ప్రజాశక్తి -బిజినెస్‌డెస్క్‌కొండూరి వీరయ్య Sun, 28 Feb 2010, IST
ఊరందరిదీ ఒక దారి అయితే ఉలిపి కట్టెది వేరే దారట. సంస్కరణలను వేగవంతం చేసేందుకు మన భారతదేశం 2010-2011 బడ్జెట్‌లో పెద్ద పీట వేయటమే దీనికి ఉదాహరణ. గతవారం చెప్పుకొన్నట్లు రెండు దశాబ్దాల సంస్కరణల అనుభవాలు మదింపు చేసుకునేందుకు వచ్చిన అరుదైన అవకాశాన్ని ప్రభుత్వం వృధా చేసుకొందని చెప్పకతప్పదు. 1990-1991 సంస్కరణలకు ఆరంగేట్రం చేసిన ప్రణబ్ ముఖర్జీ, మన్మోహన్‌సింగ్, మాంటెక్ సింగ్ అహ్లువాలియాలే నేడు కూడా కీలక విధాన నిర్ణాయక హౌదాలో ఉన్నారు. పైగా మొదటి రెండు దశాబ్దాల్లో మౌలిక రంగాలకు పరిమితం అయిన సంస్కరణలను నేడు సామాజిక, అనుబంధ రంగాలకు కూడా విస్తరించటానికి వీరి నేతృత్వంలో ప్రభుత్వం నడుం కట్టినట్లు బడ్జెట్ ప్రసంగాన్ని పరిశీలిస్తే అర్థం అవుతుంది.
ఏ దేశానికి సంబంధించిన ఆర్ధిక వ్యవస్థలోనైనా రెండు భాగాలు ఉంటాయి. మొదటిది పరపతి విధానం. దాన్నే విస్తృతార్థంలో మానిటరీ పాలసీ అంటారు. రెండోది ద్రవ్య విధానం. దాన్నే ఫిస్కల్ పాలసీ అంటారు. పరపతి విధానం ద్వారా రిజర్వు బ్యాంకు మార్కెట్లో ఉండాల్సిన రొక్కం నిధులు, దానికి అవసరమైన విధి విధానాలను ప్రభుత్వాలు నియంత్రిస్తాయి. ద్రవ్య విధానంలో భాగంగా ప్రభుత్వం మార్కెట్‌లో ఉన్న నిధులు ఎవరి వద్దకు చేర్చాలి అన్న విషయంలో తన విచక్షణ ప్రదర్శిస్తుంది. ఇందులో ముఖ్యమైనది పన్నుల విధానం. ఏ ప్రభుత్వం అయినా ఎవరి పక్షపాతిగా ఉంది అని చెప్పటానికి సదరు బడ్జెట్‌లో అనుసరించిన పన్నుల విధానం కీలక ప్రాతిపదికగా ఉంటుంది. పరోక్ష పన్నులు (ఎక్సైజ్, కస్టమ్స్, సర్‌చార్జి వంటివి) నూటికి 95 శాతం ప్రజల జీవితాలను, ఆదాయ వ్యవయాలను నేరుగా ప్రభావితం చేస్తాయి. దీనికి భిన్నంగా ప్రతక్ష్య పన్నుల పరిధిలోకి వచ్చే ప్రజల వాటా కేవలం 5 శాతం మాత్రమే.95 శాతం మందిపై విధించే పన్నుల ద్వారా ప్రభుత్వానికి ఎక్కువ ఆదాయం సమకూరవచ్చు. కానీ ఆ మేరకు ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావం పడుతుంది. పదే పదే కౌటిల్యుడి ఆర్థిక సూత్రాల ప్రకారం బడ్జెట్ రూపొందించామని చెప్పుకున్న ప్రణబ్ ముఖర్జీ , ''మార్కెట్‌లో నియంత్రణలు లేని ధరల వల్ల వేర్వేరు వర్గాల ప్రజలు వేర్వేరు మోతాదుల్లో భారాలపాలవుతారు. ప్రత్యేకించి శ్రమజీవులపై ఈ భారం ఎక్కువగా ఉంటుంది'' అన్న కౌటిల్యుని సూత్రాన్ని మాత్రం మర్చిపోయారు. ఉత్పాదక క్రమాన్ని దెబ్బతీయకుండా ప్రభుత్వ ఆదాయం పెంచుకోవటానికి అవసరమైతే జూద గృహాలు (నేటి స్పెక్యులేటివ్ వ్యాపారులు)పై కూడా పన్ను వేయాలని కౌటిల్యుడు చెప్పిన సూత్రం మాత్రం ఆర్థిక మంత్రికి గుర్తుకు రాలేదు.
ప్రభుత్వం చమురు ధరలు, ఎరువులపై నియంత్రణ రద్దు చేస్తూ తీసుకున్న నిర్ణయం మొత్తంగా 95 శాతం మంది ప్రజానీకంపై భారాలు మోపటంతో పాటు ద్రవ్యోల్బణాన్ని పెంచుతుంది. దాంతో పాటే ధరలు కూడా పెరుగుతాయి. ధరలు పెరగటం అంటే మార్కెట్‌లో ప్రజల చేతిలో ఉన్న రొక్కం (లిక్విడిటీ) తగ్గిపోవటం అన్నమాట. ధరల రూపంలో ఈ నిధులు చేతులు మారి సంపన్నులకు చేరతాయి. అదే 5 శాతం మంది పారిశ్రామికవేత్తలు, కుబేరులపై విధించే పన్నులు పెంచటం వల్ల నేరుగా ఆర్థిక వ్యవస్థపై పడే భారం పరిమితంగా ఉంటుంది. కానీ ప్రభుత్వం మొదటి నిర్ణయానికే ప్రాధాన్యత ఇచ్చింది.సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ (సిబిడిటి) అంచనా మేరకు కేవలం వివాదాల కారణంగా ప్రభుత్వం ఏటా పన్నుల ద్వారా రావాల్సిన ఆదాయంలో 50 వేల కోట్ల రూపాయలు కోల్పోతోంది. ప్రభుత్వం ఈ బడ్జెట్‌లో పరోక్ష పన్నుల ద్వారా వసూలు చేయదల్చుకొన్న మొత్తం ఆదాయంలో ఇది మూడోవంతు. అంతేకాదు. గత మూడు సంవత్సరాలుగా దేశ స్థూల జాతీయోత్పత్తిలో ప్రత్యక్ష పన్నుల వాటా, కార్పొరేట్ పన్నుల వాటా తగ్గిపోతోందని ఆర్థిక సర్వే స్పష్టంగా చెప్పింది. అయినా ఈ విషయాలు సరి చేయటం ద్వారా ఆదాయం పెంచుకునేందుకు ఉన్న మార్గాలు పరిశీలించటానికి ప్రభుత్వం నిరాకరిస్తోంది.
మధ్యతరగతి ప్రజల మెప్పు పొందటం కోసం ఆదాయపు పన్నుల్లో నామమాత్రపు మార్పులు చేసింది. చూడటానికి 1,60,000 రూపాయలకు లోబడి ఆదాయం వచ్చే వారిపై పన్ను భారం తగ్గించటం ద్వారా వారి చేతిలో ఖర్చుపెట్టటానికి పుష్కలంగా అవసరమైన నిధులు అందుబాటులో ఉంచామని ఆర్థిక శాఖ కార్యదర్శి ప్రకటించారు. అదే సమయంలో ధరల నియంత్రణను గాలికి వదిలేయటం ద్వారా కుడిచేత్తో ఇచ్చిన రొక్కాన్ని ఎడమ చేత్తో లాగేసుకున్నట్లయ్యింది. చమురు, ఎరువుల ధరలపై నియంత్రణ రద్దు చేయటం ఈ ఒక్క బడ్జెట్‌కే పరిమితమైన కసరత్తు కాదు. రానున్న కాలంలో ఈ ధరల నిర్ణయ క్రమాన్ని మార్కెట్ ఒడిదుడుకులకు అనుగుణంగా నిర్ణయించే స్వతంత్ర అధికారాన్ని ఆయా కంపెనీలకు చేతిలో కట్టబెట్టింది. గత నెల రిజర్వు బ్యాంకు వెలవరించిన ఒక నివేదికలో '' ప్రభుత్వం మార్కెట్‌ను ప్రతికూలంగా ప్రభావితం చేసేలా తీసుకున్న నిర్ణయాలు భారం తక్షణమే ప్రజలకు చేరుతుంది. సానుకూలంగా ప్రభావితం చేసేలా తీసుకున్న నిర్ణయాలు ప్రజలకు చేరేసరికి ఆలస్యం అవుతున్నాయి'' అని పేర్కొంది. అంతర్జాతీయ మార్కెట్‌లో పెద్దఎత్తున పతనం చవిచూసిన గత రెండు సంవత్సరాల్లో రిటైల్ ధరలు ఏమాత్రం తగ్గాయో మనం చూస్తూనే ఉన్నాము. అందువల్ల ఇకపై ప్రజలపై పడే ధరల భారం ఎగమోరతో ఉంటుందే తప్ప తిరుగుముఖం పట్టే అవకాశాలు లేవు.
సంస్కరణల విషయంలో చెప్పుకోవాల్సిన మరో కీలక అంశం వ్యవసాయ రంగంలో ప్రైవేటు పెట్టుబడులు పెంచాలన్న ప్రతిపాదన. విద్యా రంగంలో విదేశీ విశ్వవిద్యాలయాలకు పెద్ద పీట వేయాలన్న ప్రతిపాదన ముఖ్యమైనవి. ప్రభుత్వం మూడ్ గమనించిన రిజర్వు బ్యాంకు కూడా ఈ విధానాలకు మానిటరీ పాలసీలో ఉన్న అవాంతరాలు తగ్గించే విధంగా అవసరమైతే రూపాయి పూర్తి మారకాన్ని అనుమతించేందుకు వెనకాడబోమని ప్రకటించింది. ఆర్థిక సర్వేలో కూడా ఇప్పటి వరకు ప్రభుత్వం అనుసరిస్తున్న సంక్షేమ విధానాల దశ, దిశను మార్చాలని ప్రతిపాదించింది. పాశ్చాత్య దేశాల్లో సంక్షేమ రాజ్యం గురించి జరుగుతున్న చర్చల సారాంశాన్ని భారత ప్రభుత్వం తన విధాన పత్రాల్లో చొప్చించింది. తద్వారా భారతదేశంలో సంక్షేమ రాజ్యం గురించి జరుగుతున్న చర్చకు ఆందోళనకరమైన నూతన కోణాన్ని జోడించింది ఈ బడ్జెట్.
Wednesday, March 3, 2010
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment