Tuesday, March 9, 2010

పన్ను విధానంలో మార్పుతో చేతిలో మిగిలిలేదెంత?

ప్రజాశక్తి -బిజినెస్‌డెస్క్‌ Sun, 7 Mar 2010, IST
కొండూరి వీరయ్య

బడ్జెట్‌ తతంగం పూర్తయ్యింది. ఇక మీదట బడ్జెట్‌ తర్వాత ఏయే రంగాలకు ఎంతమేర నష్టం కలిగింది, ఎంతమేర ప్రయోజనం కలిగింది అన్న అంశాలపై చర్చలు, సమీక్షలు దృష్టిపెడుతున్నాయి. ముఖ్యంగా విష్లేషకులు వ్యక్తిగత ఆదాయ పన్నుల విధానంలో వచ్చిన మార్పులపై కేంద్రీకరిస్తున్నారు. ఎందుకంటే ఇది మార్కెట్‌లో సరుకుల కదలికపైనా, నిధుల లభ్యతపైనా ప్రత్యక్ష ప్రభావం చూపించనుంది. మార్కెట్‌ విశ్లేషకులు, ఆర్థిక సంస్థలన్నీ ఈ పన్నుల విధానంలో ప్రతిపాదించిన మార్పు ద్వారా మధ్యతరగతి ప్రజలకు పెద్దఎత్తున మిగులు డబ్బులు చేతిలో ఉంటాయని వాదిస్తున్నారు. దానికనుగుణంగానే పన్నుల్లో వచ్చిన మార్పుల ద్వారా మిగిలిన డబ్బును ఫలానా స్కీంలో పెట్టుబడులు పెట్టండి, ఇంత కాలం తర్వాత అంత ఆదాయం వస్తుందన్న ప్రకటనలుకుప్పలు తెప్పలుగా కనిపిస్తున్నాయి. నిజానికి ప్రస్తుత బడ్జెట్‌లో ప్రతిపాదించిన పన్నుల విధానం వల్ల ప్రజల వద్ద అంత ఎక్కువ మొత్తంలో నిధులు ఆదా అవుతున్నాయా అన్న విషయాన్ని పరిశీలిద్దాం.

తాజా బడ్జెట్‌లో వ్యక్తిగత పన్నుల విధానాన్ని విశ్లేషించేముందు 2011 ఏప్రిల్‌ 1 నుండీ ప్రత్యక్ష పన్నుల విషయంలో నూతన విధి విధానాలు అమల్లోకి తేనున్నట్లు ప్రభుత్వం ప్రకటించిన విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఎందుకంటే ప్రస్తుత బడ్జెట్‌లో వ్యక్తిగత ఆదాయ పన్ను విషయంలో ప్రతిపాదించిన కొన్ని ప్రతిపాదనలు ఆ లక్ష్యానికి అనుగుణంగానే ఉన్నాయి. పన్నుల శ్లాబుల్లో ప్రతిపాదించిన మార్పుల వల్ల గతం కంటే ప్రజల వద్ద అదనపు వెసులుబాటు ఉంటుందన్న విషయాన్ని దిగువనున్న పట్టిక రుజువు చేస్తోంది. సదరు మార్పులను అంతవరకే పరిమితం చేసి చూస్తే నిజమే కదా అన్న భావన కూడా కలగటం కద్దు. కానీ ఈ మార్పులను అదే బడ్జెట్‌ పత్రంలో ప్రతిపాదించిన ఇతర మార్పుల నేపథ్యంలో పరిశీలిస్తే తప్ప నిజంగా కలిగే ప్రయోజనం ఏమిటన్నది అర్థం చేసుకోవటం సాధ్యం కాదు.ఇదే విధంగా సంత్సరానికి యాభై లక్షల ఆదాయం వచ్చే వారికి కూడా గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం అదనంగా 50,000 రూపాయలు తక్కువ పన్ను కడితే సరిపోతుంది. ఇదే సందర్భంలో ఇతర అంశాల్లో తెచ్చిన మార్పుల వల్ల ఈ మిగులు ఆదాయాన్ని నిర్భయంగా ఉపయోగించే అవకాశం లేకుండా చేసింది ప్రభుత్వం. అదెలాగో ఇప్పుడు పరిశీలిద్దాం. స్థూలంగా చెప్పాలంటే ఈ విధంగా మిగిలిన డబ్బును ఇతర తక్షణ ప్రయోజనకరమైన పనికి - అంటే ఇల్లు కట్టుకోవటానికో మరోదానికో వెచ్చిస్తే భారం మరో రూపంలో వచ్చి పడుతుంది. కేవలం కాపిటల్‌ మార్కెట్లు, ఈక్విటీ, బాండు మార్కెట్లలో పెట్టుబడులు పెట్టుకుంటేనే ఈ రాయితీల వల్ల వచ్చిన ప్రయోజనం ఒనగూడుతుంది. అంటే ఈ ఆదాయ పన్నుల విధానంలో ప్రతిపాదించిన మార్పులన్నీ ప్రజల చేతిలో అదనపు ఆదాయం మిగిల్చేందుకు కాదు. ద్రవ్య మార్కెట్లలో పెట్టుబడులు ప్రోత్సహించేందుకే అన్నది స్పష్టం అవుతుంది.

ఈ ఇచ్చిన రాయితీలు ప్రధానంగా బాండ్‌ మార్కెట్‌ను, మ్యుచువల్‌ ఫండ్‌ మార్కెట్‌ను, పెన్షన్‌ మార్కెట్‌ను బలోపేతం చేసేవిగా ఉన్నాయి. పై పద్ధతిలో మిగుల్చుకున్న ఆదాయాన్ని మౌలిక వసతుల కల్పనా రంగంలో విడుదలయ్యే బాండ్లుపై (ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ బాండ్లు) ఖర్చు పెడితే మరో రూ.20,000 వరకూ మినహాయింపు వస్తుంది. ఆర్థిక రంగంలో ఏ విభాగాన్ని కదిలించినా ఆ విభాగంలో మౌలికవసతుల కల్పనకు లక్షల కోట్లలో నిధులు అవసరం అని ప్రభుత్వం, నిపుణుల కమిటీలు ప్రకటించటాన్ని చూస్తూనే ఉన్నాము. ఈ మార్పుల ద్వారా ప్రభుత్వం సదరు నిధులు కల్పించేందుకు బదులుగా మార్కెట్‌ ద్వారా, అంటే ప్రజల ద్వారా ఆ నిధుల సేకరణకు మార్గం సుగమమం చేస్తోంది ప్రభుత్వం. అయితే ఈ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ బాండ్లు ఎవరు విడుదల చేస్తారు అన్నది కీలక అంశంగా ఉంది. అంతేకాదు. బాండ్ల ద్వారా వచ్చే సగటు ఆదాయం, వడ్డీనికూడా పన్నుల పరిధిలోకి తెస్తూ నిర్ణయించింది ప్రభుత్వం. ప్రైవేటు కంపెనీలకు విడుదల చేసే అటువంటి బాండ్లుకు కూడా ఈ పన్ను రాయితీలు వర్తింపచేస్తే ఇకపై రూపాయి పెట్టుబడి లేకపోయినా ప్రజల సొమ్ముతో దర్జాగా వేల కోట్ల లాభాలు దిగమింగటానికి మార్గం తేలికపర్చటమే అవుతుంది.

ఈ బడ్జెట్‌ ప్రతిపాదించిన పన్నుల విధానంలో మరో ముఖ్యమైనది నూతన పెన్షన్‌ పథకానికి సంబంధించింది. కార్మిక సంఘాలు, వామపక్షాల ఒత్తిళ్ల వల్ల నూతన పెన్షన్‌ విధానం ఇంతవరకూ చట్టరూపానికి నోచుకోలేదు. తాజా బడ్జెట్‌లో ఇపిఎఫ్‌, పిపిఎఫ్‌ల లబ్దిదారులకు స్కీం మెచ్యూరిటీతో వచ్చే ఆదాయంపై కూడా పన్ను ప్రతిపాదించారు. అంటే ఆర్థిక మంత్రి ప్రతిపాదన పార్లమెంట్‌ ఆమోదం పొందితే ఇపిఎఫ్‌ స్కీం మెచ్యూరిటీతో లక్ష రూపాయల ఆదాయం సంపాదించుకుంటే అందులో 60 వేల రూపాయలు పన్ను రూపంలో చెల్లించాల్సి ఉంటుంది. పిల్లల చదువులకో, పెళ్లిళ్లకో, ఇల్లు కట్టుకోవటానికో దాచుకున్న డబ్బులపై పన్ను వేటు పడుతోంది. మరోవైపున నూతన పెన్షన్‌ పథకంలో సభ్యత్వం తీసుకున్న ప్రతి కార్మికుడు, ఉద్యోగికీ ఏటా ప్రభుత్వం వెయ్యి రూపాయల చొప్పున మూడేళ్ల పాటు నిధి జమచేయనుంది. కొత్త పథకం పట్ల మోజు కల్గించే ప్రయత్నం తప్ప ఇది నిజంగా కార్మికులకు ప్రయోజనం కలిగించే ప్రయత్నం కాదు.

ఒకవేళ ఎవరైనా ప్రయోజనకరమైన వస్తువులు కొనుగోలుచేయాలని ప్రయత్నిస్తే వారి పరిస్థితి ఎలా ఉంటుంది? వివిధ రంగాలపై సర్వీసు పన్ను పెంచటం ద్వారా వస్తువులు, సేవలు మరింత భారంగా మారనున్నాయి. ఉదాహరణకు నిర్మాణంలో ఉన్న ఇంటికి బ్యాంకు రుణం తీసుకుంటే దానిపై కూడా సర్వీసు పన్ను చెల్లించాల్సి ఉంటుంది. అంటే ఇకపై ఇన్‌స్టాల్‌మెంట్ల భారం పెరగనుందన్నమాట. వినిమయ వస్తువులు కొందామంటే కూడా పరిస్థితి అంత తేలికగా ఏమీ లేదు. ఉదాహరణకు పెట్రోలియం ఉత్పత్తులపై పెంచిన భారం అన్ని రంగాల్లోనూ, అన్ని తరగుతల ప్రజలపైనా వడ్డించేందుకు కంపెనీలు సిద్ధమవుతున్నాయి. అదేవిధంగా కనీస ప్రత్యామ్నాయ పన్ను (మాట్‌)లో పెరిగిన భారాన్ని, ఎక్జైజు, కస్టమ్స్‌ సుంకాల రూపంలో పెరిగిన భారాన్ని కంపెనీలు నేరుగా వినియోగదారులపై వడ్డించేందుకు సిద్ధమయ్యాయి. ఈ దిశలోనే ఎలక్ట్రానిక్‌, మరియు గృహోపకరణాలు ఉత్పత్తి చేసే ఎల్జీ కంపెనీ తమ ఉత్పత్తుల ధరల్లో 1.5 శాతం నుండి 3.5 శాతం పెంపుదలకు ఆదేశాలు జారీ చేసింది. గోద్రెజ్‌ కంపెనీ ఉత్పత్తులు బడ్జెట్‌కు ముందు రెండు శాతం తక్కువ ధర పలికితే బడ్జెట్‌ మరునాడు రెండు శాతం అదనపు ధర పలుకుతున్నాయి. వళ్‌పూల్‌ కంపెనీ తమ ఉత్పత్తుల న్నింటిపైనా సగటున రెండు శాతం ధరలు పెంచాలని నిర్ణయిం చుకుంది. ఎక్జైజు సుంకాలు పెరగటం వల్ల కార్ల కంపెనీల తమ ఉత్పత్తులపై 3000 నుండి 50000 వరకు పెంచుతూ నిర్ణయించాయి. కొత్త పన్నుల విధానం ద్వారా చేతిలో మిగిలిన డబ్బులు వెచ్చించాలని మార్కెట్‌లోకి అడుగుపెట్టే సోదరులారా... ఎంత ఖర్చుపెడుతున్నారు, ఎందుకు ఖర్చు పెడుతున్నారో ఒక్కసారి ఆలోచించుకోండి మరి....

పన్ను పరిధిలోకి గత ప్రస్తుత తేడా

వచ్చే ఆదాయం బడ్జెట్‌ బడ్జెట్‌ (మిగులు)

2,00,000 4120 4120 0

5,00,000 55620 35019 20,601

10,00,000 210120 158619 51,501

12,00,000 2,71,919 2,20,419 51,500

15,00,000 3,64,619 3,13,119 51,500

20,00,000 5,19,119 4,67,619 51,500

No comments: