Published in Prajasakti Telugu Daily, Mon 22nd Feb 2010, IST
* 20 సంవత్సరాల క్రితం సంస్కరణలు ప్రారంభమైనపుడు ప్రభుత్వం ముందున్న మరో లక్ష్యం, ఐఎంఎఫ్, ప్రపంచ బ్యాంకులు నిర్దేశించిన కీలక షరతు, ద్రవ్యలోటు తగ్గించటం. ఈ షరతు అమల్లో భాగంగా తెరమీదకు వచ్చిందే ద్రవ్యనియంత్రణ చట్టం. పెట్టుబడిదారీ వ్యవస్థ తాజా సంక్షోభ దశ నేపథ్యంలో ద్రవ్యలోటు నియంత్రించాలా వద్దా అన్న అంశంపై పెద్దఎత్తున సైద్ధాంతిక చర్చ జరుగుతోంది.
అనుభవాజ్ఞుడైన ఆర్థిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ ఈ శుక్రవారం యుపిఎ-2 ప్రభుత్వపు రెండో బడ్జెట్‌ను పార్లమెంట్‌లో ప్రతిపాదించనున్నారు. నిజానికి యుపిఎ-2లో ఇది తొలి పూర్తి స్థాయి బడ్జెట్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎన్నికల ముందు ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ప్రతిపాదించారు. ఎన్నికల తర్వాత పూర్తి స్థాయి బడ్జెట్ ప్రతిపాదించినా దానికంటే ముందే ఎన్నికలు ముగియగానే రెండు, మూడు దఫాల ఉద్దీపన పథకాలు ప్రకటించటం మనకు తెలుసు. దాంతో గత సంవత్సరం బడ్జెట్ అంతా పెట్టుబడిదారీ వ్యవస్థ సంక్షోభం పడగ నీడన సాగింది. ప్రస్తుతం అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ ఈ సంక్షోభం పగడ నీడ నుండి బయట పడుతుందని చెప్పుకొస్తున్నారు. వర్ధమాన దేశాలు ప్రత్యేకించి చైనా, భారతదేశాల్లో ఆర్థికాభివృద్ధి వేగం గురించి పుంఖానుపుంఖాలుగా వివరాలు వస్తున్నాయి.
తాజాగా గత వారం విడుదలైన పారిశ్రామికాభివృద్ది సూచికలు కూడా భారతదేశంలో పారిశ్రామికాభివృద్ధి రెండంకెల స్థాయిని దాటిపోతుందని చెప్తున్నాయి. ఈ పరిస్థితుల్లో ప్రణబ్ ముఖర్జీ పూర్తి స్థాయి బడ్జెట్ ప్రతిపాదించాల్సి ఉంది. ఈ బడ్జెట్‌కు రెండు ప్రత్యేకతలు కూడా ఉన్నాయి. జనవరి రెండో వారంలో చెప్పుకున్నట్లు గత దశాబ్దం సామ్రాజ్యవాద ప్రపంచీకరణకు సవాళ్లు విసిరిన దశాబ్దం. అదేసమయంలో వర్ధమాన దేశాల ఆర్థిక వ్యవస్థలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో పట్టు పెంచుకుంటున్న కాలం కూడా. పలువురు అంతర్జాతీయ ఆర్థికవేత్తలు, విశ్లేషకులు ఈ దశాబ్దం చిండియా దశాబ్దం (చైనా, భారత్‌ల ఆధిపత్యం కొనసాగే దశాబ్దం)గా పరిగణిస్తున్నారు. అంటే గత మూడు నాలుగు సంవత్సరాలుగా ఈ రెండు దేశాలు ఆర్థిక రంగంలో ప్రదర్శిస్తున్న ప్రతిభాపాటవాలు మరో దశాబ్దం పాటు కొనసాగే అవకాశం ఉందన్న అంచనాలు ఉన్నాయి. అంటే దశాబ్దం పాటు నిర్వరామమైన అభివృద్ధికి కావల్సిన విధానమార్గదర్శనం చేసేందుకు ఈ సంవత్సరం ప్రభుత్వం ప్రతిపాదించే బడ్జెట్ ఒక అనూహ్య అవకాశంగా ఉండనుంది.
మరో ముఖ్యమైన ప్రత్యేకత ఈ సంవత్సరంతో కాంగ్రెస్ ప్రభుత్వం పివి నరసింహారావునేతృత్వంలో ప్రారంభించిన ఆర్థిక సంస్కరణలకు నిండా రెండు దశాబ్దాలు పూర్తయ్యాయి. విదేశీ మారక ద్రవ్య చెల్లింపుల సంక్షోభంతో సంస్కరణలకు తెరతీసిన ప్రభుత్వాలు వరుసగా కొద్ది పాటి వ్యత్యాసాలు మినహా ఈ ధోరణిని కొనసాగిస్తూ వచ్చాయి. ప్రణబ్ ముఖర్జీ ప్రతిపాదించే బడ్జెట్ గత రెండు దశాబ్దాల ఆర్థిక సంస్కరణలను సమీక్షించుకునేందుకు మంచి అవకాశంగా ఉంటుంది. ప్రణాళికా సంఘం అంచనాల మేరకే సంస్కరణల ఫలితంగా తోసుకొచ్చిన అభివృద్ధి అవకాశాల తర్వాత కూడా 35 శాతం ప్రజలు పేదరికంలో మగ్గుతున్నారు. పరిస్థితులు ఎంతగా దిగజారాయంటే చివరికి ప్రాథమిక హక్కుగా గుర్తిస్తే తప్ప ప్రభుత్వం పౌరులందరికీ ఆహారం పెట్టలేని దుస్థితికి చేరింది. ఆహారోత్పత్తుల ధరలు బహుశా చమురు సంక్షోభం తర్వాత ఇంత స్థాయిలో పెరిగింది ఇప్పుడేనేమో.సంస్కరణలు ప్రారంభించే నాటికి ప్రభుత్వం ముందున్న మౌలిక లక్ష్యాల్లో ఒకటి రెండంకెలకు చేరుకున్న ద్రవ్యోల్బణం మదపుటేనుగును లొంగదీసుకోవటం. దాదాపు ఏడెనిమిది సంవత్సరాల పాటు 5-6 శాతానికి అటు ఇటూగా ఉన్న ఈ ద్రవ్యోల్బణం తిరిగి గత రెండు సంవత్సరాలుగా రెండంకెల దశకు చేరుకొంది. గత సంవత్సరం వరకూ వరసగా నాలుగు సంవత్సరాల పాటు కరుణించిన వరుణుడి సహకారంతో అదుపులో ఉన్న ఈ మదపుటేనుగు ఎన్నికలకు ముందు ఒక్కసారిగా కట్లు తెంచుకొంది. దాంతో ద్రవ్యోల్బణం పది శాతానికి పైమాటగానే మిగిలింది.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో సంక్షోభం కారణంగా దెబ్బతిన్న పారిశ్రామికోత్పత్తి సంవత్సరం చివరి నాటికి కోలుకున్నా వ్యవసాయోత్పత్తి మాత్రం కరువు బారి నుండి బయటపడలేదు. దాంతో ఆహారోత్పత్తుల ద్రవ్యోల్బణం 17-19 శాతం మధ్య ఊగిసలాడుతోంది. దాని ప్రభావం మార్కెట్లో కనిపిస్తోంది. మరోవైపున ఉపాధి రంగంలో కొత్తగా కనిపిస్తున్న పురోగతి ఏమీ లేదు. ఐటి రంగంలో, ఎగుమతి ఆధారిత పరిశ్రమల్లో కాస్తంత ఉపాధికల్పన సామర్థ్యం పెరిగినా సాంప్రదాయకంగా ఉండే పారిశ్రామిక రంగం, వ్యవసాయరంగంలో ఉపాధి కల్పన తగ్గిపోయిందని ప్రభుత్వమే అంగీకరిస్తోంది. ఉన్న కొద్ది పాటి ఉపాధి కల్పన కూడా నిరంతరం అభద్రత వాతావరణంలో ఉంది. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం ప్రతిపాదించే బడ్జెట్ ఈ పర్యవసానాలను, ఈ పర్యవసానాలకు కారణమైన విధానాలను సమీక్షించాలని ఆశించటం అత్యాశ కాదు. ప్రభుత్వం ఈ సమీక్షకు సిద్ధమవుతుందా లేదా అన్నది వేరే ప్రశ్న. రెండు దశాబ్దాల సంస్కరణలను పురస్కరించుకుని మిగిలి ఉన్న సంస్కరణల ప్రక్రియను అంటే కాపిటల్ అకౌంట్ కన్వర్టబిలిటీ, వివిధ దేశాలతో స్వేఛ్చా వాణిజ్య ఒప్పందాలు, కార్మికరంగ సంస్కరణలు వంటి అంశాలకు ఈ బడ్జెట్‌లో ప్రాధాన్యత ఇవ్వాలని పారిశ్రామిక వర్గాలు డిమాండ్ చేస్తున్నాయి. అంతేకాదు. పన్నుల రంగంలో కూడా సంపన్నులకు, పెట్టుబడిదారీ వర్గానికి మరింత రాయితీలు ఇవ్వాలన్న డిమాండ్ కూడా ముందుకొస్తోంది. ప్రత్యక్ష పన్నుల ప్రవర్తనా నియమావళి, దేశవ్యాప్తంగా వర్తించే ఒకే తరహా వాణిజ్యపన్నుల విధానం- గూడ్స్ అండ్ సర్వీసెస్ టాక్స్(జిఎస్‌టి)- ఇందులో ముఖ్యమైన అంశాలుగా ఉన్నాయి. 20 సంవత్సరాల క్రితం సంస్కరణలు ప్రారంభమైనపుడు ప్రభుత్వం ముందున్న మరో లక్ష్యం, ఐఎంఎఫ్, ప్రపంచ బ్యాంకులు నిర్దేశించిన కీలక షరతు, ద్రవ్యలోటు తగ్గించటం. ఈ షరతు అమల్లో భాగంగా తెరమీదకు వచ్చిందే ద్రవ్యనియంత్రణ చట్టం. పెట్టుబడిదారీ వ్యవస్థ తాజా సంక్షోభ దశ నేపథ్యంలో ద్రవ్యలోటు నియంత్రించాలా వద్దా అన్న అంశంపై పెద్దఎత్తున సైద్ధాంతిక చర్చ జరుగుతోంది.
యూరోపియన్ యూనియన్ సభ్యదేశం గ్రీస్ తన స్థూల జాతీయోత్పత్తి కంటే 114 శాతం అధికంగా అప్పుల్లో కూరుకుపోయింది. 2012 నాటికి అమెరికా అప్పులు ఆ దేశ స్థూల జాతీయోత్పత్తిలో 77 శాతంగా ఉంటాయని బ్యాంక్ ఆఫ్ ఇంటర్నేషనల్ సెటిల్‌మెంట్ పరిశోధనలో వెల్లడైంది. ఈ పరిస్తితుల్లో రానున్న దశాబ్దంలో భారతదేశం ఆర్థిక ఆధిపత్యాన్ని ప్రదర్శించాలంటే ద్రవ్య లోటు నియంత్రించటం ముఖ్యమైన షరతుగా పలువురు ఉదారవాద ఆర్థికవేత్తలు, విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. ద్రవ్యలోటు నియంత్రించకపోతే ద్రవ్యరంగంలో సుస్థిరత సాధ్యం కాదన్నది వీరి వాదన. సంక్షోభం నేపథ్యంలో అన్ని ప్రభుత్వాలు విస్తృతంగా ఉత్పాదక, మౌలిక సదుపాయాల రంగంలో పెట్టుబడులు పెంచుకుంటూ వచ్చాయి. ఈ పెట్టుబడులు పెరుగుతున్నంత కాలం ద్రవ్యలోటుపెరుగుతూ ఉంటుంది. అదేసమయంలో ప్రైవేటు రంగ పెట్టుబడికి గల అవకాశాలు పరిమితం అవుతూ వస్తాయి. అందువల్లనే ద్రవ్యనియంత్రణ పేరుతో ఉత్పత్తి రంగంలోనూ, మౌలిక సదుపాయాల రంగంలోనూ ప్రైవేటు పెట్టుబడికి అవకాశాలు విస్తరింపచేయాలన్నది వీరి వాదన. ద్రవ్యలోటు నియంత్రణ రెండంచెల చర్య. మొదటిది పైది. రెండో అంచెలో భాగంగా ప్రభుత్వ వ్యయం తగ్గించుకునేందుకు గాను సబ్సిడీలపై వేటు వేయాలని వీరు ప్రతిపాదిస్తున్నారు.
బడ్జెట్‌కంటే ముందే ఎరువులపై ఇచ్చే సబ్సిడీని కుదించేందుకు కట్టుదిట్టమైన ఏర్పాటు జరిగిపోయాయి. గురువారం నాటి క్యాబనెట్ నిర్ణయం వల్ల, డీకంట్రోల్డ్ నుండి న్యూట్రియంట్ బేస్డ్ ఎరువుల సబ్సిడీకి మళ్లటంతో కేంద్ర ప్రభుత్వానికి సుమారు రూ.30వేలకోట్లు ఆదా అవుతుందని అంచనా వేస్తున్నారు. స్థూలంగా చూస్తే రెండు దశాబ్దాల ఆర్థికాభివృద్ధి ఫలితాలు, పర్యవసానాలు సమీక్షించి సమగ్ర మానవాభివృద్ధికి అవసరమైన విధానాలకు బడ్జెట్ ప్రాధాన్యత ఇస్తుందా లేక రానున్న దశాబ్ద కాలంలో ప్రపంచ ఆర్థికరంగంపై భారతదేశ బహుళజాతి కంపెనీల ఆధిపత్యం నిలుపుకోవటానికి అవసరమైన విధానాలకే ఈ బడ్జెట్ పరిమితం అవుతుందా అన్నది దేశం ముందున్న ప్రశ్న.
కొండూరివీరయ్య
Monday, February 22, 2010
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment