలు పరిశీలిద్దాం.

యుపిఎ-1 అధికారంలో ఉన్న మొదటి మూడేళ్లు అంటే 2005-2008 మధ్య కాలంలో అదనంగా 24 లక్షల ఉపాధి అవకాశాలు కల్పించబడ్డాయి. అంటే సంవత్సరానికి సగటున ఎనిమిది లక్షల చొప్పున ఉద్యోగాలు వచ్చాయి. 1999-2000 నుండి 2004-2005 మధ్యకాలంలో సాధించిన ఉపాధి కల్పన రేటు కంటే ఇది చాలా తక్కువ. అంతేకాదు. 1983 నాటికి భారత ఆర్థిక వ్యవస్థ సంవత్సరానికి 239 మిలియన్ల మందికి ఉపాధి కల్పించగల సామర్థ్యంతో ఉంటే, 1993 నాటికి ఈ సామర్థ్యం 314 మిలియన్లకు పెరిగింది. అంటే పదేళ్ల కాలంలో 75 మిలియన్ల మందికి అదనంగా ఉపాధి అవకాశాలు కల్పించగల పరిస్థితికి చేరింది. అయితే సంస్కరణల తర్వాత కాలంలో ఈ ఎదుగుదల వేగం కొనసాగలేదు. 1983తో పోల్చి చూస్తే 1993, 2000 మధ్య కాలంలో స్థూల జాతీయోత్పత్తి, ఆర్థికాభివృద్ధిలో గణనీయమైన మార్పు వచ్చింది. అయితే వృద్ధి రేటు వేగానికి అనుగుణంగా ఉపాధి కల్పన సామర్థ్యం పెరగలేదు. సంస్కరణల వేగంతో పాటు ఆర్థిక వ్యవస్థలో ఉపాధి కల్పన సామర్థ్యం పెరగలేదన్న విషయాన్ని ప్రభుత్వం విడుదల చేసిన ఈ గణాంకాలే రుజువు చేస్తున్నాయి. 1993-2000 మధ్య కాలంలో 338 మిలియన్ల మందికి ఉపాధి అవకాశాలు కల్పించగా 2000-2004 మధ్య కాలంలో 385 మిలియన్ల మందికి ఉపాధి అవకాశాలు కల్పించగలిగింది భారత ఆర్థిక వ్యవస్థ. 1991 తర్వాత జనాభా పొందికలో వచ్చిన మార్పులు పరిగణనలోకి తీసుకుంటే ఈ వృద్ధి రేటు ఇంకా తగ్గిపోతుందన్న విషయం వాస్తవం. 2001 జనాభా లెక్కల ప్రకారం మొత్తం జనాభాలో కష్టించి పని చేయగలిగిన వయస్సున్న వారు 58 శాతంగా ఉన్నారు. 2010 జనాభా లెక్కల్లో ఈ సంఖ్య మరింత పెరగనుంది. అంటే మొత్తం 2001 నాటికి భారత జనాభా 99 కోట్లు అనుకుంటే, కుడిఎడంగా 60 కోట్ల మంది పని చేయగలిగిన వారున్నారు. ఇందులో ప్రభుత్వ లెక్కల ప్రకారమే 2000 నాటికి 33 కోట్ల 80 లక్షల మంది, 2004లో 38 కోట్ల 50 లక్షల మంది ఉపాధి పొందగలిగారు. అంటే శ్రమించగలిగిన జనాభాతో పోలిస్తే నిరుద్యోగం 50 శాతానికి పైగా ఉంటే మొత్తం జనాభాతో పోలిస్తే నిరుద్యోగం 15 శాతానికి దగ్గరగా ఉంటుంది. ఏ దేశ ఆర్థిక వ్యవస్థలో అయినా 15 శాతం ఉత్పాదక సామర్థ్యం నిరుపయోగంగా పడి ఉంటే ఆ దేశ ఆర్థిక వ్యవస్థ అంతగా వెనకబడినట్లే అని వేరే చెప్పనవసరంలేదు.


ఈ కాలంలో మొత్తం శ్రమశక్తి మార్కెట్‌ 46 కోట్లకు చేరుకొంది. పని చేయగలిగిన సామర్థ్యం ఉన్న ప్రజల రేటు ఈ కాలంలో బాగా పెరిగింది. ప్రభుత్వ అంచనాల ప్రకారమే ఈ రేటు 2.85గా ఉంటే ఉపాధి కల్పన కేవలం రెండు శాతంగా మాత్రమేఉంది. అంటే సంవత్సరానికి ఉపాధి కల్పన వృద్ధి రేటు శ్రమ శక్తి మార్కెట్‌ వృద్ధి రేటు కంటే వెనుకబడి ఉంది. దీనికి తోడు అంతర్జాతీయ ద్రవ్య సంక్షోభం ప్రభావం కూడా ఆర్థిక వ్యవస్థలో ఉపాధి కల్పన సామర్థ్యాన్ని తగ్గించి వేసింది. ప్రభుత్వ లెక్కల ప్రకారమే 2008 అక్టోబరులో ఐదు లక్షల మంది అదనంగా నిరుద్యోగ సైన్యానికి తోడు కాగా జనవరి 2009 నాటికి అందులో 2.76 లక్షల మంది తిరిగి శ్రమ మార్కెట్లోకి ప్రవేశించారు. అంటే వీరికి ఉద్యోగాలు దక్కాయి. కానీ అందులో జూన్‌ 2009 నాటికి మరో లక్షా ముప్పయివేల మంది నిరుద్యోగులయ్యారు. అంతేకాదు. సంక్షోభం ఉపాధి మార్కెట్‌పై మరో విధమైన ప్రభావం కూడా చూపింది. 2004-2008 మధ్య కాలంలో మధ్యతరగతి ఉద్యోగికి సగటున వేతనాల్లో 8-11 శాతం వృద్ధి రేటు ఉంటే 2008 తర్వాతి కాలంలో ఇది దాదాపు స్థబ్దతకు లోనైందని చెప్పవచ్చు. ఈ కాలంలో ప్రభుత్వం ఆరవ వేతన సంఘం నివేదిక అమలు చేయకపోయి ఉంటే పరిస్థితి మరింత దారుణంగా ఉండేది. దీనికి తోడు గ్రామీణ ప్రాంతంలో రుతుపవనాలపై ఆధారపడ్డ ఉపాధి కల్పనలోని లోటుపాట్లు ఉండనే ఉన్నాయి. ఈ నివేదిక మరో విషయాన్ని కూడా దృష్టికి తెస్తోంది. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి సంబంధించిన సమస్య అది. గ్రామీణ ప్రాంతంలో 57 శాతం మంది స్వయం ఉపాధి చూసుకుంటున్నారని నివేదిక ప్రస్తావించింది. అందులో కూడా గ్రామీణ ఉపాధి మార్కెట్‌కు కీలకంగా ఉన్న వ్యవసాయ రంగం ఈ కాలంలో వృద్ధి రేటు మందగించటంతో వ్యవసాయ కూలీ వేతనాలపై ఆధారపడ్డ మహిళలు, దళితులు, బలహీన వర్గాలకుచెందిన ప్రజలు ఎక్కువ మంది నిరుద్యోగం బారిన పడ్డారని నివేదిక చెప్తోంది. అందువల్లనే ఈ వర్గాలకు చెందిన ప్రజలు ఈ కాలంలో పెద్దఎత్తున పట్టణ ప్రాంతాలకు వలసవెళ్లిన విషయాన్ని కూడా నివేదిక గుర్తించింది. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం అమలు చేసిన జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం వల్ల మూడేళ్లలో అంటే 2004-005 నాటికి 221 మిలియన్లుగా గ్రామీణ ఉపాధి అవకాశాలు కల్పిస్తే 2007-2009 నాటికి 939 మిలియన్లకు పెరిగిందని ప్రభుత్వం చెప్తోంది. పైన చెప్పిన లెక్కలకు ఎన్‌ఆర్‌ఇజిఎ లెక్కలకు మధ్య పొంతన కుదరని పరిస్థితిని ఈ గణాంకాలు ముందుకు తెస్తున్నాయి. 2010-2015 నాటికి 63.5 మిలియన్ల మంది అదనంగా శ్రమశక్తి మార్కెట్లో చేరనున్నారని కూడా ప్రభుత్వం అంచనా వేసింది. ఈ అంశాన్ని దృష్టిలోకి తీసుకున్నపుడు రానున్నకాలంలో నిరుద్యోగ మహమ్మారి మరింత స్వైరవిహారం చేయనున్నట్లు అర్థమవుతోంది.

2004-05లో మొత్తం ఉపాధిలో శాశ్వత ఉపాధి శాతం ఆధారంగా ప్రధాన రాష్ట్రాల వర్గీకరణ

అట్టడుగు స్థాయి

(పది శాతం కంటే తక్కువ)

బీహార్‌, ఛత్తీస్‌గఢ్‌, జార్ఖండ్‌, ఒడిషా, ఉత్తరప్రదేశ్‌

దిగువస్థాయి

(10 నుంచి 15 శాతం)

రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌ , అస్సోం, ఆంధ్రప్రదేశ్‌, కర్నాటక, ఉత్తరాంచల్‌, హిమాచల్‌ ప్రదేశ్‌, పశ్చిమ బెంగాల్‌

మధ్యస్థాయి

(15 - 20 శాతం)

జమ్మూకాశ్మీర్‌, గుజరాత్‌, కేరళ, హర్యానా

అధిక స్థాయి (20 శాతానికి పైబడి)

మహారాష్ట్ర, తమిళనాడు, పంజాబ్‌, ఢిల్లీ

విద్యార్హతను అనుసరించి కార్మికులు విభజన శాతం- వారి ఉపాధి స్థాయి

కార్మికుల విద్యార్హత స్వయం ఉపాధి రెగ్యులర్‌ క్యాజువల్‌

నిరక్షరాస్యులు 56.11 4.33 39.56

ప్రాథమిక 56.03 8.86 35.11

మాధ్యమిక 58.94 11.88 29.18

సెకండరీ 60.34 15.75 23.91

హైయర్‌ సెకండరీ 62.33 25.08 12.59

పట్టభద్రలు- ఆపైన 49.45 46.29 4.26

2009-10 నుంచి 2014-15 వరకు అంచనాగా చూపిన జనాభా, పనిలో ఉన్న కార్మికుల రేటు(ఎల్‌ఎఫ్‌పిఆర్‌), మొత్తం కార్మికులు, ఉపాధి వివరాలు...

2009-10 2010-11 2011-12 2012-13 2013-14 2014-15

మొత్తం జనాభా (పదిలక్షల్లో) 1177 1193 1208 1224 1239 1254

ఎల్‌ఎఫ్‌పిఆర్‌ (%) 44.2 44.4 44.8 45.1 45.4 45.8

కార్మికులు (పదిలక్షల్లో) 520 530 541 552 563 574

వార్షిక కార్మికుల జనాభా పెరుగుదల (పదిలక్షల్లో) 10 10 11 11 11 11

ఉపాధి వృద్ధి రేటు రెండుశాతంగా ఉంటే (పదిలక్షల్లో) 506 516 526 537 548 559

ఉపాధి వృద్ధి రేటు 2.25శాతంగా ఉంటే (పదిలక్షల్లో) 506 517 529 541 553 566

ఉపాధి వృద్ధి రేటు 2.50శాతంగా ఉంటే (పదిలక్షల్లో) 506 519 532 545 559 572

1993-94 నుంచి 2004-05 మధ్యకాలంలో ఉపాధి వారిగా కార్మికుల శాతం

ఉపాధి రకం 1993-94 1999-2000 2004-05

గ్రామీణ

స్వయం ఉపాధి 57.96 55.76 60.2

వేతన కార్మికులు 42.04 44.24 39.9

1) రెగ్యులర్‌ 6.45 6.83 7.1

2) క్యాజువల్‌ 35.59 37.41 32.8

పట్టణాలు

స్వయం ఉపాధి 42.29 42.23 45.4

వేతన కార్మికులు 57.71 57.77 54.5

1) రెగ్యులర్‌ 39.40 40.03 39.5

2) క్యాజువల్‌ 18.31 17.74 15.0

కొండూరి వీరయ్య

No comments: