Published in Sunday supplement Book, Prajasakti July 4th 2010
జూన్ 25వ తేదీన కేంద్ర ప్రభుత్వం భారతదేశంలో చమురు ఉత్పత్తుల ధరలపై నియంత్రణలను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయాన్ని పారిశ్రామిక వర్గాలు ఆహ్వానించాయి. ఇకపై చమురు ఉత్పత్తుల రంగంలో అవధుల్లేని విధంగా ప్రైవేటు పెట్టుబడులు వచ్చిపడతాయని ప్రభుత్వం, 'కొంతమంది' మేధావులు చెప్తున్నారు. మరోవైపున ధరాఘాతంతో కకావికలవుతున్న సామాన్య ప్రజానీకంపై ఇది కొండంత భారం అనటానికి వెనకాడాల్సిన అవసరం లేదు. ఈ పరిస్థితుల్లో నిత్య జీవితంలో చమురు ఉత్పత్తుల పాత్ర, చమురు ఉత్పత్తుల ధరవరల్లో వచ్చే మార్పులు, వాటికి కారణాలు, శుద్ధి ప్రక్రియ, పన్నుల విధానం గురించి క్లుప్తంగా తెలుసుకుందాం.
పెట్రోలు, డీజిలు, కిరోసిన్, గ్యాస్. ఈ నాలుగు సరుకులు లేకుండా ఆధునిక మానవుడి అత్యాధునిక జీవితాన్ని ఊహించటం సాధ్యం కాదు. షుమారు శతాబ్దిన్నర కాలంగా జాతీయ ఆర్థిక వ్యవస్థల్లో చమురు కీలక పాత్ర పోషిస్తోంది. ప్రత్యేకించి చమురు శుద్ధి ప్రక్రియ మొదటిప్రపంచ యుద్ధానికి కాస్తంత ముందుగా ప్రారంభమైన చమురు శుద్ధి ప్రక్రియతో నిత్య జీవితంలో చమురు విడదీయరాని విధంగా పెనవేసుకుపోయింది. లేటెక్స్ కాటుక మొదలు, వాహనాలు సున్నితంగా నడవటానికి ఉపయోగించే కందెన నూనెల వరకూ, ధరించే బట్టల మొదలు ఇళ్లలో అలంకరించే కార్పెట్ల వరకూ... అంతెందుకు. మహిళలు నిత్యం ఉపయోగించే సౌందర్యసాధనాల మొదలు వైద్యులు రాసిచ్చే మందుల వరకూ అన్నింటిలోనూ చమురు ఉత్పత్తులు వివిధ పాళ్లలో మనకు దర్శనం ఇస్తాయి. ఒక్క మాటలో చెప్పాలంటే ''ఎందెందు వెదకి చూసిన అందందే గలదు 'చమురు'' అని నిర్ధారించుకోవచ్చు. చమురు, దాని ఉప ఉత్పత్తుల నుండి తయారయ్యే వస్తువులు జాబితా తయారు చేయాలనుకుంటే కనీసం 212 వస్తువుల జాబితాను చూడవచ్చు. కంప్యూటర్లు, కంప్యూటరు డిస్కులు, ఎరువులు, పురుగుమందులు, కృత్రిమ హృదయాలు, పేస్‌మేకర్స్, యాస్పిరిన్, కాంటాక్టు కళ్లద్దాలు, బ్యాండేజిలు, అత్యవసర శస్త్రచికిత్స సాధనాలు, ప్లాస్టిక్కు వస్తువులు, గృహోపకరణాలు, ఫోన్లు, బట్టలు, ఫుట్‌బాల్ వంటి క్రీడా వస్తువులు, తలంటుకునే షాంపూలు... ఇలా చెప్పుకుంటూ పోతే చమురు ఉత్పత్తులు లేని సరుకులు గుర్తించటం బ్రహ్మ విద్యే అవుతుంది. అందుకనే శాస్త్రజ్ఞులు మనం పెట్రో రసాయనాల యుగంలో జీవిస్తున్నామని నిర్ధారించారు.
ఇంత చమురు ఎక్కడ నుండి వస్తోంది ?
నిత్యజీవితంలో అంతగా ముడిపడి ఉన్న ఈ చమురు ఎలా వస్తుంది, ఎక్కడ నుండి వస్తుంది అన్న ఆసక్తి కలగటం సహజం. మన దేశానికి సంబంధించినంత వరకు దేశంలోని చమురు నిల్వలు వెలికి తీసే బాధ్యత భారత చమురు సహజవాయువుల కంపెనీది. ఈ కంపెనీ ఆధ్వర్యంలో అస్సాంలోని డిగ్బోరు, మహారాష్ట్రలోని బోంబే హై, ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా గోదావరి బేసిన్‌లలో చమురు వెలికితీత కార్యక్రమాలు గత మూడు దశాబ్దాలుగా ముమ్మరంగా సాగుతున్నాయి. ఈ మధ్యనే రిలయన్స్ కంపెనీ కెజి బేసిన్‌లో గ్యాస్ వెలికితీత పనుల్లో ప్రవేశించింది. ఎస్సార్, గుజరాత్ పెట్రోలియం కార్పొరేషన్, షెల్ అదాని వంటి మరికొన్ని ప్రైవేటు కంపెనీలు కూడా దేశంలో ఈపనిలో ఉన్నాయి. ఇక అంతర్జాతీయంగా చూసుకుంటే బ్రిటిష్ పెట్రోలియం (బిపి), షెల్ కంపెనీలు ప్రపంచంలో మూడొంతుల చమురు రంగంపై ఆధిపత్యం కలిగి ఉన్నాయి. ఈ సముద్ర నిల్వలు భూగర్భంలోనే కాదు. సముద్ర గర్భంలో కూడా దాగి ఉన్నాయి. ఆధునిక పెట్టుబడిదారీ విధానం నరసింహావతారంలో హిరణ్యకశ్యపుడి పొట్ట చీల్చి పేగులు బయటికి తీసినట్లుగా భూగర్భాన్ని చీల్చి చమురు బయటికి తీయటంలో ఎప్పటికపుడు అత్యాధునిక సాధనాలు కనిపెడుతోంది. ఇవి కాక ప్రపంచ ఆర్థిక వ్యవస్థను యధా విధిగా కొనసాగించేందుకు అవసరమైన చమురు ఉత్పత్తి చేస్తున్న దేశాలు, చమురు ఉత్పత్తి ఎగుమతి దేశాల కూటమిగా ఒపెక్‌గా ఏర్పడ్డాయి. ఇందులో ఇరాన్, ఇరాక్, సౌదీ అరేబియా, వెనిజులా వంటి దేశాలు కీలకమైనవి.
ఎక్కడెక్కడ ఎంతెంత....
నిత్య జీవితంలో ఇంత కీలక పాత్ర పోషిస్తోంది కనుకనే అంతర్జాతీయంగా చమురు నిల్వలపై పెత్తనం సంపాదించేందుకు అమెరికా శతవిధాలా ప్రయత్నిస్తోంది. 2002 నాటికి అధికారిక అంచనాల ప్రకారం ప్రపంచంలో ప్రధానమైన చమురు నిల్వలున్న దేశాల గురించిన సమాచారాన్ని ప్రత్యేకంగా ఇచ్చిన బాక్స్‌లో చూడొచ్చు. 2002 ప్రామాణికంగా తీసుకోవటం వెనక వున్న ఉద్దేశ్యం స్పష్టం. నూతన సహస్రాబ్దిలో అమెరికా అనుసరిస్తున్న యుద్ధోన్మాదం వెనక కీలక లక్ష్యం అంతర్జాతీయ ఇంధన వనరులపై పెత్తనం సాధించటమే. కీలకమైన చమురు వనరులున్న దేశాల్లో నయానో భయానో అమెరికా సైనిక స్థావరాలు ఏర్పాటు చేసుకుని ఇంధన వనరుల ఉత్పత్తిని రోజువారి నియంత్రిస్తోంది.
శుద్ధి ప్రక్రియ
భూగర్భం నుండి వెలికి తీసిన ముడి చమురు యథాతథంగా వినియోగించటం సాధ్యం కాదు. ఎందుకంటే ఇది కర్బన ఇంధనాల సముదాయం. ఇది యథాతథంగా వాడితే ప్రాణాంతకం. అందువల్ల దాన్ని శుద్ధి చేయాలి. ఈ శుద్ధి ప్రక్రియలోనే రవాణాకు ఉపయోగించే పెట్రోలియం, డీజిల్, ఇళ్లల్లో అవసరాలకు వాడే గ్యాస్, కిరోసిన్, ఎరువుల తయారీలో ఉపయోగించే నాఫ్తా, కందెన నూనెలు, మైనం, తారు, వంటి ఇతర ఉత్పత్తులు వెలుగు చూస్తాయి. 1900కి పూర్వం నుండే చమురు శుద్ధి చేయటానికి ప్రయత్నాలు ప్రారంభం అయ్యాయి. తొలినాళ్లలో జరిగే శుద్ధి ప్రక్రియలో 15 బారెళ్ల చమురు నుండి ఒక బారెల్ పెట్రోలు మాత్రమే వెలికి తీయగలిగేవారు. 19వ శతాబ్దం చివరి రెండు దశాబ్దాల్లో పారిశ్రామిక పెట్టుబడిదారీ విధానం తారాస్థాయికి చేరుకోవటంతో దాని అవసరాలు తీర్చగలిగే స్థాయిలో ఇంధన వనరులు కూడా అవసరమయ్యాయి. ఈ దిశగా అనేక ప్రయోగాలు జరిగాయి. 1913లో ఇండియానాకు చెందిన స్టాండర్డ్ ఆయిల్ కంపెనీ ఉద్యోగి విలియం బర్టన్ థర్మల్ క్రాకింగ్ అనే ప్రక్రియను కనిపెట్టాడు. చమురు అంటే కర్బన వాయువుల సముదాయం అని పైన చెప్పుకున్నాము.
ఈ ప్రక్రియలో ముడి చమురును బాయిలర్‌లో వేసి నిర్దిష్ట ఉష్ణోగ్రత వరకూ వేడి చేయటం ద్వారా అందులోని హైడ్రోకార్బన్లను వేరు చేస్తారు. వివిధ దశల్లో జరిగే ఈ ప్రక్రియలో వివిధ ఉత్పత్తులు బయటికి వస్తాయి. మనం పురాణాల్లో చూసే క్షీరసాగర మధనానికి ఇదేమీ తక్కువ కాదు. ఈ తొలినాటి ప్రక్రియల్లో 15 బారెళ్ల చమురును శుద్ధి చేసి ఒకే బారెల్ పెట్రోలు బయటికి తేగలిగితే, బర్టన్ ప్రక్రియ ద్వారా ఒక్కో బారెల్ చమురు నుండి రెండు బారెళ్ల పెట్రోలు బయటికి తేగలుగుతారు. నాటి నుండి చమురు శుద్ధి ప్రక్రియే స్వతంత్ర పరిశ్రమ హోదాకు ఎదిగింది. భారతదేశంలో హెచ్‌పిసిఎల్, బిపిసిఎల్ కంపెనీలు చమురు శుద్ధిలో ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి. ఇవి కాక గుజరాత్ కేంద్రంలో పని చేస్తున్న రిలయన్స్ పెట్రో కెమికల్స్ ప్రైవేటు రంగంలో కీలకమైనది. మన దేశ పారిశ్రామిక అవసరాలకు సరిపడినంత చమురు నిల్వలు దేశీయంగా అందుబాటులో లేకపోవటంతో విదేశాల నుండి పెద్దఎత్తున చమురు నిల్వలు దిగుమతి చేసుకుని వాటిని శుద్ధి చేసి దేశీయ పారిశ్రామిక అవసరాలకు ఉపయోగించుకుంటున్నాం. ఈ విధంగా శుద్ధి చేసిన చమురు ఉత్పత్తులను మార్కెట్ చేయటానికి ఉన్నవే ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, భారత్ పెట్రోలియం కార్పొరేషన్, హిందూస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ వంటివి. వీటికి తోడు ఇండియన్ గ్యాస్, భారత్ గ్యాస్ అంటూ రెండు రకాల గ్యాస్ బ్రాండ్లు మన దేశంలో మార్కెట్‌లో ఉన్నాయి. ప్రపంచీకరణ విధానాల అమలు ప్రారంభించిన నాటి నుండీ క్రమంగా చమురు, సహజవాయువు వెలికి తీతను ప్రైవేటు పరం చేస్తూ వచ్చిన ప్రభుత్వాలు, శుద్ధి పనులు కూడా ప్రైవేటు రంగానికి అప్పగించే దిశగా చర్యలు చేపడుతున్నాయి. ఇక మిగిలింది చమురు ఉత్పత్తులు మార్కెటింగ్ మాత్రమే. నేటి వరకూ చమురు ఉత్పత్తుల మార్కెటింగ్ పూర్తిగా ప్రభుత్వ నియంత్రణలో ఉంది. ప్రస్తుతం అమల్లోకి రానున్న నూతన విధాన ద్వారా ఈ నియంత్రణ గాల్లో కలవనుంది.
నిల్వ నిర్ధారణ- పన్నులు
చమురు రంగం ద్వారా ప్రభుత్వానికి రెండు రకాల ఆదాయాలు సమకూరతాయి. ఒకటి ముడి చమురు దిగుమతి చేసుకునే సందర్భంలో వచ్చే దిగుమతి సుంకం. దిగుమతి చేసుకున్న ఉత్పత్తులను పారిశ్రామిక ప్రక్రియ ద్వారా వినియోగానికి వీలయ్యే సరుకుల రూపంలో మార్చినపుడు విధించే సుంకాలు. ఇవి ఎక్సైజు పన్ను, కార్పొరేట్ పన్ను, రాయల్టీ, డెవిడెండ్, డెవిడెండ్ పై పన్ను, ఇతరములు. ఈ విధంగా మార్కెట్‌లో వినియోగానికి వీలయిన సరుకులు వినియోగదారుడికి చేరే క్రమంపై విధించే పన్నులు వేరే ఉన్నాయి. అవి వాణిజ్య పన్ను, వాట్, ఆక్ట్రారు పన్నులు. ఇన్ని రూపాల్లో వచ్చే ఆదాయాన్ని అటు కేంద్రం, ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు పంచుకుంటాయి. బహుశా రాష్ట్ర ప్రభుత్వాలకు వచ్చే ఆదాయంలో అబ్కారీ ఆదాయం తర్వాత ఈ రూపేణా వచ్చే ఆదాయమే ఎక్కువ. ఉదాహరణకు ఢిల్లీ లాంటి చోట్ల ఒక లీటరు పెట్రోలు ధరలో ఎన్ని పద్దులు కలిసి ఉంటాయో చూద్దాం. లీటరు పెట్రోలు ధరను రెండు భాగాలుగా విభజించవచ్చు. మొదటి ముడి చమురు కొనుగోలు నుండి శుద్ధి వరకూ అయ్యే ఖర్చు. రెండోది శుద్ధి అయిన సరుకును మార్కెట్లోకి తెచ్చే ప్రక్రియలో ఉండే ఖర్చు. అంతర్జాతీయ ధరవరలను ప్రభుత్వం నియంత్రించలేకపోయినా పన్నుల విధానాన్ని మాత్రం నియంత్రించ గలిగే శక్తి దానికి ఉంది. అందువల్లనే చమురు ఉత్పత్తులపై పన్నులను పునర్వవస్థీకరించటం ద్వారా వినియోగదారులపై భారాలు తగ్గించవచ్చని నిపుణులు వాదిస్తున్నారు.
కొనుగోలు, శుద్ధి తర్వాత లీటరు పెట్రోలు ధర - 20.42 రూపాయలు
ఎక్సైజు పన్ను - 14.63 రూపాయలు
విద్యారంగ సెస్ - 2.92
వాణిజ్య సుంకం - 7.2
డీలర్ కమీషన్ - 0.84
వెరసి లీటరు పెట్రోలు ధర 46.01(పెంచటానికి ముందు)
ధరల్లో మార్పు
చమురు ఉత్పత్తుల ధరల్లో వచ్చే మార్పులకు కారణాలు జాతీయ, అంతర్జాతీయంగా ఉంటాయి. జాతీయ కారణాలు అంటే పైన చెప్పుకున్న పన్నుల విధానంలో వచ్చే మార్పులు. అంతర్జాతీయ కారణాలు అంటే చమురు ఉత్పత్తి చేసే దేశాల్లో రాజకీయ అస్థిరత, అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ ఉత్థాన పతనాలు, డెరివేటివ్ వాణిజ్యం ముఖ్య కారణాలు. ఉదాహరణకు 2006-08 మధ్య బారెల్ చమురు ధర కుడిఎడంగా 180 డాలర్లకు చేరింది. ఆర్థిక సంక్షోభం కారణంగా ఇది తగ్గిపోయి నేడు షుమారు 77 డాలర్లగా ఉంది. అంతర్జాతీయంగా చమురు ధరలు మారినపుడల్లా పైన చెప్పుకున్న చమురు సంబంధ పద్దుల్లో పెద్దఎత్తున తేడాలు వస్తాయి. చమురు ధరలు చంచలంగా మారుతూనే వుంటాయి. నష్టం వచ్చే మాట ఉండదు. ధరలు పెరిగినపుడు ఆ ధరల భారాన్ని ప్రజల నుండే వసూలు చేస్తారు. ప్రభుత్వానికి మాత్రం ఎక్కువ రేటు ఉన్నపుడు ఎక్కువ దిగుమతి సుంకం ఆదాయం, తక్కువ రేటు ఉన్నపుడు తక్కువ దిగుమతి సుంకం ఆదాయం వస్తుంది. మిగిలిన పద్దులన్నీ వినియోగదారుల నుండి వసూలు చేసేవే కనుక పెద్ద మార్పు ఉండదు.
2010 జూన్ వరకు భారతదేశంలో చమురు ఉత్పత్తుల ధరలను ప్రభుత్వం నియంత్రిస్తోంది. ఇకపై ఈ నియంత్రణ ఉండదు. అంటే పెట్రోలియం కంపెనీలే అంతర్జాతీయ ధరల ఆధారంగా ప్రతి 15 రోజులకొకసారి చమురు ఉత్పత్తుల ధరలు మార్చేసుకునే స్వేచ్ఛ కలిగి ఉంటాయి. ఈ రకమైన స్వేచ్ఛ ఉంటే చమురు శుద్ధి రంగంలో ప్రైవేటు పెట్టుబడులు వస్తాయన్నది ప్రభుత్వం వాదన. అదేవిధంగా ధరలు కూడా తగ్గుతాయన్నది ఈ వాదనల ఉమ్మడి సారాంశం. ఇప్పటికే వర్థమాన దేశాల్లో అనేక దేశాల్లో చమురు ఉత్పత్తుల ధరలను మార్కెట్ ధరలతో అనుసంధానం చేశారు. అయితే అయా దేశాల్లో ఎక్కడా మార్కెట్ మాయాజాలంలో ధరలు తగ్గిన దాఖలాలు లేవు. లాభాల కోసం వచ్చే కంపెనీలు ప్రజల స్థితిగతులను పట్టించుకుంటాయని నమ్మటం చెరువులో స్నానం చేస్తున్న బ్రాహ్మణుడు చెరువుగట్టున ఉన్న పులి చేతిలో బంగారు కడియం గురించి ఆశపడినట్లే ఉంటుంది సుమా.
పెట్రో పన్ను లెక్కించే విధంబెట్టిదనిన...
పెట్రోల్ ధరలో అసలు ధర (baరఱష జూతీఱషవ) కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పన్నులు, డీలరు కమీషన్, రవాణా చార్జీలు కలిసి ఉంటాయి. ముందుగా పెట్రోల్ అసలు ధరను ప్రభుత్వం ఎలా నిర్ణయిస్తుందో చూద్దాం. ప్రభుత్వం ముడిచమురు బ్యారెళ్ల లెక్కన దిగుమతి చేసుకుంటుంది. ఒక బ్యారెల్‌కు 42 అమెరికా గ్యాలన్ల ముడిచమురు పడుతుంది. 42 గ్యాలన్లంటే 159 లీటర్లు. దీనిని లెక్కల సౌకర్యార్ధం 160గా తీసుకుంటారు. అంటే ఒక బ్యారెల్‌కు 160 లీటర్లన్నమాట. 1 లీటరు ముడిచమురు (క్రూడ్ ఆయిల్) ధరనే పెట్రోల్ అసలు ధరగా ప్రభుత్వం నిర్ణయిస్తున్నది. అంటే 1 లీటరు పెట్రోల్ అసలు ధర = బ్యారెల్ క్రూడ్ ఆయిల్ ధర (రూపాయిలలో) క్ష్మి 160 లీటర్లు. పెట్రోల్ ధరలు పెంచిన రోజున (25.06.2010న) బ్యారెల్ ముడిచమురు ధర 77 డాలర్లుగా ఉంది. అంటే 77 × 46.39 = రు||3572.03 అన్నమాట. ( 1 డాలరు 46.39రు||లు). దీని ప్రకారం 1 లీటరు పెట్రోల్ అసలు ధర = రు||3572.03 క్ష్మి 160 = 22.33 ( దీనిని రు||23గా తీసుకున్నారు). ఇక పెట్రోలియం ఉత్పత్తుల ధరలు పెంచిన అనంతరం మన రాష్ట్ర రాజధానిలో పెట్రోల్ ధరను విశ్లేషిద్దాం.
పెట్రోల్ అసలు ధర రు||23.00
సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీ రు||15.35 (ఇది కేంద్ర బడ్జెట్‌లో నిర్ణయించిన స్థిరమైన ధర)
ఎడ్యుకేషన్ సెస్ రు||00.46 (సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీ మీద 3%)
క్రూడ్ ఆయిల్ కస్టమ్స్ డ్యూటీ రు||01.15 (అసలు ధరపై 5%, ఇది కేంద్ర ప్రభుత్వ పన్ను)
పెట్రోల్ పై కస్టమ్స్ డ్యూటీ రు||01.73 (అసలు ధరపై 7.5%, ఇది కేంద్ర ప్రభుత్వ పన్ను)
వ్యాట్ రు||07.59 (అసలు ధరపై 33%, ఇది రాష్ట్ర ప్రభుత్వ పన్ను)
డీలర్ కమీషన్ రు||01.05
రవాణా చార్జీలు రు||07.17
మొత్తం రు||57.50
పై అంశాలలలో కేంద్ర పన్నులు రు||18.69 (అసలు ధర మీద 81.26%)
రాష్ట్ర పన్నులు రు||07.59 (అసలు ధర మీద 33%)
మొత్తం పన్నులు రు||26.28 (అసలు ధరమీద 114.26%)
దీనిని బట్టి చూస్తే పెట్రోల్ అసలు ధర లీటరు రు||23లు. దీనిమీద పన్నులు రు||26.28లు. పన్నులు అసలు ధరను మించిపోయాయన్నమాట.
25.06.2010న పెట్రోలు రేటు లీటరుకు రు3.50 పెంచింది. దీనితో మార్కెట్ రేటుకు సమానమైంది. అంటే అంతకు ముందు రు||3.50లు తక్కువకు ఇచ్చింది. దీని ప్రకారం పెంచకముందు కేంద్రం మనకు లీటరుకు ఇచ్చిన సబ్సిడీ రు||3.50. పన్ను రూపంలో మన దగ్గర తీసుకున్నది రు||17. నిజంగా కేంద్రం ఇంత కాలం పెట్రోలుపై సబ్సిడీ ఇచ్చిందా? లేక మనదగ్గరే కాజేసిందా? ఆలోచించండి. ప్రభుత్వం మన నుండి లీటరుకు రు||17 పన్నుల రూపంలో తీసుకుని, లీటరుకు రు||3.50 సబ్సిడీ ప్రకటించింది. మన నుండి తీసుకున్న రు||17 నుండే ఈ రు||3.50 ను ఆయిల్ కపెంనీలకు చెల్లిస్తే ఆయిల్ కంపెనీలకు నష్టం వుండదు. ప్రభుత్వం ప్రత్యేకంగా తన ఖజానా నుండి చెల్లించ నవసరంలేదు. ప్రాంతాలను బట్టి రవాణా చార్జీల్లో కొద్ది మార్పులొస్తాయి. దాంతో పెట్రోల్ ధర స్వల్పంగా మారతుంది. ఇక డీజిల్ ధర చూసినా ఇదే పరిస్థితి. డీజిల్ అసలు ధర మీద కూడా ఇవే పన్నులు, ఇవే మోతాదులో వసూలు చస్తున్నారు. డీజిల్ ధర అసలు ధర కన్నా 1.49 శాతం తక్కువ వున్నదని మన ఆర్థిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ చెబుతున్నారు. మనమీద ఏదో దయ దలచినట్లుగా చెబుతున్నారు. కానీ వసూలు చేస్తున్న పన్నులు 36 శాతం వున్నాయి. ఈ విషయాన్ని మంత్రిగారు చెప్పడంలేదు. 36 శాతం తీసుకుని 1.49 శాతం ఇస్తున్నారన్నమాట. ఇదీ వరస.
యం.వి. ఆంజనేయులు, ఎల్.ఐ.సి.ఆఫ్ ఇండియా సి.ఎ.బి, విజయవాడ.
ప్రధానమైన
చమురు నిల్వలున్న దేశాలు
సౌదీ అరేబియా - 261750 మిలియన్ బారెళ్లు,
ఇరాక్- 112500 మి.బా,
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ - 97800
కువైట్ - 96500,
ఇరాన్ - 89700,
వెనిజులా - 77685,
రష్యా -48573,
లిబియా-29500,
మెక్సికో-26941
నైజీరియా-24000,
చైనా-24000,
అమెరికా-22045,
కతార్ - 15207,
హనవోరు -9947,
అలర్జీయా- 9200
బ్రెజిల్ - 8465,
ఒమన్-5506,
కజకిస్తాన్-5417,
అంగోలా-5412,
ఇండోనేషియా-5000.
డిల్లీలో చమురు ఉత్పత్తుల పన్ను
పెట్రోల్ డీజిల్ గ్యాస్ కిరోసిన్
వ్యాట్ 20% 12.5% 4% 4%
సెంటర్
సేల్స్ టాక్స్ 2% 2% 2% 2%
- కొండూరి వీరయ్య
Thursday, July 8, 2010
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment