ప్రపంచం నూతన సహస్రాబ్దంలో రెండో దశకంలో ప్రవేశించింది. తొలి దశాబ్దం చివరి కాలం పెట్టుబడిదారీ వ్యవస్థ కనీ వినీ ఎరుగని సంక్షోభంతో ముగిసింది. గత సంవత్సర కాలం నుండీ ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఈ సంక్షోభం నుండి విముక్తి దిశగా సాగుతోందన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. అయితే వాస్తవం దీనికి భిన్నంగా ఉంది. అంతర్జాతీయ కార్మిక సంస్థ (ఐఎల్‌ఓ) తాజాగా విడుదల చేసిన నివేదిక ప్రకారం తాజా సంక్షోభం ప్రపంచ వ్యాప్తంగా 61 మిలియన్ల మందిని నిరుద్యోగ సైన్యంలో జత చేయగా, 2009 చివరి నాటికి ప్రపంచ వ్యాప్తంగా 214 మిలియన్ల నుండి 241 మిలియన్ల మధ్య నిరుద్యోగ సైన్యం ఉందని అంచనా వేసింది. ఆర్థికంగా అభివృద్ధి చెందిన దేశాల సంస్థ (ఒఇసిడి) నిర్వహించిన సర్వేలో 2009 చివరి నాటికి సభ్య దేశాల్లో నిరుద్యోగం 9 శాతానికి పైగానే ఉన్నట్లు నిర్ధారించింది. ఒఇసిడి దేశాలకు నాయకత్వం వహిస్తున్న అమెరికాలో నిరుద్యోగం 16 శాతం వరకూ ఉంటుందని అమెరికాకు చెందిన ఆర్థికవేత్తలే అంచనా వేస్తున్నారు. అమెరికా ప్రభుత్వమే తమ దేశంలో నిరుద్యోగం 10 శాతం ఉందని అధికారికంగా ప్రకటించింది.
ఇప్పటికే నిరుద్యోగ భృతి కోసం వెచ్చిస్తున్న నిధులు సరిపోవటం లేదని రాష్ట్ర ప్రభుత్వాలు నిరసన వ్యక్తం చేస్తున్నాయి. జోసెఫ్ స్టిగ్లిట్జ్ లాంటి ప్రముఖ ఆర్థిక వేత్తలు అమెరికా ప్రభుత్వం మరో దఫా ఉద్దీపన వరాలు ప్రకటించకపోతే పెరుగుతున్న భారాన్ని తట్టుకోవటం సాధ్యం కాదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రపంచబ్యాంకు తాజాగా 53 దేశాల్లో నిర్వహించిన మరో అధ్యయనంలో 2007లో 4.1 శాతంగా ఉన్న నిజవేతనాల వృద్ధి రేటు 2009 చివరి నాటికి 1.4 శాతానికి తగ్గిపోయింది. ప్రపంచ వ్యాప్తంగా 100 బిలియన్ల మంది రోజూవారీ అర్థాకలితో కాలం వెళ్ల దీస్తున్నారు. అంతేకాదు. ఐక్యరాజ్యసమితి అంచనా ప్రకారం రోజుకు 1.25 డాలర్ల ఆదాయం పొందలేని వారు కడుపేదల జాబితాలో ఉంటారు.
అటువంటి వారి సంఖ్య 1.4 బిలియన్లకు చేరిందని ఐరాసనే తేల్చి చెప్పింది. అంటే ప్రపంచ దేశాలు మిలీనియం లక్ష్యాల సాధనకు చాలా దూరంలో ఉన్నాయని ఈ వివరాలు రుజువు చేస్తున్నాయి. మొత్తంగా చూస్తే ఉరుగ్వే ప్రధాని యోవెన్ ముసువేరి మాటల్లో ''ప్రపంచ ఆర్థిక వ్యవస్థ నూతన సహస్రాబ్దిలో పాత వ్యవస్థే నూతన మార్గాల్లో తన ఆధిపత్యాన్ని కొనసాగించే దిశగా సాగుతోంది''. ఇదీ నూతన దశాబ్ధంలో ప్రవేశిస్తున్న ప్రపంచఆర్థిక వ్యవస్థ తీరుతెన్నులు. గతవారం చెప్పుకున్నట్లుగా నూతన దశాబ్దంలో సామ్రాజ్యవాద ప్రపంచీకరణ నేడు వర్ధమాన దేశాల నుండి రాజకీయ, ఆర్థిక సవాళ్లను ఎదుర్కోంటోంది. తాజాగా పెట్టుబడిదారీ వ్యవస్థ ఎదుర్కొంటున్న సంక్షోభం సామ్రాజ్యవాద ప్రపంచీకరణ ఎదుర్కొంటున్న సైద్ధాంతిక సవాళ్లను కూడా ముందుకు తెచ్చింది.
గత దశాబ్దంలో సామ్రాజ్యవాద ప్రపంచీకరణ ఎదుర్కొంటున్న రాజకీయ సవాళ్లు లాటిన్ అమెరికా దేశాల రాజకీయ పరిణామాల్లో ప్రస్ఫుటం అయ్యాయి. సోషలిజానికి పెట్టని కోటగా ఉన్న క్యూబాకు తోడుగా దక్షిణ అమెరికా ఖండంలో వెనిజులా, బొలీవియా, చిలీ వంటి దేశాలు సామ్రాజ్యవాద ప్రపంచీకరణ మార్గం నుండి వైదొలగటమే కాదు. ఈ వ్యవస్థ పట్ల సమర్థవంతమైన విమర్శకు తెరతీయటం ద్వారా ప్రపంచీకరణపై సమగ్ర సైద్ధాంతిక దాడికి పూర్వరంగం సిద్ధం చేశాయి. దానికి తోడు నాలుగు దశాబ్దాల ప్రపంచీకరణ విధానాలు పెట్టుబడిదారీ వ్యవస్థను కోలుకోలేని లోతులకు నెట్టేశాయి. దాంతో పలు వర్ధమాన దేశాలు పెట్టుబడిదారీయేతర ఆర్థిక నమూనాల పట్ల, రెండో ప్రపంచ యుద్ధానంతరం తెరమీదకు వచ్చిన పలు ఆర్థికాభివృద్ధి నమూనాల పట్ల ఆసక్తి ప్రదర్శిస్తున్నాయి. అంతేకాదు. పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థకు రాజకీయంగా ఊపిరి పోస్తున్న ప్రజాస్వామ్య వ్యవస్థ కూడా ఈ కాలంలో సైద్ధాంతిక గందరగోళానికి లోనైంది.
ప్రజాస్వామిక ప్రభుత్వాలు లాటిన్ అమెరికాలో పురోగామి శక్తులకు ప్రాతినిధ్యం వహించటానికి బదులుగా పెట్టుబడిదారీ సైద్ధాంతిక, రాజకీయ, ఆర్థిక విధానాలను ముందుకు తీసుకెళ్లే సాధనంగా మారటంతో ఆయా దేశాల్లో ప్రజలు ప్రజాస్వామిక పద్ధతులనే ఉపయోగించుకుని ప్రత్యామ్నాయ మార్గాల వైపు నడవటానికి సిద్ధం అయ్యారు. దాంతో సామ్రాజ్యవాద దేశాలన్నీ ఏకంగా ప్రజాస్వామిక వ్యవస్థే ముప్పు ఎదుర్కొంటోందని ఆందోళన వ్యక్తం చేశాయి. రెండేళ్ల క్రితం ఏకంగా ప్రధాని మన్మోహన్‌సింగ్, అమెరికా మాజీ అధ్యక్షులు బుష్‌ల సంయుక్తంగా ప్రజాస్వామ్య పరిరక్షణ నిధిని ఏర్పాటు చేస్తున్నట్లు ఐక్యరాజ్యసమితి సాక్షిగా ప్రకటించారు.
గత దశాబ్ద కాలంగా సామ్రాజ్యవాద ప్రపంచీకరణ ఎదుర్కొంటున్న ముప్పేట సవాళ్లను పరిష్కరించటంలో అంత సామర్థ్యం చూపలేకపోయినందున ఈ తరహా ప్రపంచీకరణకే పునాదులుగా నిలిచిన ప్రపంచబ్యాంకు, అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ, ప్రపంచవాణిజ్య సంస్థలు పెద్దఎత్తున సామ్రాజ్యవాద దేశాల నిర్లక్ష్యానికి గురయ్యాయి. దోహాలో ప్రపంచ వాణిజ్య సంస్థ పతనం మొదలు కాగా లాటిన్ అమెరికా దేశాలు ఐఎంఎఫ్ నిధులు నిరాకరించటం ద్వారా ఆయా సంస్థలకు సవాలు విసిరాయి. తాజాగా పెట్టుబడదారీ వ్యవస్థ ఎదుర్కొంటున్న సంక్షోభం నుండి వివిధ దేశాలు బయటపడటానికి అవసరమైన నిధులు సమకూర్చటంలో విఫలమైన అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ చివరకు తనవద్ద ఉన్న బంగారం నిల్వలను అమ్మి నిధులు సమీకరించుకోవాల్సిన దుస్థితికి చేరింది. దీనికి ముఖ్యమైన కారణం ఈ సంస్థలు సామ్రాజ్యవాద దేశాల ప్రయోజనాలకు సమర్థులైన బోయీలుగా వ్యవహరించలేకపోవటమే. అటువంటి పరిస్థితుల్లో సామ్రాజ్యవాద దేశాలు ఈ సంస్థలకు కేటాయించాల్సిన వార్షిక నిధులను కూడా సమకూర్చటానికి అమెరికా వంటి దేశాలు ముందుకు రావటం లేదు. దాంతో ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో తన పాత్రకు అనుగుణంగా జోక్యం చేసుకోవటానికి గాను ఐఎంఎఫ్ వంటి సంస్థలు తమ వద్ద ఉన్న బంగారం నిల్వలను అమ్ముకోవాల్సి వస్తే ప్రపంచ బ్యాంకు వంటి సంస్థలు దేశాలకు ఇచ్చే రుణాలను కుదించుకోవాల్సి వస్తోంది.
వర్ధమాన దేశాలు డబ్ల్యుటిఓలో ఇంతకాలంసంపన్న దేశాలు అనుసరిస్తూ వచ్చిన మాయోపాయాలు గుర్తించి వారికి దీటుగా ప్రత్యామ్నాయ వ్యూహరచన చేయటంతో అక్కడ కూడా సంపన్న దేశాల ఆటలు సాగటం లేదు. తన మాట నెగ్గకపోతే ఒప్పందమే అవసరం లేదన్న ధోరణిలో సామ్రాజ్యవాద దేశాలు ఒంటెత్తుపోకడకు పోవటమే దోహా దఫా చర్చలు దశాబ్దకాలం పలు దఫాల అధికారిక, అనధికారిక చర్చల తర్వాత కూడా ముగింపుకు రాలేకపోయాయి. పైన చెప్పుకున్నట్లే తాజా సంక్షోభంతో పలు దేశాలు ప్రత్యామ్నాయ ఆర్థికాభివృద్ధి నమూనాల వైపు దృష్టి మళ్లిస్తున్నాయి. అందులో భాగంగా పలు దేశాలు తమ తమ దేశాల్లో అంతర్గత మార్కెట్‌పై దృష్టి సారించటం, ప్రణాళికా వ్యవస్థలను పటిష్టం చేయటం వంటి చర్యలు చేపట్టాయి.
ఈ చర్యలు ఆయా వర్ధమాన దేశాల్లో జాతీయ బూర్జువావర్గం అంతర్జాతీయ స్థాయికి ఎదగటానికి పెద్దఎత్తున దోహదం చేస్తోంది. భారతదేశానికి చెందిన టాటా, బిర్లా, ఎయిర్‌టెల్, అంబానీ, స్టెరిలైట్ వంటి పలు గుత్త వాణిజ్య సంస్థలు అంతర్జాతీయ కంపెనీలతో పోటీపడగల స్థాయిలో బహుళజాతి కంపెనీలుగా ఎదిగాయి. గత రెండు దశాబ్దాలుగా ప్రభుత్వం అనుసరించిన ఆర్థిక విధానాలను రెండు భాగాలుగా విడదీయవచ్చు. మొదటి 1991 నుండి 2000 వరకూ అమలు జరిగిన విధానాలు ప్రధానంగా దేశీయ గుత్తపెట్టుబడిదారుల వద్ద మూలుగుతున్న పెట్టుబడి నిల్వలను మార్కెట్‌లో వినియోగానికి తేవటానికి అవసరమైన విధానాలు కాగా 2000 తదనంతర కాలంలో అనుసరించిన విధానాలు మొదటి దశ విధానాలతో విపరీతంగా లాభాలు పెంచుకున్న దేశీయ గుత్తపెట్టుబడిదారులు అంతర్జాతీయ మార్కెట్‌లో ప్రవేశించటానికి అవసరమైన రంగాన్ని సిద్ధం చేసే దిశగా ఉన్నాయి.
ఈ రెండు దశల మధ్య ఉన్న వ్యత్యాసాన్ని గుర్తించటానికి ప్రపంచ వాణిజ్య సంస్థ చర్చల్లో భారత ప్రభుత్వం అనుసరిస్తున్న ఎత్తుగడలను పరిశీలిస్తే సరిపోతుంది. తాజా సంక్షోభం నేపథ్యంలో కూడా భారత ప్రభుత్వం అనుసరించిన ఆర్థిక, ద్రవ్య విధానాలు ఈ రెండు దశల్లో ఉన్న వ్యత్యాసాలను మనముందుకు తెస్తున్నాయి. ఈ విధంగా గడచిన దశాబ్దం సామ్రాజ్యవాద ప్రపంచీకరణ, పెట్టుబడిదారీ ఆర్థిక నమూనాలకు పెనుసవాళ్లు విసిరిన దశాబ్దంగా చరిత్రలో నిలిచిపోతుంది. అదేసమయంలో అంతర్జాతీయ ఆర్థిక రంగం, మార్కెట్, లాభాల వాటాలో వర్ధమాన దేశాలకు చెందిన బహుళజాతి కంపెనీల పాత్ర పెరగటానికి పునాదులు వేసిన దశాబ్దంగా కూడా దీన్ని పరిగణించవచ్చు. రానున్న దశాబ్దం సామ్రాజ్యవాద ప్రపంచీకరణ ఎదుర్కునే సవాళ్లను తీవ్రతరం చేయటమే కాదు. దాని మనుగడను ప్రశ్నార్థకం చేసే దిశగా అడుగులు వేస్తుందని కోపెన్‌హేగెన్‌లో వర్ధమాన దేశాలు అనుసరించిన ఎత్తుగడలు స్పష్టం చేస్తున్నాయి.
Tuesday, January 12, 2010
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment