Monday, February 8, 2010

సంక్షోభం నుంచి అమెరికా గట్టెక్కాలంటే అవుట్‌ సోర్సింగ్‌ పై వేటు పరిష్కారం కాదు

Published in Prajasakti February 8th 2010

అమెరికా అధ్యక్షుడు బరాక్‌ ఒబామా జాతినుద్దేశించి చేసిన ప్రసంగం మరో సారి భారతదేశంలో ఐటి, ఐటెస్‌ పరిశ్రమల భవితవ్యంపై చర్చను రేకెత్తించింది. నిజానికి ప్రపంచీకరణ నేపథ్యంలో ఔట్‌సోర్సింగ్‌ను తెరమీదకు తెచ్చింది సంపన్న దేశాలే. ఆయా దేశాల్లో 80వ దశకంలో కంపెనీలు ఎదుర్కొంటున్న లాభాల రేటు పతనమవుతున్న నేపథ్యంలో ఈ భావన తెరమీదకు వచ్చింది. బహుళజాతి కంపెనీలు ఉత్పాదక కార్యకాలాపాలు, అనుబంధ కార్యకలాపాల భారం తగ్గించుకోవటానికి ఉత్పత్తి క్రమం దెబ్బతినకుండా కొన్ని కార్యకలాపాలను భారతదేశం వంటి దేశాలకు తరలిస్తూ వచ్చారు. ఈ విధమైన తరలింపుతో ఉత్పత్తి వ్యయం తగ్గించుకోగలిగాయి. లాభాల రేటు పెంచుకోగలిగాయి.అదేసమయంలో అంతేమేరకు మానవవనరుల వినియోగాన్ని తగ్గించుకోగలిగాయి. అంటే ఔట్‌సోర్సింగ్‌కు పాల్పడుతున్న దేశాల్లో సదరు రంగంలో నిరుద్యోగం పెరుగుతూ ఉంటే ఔట్‌సోర్సింగ్‌ ద్వారా సేవలందిస్తున్న దేశాల్లో ఆయా రంగాల్లో ఉపాధి అవకాశాలు పెరుగుతుంటాయి. దాంతో పాటు సమాచార సాంకేతిక పరిజ్ఞానంలో వచ్చిన విప్లవాత్మక మార్పులు ఈ ప్రక్రియను మరింత వేగవంతం చేశాయి. దేశీయంగా ఇన్ఫొసిస్‌, విప్రో, టిసిఎస్‌ వంటి కంపెనీల స్థాపనకు అవకాశం ఇచ్చాయి.

అమెరికా, యూరప్‌ దేశాల్లో కంటే భిన్నంగా భారతదేశంలో ప్రాథమిక శాస్త్ర విజ్ఞాన రంగం (గణితం, భౌతిక, రసాయన శాస్త్రాలు)లో విద్యార్థులు అసమాన ప్రతిభాపాటవాలు చూపించటం కూడా వివిధ శాస్త్రపరిజ్ఞానం రంగానికి సంబంధించిన సేవలను మన దేశానికి ఔట్‌సోర్సింగ్‌ చేయటానికి సంపన్న దేశాలు సిద్ధపడ్డాయి. ఔట్‌సోర్సింగ్‌ రెండు రకాలు. మొదటిది వనరులు, నైపుణ్యం కోసం కొన్ని సేవలు ఇతర దేశాల్లో పూర్తి చేయించుకోవటం కాగా రెండోది మార్కెట్‌ అవకాశాలు విస్తరించుకోవటం ఔట్‌సోర్సింగ్‌ విధానాలను అవలంభించటం. భారతదేశంలోని బిపిఒ, ఔట్‌సోర్సింగ్‌ పరిశ్రమ ప్రధానంగా మొదటి తరహాకు చెందినదిగా చెప్పుకోవచ్చు. అందువల్లనే ప్రపంచ ఆర్థిక వ్యవస్థ అతలాకుతలమవుతున్నా ఈ పరిశ్రమలు మాత్రం నిలకడగా ఉన్నాయి. తాజాగా వెల్లడయిన గణాంకాల ప్రకారం మన దేశంలో 71 శాతం కంపెనీలు ఈ సంవత్సరం సిబ్బంది నియామకానికి గాను పథకాలు సిద్ధం చేసుకున్నాయి. సాధారణంగా ఔట్‌సోర్సింగ్‌ పరిశ్రమల్లో డిమాండ్‌ను బట్టి తాత్కాలిక ప్రాతిపదికన సిబ్బంది నియామకం జరుగుతుంది. అంటే రానున్న ఆర్థిక సంవత్సరంలో బిపిఒ పరిశ్రమ పెద్దఎత్తున అవకాశాలు వస్తాయన్న అంచనాతో ముందుకు పోతుంది. ఈ పరిస్థితుల్లో భారతదేశానికి వస్తువులు, సేవలు ఔట్‌సోర్సింగ్‌ రూపంలో తరలించే కంపెనీలపై పన్ను వేస్తామని, అమెరికాలోనే పారిశ్రామిక కార్యకలాపాలు నిర్వహించే కంపెనీలకు పన్ను రాయితీలు ఇస్తామని ఒబామా ప్రకటించారు. దాంతో ఇటు అమెరికా కంపెనీల్లోనూ, భారతదేశంలోని బిపిఒ పరిశ్రమలోనూ ఆందోళన మొదలైంది.

ప్రపంచ ఆర్థిక సంక్షోభం కారణంగా భారతదేశంలోని బిపిఒ పరిశ్రమ ఆదాయం పడిపోయింది. 2009-2010 ఆర్థిక సంవత్సరానికి గాను 50 బిలియన్‌ డాలర్ల మేర ఎగుమతులు సాధించిన బిపిఒ పరిశ్రమ 2010-2011 ఆర్థిక సంవత్సరానికి మరో 15 శాతం ఆదాయం వస్తుందని అంచనా వేస్తోంది. ప్రస్తుతం భారతదేశంలో 7 లక్షల మంది బిపిఒ పరిశ్రమల్లో ఉపాధి పొందుతున్నారు. ఇందులో 60 శాతం ఆదాయం అమెరికా కంపెనీల నుండే వస్తోంది. దాంతో అమెరికా ఆర్థిక విధానాల్లో వస్తున్న మార్పులు ప్రత్యేకించి బిపిఒ పరిశ్రమను ప్రభావితం చేసే విధానాల పట్ల మన దేశంలో సహజమైన ఆసక్తి ఉంటుంది. గత సంవత్సరం ఒక ఉపన్యాసంలో బెంగుళూరులో వాణిజ్య కార్యకలాపాలు నిర్వహించే పరిశ్రమల కంటే బఫెలోలో వాణిజ్య కార్యకలాపాలు నిర్వహించే కంపెనీలకు పన్ను రాయితీలు ఎక్కువగా ఇస్తామని ప్రకటించారు. గత నెల జాతినుద్దేశించి చేసిన 70 నిముషాల ప్రసంగంలో అమెరికాలో దేశీయంగా ఉపాధి అవకాశాలు పెంచాల్సిన అవసరం గురించి 29 సార్లు ప్రస్తావించారు. వాషింగ్టన్‌ పోస్ట్‌ పత్రిక తన సంపాదకీయంలో 2009 సంవత్సరంలో ఆరోగ్యబీమా లక్ష్యంగా పని చేసిన ఒబామా ప్రభుత్వం 2010 సంవత్సరంలో ఉపాధికల్పన లక్ష్యంతో పని చేయనుందని వ్యాఖ్యానించింది.

ఔట్‌సోర్సింగ్‌ వల్ల గతంలోకూడా నిరుద్యోగం పెరిగింది. అయితే మిగిలిన పారిశ్రామిక, ఆర్థిక సేవల రంగంలో కొత్త ఉపాధి అవకాశాలు కనిపిస్తూ ఉండటం, ప్రపంచ ఆర్థికరంగంపై అమెరికా పెత్తనం కొనసాగుతూ ఉండటంతో ఇది పెద్ద సమస్యగా అప్పట్లో కనిపించలేదు. కానీ పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థ ఎదుర్కొంటున్న సంక్షోభం పర్యవసానంగా అమెరికా ఆర్థిక ఆధిపత్యానికి సవాళ్లు ఎదురయ్యాయి. ఉత్పాదకరంగం, ఆర్థిక సేవల రంగం కుదేలయ్యాయి. దాంతో కంపెనీల లాభాలతో పాటే ఉపాధి అవకాశాలూ ఆవిరయ్యాయి. అమెరికాలో అధికారిక లెక్కల ప్రకారం నిరుద్యోగం 12 శాతం వరకూ ఉండగా అనధికారిక లెక్కల ప్రకారం 18 శాతం వరకూ ఉంది. అందువల్లనే ఒబామా ప్రభుత్వ ప్రధాన ఆర్థిక సలహాదారు లారీ సమ్మర్స్‌ ''అమెరికా ఆర్థిక వ్యవస్థ గణాంకాల్లో రికవరీ చూపిస్తున్నప్పటికీ మానవవనరుల వృద్ధి విషయంలో స్థబ్దత కొనసాగుతూనే ఉంది'' అని ప్రకటించారు. ఈ నేపథ్యంలో అమెరికా ఆర్థిక వ్యవస్థలో ఉపాధి అవకాశాలు పెంపొందించాల్సిన తక్షణ ఆవశ్యకత ఒబామా ప్రభుత్వం ముందుంది. దానికనుగుణంగానే ఔట్‌సోర్సింగ్‌కు పాల్పడే కంపెనీలకు ఉన్న పన్ను రాయితీలు రద్దు చేయటంతో పాటు కొత్తగా పన్నులు విధించే అవకాశం కూడా ఉందని ప్రకటించింది. తద్వారా అదనంగా 241 బిలియన్ల డాలర్ల ఆదాయం సంపాదించాలని అమెరికా ప్రభుత్వం ప్రతిపాదిస్తోంది. దీని ప్రభావం రెండు రకాలుగా ఉంటుంది.

ప్రస్తుతం అమల్లో ఉన్న ఔట్‌సోర్సింగ్‌ అనుకూల విధానాల వల్ల అమెరికా కంపెనీల పారిశ్రామిక ఉత్పత్తులు చౌకగా తయారవుతున్నాయి.

ఈ విధంగా చౌకైన పారిశ్రామిక ఉత్పత్తులతో ప్రపంచ మార్కెట్‌ను ముంచెత్తుతోంది. మిగిలిన దేశాల పారిశ్రామిక ఉత్పత్తులు భారీ వ్యయంతో కూడుకున్నవి కావటంతో అంతర్జాతీయ మార్కెట్లో అమెరికా ఉత్పత్తులతో పోటీపడలేకపోతున్నాయి. ఈ అవుట్‌సోర్సింగ్‌ విధానాలకు స్వస్తి చెబితే అమెరికా కంపెనీల్లో తయారయ్యే ఉత్పత్తుల మార్కెట్‌ విలువ పెరిగిపోతుంది. ప్రపంచీకృతమైన ఆర్థిక వ్యవస్థలో ఒక్క కలంపోటుతో ఔట్‌సోర్సింగ్‌ను రద్దు చేయటం సాధ్యం కూడా కాదు. ఈ విషయాన్ని గుర్తించబట్టే ఔట్‌సోర్సింగ్‌కు పాల్పడే కంపెనీలపై పన్ను విధిస్తామని ప్రకటించాడు. ఈ చర్య కూడా ఆయా కంపెనీ ఉత్పత్తులను మరింత ప్రియం చేయనున్నాయి. అదే జరిగితే ఇప్పటికే సంక్షోభం పడగ నీడన ప్రాణాలరచేతిలో పెట్టుకు కూర్చున్న అమెరికా పారిశ్రామిక రంగం మరింత ఒత్తిళ్లకు లోనవుతుంది. అంతర్జాతీయంగా కొనసాగుతున్న ఆధిపత్యానికి సంపూర్ణంగా స్వస్తి చెప్పాల్సి వస్తుంది. దాంతో అదనపు ఆదాయం ఎలా ఉన్నా ఉన్న ఆదాయం తగ్గిపోయే ప్రమాదం ఉంది. ఒక అంచనా మేరకు ఒబామా ప్రతిపాదించిన పన్నుల విధానం అమలు జరిగితే అమెరికాలో తయారయ్యే పారిశ్రామిక వస్తువులు, సేవలు ఖరీదు 50 శాతం అదనంగా పెరుగనున్నాయి. ఈ పరిస్థితి అటు అమెరికా కంపెనీలకు మాత్రమే కాదు, ఇటు అమెరికా ప్రభుత్వానికీ యమపాశంగా మారనుంది. ఈ పరిస్థితుల్లో ఔట్‌సోర్సింగ్‌ గురించి ఒబామా బెదిరింపులు ఆచరణకు నోచుకునే అవకాశాలు తక్కువగా కనిపిస్తున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వెలుగు చూసిన మూడో త్రైమాసిక ఫలితాల్లో ఐటి, ఐటెస్‌ రంగ పరిశ్రమల లాభాలు పెరగటం వెనక ఉన్న తర్కం ఇదే.

కొండూరి వీరయ్య

No comments: