Thursday, January 28, 2010

కొనసాగనున్న ధరాఘాతం

ప్రజాశక్తి - బిజినెస్‌ వాచ్ కొండూరి వీరయ్య Sun, 24 Jan 2010, IST
2010 సంవత్సరం భారత ఆర్థిక వ్యవస్థలో ప్రత్యేక స్థానాన్ని ఆక్రమించుకోనుంది. యుపిఎ2 అనుసరించిన ఆర్థిక విధానాలు, అర్థం లేని మార్కెట్‌ మేనేజిమెంట్‌ పుణ్యమా అంటూ దేశ ప్రజానీకం ఈ సంవత్సరమంతా ధరాఘాతానికి లోనుకానుంది. ప్రస్తుత వ్యవసాయక సంవత్సరం ప్రారంభంలోనే వర్షపాతం అనుకూలం లేదని తెలుసు. సేద్యపు భూమి వైశాల్యం 8 శాతం తగ్గిందనీ వ్యవసాయ శాఖ ప్రకటించింది. ముఖ్యమైన ఆహారోత్పత్తులు దేశీయ అవసరాలకు అనుగుణంగా లేవనీ ప్రకటించింది. చక్కెర అవసరానికంటే తక్కువగా ఉందనీ తెలుసు. పప్పు ధాన్యాలు 30 లక్షల టన్నులు తక్కువగా ఉన్నాయనీ తెలుసు. కానీ అందుకవసరమైన నివారణ చర్యలు తీసుకోవటంలో అటు ఆర్థికమంత్రిత్వ శాఖ గానీ, వ్యవసాయ మంత్రిత్వ శాఖ గానీ దారుణంగా విఫలమైంది. పర్యవసానం... ఉత్తరాది ప్రజలు దీపావళికీ, దక్షిణాది ప్రజలు సంక్రాంతికి నోరు తీపి చేసుకోవటానికి జేబులు ఖాళీ చేయించుకోవాల్సి వచ్చింది. సంవత్సరం క్రితం 20-25 రూపాయలుగా ఉన్న చక్కెర సంవత్సరం తిరక్కముందే 50 రూపాయలకు చేరుకొంది. ఖచ్చితంగా 100 శాతం రేటు పెరిగిందన్నమాట. సంవత్సరం క్రితం 40 రూపాయలకు అటు ఇటుగా ఉన్న కందిపప్పు నేడు 100 రూపాయలకు చేరింది. అంటే 125 శాతం రేట్లు పెరిగాయి. ఇంతేకాదు. ఉల్లిపాయలు, ఇతర కూరగాయలు కూడా పెరుగుదలలో ఏమాత్రం తీసిపోలేదన్నట్లు పోటీపడ్డాయి. వెరసి ఆహారోత్పత్తులకు సంబంధించిన ద్రవ్యోల్బణం 20 శాతానికి చేరింది.

విచిత్రమేమిటంటే ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక సంక్షోభం కారణంగా అన్ని దేశాల ఆర్థిక వ్యవస్థల్లో ద్రవ్యోల్బణ ప్రమాదం పొంచి ఉంటే భారతదేశంలో మాత్రం రెండు మూడు నెల్ల పాటు టోకు ధరల సూచితో కొలిచే ద్రవ్యోల్బణం తిరోగమన దిశలో ఉంది. అంటే సున్నాకంటే కూడా తక్కువ స్థాయిలోకి పడిపోయింది. 2008 పార్లమెంట్‌ ఎన్నికలకు ముందు 12 శాతానికి పైగా ఉన్న ద్రవ్యోల్బణం ఎన్నికల తర్వాత అమాంతంగా ఎలా పడిపోయిందన్నది సామాన్య ప్రజలకే కాదు. ఇటు ఆర్థికవేత్తలకూ అంతుబట్టని సమస్యగా మిగిలింది. ఇదిలా ఉండగా వినిమయ ధరల సూచి మాత్రం దాదాపు 9 నుండి 11 శాతం మధ్య పెరిగితే అందులో ఆహారోత్పత్తుల ధరల సూచి 69 శాతం వరకూ పెరిగింది. ఈ కాలంలోనే ఇతర వస్తువుల ధరల మాట ఎలా ఉన్నా ఆహారోత్పత్తుల ధరలు మాత్రం ఆకాశానికంటటం ప్రారంభమైంది. ప్రభుత్వం మాత్రం చేష్టలుడిగి చూస్తూఉండిపోయింది తప్ప కారణాలు వెతికేందుకు ప్రయత్నించలేదు. పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాల్లో విజయోత్సవాల ఊపు మీద ఉన్న యుపిఎ2 పార్లమెంట్‌లో ధరల పెరుగుదలపై జరిగిన చర్చకు సమాధానమిస్తూ ధరల నియంత్రణ బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలదేనని నిస్సిగ్గుగా ప్రకటించింది. రాష్ట్రాల్లో నల్లబజారు పెద్దఎత్తున విస్తరించినందున సరుకులు దుకాణాల్లో కనిపించకుండా పోతున్నాయని సమస్యను తప్పుదారి పట్టించే ప్రయత్నం చేసింది. వాస్తవాలు పరిశీలించేవారికి సరుకులు అసలు దుకాణాల వరకూ చేరకపోవటమే కాదు, ఉత్పత్తి స్థాయిలోనే తగ్గిపోయాయని స్పష్టంగా తెలుస్తోంది. కానీ ప్రభుత్వం ఈ విషయాలు గుర్తించటానికి నిరాకరిస్తూ వచ్చింది. దాంతో నివారణ చర్యలు చేపట్టే బాధ్యత నుండి కూడా వైదొలగింది.

ఎట్టకేలకు కళ్లు తెరిసేసరికి పుణ్యకాలం కాస్తా పూర్తయి ప్రజలు ధరాఘాతానికి బలైపోయారు. ప్రతిపక్షాల ఒత్తిడితో ప్రభుత్వం చివరికి అంతర్జాతీయ మార్కెట్‌ నుండి దిగుమతులు చేసుకోవటం ద్వారా ఈ సమస్యను పరిష్కరిస్తామని ప్రకటించింది. తీరా అందుకవసరమైన అనుమతులు ఇవ్వటంలో తాత్సారం చేసింది. ఉన్న కొద్దిపాటి సమయాన్ని ప్రైవేటు సంస్థలు ఉపయోగించుకుని దిగుమతులు చేసుకోగా ప్రభుత్వరంగ సంస్థలైన స్టేట్‌ ట్రేడింగ్‌ కార్పొరేషన్‌, నాఫెడ్‌ వంటి సంస్థలు, పప్పుధాన్యాల మార్కెట్‌ను నియంత్రించే సంస్థలు మాత్రం కిమ్మనకుండా ఉండిపోయాయి. ఈ విషయంపై పార్లమెంటరీ స్థాయీ సంఘానికి ప్రభుత్వం ఇచ్చిన సమాధానంలో అంతర్జాతీయ మార్కెట్లోనూ, దేశీయ మార్కెట్లోనూ ధరల విషయంలో పెద్దగా వ్యత్యాసం లేదని, ఇప్పుడున్న ధరలతో దిగుమతులు చేసుకుంటే లాభసాటిగా ఉండదని అందువల్ల దిగుమతులు మందగించాయని చెప్పి చేతులు దులిపే ప్రయత్నం చేసింది. అంటే దేశీయంగా ఉత్పత్తి చేయటానికి అవసరమైన పరిస్థితులు కల్పించకుండా, విదేశీ దిగుమతులు చేసుకోకుండా మరి ప్రజల అవసరాలు ఎలా తీర్చనుంది ? రిజర్వు బ్యాంకు మూడునెల్లకొకసారి చేసే ప్రకటనలో సదరు కాలంలో ప్రభుత్వం వద్ద ఇన్ని లక్షల కోట్ల డాలర్లు పేరుకున్నాయని ప్రకటిస్తూ రావటం మనం చూస్తున్నాము. మరి ఈ విధంగా పేరుకొంటున్న లక్షల కోట్ల డాలర్లను ఏ అవసరాలకు వినియోగించనున్నారు? ప్రజల ఆహార అవసరాలు తీర్చటం మినహా ఏ ప్రభుత్వానికైనా ముఖ్యమైన కర్తవ్యం ఏముంటుంది? అన్న ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది.

ప్రణాళికా సంఘం అంచనాల ప్రకారమే రానున్న మూడు సంవత్సరాల్లో పప్పు ధాన్యాల ధర మరింత పెరిగే అవకాశం ఉంది. అంటే నేడు 100రూపాయలుగా ఉన్న కందిపప్పు ధర 150 వరకూ పెరిగినా ఆశ్చర్య పడాల్సిన అవసరం లేదన్నమాట. పప్పు ధాన్యాలు కార్మికులు, వ్యవసాయ కార్మికుల ఆహారంలో కీలక పాత్ర పోషిస్తాయి. మిగిలిన సంపన్నవర్గాల మాదిరిగా ఈ వర్గాలు పౌష్టికాహారం తీసుకునే ఆర్థిక స్థోమత కలిగిన వర్గాలు కాదు. కానీ వీరు చేసే శారీరక శ్రమకు తగ్గట్లుగా పోషకాహారం లేకపోతే వీరి ఉత్పాదకత కూడా పతనం అవుతుంది. ఆరోగ్యం క్షీణించటం ఎటూ తప్పదు. అటువంటి పరిస్థితుల్లో వీరి ఆహారంలో ముఖ్యభాగమైన చక్కెర, పప్పు ధాన్యాల పట్ల ప్రభుత్వం ఇంత నిర్లక్ష్యం ఎందుకు వహిస్తోంది అన్నది పెద్ద ప్రశ్నగా మిగిలిపోతుంది. ప్రభుత్వ అంచనాల ప్రకారమే 2008-2009 ఆర్థిక సంవత్సరానికి దేశంలో 146.8 లక్షల టన్నుల చక్కెర ఉత్పత్తి అయింది. 2007-2008 ఆర్థిక సంవత్సంరలో మరో 105 లక్షల టన్నుల చక్కెర మిగిలి ఉంది. 2008-2009 ఆర్థిక సంవత్సరంలో 220 లక్షల టన్నులుగా ఉంది. అంటే గడచిన ఆర్థిక సంవత్సరానికి అవసరానిక మించి 30లక్షల టన్నుల చక్కెర మార్కెట్లో అందుబాటులో ఉంది. కానీ ధరలు మాత్రం పెరిగిపోయాయి. దీనికి కారణం ఎన్నికలకు ముందు చక్కెర పరిశ్రమ లాబీయింగ్‌ ఒత్తిళ్లకు లోనై ప్రభుత్వం ఎగుమతులకు అనుమతించటమే.

అంతర్జాతీయ మార్కెట్లో కూడా చక్కెర ఉత్పత్తులు డిమాండ్‌కు తగ్గట్లుగా లేకపోవటంతో మన దేశ చక్కెర పరిశ్రమలకు లాభాల పంట బాగా పండింది. కానీ రైతులకు మాత్రం ఈ వ్యాపారం గిట్టుబాటు కాకపోవటంతో ఈ సంవత్సరం (2009-2010) చక్కెర సాగు విస్తీర్ణం తగ్గిపోయింది. దాంతో ఉత్పత్తి కూడా తగ్గిపోయింది. ఎతా వాతా ఈ మార్పులు ప్రభుత్వ విధాన రూపకల్పనలో ప్రాధాన్యతకు నోచుకోకపోవటంతో భారాలు మోయటం వినియోగదారుల వంతైంది.వందరోజుల్లో ఆహార భద్రత చట్టం ఆమోదిస్తామని అధికారానికి వచ్చింది యుపిఎ 2 ప్రభుత్వం. కానీ అధికారానికి వచ్చి తొమ్మిది నెల్లు గడుస్తున్నా ఈ చట్టం ఊసెత్తటం లేదు. ఈ విషయం అటుంచితే 2008-2009 ఆర్థిక సంవత్సరానికి జాతీయ ఆహార భద్రత కోసం వెచ్చించిన నిధుల్లో సగానికి పైగా ఖర్చుకాలేదు. అంతేకాదు. రాష్ట్రీయ కృషి వికాస్‌ యోజన పథకం కింద పప్పుధాన్యాల ఉత్పత్తి పెంచే లక్ష్యాలకు కూడా ప్రభుత్వం ఆమడ దూరంలో ఉంది. ఇన్ని లోపాలు ఉండబట్టే ప్రభుత్వం అసమర్థతను ఆసరా చేసుకుని మార్కెట్‌ శక్తులు కూడా ధరాఘాతంలో తమవంతు పాత్ర పోషిస్తున్నాయి.

ఈ పరిస్థితుల్లో వ్యవసాయ మార్కెట్‌ విధానాన్ని, సహకార రంగాన్ని సమూలంగా తిరగదోడాల్సి ఉంది. అంతేకాదు. ప్రత్యేక ఆర్థిక మండళ్ల పేరుతో వ్యవసాయ భూముల కైంకర్యాన్ని కూడా నియంత్రించేందుకు చర్యలు చేపట్టాల్సి ఉంది. జాతీయఆహారభద్రత చట్టం తక్షణమే అమల్లోకి తేవటంతో పాటు అప్పటివరకూ ప్రజా పంపిణీ వ్యవస్థను దారిద్య్రరేఖకు ఎగువన, దిగువన అన్న వ్యత్యాసం లేకుండా అందరికీ అందుబాటులోకి తేవాలి. పేదరికాన్ని లెక్కించానికి ప్రణాళికా సంఘమే నియమించిన టెండూల్కర్‌ కమిటీ గత పదేళ్లల్లో పేదరికం పదిశాతానికి పైగా పెరిగిందని ప్రకటించింది. అంతకు ముందు గ్రామీణాభివృద్ధి మత్రిత్వ శాఖ నియమించిన స్వంతత్ర నిపుణుల కమిటీ ( ఎన్‌బి సక్సేనా కమిటీ) 50 శాతం ప్రజలు పేదరికంలో ఉన్నారని తెలిపింది. ఈ గణాంకాలకు అనుగునణంగా బడ్జెట్‌ కేటాయింపుల్లో మార్పులు రావాలి. వీటితో పాటు ఆహారోత్పత్తుల ద్రవ్యోల్బణానికి ప్రత్యేక సూచిని తయారు చేయాలి. ఈ చర్యలు చేపట్టేలా ప్రభుత్వంపై ఒత్తిడి తేవటంలో విఫలం అయితే రానున్న కాలంలో ప్రజానీకాన్ని ధరాఘాతం వెన్నాడనుంది!

No comments: