Thursday, June 24, 2010

డెరివేటివ్‌ ట్రేడింగ్‌కు పదేళ్లు

ప్రజాశక్తి బిజినెస్‌ డెస్క్‌ కొండూరి వీరయ్య Sun, 20 Jun 2010, IST

భారతదేశంలో ఈక్విటీ మార్కెట్‌లో డెరివేటివ్‌ ట్రేడింగ్‌కు పదేళ్లునిండాయి. ఈ పదేళ్ల కాలంలో డెరివేటివ్‌ మార్కెట్‌ లావాదేవీలు గణనీయంగా పెరిగాయి. 2000-2001లో తొలిసారిగా భారతదేశంలో ఇండెక్స్‌లలో డెరివేటివ్‌ వాణిజ్యానికి అనుమతించారు. ఆ సంవత్సరం దేశంలోని అన్ని స్టాక్‌ ఎక్స్ఛేంజిల్లో జరిగిన డెరివేటివ్‌ లావాదేవీల విలువ 11,477 కోట్ల రూపాయలు. ఈ సంవత్సరం మే నెల్లో ఒక్క బొంబాయి స్టాక్‌ ఎక్స్ఛేంజి మరియు ఢిల్లీ స్టాక్‌ ఎక్స్ఛేంజిల్లో సగటు రోజువారీ లావాదేవీల విలువే 16872 కోట్లు. దేశవ్యాప్తంగా డెరివేటివ్‌ లావాదేవీలు పరిగణనలోకి తీసుకుంటే 2010 మే నెల్లోనే 1.01 ట్రిలియన్‌లు ఉన్నాయి. ఈక్విటీ మార్కెట్‌లోకూడా నేరుగా రొక్కం చేతులు మారే దాంతో పోల్చి చూస్తే డెరివేటివ్‌ మార్కెట్‌ లావాదేవీలు ఐదు రెట్లు అధికం. ఇంకా చెప్పాలంటే ఈ పదేళ్లలో ప్రపంచంలోని డెరివేటివ్‌ మార్కెట్లలో మూడో అతి పెద్ద మార్కెట్‌గా అవతరించింది.

డెరివేటివ్‌ మార్కెట్‌ విస్తరణ దిశగా ప్రభుత్వం తీసుకున్న వివిధ చర్యలను దిగువనున్న పట్టికలో చూడవచ్చు.

జూన్‌ 2000- బోంబే స్టాక్‌ ఎక్చేంజిలో ఫ్యూచర్స్‌ ట్రేడింగ్‌కు అనుమతి

జూన్‌ 2000- నిఫ్టిలో ఫ్యూచర్స్‌ ట్రేడింగ్‌కు అనుమతి

ఆగస్టు 2000- నిఫ్టి, బోంబే స్టాక్‌ ఎక్జేంజిలో ఫ్యూచర్స్‌, ఆప్షన్స్‌లో ట్రేడింగ్‌ ప్రారంభం

2001- సింగిల్‌ స్టాక్‌ ఫ్యూచర్స్‌, ఈక్విటీ ఇండెక్స్‌లో ఫ్యూచర్స్‌ ట్రేడింగ్‌ ప్రారంభం

2002 - ఆహారోత్పత్తులల్లో ఫ్యూచర్స్‌ ట్రేడింగ్‌పై ఉన్న ఆంక్షల రద్దు

2008- ద్రవ్యమార్కెట్‌ ఉత్పత్తుల్లో ఫ్యూచర్స్‌ ట్రేడింగ్‌కు అనుమతి.

గత రెండేళ్లలో డెరివేటివ్‌ మార్కెట్‌ అనేక కొత్త పుంతలు తొక్కింది. తొలుత ఈక్విటీ డెరివేటివ్‌లలో వాణిజ్యానికే పరిమితమైన లావాదేవీలు రాను రాను డెరివేటివ్స్‌లోని ఇతర అంశాలు స్టాక్‌ ఆప్షన్స్‌, ఫ్యూచర్స్‌ మరియు ఇండెక్స్‌ ఆప్షన్స్‌తో సహా అన్ని రకాల లావాదేవీలకు తలుపులు తెరవబడ్డాయి. 2007 డిశంబరు నాటికి స్టాక్‌ ఆప్షన్స్‌ లావాదేవీలే మొత్తం డెరివేటివ్‌ లావాదేవీల్లో మూడింట రెండు వంతులు ఉంటే ఇండెక్స్‌ లావాదేవీలు 22-33 శాతం మధ్య ఉండేవి. నాడు ఆప్షన్స్‌ విభాగంలో 10 శాతం మాత్రమే లావాదేవీలు జరిగితే నేడు 60 శాతానికి పెరిగాయి. సెక్యూరిటీస్‌ లావాదేవీలపై విధించే పన్ను విషయంలో సడలింపు ఇచ్చిన తర్వాత ఈ డెరివేటివ్‌ మార్కెట్‌లో లావాదేవీలు ఊపందుకోవటం స్పష్టంగా కనిపిస్తోంది. ఫ్యూచర్స్‌ వాణిజ్యం కంటే ఆప్షన్స్‌ వాణిజ్యం మరింత తేలిక కావటంతో నేడు స్టాక్‌ మార్కెట్‌ బ్రోకర్లు ఆప్షన్స్‌ మార్కెట్‌పై కేంద్రీకరిస్తున్నారు. ఆప్షన్స్‌ మార్కెట్‌ ద్వారా వాణిజ్యంలో ఎదురయ్యే రిస్కును సమర్థవంతంగా ఎదుర్కోవటానికి అవకాశం ఉండటంతో పాటు డెరివేటివ్‌లలోని మిగిలిన పద్ధతుల కంటే ఆప్షన్స్‌ పద్ధతిలో ఎక్కువ సౌలభ్యం, అదనపు ఆదాయాన్ని సంపాదించే అవకాశాలు ఉండటంతో బ్రోకర్లు ఇతర మార్కెట్‌ సాధనాల కంటే ఆప్షన్‌లకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. దీనికనుగుణంగానే స్టాక్‌ మార్కెట్‌ నియంత్రణా సంస్థ దీర్ఘ కాల ఆప్షన్స్‌లో వాణిజ్యానికి అవకాశాలు కల్పించే దిశగా పలు చర్యలు తీసుకొంది.

ఇంత భారీ స్థాయిలో ట్రిలియన్‌ డాలర్లకు పైగా లావాదేవీలు జరుగుతున్నా దీని నిజస్వభావం గురించి సాధారణ మార్కెట్‌ ఆపరేటర్లకు అంతగా సమాచారం అందుబాటులో లేదు. అంతేకాదు. స్టాక్‌ ఎక్స్ఛేంజి నియంత్రణా బోర్డు కేవలం నెలవారీ డెరివేటివ్‌ కాంట్రాక్టులను మాత్రమే అనుమతించటంతో ప్రతి నెలా కాంట్రాక్టులను పునరుద్ధరించుకోవటం కోసం పెద్దఎత్తున రుసుములు చెల్లించాల్సి వస్తోందని వ్యాపారులు వాపోతున్నారు. ఇందులో దాగి ఉన్న మరో సమస్య ఏమిటంటే దీర్ఘకాల డెరివేటివ్స్‌కు సంబంధించింది. ఒక సారి ఇటువంటి దీర్ఘకాలంలో మెచ్యురిటీ అయ్యే డెరివేటివ్‌లలో పెట్టుబడులు పెట్టడం అంటే సదరు పెట్టుబడులను అంత కాలం పాటు నిర్జీవంగా వదిలేయటమే. దీన్నే పెట్టుబడులు లాక్‌ చేయటం అంటారు. దాంతో మెచ్యూరిటీ కాల వ్యవధి ఎక్కువగా ఉండటంతో అటువంటి వాటిల్లో ఎక్కువగా పెట్టుబడులు పెట్టటానికి బ్రోకర్లు వెనకాడుతున్నారు. ఇన్ని పరిమితులున్నా డెరివేటివ్‌ మార్కెట్‌ లావాదేవీలు దేశంలో ట్రిలియన్‌ డాలర్లకు చేరుకొందంటే పందేలు కాసే సంస్కృతి మార్కెట్‌లో ఎంతగా పెరిగిపోయిందో స్పష్టం అవుతోంది.

మరో వైపున ఓవర్‌ ది కౌంటర్‌ ఈక్విటీ డెరివేటివ్‌లకు అవకాశం ఇవ్వాల్సిందిగా సెబిపై ఒత్తిడి పెరుగుతోంది. గత సంవత్సరం దేశంలో డెరివేటివ్‌ మార్కెట్‌ను సమీక్షించి తదుపరి చర్యలు తీసుకోవటానికి సెబి స్వయంగా ఒక కమిటీని నియమించింది. ఈ కమిటీ స్టాక్‌ మార్కెట్‌లో ఓవర్‌ ది కౌంటర్‌ ట్రేడింగ్‌ తరహాలో డెరివేటివ్‌ మార్కెట్‌లో కూడా ఓవర్‌ ది కౌంటర్‌ ట్రేడింగ్‌ను అనుమతించవచ్చని సిఫార్సు చేసింది. ఈ లోగా అంతర్జాతీయ పెట్టుబడిదారీ సంక్షోభం ముంచుకు రావటంతో ఈ సిఫార్సులను కార్యరూపం దాల్చేలా చేపట్టాల్సిన చర్యలను ప్రభుత్వం వాయిదా వేసింది. అయితే ఇప్పటికే భారతదేశానికి చెందిన కొన్ని సంస్థలు విదేశీ డెరివేటివ్‌ మార్కెట్లలో ఓవర్‌ ది కౌంటర్‌ డెరివేటివ్‌ వాణిజ్యంలో నిమగమై ఉన్నాయి. దాంతో ఈ ప్రక్రియకు మనదేశంలోనూ అనుమతించాలన్న ఒత్తిడి క్రమేణా పెరుగుతోంది. ఓవర్‌ ది కౌంటర్‌ డెరివేటివ్‌ వాణిజ్యాన్ని నియంత్రించటం ద్వారా అంతమేర పెట్టుబడులు విదేశాలకు వెళ్లేందుకు ప్రభుత్వం అవకాశం కల్పిస్తోందని, ఈ ప్రక్రియకు దేశంలోనే అనుమతిస్తే సదరు వాణిజ్యానికి వినియోగించే పెట్టుబడులు దేశంలోనే ఉంటాయన్నది వీరి వాదన. కర్ణాటకలో సెల్ఫ్‌ ఫైనాన్స్‌ వైద్యకళాశాలలకు అనుమతించి, ఆంధ్రప్రదేశ్‌లో అనుమతించనందున శక్తి కలిగిన వారు కర్ణాటక వెళ్లి చదువుకోవటంతో మన రాష్ట్రం నుండి డబ్బులు తరలి వెళ్లుతున్నాయని, దానికి బదులుగా రాష్ట్రంలోనే సెల్ఫ్‌ ఫైనాన్స్‌ వైద్య కళాశాలలు స్థాపించటానికి అనుమతించాలని గతంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం వాదించినట్లుగా ఉంది పై వాదన. ఇటువంటి వాదనలతోనే డెరివేటివ్‌ మార్కెట్లో నిషేధిత ఉత్పత్తుల్లో వాణిజ్యాన్ని అనుమతించే దిశగా ప్రభుత్వంపై వస్తున్న ఒత్తిళ్లను తట్టుకుని ఈ మార్కెట్‌ను ప్రభుత్వం ఎలా నియంత్రించనున్నదన్న విషయం రానున్న కాలంలో గానీ స్పష్టం కాదు.

No comments: