యుపిఎ 2 ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పెట్టుబడుల ఉపసంహరణ కుంభకోణం దిశగా నడుస్తోంది. ప్రతిష్టాత్మకమైన ప్రభుత్వరంగ సంస్థల గ్రామీణ విద్యుదీకరణ కంపెనీ, జాతీయ గనులు, ఆర్‌ఇసి, ఖనిజాభివృద్ధి సంస్థ, ఎన్‌ఎంఎండిసి, జాతీయ థర్మల్ విద్యుత్పత్తి కార్పొరేేషన్ ఎన్టీపిసిల్లో ప్రభుత్వ వాటాల ఉపసంహరణ వ్యవహారాన్ని పరిశీలిస్తే నా ఈ సందేహం నిరాధారం కాదని స్పష్టమవుతోంది. 2009-2010 ఆర్థిక సంవత్సరానికి 25000 కోట్ల రూపాయల ఆదాయాన్ని పెట్టుబడుల ఉపసంహరణ ద్వారా సంపాదించాలని ప్రభుత్వం నిర్ణయించుకొంది. యుపిఎ- 1 మరియు యుపిఎ 2 మధ్య ఆర్థిక విధానాల్లో ఉన్న మౌలిక వ్యత్యాసాన్ని ప్రతిబింబిస్తూ 2009 జూన్‌లో రాష్ట్రపతి, 'ప్రభుత్వరంగ సంస్థల ఆస్తుల్లో వాటాలు పొందే హక్కు ప్రతి పౌరుడికీ ఉంది. అందువల్ల ప్రభుత్వ రంగ సంస్థల యాజమాన్యంలో మార్పు లేకుండా సాధ్యమైనంత మంది ఎక్కువ ప్రజలకు వాటాలపై హక్కులు కల్పించేందుకు గాను ప్రభుత్వం చర్యలు చేపడుతుంది' అని పేర్కొన్నారు. ప్రభుత్వరంగ సంస్థల వాటాలు ప్రైవేటు శక్తులకు కట్టబెట్టే పనికే నాజూకుగా ప్రభుత్వం ప్రభుత్వరంగ సంస్థల ఆస్తులపై ప్రజలకు హక్కులు కల్పించటం అని పిలిచింది. ఈ విధానం ప్రకారం ప్రభుత్వరంగ సంస్థల వాటాల విక్రయంలో ప్రజలు తండోపతండాలుగా పాల్గొనాలి. లక్షలాది షేర్లు, వాటాలు కొనుగోలు చేయటానికి గాను మార్కెట్‌ను ప్రజలు ముంచెత్తాలి. కానీ పరిస్థితి దీనికి భిన్నంగా సాగుతోందని దిగువనున్న పట్టిక తెలియచేస్తోంది.
ఈ మొత్తం ప్రక్రియలో మరో కీలకమైన అంశం దాగి ఉంది. షేర్లు కొనటానికి సాధారణ ప్రజలు సిద్ధం కాకపోవటం ఒక అంశమైతే మరోటి ప్రయివేటు కంపెనీలు కూడా సిద్ధం కాకపోవటం. ఈ పరిస్థితి ఎందుకొచ్చిందన్న ప్రశ్నకు సమాధానం వెదకటంలోనే అసలు కిటుకు దాగి ఉంది. ప్రభుత్వం ఆశించినంతగా వాటాల కొనుగోళ్లుకు దరఖాస్తులు రాలేదని ఈ పట్టికలోని సమాచారం తెలియచేస్తోంది. అలా అని వాటాల ఉపసంహరణ ప్రక్రియను విరమించుకుంటే ప్రభుత్వ మౌలిక స్వభావమే ప్రశ్నార్థకం అవుతుంది. అందువల్ల పెద్దఎత్తున ప్రభుత్వ రంగ సంస్థలైన, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, భారత జీవిత బీమా కంపెనీలను మార్కెట్‌లోకి దించి వారి పెట్టుబడులను వాటాల కొనుగోళ్లకు పురమాయించింది ప్రభుత్వం. ఉదాహరణకు గ్రామీణ విద్యుదీకరణ కార్పొరేషన్ వాటాలు కొనుగోలు చేయటానికి ఎల్‌ఐసి 3000 కోట్ల రూపాయలు వెచ్చించింది. ఎన్‌ఎండిసి కంపెనీ వాటాలు కొనుగోలు చేయటానికి మరో రూ.8000 కోట్ల ఎల్‌ఐసి నిధులు వినియోగించబడ్డాయి. ఇతర ప్రయివేటు సంస్థలు, మ్యూచ్‌వల్ ఫండ్స్, ఇతర ద్రవ్య సంస్థలు ఈ వాటాలు కొనుగోలు చేయటానికి ముందుకు రాలేదు. తత్పర్యవసానంగా ఆయా కంపెనీల మార్కెట్ కాపిటలైజేషన్ విలువ తగ్గిపోయింది. ఫలానా కంపెనీ వాటాలు మార్కెట్‌లో విడుదలైన దానికంటే ఎన్ని రెట్లు ఎక్కువగా అమ్ముడయితే ఈ కంపెనీ మార్కెట్ విలువ అంత ఎక్కువ ఉన్నట్లు. మరి ఆర్‌ఇసి, ఎన్‌ఎండిసి కంపెనీల మార్కెట్ విలువ పెంచే దిశగా ప్రభుత్వ చర్యలు దోహదం చేయలేదని దీన్ని బట్టి అర్థం అవుతుంది. మరి ఈ పెట్టుబడుల ఉపసంహరణ ప్రక్రియ ద్వారా ప్రభుత్వం సాధించదల్చుకున్నది, నిరూపించదల్చుకున్నది ఏమిటి?
ఇక్కడ ఒక విషయాన్ని చర్చించుకుందాం. ఎవరైనా షేర్లు కొనుగోలు చేసేటప్పుడు ఫలానా కంపెనీ లాభాలు, స్థిరాస్తుల, అప్పులు, ఇతర లావాదేవీలు గురించి ఆరా తీస్తాము. అపుడపుడూ కీలకమైన విషయాల్లో ప్రభుత్వం తన ఆశక్తతను, అసహాయతను కప్పిపుచ్చుకునేందుకు చట్టం తన పని తాను చేసుకుపోతుంది అని ప్రకటించటం అలవాటుగా మారింది. అదే తరహాలో ప్రభుత్వం కీలక ఆర్థిక నిర్ణయాలు తీసుకునే బాధ్యత నుండి తప్పుకునేందుకు మార్కెట్ తన పని తాను చేసుకుపోతుంది. 'మార్కెట్ ధర్మం' దీనికి అంతరాయం కలిగించకూడదు అని వాదించటం కూడా అలవాటుగా మారింది. ఈ సూత్రాన్ని మాటవరసకు అంగీకరించినా ఈ విషయాల్లో ఏ కంపెనీ మెరుగ్గా ఉంటే ఈ కంపెనీ వాటాలు అమ్ముడవటం సోకాల్డ్ మార్కెట్ ధర్మం. ఆ విధంగా చూసుకున్నపుడు పట్టికలో ప్రస్తావించిన కంపెనీలన్నింటిలో ఎన్‌ఎండిసి, ఆర్‌ఇసి కంపెనీల స్థిరాస్తులు, నికర లాభాలుఎక్కువ అన్నది నిస్సందేహం. కనీసం నరవత్న కంపెనీల్లో ఒకటి, అంతర్జాతీయంగా మార్కెట్ ఆదరణ పొందిన ఫోర్బ్స్ 500 కంపెనీల్లో స్థానం పొందిన ఎన్టీపిసీ వాటాలు కూడా కొనుగోలు చేసే నాధుడు కరువయ్యాడని ఈ పట్టిక తెలియచేస్తోంది. అటువంటప్పుడు మార్కెట్ ధర్మం ప్రకారం ఈ కంపెనీల వాటాలకు గిరాకీ ఉండాలి. కానీ మార్కెట్ ధర్మం ఇక్కడ పని చేయలేదు. చిన్న చిన్న కంపెనీలు, నామమాత్రపు స్థిరాస్థులు కలిగి, మార్కెట్ రుణాలపై ఆధారపడే కంపెనీల వాటాలు అమ్ముడయినంతగా ప్రభుత్వరంగంలోని పెద్దఎత్తున స్థిరాస్తులు కలిగి, ప్రతి ఏటా లాభాలు సంపాదిస్తున్న కంపెనీల వాటాలు అమ్ముడుకాలేదు. అంటే ఇక్కడ మార్కెట్ మానాన మార్కెట్ పని చేయలేదని సదరు పెట్టుబడుల ఉపసంహరణ వాదులు, మార్కెట్ వాదులు అంగీకరించాల్సివుంది.
అలా కాదనుకున్న పక్షంలో చట్టానికి కళ్లు లేవు అన్న ధోరణిలో మార్కెట్ కూడా గుడ్డిది, వాస్తవికతను గుర్తించలేదు అని అంగీకరించాలి. ఈ రెండింటిలో ఈ ఒక్క వాదనను అంగీకరించినా పెట్టుబడుల ఉపసంహరణ అర్థం లేని పని అని తీర్మానించాల్సి వస్తుంది. ప్రభుత్వం మరి ఏ వాదన అంగీకరిస్తుంది అన్న విషయాన్ని తెలుసుకోవటానికి సమయం పడుతుంది.ఈ లోగా మార్కెట్ అవకతవకల కోణాన్న పరిశీలిద్దాం. శక్తివంతమైన కంపెనీల వాటాలుమార్కెట్‌లో పలుకుబడి కోల్పోవటం వెనక ఖచ్చితంగా మార్కెట్ ఆపరేటర్లు జట్టు కట్టటం కారణం అయి ఉంటుందన్న సందేహాలు ఉన్నాయి. ఒక వేళ మార్కెట్ వివేకవంతం అయినదైతే షేర్లుకంపెనీల్లో ఒకటి కాకపోతే మరోటైనా వివేకవంతంగా వ్యవహరించాలి కదా... మరి పబ్లిక్ ఇషఉ్య ముగింపు తేదీ వరకూ సదరు కంపెనీల వాటాలు అమ్ముడవకపోవటం వెనక ఉన్న మర్మం ఏమిటి? ప్రభుత్వం స్టేట్ బ్యాంకు, ఎల్ ఐసి వంటి కీలకమైన సంస్థల నిధులు మళ్లించి మరీ ఈ మార్కెట్ సెంటిమెంట్ కాపాడాల్సిన అవసరం ఏమొచ్చింది ? ఈ మొత్తం వ్యవహారాన్ని వెలుగులోకి తెస్తే తప్ప పెట్టుబడుల ఉపసంహరణ పేరిట ప్రభుత్వం ఆడుతున్న నాటకంలో నిజాలు, నీడలు వెలుగు చూడటం సాధ్యం కాదు.
కంపెనీ ఇష్యూ మోతాదు వచ్చిన దరఖాస్తులు గిరాకీ శాతం
డిక్యు 123 11083 86.3
మాన్ ఇన్‌ఫ్రా 142 8904 67.8
ఎఆర్‌ఎస్‌ఎస్ 103 5286 51.3
ఇన్‌ఫినిట్ కంప్యూటర్ 190 6840 36.0
ఐఎల్‌ఎఫ్‌ఎస్ ట్రాన్‌పోర్ట్ 700 22694 32.4
జుబిలియంట్ ఫుడ్స్ 328 8941 27.3
ఆర్‌ఇసి 3486 10945 3.1
ఎన్‌ఎండిసి 9957 12459 1.3
ఎన్‌టిపిసి 8480 10515 1.2
Monday, March 22, 2010
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment