Monday, February 1, 2010

రికవరీకి సహకరించని ద్రవ్య విధానం

కొండూరి వీరయ్య, Prajasakti Telugu daily, February 1st edition
రిజర్వు బ్యాంకు విడుదల చేసిన ప్రకటనలో తాజా చర్యల వల్ల ద్రవ్యోల్బణం ఎంతమేర అదుపులోకి వస్తుందో ప్రకటించలేదు. పైగా ఈ సంవత్సరం ఋతుపవనాలపై ఆధారపడి ఆహారోత్పత్తులు, ఇతర పారిశ్రామికోత్పత్తుల ధరల నడవడిక ఉంటుందని స్పష్టం చేసింది. అటువంటప్పుడు అమల్లో ఉన్న విధానాన్ని మార్చటం ద్వారా అందుబాటులో ఉన్న ప్రయోజనాలను కూడా వదులుకోవటం ఎందుకో అన్నది అర్థం కాని ప్రశ్నగా ఉంది. మరోవైపున మారిన ద్రవ్య విధానం పర్యవసానంగా పెరిగే ఉత్పత్తి వ్యయం పారిశ్రామిక ఉత్పత్తుల ధరలపై ప్రభావం చూపనుంది. ఇంత వరకు ప్రభుత్వం అభిప్రాయంలో పారిశ్రామిక ఉత్పత్తుల ధరలు స్థిరంగా ఉన్నాయి. వ్యవసాయోత్పత్తుల ధరలు పెరుగుతున్నాయి. తాజా చర్యలు వ్యవసాయోత్పత్తుల ధరలు తగ్గించటంలో దోహదం చేయకపోగా పారిశ్రామికోత్పత్తుల ధరలను కూడా పెంచేస్తాయి. ఈ పరిస్థితులు ప్రైవేటు పెట్టుబడులపై వచ్చే లాభాలను తగ్గించేస్తాయి. దాంతో ప్రైవేటు పెట్టుబడుల చలనం కూడా తగ్గిపోతుంది. ఇది మార్కెట్లో నిధుల కొరతకు దారితీసినా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు.

భారత రిజర్వు బ్యాంకు శుక్రవారం నాడు ప్రకటించిన విధానం అటు ఆర్థిక వ్యవస్థలో రికవరీని పెంచేందుకు గానీ, ఇటు ద్రవ్యోల్భణాన్ని తగ్గించేందుకు గానీ దోహదపడేదిగా కనిపించటం లేదు. మూడో త్రైమాసం ఆర్థిక ఫలితాలు సమీక్షించిన అనంతరం ప్రకటించిన ఈ విధానం మార్కెట్‌లో నిధుల లభ్యతను తగ్గించటమే లక్ష్యంగా ఉంది. గత నెలరోజుల నుండే ప్రభుత్వం ఈ దిశగా చర్యలు తీసుకోనుందన్న విషయాన్ని చూచాయగా వెల్లడిస్తూనే వచ్చారు. డిసెంబరు మూడో వారంలో మాజీ రిజర్వు బ్యాంకు గవర్నరు, ప్రధాని ఆర్థిక మండలి సలహాదారు రంగరాజన్‌ డిసెంబరులో సాధారణంగా కనిపించే ధరల తగ్గుదల ఈ సారి కనిపించకపోతే మార్కెట్లో నిధుల లభ్యతపై ఆంక్షలు విధించటం ఒక్కటే ధరల నియంత్రణ సాధనంగా ఉంటుందని ప్రకటించారు. జనవరి రెండో వారాంతంలో రిజర్వు బ్యాంకు డిప్యూటీ గవర్నర్‌ ఉషా థోరట్‌ గృహ నిర్మాణ రంగంలో అవసరానికి మించి బకాయిలు పేరుకుపోతున్నాయని దీన్ని నియంత్రించాల్సిన అవసరం ఉందని ప్రకటించారు. అదే విధంగా డిసెంబరులోనే విడుదలైన మరో ప్రకటనలో బ్యాంకుల వద్ద స్థూల పారుబకాయిల రేటు పెరుగుతుందని నిర్దారించారు. ఆర్థిక వ్యవస్థలో కనిపిస్తున్న ఈ లక్షణాలన్నింటికీ కారణం మార్కెట్లో అవసరానికి మించి నిధులు అందుబాటులో ఉండటమేనని ఆర్థికవేత్తలు, ప్రభుత్వం అభిప్రాయపడింది. వీటన్నింటికి తోడు జి 20 ఆర్థిక మంత్రుల సమావేశంలో 2010-2011 ఆర్థిక సంవత్సరంలో సరళ ద్రవ్య విధానాలు సమీక్షించుకోవాలని నిర్ణయించారు. ఈ నిర్ణయం అమల్లో భాగమే ప్రభుత్వం తీసుకుంటున్న తాజా చర్యలు అని చెప్పవచ్చు.

మరో వైపున నిజ ఆర్థిక వ్యవస్థ గురించి వస్తున్న వార్తలు కూడా ఆర్థిక వ్యవస్థ రికవరీ దారిలో పడిందన్న గట్టి అభిప్రాయాన్ని కల్గించింది.

డిసెంబరు నాటి పత్రికలు పరిశీలిస్తే లాభాల రేటు పెరగటం వల్ల కంపెనీలు 20 శాతం మేర అడ్వాన్సు పన్ను ముందే చెల్లించటం గురించి, పెరుగుతున్న ఉపాధి అవకాశాలు గురించిన వార్తలే ప్రధానంగా కనిపించాయి. దాంతో నిజ ఆర్థిక వ్యవస్థ కూడా గాడిన పడ్డట్లు ప్రభుత్వం అంచనాకు వచ్చింది. గాడి తప్పిన ఆర్థిక వ్యవస్థను ఆదుకోటానికే గత సంవత్సర కాలంగా ప్రభుత్వం సరళమైన ద్రవ్య విధానాన్ని అనుసరిస్తూ వచ్చింది. ఒక సారి ఆర్థికవ్యవస్థ గాడినపడిందన్న అంచనాకు వచ్చిన తర్వాత సహజంగానే ద్రవ్య విధానాన్ని పటిష్టం చేయటానికి నడుం కట్టింది. (అందువల్లనే ఆర్థిక వ్యవస్థలో కనిపిస్తున్న రికవరీ ఈ మార్పులను అనివార్యం చేస్తుంది. ఇంత కాలం అమలు జరిగిన విధానాలు స్థబ్దతతో కూడుకున్న ఆర్థిక వ్యవస్థను ఉద్దేశించినవే తప్ప పరుగులెత్తే ఆర్థిక వ్యవస్థను ఉద్దేశించినవి కాదు) అని చెప్పుకొంది. స్థూలంగా చెప్పుకోవాలంటే గత సంవత్సర కాలానికి పైగా కుదేలైన ఆర్థిక వ్యవస్థకు జవసత్వాలు కల్పించే లక్ష్యంతో అమలు జరిగిన ద్రవ్య విధానం నేడు సదరు లక్ష్యాన్ని పక్కన పెట్టి ద్రవ్యోల్బణాన్ని అదుపులోకి తెచ్చే లక్ష్యంపై కేంద్రీకరించింది. భారతదేశంలో సంస్కరణలు మొదలైన నాటి నుండీ ద్రవ్యోల్బణం అదుపు చేయటం ద్రవ్య విధానపు మౌలిక లక్ష్యాల్లో ఒకటిగా మారింది. అంటే భారత ద్రవ్య విధానం తిరిగి సంస్కరణల నాటి ధోరణికి తిరిగి మళ్లుతుందని చెప్పవచ్చు.

నేడు ప్రకటించిన ద్రవ్య విధానం భారత ఆర్థిక వ్యవస్థలు పలు రూపాల్లో ప్రభావితం చేయనుంది. ముందుగా నిధుల లభ్యత విషయాన్ని పరిశీలిద్దాం. గత సంవత్సరం కాలంగా రిజర్వుబ్యాంకు ప్రకటించిన వివిధ రాయితీల వలన మార్కెట్లో సుమారు 5,60,000 కోట్ల రూపాయల అదనపు నిధులు అందుబాటులోకి వచ్చాయి. దాంతో పారిశ్రామిక రుణాలు, గృహ నిర్మాణ రంగానికి రుణాలు చౌకగా అందుబాటులోకి వచ్చాయి. ఇది ఉత్పత్తి వ్యయాన్ని తగ్గించటానికి తోడ్పడింది. ఉత్పత్తి వ్యయం తగ్గటంతో కంపెనీల లాభాల రేటు బాగా పెరిగింది. ఈ విషయాన్ని బిజినెస్‌వాచ్‌ గత సంచికల్లో ఉద్దీపన లాభాల శీర్షికన వచ్చిన వ్యాసాల్లో వివరంగా తెలియచేశాము. అదేవిధంగా మార్కెట్లో నిధుల లభ్యత అధికంగా ఉండటంతో ఈ నిధులు ఈక్విటీ మార్కెట్‌కు మళ్లించబడ్డాయి. గత సంవత్సరకాలంలో అనుత్పాదక ఆర్థిక రంగంలో ఈక్విటీ మార్కెట్‌ లాభాల పంట పడించిన వాటిలో ఒకటిగా ఉంది. అదేవిధంగా పుష్కలంగా లభ్యమవుతున్న నిధులు తక్కువ వడ్డీలకు చేతికందటంతో ముఖ్యమైన కంపెనీలన్నీ తమ ఉత్పాదక విస్తరణకు అవసరమైన వనరులు సమకూర్చుకున్నాయి.

ఈ పెరిగిన సామర్థ్యంలో ముడివనరుల మొదలు సాంకేతిక పరిజ్ఞానం వరకూ ఉన్నాయి. దీంతో కంపెనీలు రానున్న కాలంలో అవసరమైన ఉత్పత్తిని అందించగలిగే సామర్థ్యంతో పాటు అంతర్జాతీయ పోటీని తట్టుకోవటానికి అన్ని విధాలా సిద్ధం కావటానికి సరళమైన ద్రవ్య విధానం ఎంతగానో తోడ్పడింది. ప్రస్తుతం దశల వారీగా ఈ అదనపు నిధులను ఉపసంహరించుకోవటానికి ప్రభుత్వం సిద్ధమైంది. అందులో భాగంగా శుక్రవారం నాటి చర్యల ద్వారా మార్కెట్‌లో చలామణిలో నుండి 36000 కోట్ల నిధులు తగ్గించింది. రానున్న కాలంలో కూడా మరిన్ని నిధులు మార్కెట్‌ నుండి వెనక్కుపోనున్నాయి. ఈ పరిణామం పైన పేర్కొన్న సానుకూల అంశాలన్నింటికీ నష్టదాయకంగా మారనుంది. ఉన్న ఫళంగా ఆర్థిక వ్యవస్థకు పెద్దగా నష్టం జరక్క పోయినా ఇటువంటి నిర్ణయాలు గాడిలో పడుతున్న ఆర్థిక వ్యవస్థను అడ్డుకోవటంలో మాత్రం ఈ మార్పులు కీలక పాత్ర పోషించనున్నాయని చెప్పవచ్చు.

ద్రవ్యోల్బణాన్ని నియంత్రించటం ఈ తాజా మార్పులకు తక్షణ లక్ష్యమని రిజర్వు బ్యాంకు ప్రకటించింది. కానీ రిజర్వు బ్యాంకు విడుదల చేసిన ప్రకటనలో మాత్రం తాజా చర్యల వల్ల ద్రవ్యోల్బణం ఎంతమేర అదుపులోకి వస్తుందో ప్రకటించలేదు. పైగా ఈ సంవత్సరం ఋతుపవనాలపై ఆధారపడి ఆహారోత్పత్తులు, ఇతర పారిశ్రామికోత్పత్తుల ధరల నడవడిక ఉంటుందని స్పష్టం చేసింది. అటువంటప్పుడు అమల్లో ఉన్న విధానాన్ని మార్చటం ద్వారా అందుబాటులో ఉన్న ప్రయోజనాలను కూడా వదులుకోవటం ఎందుకో అన్నది అర్థం కాని ప్రశ్నగా ఉంది. రిజర్వు బ్యాంకు మాటల్లోనే.. ''పెద్దఎత్తున ఆహారధాన్యాల నిల్వలు సిద్ధం చేసుకోవటం ధరల నియంత్రణకు ఉపయోగపడుతుంది. జూలై తర్వాతికాలంలో ద్రవ్యోల్బణం ఋతుపవనాలపై ఆధారపడి ఉంటుంది.'' మరోవైపున మారిన ద్రవ్య విధానం పర్యవసానంగా పెరిగే ఉత్పత్తి వ్యయం వల్ల పారిశ్రామిక ఉత్పత్తుల ధరలు కూడా భారం కానున్నాయి. ఇంత వరకు ప్రభుత్వం అభిప్రాయంలో పారిశ్రామిక ఉత్పత్తుల ధరలు స్థిరంగా ఉన్నాయి. వ్యవసాయోత్పత్తుల ధరలు పెరుగుతున్నాయి. తాజా చర్యలు వ్యవసాయోత్పత్తుల ధరలు తగ్గించటంలో దోహదం చేయకపోగా పారిశ్రామికోత్పత్తుల ధరలను కూడా పెంచేస్తాయి. ఈ పరిస్థితులు ప్రైవేటు పెట్టుబడులపై వచ్చే లాభాలను తగ్గించేస్తాయి.

దాంతో ప్రైవేటు పెట్టుబడుల చలనం కూడా తగ్గిపోతుంది. ఇది మార్కెట్లో నిధుల కొరతకు దారితీసినా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. సరళమైన ద్రవ్య విధానం కారణంగా గత సంవత్సర కాలంలో రాష్ట్ర ప్రభుత్వాలు అప్పుల కోసం పెద్దగా బహుళజాతి సంస్థలు అంటే ప్రపంచ బ్యాంకు, ఆసియా అభివృద్ధి బ్యాంకు వంటి వాటిపై ఆధారపడాల్సిన అవసరం లేకపోయింది. నేడు కేంద్ర ప్రభుత్వం ఈ విధానం నుండి వైదొలగటం రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకునే రుణాలపై భారాన్ని కూడా పెంచనున్నాయి. రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకునే రుణాలు భారం కావటం అంటే వివిధ పన్నులు, సేవలపై విధించే చార్జీల రూపంలో ప్రజలపై మరో రకమైన భారం పెరగటమే. భారత ఆర్థిక వ్యవస్థ పూర్తి స్థాయిలో కోలుకోవటం అనేది అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ కోలుకోవటంపై ఆధారపడి ఉంటుందని గుర్తించిన రిజర్వు బ్యాంకు అంతర్జాతీయ ఆర్థికవ్యవస్థలో సరళ ఆర్థిక విధానాలు కొనసాగుతున్నంత కాలం వాటిని దేశీయంగా కూడా అమలు చేయాలి. అటువంటి విధానాల ప్రయోజనం నేరుగా ప్రజలకు చేరేందుకు మార్గాలు ఏమిటో ఆలోచించకుండా రూళ్ల కర్ర సిద్ధాంతం ప్రకారం ముందుకు వెళ్లాలని నిర్ణయించుకోవటం ఆర్థిక వ్యవస్థ కోలుకోవటానికి అంతగా సహకరించే అంశం కాబోదు.

No comments: